Friday, 10 January 2014

Amrutam Kurisina Ratri (అమృతం కురిసిన రాత్రి)

ప్రస్తావన:

ఇరవయ్యో శతాబ్దంలో ప్రపంచ మంతటా, అన్ని రంగాల లోను శర వేగంతో విప్లవాత్మక మైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆంగ్ల భాష ద్వారా, పర భాషల లోని సర్వ కవితా రీతులు మన రచయితలకు పరిచయ మయ్యాయి.ఆ కారణం చేత తెలుగు కవితా రంగంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. వీటి ప్రభావం ఆనాటి కవులందరి మీద కొంతమేరకు కనిపిస్తుంది. కవితా రంగంలో అనేక పద్ధతులు మొదలయ్యాయి. సంప్రదాయ కవిత్వము, భావ కవిత్వము, అభ్యుదయ కవిత్వము, వచన కవిత్వము - అనే నాలుగు పాయలలో కవితా రథం పయనించ సాగింది. 20వ శతాబ్దం తొలి పాదంలో తెలుగు కవితా రంగంలో వచ్చినన్ని మార్పులు అంతకు ముందు కాలంలో మనకు కనిపించవు. సంప్రదాయ కవితా రీతులను మాని, ఆధునికత వైపు కలం సాగించిన వారికి ప్రజాదరణ లభించుట మొదలైనది.

గేయం, వచనం, రెండూ కూడా తెలుగు సాహిత్యంలో తమ తమ స్వతంత్ర ప్రతి పత్తిని నిర్మించుకొనుటలో విజయాన్ని సాధించాయి. 1935వ సంవత్సరము నుండి వచన కవిత క్రమ వికాసం చెందు తున్నది. భావ వ్యక్తీకరణలో స్వేచ్ఛా స్వతంత్ర్యాలు ఆదర్శంగా ఈ కవిత అభివృద్ధి చెందుతోంది. వచన కవిత సులభంగా అర్థ మవుతుంది. అందుకే ప్రజలు దాన్ని ఆదరిస్తున్నారని మనం భావించాలి. అయితే ప్రతి ప్రక్రియ, కొన్ని భావాల అభి వ్యక్తీ కరణకు యెక్కువ అనుకూలంగా వుంటుంది. ఏ ప్రక్రియ లోనైన కవితా వస్తువు సాధారణంగా మూడు రూపాలలో ప్రదర్శిత మౌతుంది. భావ సంచలనం, ప్రకృతిలోని సౌందర్యా రాధనం, సామాజిక జీవన విశ్లేషణం. ఏ ప్రక్రియ రూపంలో వెలువడినా, ఒక కవిత విలువ ఆ కవితా గుణాన్ని, ప్రయోజనాన్ని బట్టి నిర్ణయించ బడుతుంది. గుణం లోపించి నప్పుడు కవిత ఏ ప్రక్రియలో వున్నా ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించినా, అది కవితగా పరిగణించ బడదు. అంటే, ఏప్రక్రియలో చెప్పినా, కవిత కళాత్మక మైన అంతర సత్య దర్శనం కలిగించాలి.అప్పుడే అది ఒక విశిష్ట మైన కళా సంపదగా లోకానికి మిగులు తుంది. వచన కవితా ప్రక్రియలో ప్రఖ్యాత కవులు (కుందుర్తి, తిలక్, బైరాగి, ఆరుద్ర, దాశరథీ, అజంతా, నారాయణ రెడ్డి, బోయిభీమన్న, శేషేంద్ర శర్మ, ఇత్యాదులు) ప్రసిద్ధి కెక్కిన వచన కవితా గ్రంధాలు రచించారు. అయినప్పటికీ, "ఆధునిక వచన కవిత్వానికి ప్రాణం పోసిన వాడు తిలక్. అంతకు ముందే ఒక మట్టి బొమ్మను దేవాలయంలో ప్రతిష్ఠ చేశారు గాని, అది తిలక్ వాణి స్పర్శ తగిలే వరకు పలక లేదు. ఆయన్ను చూడగానే కేరింతలు కొడుతూ ఆటలాడింది... అప్పటికి గాని వచన కవిత్వానికి ఒక స్థాయి రాలేదు. గౌరవం లభించ లేదు" (కుందుర్తి). ఆశ్చర్య మేమిటంటే తిలక్ కవిత చెప్పిన పద్ధతి అటు సంప్రదాయజ్ఞులనూ, ఇటు ఆధునికులనూ, సమానంగా ఆకర్షించింది. తిలక్ రచించిన "వచన గేయం" పరిమళ భరిత మైన బంగారపు తీగలాగా సాగి ఆయన పనితనపు సామర్థ్యానికి లొంగి రసజ్ఞుల కంఠా భరణమై వాసి కెక్కింది!


బాల గంగాధర్ తిలక్ రచించిన "అమృతం కురిసిన రాత్రి" అనే కవితా సంకలనాన్ని పాఠక మహాశయులకు వివరణాత్మకంగా పరిచయం చేయడమే ఈ వ్యాసం యొక్క ముఖ్యోద్దేశం.

1971వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ (ఢిల్లీ) వారు "అమృతం కురిసిన రాత్రి" తెలుగులో ప్రచురిత

మైన ఉత్తమ కవితా సంకలనముగా ఎంపిక చేసి, పురస్కారాన్ని (జాతీయ అవార్డు) ప్రదానం చేశారు. అంతేకాక, ఈ రచన ఉత్తమ జనహిత గ్రంథంగా కూడా, ఎంపికయినది.బాల గంగాధర తిలక్ కవితా దృక్పథం:

ఒక మహాకవి కవితా సుధను ఆస్వాదించుటకు ముందు ఆ కవి యొక్క కవితా దృక్పథం తెలుసు కొనుట ఎంతో వాంఛనీయం. దాని వలన పఠితలకు రచయిత భావాలు సులభంగా అర్థ మౌతాయి. కవితలను చదివి ఆనందించ గల్గుతారు. ఆ ఉద్దేశ్యంతో తిలక్ గారి కవితా దృక్పథాన్ని సూక్ష్మంగా చర్చించడ మైనది.

తిలక్ గారు అంతరాత్మా ప్రేరితులై వచన కవితా రచనకు పూనుకున్నారు. కవిత్వాన్ని గురించిన వారి అభిప్రాయాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.


పద్య రచనను గురించి ప్రస్తావిస్తూ "పద్యం ఈ నాటి అనుభూతి విలక్షణతను ప్రదర్శింప లేదు. సమకాలీన జీవితం లోని వివిధ ప్రవృత్తులను పద్యంలో చూపించలేం". అంటారాయన.అంతేకాక, కవిత యొక్క నిర్వచనమూ, స్వరూపం ఎప్పటి కప్పుడు మారుతోంది. విస్తృత మౌతోంది. చంధస్సూ, కవి సమయాలు, మొదలైన సంకెళ్ళ నుండి తప్పు కొనిన కవిత అచ్చమైన రూపం సంతరించు కొంటుందని ఆయన నమ్మకం. ఆలాగే కథా సంవిధానం అనే అనవసరపు తొడుగుని విప్పుకొని ప్రధాన అనుభూతుల ఆకృతితో నేటి కవిత్వం దర్శన మిస్తుంది... కవిత్వాన్ని నేడు అనుభవ ప్రధానంగా పరిగణిస్తున్నాం. సిద్ధాంతాల కోసం కవిత్వాన్ని, అసలు వ్యక్తిని, బలి పెట్టే తత్త్వం హర్ష నీయం కాదు". అంటారు తిలక్.మరో సందర్భంలో వ్రాస్తూ "ఈ నాటి కవిత చురుకైన ఆవేశాన్ని, సాంద్రతరమైన అనుభూతి వత్తిడినీ, సూక్ష్మమైన భావననీ, అనుసరించడానికి, తన స్థానాన్ని ప్రత్యేకించు కుంది... కవి దృష్టి నేడు ఒక లాంతరు పట్టుకొని నలు వైపులా వెళ్ళి ఓపికగా పరిశీలించడం లాంటిది కాదు. వస్తు స్వరూపాలకూ, సంఘర్షణ లకూ, శక్తులకూ, కీలక స్థానం మీద శక్తి వంతమైన బ్యాట్రీ లైటు ఫోకస్ చెయ్యడం లాంటిది" అంటారు తిలక్ గారు. తమ రచనల్లో కీలక స్థానం మీద శక్తి వంతమైన బ్యాట్రీ లైటు ఫోకస్ చేస్తారు, వస్తువు మీద కాదు! తిలక్ రచించిన "నిన్న రాత్రి" అనే కవిత (చూడు ఆ.కు.రాత్రి 118-119పుటలు) పరిశీలిస్తే వారి కవితా తత్త్వమంతా అందులో ఇమిడి వున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు "తిలక్ గారికి, తక్కిన అభ్యుదయ కవులకు ఉన్న భేదం ఆ కవితలో ప్రస్ఫుటంగా దర్శన మిస్తుంది" అంటారు విప్లవ కవి వరవర రావుగారు. నవీనుల మనుకొనే వారు - సాంప్రదాయ కవులమని భావించే వారు శ్రీ బాలగంగాధర తిలక్ తమ తమ వర్గీయుడని ఎందుకు భ్రమి స్తారో కూడా "నిన్నరాత్రి" కవిత చదివితే విశద మౌతుంది.ఆ కవితా ఖండికలో ఒక యువకుని ఆకలి చావు,"అమ్ముకొని యౌవ్వనం, అలసిన జీవనం" సాగించి, సాగించి, సంధ్య వేళ ఉరి తీసుకొన్న సాని దాని కథ, కాంగోలో, క్యూబాలో, సైప్రస్ లో, లావోస్ లో కాలి, కమురు కంపు కొట్టే కాలం కథ, మానవ వ్యథ వర్ణిత మైంది. ఆశ్చర్యకర మేమిటంటే, "ఇవన్నీ నేను (రచయిత) నా మంచం మీద వచ్చి కూర్చొన్న దేముణ్ణి అడుగ లేదు!" అని చెప్పడం లోనే ఉన్నదని అంటారు వరవర రావు. గమనించండి:నాకు తెలుసు నాకు తెలుసు

గొలుసు లోని అసలు కిటుకు

నాకు తెలుసు నాకు తెలుసు

దేవుని చెక్కిళ్ళ మీద దీనంగా కారే కన్నీటిని ...

