Friday, 10 January 2014

Kalarekha (కాలరేఖ)

భూమిక:

తెలుగు దేశంలో సుప్రసిద్ధ విద్వాంసులు చాలామంది జన్మించారు. అనేకమంది మహాకవులు అద్భుత కవితా ఖండాలను సృష్టించి ఖ్యాతిగడించారు. కాని విద్వత్కవులుగా కీర్తి ప్రతిష్ఠ లార్జించినవారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అట్టివారిలో గుంటూరు శేషేంద్ర శర్మ గారొకరు. శ్రీశర్మగారు బహుముఖ ప్రజ్ఞాశాలి, భాషాపరశేషభోగి. తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషా సాహిత్యాలలో నిష్ఠాతులేగాక, హిందీ, ఉర్దు సాహిత్యాలలో సహితం గణనీయమైన కృషి చేశారు.

శ్రీశేషేంద్రశర్మగారు, ఎంత గొప్ప కవియో, అంతటి గొప్ప విద్వాంసుడూ, విమర్శకుడు అనుటలో ఎలాంటి భిన్నాభిప్రాయము లేదు. ప్రముఖ కవిగా, మహాపండితునిగా, గొప్ప విమర్శకునిగా శర్మగారు ప్రదర్శించిన ప్రతిభ అనన్య సామాన్యము. వీరి 'శ్రీవిద్యారహస్యనేతృత’ సర్వం కష్టమని పేర్కొనుట అతిశయీక్తి కాదు. "భారత రామాయణ ములను కలిపి శ్రీశర్మగారు చదివి నట్లుగా చదివిన వారి సంఖ్య లేదనియే చెప్పవలెను" (విశ్వనాధ సత్యనారాయణ). ప్రపంచ సాహిత్య ధోరణులను అవగాహన చేసుకొని, విస్తృత దృక్పథాన్ని అలవరచు కొని, కవితారంగంలోను విశ్వజనీన ప్రవృత్తిని ప్రకటించారు. నూతన కవితా ‘వాహిక’ చేబట్టి కవితా రంగంలో నూతన శకాన్ని సృష్టించారు. ఆధునిక కవితా రంగంలో ‘మండేసూర్యుని’ గా అభివర్ణించారు శ్రీశ్రీగారు శ్రీశేషేంద్రశర్మగారిని. తన కాలం వరకు ఉన్న కవితా ధోరణులను పూర్తిగా అకలింపు చేసుకొని, నాటికి లేనిదాన్ని సృజించి అభివృద్ధి చేయడమే వినూత్న శక్తిగా పరిగణిస్తారు శేషేంద్రశర్మగారు. శ్రీశర్మగారి కలం నుండి అనేక రచనలు ప్రవహించాయి. రచనలన్ని కలిపి దాదాపు 40కి పైగా ప్రచురిత మయ్యాయి.

శేషేంద్రశర్మగారి సాహిత్య ప్రస్థానం:

శేషేంద్రశర్మగారు వృత్తి రీత్యా ప్రభుత్వోద్యోగి (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్ కమీషనరుగా పని చేశారు) ప్రవృత్తి మాత్రం సాహిత్యం. వారి సాహిత్య జీవితం అత్యంత మహోన్నతమైనది. శ్రీనాథ మహాకవి వలె నూనూగు మీసాల నాడే అంటే 20వ ఏటనే (1947లో) రచనా వ్యాసంగం మొదలెట్టారు. అనువాద కావ్యం "సొరాబు" తో ఆయన సాహిత్య ప్రస్థానం ఆరంభ మయింది. తర్వాత 1961వ సంవత్సరం లో శర్మగారి "చంపూవినోదిని" పద్య కావ్యం ప్రచురిత మయింది. ఆ కావ్యం శర్మగారి ఆశు కవిత్వ పటిమకు, పాండిత్య ప్రకర్షకు అద్దం పడుతుంది. శ్రీ శేషేంద్రశర్మ గారు 11 పద్య కావ్యాలు, 12 విమర్శనా గ్రంథాలు రచించి పేరు ప్రతిష్ఠలు ఆర్జించారు. వారి ప్రముఖ రచనలను గూర్చి సంక్షిప్త వివరణ పాఠక మహాశయుల నిమిత్తం ఇందు పొందు పరచడ మైనది. విజ్ఞులు దీనిని సహృదయంతో స్వీకరిస్తారని ఆశిద్దాం!

ప్రసిద్ధ రచనలు :

శ్రీ శేషేంద్రశర్మగారి నాదేశం - నాప్రజలు, శేషజోత్స్న, రక్తరేఖ, ఆధునిక మహాభారతం, జనవంశం, స్వర్ణహంస, షోడశి - రామయణ రహస్యాలు, మండే సూర్యుడు, కవిసేన మేనిఫెస్టొ విశిష్ఠ రచనలుగా పేర్కొంటారు పండితులు. ఆయా రచనల లోని విశేషాలను తెలుసు కొనే ప్రయత్నం చేద్దాం.

నాదేశం - నాప్రజలు:

సాహిత్య వ్యాసంగం లో ప్రయోగాలు చేయుట శేషేంద్రశర్మగారికి అత్యంత ప్రీతి కరమైన విషయం. ఆధునిక సాహిత్యంలో కావ్యేతిహాసాలు లేని లోటును తీర్చే ఉద్దేశ్యంతో శేషేంద్రశర్మగారు "ఆధునిక మహాభారతము (నాదేశం-నాప్రజలు) రచించారు. విలక్షణ ప్రక్రియ అయిన "వచన కవితా వాహిక" ద్వారా ఒక అద్భుత కావ్యాన్ని సృష్టించి ప్రపంచ స్థాయి రచయితగా నిలచారు శేషేంద్రశర్మగారు. సామాజిక చైతన్యాంశాలను సాహిత్యంలో ప్రవేశ పెట్టి విలువలను పెంచడమే కాక, ఒక నూతన ప్రక్రియ ఆధునికులకు పరిచయం చేశారు. ఇతిహాస నిర్మాణానికి బాధానుభూతి పూర్వక బలి కావాలి. నేనే ఆబలి! నా వయస్సు నా పాండిత్యం, నా ప్రతిభ, నా అనుభవం సర్వస్వం పిండి, మాటల గొంతుల్లో పోసిన నా రక్తం ఈ ఇతిహాసం. ప్రపంచ మానవుల్ని, వాళ్ళ చరిత్రల్నీ, వాళ్ళ జయాప జయాల్నీ, వాళ్ళ భూత భవిష్యద్వర్తమానాల్నీ, అన్నిటినీ అనుభవ జ్ఞాన నేత్ర ద్వయంతో అవలోకన చేసి, ఆ విశ్వ దృశ్యం నుంచి ఈ తాత్పర్యం పిండాను" అంటారు శర్మగారు నాదేశం-నాప్రజలు గురించి ప్రస్తావిస్తూ!

వర్తమాన తెలుగు కవిత్వంలో ఇతిహాసం ఒక అచుంబిత మైన ప్రక్రియ. "ఇప్పుడు నేను ఈ ఇతిహాసం సమర్పిస్తున్నాను, దేంట్లో ఒక సామాన్య కర్షకుడు నాయకుడో ... కర్షకుడి జీవితంలో ఏం గాథ లుంటాయి ... ఈ ఇతిహాసంలో కథ కోసం చూడకూడదు... ఆధునిక యుగంలో పాశ్చాత్య దేశాల్లో కథా రూపం ఇతివృత్తం లేని ఇతిహాసాలే వస్తున్నాయి". ఈ పుస్తకం ద్వారా కవిత్వంలో విలువల్ని, వస్తు రూపాల్లాంటి కవితా సామాగ్రిని, కవి అలోచనలే నిర్దేశిస్తాయని, ఋజువు చేశారు శ్రీశర్మగారు.

