Friday, 10 January 2014

చతుర్ముఖ జ్యోతి

ప్రస్తావన:

విఖ్యాతులైన వ్యక్తుల స్మృతిని స్మరించుకుంటూ అభినందన సంచికలు, షష్టిపూర్తి సంచికలు వెలువరించుట మన సంప్రదాయము. కొంతమంది విశిష్ట వ్యక్తులకు వారితో సంబంధమున్న అభిమానులు, మిత్రబృందం అధిక సంఖ్యలోనే గాక, అన్ని రంగాలలోను ఉంటారు. శాస్త్రజ్ఞులు, విశేషజ్ఞులు, విద్వాంసులు, కవులు, గాయకులు, జ్ఞానులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు, ఉన్నతాధికారులు, రచయితలు, అమితంగా ఆదరాభిమానాలు ప్రకటించే సాధారణ వ్యక్తులు, సహాయ సహకారాలను అందుకొనిన వారు, ఎందరో ఉంటారు! అంతేకాక, ఆ విఖ్యాత వ్యక్తి, సమాజానికి అందజేసిన సేవలు, సంస్థాగతంగా ఆయన సాధించిన విజయాలను ప్రతి రోజు గుర్తుకు తెచ్చుకొని, ఆ విశిష్ట వ్యక్తి లక్షణాలను స్తుతించే వారిని సహితం మనం రోజూ చూస్తుంటాము. సరిగ్గా అదే జరిగింది కీ.శే. ఆలపాటి రవీంద్రనాథ్ గారి విషయంలో!

అందుకే వెలుగు లోనికి వచ్చింది "రవీంద్ర స్మృతిసంచిక". సుందరమైన తెలుగు లిపిలో, అతి సుందరమైన చిత్రపటాలతో, ఆకర్షణీయ రంగు చిత్రాలతో, చక్కని కాగితంపై, మనసు నాకట్టుకొనే మంచి రచనలతో. తెలుగునాడు లో నేడు ప్రసిద్ధులైన మేధావు లందరు, ఈ సంపుటికి రచన లందజేసి, శ్రీ రవీంద్రనాథ్ పై వారికి గల అవ్యాజ ప్రేమను, హృదయ కంపనలను, ఆదరాభిమానాలను, శ్రద్ధా భక్తులను, వ్యక్త పర చారు. అన్ని వయసుల వారు, ఆ సౌజన్య మూర్తి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని (మూర్తిమత్వం) మన ముందు ప్రతిష్టించారు. అదే, మన కన్నుల ముందు దర్శన మిచ్చే శిల్పా కృతి రవీంద్ర స్మృతి అనే ఈ గ్రంథం.

ఇంతమంది ప్రముఖ వ్యక్తుల నుండి ఏ రూపంలోనైనా, ఇన్ని రచనలు, పత్రికా స్పందనలు, యేకీకృతం చేయుట అసాధారణ విషయం. రచనలు పొందు పరచుట ఒక యజ్ఞ సమాన మయితే, వాటిని తగు రీతిలో అతి తక్కువ ముద్రణా లోపములతో గ్రంథ రూపంలో, ఎక్కడి కక్కడ, సముచిత చిత్రాలతో ఆహ్లాద కరంగా అమర్చి రూపొందించుట మరో యాగం లాంటిది. ఇంతటి గొప్ప పని సాధించిన "రవీంద్ర స్మృతి" సంపుటి సంపాదక మహాశయులు "సహవాసి" (జంపాల ఉమామహేశ్వర రావు గారు) ప్రశంసనీయులు.

ఈ స్మృతి సంపుటికి, దాదాపు 45మంది ప్రముఖులు తమ తమ రచనలు అందజేశారు. కొందరు తక్కువ మాటలతో ఎక్కువ భావ పరంపర వ్యక్త పరుస్తే, మరికొందరు వివరణాత్మకంగా తమ అనుభూతి అను కంపాలను అక్షర రూపంలో చిత్రించారు. రవీంద్రనాథ్ గారితో వారి వారి అనుభవానుబంధాలను ప్రస్ఫుట పర చారు. అందరూ కలిసి రవీంద్రనాథ్ గారి పూర్ణమూర్తిమత్వం, ఆయన యొక్క విశిష్ట వ్యక్తిత్వాన్ని విస్మరించక, రూపు కట్టే యత్నం చేశారు! అది అత్యంత ముదావహం.

ఈ పుస్తకాన్ని 'రవీంద్ర చతుర్ముఖ జ్యోతి" గా భావించి, అందులోని విశేషాలు నాలుగు స్రవంతులుగా ప్రవహించి ఏకోన్ముఖమై శిల్ప సాగరంగా పరిణతి చెందిన విధానాన్ని, విశేషాలను, విజ్ఞులైన పాఠకుల ముందు ఉంచుట యే, ఈ వ్యాసం యొక్క ప్రధానోద్దేశం. ఆ ప్రయత్నం లోని సఫలతా మూల్యాంకణం, విజ్ఞులకే వదులుదాం!

ఈ వ్యాసం చదువుతున్నప్పుడూ, చదివిన తర్వాత, రవీంద్రనాథ్ గారి ఆర్ద్రత, సౌహార్థం, సంస్కారం, సౌజన్యం పాఠకుల తలపులలో పరిమళాన్ని వెదజల్లు తాయని నానమ్మకం.

"సత్పురుషుల మంచితనం - ఝుంఝూనిల ధాటి కాగి

దిగంతాల పర్యంతం - సుగంథాలు పంచుతుంది" అన్నట్లుగా!

చతుర్ముఖ జ్యోతి:

దీనిని నాలుగు పాయలుగా భావించడమైనది. ఆ నాలుగు పాయలు: రవీంద్రనాథ్, వారి పరిచయ స్రవంతి, పత్రికలు (జ్యోతి, రేరాణి, సినిమా), మిసిమి. ఈ చతుర్ముఖ జ్యోతి లోని తొలి పాయ రవీంద్రనాథ్ గారి జీవిత విశేషాలు. ఆయన బాల్య చర్యలను గూర్చి మనకు ఎక్కువ విశేషాలు తెలియనప్పటికీ, కొన్ని వివరాలు తెలుసు కొనుట మన కర్తవ్యం.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రములో, తెనాలి తాలుకా గోవాడ అనే గ్రామంలో ఓ రైతు కుటుంబంలో నవంబరు నాలుగవ తేదీన 1922వ సంవత్సరం లో జన్మించారు శ్రీ ఆలపాటి రవీంద్రనాథ్ గారు. ఆయన తల్లి తండ్రులు ఆలపాటి వెంకటరామయ్య, అమ్మెమ్మ గారలు. రవీంద్రనాథ్ గారికి ఒక సోదరుడు, ముగ్గురు అక్కచెల్లెండ్రు.

రవీంద్రనాథ్ గారి విద్యాభ్యాసం కింగ్ జార్జి కొరొనేషన్ హైస్కూల్, లో ప్రారంభ మైనప్పటికీ, మధ్య లోనే ఆగి పోయింది. సహజంగా స్వేచ్ఛా ప్రియుడైన రవీంద్రనాథ్ కు, క్రమశిక్షణ చట్రములో నడిచే పాఠశాల వాతావరణం నచ్చలేదు. అందు చేత స్కూలు చదువుకు త్వరలోనే స్వస్తి చెప్పారు. అంతేగాని, విద్యాభ్యాసానికి కాదు. ఇంట్లో ఉపాధ్యాయులని పెట్టుకొని విద్యాభ్యాసము కొనసాగించారు. పట్టాలకు, పరీక్షల కోసం కాకుండా, అసలైన జ్ఞాన సముపార్జనకు నిష్ఠతో ప్రయత్నించారు. తనకు అభిమాన విషయాలపై మంచి పుస్తకాలను తెప్పించుకొని స్వయంగా పఠించే పద్ధతిని అలవర్చు కొన్నారు. అనేక విషయాలకు సంబంధించిన పుస్తకాలను నిబద్ధతతో చదివి, విషయాలను గ్రహించి, అవగాహనా శక్తిని పెంపొందించు కొన్నారు. తను చదివిన విషయాలను గూర్చి, పుస్తకాలను గురించి మిత్రులతోను, విశేషజ్ఞులతోను చర్చలు ప్రారంభించారు. అంతేకాక, తను అవగాహన చేసు కొనిన అనేక విషయాల సారాంశాన్ని మిత్రులకు తెలియ పరిచే వారు.

రవీంద్రనాథ్ గార్కి స్కూల్లో సీనియర్ విద్యార్థి, కొసరాజు సాంబశివరావు, ఆనాటి రవీంద్రనాథ్ చురుకు తనాన్ని గురించి, అప్పటి అల్లరి పనుల గూర్చి తన తీపి జ్ఞాపకాలుగా చెప్పేవారు. చిన్నతనం నుంచే రవీంద్రనాథ్ గారిపై తన తాత గారైన దేవయ్యగారి ప్రభావం కొంత ఎక్కువగా ప్రస్ఫుటించేది. గోవాడ గ్రామం ఆనాటి రాజకీయాలలో స క్రియాత్మకంగా ఉండేది. కాంగ్రెసు పార్టీ ప్రభావం ఆ గ్రామంలో కొంత హెచ్చుగానే కనిపించేది! గోవాడ గ్రామం కాంగ్రెసు నాయకులను బాగా ఆకర్షించేది. రవీంద్ర గారికి 10ఏండ్ల ప్రాయంలోనే గాంధీజీ గారిని చూచే అవకాశం లభించింది. రవీంద్రనాథ్ పై గాంధేయ ప్రభావం ఉన్నదనడానికి, ఆయన ఖద్దరు ధరించడం, శాకాహారం తీసుకొనడం నిదర్శనాలుగా చెప్పుకొన వచ్చు.