మానవుడే దానవుడై తిరగ బడినప్పుడు

పాపం! - పెద్దవాడు - కన్న కడుపు - ఏం చేస్తాడని!ఈ తతంగమంతా గమనిస్తూ, కవి తిలక్ ముక్కు మూసుకొని కూర్చో గలడా?! అద్భుత మేమిటం టే ఈ ఆధునిక యుగంలో దేవుడు ఎంత నిస్సహాయుడై పోయాడో - దేవుని చెక్కిళ్ళ మీద దీనంగా కార్చే కన్నీటిని తుడిచి ఊరడించ వలసిన పరిస్థితి కవికి పట్టింది.! మరో చమత్కార మేమిటంటే తిలక్ బాధ్యత నంతా దేవుని మీద వేయడు. హృదయాన్ని కదిలించే విధంగా మానవుడే దానవుడై ప్రవర్తిస్తే - పాపం దేవుడు మాత్రం ఏంజేస్తాడు - పైగా కన్న కడుపు! అంటూ జాలిని వ్యక్త పరుస్తాడు! సిద్ధాంతా లన్నింటికీ అతీత మైన మానవతా ధర్మాన్ని ప్రతి పాదిస్తాడు తిలక్ ఈ కవితలో.తిలక్ గారికి కవిత్వం గురించి, మరియు కవిత్వం లోని "నవత్వం" గురించి నిర్దిష్టమైన అభిప్రాయా లున్నవి. "కేవలం అనుభూతి విశేషాన్నే కవిత్వంగా భావించిన వాడైతే, ఆధునికుల్లో, ఫ్రీవర్స్ రచయితల్లో ఆయనకు అగ్రస్థానం వచ్చేది కాదు... ఆయన కవిత్వంలో అబ్ స్క్యూరిటి, అస్పష్టత పనికి రాదన్నాడు. "మోడరన్ గా ఉండాలని, ఏదో అందామనీ, తనకే తెలియని అస్పష్టపు అనుభూతిని అర్థం లేని యిమేజరీల తో, కలగా పులగపు వర్ణనలతో, చాతకాని అనుకరణలతో రాయొద్దన్నాడు. అంతటితో ఆగలేదు. "కవిత కొత్త అనుభవాల కాంతి పేటికను తెరవాలి, కదిలించాలి. ఈ కాలంలో బ్రతుకు; ఈ ప్రపంచాన్ని ప్రతిఫలించు. ఇంటికున్న కిటికీ లన్నీ తెరచి అన్ని పవనాల్ని ఆహ్వానించు, నువ్వు చెప్పేదేదైనా నీదై వుండాలి. నీలో నుంచి రావాలి, చించుకొని రావాలి. మళ్ళీ ఈనాడు చిత్ర కవితల్నీ, అయోమయ బంధాల్నీ, పునరుద్ధరించకు" అంటారు. ఎంత మంచి ఆలోచనలు! ఎంత మహత్తర మైన సందేశం! కవితా రచనను నిష్ఠతో సాగించే రచయిత లందరూ అనుసరించ దగిన సందేశ మిది! తిలక్ మహాశయుని హృదయానికి అద్దం పట్టేటువంటి ఆలోచనా పరంపర.తిలక్ కవితా దృక్పథాన్ని గూర్చి అనేక విషయాలు పేర్కొన వచ్చు. అలా వ్రాస్తే - ఒక పుస్తకమే అవుతుంది! అది ఈ వ్యాస కర్త లక్ష్యం కాదు. అందుకని...

"కవిత్వం ఒక ఆల్కేమీ, దాని రహస్యం కవికే తెలుసును

కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకీ తెలుసు

కృష్ణ శాస్త్రి కి తెలుసు, శ్రీ శ్రీ కి తెలుసు"

అన్నా! కవిత్వం అంతరాంతర జ్యోతి స్సీమల్ని బహిర్గతం చెయ్యాలి, విస్తరించాలి చైతన్య పరిధి

అగ్ని జల్లినా, అమృతం కురిసినా

అందం, ఆనందం దాని పరమావధి"

అని పేర్కొంటూ ఈ విభాగం ముగిద్దాం!అమృతం కురిసిన రాత్రి - కవితాధ్యాయనం:కవిత్వ అధ్యాయనానికి సాహిత్యాభిరుచి అవసరం.కవిత్వంలో వస్తువు వుంటుంది, ప్రక్రియ వుంటుంది, అనుభవం వుంటుంది. వస్తువు ఏదైనా, ప్రక్రియ ఏదైనా అవి రెండూ కూడా అనుభవానికి సాధకాలు. అనుభూతిని అందుకోవడానికి సహాయ పడతాయి. కవిత చదివితే పాఠకుడు ఆ కవితలోని భావంతో సానుభూతి ప్రకడించడం, లేదా ఆ కవిత ప్రతి పాదించే భావంతో ప్రభావితుడు కావటం జరుగు తుంది. కవితాను భూతిని రెండు విధాలుగా పొంద వచ్చు. మొదటిది మనసుతో, రెండవది మెదడుతో. మనసుతో పొందే అనుభాతి పఠితకు లో చూపు నిస్తుంది. మెదడుతో పొందే అనుభూతి పై చూపు నిస్తుంది. పఠితలో విశ్వాసాన్ని తెలుసు కొనేది లో చూపు. విశ్వాత్మలో పఠిత తనను తాను చూచు కొనేది పై చూపు. ఈ రెండు విధానలలో దేనితోనైనా పాఠకుడు (పఠిత) తన కవిత్వ అధ్యాయనం మొదలెట్ట వచ్చు. పైన పేర్కొనిన విషయాలు దృష్టిలో పెట్టు కొని "అమృతం కురిసిన రాత్రి" లోని కవితా ఖండికలు (కొన్నిటిని) ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం."అమృతం కురిసిన రాత్రి" అనే కవితా సంకలనం లో 80 కవితా ఖండిక లున్నవి. ఈ కవితలన్నీ 1941-1970 మధ్య కాలం లో రచించ బడినవి. సంకలనము లోని ప్రతి కవితా ఖండిక స్వయం సంపన్న. దేని కదే చదివి ఆనందింప తగినది. ఒక దానితో మరొకటి వస్తు బాంధవ్యము లేనిది. కాబట్టి కవితలన్నీ ఏక బిగిని చదువ వలసిన అవసరము లేదు. దేని ఆనందం దానిదే. దేని అనుభూతి దానిదే. పఠితలు తమ తమ ఇష్టాను సారంగా, ఇష్టాను క్రమంగా చదివి ఆనందించ గలరు."అమృతం కురిసిన రాత్రి" సంకలనము లోని మొదటి కవిత "నా కవిత్వం" అనే శీర్షికతో ప్రచురిత మైనది. ఈ గేయం 1941లో రచించినది. అప్పటికే, విభిన్న రాజకీయ ధోరణులు సాహిత్య రంగములోకి ప్రవేశించాయి. ముఖ్యంగా అభ్యుదయ కవులు రాజకీయ ప్రభావాలకు లోనై తమ తమ కవిత్వంలో ఆయా ధోరణులు వ్యక్త పరచటం ప్రారంభ మైనది. నిబద్ధ కవితలు విరివిగా ప్రచురిత మయ్యాయి. అయితే, రాజకీయ పక్షాలకు రచయిత దాసోహం కావటం తిలక్ గారికి సమ్మతం కాదు. ఆ భావనే ఈ కవితా ఖండిక పరోక్షంగా వ్యక్త పరుస్తుంది:నా కవిత్వం కాదొక తత్వం

మరికాదు మీరనే మనస్తత్వం

కాదు ధనిక వాదం, సామ్య వాదం

కాదయ్యా అయోమయం జరామయం

...