శేషజ్యోత్స్న :

శ్రీశేషేంద్రశర్మగారు "వేదనా జీవితం నుండి ప్రేమోప జీవిగా మారిన తరుణంలో రచించిన రచన "శేషజ్యోత్స్న". ఇది ఇరువది కవితల ఖండ కావ్యం. దీనికి శేషేంద్రశర్మగారు రచించిన ఉపోద్ఘాతం "నేనూ - నా నెమిలీ లేక నెమిలీ - నా నేనూ" విశేషించి పేర్కొన దగినది. ప్రేమ కూడా ఒక తపస్సే! విరహావస్థలో కంటే, సాఫల్యంలో దాన్ని తపస్సుగా, దర్శనంగా, ఆత్మ సంస్కారంగా, అనుభవించుట గొప్ప సంస్కార వంతుల విశేషం. అట్టివారు అరుదుగా వున్నారు. సాధారణంగా ప్రేమ తపస్వులైన కవులు విరహులే! శేషజ్యోత్స్న కవితా ఖండికలలో ఎక్కడ చూచినా ప్రేమ సాఫల్యానుభూతి కవితా మధు స్రవంతిగా ప్రవహిస్తుంది! మచ్చుకు :

"ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నీవు" అన్నాయి - నా పెదవులు మృదువులైన అక్షరాలుగా మారిన

జన్మాంతర నిరీక్షా మధువుతో తడిసి - ... బహు జన్మల సమూహాలకు పూర్వం

నాలో నీవు, నీలో నేనూ ఉన్నాను కాబోలు ... (ఆమె రెండు కళ్ళు)"నిన్నూహించి రెండు ముక్కలు చెపితే -అవే రెండు రెక్కలయి - ఊహ

విహాయసంలో కెగిరి పోతుంది -అదే ఒక గీతం అవుతుంది - ..." (ఏవో చినుకులు).

ఇందు లోని మిగతా కవితా ఖండికలు ముఖ్యంగా, పడవలూ-తెరచాపలూ, నూతన తీరాలు, నీవు, ఆరోజు, మనసే ఒక మధుమాసం, చీకటి దయ్యాలు, వెన్నెల వ్యధ, ఇత్యాదులు చదివి ఆనందింప తగినవి. ఈ కవితా సంకలనం 1972 లో ప్రచురిత మైనది. ఇది ఇంగ్లీషు, ఊర్దూ, హిందీ భాషల లోనికి అనువదించ బడినదంటే, దీని ప్రాముఖ్యత, ప్రభావం ఎలాంటివో ఊహించు కోవచ్చు!

రక్తరేఖ (నాడైరీ) :

ఈ పుస్తకం శేషేంద్రశర్మగారు తన స్వంత ఉపయోగం కోసం వ్రాసుకొన్న చిత్తు పుస్తకం (Writers Note Book). దాన్ని యథా తధంగా ప్రచురించటం జరిగింది. ఇందులో తత్వ విచారమూ, తెలుగు దేశంలో కవిత్వం పట్ల ప్రబలిన అపోహల ఖండనమూ ప్రథాన భాగాలు. కవిగా భావకుడుగా శేషేంద్రశర్మ లో జరిగిన పరివర్తన తెలుసు కొనుటకు "రక్తరేఖ" ఉపకరిస్తుంది. శేషేంద్రశర్మగారిలో ఏ మార్పు వచ్చినా - ఆయనకు చిన్న పిల్లల మీద, పక్షుల మీద ఉదయాస్తమయల మీద, ఉండే మోజు పెరుగుతుంది! "ఎందుకు వస్తున్నాయి ఈ చక్కని భావాలు నిశ్శబ్ద బంధురమైన నా మందిరము లోకి" అని తన్ను తానే ప్రశ్నించు కొంటాడు. "నీలాకాశంలో తెలి మబ్బులై పొండి, సాగరాల్లో నావల తెరచాపలై పొండి,దూర తీరాలకు తరలి పోయే పవనాలై పొండి, రేపటి గులాబీల తోటల్లో ఉషస్సులై పొండి!" అంటూ పాఠకుల పైకి తన భావాల్ని గుప్పిస్తారు శేషేంద్రశర్మ. ఆయన హృదయ పరిణతిని "రక్తరేఖ" కావ్యం వివరంగా చిత్రిస్తుంది. ఈ పుస్తకం 1974వ సంవత్సరంలో ప్రచురిత మైనది. సాహిత్యం గురించి, సమాజాన్ని గురించి ఎన్నో ఆలోచనాత్మక మైన విషయాలను పొందు పరచారు రచయిత ఈ పుస్తకంలో.

ఋతుఘోష :

శేషేంద్రశర్మగారి కవితా ప్రతిభను విశ్వనాథ మొదలు పుటపర్తి నారాయణాచార్యుల వరకు ప్రశంసించని వారు లేరు. శర్మగారి కవితలో శ్రీనాథ మహాకవి చందో బద్ధత, ముక్తచ్ఛంద రచనలో బాలగంగాధరతిలక్ తో సాదృశ్యము కని పిస్తుంది. భాషా సౌందర్య రహస్యం ఆధునికుల్లో శేషేంద్రశర్మకూ, తిలక్ కూ తెలిసి నంతగా మరెవరికి తెలియదని ఆర్.యస్.సుదర్శనం వంటి విమర్శకుల అభిప్రాయం. కొందరు విశేషజ్ఞులు ఋతుఘోషను శేషేంద్ర హృదయ వేదంగా అభివర్ణించారు. ఒక విధంగా ఆలోచిస్తే "ఋతుఘోష" పేరులోనే కనిపిస్తున్న "ఘోష" దీనికి అంతస్సూత్రం. ఒకానొక "ఆర్తి" దీనికి జీవనాడి! శరీరాన్ని "కారాగారంగా" భావించి ఎక్కడికో ఎగిరి పోవడానికి ఆకాంక్షించే తత్త్వం. అది అసాధ్యమైన నిర్వేదం దీనిలో కనిపిస్తాయి.

"ఆసల్ తీరునే దృష్టిచే, మహిత ఘాడాలింగ నాయుక్తిచే

నా సంయోగ నిరంత వేదనము లేయద్వైత సంసిద్ధికో

నైసర్గంబగు నేయగాధకుహరాంతకః, ప్రజ్వలానంద కీ

లానంతర్పణకో శరీర మొక కారాగారమై తోచగన్".

అంటూ ప్రగాఢ తాత్త్విక రేఖను ఆవిష్కరిస్తాడు. ప్రణయాన్ని "ఆనంద" భూమికకు ప్రచోదనం చేస్తాడు. శేషేంద్ర ప్రణయ తత్త్వం శరీరావధి కాదు, "ఆనందావధి". అంతేకాదు, "శరీర మొక కారాగారమై తోచగన్" అనే మాట అత్యంత కీలకంగా తోస్తుంది. కవి ప్రతి కవితా ఖండికలోనూ, ఎగిరి పోవాలనే ఆకాంక్షను ఏదో విధంగా వ్యక్తం చేస్తాడు! పక్షులూ, ఎగరడం, ఆకాశం - ఇవే తరచుగా శేషేంద్రశర్మగారి కవితలో మన కెదురయ్యే కవితా సామాగ్రి! ఋతుఘోష లోనిదే మరో పద్యం పరికించండి:

"ఎవడో చాకలి ఆకలిన్ మరచి తానే వన్యె మల్లీలతా

నివహక్రోడపుటీ తటాకముననో నిత్యాశ్రమా జీవన

వ్యవసాయం బొనరించు చున్న ధ్వనియే వ్యాపించే ప్రాపంచిక

వ్యవహార ప్రవిహీన విశ్వహృదయ వ్యాపార మేమో యనన్".

నిశ్శబ్ద మావహించిన మధ్యాహ్న వేళ చాకలి వాడు బట్టలుతికే ధ్వని "విశ్వ హృదయ వ్యాపార" మన్నట్లు వినిపించిందట! అంతర్ముఖుడైన ఋషి ధ్యాన నిష్ఠతో కూర్చున్నప్పుడు మనస్సు ఇంద్రియ వ్యాపారముల నుంచి నివర్తిత మయ్యే స్థితిలో వినిపించే హృదయ స్పందనాన్ని ధ్వనిస్తూ, ఋషికి విశ్వానికి ఏర్పడే తాదాత్మ్యాన్ని సూచించే తీరున సాగిన పై పద్యం "ఋతుఘోష" లో ఆణిముత్యం లాంటిది. కావ్యమంతా ఇటు వంటి ఆణిముత్యాల మాల! ఈ కావ్యం లోని మరో విశేషం కవి ఒక వంక ఋతువుల సౌందర్యాన్ని వివరిస్తూనే అది పేదలకు, దీన జనులకు అందడం లేదనే ఆవేదనను వ్యక్తం చేస్తాడు. పాఠకుల దృష్టిని అందం మీది నుండి లోక భోగ వ్యత్యాసం వైపు మళ్ళిస్తాడు! అదే శేషేంద్ర ప్రత్యేకత!