1934వ సంవత్సరం నుండి రవీంద్రనాథ్ గారు సొంత చదువులలో ఎక్కువ సమయం వినియోగించేవారు. తరచుగా తెనాలి వస్తూ పోతుండటంతో, తెనాలి లోని వ్యక్తుల ప్రభావం ఆయన మీద పడ నారంభించింది. ఆంధ్రా పారీస్ గా పేరుపొందిన తెనాలిలో నాటక శాలలు, ప్రింటింగు ప్రెస్సులు, పత్రికలు ఎక్కువ సంఖ్యలోనే ఉండేవి. సామాన్యంగా చురుకైన, ఆలోచనా పరుడైన రవీంద్రనాథ్ గారి ఊహలు ప్రింటింగ్ వ్యాపారం వైపు మళ్ళాయి! ఈ మధ్య కాలంలో రవీంద్రనాథ్ గార్కి అబ్బూరి రామకృష్ణారావు గారితో పరిచయ మేర్పడింది.

రామకృష్ణారావు గారి లాంటి పెక్కు మేధావులను డా. ఎమ్.ఎన్.రాయ్ స్థాపించిన రాడికల్ డెమోక్రటిక్ పార్టీ ఆకర్షించింది. వారిలో త్రిపురనేని గోపీచంద్, అబ్బూరి వరద రాజేశ్వరరావు, ఆలపాటి రవీంద్రనాథ్ ముఖ్యులు. శ్రీ రామకృష్ణరావు గారి ఆధ్వర్యంలో వీరంతా ఆపార్టీకి కార్య కర్తలుగా పనిచేసేవారు.

1942వ సంవత్సరంలో, తన 21వ యేట రవీంద్రనాథ్ గారి వివాహం చెరుకూరి బాపనయ్య, భ్రమరాంబల కుమార్తె కళావతితో జరిగింది. సామాజిక చైతన్యం కోసం పోరాటం జరిపిన విఖ్యాత వ్యక్తి త్రిపురనేని రామస్వామి చౌదరిగారి గారు ఆధ్వర్యం వహించి ఆ వివాహాన్ని జరిపించారు. ఆ వివాహంలో పాల్గొన్న మరో ప్రసిద్ధ వ్యక్తి ఆంధ్ర విశారద శ్రీ తాపీ ధర్మారావు (తాతా జీ) గారు. ఆ రోజుల్లో ఆ వివాహాన్ని అభ్యుదయ వివాహంగా పేర్కొన్నారు.

తెనాలిలో అనేక ప్రభావాలకు గురైన రవీంద్రనాథ్, రామస్వామి చౌదరి, తాపీ గార్ల ప్రభావానికి కూడా కొంత మేరకు లోనయ్యారు. ఆనాటి పరిస్థితులలో వారిరువురు చైతన్యం తేవడంలో బాగా ఉపకరించారన్నారు.

రవీంద్రనాథ్ గారు తెనాలిలో ప్రింటింగ్ ప్రెస్ పెట్టడం, వారి జీవితంలో ఒక ముఖ్య మలుపు. అది వ్యాపార రీత్యా అవసరమే గాక, ఆయన వ్యక్తిత్వాన్ని వికసింప జేసుకోడానికి ప్రధాన సాధన మయింది. దేశ స్వాతంత్ర్యానికి పూర్వం ప్రింటింగ్ ప్రెస్సులు చాలా కీలక పాత్ర వహించాయి. అవి కళాకారులు, పండితులు, గాయకులు, నటులు, ఉపాధ్యాయులు, కలిసే చర్చా వేదికలుగా ఉపకరించేవి. ఆ తరుణంలో ఆ ప్రెస్ ల అన్నిటి మధ్య రవీంద్రనాథ్ తన ప్రింటింగ్ ప్రెస్ ను స్థాపించారు. దాని పేరు జ్యోతి ప్రెస్ అని పెట్టారు. ఆ రోజుల్లో జ్యోతి ప్రెస్ రాడికల్ హూమనిష్టులకు, హేతువాదులకు, స్వతంత్ర ఆలోచన పరులకు కూడలిగా పేరుబడింది.

ప్రింటింగ్ ప్రెస్ కు బాగా పని సమకూర్చుకో వలసిన ఆవశ్యకత శ్రీ రవీంద్రనాథ్ ను తరచు మద్రాసు ప్రయాణాలకు పురిగొల్పింది. ఈ రంగంలో పోటీకూడా హెచ్చుగానే ఉండేది. రవీంద్రనాథ్ కు పని సమకూర్చే విషయంలో మాట సహాయం చేసిన వారిలో శ్రీయుతులు బెజవాడ గోపాలరెడ్డి, అబ్దుల్ సలాం, వామన రావు (డి.జి.ఐ.), బుల్లెయ్య (విద్యాధికారి), గోవింద రాజుల నాయుడు మొదలైన ప్రభృతులుండేవారు. సినిమా రంగంలో సహితం శ్రీయుతులు కొంగర జగ్గయ్య, డి.వి. నరసరాజు, పాలగుమ్మి పద్మరాజు, గుమ్మడి వెంకటేశ్వరరావు, కాంచనమాల రవీంద్రనాథ్ గారికి అత్యంత సన్నిహితులు.

ప్రింటింగ్ ప్రెస్ చక్కగా నడుస్తున్న కాలంలో రవీంద్రనాథ్ గారి ఆలోచనా సరళి పత్రికల వైపు మరలింది. మద్రాసులో పత్రికలకు కావలసిన సమాచారం, పాత మాగజైనులు, పుస్తకాలు లభించేవి. మోర్ మార్కెట్టు లో ఈ సామాగ్రీ అంతా చౌకగా దొరికేది. ఆ రోజుల్లోనే, రవీంద్రనాథ్ గార్కి మద్రాసులో శ్రీ శ్రీ, ఆరుద్రా లు సన్నిహిత మిత్రు లయ్యారు. ఒక వైపు జాతీయోద్యమం, ఉమ్మ రంగా సాగుతున్న రోజులవి. మరో వైపు ఎమ్.ఎన్.రాయ్ ఎదురీతగా రాజకీయాలలో వివేచన ఉండాలనీ, వికేంద్రియకరణ రాజకీయం గాను, ఆర్థిక పరం గాను వుండాలన్న వాదనను ప్రచారం చేయ మొదలెట్టాడు. రాయ్ భావాలు చాలా మంది తెలుగు వారిని ఆకర్షించాయి. రాడికల్ డెమోక్రాటిక్ పార్టి ఏర్పాటు, దానికి త్రిపురనేని గోపీచంద్ కార్యదర్శి కావడం, ఇంకా ఎన్నో పరిణామాలు జరగడం, ఎం.ఎన్.రాయ్ రెండో సారి తెనాలి రావడం, అన్నీ వెను వెంటనే జరిగిపోయాయి. ఈ పరిణామాల ప్రభావం రవీంద్రనాథ్ పై కూడా కొంత పడింది. రవీంద్రనాథ్ గారు రాయ్ గారి భావాలకు దగ్గరయ్యారు. ఆ స్ఫూర్తి తోనే పత్రికలు స్థాపించారు. రమణీయకత, కళలు, విమర్శల నిమిత్తం ఒక పత్రిక (జ్యోతి), కళా పోషణ, సెక్సును శాస్త్రీయంగా చెప్పడానికి రేరాణి పత్రికను ఉద్దేశించారు.

జ్యోతి పత్రిక ప్రారంభంతో ఆంధ్రాలో కొత్త గాలి వీచింది. కొత్త రచయితలకు అవకాశం లభించింది. రవీంద్రనాథ్ ప్రోత్సాహంతో పలువురు రచయితలు వెలుగులోకి వచ్చారు. ఇతర పత్రికలు వేయని రచనలు (చలం గారి రచనలు) జ్యోతి లో చోటు సంపాదించాయి. ముఖాలు పరికించక, రచనలోని పస చూచి ప్రచురించే సాంప్రదాయాన్ని రవీంద్రనాథ్ జ్యోతి ద్వారా ప్రవేశ పెట్టారు. జ్యోతి పత్రికను రేషణలిష్టు పత్రికగా పేర్కొన్న రవీంద్రనాథ్, ఆ విధానికి తగ్గట్టు గానే పత్రికను నడిపారు. ఎమ్.ఎన్.రాయ్ ఆలోచనా స్రవంతి లోని శాస్త్రీయ ధోరణి రవీంద్రనాథ్ ను బాగా ఆకర్షించింది. రాడికల్ హ్యూమనిస్టులలో రవీంద్రనాథ్ కు సన్నిహితు లైన వారు ఆవుల గోపాల కృష్ణమూర్తి, జి.వి.కృష్ణారావు గారలు. అలాగే తెనాలి నుండి సినిమా పత్రిక నడిపి, కొత్త దారులు, నూతన పద్ధతులు తెలుగు వారికి తెలియ పరిచారు.

పత్రికా నిర్వహణ (అంటే తెనాలిలో ప్రారంభించిన జ్యోతి, రేరాణి, సినిమా) ద్వారా రవీంద్రనాథ్ గారు చాలామంది కొత్త రచయితలను తెలుగు వారికి పరిచయం చేశారు. వారిలో ముఖ్యులు శారద (నటరాజన్), రావూరి భరద్వాజ, ధనికొండ హనుమంతరావు ఇత్యాదులు. అంతేకాక, చాలామంది ప్రముఖులతో తమ పరిచయాన్ని, స్నేహాన్ని పెంపొందించు కొన్నారు. వ్యక్తిగా, మేధావిగా వికసించారు. బాహ్య సౌందర్యముతో పాటు, హృదయ సంస్కారాన్ని పెంపొందించు కొన్నారు. అభిప్రాయాలు కలువని వారితో సహితం అత్యంత సౌమ్యతతో వ్యవహరించి, వయసులోని తార తమ్యతను పాటించక, అభిమానాప్యాయతలు కనబరచుటలో అయన కు ఆయనే సాటి, అని పేరు బడ్డారు.