నా అక్షరాలు కన్నీటి జడులతో తడిసే దయా పారావతాలు

నా అక్షరాలు ప్రజా శక్తుల వహించే విజయ ఐరావతాలు

నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడ పిల్లలు.తన కవిత్వాన్ని పైన పేర్కొనిన (తొలిగేయంలో) కొలత బద్దతో కొలవద్దన్నాడు తిలక్. తన కవితా శక్తి నంతా కరుణా శృంగారాలతో నింపి విశ్వ శ్రేయస్కరం చేస్తానంటాడు. "కరుణ" కు దయాపారావతాలను, శృంగారానికి అందమైన ఆడపిల్లలను, విశ్వశ్రేయస్సు సూచనగా విజయ ఐరావతాలను, ప్రతీకలుగా (సంకేతాలు) చిత్రిస్తాడు తిలక్.

"మేగ్నాకార్టా" అనే మరో కవితలో

మాకు లోకం ఒక గీటురాయి మాకు కరుణ చిగురు తురాయి

మేం పర పీడన సహించం మేం దివ్యత్వం నటించంఅంటారు. ఈకవిత రచించినది 1942వ సంవత్సరంలో. ఆకాలంలో కొంతమంది యువకులు "నయాగరా" కవులనే పేరుతో సాహిత్యాన్ని ఎత్తి పోతలుగా కురుపించారు. ఆనాటి యువకులకు వ్యక్తి చైతన్యాన్ని, సంఘ చైతన్యంగా అనువదించాలనే సంకల్పం ప్రభల మైనది. ఆ తరుణంలో తన "మేగ్నా కార్టా" ప్రకటిస్తాడు తిలక్. విజయ శంఖారావ విమల గీతమ్ము తో కొత్త మార్గాలకై సాగిపోతాడు. "మేగ్నా కార్టా" అంటే ఒక "సివిల్ లిబర్టి చార్టరు" ప్రతి పౌరుడికి అన్ని విధాల స్వేచ్ఛ అవసర మనే ప్రభల వాంఛ.సైనికుడి ఉత్తరం: రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు తన భార్యకు వ్రాసిన ఉత్తరం ఈ కవితా ఖండిక లోని వస్తువు. ఆ సమయం లో సైనికులు అనుభవించిన బాధలు, వారి జీవన విధానం, వారిని మనుషులుగా కాక మరలగా వాడిన వృత్తాతం అత్యంత ఆకర్షనీయంగా చిత్రించాడు కవి. అంతే కాక, ఆ తరుణంలో మనుష్యులలో చీకటి కొండగా పెరిగిన స్వార్థం, సైని కుల అసహాయత వారిని నిరుత్సాహ పరచి, వారిలో నిర్వీర్యతనే గాక రాక్షసత్వాన్ని, జీవితం పట్ల చులకనా భావాన్ని యినుమడింప చేస్తుంది. అప్పటి వారి మనస్థితిని - మనో వేదనను వ్యక్త పరచడంలో మనోంతరాల నుండి అనుభూతిని విశాల పరిధిలోనికి గొని వచ్చి ఘనీ భవింప జెయ్యాలని ప్రయత్నిస్తాడు తిలక్. ఆ కవితా ఖండిక లోని కొన్ని పాదాలను పరిశీలించండి!ఇక్కడ నేను క్షేమం - అక్కడ నువ్వు కూడా...

...

ఇప్పుడు రాత్రి, అర్థ రాత్రి

నాకేం తోచదు నాలో ఒక భయం

తెల్లని దళసరి మంచు రాత్రి చీకటికి అంచు

దూరంగా పక్క డేరాలో కార్పోరల్ బూట్స్ చప్పుడు

ఎవరో గడ్డి మేటి నుంచి పడ్డట్టు -

నిశ్శబ్దంలో నిద్రించిన సైనికుల గురక

చచ్చిన జీవుల మొరలా వుంది.

... ...

పోదు నాలో భయం మళ్ళీ రేపు ఉదయం

ఎడార్లు నదులూ అరణ్యాలు దాటాలి.

ట్రెంచెస్ లో దాగాలి

పైన ఏరోప్లేను, చేతిలో స్టెన్ గన్

కీయిస్తే తిరిగే అట్ట ముక్క సైనికులం

మార్చ్!

వన్ టూ త్రీ షూట్ డెడ్ ఎవడ్

నువ్వా నేనా

కేబుల్ గ్రాం యిప్పించండి కేరాఫ్ సో అండ్ సో

(మీ వాడు డెడ్.)

సృహతప్పిన ఎనెస్తిషియాతో

వెన్నెముక కర్రలా బిగిసింది.

యుద్ధం యుద్ధం

లిబియాలో బెర్లిన్లో స్టాలిన్ గ్రాడ్ లో

స్వార్థం పిచ్చి కుక్కలా పెరిగింది.

...

నేనిది వరకటి నేను కాను

నాకు విలువల్లేవు

నాకు అనుభూతుల్లేవు

చంపడం, చావడం

మీసం దువ్వడం లాంటి అలవాటయ్యింది.

కనిపించే ఈ యూనిఫారం క్రింద

ఒక పెద్ద నిరాశ, అనాగరికత

బ్రిడ్జీ క్రింద నది లాగా రహస్యం గా వుంది.

వదల లేని మోపు ఊబిలాగా వుంది

నేనంటే నాకే అసహ్యం

అందుకే మరీ మరీ చంపుతాను, మరీ మరీ తాగుతాను

ఇంకేం చేసినా ఎవరూ ఒప్పుకోరు.

...

తిరిగి ఎప్పుడు మన ఊరు వస్తానో!

నిన్ను చూస్తానో?

...

ఎన్నాళ్ళకి! ఎన్నాళ్ళకి!

కొన్ని వేల మైళ్ళ దూరం మన మధ్య

ఒక యుగంలా అడ్డు పడింది.

ఇంక సెలవ్ మై డియర్!

నిద్ర వస్తోంది మత్తుగా నల్లగా

అడుగో సెంట్రీ డేరా ముందు గోరీలా నిలబడ్డాడు

...

మళ్ళీ జవాబు వ్రాయ్ సుమీ!

ఎన్నాళ్ళకో మరీ

సెలవ్! అబ్బా! చలి!

చలి గుండెల మీద కత్తిలా తెగింది.

నీ రూపం నా దేహానికి వెచ్చగా తగిలింది.భార్యా పిల్లల నుండి యెంత కాలం నుండి విడిగా వున్నాడో? అసలు వారిని కలుస్తానన్న నమ్మకం సైనికుడికి కలుగుట లేదు. ఒక వేళ కలిసినా ఎన్నాళ్ళకి? అనే ప్రశ్న అతన్ని కలవర పెడుతోంది! ఇదే తిలక్ శైలి లోని ప్రత్యేకత! మానవ కారుణ్య భావనకు పతాకం ఎగుర వేసే తత్వము తిలక్ ది.మరో అద్భుతమైన కవితా ఖండిక "ఆర్త గీతం" ఇది ఒక హృదయ విదారక మైన కవిత. ఈ కవిత చదువు తున్నప్పుడు దేవులపల్లి కృష్ణ శాస్త్రి రూపం మన కనుల ముందు మసలు తుంది. ఆయన రచన "ఏడ్వనీండి నన్ను" మనకు స్పురిస్తుంది. కాని ఈ రెండు కవితలలో చాలా వ్యత్యాస మున్నది. తిలక్ హృదయ వ్యధకు దారి తీసిన కారణాలు పాఠకుణ్ణి సహితం అత్యంత వేదన పాలు చేస్తాయి. కవితలోని కొన్ని భాగాలు తిలకించండి!

నా దేశాన్ని గూర్చి పాడ లేను,

నీ ఆదేశాన్ని మన్నించ లేను,

ఈ విపంచికకు శ్రుతి కలుప లేను

ఈ రోజు నాకు విషాద స్మృతి,

విధి తమస్సులు మూసిన దివాంధరుతి

నా ఎడద మ్రోడైన ఒక దుస్థితి.