స్వర్ణహంస:

ఈ వ్యాస సంపుటి 1968వ సంవత్సరంలో వెలువడింది. ఇది సంస్కృతంలో హర్షభట్ట (శ్రీ హర్షుని) ని విరచిత మైన "నైషధ మహాకావ్యం" యొక్క విశ్లేషణాత్మక విమర్శ. సాహితీ లోకం హర్ష నైషధంను కావ్యముగా పరిగణించి పఠించు చున్నది. "హర్షుని కేవలము సారస్వతేయునిగా మాత్రమే లోకము తలచు చున్నది. అది పొరపాటు. హర్షుడపర శంకరుడు. శాంకర సాంప్రదాయము కాంతా సమ్మితముగా జెప్పుట కీ గ్రంథము వ్రాసెను" అంటారు శేషేంద్రశర్మగారు. ఇంకా "హర్షనైషధం లో హంస దానెవరో యెనిమిది వందల సంవత్సరముల నుండి చెప్పు చున్నప్పటికిని ఇంత వఱకు ఎవరును గుర్తింప లేదు".! ... నైషధము మంత్ర శాస్త్రము; నైషధము యోగశాస్త్రము; నైషధము వేదాంతశాస్త్రము". ఈ విషయమును శేషేంద్రశర్మగారు సమన్వయ పూర్వకముగా సమర్థించి ఈ విమర్శనా గ్రంథము (స్వర్ణహంస) లో చూపించారు (నిరూపించారు). శ్రీశర్మగారి విశ్లేషణ ప్రకారం నలుడు జీవాత్మ; భీముడు పరమాత్మ లేక నిర్గుణ బ్రహ్మము; దమయంతి శ్రీ మహాత్రిపురసుందరి. హర్షనైషధం లో మొదటి మూడు సర్గలలో గ్రమముగా అజప మంత్రాధి దేవతగా, జీవాత్మగా, పరమాత్మగా వర్ణింప బడినది. ఈ విషయం ఉపనిషత్తుల నుండి ఉదాహరణలు తీసుకొని సమర్థించారు శర్మగారు. ఈ సిద్ధాంతాన్ని పూర్వ పక్షం చేయుట సులభ కార్యం కాదు.

నైషధ వ్యాఖ్యాత, మల్లినాథసూరి గాని, నైషధాన్ని తెలుగు జేసిన శ్రీనాథ మహాకవి గాని, ఈ విషయములను విశద పరచలేదు. అదే విధంగా, నైషధము నందలి సరస్వతి నలుని కుపదేసించిన చింతామణి మంత్ర పరమగు "ఆవామావామార్థే" అను శ్లోకమునకు మల్లినాధుడు దేవతా, మంత్ర యంత్రాణాం త్రయాణామపి ప్రకృతత్వాత్" అని మూడర్థములను, ప్రకృతములని చెప్పగా, శ్రీశర్మగారు ఆ మూడర్థములే గాక బ్రహ్మ విద్యా రహస్య పరమగు నాల్గవ యర్థము కూడా కలదని, అది ప్రకృతము గాకున్నను బ్రకృత మైన మంత్ర శాస్త్రార్థము కన్న పరమ రమణీయ మైనదని పేర్కొన్నారు.

నైషధ కావ్యం ధ్వని కావ్యం. కాని, ఈ కావ్యం లోని ధ్వని గూఢ ధ్వని. హర్షభట్టు వ్యాస వాల్మీకాదుల వలె ఆధ్యాత్మిక యోగమంత్ర శాస్త్ర రహస్యములను ఆ కావ్యము నందు నిక్షేపించి అపార ప్రతిభ ప్రదర్శించారని శ్రీశర్మగారి వాదన. శ్రీ శేషేంద్రశర్మగారికి యోగమంత్ర శాస్త్ర ములందుగల అభినివేశము అపారం. ఆ శాస్త్రములలోని రహస్యములన్నియు వారికి కరతలామలకము. అందుచే సహేతుక మైన వారి వాదన ఖండింప జాలనిది. "స్వర్ణహంస" శర్మగారికి, తంత్ర, మంత్రయోగశాస్త్రాదులలో గల అపార జ్ఞానానికి నిదర్శనము.

పక్షులు:

పక్షులు అనే కవితా సంపుటి 1970వ సంవత్సరంలో ప్రకటిత మైనది. ఈ సంపుటికి వ్రాసిన మున్నుడిలో "కవిత్వ మంటే పద్యమే నని కొందరు, కాదు గేయమని కొందరు; కాదు వచన కవితేనని కొందరు ... కవిత్వమనే ఆ ఆనంద స్వరూపిణి ఏఒక్క రూపంలో మాత్రమే ఎందుకుంటుంది? ... అన్ని ప్రక్రియలు ఉండ వలసిందే ..." అంటారు శేషేంద్రగారు. "కవిత ధరించే బాహ్య వేషం చంధస్సు ... అంతరదృష్టితో పరిశీలిస్తే దాని నెట్లా చెప్పాలంటే - యుగయుగాల పొరల క్రింద అణగి నూతన వ్యక్తీ కరణ కోసం తహతహ లాడుతూవున్న, మానవాత్మ సాహిత్య బంధాలన్నీ ఛేదించుకొని సముజ్వల భావ లావాగా ప్రవహించింది. పశ్చిమ దేశాల్లో ఛందస్సు విగళితం కావడం కవితలో రూపానికి ప్రాధాన్యం నశించడానికి సంకేత మైతే, మన దేశంలో ఒక రూపాన్ని తోసేసి, మరొక రూపాన్ని స్వీకరించడం మాత్రమే అయింది. ...అందుచేత కవిత్వం ఎలా వ్రాయాలి అనే విషయం మీద గంతులు వేయడం కంటే, కవిత్వం ఎలా వుంటుంది అని వివేచన చేయడం లాభదాయకం" అంటారు శేషేంద్ర.

ఈ సంపుటం "చెరుకువిల్లు" అనే కవితతో ప్రారంభించారు శేషేంద్ర. భావకుడైన సహృదయుడు, ఈ కవితను చదివితే ఆనంద జీవన మధూళిలో స్నాతుడౌతాడు! చెరుకువిల్లు అనేది మన్మథ ప్రతీకమైన కవి సమయం. కాని, దీనిని శేషేంద్ర కవి మన్మథ ఆయుధంగా చిత్రించ లేదు. మనసులో చైతన్య జ్వాలగా మెదిలే కవితా మహేంద్ర చాపానికి ప్రతీకగా ప్రయుక్తం చేశాడు. గమనించండి.!

అక్షరాల ఇసుకతో కవిత కడతారామరి – తలపుల నెత్తావులు చిమ్మే మృదు హృదయ

సుమ ధూలి కావాలి; జీవన మధూళి తో తడపాలి - చెఱకువిల్లు విరిచిన వాడే చిగురు కైత చెపుతాడు

ఎదల పొరదిళ్ళ మీద మల్లెలు విరియిస్తాడు. . . .

జీవితంలో లేని కవితా కాగితంలో వస్తుందా - తునక మబ్బు లేకుండా చినుకు నేల బడుతుందా. . . .

సుందర భావ జగత్తు సృష్టించ లేని వాడు - ముసలి పదాలతో మురిపేలాడుతూ సరి పుచ్చుతాడు

ఊహకు రెక్క లున్న వాడు ఉదధులు దాటుతాడు - ఉత్తుంగ శిఖరాలకు ఎగురుతాడు. ...

వాడే, చైతన్యం - చరిత్రను సృష్టిస్తాడు - చరిత్ర భారాన్ని జ్ఞాన నేత్రాగ్ని జ్వాలా దగ్ధం చేస్తాడు.