వ్యక్తిగా కొన్ని నియమాలను స్వయంగా నిర్ణయించుకొని, వానిని అనుసరిస్తూ, నియమ బద్ధ మైన జీవన శైలిని అలవర్చు కొన్నారు. శరీరానికి, వ్యాయామ, ఆహార, విశ్రాంతులు అత్యంత ముఖ్య సాధనాలుగా భావించి, వాటిని క్రమం తప్పకుండా పాటించే వారు. వ్యాయామానికి ప్రతి రోజు సాయంత్రాలు టెన్నిసు ఆట ఆడే వారు. ఆహార, విశ్రాంతుల విషయం లోను, చాలా కచ్చితంగా వ్యవహరించే వారని ప్రతీతి. వీటన్నితో పాటు జ్ఞాన సముపార్జనకై, మంచి పుస్తకాలు, విదేశాలలో ప్రచురితమైన Times పత్రిక మొదలైన మాగజైనులు తెప్పించుకొని చదివే వారు. కనీసం రోజుకు 300-400 పేజీలు చదివితే గాని ఆయనకు రాత్రి నిద్ర పట్టదని ఆయనను గూర్చి మిత్రులు చెప్పే వారు. మంచి పుస్తకాలు తాను చదువుట యే కాక, చాలామంది మిత్రుల చేత కూడా చదివించే వారుట! తాను చదివిన గ్రంథములలో విజ్ఞానాన్ని మిత్రులకు సహితం పంచే వారని, ఆయన మిత్రులు వ్యక్త పరిచిన అభిప్రాయాల వలన రూఢి పడు చున్నది.

మంచిని పెంచడం, మానవతను మన్నించడం, జ్ఞానాన్ని పంచి పెట్టడ మనే లక్షణాలు ఒకటిగా మూర్తీ భవించిన వ్యక్తి రవీంద్రనాథ్ గారని పలువుర ప్రశంస లందు కొన్నారు. అలాగే, సిగరెట్లు, విస్కీ, టెన్నిస్ రవీంద్రనాథ్ గారి నిత్యావసరాలుగా మారాయి. చాలాకాలం వాటిని విడవ లేదు. అలాగని, అతిగా సేవించిన సందర్భాలు సహితం మనకు తెలియవు.

మూఢాచారాలు గాని, మూఢ నమ్మకాలు గాని వారి దరికి చేరిన వివరాలు సహితం మనకు తెలియవు. ఇక మత విషయానికి వస్తే, రవీంద్రనాథ్ బౌద్ధ తత్త్వ ప్రియుడని తెలియు చున్నది. బౌద్ధం పై చాలా గ్రంథాలు, కొన్ని అరుదైనవి, సేకరించి చదివారని తెలియనగు చున్నది. బుద్ధుని గొప్ప తాత్వికునిగా, చింతనా పరుడుగా, నీతి మంతుడుగా ఆయన భావించారు. నిత్య జీవితంలో బుద్ధుడు చెప్పిన కొన్ని విషయాలు తరచు ఉల్లేఖించే వారని ప్రసిద్ధి! భిక్షకు వెళ్ళినప్పుడు ఎవరు ఏదిచ్చినా అది స్వీకరించాలే గాని, ఫలానిది కావాలనో, ఇచ్చింది వద్దనో భిక్షువులు అనరాదని బుద్ధుడు చెప్పాడట. అంతేకాక, బోధకులు స్థానిక భాషను తప్పని సరిగా నేర్చుకోవాలని, దానితో పాటు కొంత వైద్యం వస్తే మంచిదని బుద్ధుడు భావించాడట! ఈ విషయాలన్నీ రవీంద్రనాథ్ కు చాలా నచ్చిన అంశాలు. ఆధునిక బౌద్ధ చింతనా పరిణామాలతో ఆయన ఎప్పటి కప్పుడు కొత్త విషయాలు సేకరించే వారని మిత్రులు పేర్కొన్నారు.

తెనాలిలో ఉన్నంత కాలం ఈ విధమైన జీవితాన్ని గడిపారని రవీంద్రనాథ్ ను గూర్చి వ్రాసిన ప్రతి రచయిత ఉల్లేఖించారు. కాలం ఒకే రీతి సాగదు కదా?! రవీంద్రనాథ్ గారు సహితం వ్యాపారం లో నష్టాలకు గురికాక తప్ప లేదు. తెనాలిలో తాము ప్రారంభించిన పత్రికలు మూత పడినవి. 1957వ సంవత్సరంలో ముద్రణా యంత్రాంగాన్ని హైదరాబాదు తరలించారు. హైదరాబాదులో కళాజ్యోతి ప్రెస్ ను అన్ని హంగులతో ఆధునిక యంత్రాంగంతో స్థాపించే ప్రయత్నంలో నిమగ్నులై తను ఊహించిన విధంగా ఆ ప్రెస్ ను తీర్చి దిద్దటంలో విజయాన్ని సాధించారు. కొత్త ముద్రణాలయం హైదరాబాదు నగరంలో ఒక గొప్ప ప్రెస్ గా పేరు పొందింది. రైల్వే బ్రాంచి నుండి, తెలుగు అకాడమీ నుండి, పని హెచ్చు పరిమాణంలో లభించేది. రవీంద్రనాథ్ గారు ఉదయం నుండి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రెస్ కార్య కలాపాల్లోనే నిమగ్నమయ్యే వారు. రవీంద్రనాథ్ కుమారులు ప్రెస్ పనులకు ఆధ్వర్యం వహించే వరకూ శర్మ గారనే వ్యక్తి ప్రెస్ కార్య కలాపాలు నిర్వహించే వారని చేప్తారు.

హైదరాబాదులో సహితం నియమబద్ధమైన జీవనశైలినే పాతించే వారు రవీంద్రనాథ్ గారు. ప్రముఖమైన క్లబ్బులలో సక్రియాత్మక సభ్యులుగా వ్యవహరించే వారు. సాయంత్రాలు ఫతే మైదాన్ లో టెన్నిస్ ఆడడం, మిత్రులతో గడపడం రవీంద్రనాథ్ గారి నిత్య కృత్యాలలో భాగ మయ్యాయి. పుస్తక ప్రదర్శనాలకు వెళ్ళుట, నచ్చిన పుస్తకాలు కొని తన లైబ్రరీకి చేర్చుట రవీంద్రనాథ్ గారి మరో కార్యక్రమంగా ఉండేది. సికింద్రాబాదు క్లబ్బు లోని గ్రంథాలయం, ముఖ్యంగా మాగజైన్స్ సెక్షన్ (Magazines Section) అంటే ఆయనకు చాలా యిష్టం. హైదరాబాదులో అనేక మిత్రులతో, కొత్త వారి పరిచయాలతో తన మానసిక పరిధిని పరిణతం చేసుకోవడం వారికి అలవాటుగా మారింది. అలా తరచుగా కలిసే వారిలో అబ్బూరి రామకృష్ణారావు గారు పేర్కొన దగిన వారు. ఆ రోజుల్లో రవీంద్రనాథ్ గారిని తరచు కలిసిన మిత్రులలో బూదరాజు రాధాకృష్ణ, తాళ్ళూరి నాగేశ్వరరావు, అశ్వినీ కుమార్ (విజయవాడ), రావూరి భరద్వాజ, సినారే, సి. ధర్మారావు ఆయనకు బాగా సన్నిహితులు.

వయసు మీరుతున్న కొలదీ ప్రెస్ బాధ్యతలన్నీ కుమారుల కప్పగించి, తాను విశ్రాంతిగా తన సమయాన్ని సభలు, సాహిత్య గోష్ఠులు, ఇతర సామాజిక వ్యవహారాలలో గడిపే వారు.

ఆయన తత్వం (Personal philosophy) "నేను ఎవరిని అని చాలామంది ప్రశ్నించు కొంటూ ఉంటారు. ఈ ప్రశ్నను గురించి మీరే మైనా ఆలోచించారా?" అని డా. రవీంద్రనాథ్ గారిని ఒకసారి ప్రశ్నించి నప్పుడు, వేదాంతులు మాటాడుకునే ఆత్మ ఏమిటో నాకు తెలియదు. కాని, నా మాత్రానికి నేను ఈ విధంగా సమాధానం చెప్పు కొంటాను" అన్నారు ఆయన. "నేను నేనే. నేను కు అర్థం చెప్పుకోవడానికి నేను నానుంచి బయటకు పోవలసిన పని లేదు. జీవితంలో అనేక సన్నివేశాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిల్లో నా పాత్రను నిర్వహిస్తూ ఉంటాను. మాములుగా ఈ పాత్రల పరంగా నేను "ఇది", "ఫలానా" అని చెప్పు కొంటాం. కేవలం నేను తండ్రి, భర్త, స్నేహితుడూ, మొదలయిన పాత్రల సంయోగం మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. నాకు కొన్ని ఆశంసలు, ఆకాంక్షలు, లక్ష్యాలు ఉంటాయి. నన్ను నేను వాటి పరంగా నిర్వచించు కొంటాను. ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. అదే జీవితం కాదు. అదే నేను కాదు. ... నేను కావాలను కొన్నది అయ్యాను. ... "నేను" ను గురించి నేను ఏమి చెప్పాలను కొన్నది వ్యక్తత చేశానను కొంటాను".

రవీంద్రనాథ్ పరిచయ స్రవంతి:

ఇది ఒక పెద్ద ధార! చిన్న పాత్ర (కొద్ది పుటల) లో ఇమడ్చడం కష్టతర మైన పని! సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేద్దాం!