నేడు నేను కన్నీరుగా కరిగిన గీతికను,

సిగ్గుతో రెండుగా చీలిన వెదురు బొంగును,

మంటలో అంతరాంతర దగ్ధమైన బూడిదను

పైన దైవమునకు, కింద మానవునకు జవాబు చెప్ప వలసిన వాణ్ణి

రసాతల మంట శిరస్సు వంచిన వాణ్ణిఆ తర్వాత గేయాలలో తాను చూచిన దృశ్యాలను హృదయానికి హత్తుకొనే విధంగా చిత్రిస్తాడు తిలక్. "నేను చూచాను నిజంగా మూర్తీభవత్ దైన్యాన్ని, హైన్యాన్ని, క్షుభితాశ్రు కల్లోల నీరధుల్ని,గచ్చత్ శవాకార వికారుల్ని" అంటాడు భరించ లేని ఆవేదనతో. అందుకే కాబోలు ఇది ఏ నాగరికతకు ఫల శ్రుతి? ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి; ఏ బుద్ధదేవుని జన్మ భూమికి గర్వ స్మృతి"? అని నిక్కచ్చిగా ప్రశ్నిస్తాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ అంటాడు. "ఒక్క మలినాశ్రు బిందు వొరిగి నంత వరకు; ఒక్క శుష్క స్తన్య సన్నిధిని క్షుదార్తి నేడ్చు పసి పాప ఉన్నంత వరకు...; అలాగే "ఒక్క తల్లి వీరవాక్రోశ రవమ్ము విన్నంత వరకు, ఒక్క క్షత దుఃఖిత హృదయ మూరడిల్ల నంత వరకు, నాకు శాంతి కలగ దింక నేస్తం, నేను నిగర్వి నైనాను, ఈ సిగ్గు లేని ముఖాన్ని చూపించ లేను" అని వాపోతాడు. అంతే కాదు, ఈ స్థితిని గురించి పట్టించు కొనే నాధుడెవడైనా (రాజకీయ వేత్త గాని, భోగ భ్యాగ్యాలను భవించు వారుగాని) ఉన్నాడా? ఈ విషాద ఆర్తి వారిని చలింప జేస్తుందా? ఏ భగవంతునికి ఈ హృదయ విదారక స్థితి విన్నవించాలి? అని ప్రశ్నిస్తాడు కవికుల తిలక్. "ఆర్త గీతం" కవిత సూక్ష్మంగా పరిశీలిస్తే - తిలక్ మానవ కవి అనీ, అన్ని ధర్మాలకు మించిన మానవ ధర్మం త్రికరణ శుద్ధిగా పాటిస్తారనే నమ్మిక పాఠకు లందరి లోను దృఢ మౌతుంది. తిలక్ కోరుకునే దేశం ప్రాణమున్న మనుష్యులతో నిండినది. ఆ దేశం లోని మనుషులకు ఆయన కోరుకున్నదల్లా, కడుపు నిండా ఆహారం, గుండే నిండా ఆ శ్లేషం, బ్రతుకు పొడువునా స్వతంత్రం, కొంచెం పుణ్యం, కాస్త పాపం, కొంత కన్నీరు, మరికొంత సంతోషపు తేనీరు"! ఈ అవసరాలన్ని తీరేకాల మెప్పటి కైన వస్తుందా అని ఆయన మనో వ్యధ! దానిని గురించి అటు దేవునికీ, ఇటు మనిషికీ తగిన జవాబు ఇవ్వ లేక తన నిస్పృహను వ్యక్త పరుస్తాడు.గొంగళి పురుగులు:నేటి సామాన్య మానవునికి అన్ని సమాజ రంగాల్లో ప్రతి నిధులు ఉన్నారు. సాహిత్య రంగంలో సామాన్యునికి ప్రతినిధి తిలక్. సామాన్యుని ఆశయాల్ని, స్వధర్మాన్ని గుర్తించడమే గాక, వారిలో తానొకడుగా భావించాడు తిలక్. సామాన్యుని అణగ ద్రొక్కాలనే యత్నంలో వున్న వారంతా నేటి రచయితకు (తిలక్) శతృవుల వంటి వారు. తానాశించే జాగృతీ, చైతన్యమూ సామాన్యులలో కనిపించక పోవడంతో నిస్పృహకు లోనవుతాడు. అలాంటి మానసికి స్థితి లో రచించిన కవితా ఖండిక, "గొంగళి పురుగులు". గొంగళి పురుగును, పూట గడవని, కనీసావసరాలు తీరని, దైన్య స్థితిలో జీవించే సామాన్యునికి ప్రతీకగా వాడుతాడుకవి. కవితా చిత్రణ తిలకించండి:బల్ల పరుపుగా పడుకొన్న జీవితం మీద నుంచి

భార్యా మణి తాపిగా నడచి వచ్చి అంది కదా -

"పంచదార లేదు, పాల డబ్బా లేదు

బొగ్గుల్లేవు రాత్రికి రగ్గుల్లేవు.

రోజూ పాడే పాత పాటకి రోజూ ఏడ్చే పాత చావుకి

విలువలేక, విని కూడా కదల కుండా గొంగళీ పురుగు

సగం సగం తిన్న కలల్ని నెమరేస్తూ నిద్ర పోయింది

... ... ...

విసుగెత్తి చివరికి గొంగళి పురుగులు

బల్ల పరుపుగ పరుచు కున్న తన జీవితాన్ని పరుపు చుట్టలా చుట్టి

ఆత్మహత్య చేసు కుందా మని అనుకుంటుంటే

పెళ్ళాం మాట వినబడి బాస్ కేక వినబడి

భయంతో గజ గజ వణుకుతూ

సగం సగం తిన్న కలల్ని నెమరు వేస్తూ

సగం సగం చచ్చిన ప్రాణాల్ని జోకొట్టుతూతిలక్ 1959లో "ఒక శ్రుతి" అనే కవితను రచించారు. శ్రుతి అనే పదానికి వేదం, ధ్వని, విన బడినది, సంగీతం లోని మేళవింపు అనే నానార్థాలు ఉన్నప్పటికీ - వినబడినది అనే అర్థం లోనే తిలక్ వాడారని మనం భావించ వలసి ఉంటుంది. "ఒక శ్రుతి" అనే గేయంలో "దూరదూరల్లో రేఖగా, పొలి మేరగా కరిగి నిల్చిన తనలో వినబడే" శ్రుతిని కవి పలికించడానికి ప్రయత్నిస్తాడు. ఇది చాలా లోతైన భావన (deep thought) అంటితేనే, చరచరా పారిపోయే, పాదరసం లాంటి అనుభూతి. అలాంటి అనుభూతిని పదాలలో అమర్చి పాఠకుడి అనుభవానికి అందజేయాలనే ప్రయత్నం చేస్తాడు కవి తిలక్.చాలా మంది ఆధునిక కవులు ప్రదర్శించే అలాంటి భావన పాఠకుల మనోనేత్రానికి చీకటిగా కనిపిస్తుంది. అలాంటి చీకటి తెరను చీల్చుకొని పోయేటంత శక్తి పాఠకుని హృదయపు కళ్ళకి సాధ్య పడదు. కాబట్టి కవి తన మనస్సులోని చీకటిని ఒక వెలుగు రేఖతో జోడించాలి. ఆ చీకటిని (transparent) చెయ్యాలి. కవి ఉపయోగించే వెలుగు రేఖలే ఆలోచనా పరుడైన పాఠకునికి అందే సంకేతాలు, కవితా రహస్యాలు. ఈ కవితా ఖండిక లో తిలక్ చేసిన శిల్పాన్ని దర్శిద్దాం. ఈ కవితలో కవి దైవానికి తనకి మధ్య గల దూరాన్ని హృదయంతో కొలుస్తాడు! అప్పుడు వినిపించే దూర దూరల శ్రుతి"చెరగి - నేను పుట్టిన పురిటి నొప్పుల చీకటి బాధ;

చెరగి - నేనునశించి చావు సంధ్యల నెత్తుటి చార

చెరపి కొని నీ మధ్య గల దూరపు రేఖ

తెలిసికొని

నీ మధ్య నా మధ్య వంగిన తారకల శాఖ""పురుటి నొప్పుల చీకటి బాధ చేరగి పోవాలి. అప్పుడు కవికి ప్రారంభాన అనంతత్వం ప్రాప్తిస్తుంది. చావు సంజెల నెత్తుటి చార చెరగి పోవాలి. అప్పుడు అతనికి అంత్యాన అనంతత్వం ప్రాప్తిస్తుంది. "పురిటి నొప్పుల చీకటి చార" అనడంలో మానవ జన్మ లోని వేదన, జన్మ పూర్వకమైన అనంత తిమిరాలూ దర్శన మిస్తున్నవి. ఇట్లా అనంత వేదననీ, అజ్ఞాన తిమిరాన్ని పాఠకుని అనుభూతికి తేవడానికి "పురిటి నొప్పుల చీకటి చార" అనే పదాన్ని వాడడమే చీకటిని Transparent చేయడం... ఇక్కడే "దూరపు రేఖ" అనే పద సంఘటన చాలా ప్రతిభా ద్యోతక మైనది. దూరాన ఉన్న రేఖ - అని కాదు దీని అర్థం. దూరము అనేటు వంటి రేఖ. మానవుడు దైవానికి, ఒకే సారి అనంత దూరం లోనూ, అమిత సమీపం లోనూ, ఉన్నాడు... అందుకని ఒకేసారి దూరాన్ని సమీపానికీ, సమీపాన్ని దూరానికీ తీసుక పోగల శక్తిని ప్రదర్శిస్తుంది "దూరపు రేఖ" అనే సమాసం. ఇటువంటి అద్భుత శిల్పాన్ని తిలక్ తనదైన నవ్య మార్గంలో విచిత్రంగా చూప గలిగాడు" (అద్దేపల్లి రామమోహనరావు) ఒక శ్రుతి అనే కవితా ఖండికలో.తపాలా బంట్రోతు : 1959లో తంగిరాల వెంకట సుబ్బారావు అనే మిత్రుడు జిల్లా తపాలా శాఖ జరుపుకొనే వార్సికోత్సవానికి పోస్టు మాన్ మీద యేదైన కవిత వ్రాయమని కోరి నప్పుడు తిలక్ రచించిన గేయం ఈ కవితా ఖండిక. పోస్టుమాన్ అంటే తిలక్ హృదయంలో ఏర్పడిన - లేక మెలగే భావ తరంగాలకు అక్షర రూపకల్పన. మరో మాధ్యమం లేకుండా పఠితల హృదయాల్లోనికి సూటిగా చొచ్చుకు పోతుంది!మై డియర్ సుబ్బారావ్ కనిపించడం మానేశావ్

ఏవిటీ - పోస్ట్ మాన్ మీద గేయం వ్రాయాలా!