ఇందులోని కవితలు మనోహర మైనవి. పద్య రచనలు చక్కగా నుండి, కవి నిష్టా తత్త్వాన్ని వేనోళ్ళు చాటుతున్నాయి. పద్యం, నిన్నటి కవితా వాహకం, నేటి తొందర జీవితానికి పద్యాలు మాత్రమే అనవద్య సాధనాలను కోవడానికి, ఈ యుగం అగీకరించదు. (ఆవంత్స సోమసుందర్).

షోడశి - రామాయణ రహస్యాలు:

షోడశి అనే పేరు "శ్రీ విద్య" కు సంబంధించినది. శ్రీవిద్య మహాతంత్రానికి సంబంధించిన గొప్ప విద్య. గ్రంథ మంతటి లోను మంత్ర విద్య, యోగములకు సంబంధించిన వివరములు చర్చించ బడినవి. ఈ పుస్తకానికి వ్రాసిన మున్నుడిలో విశ్వనాథ సత్యనారాయణ గారు చివరి అధ్యాయము లోని దేవి స్తోత్ర శ్లోకమును పేర్కొని, దానికి శర్మగారు వ్యాఖ్యానించిన విధానాన్ని ప్రశంసించి, వ్యాఖ్యానము లోని విశేషాలను గూర్చి విశదీకరించారు. "శివః" అన్న శబ్దమును పుంలింగముగా పేర్కొని, అయినప్పటికీ, విశేషణ విశేష్యములకు తత్ర తత్ర భిన్న లింగత్వము యొక్క కలిమిని తగినట్టుగా నిరూపించారు శ్రీశర్మగారని పేర్కొన్నారు. శర్మగారు అనుసరించిన పద్ధతిని "నిగమాగమ" సంప్రదాయమని చెప్పుట సమంజసమని అభిప్రాయ పడ్డారు. శివశక్తుల కబేధ ప్రతి పత్తి కనుక, మరియు శివుడు శక్తి యొక్క ప్రతి బింబము గనుక శివశక్తు లిద్దరు అన్యోన్య ప్రతి బింబములని వక్కాణించారు. గ్రంథ మంతట అనేక విషయములు నిక్షిప్తమై ఉన్న వనియు, శ్రీశేషేంద్రశర్మగారు చేసిన పరిశోధన, వారు దృఢ పరచిన విశేషాలు అత్యంత ఆశ్చర్య జనకము లనియు, శర్మగారి మేధా విశేషము మెచ్చుకొన దగినదని చెప్పారు.

షోడశి గ్రంథంలో ప్రధాన విషయములలో మొదటిది రామాయణం లోని "సుందరకాండకు" ఆ పేరు ఎందు వలన వచ్చిందన్న ప్రశ్న, దానికా పేరు వచ్చుటకు కారణం ఆ కాండంలో కుండలినీ విద్య ప్రతిపాదించ బడినదని చెప్పుట. రెండవది సుందరాకాండంలో త్రిజటా స్వప్న వివరాలు చర్చింప బడుట. త్రిజటా స్వప్న వివరణకు పూర్వం వానిని గురించిన రహస్యములను శేషేంద్రశర్మగారు ఎత్తి చూపి, ఋజువు చేసిన విధానము విజ్ఞుల అభిమానాన్ని ఆకట్టు కొన్నది. సుందరాకాండంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడి యున్నదన్న విషయం పండితులకు తెలియనిది కాదు. కాని ఎచ్చట నున్నదీ ఎవ్వరూ విశద పరచ లేదు. కాని, శేషేంద్రశర్మగారు ఈ విషయాన్ని సాపేక్షతా సహితంగా నిరూపించారు. ఐతే, సుందరాకాండం పేరు విషయం. అమ్మవారు సౌందర్య నిధి. నిధి కాదు ఆమెయే సౌందర్యము. శ్రీదీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల యొక్క యర్థము దేవి యందు పర్యవసించునట్లు సౌందర్య మనగా దేవి - అందుచేత ఈ కాండమునకు "సుందరకాండం" అని పేరు వచ్చిందని శేషేంద్రశర్మగారి ప్రతిపాదన.

మరోవిషయం:

రామాయణం భారతము కన్న ఆధునాతన మన్న వాద తిరస్కారము. దీనికై శర్మగారు అశేష కృషి సల్పారు. రామాయణము లోని కొన్ని శ్లోకాలను యథా తథంగా భగవాన్ వ్యాసులు మహాభారతం లో చొప్పించిన వివరాల విశ్లేషణ. ఇది మహాభారతము వాల్మీకి రామాయణానికి ప్రతిబింబ మనే సిద్ధాంతానికి బలమును చేకూరుస్తుంది. షోడశిని గూర్చి చివరి మాటగా "మొత్తము మీద ఒకటి నిస్సంశయముగా చెప్ప వచ్చును. వీరి పాండిత్యం చాలా లోతు గలది. వీరి శ్రీవిద్యా నేతృత సర్వం కష్టమని చెప్పుట కభ్యంతర ముండ కూడదు. భారత రామాయణములను కలిపి వీరు (శ్రీశేషేంద్రశర్మ) చదివి నట్లు చదివిన సంఖ్య ... భారత దేశమున ఒక రిద్దరుందురేమో?" అని అభిప్రాయ పడినారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు! అందుచే షోడశిని చదివి విజ్ఞులైన పాఠక మహాశయులు రామాయణ భారతాదులలో నిక్షిప్తమైన తంత్ర, మంత్ర యోగ సిద్ధాంతములను గూర్చి వివరాలను, విశేషాలను గ్రహిస్తారని ఆశిద్దాం. షోడశి తొలిసారి 1967వ సంవత్సరంలో ప్రచురిత మైనది. 16 శీర్షికల క్రింద వివరాలన్ని చర్చించబడినవి.

షోడశి, స్వర్ణహంస గ్రంథాలలో శ్రీశేషేంద్రశర్మగారు వివరించిన అంశాలు పరిశోధనాత్మక మైనవి. మంత్ర, తంత్ర శాస్త్రాలలో శర్మగారికి గల ప్రావిణ్యం విశద పరుస్తాయి. ఎక్కువ మందికి తెలియని విషయాలని చర్చించడం వలన ఈ రెండు పుస్తకాలకు మంచి పేరు వచ్చింది. వీటిని "శాస్త్రానుస్యూతవర" విమర్శగా పేర్కొన్నారు శ్రీ ఆచార్య సంపత్కుమారవర్యులు. వీనిని తెలుగు సాహిత్య విమర్శలో ప్రామాణిక విమర్శ గ్రంథాలుగా పేర్కొన వచ్చును.

విహ్వల:

శేషేంద్రశర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం పద్య రచనలూ, విమర్శా యుక్తమైన వ్యాసాలే కాక మిగతా సాహిత్య ప్రక్రియలలో సహితం అందెవేసిన చేయి. చిన్న కథా ప్రక్రియా రచనలో ప్రయోగాలు చేశారు. ఆయన ప్రచురించిన కథా సంపుటి "విహ్వల" పాఠకుల ఆదరాభిమానాలు చూర గొన్నది. ఈ సంపుటిలో ఐదు కథలను సమకూర్చారు రచయిత. దీనిలో "రంగుల చేప" అనే కథానిక కథా శిల్పానికి చెప్పుకో దగిన ఒక విలక్షణ రచన. మానవీయతలో పాత్ర అంతరంగిక కల్లోలం, ఆ కల్లోలం మధ్య ఆర్థ్రంగా ఎగురుతున్న నీటి తుంపరలు -సమస్తమూ క్లుప్తతతో విరిసినై. సముద్రం మీదికి వెళ్ళి తిరిగి రాని తండ్రికై నిరీక్షిస్తూ నిలచిన జాలరి పసిబాలుని చిత్రణ హృదయ విదారకంగా ఉంది. మరువలేని, మరపు రాని సంఘటన అద్భుతంగా వర్ణిత మైనది. సంపుటి లోని మిగతా నాలుగు కథలూ ఆస్వాద నీయాలు, పఠితలను ఆలోచింప చేస్తాయి.