చిరు ప్రాయం లోనే రవీంద్రనాథ్ గారికి ఎక్కువమంది పరిచయస్తులు తయారయ్యారు. దానికి కారణం ఆయన ఆకర్షణీయ వ్యక్తిత్వం. సాధారణంగా స్నేహం, వయస్సులో అనుభవంలో సమ వుజ్జీల మధ్య ఉంటుంది. అందులోనూ, సంప్రదాయ శృంఖలాలని తెంచుకోలేని సమాజంలో, ఈ అంతరాలని తొలగించుకొని మైత్రిని నెరపటం చాలా అరుదు. అదే జరిగింది శ్రీ రవీంద్రనాథ్ గారి జీవితంలో. మంచి పెంచడం, ఆనందాన్ని పంచడం, ఆలోచనల్ని రేకెత్తించడం అందరు చేయలేని పని. దానిని సాధించడంలో సఫలు లయ్యారు రవీంద్రనాథ్. అంతేకాదు, అభిప్రాయాలు కలవని వారితో కూడా అత్యంత సౌజన్యంతో వ్యవహరించి, అభిమానాప్యాయతలు కనబరచుటలో ఆరి తేఱినవారు రవీంద్రనాథ్ గారు. అందుకే మరి - ఇంతమంది కవులు, పండితులు, విద్యా వేత్తలు, మేధావులు, రచయితలు, న్యాయమూర్తులు, అడ్మినిస్ట్రేటర్లు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికులు, సినీ ప్రముఖులు, ఇంకా ఇతర జీవన రంగాలలోని మాన్యులు, సామాన్యులతో రవీంద్రనాథ్ గారి పరిచయాలు, స్నేహ బంధాలు వెల్లివిరిశాయి. రవీంద్రనాథ్ గారికి జ్ఞానార్జన తీరని దాహం, సాహిత్యం, తత్వ శాస్త్రం, ఆధునిక దర్శనాలు (తత్త్వాలు), Time, Encounter లాంటి పత్రికలు - ఒకటేమిటి ఆలోచనా పరుల మేధకు పదును పెట్టేవేవి ఆయన పరిధిని దాట లేదు! తాను పొందిన అనుభూతిని, ఆర్జించిన విజ్ఞానాన్ని స్నేహితులతో పంచుకోవాలనే తపన, ఆయనను స్నేహితులు చుట్టు ముట్టుటకు ప్రభల కారణం. తరచుగా స్నేహితులని తన Nest కి ఆహ్వానించి, అతిథి మర్యాదలు జరిపి, తాజాగా తాను చదివిన గ్రంథాల సారాంశాన్ని వారికి చెప్పి చర్చిస్తే గాని, ఆయనకు సంతృప్తి కలిగేది కాదు. సినారే గారు వ్యాఖ్యానించి నట్లుగా "భావ ప్రేరకంగా వున్న ఏ చిన్న అంశం దొరికినా, హేతువుకు ఏతామెత్తే ఓ వాక్యం కంట బడినా, రవీంద్రునికి నిలువెల్లా పారవశ్యం. నిరాఘాటంగా ఆ ఆనందానుభూతి ఆర్థిక పరమైన కాల మానాలకు అతీతం. సంస్కృతి ఆయన రక్తము లోనే వుంది (Culture is in his blood)”. అదే ఇంతటి విస్తృత పరిచయ మండలి (స్రవంతి) రవీంద్రనాథ్ కు కల్గుటకు అసలు కారణం! ఈ కౌటుంబిక నేపథ్యం వారి అస్తమయం దాకా నిరాఘాటంగా ప్రవహించింది! "ఆయనతో దశాబ్దాల స్నేహ సాన్నిహిత్యాలున్న వారు, తక్కువ కాలమైన, నిక్కమైన పరిచయం వున్న వారు, బంధువులు, ఆంతరంగికులు తమ జీవితాల జ్ఞాపకాల వాకిళ్ళు తెరచి, తరచి ఆయనతో పెనువడిన తమ అనుభవాలు, సంఘటనలు, విశేషాలతో ఈ సంపుటి నింపారు, సుసంపన్నం చేశారు. ఆయన జీవితాన్ని, చింతనని, కృషిని పునరావిష్కరించారు. ... ఇక ఏం వ్రాసినా, చర్విత చరణమే అవుతుంది"! అందుకే, ఆ ప్రయాస మానుకున్నాను. పాఠకులు స్మృతి సంపుటిని చదివి ఆనందిస్తారని ఆశిద్దాం!

మిత్ర మండలి దృక్పథంతో రవీంద్రనాథ్ గారిని దర్శిద్దామా! "రవీంద్రుని దృష్టిలో వ్యాపారం వ్యాపారమే, వినోదం వినోదమే, విజ్ఞానం విజ్ఞానమే! వ్యాపార దృష్టిని, వైజ్ఞానిక దృష్టి నుంచి భిన్నంగా ఉంచిన వివేకి అతడు... జీవితాంతం మానవీయ ప్రవృత్తిని, అవ్యాజ మైత్రిని తన మనుగడ లోని అవిభాజ్య పార్శ్వాలుగా మలుచు కొన్న డా. ఆలపాటి రవీంద్రనాథ్ రుచిర స్మృతికి అంకితం ఈ అక్షర సంపుటి" అంటారు డా. సినారే.

"ఆయన ... ఉద్గమన శక్తి ప్రౌఢమై భూమి పెకల్చుకొని వచ్చిన వాడు అందువలన నే, డిగ్రీలు లేకుండానే పాండిత్యం గడించి, ఆ పాండిత్యానికి వన్నె వాసి యే కాక, సాంఘిక ప్రయోజనాన్ని చేకూర్చారు" అంటారు జస్టిసు పి.ఎ.చౌదరి. "రవీంద్రనాథ్ గారి వ్యక్తిత్వం, కృషి, సౌహార్థం చాలా దొడ్డవి. ఆయన స్నేహం అమృతాయమానం" అంటారు డా. బూదరాజు రాధాకృష్ణ. ఎందరో మేధావులను గూర్చి, రచయితలను గూర్చి, మన జీవితాలను ప్రభావితం చేసిన ఆలోచనా పరులను గూర్చి ఆయన చెప్పే వారు... ఆయనతో సంభాషణ తర్వాతే నేను బౌద్ధాన్ని గూర్చి, అంబేద్కరు రచనల గురించి తెలుసు కొన్నాను" (డా. జయప్రకాష్ నారాయణ).

"డా. ఆలపాటి రవీంద్రనాథ్ గారి ఉత్తమ కళాభిరుచీ, స్నేహ శీలత, సహృదయ తా చిరస్మరణీయాలు" అంటారు అబ్బూరి ఛాయాదేవి. "డా. రవీంద్రనాథ్ గారిని చూచినప్పుడు ఉత్సాహం మూర్తీ భవించిన యీయనలో సీరియస్ సాహిత్యోపాసకు డున్నాడని అనుకోవడం కష్టం" అని అభిప్రాయం వ్యక్త పరచారు రామలక్ష్మీ ఆరుద్ర. "నాకు ప్రతిభ వలన, కృషి వలన ఎన్నో క్వాలిఫికేషన్సు లభించి ఉండవచ్చు. కాని, రవీంద్రనాథ్ గారితో పాటుగా ఈ లోకంలో కొంత కాలం పాటుగా జీవించి ఉండటం, వారితో పరిచయం కలిగి ఉండటం - ఈ రెండు యోగ్యతలు ఎంతో మిన్న! రవీంద్రనాథ్ మేధావులలో కూడా నవీనుడు, ఆధునికానంతరుడు" అని వర్ణిస్తూ, దీపం (జ్యోతి) ఆయనే, కాంతి (మిసిమి) ఆయనే"! అంటారు భరాగో.

"ఆయన ఎంతగా "నా ఆల్టర్ ఈగో" అయినా ఆయనలో రస, సౌందర్యాలు తొణికిస లాడుతుంటే, నన్ను సిద్ధాంతాలూ, దర్శనాలు, తర్కం ఆ కట్టు కొన్నాయి. ఫలితంగా ఆయన పచ్చని చెట్టు అయితే, నేను ఎండు వారిన కట్టెను - ఇద్దరం ఒకే వృక్షానికి చెందిన వారమైనా ఈ తేడా మిసిమి లో ప్రతి ఫలించింది" అంటారు అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి - మిసిమి కి రవీంద్రనాథ్ గారి తర్వాత సంపాదకత్వం వహించిన వారు. ఎంత గొప్పగా వర్ణించారు రవీంద్రనాథ్ గారి మూర్తిమత్వం!

"రవీంద్రనాథ్ గారు చాలా ముందు చూపున్న భావుకులు నా జీవితానికింత స్థిరత్వం ప్రసాదించిన వారికి పాదాభి వందనం" అని తమ సన్నిహితత్వాన్ని ప్రకటించారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ.

"శ్రీ రవీంద్రనాథ్ గారు వస్త్రధారణ నుంచి ప్రతి అంశములోనూ సౌందర్యాన్ని, ఆధునికత, హుందాతనాన్నిచ్చి, విలువలు పెంచే సంప్రదాయ బద్ధత పాటిస్తూ జీవితంలో సమతౌల్యం, ప్రదర్శించి, తన జీవితాన్ని విలువలతో, ప్రయోజనాత్మకంగా అనుభవించిన వ్యక్తి" అని అభివర్ణించారు విదుషీమణి డా. మంజులత. రవీంద్రనాథ్ ను సరసుడూ, సాహిత్యాభిమాని, స్నేహశీలి, అభ్యుదయ వాది, భేషజాలు లేని మనిషిగా చిత్రించారు సంగీత, సాహిత్యాభిమాని డా. వై. విశ్వనాథ్. "నిజానికి రవీంద్రనాథ్ తో నా పరిచయం మూడు సంవత్సరాలే! కాని నా జీవితం లో ఈ మూడు సంవత్సరములు మధురమైన సాహిత్యానుభవాల్ని మిగిల్చి, నన్ను నన్ను గా నిలబెట్టాయి" అని తన అనుభవాలను వివరించారు ప్రముఖ పాత్రికేయుడు టి. రవిచంద్.