...

ఈ నీ ప్రార్థన కడుంగడు అసభ్యం సుబ్బారావ్

ఉత్త పోస్ట్ మాన్ మీద ఊహలు రా నే రావు

ఎండలో వానలో ఎండిన చితికిన

ఒకచిన్న సైజు జీతగాడు

చేతిలో సంచి కాకీ దుస్తులు అరిగిన చెప్పులు

ఒక సాదా పేదవాడు ఇంటింటికి వీధి వీధికి

ప్రతి రోజూ తిరిగే వాడు - ప్రై మినిస్టరా ఏం?అయితే చూడు

ఆ కిటికిలో రెండు విచ్చిన కలువల్లాంటి కళ్ళు

ఆ వీధి మొగవైపే ప్రసరిస్తున్న చూపుల ముళ్ళు

ఆ కళ్ళలో ఆతృత ఆ గుండెల్లో గడచిన

దేశాంతర గతుడైన ప్రియుడి వార్త కోసం

అమ్మాయీ!

పద్ధెనిమిదేళ్ళ పడుచు దనాన్ని భద్రంగా దాచి

పళ్ళెంలో పెట్టి ప్రాణ నాధుడి కందించాలనే

నీ ఆశ నాకు అర్థమయింది

అందుకే

. . .

వీధి వీధి నంతా మేల్కొలుపు తున్నాయి

వీధి వీధి నంతా కలయ చూస్తున్నాయి

అడుగో పోస్ట్ మాన్!

...

గుడిసె ముందు కూర్చున్న పండు ముసలి అవ్వ

గడచిన బ్రతుకంతా కష్టపు నెత్తుటి కాలువ

కనబడీ కనబడని కళ్ళల్లో

కొడిగట్టిన ప్రాణపు దీపంలో

తాను కనిన తన ప్రాణం, తనకు మిగిలిన ఒకే ఒక స్వప్నం

తన బాబు తన ఊపిరి

అస్సాం రైఫిల్సులో సోల్జర్ సిమ్మాచలం

కోసం నిరీక్ష క్షణ క్షణ ప్రతీక్ష

ఒక్క కార్డు ముక్క వ్రాశాడా

బంట్రోతు వెళ్ళు వెళ్ళు త్వరగా

ముసలి దానికి మంచి వార్త నందించు

ముడతలు పడిన మొహం మీద ఆనందాన్ని పరికించు

దూర భారాన ఉన్న కుమారుని కోసం

వగచే తల్లికి

చేరు వౌతున్న నువ్వొక ఊరాట

... ...

నువ్వు దూరాల దారాల్ని విచిత్రంగా

ఒకే నిముషము

అనే కండె చుట్టూ త్రిప్పగల నేర్పరివి - కూర్పరివి

నీ మేజిక్ సంచిలో

ఏ క్షణంలో ఏది పైకి తీస్తావో

ఆ క్షణాన నువ్వు రాజుతో సమానం!

...

అందరికీ నువ్వు ఆత్మ బంధువువి

అందరికి నువ్వు వార్త నంది స్తావు

కాని నీ కథనం మాత్రం నీటిలోనే మధనం

అవుతూంటుంది.

ఇన్ని ఇళ్ళు తిరిగినా

నీగుండె బరువు దింపుకోవడానికి ఒక్క గడప లేదు

ఇన్ని కళ్ళు పిలిచినా

ఒక్క నయనం నీ కోటు దాటి లోపలకు చూడదు

ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడి లాగా వెళ్ళిపోయే నిన్ను చూచి నపుడు

తీరం వదలి సముద్రం లోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు."ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిగా వెళ్ళి పోయే నిన్ను చూచి నపుడు తీరం వదలి సముద్రం లోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు". ఎంతటి రమ్య మైన ఊహ! ఇటువంటి కవిత తిలక్ ముద్రతోనే సాధ్యం! ఇంతటి మహత్తర కవిత తిలక్ మాత్రమే సృష్టించ గలడు!అధునాతన భావకులను గురించి లోతుగా ఆలోచిస్తాడు తిలక్. "కఠినోపనిషత్" అనే గేయంలో ఒక అధునాతన భావకుని లక్షణాన్ని చిత్రించిన తీరును గమనించండి.వెలుగును వెనక్కి నెట్టుతూ రేపటి రోజుకి

పది వేల సంవత్సరాల నాటి పాత ముఖాన్ని అతికించేందుకు

కాలాన్ని సాగదీసి సాగరాన్ని మధించి ఖగోళాల నావర్తించి

అధునాతన భావకులు స్వప్న భుక్కులు

వర్తమాన శిరస్సున వధించ బోయే సమయాన

గత భూత కాల ప్రసక్తి లేక గగన పాతాళాల మధ్య

ఏట వాలుగా జారే విలాసులు తత్ క్షణ ప్రయోజన సాధకులు

చిరు నవ్వులు చిందే విషమ సంధ్య వేళ

అత గాడు మూడవ పరిమాణంలోని ఊహలకి

ఆకారం కల్పించ లేక తికమక పడుతున్నాడు

...

ఏడు రంగుల ఇంధ్ర ధనుస్సు నెక్కుపెట్టి కోట్ల కొలది జనులు

ఎండ మావుల పండుగలు చేసుకొనే సమయాన

అతగాడు తెగిన ఫిడేలు తీగల్నీ

కదలని గడియారపు గుండెల్నీ చినిగిన స్వప్నపు సంచుల్నీ

రిపేయిర్ చేసే ప్రయత్నంలో నిమగ్ను డయాడు."కో ట్ల కొలది జనులు ఎండమావుల పండగలు చేసు కుంటున్నారని" ఎంతటి కఠిన సత్యం తెలిపాడు తిలక్! ఇప్పటికి పరిస్థితి మారలేదు?! ఎంతటి నిరాశ? "కఠినోపనిషత్" ముగిపు గమనించండి!అద్భుత చారిత్రక ఘట్టాల లోన

ఆస్థికులు నాస్తికులు మతాలు సిద్ధాంతాలు

మనష్యుల్ని మరచి పరమ సత్యాలను తరచి పైకి తీసే

ఆవేశపు మధ్యాన్నపు ఎండలలోన

నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి

సౌఖ్య నగరానికి దారి తెలియక

సైను పోస్టు మీద మిధ్యాలిపి డిసైఫర్ చెయ్యలేక

జిగీషువుల జిజ్ఞాసవుల ముఖాలు వెల వెల బోతున్న సమయాన

అతగాడు ఒక్కడూ ఊపిరాడని గదిలో ఉరి పోసుకుని చని పోయాడు1963వ సంవత్సరంలొ తిలక్ తన "మైనస్ ఇంటు ప్లస్" అనే కవితను ప్రకటించాడు. ఆనాటి పరిస్థితులు తిలక్ హృదయంలో నిస్పృహను కల్గించాయి, ఆయనలోని optimism సన్నగిల్ల జొచ్చింది. "మానవుడు మానవుడిగా దేవుడుగా రూపొందే ఈ ప్రయాణం అనంత దీర్ఘం పునః పునర్వ్యర్ధం బహుయుగ విస్తీర్ణం" అంటాడు. అయితే, అనంత దీర్ఘం, బహుయుగ విస్తీర్ణ మైన మానవతా సంఘర్షణ, కృషి, ఎన్నటి కైనా ప్రతి ఫలిస్తుందనే ఆశక బదులు తిలక్ లో నిరాశ కల్గించి పెసిమిస్టుగా మారుస్తుంది. ఈ కవితా ఖండికలో తిలక్ ఆత్మ అంగీకరించ లేని సత్య మేదో దాగి ఉన్నట్లని పిస్తుంది. ఆ కారణం చేత "ఉన్నశాంతి" జడం గా కనిపిస్తుంది. నిష్క్రియాత్వాన్ని శాంతిగా భ్రమిస్తున్న మానవుని సంఘర్షించ మని ప్రభోదిస్తాడు. అందుకేజడంగా వున్న శాంతి నుండి

ఎడంగా తప్పు కుంటాడు మానవుడు

సంచలనం కలిగించే

సమరాంగణాన్ని కోరు కుంటాడు

అందుకే మానవ చరిత్ర అంతా యుద్ధ మయం

యుద్ధాలు లేని చరిత్ర చదివితే అర్థ హీనం.

. . . . . . .