మబ్బుల్లో దర్బారు:

ఈ రచన శర్మగారి మరో రూపాన్ని (నాటక కర్తగా) ప్రదర్శిస్తుంది. వారి బహుముఖ ప్రజ్ఞకు మరో ఉదాహరణగా పరిగణింప దగినది. కొందరు ఏపని చేసినా శోభిస్తుంది. శేషేంద్రశర్మగారు పద్యం వ్రాస్తే, పాడితే "స్కాచ్" పుచ్చుకున్నంత (శర్మగారి అత్యంత ప్రీతి కరమైన చర్య) పరమానందం, జెట్ ఎక్కినంత సంబరం. ఈనాడు ప్రచలిత మౌతున్న అన్ని బ్రాండుల కవిత్వాన్ని ఆయన పద్య మంటాడు. అందుకేనేమో శేషేంద్ర కవితని "పద్యమా లేక ఫ్రెంచి మద్యమా" అన్నారు శ్రీశ్రీ.

ప్రస్తుత రచన "మబ్బుల్లో దర్బారు" ఒక ఊహ చిత్రం(ఫేంటసీ). దీనిని విప్లవ నాటికగా పేర్కొన్నారు రచయిత. చదివి ఆనందింప తగినది. పాఠక మహాజనులను బాగా ఆక ర్షిస్తుంది. దీనిని తొలిసారి 1968వ సంవత్సరంలో ప్రచురించారు.

మండే సూర్యుడు (కవితా సంపుటి):

మండే సూర్యుడు అనే శేషేంద్ర కవితా సంపుటి 1974 లో వెలువడింది. ఈ సంపుటి కార్య కలాపాలలో శ్రీమతి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిరి గారు పాత్ర వహించారు. ఆమె మాటల్లో “It has emerged in these poems as the chosen voice of his people”. ఈ సత్యం "మండే సూర్యుడు" కావ్యం లోని ప్రతి కవితా లోను స్పష్ట మవుతుంది. శేషేంద్ర కవిగారు వాడిన - చెమట బిందువు, కండల కొండలు, పిడికిలి. ఆక్రోశిస్తున్న అడవులు, వ్రేలాడిన శిరసు, వంతెనలు, వంటి ప్రతీకలు పుంఖాను పుంఖాలుగా మన హృదయం పైన జలపాతంలా విరుచుక పడతాయి! ప్రతి పేజీలో విశ్వమంత రహస్యాన్ని ఇముడ్చుకొన్న పద చిత్రాలతో వెలితి లేని గీతికా భోగపదం అలరారు తుంది. ప్రతి శబ్ద దళమూ మనలను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. మండేసూర్యుడు సంపుటి లోని కవిత లన్నీ ప్రధానంగా అత్యాధునిక మైన Imagist symbolist సంవిధానలకు చెందినవి. నేడు అంతర్జాతీయంగా ప్రచలిత మౌతున్న కవితా ధోరణిని పుణికి పుచ్చు కొన్నవి.

ఇక ఈ సంపుటి శీర్షికను (పేరును) నిర్ణయించిన తొలి కవిత మండేసూర్యుడు. ఈ కవిత హైద్రాబాదు రేడియో కవి సమ్మేళనంలో మొదటి సారి ప్రసార మయింది. ఆ సమయంలో గొప్ప సంచలనం రేపింది. దీనినే ఆంధ్రప్రభ వారపత్రిక (13-11-1974) సంచిక "మనిషిని చెక్కిన శిల్పి" అనే శీర్షికతో ప్రచురించింది.

సూర్యుడు అనే ప్రతీక పూర్వం చాలామంది కవులు ప్రయుక్తం చేశారు. అయితే, మహత్తర శక్తి సంపన్నంగా ఈ కవితలో ప్రచలితం కావడం వల్ల ఈ ప్రతీక చాలామంది యువ కవులను ప్రభావితుల్ని చేసింది. ఇంతకీ ఈ మండేసూర్యుడు అనే కవిత లోని విశిష్టత ఏమిటి? పద చిత్ర బాహుళ్యముతో ధగధగ లాదుటయేనా? లేక, ప్రతీకవాద శిల్పంతో శిఖరాగ్రం అందుకొనడమేనా? మరేమైనానా? శేషేంద్రశర్మ చమటబిందువు స్వగతాన్ని ఇతివృత్తంగా ఎన్నుకొన్నాడు. ఆసాంతం స్వాత్మక ధోరణిలో చెమటబిందువు స్వగతంగా ఈ కవిత సాగుతుంది. అయితే ఈ చమటబిందువు ఎలాంటిది? "కండల కొండల్లో ఉదయించే లోకబంధువు"; అంటే లోకబాంధవుడు సూర్యుడని వేరే చెప్పనక్కర లేదు. సూర్యుడే లేకపోతే ఈ భూమిమీద జీవన సర్వస్వమంతా నిర్జీవ మవుతుంది. అంతేకాదు, శ్రమైక జీవనానికి సమస్త వస్తూత్పత్తికీ ఈ చెమట బిందువు ప్రతిష్ఠించ బడింది. దీని నుంచే సమస్త భాగ్య భోగ్యాలు రూపొందు తున్నవి. అయినా లోకం ఈ చమటబిందువుని ఖాతరు చేయుట లేదు. స్వేదశక్తి పరిగణన పొంద లేదు. శ్రమబిందువు శ్రమశక్తికీ, సృజనశక్తికీ ప్రతీక. కనుక, తాను సంఘీ భావంతో ఏ ఘనకార్య మైనా సాధించ గలదు. ఈ జగత్తు రూపు రేఖల్ని పూర్తిగా మార్చివేయ గలదు. ... ఒక ప్రతీకను నెలకొల్పి ప్రథమపురుషలో దాని పరంగా కవితను వెలార్చే ధ్యానంలో సాధారణంగా కవులకీ తమ ప్రతీకలకీ మధ్య పేచీలు వచ్చుట సహజమే. ... ప్రతీకను దురాక్రమించి ఆరోపితం కావడం వలన రసభంగం జరుగుతుంది.

"సూర్యుడు ఉదయించకపోతే - మండే నాగుండె చీల్చి దానిమీద పెడతా"

సూర్యుడు కాంతి హీనుడయితే ప్రజ్వలించే తన గుండెనే చీల్చి సూర్యుడి స్థానంలో నెల కొల్పుతా నంటుంది చేమటబిందువు!

"ఎఱ్ఱటి నా కండలతో ఎండలు కాయిస్తా" అన్న వ్యాక్యంతో ఈ కవిత పరాకాష్ఠ నందుకొంటుంది. ఈ ముగింపు వాక్యం తోనే మండేసూర్యుడు అనే కావ్య నామం సార్థక్యత పొందుతుంది.

ఇంతవరకూ "కేవలం పదాల పోహళింపు ద్వారా శబ్ద శక్తి పై ఆధార పడిన సౌందర్యానికి కవితా శిల్పం కాణాచిగా రూపొందింది. "మండేసూర్యుడు" కవితా సంపుటిలో ఈ లక్షణానికి మారుగా పదచిత్ర రచన ప్రాధాన్యం సంతరించు కొంది, ప్రతీకలు అతి ధారాళంగా నెలకొల్ప బడ్డాయి. నూతన సంవిధానం ద్వారా ప్రతి వాక్యమూ ఒక మనోహర భావ చిత్రంగా (Ideogram) రూపొందింది. ఒక సమగ్ర తేజశ్శక్తిని స్వాయత్తం చేసుకొంది. ఈ సంపుటి లోని ప్రతి కవితకు శేషేంద్ర శర్మగారు స్వయంగా ఆంగ్లానువాదాన్ని పొందు పరచారు. పుస్తకం చదువు తుంటే పాఠకునికి చెమట బిందువు స్వగతాన్ని కవి చెబుతు న్నాడన్నది సుబోధక మవుతుంది.

"నేను చమట బిందువుని - కండల కొండల్లో ఉదయించిన లోక బిందువుని"

ఈ కవిత పాఠకుల హృదయాల్లో యోచనా కిరణాలను ప్రసరిస్తుంది. కావ్యాన్ని పూర్తిగా చదివిన రసజ్ఞునికి మానసికంగా విచిత్రానుభూతిని కల్పిస్తుంది.

రాత్రి నేను కనే కలలు – దినాల మీద కట్టే వంతెనలు –

నా భాష తన నిండా బాధలు నింపు కొంది.

చీకట్ల లాస్యం - ఛేదించు కొని - చుక్కలు నా వాక్యాలై

సూర్యుడిలో కలసి పోతున్న - చిట్ట చివరి రాత్రి . . .