సాంస్కృతిక పునర్జీవన కృషిలో రవీంద్రనాథ్ ప్రముఖ పాత్ర వహించారు. ఆకాశవాణి ప్రసారం చేసే వివిధ కార్య క్రమాల బాగోగులు విమర్శనాత్మకంగా రేడియో రివ్యూ - శీర్షికను మొట్ట మొదట తెలుగు పత్రికలలో ప్రవేశ పెట్టిన వారు రవీంద్రనాథ్ గారే! అంతేకాదు, హేతువాద భావ వ్యాప్తికి శాస్త్రీయ భావనల ప్రచారానికీ చేయూతనిచ్చి సాంఘిక చైతన్యానికి పాటుపడినవారు రవీంద్రనాథ్ గారు. పత్రికా సంపాదకునిగా ఆయన పాత్ర శ్లాఘనీయమని అభివర్ణించారు, ప్రజా సాహితి సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు.

"తాము కల్పించుకునే విలువకు మించి మానవ మనుగడకు వేరే అర్థమూ, పరమార్థమూ ఏదీ లేదు. ఎవరైనా తమ జీవితాలను అర్థవంతంగా తీర్చుకోగలిగినప్పుడు, అ జీవితం నుండి అద్భుతమైన ఫలితం వెలువడితే అది వారికి అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. ... కొందరు అదృష్టవంతులు తమ జీవిత కాలంలో వీలైనంత జ్ఞానాన్ని సముపార్జించి తమ తర్వాత వారికి అందజేయ గల్గుతారు... ఆ కోవ కు చెందినవారు డా. రవీంద్రనాథ్ అని చిత్రించారు "రేపు" పత్రికా నిర్వాహకులు సి. నరసింహరావు. "కొత్త కొత్త విషయాలను గురించి, భావాలను గురించి తెలుసు కొంటూ, వాటిని పాఠకుల కందించాలన్న తపన గల వ్యక్తి శ్రీ రవీంద్రనాథ్. ఆయన సార్థక జన్ములు" అని పొగిడారు ప్రముఖ హిందీ సాహిత్యవేత్త డా. భీమసేన్ నిర్మల్.

హేతువాది, రచయిత్రీ, ఫెమినిస్టు, ఉద్యమకర్త్రి, సంఘ సేవిక మల్లాది సుబ్బమ్మ స్మృతి పథంలో రవీంద్రనాథ్ గారొక విజ్ఞాన ఖని. ఆ విజ్ఞానాన్ని సమాజానికి అందజేయడానికి ఆయన సల్పిన కృషి అమోఘం" అంటారావిడ! "ఎవరైనా గాని స్వయం ప్రకాశం గల్గి వుండాలేగాని, ఛాయా గ్రహాలుగా ఉండటం రవీంద్రనాథ్ గారికి గిట్టదు" అంటారు శ్రీరాం ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అధినేత డి. శేషగిరిరావు గారు.

"ఆగమ గీతం ఆలపించిన ఆలపాటి" అనే వ్యాసంలో "మూస లో పోసిన ఊసులు భావాలు వద్దంటూ (దీనినే indoctrination అంటారు) సమా హిత భావ సమ్యగ్దర్శనంతో, భావుక సమన్వయత్వంతో కథా కథనం సాగించాలన్న ధోరణి ప్రవర్థమాన మైంది. భేదాభిప్రాయాల పట్ల మన్నన చూపగల ప్రశస్త భావుకత లోనే అవిశ్రాంతంగా ఆయన జీవించాడు" అని పేర్కొన్నారు రచయిత, రాడికల్ హ్యూమనిస్టు పి.అచ్యుతరాం. ఎంతటి సముచిత వ్యక్తిత్వ చిత్రీకరణ! "శ్రీ రవీంద్రనాథ్ వ్యక్తిత్వం ఉన్నతమైనది, మహోన్నత మైనది, అజాత శత్రువు, ఆయన ఏ విమర్శకు దొరకని అతీతుడు" అంటారు డా. సి.హెచ్.వెంకటేశ్వరరావు.

One of the cousins of Dr. Ravimdranath, Alapati Krishna Kumaran, opines that his cousin Dr. Ravimdranath known by his colleagues, friends and competitors as well, for his drive for success in the publishing world and his desire for service to the society. He has written a long article about his cousin and the factors that influenced the making of his personality. Prof. Krishna Kumaran happens to be a Professor Emeritus of Marquette Varsity, U.S.A.

ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, హిందీ సాహిత్య కోవిదుడు పావులూరి శివరామకృష్ణయ్య గారి దృష్టిలో డా. రవీంద్రనాథ్ తన కృషి, చింతనలతో వర్తమాన, భావి తరాల వారికి స్ఫూర్తి మంతులయ్యారు.

"డా. రవీంద్రనాథ్ పసితనం నుంచే పరిణతి చెందిన ప్రతిభను ప్రదర్శించి, అనితర సాధ్యమైన పద్ధతిలో ఉన్నత శిఖరాల నధిరోహించే దిశలో పయనిస్తూ విశిష్ట ప్రవర్తనంతో విలక్షణ వ్యక్తిగా ప్రవర్తించారు. ఉన్నత ప్రమాణాలను సంతరించు కొని అన్ని వర్గాల ఆదరాభిమానాలను చూరగొన్న మానవతా మూర్తిగా ఎదిగారు" అని ప్రశంసించారు ఆచార్య యం.యల్.గురప్ప చౌదరి.

యల్. యస్. రామయ్యగారి మాటల్లో రవీంద్రనాథ్ గారు ఒక మహావ్యక్తి, సహృదయుడు. వారి ద్వారా సహాయం పొందిన వారనేకులు. వారిలో ఏదో సాధించాలనే తపన, సమాజంలో మార్పు రావాలన్న ఆసక్తి మిక్కుటంగా కనిపించేవి. ... మనిషి గంభీరంగా ఉండి, తొణకని నిండు కుండలా ఉండేవారు. తెల్లటి లాల్చీ, యిస్త్రీ చెరగని తెల్లటి పంచలొ మనిషి పులు కడిగిన ముత్యంలా వుండేవారు".

ప్రముఖ చిత్రకారుడు ఎస్సారె (రహమత్ ఆలీ) కుంచె తీర్చిన అక్షర చిత్రం ప్రకారం "హృదయ సౌందర్యం, బాహ్య సౌందర్యం మేలిమి కోవ కు చెందిన వ్యక్తుల్లో రవీంద్రనాథ్ ఒకరు. నిండు విగ్రహం, పసిడి ఛాయ, వయసుతో పాటు పెరుగుతూ పోయిన విశాల మైన నుదురు, చక్కటి ముక్కు, గంభీరంగా కనిపించె ఆ ముఖ కవళికల్ని సెకన్లలో ఆహ్లాదంగా మార్చ గలిగే అరుదైన చిరు నవ్వు ఆయన స్వంతాలు". ఇంతకంటే గొప్పగా ఏ మహామనీషి మనకు కనిపిస్తాడు?! పరిమళించే పరిపూర్ణ వ్యక్తిత్వం.! కాదు, మూర్తిమత్వం!

చతుర్ముఖ జ్యోతి - మూడవ పాయ. (జ్యోతి, రేరాణి, సినిమా)

1946 రవీంద్రనాథ్ గారి జీవితంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించు కొన్నది. ఆ సంవత్సరంలో ఆయన జ్యోతి ప్రెస్ ప్రారంభించారు. అదే సంవత్సరం, ‘జ్యోతి’, ‘రేరాణి’ పత్రికలు కూడా స్థాపించి, వాటి సంపాదకత్వం చేపట్టారు.

"జ్యోతి" పత్రిక పెట్టుటలోని ప్రధానోద్దేశము రమణీయకత, కళలు, విమర్శలను ప్రోత్సాహించుట. ఈ మేరకు, రచనలోని స్థాయి, పస చూచి ప్రచురించే సాంప్రదాయాన్ని రవీంద్రనాథ్ ప్రవేశ పెట్టారు. ఆ రోజుల్లో ప్రముఖ పత్రికలలో చాలా భాగం మద్రాసు నుండి ప్రచురిత మయ్యేవి. దానికి ముఖ్య కారణం ముద్రణా సౌకర్యాలు మద్రాసులో ఉన్నట్లు ఇతర చిన్న పట్నాలలో లేక పోవడమే. ఆ తరుణంలో రవీంద్రనాథ్ గారు సాహసించి తెనాలిలో జ్యోతి వెలిగించారు. ‘జ్యోతి’ ప్రతిభ తైలంగా గల చాలా వత్తుల్ని వెలిగించింది. ఆంధ్రాలో జ్యోతి ప్రచురణతో కొత్త గాలి వీచింది. ధైర్యంగా నూతన మార్గాలు అవలంబించే వారికి ఒక నమ్మ దగిన వేదిక లభించింది. ఇతర పత్రికలు వేయని రచనలు - చలం రచనలు వగైరా - జ్యోతి లో చోటు చేసు కున్నాయి! ‘జ్యోతి’ పత్రిక ‘రేషనలిష్టు’ పత్రికగా పేరు గడించింది. కొన్ని రంగాలలో ఇతర పత్రికలు చేయని, చేయ జాలని పాత్ర నిర్వహించింది. రేడియో ప్రసారాలను, దినపత్రికల నాయకత్వాన్ని నిశితంగా పరిశీలించి విమర్శనాత్మక వ్యాసాలు వ్రాయ మొదలెట్టింది.