అందుకే మానవుదు మానవుడిగా దేవుడిగా రూపొందే ఈ ప్రయాణం

అనంత దీర్ఘం పునః పునర్వ్యర్థం బహుయుగ విస్తీర్ణంఅంటారాయన. ఈ కవిత లోని గూడార్థం: అసలైన మనిషి, కాస్త అలజడిలో, బయట పడతాడు. వయసెల్లా జనన మరణాలకు లోనవుతుందో కృషి కూడా అలాగే ఆశ నిరాశలకు లోనౌతుంది. దాని అంతిమ జయం మరీ మరీ ప్రయత్నించడమే! నిరంతర సంఘర్షణ మాత్రమే! దీనినే తాత్వికుడైన కవి (తిలక్) పాఠకులకు సూచిస్తారు.

"అమృతం కురిసిన రాత్రి" గేయం 1962వ సంవత్సరంలో రచించినది. ఒక విధంగా పరిశీలిస్తే ఇది ఆత్మాశ్రయ మైన కవిత. కవి ఊహా లోకంలో విహరిస్తూ గడించిన అనుభూతి పరం పర. అత్యంత ఆహ్లాద కరంగా తనను తాను వ్యక్తీ కరించు కొనిన వివరణ.అది రమణీయ మైన రాత్రి. వాతావరణమంతా తియ్యదనముతో నిండి అమృతాన్ని వెదజల్లు తున్నది. జనమంతా నిద్రా వశులై పవ్వ ళిస్తారు. అప్పుడు కవి పయనం సాగుతుంది, ఎక్కడికో దూరంగా కొండదాటి, కోన దాటి వెన్నెల మైదానంలో కి. ఆ కవితా సమయ వర్ణనలు...

ఆకాశం మీద అప్సరసలు

ఒయ్యారంగా పరుగు లెత్తుతున్నారు

వారి పాదాల తారా మంజీరాలు

ఘల్లు ఘల్లని మ్రోగు తున్నాయి

.........

నన్ను చూసి చూసి కిల కిల నవ్వి ఇలా అన్నారు

చూడు వీడు అందమైన వాడు

ఆనందం మనిషైన వాడు

కలల పట్టు కుచ్చు లూగు తూన్న కిరీటం ధరించాడు

.....

ఎవరికీ దొరకని రహస్యాలని వశ పరుచు కున్నాడు

జీవితాన్ని ప్రేమించిన వాడు జీవించడం తెలిసిన వాడు

నవ నవా లైన ఊహా వర్ణార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు

ఇతడే సుమీ మన ప్రియుడు, నరుడు, మనకి వరుడు

జల జల మని కరిసింది వాన జాల్వారింది అమృతపు సోన

దోసిళ్ళతో తాగి తిరిగి వచ్చాను

దుఃఖాన్ని చావుని వెళ్ళి పొమ్మన్నాను

.....

అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్ర పోతున్నారు

అలసి నిత్య జీవితంలో సొలసి సుషుప్తి చెందారు

అలవాటునీ అస్వతంత్రతనీ కావలించుకున్నారు

ఆ ధైర్యంలో తమలో తాము ముడుచుకు పోయి పడు కున్నారు

అనంత చైతన్యోత్సవాన్ని వినిపించుకో లేక పోయారు

అందుకే పాపం ఈ నాటికీ ఎవరికీ తెలియదు

నేను అమరుడనని!స్వగతం గా గడచిన ఈ కవితలో ఆత్మ ఘోషను రంగరించి ఆధ్యాత్మికను చొప్పించాడు కవి తిలక్. అద్భుత మైన అనుభూతిని పాఠకులతో పంచు కున్నాడు. అందుకే కాబోలు ఈ కవితనే సంకలనానికి శీర్షికగా ఎంచు కొనుట!"ప్రార్థన" అనే మరో కవితలో అవాంఛనీయ శక్తుల నుండి తన దేశాన్ని కాపాడ మని దేవునికి మొర పెట్టు కుంటాడు కవి. దేవుని ఉద్దేశించిన ఆ "మొర" లో పేర్కొన్న సంఘ వ్యతిరేక శక్తుల వర్ణన పాఠకుని హృదయాన్ని కదుపు తుంది. చదవండి:

దేవుడా రక్షించు నా దేశాన్ని

పవిత్రుల నుండి పతివ్రతల నుండి

...

శ్రీ మన్మద్గురు పరం పర నుండి

...

నలభై కోట్ల మనుష్యుల నిజమైన ప్రాణం వున్న

మనుష్యులతో నిండిన దేశం నాది...

... బ్రతుకు పొడవునా స్వతంత్రం

కొంచెం పుణ్యం కించిత్ పాపం

కాస్త కన్నీరు మరి కాస్త సంతోషపు తేనీరు

చాలు మాకు తండ్రీ ...

మమ్మల్ని కనికరించు

చావు పుట్టుకల సందేహం లాంటి

జీవితంలో నలు వైపులా అంధకారం

...

ఆశల వెచ్చని పాన్పు మీద స్వప్నాల పుష్పాలు జల్లుకొని

ఆద మరచి కాసేపు విశ్రమించటాని కనుమతించు తండ్రీ.సంప్రదాయ భీరువుల్ని (ఘాటుగా) విమర్శించాడు ఈ గేయంలో తిలక్. లక్షలాది దేవుళ్ళ నుండి, వారి వారి నిరం కుశ ప్రతినిధుల నుండిఈ సామాన్యుణ్ణి రక్షింపమని వినమ్రతతో విన్నపం జేస్తాడు దేవునికి!

"నీడలు" అనే కవితా ఖండిక ఆరు గేయాల్లో ముగుస్తుంది. చిన్నమ్మా! అనే సంబోధనతో ప్రారంభించిన ఈ కవిత విశాల మైన పరి వ్యాప్తి కలిగినది. స్థూలంగా చూస్తే, అదేదో ప్రత్యేకమైన సంఘటనకు చెందిన దాని వలే కని పిస్తుంది. కాని లోతుగా పరిశిలిస్తే, దాని విశాల పరి వ్యాప్తి అర్థ మౌతుంది. చిన్నమ్మా! వీళ్ళ మీద కోప గించకు, వీళ్ళ నసహ్యించు కోకు, వీళ్ళందరూ చిన్న వాళ్ళు, ఆలోచనలు చిన్నవి, మనస్సులు చిన్నవి. ఆదరణలు చిన్నవి, అవకాశాలు అందుకో లేని వాళ్ళు. అనుభవా ల్నుంచి పారి పోయే వాండ్లు!ఇలా వాండ్లను గూర్చి వివరిస్తూ, అయినా వాండ్లను విడిచి వెళ్ళి పోకు, వీళ్ళందరూ నీ బడ్డలు"! అంటాడు. "వీళ్ళ మధ్య డైనమైట్ పేలాలనీ, డైనమోలు తిరగాలని ఆకాంక్షిస్తాడు. ఈ ఖండిక లోని ఏ కవితను తీసుకొన్నా, ఎంత ఊహకీ, ఎంత ఆలోచనకీ, ప్రేరణ, తావు, ఇవ్వాలో అంతా ఇస్తుంది. అది పాఠకుని పరిశీలనా శక్తి మీద ఆధార పడి వుంటుంది. అసలు "నీడలు" అనే పేరు లోనే "ధ్వని" వుంది.

ఆత్మాశ్రయ పరంగా సాగినట్లు కనిపించే తిలక్ రచించిన "అదృష్టాధ్వ గమనం" 1964వ సంవత్సరం లో రచించినది. "శిఖరారోహణ" 1966వ సంవత్సరం లో ప్రచురిత మైనది. మొదటి కవితలో రచయిత (కవి తిలక్) చాలా కాలం తర్వాత తన మిత్రుడిని కలుసు కొంటాడు. ఆ బాల్య సహ పాఠి అతనిని గుర్తించడు?! కవి తన బాల సహాధ్యాయి (మిత్రుని) తో సంబోధనా పూర్వకంగా మాట్లాడిన సంఘటన ఈ కవిత లో వివరిస్తాడు. కవితలో పేర్కొనిన వ్యక్తిని అదృష్టం వరిస్తుంది. జీవితంలో ఉన్నత స్థానాన్ని అందు కొంటాడు. ఇద్దరి మధ్య అసమానత ఏర్పడు తుంది. స్వగతంగా సాగిన కవితా విశేషాన్ని గమనించండి!

అన్నా

నన్నానవాలు పట్టా గలవా? ఆనాటి వాణ్ణి నీ చెలికాణ్ణి

...

స్థూల మైన ఆకృతిని అస్తిత్వాన్ని పొందని పొంద లేని ఊహామరుత్తని.

ఏకాకిని....