రోజూ ఉదయాద్రి శిఖరం మీద - రక్త కాంతులు చిందే గుండ్రని పాటని!కవిసేన మేనిఫెస్టో:

శ్రీ గుంటూరు శేషేంద్రశర్మగారు విమర్శా ప్రస్థానంలో సాగించిన అతి ముఖ్య మజిలీ ఈ గ్రంథ రచన. తెలుగులో అభ్యుదయ సాహిత్య ఉద్యమం వచ్చి ఉండక పోతే ఇలాంటి విమర్శనా గ్రంథం వెలుగు చూడక పోవునేమో?! ఈ కవిసేన మేనిఫెస్టో చదివే వారికి శ్రీశేషేంద్రశర్మ పై పాశ్చాత్యుల ప్రతీక వాద ప్రభావం బలంగా కనిపిస్తుంది.

అరిస్టాటిల్, ప్లేటో ఇత్యాది గ్రీకు పండితుల యొక్క Poetics ని, లూనాషార్కే, ప్లెఖనోవ్, గోర్కి, మాయాకోవస్కీ వంటి మార్కిష్టుల కళా వివేచననీ, భామహ, అభినవ గుప్త, శారదా తనయాది భారతీయ మేధావుల అలంకార శాస్త్రము లోని విశేషాలను సమన్వయ పరుస్తూ రూపొందించారు కవిసేన మేనిఫెస్టోన్ని శ్రీశర్మగారు. ఇలాంటి తులనాత్మక చర్చ ఇంతకు పూర్వం తెలుగు విమర్శా గ్రంథాలలో చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి పరి శోధన శ్రీశేషేంద్రశర్మ వంటి మహా పండితులకే సాధ్యం. "కేవలం సామాజిక చైతన్యం తో సాహిత్యం ఉత్పన్నం కాదు. సామాజిక చైతన్యాన్ని సాహిత్య చైతన్యం గా మార్చుకొనుట ఎంతో అవసరమని గట్టిగా చెబుతుంది "కవిసేన మేనిఫెస్టో" అలాంటి శక్తి లేని ఆకవిత్వాన్ని కవిత్వంగా పరిగణించుట నిరసిస్తుంది కవిసేనలోని వాదనా పటిమ. ఆకాలంలో అనుభూతి ఆప పదంగా, పెడ ధోరణిగా పరిగణించ బడింది. ఆ సమయంలో మేనిఫెస్టో అనుభూతి అనే భావనను పునః పరిశీలించింది. కవిత్వానికి అతి ముఖ్యమైన అంశం అనుభూతి అనీ, అనుభూతి అనేది మెదడు ద్వారా, తర్కం ద్వారా కాక, ఇంద్రియాల ద్వారా ఆర్జించు కొనిన జ్ఞానం అని నొక్కి వక్కాణించింది. అనుభూతి అనేది జీవితంలో పూర్తిగా మునిగితే గాని సిద్ధించే వస్తువు కాదని ఉద్ఘాటించింది. "సచేతనంగా. సబుద్ధికంగా, సంకల్ప సహితంగా జీవితాన్ని ఆచమనం చేయటమే అనుభూతి కళగా అభ్యసించడం అంటే" అని పేర్కొన్నది. అంతేగాక, పాండిత్యం పట్ల ఉన్న వ్యతిరేకతా భావాన్ని, వ్యుత్పన్నత పట్ల ఉన్న అలక్ష్య తత్త్వాన్ని ఖండిచింది. మరియు, "కవి అన్నవాడు పుడతాడు తప్ప తయారు కాడు " అన్న నానుడిని కవిసేన మేనిఫెస్టో ఆమోదించదు. కాని, వ్యుత్పన్నత అంటే బహు విషయ పరిజ్ఞానమని స్పష్టీకరించి, జడమైన జీవితాన్ని ఉజ్వలిత అనుభవాలుగా మార్చడానికి ఆపరిజ్ఞానం అత్యంత అవసరమని వివరించింది. వ్యుత్పన్నత వలన అనుభవం సంపన్నమూ, గాఢమూ అవుతుందని చెప్పింది మేనిఫెస్టో.

మరో విశేష మేమిటంటే రొమంటిక్ ఆత్మాశ్రయ కవిత్వం అనే పదాలు నిందా వచనాలుగా భావించే వారికి ఆ పదాల అంతరార్థాన్ని వివరించి పరాశ్రయాన్ని, ఆత్మాశ్రయము చేసుకొనుట వలనే కవిత్వం పుడుతుందని చెప్పారు. Feelings అనేవి ఆత్మాశ్రయాలే నని, అవి లేనిదే కవిత్వం జనించుట కష్ట తరమని వెల్లడించారు. ఈ విషయంలో మార్క్సిష్టు సాహిత్య కారుడైన గోర్కీని ఉల్లేఖించారు.

ప్రాచీన అలంకారికులు చెప్పిన హృదయ సంవాదం, ప్రీతి మొదలగు శబ్దాలు కవిలో వస్తువు కలిగించే ఉద్వేదన, తత్ఫలితమైన నిర్మగ్నత (Reaction and involvement) లను ప్రతిపాదిస్తున్నాయి. కమిట్‌మెంట్ అనేది పైపై ప్రకటనలకు, నినాదాలకు అతీత మైనదని శేషేంద్రగారి అభిమతము. అంతేకాక, అనుభూతీ, కావ్య ప్రయోజనమూ, ప్రతిబద్ధతా ఐక్యం కావాలంటారు శేషేంద్ర.

కవిసేన మేనిఫెస్టో తో పోల్చ దగిన రచనలు తెలుగు లో అరుదుగానే కనిపిస్తాయి. అట్టివానిలో శ్రీ కట్టమంచి వారి కవిత్వ తత్వ విచారం, రాచమల్లు వారి సారస్వత వివేచనా పేర్కొన దగినవని విజ్ఞుల అభిప్రాయం. పైన పేర్కొన్న మూడు రచనల లోనూ ఆవేశం, అభిక్షేపం, శైలిలో వాడీ వేడినీ గమనించ వచ్చును. పైన ఉదహరించిన రెండు పుస్తకాలలో విస్తృత కొటేషన్లు మాత్రం కనిపించవు. అలాగే శేషేంద్ర శర్మగారి రచన ఏ సృజనాత్మక రచనను కేంద్ర బిందువుగా వాడుకొన లేదు.

అలాగే, తెలుగు సాహిత్యంలో కొత్తగా వచ్చిన అనుభూతి వాదానికి కవిసేన మేనిఫెస్టో ఒక విధమైన శాస్త్రీయ పునాది కల్పించిందంటే, ఏమాత్రం అతిశయోక్తి కానేరదు. ఈ సందర్భములో కవిసేన మేనిఫెస్టోను గురించి ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు వ్యక్త పరచిన అభిప్రాయాలను విజ్ఞులందరూ గమనించాలి.

కాలరేఖ:

ఈ పుస్తకం ఈ శతాబ్ది చింతన తులనాత్మక సాహిత్య వ్యాస సంపుటి. ఇందు శేషేంద్రశర్మగారు రచించిన దాదాపు 24 వ్యాసాలు పొందు పరచ బడ్డాయి. వీనిలో సంస్కృత సాహిత్య సంబంధమైన విమర్శ వ్యాసాలు ఎక్కువ. మహర్షి వాల్మీకిని, వ్యాసుణ్ణి, మయూరుణ్ణి, కాళిదాసుని గురించిన వ్యాసాలున్నవి. వాటిలో శేషేంద్రశర్మగారు అత్యంత నిపుణతతో వారి కవితా హృదయాలను చిత్రించారు. కథా కావ్యాల మీద, నాటకాల మీద తన వ్యతిరేకతను వ్యక్త పరుస్తూ, కాళిదాసుని మేఘదూతం రసయుగాన్ని అంతం చేసిందని, లక్షణకారుడు భామహుడు ఆ ప్రభావం వల్లనే అలంకార యుగాన్ని ప్రారంభించారని శేషేంద్రశర్మగారు అభిప్రాయ పడ్డారు. ఈ వ్యాస సంపుటిలోనే సావిత్రి అనే వ్యాసం, సూర్యశతకం పై విశ్లేషణ పరిశీలింప దగినవి. ఇందు పొందు పరచిన మిగతా వ్యాసాలు సహితం అత్యంత ప్రశంసనీయ మైనవి. కాలరేఖ అనే వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు 1994వ సంవత్సరపు జాతీయ పురస్కారానికి ఎంపికచేశారు. శేషేంద్రశర్మగారికి కవిగా కాక, విమర్శకునిగా ఈ పురస్కార ప్రదానం పండిత లోకాన్ని సంతోషంతో నిపింది. కాలరేఖ లోని విశేషాలు పాఠకుల ముందుంచడమే ఈ వ్యాసం యొక్క ప్రధానోద్దేశ్యం. ఈ వ్యాసాన్ని చదివిన పిమ్మట కాలరేఖను విజ్ఞులైన పాఠకులు తప్పక చదువుతారని ఆశిద్దాం.