రవీంద్రనాథ్ అనేక మంది రచయితలకు అభివ్యక్తి కల్పించారు. ఎవ్వరికీ తెలియక అడవిలో పడి వున్న రచయితలను వెలుగు లోనికి తెచ్చి, అడవి కళాఖండాలను రసాస్వాదుల దృష్టికి తెచ్చారు. "శారద" రచనలు అలా వెలుగు చూచినవే. ఒక్క శారదే కాదు, ఈ నాటి ప్రసిద్ధ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారు కూడా ఆ కోవ లోనికి చెందిన వారే! వారి రచన "అలనాటి ప్రాణం" చరిత్ర సృష్టించిన విషయం పాఠకులకు విదితమే. ఆలూరి భుజంగ రావు, ప్రకాశరావు, శార్వరి, అమరశ్రీ, తాళ్ళూరి నాగేశ్వర రావు, హితశ్రీ, కొలను బ్రహ్మానంద రావు, సన్నపనేని సుబ్బా రావు, పోలవరపు శ్రీహరి రావు ఇత్యాదు ‍లంతా రవీంద్రనాథ్ ప్రోత్సాహంతో ప్రసిద్ధు లైన వారే! వీరిని పైకి తీసుకు రావడంలో రవీంద్రనాథ్ ఒక కొలమానాన్ని వాడారు. అదే! "రచన బాగా ఉండటం ఉండక పోవడమే"! ఆ కొలబద్దను ఆయన కఠినంగా అమలు పరచారు.

‘జ్యోతి’ ప్రధానంగా కథల పత్రిక (పక్ష పత్రిక). అయినా, అందులోను కవితలు, వ్యాసాలు, నాటికలు, విమర్శలు కూడా ప్రచురిత మయ్యేవి. ఆ నాటి ప్రసిద్ధ కథకులు చాలామంది జ్యోతికి వ్రాసే వారు. చలం, కుటుంబ రావు, గోపీచంద్, మల్లాది రామకృష్ణ శాస్త్రి, పి.వి.సుబ్బారావు, జి.వి.కృష్ణారావు లాంటి వారు జ్యోతికి తమ రచనలు పంపే వారు. అలాగే, శివం, శ్రీనివాసరావు, శారద, శార్వరి, ప్రకాశరావు, హితశ్రీ, లాంటి వారెందరో జ్యోతికి వ్రాసే వారు.

రేరాణి తెనాలి నుండి ప్రచురించిన తొలి మనో వైజ్ఞానిక మాస పత్రిక. అది రవీంద్రనాథ్ సంపాదకత్వం లోనే వెలువడింది. సిగ్మండ్ ఫ్రాయిడ్, హావలాక్ ఎల్లీస్, మేరీ స్టోప్స్ వంటి రచయితలను తెలుగు వారికి పరిచయం చేసిన ఘనత డా. రవీంద్రనాథ్ గారికే చెందుతుంది. ఆ రోజుల్లో రేరాణి ప్రతి సంచిక లోను చలం కథో, చౌడేశ్వరి గారి రచనో తప్పక చోటు చేసు కొనేది. చాలా కాలం ధనికొండ హనుమంత రావు రేరాణి పత్రికలో పని చేశారు. తర్వాత ‘అభిసారిక’ అనే పత్రిక సొంతంగా మొదలెట్టారు. రేరాణి లో ప్రచురితమైన భరద్వాజ గారి రచన ‘అలవాటైన ప్రాణం’ చరిత్రను సృష్టించిన విషయం ఇది వరకే ఉల్లేఖించాం.

లైంగిక విషయాల ప్రస్తావనే బూతుగా, అశ్లీలంగా పరిగణించే రోజుల్లోనే అత్యంత సాహసంతో హావలాక్ ఎల్లీస్ రచనల అనువాదాలు ‘రేరాణి’ లో రవీంద్రనాథ్ గారు ప్రచురించి, ఆయన వైజ్ఞానిక దృక్పథాన్ని, ముందు చూపును, ప్రగతి శీలతను వెల్లడించారు. ‘రేరాణి’ నిజానికి శాస్త్రీయ లైంగిక విజ్ఞాన పత్రికగా కూడా పేరు తెచ్చుకుంది. ఈ నాడు అందరు ఆర్భాటం చేస్తున్న అనేక సమస్యలను గురించి దాదాపు 60 సంవత్సరాల క్రితమే మంచి మంచి వ్యాసములు ‘జ్యోతి’, ‘రేరాణి’ పత్రికలలో ప్రచురించి భవిష్యత్తుకు మార్గదర్శకు లయ్యారు రవీంద్రనాథ్ గారు.

అలాగే సినిమా పత్రిక మూలంగా మంచి సినిమాలను, మంచి నటులను గూర్చిన అనేక వ్యాసాలు ప్రచురించి సినిమా రంగానికి కూడా గొప్ప సేవ జేశారు రవీంద్రనాథ్ గారు. తెనాలి నుండి వెలువడిన తొలి సినిమా మాస పత్రిక ‘సినిమా’.

చతుర్ముఖ జ్యోతి - నాల్గవ పాయ - మిసిమి.

"రవీంద్రనాథ్ అంటే 'మిసిమి', మిసిమి అంటే రవీంద్రనాథ్. ఆ రెండు అవిభాజ్యం". అందుకే నేమో 'రవీంద్ర స్మృతి ' సంపుటికి తమ తమ రచనలందించిన వారిలో అత్యధిక భాగం రచయితలు 'మిసిమి ' ని గూర్చి ఏవో కొన్ని విషయాలు ఉల్లేఖించుట తప్పని సరి యైనది! అందుకే ఈ వ్యాసంలో ఒక ప్రముఖ పాయగా మిసిమిని గూర్చి వ్రాయడ మైనది. సాధ్యమైనంత మేరకు, రచయితల అభిప్రాయాలను ఇందు పొందు పరచడ మైనది. కొన్ని సందర్భాలలో రచయితల మాటల్లోనే వారి భావ పరంపర వ్యక్త పరిచే ప్రయత్నం జరిగింది.

సహవాసి గారి దృష్టిలో మిసిమి వెనుక రవీంద్రనాథ్ గారి తపన ఉంది. మొట్ట మొదట్లో ఆయన మిసిమిని ఏ ఉద్దేశ్యంతో ప్రారంభించి నప్పటికీ, ఆలోచనా పరులైన పాఠకులకు, జిజ్ఞాసువులకు, పరిశోధకులకు, మేధావులకు మహోపకారమే జరిగింది.

ఇది వరకు ఏ పత్రికకు లేనటువంటిది, కుడి, ఎడముల (ఎటువైపు నుండి చదివినా) తేడా రానిది 'మిసిమి ' అనే పేరు! పత్రికకు ఈ పేరును సూచించిన వారు బూదరాజు రాధాకృష్ణ గారు. 'మిసిమి ' అంటే నూతన కాంతి, నవనీతం (వెన్న) అని రెండర్థాలు. ఆ పదం, దాని అర్థం సప్రమాణంగా చూపనిదే రవీంద్రనాథ్ గారికి సంతృప్తి కలుగ లేదు. అందుకే ఈ పద ప్రయోగానికి నిదర్శనంగా అల్లసాని పెద్దనగారి మనుచరిత్ర నుండి -

"మిసిమి పర సీమ వల రాజు మేనమామ

వే వెలుంగుల దొర జోడు రే వెలుంగు"

అనే పద్యం లోని వాక్యాలు ఉల్లేఖించడం జరిగింది. అలాగే నవనీతం అనే అర్థంలో ఎవరు ఎక్కడ వాడారో కూడా ఉదాహరణ పూర్వకంగా వివరించారు శ్రీ బూదరాజు రాధాకృష్ణ గారు.

"మిణుకు టూర్పుల వాని

మిసిమి మేతల వాని

మెరుగు ఛామన ఛాయ మేని వాని ...”

అలాగే నవనీతం అనే అర్థం లో తెనాలి రామకృష్ణ కవి తన పాండురంగ మహత్యం అన్న కావ్యం లో పైన ఉదహరించిన వాక్యాలలో వాడారు.

'మిసిమి' అన్న పేరు రవీంద్రనాథ్ సంపాదకత్వంతో సార్థక మైనది. మిసిమి మాస పత్రిక ప్రచురించి సంపాదకునిగా పనిచేసి డా. రవీంద్రనాథ్ గారు గడించిన కీర్తి ప్రతిష్టలు కాలం చెరపలేనివి.

మిసిమి పక్ష పత్రికగా ఆరంభమై, తర్వాత మాస పత్రికగా మారింది. జ్యోతి (కళాజ్యోతి) ప్రెస్ కు విదేశాల నుండి నాణ్యమైన కాగితం తెప్పించాలంటే పత్రిక పేరిట కోటా సాధ్యమనే దృష్టితో పక్ష పత్రికను ఆరంభించారు రవీంద్రనాథ్ గారు. పత్రికకు తగిన మేటర్ విషయంలో డా.ఎన్.ఇన్నయ్యగారు సహకరించారు. నాలుగు సంచికలు వచ్చే సరికి, పత్రిక ఆపేయాలా, కొనసాగించాలా అనే ప్రశ్న ఎదురైంది. రవీంద్రనాథ్ గారి కుమారులు ఆయన్ను ప్రోత్సహించి, పత్రికను ఆపరాదనే నిర్ణయానికి కారకులయ్యారు. ఆ విధంగా 'మిసిమి' నిలదొక్కుకొని మాస పత్రికగా మారింది. రవీంద్రనాథ్ గారు తమ పూర్తి సమయాన్ని వినియోగించి 'మిసిమి 'ని ఒక ప్రామాణిక పత్రికగా రూపొందించారు. రవీంద్రనాథ్ 'మిసిమి' కి రూపకల్పన చేసి జవ జీవాలు నింపిన సంపాదకుడు మాత్రమే కాదు ఆ ‘మిసిమి' ని అందరికీ వెలుగు నందించే 'పసిమి' గా తీర్చి దిద్దారు. రవీంద్రనాథ్ గారి లక్ష్య శుద్ధి మహత్మ్యం వలన ఇప్పుడు 'మిసిమి' రజతోత్సవం కూడా జరుపు కుంటోంది!