"తనది అదృష్టాధ్వ గమనం! ఎవరూ వినని పాటను, ఒకే తీగ మాత్రం మిగిలిన సితార మీద (ఆ ఒక్క తీగ కూడా తెగిన నాడు ఆయన అన్వేషణ మౌనంలోకి ఇంకిపోతుంది) పాడుతూ, ఎవరూ నడవని బాటలో నడుస్తున్నాడు. "కొమ్మ మీద ఆహారం దొరకని కృకలాసం (ఊసరవెల్లి) కంగారు చూపులో, ఊరవతల సందులలో దుమ్ము కొట్టుక పోయిన పిల్లల కళ్ళల్లో ఆరిపోతున్న వెలుగు లో కాలవ వొడ్డున, వంకర తిరిగి న తుమ్మ చెట్టు కొమ్మల్లోంచి కాలి మసై పోతున్న పశ్ఛిమ దిశ గగనంలో ఒక భయం కరమైన సృష్టి క్రమాన్ని, మానవ యత్న వైఫల్యాన్ని ఊహించు కుంటున్నాడు రచయిత. మాములు దారుల్నీ, మర్యాదల్నీ, మంచి చెడ్డల్నీ, విడిచి రాత్రిందివాల మధ్య రహఃకిర్మీరరథ్య (బంగారు బాటల కూడలి) ఆశతో, విశ్వాసంతో, ఆత్మ బలంతో సాగిపోయా డాయన. ఆయన లోపల ఆయన బాధలు, వెలుపల క్షత జగత్తు ఆక్రోశించిన కరుణా భిభత్స రవాలు.నిరంతర పరిణామ జగత్కటాహంలో సల సల కాగే మానవాశ్రు జలాలు. ఐనప్పటికీ అంతర్గత సంగీతం అనుపమ సుందర గీతం ఆయనలో వినబడటం మాన లేదు. సృష్టి లోని అర్థం కోసం, జన్మ లోని సాఫల్యం కోసం... ప్రతి తెరనీ తొలగిస్తూ, ప్రతి అరని తెరుస్తూ నడిచాడాయన". "ఆకాశమంత నా ఏకాంతము లో అనంత మానవ హృదయ స్పందన వినడం మాన లేదు. అలసిన ప్రవాసంలో అద్భుత సౌధాల మణి కవాటాలూ తెరుచు కోవడం మాన లేదు" (వరవరరావు)."శిఖరారోహణ" మరో అద్భుత మైన రచన. ఈ గేయంలో కవి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకు తున్నాడు. ఆ సందర్భాన్ని వాదు కొని, నవీన కాలపు అవ లక్షణాన్ని, నవ యుగానికి కావలసిన శక్తి వికాసాన్నీ సూచన మాత్రంగా స్పృశిస్తాడు. ఆధునిక కాలంలో ప్రాప్తించిన దుర్దశను గేయం మొదటి మూడు భాగాల్లో చమత్కార పూరితంగా "తీక్షణ ధ్వని రచన" తో నిరూపిస్తాడు. నాలుగో భాగంలో కాలపు మూలాల్లోకి, అనుభూతి లోతుల్లోకి కూరుకొని పోతాడు! ఈ నాల్గవ భాగమంతా సనాతనత్వ భావ పూర్వక మైన వేదనా వర్ణితం.విప్లవకవి (వరవరరావు) మాటల్లో "శిఖరారోహణ" అద్భుత మైన రచన. "పాత మాటల మూటలో కవులూ, వట్టి మాటల సంచులతో రాజకీయ వేత్తలూ, మొహమాటం లేకుండా ముందెక్కి కూర్చున్నారు రైళ్ళో". అట్లా "పాత మాటల మూటల కవుల" మీద ఒక విసురు విసరనే విసిరాడు. ఇంకా ఆ కవితా ముగింపులో కొరడా దెబ్బల వంటి తీర్పు ఇచ్చాడు. "కొత్త దారి తొక్క లేని, కొత్త మలుపు తిరగ లేని కుంటి గుడ్డి వాళ్ళ ప్రయాణ కోలాహలం, మురికి కాల్వ మీద, ముసలి తనం మీద, మృషా (అసత్య) జగతి మీద, మహోదయం వికసించదు. సంప్రదాయ భీరువుకీ, అస్వతంత్ర వితంతువుకీ వసంతం లేదు! సాహసి కానివాడు జీవన సమరానికీ, స్వర్గానికీ పనికి రాడు. అయితే, ఆయన (తిలక్ లో) ఎంత సత్సంప్రదాయం జీర్ణించి పలికిందో కూడా చెప్పుకొంటాడు. మన సంసృతిని గురించి కూడా తిలక్ కు విశాల మైన దృక్పధం వుంది. ఆయన షేక్స్పియర్, డాంటీ, కాళిదాసూ, శంకరుడూ మార్క్స్, మహాత్ముడూ, పికాసో, సార్ట్రే లకు వారసుడి నను కున్నాడు.కాని కేవలం కాళిదాసు, శంకరుడూ, మహాత్ములకే వారసు ణ్ణను కో లేదు. "మనగలిగినదీ, కాలానికి నిలబడ కలిగినదీ వద్దన్నా పోదు. మన దైనా మరొకరి దైనా మంచికి జాతీ కులమూ సరిహద్దులు లేవు" అన్న వసుదైక దృక్పథం తిలక్ మహాశయునిది. కాళిదాసు కవిత్వం లోని మాధుర్యం, సౌందర్యం, ఉపనిష దర్శ మహోదది ఎవడు పోగొట్టు కుంటాడూ?ఏ దేశ సంసంకృతి అయినా ఏనాడూ కాదొక స్థిర బిందువు

నైక నదీ నదాలు అదృశ్యంగా కలసిన అంతస్సింధువు

అంటారు తిలక్ మహాశయులు.తిలక్ కవితల్లో ఏది చదివినా కవితా రచన పారవశ్య లక్షణాన్ని పసి గట్ట వచ్చు. ఆయన శిల్పం ఆయనదే! బియ్యంలో నువ్వుల వలే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. "నేను కాని నేను" అనే కవితా ఖండికలో ఈ విషయం మనకు విశద మౌతుంది.

"ఒక నిశార్థ భాగంలో నివహ గగనం

ఓరగా భూమ్మీదకు ఒంగి ఏదో రహస్యం చెబుతున్న వేళ"

అంటారు కవి. "నక్షత్రాలతో కలసిన ఆకాశం భూమ్మీదకు వంగి రహస్యం చెప్పటం" ఎంతటి గొప్ప ఊహ! ఆ పదాల పొందికలోనే ఉన్నది రచయిత విశిష్ఠత. 'రహస్యం' చెప్పటం అనే పదం చాలా మహత్వ మైనది. ఆ వాడుకలోనే కవి మనస్సులోని నిశ్శబ్ద స్థితి వ్యంజన (సూచన) ఉన్నది. ఈ విధంగా "బయటి ప్రకృతి గతమైన వస్తువుల్ని వర్ణిస్తూ, ఆ వర్ణన తోనే అనుభూతిని, సంకేత రూపాన జోడించి, ఆ అనుభూతి, మనోంతర్గత రహస్య వ్యక్తీ కరణ రూపంగా ఉండేటట్లు మలచ బడిన ఈ గేయం, ప్రకృతికీ, కవితా పరవశితమైన మనస్సుకీ కవి రహస్యాలతో నిర్మించుకొన్న వంతెన లాంటిది".బయటి వస్తువుని వర్ణించుట లోనే కవి లోని ఆవేశం వ్యంగ్యంగా స్ఫురిస్తుంది. ఉదాహరణకి ఈ క్రింది పంక్తులను పరిశీలించండి:

"ఎదురుగా గోడమీద బల్లి ఏకాగ్రంగా నాకేసి చూస్తూ ఉంటుంది".

"కిటికి అవతల ఫెరన్ మొక్క క్రీకంట కనిపెడుతూ ఉంటుంది"

"కీచురాళ్ళ చప్పుడు అప్పుడు వినిపిస్తూ ఉంటుంది"తర్వాత కూడా మరి కొన్ని చిత్ర మైన సంకేత భావాలచేత కవి తన అనుభూతిని వ్యక్త పరుస్తాడు. అలాగే 'మంచూ మసక వెన్నెల కలసిన శీతాకాలపు రాత్రీ కవి మనసు యొక్క వ్యక్తా వ్యక్త స్థితికి సంకేతం! అటువంటి రాత్రిగుండెల మీద కవి నిట్టూర్పు వాలుతుంది. ఆ నిట్టూర్పు కవితావేశ పరాకాష్టతో కూడిన నిట్టూర్పు. అది కవి ఏకాంతం మీద ఒక రకమైన తీర్పు. విపులంగా చెప్పాలంటే కవి ఏకాంత స్థితిని చిత్రించే వ్యాఖ్యానం. కవి తనలో తాను యేకమైన అద్వైత స్థితికి సూచన. సూక్ష్మంగా పరిశీలిస్తే తిలక్ తన చుట్టూ వున్న ప్రకృతిలోనే, తన అవేశాన్ని సూచన ప్రాయంగా వర్ణిస్తూ, సంకేతాల ద్వారా తన పారవశ్యాన్ని నిరూపిస్తాడు. అందుకే తిలక్ ప్రధానంగా తాను అనుభూతి వాదినని చెప్పుకొన్నాడు."కిటికీ” అనే మరో గేయం లో మనస్సు యొక్క దైర్ఘ్యాన్ని మూర్తీభవించే విధంగా మన ముందు ఉంచుతాడు చూడండి!