కాలరేఖ లోని విశేషాలు:

ఇదివరలో పేర్కొనిన విధంగా కాలరేఖ (The Arc of Time) విమర్శనా సాహిత్యంలో ఉల్లేఖనీయమైన రచన. ఇందులోని మొదటి తొమ్మిది వ్యాసాలు శ్రీశేషేంద్రశర్మ సాహిత్య విమర్శనా ప్రతిభను, వారి కవితాశక్తిని ప్రశంసిస్తూ ఇతర రచయితలు వ్రాసినవి. వీనిలో శ్రీశర్మగారి జీవిత విశేషాలను ముఖ్యంగా వారి సాహితీ ప్రస్థానం స్థూలంగా, చర్చించ బడినది. ఇది వారి స్వీయ వ్యాసాలను చదివి అవగాహన చేసుకొనుటలో పాఠకులకు ఉపకరిస్తుంది. కాలరేఖ సంపుటిలో తొలి వ్యాసం "వాల్మీకి కవిత". ఈ వ్యాసాన్ని క్రింది కవితతో మొదలెడతారు శర్మగారు.

"నదులు కవులు భూగోళపు రక్త నాళాలు - నదులు ప్రవహిస్తాయి కవితల్లా

పసువుల కోసం పక్షుల కోసం మనుష్యుల కోసం - నదులు కంటున్న కలలు పొలాలో ఫలిస్తాయి

కవులు కంటున్న కలలు మనుష్యులలో ఫలిస్తాయి" (ఆధునిక మహాభారతము).

"మనమందరం ఈ దేశంలో కవుల కలలం. కవులకు మూల పురుషుడు వాల్మీకి. ఆయన కావ్యం రామాయణం నుంచి వ్యాసుడి భారతం పుట్టింది! రామాయణ భారతాదుల నుండి భాస కాళిదాసులు పుట్టారు. ఇది ఈదేశపు కవుల వంశ వృక్షం. ఆ వృక్ష ఛాయల్లో మనం పుట్టి పెరిగి మన పరమార్థం చేరుకుంటున్నాము".

సాధారణంగా ఉపమలకు కాళిదాసును పేర్కొంటున్నారు. కాని, "వాల్మీకి పెదవి కదిపితే చాలు చిలుక కొరికితే దానిమ్మ గింజలు రాలినట్లు రాలుతాయి ఉపమలు" అంటారు శర్మగారు. ఈ విషయాన్ని అనేక ఉదాహరణలతో అత్యంత మనోహరంగా ప్రదర్శిస్తారు పాఠకులకు. "రాముడు జలాల్లోకి దిగి ఆచమనం చేశాడు. జరిగింది ఇంత మాత్రమే. కాని వాల్మీకి యొక్క వర్ణమయ దృష్టికి ఈ సాధారణ విషయంలో ఎన్నో రమణీయతలు కనిపిస్తాయి. ... "ఉపా స్పృశత్ సుశీతేన జలేనోత్పల గంధినా" వట్టి ఆచమనం కాదు, కలువ పూల వాసనలు గుబాళించే శీతల మైన జలాలతో ఆచమనం చేశాడు అంటాడు వాల్మీకి. ... ఆ వర్ణనకు రాముడి ఆచమనం మాట అటుంచి మన నోరు లాలాజల మయం అవుతుంది!

వాల్మీకి ప్రతిభను వర్ణిస్తూ "పిపీలికాది బ్రహ్మపర్యంతమైన సృష్టిలో వాల్మీకి జ్ఞాన నేత్ర పరిధిలో రానిది ఏదీ లేదు. గుడిసె తెలుసు, మహలు తెలుసు, మద్య మాంస మహిళామయ ప్రపంచమంతా తెలుసు. ... ఋషిత్వం తెలుసు వేట తెలుసు, పాట తెలుసు, ఇది తెలుసు ఇది తెలియదు అని చెప్పడానికి వీలు లేదు. జ్ఞానం చేత ఆశ్చర్యం కలిగించే సర్వజ్ఞుడు! వాల్మీకి సౌందర్య సింధువు" అంటారు శేషేంద్రశర్మ. ...

చంద్రోదయాన్ని వర్ణిస్తున్నాడు వాల్మీకి, "ప్రజగామ సభశ్చంద్రః" (సుందరాకాండ) చంద్రుడు ఆకాశంలో ప్రవేశించాడు. అంతిటితో ఆపడు ... అదికోట్లాది కళ్ళకు కనిపించే సాధారణ దృశ్యం ... వాల్మీకికి మాత్రమే మరొకటి కనిపిస్తుంది - నీలి జలాల్లోకి హంస ప్రవేశించడం ... కవికంటికి మాత్రమే కనిపించే రెండో దృశ్యం పరోక్షం. అది మన ఎదుట లేదు. ... వాల్మీకి మాటలన్నీ ఇలాంటి మాణిక్యాలే. ఆయన నోరు కదిపితే అలంకారాలు ప్రతీకలు బింబాలు . . . చివరకు ఆ మూర్ఛావహమైన చాంద్రీ మయ నిశా శిల్పిని చంద్రుడ్ని చూచి ఋషి చేతులు జోడించి "రరాజ చంద్రో భగవాన్ శశాంకః" అంటాడు.

"రావణుడు అపహరించి లంకకు తెచ్చిన సీత రామ వియోగం సహించ లేక . . . ప్రాణత్యాగం చేద్దామనే నిర్ణయానికి వచ్చింది. అదే సమయంలో హనుమ అశోకవన ప్రవేశం . . . సీతకు ఎడమ కన్ను అదిరింది . . . "ప్రాస్పంద తైకం నయనం సుకేశ్యాః మీనా హతం పద్మ మివాభి తామ్రం". వాల్మీకి టెక్నిక్ సర్వత్రా ఒక్కటే! - సీత ఎడమ కన్ను అదిరింది, ఎలా - పూచిన తామర కొలనులో ఈదుతున్న చేప తోక తగిలి కదిలిన తామర పువ్వులా కదిలింది! కాని ఆయన పంక్తి పొడవు ఒక్క అంగుళమే, కాని దాని గర్భంలో ఉన్న చిత్రాన్ని - మన శబ్దజాలంలో చెప్పాలంటే ఇన్ని మాటలు తెచ్చు కోవాలి." ఈ విధంగా వాల్మీకి ప్రతిభను, ఉపమలను విశ్లేషిస్తూ వ్యాసాన్ని ముగిస్తారు శర్మగారు. వాల్మీకి ఘనత అద్దం లోని హిమాలయంగా మన ముందుంచారు ఈ వ్యాసం ద్వారా రచయిత!

కాలరేఖ లోని రెండో వ్యాసం కాళిదాసుని మేఘసందేశమును గురించినది. శ్రీశేషేంద్రశర్మగారి దృష్టిలో మేఘసందేశం ఒక కావ్యం కాదు! కుమారావస్థలో దానిని చదువుకున్న వాళ్ళకు అది జీవితాంతం వెంటాడే ఒక బలీయ స్మృతి! "ఏది వృద్ధుల్నీ, ప్రౌఢుల్నీ, కుమారుల్నీ బాలుర్నీ చేసి వయః ప్రవాహాన్ని వెనక్కి మళ్ళిస్తుందో, ఏది మృత్యుబోధ వైపు ప్రవహించే మనిషికి ఆనకట్ట కడుతుందో, ఆ ఆశ్చర్య జనక మైన కావ్యం మేఘసందేశం".