"మిసిమి అందరికి అందుబాటులో ఉండదు. అంటే, మిసిమిలో ప్రచురితమయ్యే కొన్ని కొన్ని రచనలు అందరికీ మింగుడు పడవు! వాటి 'స్థాయి' ఒక కనీస స్థాయిని అధిగమించిన వారికే అందు బాటులో ఉంటుంది. వారినే మేధావి పాఠకు లంటున్నాము. మేధావులు, మేధావి పాఠకులు ఒకటే కారు. మేధావుల పాఠకులు మేధావి పాఠకులు" (చలసాని ప్రసాదరావు). 'మిసిమి' మేధావుల పత్రిక. మేధావి పాఠకుల పత్రిక. ఆ పాఠకుల కోసం ఈ మేధావుల కలం పట్టించిన సంపాదకుడు డా. రవీంద్రనాథ్. ఆ పని కూడా గతంలో ఎవరు చేయని స్థాయిలో, ఊహించని రీతిలో చేశారాయన. తనతో పాటు 'మిసిమి' కూడా 'పసిమి' గా వెలిగి పోయేటట్లు చేశారు. విద్యావంతులైన ఆధునిక తెలుగు పాఠకుల కంటికి పంచ రంగుల పసిమిగా మేధకు బరువైన మేతగా, హస్త భూషణంగా కూడా తీర్చి దిద్దా రాయన. మిసిమి ముందు, వెనుకా ఎన్నెన్ని, ఎందరెందరు ప్రసిద్ధ చిత్రకారుల అపురూప కళా ఖండాలు మిల మిల లాడాయి!? వాటి ముద్రణలో ఏ పాశ్చాత్య ముద్రణకు తీసిపోని నైపుణ్యాన్ని ఎంతగానో సాధించారు. ఉన్నవి కాసిన్ని పేజిలే, అయినా ఎంత బరువైనది 'మిసిమి'?!

"నేర్చు కొనిన దేనినైనా స్వీయానుభవాలతో సమీక్షించుకుని స్వీయ సమాజావసరాలకు అను వర్తింప జేయడం సృజన శీలుర పని. ఈ అంశాన్ని గురించి ఒకసారి రవీంద్రనాథ్ గారితో చర్చించి నప్పుడు "అలా రాసేవారూ, రాయగల వారు ఉండాలి కదా?" అన్నారాయన" (చలసాని). అలాంటి మౌలిక రచనలు కనబడి నప్పుడు, వాటి రచయితలను గూర్చి వాకబు చేసి, వారిచేత రచనలు చేయించి ప్రముఖంగా ప్రచురించిన సంపాదకుడు రవీంద్రనాథ్. సంపాదకుడంటే ... ఏదో, వచ్చిన రచనల్లోంచి పనికి వస్తాయను కున్నవి నాలుగు ఎన్నిక చేసి అచ్చు కిచ్చే ప్రచురణ కర్తగా ఉండిపో కూడదు. తమ పాఠకులకు ఏం అందించాలని ఆశిస్తున్నారో, అలాంటి రచనలకు ప్రణాళిక రూపొందించి, ఆ ప్రకారం, ఆయా రచనలను సమర్థులను కొన్న వారి చేత రాయించి ప్రచురించే వాడే నిజమైన సంపాదకుడు. అలాంటి సంపాదకుడు డా. రవీంద్రనాథ్. అందు చేతనే 'మిసిమి కి అంతటి స్థాయి వచ్చింది. ఆ స్థాయి నిలుపు దలకే తమ సంపూర్ణ శక్తి సామర్థ్యాలను వాడు తున్నారు ప్రస్తుత సంపాదకులు.

రవీంద్రనాథ్ రచయితలకు స్వయంగా ఫోనులు చేసి వ్యాసాలు తెప్పించడమే కాక, స్టేట్స్ మన్, టైం లాంటి పత్రికలలో వచ్చిన సమాచారం అనువాదం చేయించి చక్కటి తెలుగు శీర్షికలుగా ప్రచురించడం, సుప్రసిద్ధ మానవతావాది ఎంబ్రోసు వ్రాసిన "Devils Dictionary” వరుసగా మిసిమి లో ప్రచురించారు. ఫోను ద్వారా ఎందరో ప్రముఖ వ్యక్తులను సంప్రదించి 'మిసిమి’ ని బాగా పెంపొందించే కార్యక్రమం చేపట్టారు. ఈ విధంగా 'మిసిమి’ కి విశిష్ట వ్యక్తిత్వం కల్పించారు. విజ్ఞుల దృష్టి 'మిసిమి’ వైపుకు మరలింది. గ్రంథాలయాలు 'మిసిమి’ కి Subscription పంప ప్రారంభించాయి. రాను రాను 'మిసిమి’ ఒక ప్రముఖ సాహిత్య పత్రిక స్థానం గడించింది.

తర్వాత కాలంలో 'టైం’ పత్రికలో పాల్ జాన్సన్ పుస్తకం 'ఇంటలెక్చువల్స్’ పై పెద్ద రివ్యూ వచ్చింది. అది చదివిన తరువాత ఆ పుస్తకం తెప్పించి దానిలోని విశేషాలు కొన్నింటిని సీరియలుగా తెలుగు చేసి శ్రీ అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు 'మేధావుల మెతకలు అనే శీర్షికతో వ్యాసాలుగా 'మిసిమి పాఠకుల కందజేశారు. దానితో 'మిసిమి’ కీర్తి మిన్ను లంటింది.

అటు తర్వాత 'మిసిమి’ ప్రచురించిన రచనలలో ప్రముఖ మైనవి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి 'మధురవాణి ఇంటర్వ్యూలు’. ఈ శీర్షిక క్రింద ప్రచురించ బడిన రచనలు పాఠక లోకాన్ని అమితంగా ఆకర్షించాయి. పురాణం గతించిన తర్వాత భమిడిపాటి రామ గోపాలం సంకలన కర్తగా పూనుకోగా, 'మధురవాణి ఇంటర్వ్యూలు’ - గ్రంథ రూపం లోకి కళాజ్యోతి పరి వర్తించింది. 'మేధావుల మెతకలు', 'మధురవాణి ఇంటర్వ్యూలు’ - రెండూ డా. రవీంద్రనాథ్ సంపాదకత్వానికి హై లైట్లే.

ఈ సమయంలోనే సాధారణంగా అడగనిదే రాయని సంజీవ దేవ్ తమంతట తాము వ్యాసాలు వ్రాసి 'మిసిమి’ కి పంపించారు. ఈ విశేష చర్య డా.సంజీవదేవ్ గార్కి మిసిమి పట్ల ఉన్న అభిమానానికి గీటు రాయిగా పరిగణించ దగినది. కళలు, సాహిత్యం తో పాటు సైకాలజీ పై డా. రవీంద్రనాథ్ గారికి ప్రత్యేక దృష్టి ఉండేది. అందులో భాగంగానే సి. నరసింహం గారు ప్రచురించిన 'వ్యక్తిత్వ వికాసం’ నుండి కొన్ని భాగాలు మిసిమి లో ప్రచురించారు. కథలను మిసిమి లో ప్రోత్సహించక పోవుట రవీంద్రనాథ్ గారి ప్రత్యేకత. అయినప్పటికీ, చలసాని ప్రసాదరావు, శేషగిరిరావు గార్ల కళల అంశాలు ఆయనకు నచ్చాయి. అలాగే ముఖచిత్రం, మిగిలిన అట్టలపై చిత్రాలు ఎంపికకు కాలాన్ని బాగా వినియోగించి సఫలీ కృతులయ్యారు. రాజకీయ అంశాలపై పరిశోధనాత్మక వ్యాసాలు ఏటుకూరి బలరామమూర్తి మొదలైన వారు ఎవరైనా వ్రాస్తే అవి మిసిమి లో చోటు చేసు కొనేవి. మిసిమి లో పద ఔచిత్యాల విషయంలో బూదరాజు రాధాకృష్ణను, పాత ఆసక్తికర సంఘటనలకు ఆంధ్రపత్రికలో పనిచేసి రిటైర్ అయిన శర్మ గారిని తరచు సంప్రతించే వారు.

మిసిమిని గురించి మేధావులు రకరకాల అభిప్రాయాలు వ్యక్త పరచారు. "మిసిమి జిజ్ఞాసువుల పత్రిక. పరిశోధకుల వేదిక, మానవీయత కది భూమిక ... మిసిమిలోని దాదాపు అన్ని వ్యాసాలూ పరిశీలన, పరిశోధనా పత్రాలే. భావప్రదీపకాలే ... పాఠకుల్లో స్వతంత్రంగా ఆలోచింపజేసే సాధనం" అని అభి వర్ణించారు జస్టిస్ ఆవుల సాంబశివరావు. ఆచార్య శేషాద్రిగారి మాటల్లో - 'భారతి నిలిచి పోయిన తరువాత తెలుగులో అలాంటి ఉన్నత స్థాయి పత్రికలు రాలేదు. ఆ లోటును రవీంద్రనాథ్ కలలు గన్న 'మిసిమి పూరించ సాగింది. అది (మిసిమి) అంతర్జాతీయంగా మేధావులు చర్చించే సమస్యలు సారస్వతంలో, కళలో గాని, సిద్ధాంతాలలో గాని, భౌతిక, మానసిక శాస్త్రాలలో గాని - అన్నింటికీ కేంద్రీ కృతం".