కిటికీ తెరిస్తే గా లీ వెలుతురుతో పాటు

జాలి జీవితపు ధూళీ జ్ఞానమధూళీ కూడా వస్తాయి

తెరిచే కిటికీని బట్టి పర తెంచే పుష్ప రాగం వుంటుంది.

గదికీ మదికీ కూడ గవాక్షా లుంటాయి

అంతరిక్షం లోకి జీవిత రహస్యం లోకి సృష్టి సమక్షంలోకి

విచ్చు కొనే విచిత్రాక్షి సమూహాలు

ఆనంద శోకానుభూత్య విరళ తటిచ్ఛకిత వార్షుక వలాహ కాలు.అనుభూతిని అమోఘంగా చిత్రించి కవితా రూపంలో వ్యక్త పరచారు తిలక్ గారు. "నువ్వు లేవు నీ పాట వుంది" అనే కవితలో - ఇంటిముందు ఉద్యాన వనంలో చిన్ననాడు తాననుభవించిన ప్రేయసి సమాగమానుభూతి యొక్క స్మృతి వేదన ఈ కవితా ఖండిక లోని వస్తువు. కవితను ప్రారంభించిన తీరును గమనించండి:నువ్వు లేవు నీ పాట ఉంది

ఇంటి ముందు జూకా మల్లె తీగల్లో అల్లు కొని

లాంతరు సన్నని వెలుతురులో క్రమ్ము కుని నా గుందేల్లో చుట్టు కుని

గాలిలో ఆకాశంలో నక్షత్రం చివరి మెరుపులో దాక్కుని

నీరవంగా నిజంగా వుంది

జాలిగా హాయిగా వినబడుతూ వుంది

శిశిర వసంతాల మధ్య వచ్చే మార్పుని గుర్తుకి తెస్తోంది"యౌవనంలో తన కౌగిలిలో పాడిన ప్రేయసి యొక్క అనుభూతి కవి హృదయంలో ఎలా స్పందించిందో పైన ఉదహరించిన పంక్తులు వ్యక్త పరుస్తాయి. వారు సంగమించే సమయాన ఇంటిముందు ఉన్నటువంటి జూకామల్లె తీగలో, లాంతరు సన్నని వెలుగులో ఆపాట కవి హృదయాన్ని నింపుతుంది. మరో విధంగా చెప్పాలంటే ఆతరుణం ఆపాట, వాతావరణం కవి (తిలక్) గుండెలలోకి చొచ్చుకుని ఆయనను ప్రకృతిలో ఐక్యం జేస్తుంది. ఆ తరుణం లో అద్వైతానంద స్థితి. అయితే, ఈ నాటి ఆస్మృతి అనిర్వచనీయ వేదనా సహిత మైనది. ఆవేదనలో తీయదనం కరిగిపోయి ఉన్నది. ఆవేదనను తిలక్ అతి సమర్థవంతంగా ప్రకృతితో ధ్వనింప జేస్తాడు. కవి అనుభూతి గాలిలో నిండింది; ఆకాశాన్ని పలకరించింది. ఉదాహరణకు "నక్షత్రపు చివరి మెరుపులో" అన్నది విషాదపు జీరకు సంకేతంగా వాడబడింది. ఆపాట ఈనాటికీ "జాలిగా" వినబడుతోంది. పైగా అది శిశిర వసంతాల మధ్య మార్పు వలె ఉన్నది" అంటాడు తిలక్. మనకందరికి తెలిసిన విషయ మేమిటంటె శిశిరం విషాదం. వసంతం ఆనదం. ఈరెంటికీ మధ్య, విషాదానందాల మధ్య - మార్పు; అంటే వేదనని పిలిచే ఆనదం, ఆనందానికి చేతులు చాచే వేదన, రెండూ కలసిన రేఖ ప్రస్తుత కవి యొక్క స్మృతి! ఈకవితా ఖండిక మొత్తం చిత్ర విచిత్రాను భూతులతో నిండి ఉంది. తిలక్ తన అనుభూతికి మరికొన్ని పోకడలు చెప్పి తర్వాత గేయాన్ని ముగించె విధానంలో సమగ్ర శిల్పత్వాన్ని వ్యక్తీకరిస్తాడు"ఇంటిముందు జూకామల్లె తీగల్లో అల్లుకొని...

శిశిర వసంతాల మధ్య వచ్చే

విచిత్ర మధురమై మార్పుని గుర్తుకి తెస్తోంది

ఇన్నేళ్ళ తరువాత" అంటూ –మహాకవులైన విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ లు అంటే అవ్యాజమైన గౌరవాదరాలు తిలక్ మహాశయునికి. వారిని త్రిమూర్తులుగా చిత్రీకరిస్తాడు. అల్లాగని వారిని గుడ్డిగా అభిమానించడు. చురక చురకగా వ్యంగ్య రీతిలో వారిని గూర్చి ఏమంటారో గమనించండి:

ఒకడు:

మావాడే - మహాగట్టివాడు - మకుటం లేని మహారాజయ్యేవాడు

కాని ముసలిదాన్ని, మసక మసక కన్నులదాన్ని

మూలమూల ముడుచుకు కూర్చున్నదాన్ని

మనువు చేసుకోవాలన్న ఉబలాటంతో

మంచి చెడ్డా మరచి పోయాడు

మర్యాదల్ని అతిక్రమించాడు

మరి పనికిరాడు.మరొకడు:

మల్లెపూల మీద పరుంటాడు, మంచి గంధం రాసుకుంటాడు

మరి ఎందుకేడుస్తాడు?

మంచి పనివాడు, మాకు నచ్చిన వాడు

మాతో నడుస్తా నంటాడు

మరి నిజంగా వస్తాడా?మూడోవాడు:

అరే! వీడు చిచ్చిర పిడుగు,

ఎండలో నడిచే మనుష్యులకు గొడుగు

ముందుకు వేసిన అడుగు

మాకు చిన్నన్న కానీ అన్నన్న!

ఈ మధ్య విదేశాల చవకబారు

పానీయాలు సేవించి

మత్తుగా పడుకున్నాడు

మరి యిప్పట్లో లేవడు.ఎంతో నిజాయితీగా, నిర్భయంగా, చమత్కార యుతంగా చిత్రించారు త్రిమూర్తులను! అదే తిలక్ లో దాగి యున్న మహనీయత. అందుకే, ఆయనను అనుభూతి వాదిగా పేర్కొనుట.ముగింపు:మరో మహత్తర మైన సత్య మేమిటంటే, ఆధునిక కవితా యుగంలో కావ్య వస్తువు పరిధిని విస్తృత పరచి సర్వ జీవిత తరంగాలకూ వ్యాపింప జేయడానికి ఆయన పడిన శ్రమ. సంకుచితమైన జాతి మతాల సరిహద్దులను చెరపి వేసి అకుంఠిత మానవీయ పతాకాన్ని యెగుర వేసిన అభ్యుదయ కవి తిలక్. ఉత్తర ధృవాన ఒక పాదం, దక్షిణ ధృవాన మరోపాదం ఉంచి త్రివిక్రముని వలే పెరిగి కవితా రాజ్యమును పరిపాలించిన వాడు తిలక్. "ఎవరెస్టు కన్నా ఎత్తైన ఆయన ఊహా శిఖరాన్ని" చేరుకోవడం సాధ్యం కాని పని. ఆయన హృదయాన్ని చదవడం కూడా కష్టతరమే! "అమృతం కురిసిన రాత్రి" అనే కవితా సంకలనం లో పొందు పరచిన కొన్ని కవితా ఖండికలలో మరుగు పడిన మాణిక్యాలు, కవితా శిల్పాలలోని సౌందర్యాలు పాఠకుల ముందుంచే సాహస ప్రయత్నం చేశాడు ప్రస్తుత వ్యాస కర్త. అది ఎంత వరకు ఫలించినదో విజ్ఞులే నిర్ణయించాలి.ఈ వ్యాస రచనా ప్రక్రియలో భాగంగా, తిలక్ కవితా విశేషాలను తెలుసుకొనేటందుకు వ్యాస కర్త అనేక రచయితల రచనలను పరిశీలించడం ఆవశ్యకమైనది. ఆయా రచనలలోని భావజాలం అత్యంత ఉపయోగ మైనది. అయా రచయిత లందరికీ - ముఖ్యంగా, కుందుర్తి గారికీ, వరవరరావు గార్కీ, రామమోహనరావు గారికీ, మల్లవరపు విశ్వేశ్వరరావు గారికీ వ్యాస కర్త ఋణబడి యున్నాడు. వారికి కృతజ్ఞతా పూర్వక నమోవాకములు.

చివరగా కాళోజి మాటలతో ఈ వ్యాసం ముగింద్దాం:

కవితిలకుడు లేడు

కవితా క్షేత్రం పడ్డది బీడు

...

శారద నుదుటి తిలకం

కవితకు రాణింపు, ధ్వనికి గుబాలింపు

"ట్రాన్ స్పరెంట్ చీకటి"

“వానికి వాడే సాటి"

1 comment:

  1. చాలా బాగుందండీ తిలక్ గారి కవిత్వం పైన మీ విశ్లేషణ !!!

    ReplyDelete