'మేధను’ ప్రతిబింబించే తెలుగు పత్రికలు ఇటీవలి కాలంలో లేవనే చెప్పాలి. ఈ లోపాన్ని గుర్తించిన రవీంద్రనాథ్ ఈ లోపాన్ని తీర్చ సంకల్పించి 'మిసిమి ని స్థాపించి ఈ లోపాన్ని తీర్చారు. ఇందులో ఆలోచనకు, సమాలోచనకు, శాస్త్రీయ దృక్పథానికి, తాత్త్విక, తార్కిక చర్చలకూ, భౌతిక విజ్ఞాన, మనో విజ్ఞాన, సత్యాన్వేషణలకూ వైశిష్ట్యాన్ని, వై లక్షణాన్ని, వైవిధ్యాన్ని పాఠకులకు అందిస్తూ, వారి జిజ్ఞాసా జ్వాలలను ప్రజ్వలించ జేయడంలో సఫలులు అయి నారు.

"ఇటువంటి ప్రగాఢ పత్రికను నడపటంలో ప్రధానమైన చిక్కు ఏమంటే కల్పనా సాహిత్యాన్ని సృష్టించే రచయితల వలె ఇటువంటి మేధా సాహిత్యానికి రూపం ఇచ్చే రచయితలు ఎక్కువగా ఉండక పోవటం" అని అభిప్రాయ పడ్డారు ప్రసిద్ధ కళా కారులు, కళా విమర్శకులూ డా. సంజీవ దేవ్.

'మిసిమి ఒకటి రెండు రోజుల్లో చదివి అవతల పారవేసేది కాదు. అది ఆలోచనామృతాన్ని అందించేది, దాన్ని ఆస్వాదించడానికి తీరు బడి కావాలంటే తన కృషి సఫల మైందని భావిస్తూ, చిరునవ్వు చిందించే వారు డా. రవీంద్రనాథ్" అని పేర్కొన్నారు ప్రఖ్యాత హిందీ సాహిత్యవేత్త డా. భీమ్ సేన్ నిర్మల్.

“It does one’s heart good to see a serious periodical like MISIMI, not only serving but marching from strength to strength, month by month. It is not a matter of Circulation but Cerebration. Even if there are a thousand readers influenced by its content, it will be a substantial gain to the intellectual life of the Telugu – speaking public” says Dr.D.Anjaneyulu (Author and Journalist).

ప్రసిద్ధ మేధావులే గాక, పత్రికలు కూడా ప్రశంసలు గుప్పించాయి 'మిసిమి’ పై. మహానగర్ దినపత్రిక 22-07-1995 సంపాదకీయం లో "హుస్సేన్ సాగరు’, లో ఒక కలువ పువ్వు కనిపిస్తే ఎలా వుంటుంది? గంజాయి వనంలో ఒక తులసి మొక్క కనిపిస్తే అప్పుడు ఎలా వుంటుంది? కాకుల గోల మధ్య ఒక కోయిల పాట వినిపించితే ఎలా వుంటుంది? తెలుగు వ్యాపార, వ్యవహార పత్రికల మధ్య 'మిసిమి’ అనే బంగారు పత్రికను చూచి నప్పుడు ఖచ్చితంగా అలాగే వుంటుంది. పాఠకులు కొని చదువుకునే పత్రికలకూ చదువుకున్న వారు చదువుకునే పత్రికకూ వున్న తేడా తెలిస్తే, 'మిసిమి’ విశిష్టత అర్థం అవుతుంది" అని శ్లాఘించింది.

అలాగే తెలుగు విద్యార్థి తన ఆగష్టు 1995 సంచిక లో ఈ విధంగా వ్రాసింది. "పురుషు లందు పుణ్య పురుషులు వేరయా - అన్నాడు వేమన. పత్రిక లందు పుణ్య పత్రికలు వేరయా అంటాం మన మందరము కూడా 'మిసిమి’ పత్రిక సంచికలు రెండు మూడు చదివితే. 'మిసిమి’ ఒక విలువైన మాస పత్రిక ... అసలది చూచే టప్పటికి రసజ్ఞులైన పాఠకుల హృదయాలు పులకిస్తాయి. ఇక విషయానికి వస్తే ... భారతీయ దర్శనాలు పరిచయం చేయబడతాయి - ఒక సంచికలో తాత్త్వికులు జిడ్డు కృష్ణమూర్తి తో ముఖాముఖి - మరో సంచికలో చార్వాక దర్శనం మీద విమర్శ వుంటుంది... కాలక్షేపానికి చదివే పత్రిక కాదు 'మిసిమి '. సాహిత్యం, వేదాంతం , తత్త్వశాస్త్రం, మనోవైజ్ఞానిక శాస్త్రం, మన దర్శనాలు, సామాజిక సిద్ధాంతాలు - ఇటువంటి లోతైన అంశాలకు సంబంధించిన దుర్గ్యాహ్యమైన విషయాలను కూడా, సులభ గ్రాహ్యంగా అందిస్తుంది 'మిసిమి'.... 'మేధావుల మెతకలు', ‘మధురవాణి ఇంటర్వ్యూలు'తో పాఠకలోకం ఆలోచనా స్రవంతిని మలుపు త్రిప్పిన రవీంద్రనాథ్ అనేక వినూత్న శీర్షికలను 'మిసిమి పాఠకులకు అందించారు".

దక్షిణదేశంలో ఉత్తమోత్తమ ఆంగ్ల దిన పత్రికగా ప్రసిద్ధికెక్కిన హిందూ దిన పత్రిక దృష్టిలో “MISIMI is one of those rarest of rare gems in terms of literary value which is difficult to be found in the contemporary scene, however deep one may fathom … Misimi is not a run of the mill magazine. … It is not often, that one comes across quality printing with quality features on quality subjects. MISIMI – Lustre, resplendent. It is a monthly, which contains everything a curious mind wants to know”. …

ఇంతకంటే గొప్ప కితాబు లేముంటాయి! అందుకే, 1995వ సంవత్సరంలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం రవీంద్రనాథ్ గారికి గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. మన విశ్వవిద్యాలయాలు ఇలాంటి పని చేయవు కదా?! మన పద్ధతి ఇంట గెలిచి రచ్చ గెలుచుట కాదు. రచ్చ గెలిచి ఇంటి గౌరవాన్ని ఆశించుట. ఇంతటితో 'మిసిమి ' అభినందన మాలను ముగిస్తూ ఈ నాలుగవ స్రవంతిని సంపూర్ణం చేయడమైనది.

తండ్రిపై పిల్లల ఆదరాభిమానాలు మూల్యాంకణాతీత మైనవి! ఆ దృష్టితో చూస్తే, రవీంద్రనాథ్ గారి కుమారులు, కుమార్తె వారి యందు వెల్లడించిన భావజాలం అత్యంత అమూల్య మైనది. అన్నిటి కంటే గొప్ప విశేషం, తమ తండ్రిగారి మానస పుత్రిక 'మిసిమి' ని ఎలాంటి లోటూ లేకుండా పోషించుట! అది వారికి తమ తండ్రిపై గల గాఢానురాగం చెప్పక చెబుతోంది.

ఈ వ్యాసాన్ని చతుర్ముఖ జ్యోతిగా చిత్రించాలని ఆశించాను కాని అన్ని విషయాలు ఆ నాలుగు పాయలలో ఇముడ్చలేక పోయాను. ఉదాహరణకు, మిసిమిలో ప్రచురిత మైన కొన్ని ముఖ్య రచనలు, డా. రవీంద్రనాథ్ గారికి ప్రముఖులు వ్రాసిన ఉత్తరాలు, రవీంద్రనాథ్ గారు స్వర్గస్తులైన తర్వాత వారికి వారి మిత్ర మండలి (స్రవంతి) వ్యక్త పర చిన హృదయ వేదనా సందేశాలు, రవీంద్రనాథ్ గారి అంతిమ యాత్రకు సంబంధించిన అనేక వివరాలు విశ్లేషణాత్మక వివరణ పొందలేదు. కారణం డా. రవీంద్రనాథ్ గార్ని చతుర్ముఖ జ్యోతిగా చిత్రించాలన్న ప్రభల వాంఛ. అందుకు విజ్ఞులైన పాఠకులు మన్నిస్తారని ఆశిస్తా.

ముగింపు: డా. రవీంద్రనాథ్ గారు ప్రముఖ వ్యక్తి’ సౌజన్య మూర్తి, సంభాషణా చతురుడు, దాతృత్వంలో ఎముక లేని చేయి. జీవితాన్ని సమ్యక్ దృష్టితో దర్శించి, మంచిని పెంచి, జ్ఞానాన్ని పంచి, మానవతను ఎల్ల వేళలా మరవక, అందరికి అందుబాటులో ఉండి తారతమ్యాలు విసర్జించి, అజాత శత్రువుగా ప్రసిద్ధి కెక్కారు. వారు తెలుగు పత్రికా రంగానికి, తెలుగు జాతి వికాసానికి, అనేక విధాల సేవ చేసిన మేధావి, వదాన్యుడు. ఇంతమంది ప్రముఖులు ఆయన స్నేహ సౌహార్థాన్ని తనివితీరా ఆస్వాదించారు, అమృత ఘడియలైన ఆయన జీవిత కాలంలో నివసించే అదృష్టాన్ని పొందగలిగారు. అకాలంలో ఆంధ్రదేశం బయట కాలం గడిపిన నేను ఆయన వ్యక్తిగత దర్శనానికి గాని, వారితో మాట్లాడే అవకాశానికి గాని నోచుకో లేదు. అది నా దురదృష్టం. అయినప్పటికీ వారి స్మృతి సంపుటిని పరిశీలించి, వారిని గూర్చిన వివరాలు ఈ వ్యాస రూపంలో అందరి ముందు ఉంచే అవకాశాన్ని నాకు కల్పించి, ఎనలేని సంతృప్తిని నాకు కలుగ జేసి నందులకు 'మిసిమి సంపాదకులు శ్రీ అశ్వినీ కుమారు గార్కి నా కృతజ్ఞతా పూర్వక నమఃసుమస్సు లంద జేస్తున్నాను.

No comments:

Post a Comment