వాల్మీకి రామాయణంలో ఎక్కడో అరణ్యంలో ప్రచ్ఛన్నంగా పడి ఉన్న విప్రలంబ శృంగార లక్షణ యుక్తము, కరుణ రస బిందు స్పందమానము అయిన శ్లోకం -

"ఇతి వైశ్రవణో రాజా రంభాసక్తం పురానఘ! - అనుపస్థీయ మానోమాం సంకుద్ధ్రో వ్యాజహారహ"

అనేదాన్ని తీసుకొని మేఘసందేశం వ్రాశాడు మహాకవి కాళిదాసు.

పై శ్లోకమే -: "కశ్చిత్కాంతా విరహ గురుణా స్వాధికారాత్ ప్రమత్తః \ శాపేనా స్తంగమిత మహిమా వర్ష భోగ్యేణ భర్తుః

యక్షశ్చక్రే జనక తనయా స్నాన పుణ్యోద కేషు \ స్నిగ్ధ చ్ఛాయా తరుషు వసతిం రామగిర్నాశ్రమేషు"

శ్లోకంగా రూపమెత్తింది. "కాళిదాసులో ఈ దేశపు మట్టి వాసన ఘ్రాణేంద్రియాల్ని దేశవాసుల్నిగా పిలుస్తుంది! కాళిదాసు పితృపితామహమైన సారస్వతీయ సామ్రాజ్యానికి చక్రవర్తి! వ్యాసుడిలో వాల్మీకి కనిపించడు, వ్యాసుడి అంగాంగాన వాల్మీకి తేజస్సు మండలీకరిస్తున్నప్పటికీ. కాళిదాసులో మాత్రం పంక్తి పంక్తిలో కనిపిస్తుంది! కాళిదాసు శరీరంలో ప్రవహించే వాల్మీకి అంతర్లీనత . . . భారతీయ కావ్య సామ్రాజ్యంలో వాల్మీకి, వ్యాస, కాళిదాసులు సగర, దిలీప, రాఘవుల వంటి ఆదిమ చక్రవర్తులు" అంటారు శేషేంద్రశర్మగారు.

కాలరేఖలోని మరో ముఖ్య వ్యాసం "అరవింద సావిత్రి". వాల్మీకి వ్యాసులు దృశ్య వస్తువైన మానవుడి భౌతిక జీవయాత్రను గురించి కావ్యాలు రచిస్తే, అరవిందుడు ప్రధానంగా మానవుడి మరణాంతర జీవనాన్ని గూర్చి, అంటే, మానవుడి అభౌతిక జీవయాత్రను గురించి కావ్య నిర్మాణం చేశాడు. అంటే, అరవిందుల ఇతివృత్తం అదృశ్య వస్తు ప్రధానం. ఒక విషయం మనం గమనించాలి. వ్యాస వాల్మీకుల్లో అధ్యాత్మిక సంబంధమైన మిధకీయ సృష్టి కొంత ఉన్నప్పటికీ దానికంటే వారిలో ప్రధానం మానవుడు భూగోళం మీద చేసిన జీవయాత్ర. సావిత్రి వ్యాసుడి మహాభారతంలో ఉపాఖ్యానం, ఆఖ్యానం కాదు. కాని అరవిందుడు దానిని ఆఖ్యానంగా వికసింప జేశాడు. అందువలన అరవిందుని కావ్య సృష్టి అదృశ్య వస్తువుని దృశ్యమానం చేయడం అనే విచిత్ర ప్రక్రియ! ఒక విధంగా చెప్పాలంటే, వాల్మీకి, వ్యాసుల సరరన కూర్చో బెట్టగలిగిన మహావ్యక్తి అరవిందులు. అందుచేత మన దేశంలో రామాయణ, మహాభారత ఇతిహాస మహాగ్రంథాల తర్వాత మూడవ ఐతిహాసిక కావ్యం సావిత్రి, అంటారు శేషేంద్రగారు.

సావిత్రి లాంటి ప్రాచీన కథల్లో ముఖ్యమైనది స్వర్గ నరకాన్ని గురించి చేయబడిన మానవీయ ఊహ! మానవుడు ఇహలోకం లో చేసే దుష్కర్మలు ఫలరహితంగా ఉంటాయని మనిషి ఒప్పుకోలేని దశ చేరినప్పుడు జన్మించిన ఒక ప్రతీకాత్మక తత్వచింతన ఇది. 20వ శతాబ్దంలో ఇంత మహత్తర ఆధ్యాత్మిక కావ్యం మరొకటి లేకపోవడం చేత, అరవిందుని సావిత్రి కావ్యం అత్యంత విశిష్ట గ్రoథంగా పరిగణింప బడుతుంది. శేషేంద్రశర్మగారి దృష్టిలో సావిత్రి ఒక భాషకు సంబంధించినది కాదు - మూలం ఇంగ్లీషులో ఉన్నప్పటికీ, అన్ని భాషలలోకి పోయి అది ప్రజల కావ్యంగా పరిగణించ బడవచ్చును. "అరవిందులు యోగి కావడం చేత ఈ కావ్యం కావ్యతలో పరాకాష్ట పొందింది. అయోగులు, అర్థ యోగులు అయిన లౌకిక కవులు ఈ మూర్ఛా మహామాయను ఉత్పాదన చేయలేరు. సృజనాత్మక శిఖరాలైన వాల్మీకి, వ్యాస, హోమర్, వర్జిల్, దాంతే . . . మహానుభావుల్ని కావ్యమర్మ దృష్టికి గురి చేస్తే తెలుస్తుంది, వాళ్ళందరూ యోగులు, లేక భక్తులు అని. యోగి కాని కవి వాస్తవంగా లేనేలేడు".

వ్యాసుడెవరు?

"సముద్రంలో కలిసిపోయిన వాడ్నయినా పట్టుకోవచ్చు గాని కాలంలో కలిసిపోయిన వాడ్ని పట్టుకోవటం మహాకష్టం. వాల్మీకి, వ్యాసులు అలాంటి వారు" అంటారు శ్రీశేషేంద్ర వ్యాసుడు అనే వ్యాసంలో. వ్యాసుడెవరు అన్న ప్రశ్నకు జవాబు అంత సులభం కాదు. ఎందుకంటే, ఏ వ్యాసుడు అన్న ప్రశ్న కూడా దానితోనే ఉత్పన్న మౌతుంది. జయం వ్రాసిన వ్యాసుడా? భారతం వ్రాసిన వ్యాసుడా? వేదవిభజన చేసిన వ్యాసుడా? బ్రహ్మ సూత్రాలు వ్రాసిన వ్యాసుడా? పురాణాలు వ్రాసిన వ్యాసుడా? పతంజలి యోగసూత్రాలకు భాష్యం వ్రాసిన వ్యాసుడా? బృహస్పతి, నారదా, కాత్యాయనాది స్మృతికర్తల్లో ఒకడై స్మృతి వ్రాసిన వ్యాసుడా?

మహాభారత, బ్రహ్మసూత్ర, అష్టాదశ పురాణాలు వ్రాసిన వ్యాసుడు ఒక్కడే అని సంప్రదాయం. ఈ విషయమే వివాద గ్రస్థం. అయినప్పటికీ వ్యాసుడు ఒక్కడే అన్న విశ్వాసం దేశంలో బలంగానే వున్నది. వ్యాసుడు భారతీయ సాహిత్యానికి చేసిన ప్రధానం ఏమిటని మరొ ప్రశ్న. ఈ ప్రశ్నకు కూడా జవాబు క్లిష్టతర మైనదే! కవిగా, కావ్య నిర్మాతగా మహాకవి వాల్మీకిని మించిన వారు బహుశా లేరనే ఎక్కువ మంది కావ్య మీమాంసకుల అభిప్రాయము. అయితే, వాల్మీకిని అడుగడుగునా అనుసరించిన ప్రథమ కవి వ్యాసుడేనని శర్మగారి అభిప్రాయం. దీనికి ఆధారంగా మహాభారతాన్నే ఉల్లేఖిస్తారు శేషేంద్రగారు.

ఈ వ్యాసంలో అనేక విషయాలను (చాలా వరకు వ్యాస సంబంధిత మైనవి) విస్తృతంగా చర్చించారు శేషేంద్రశర్మగారు. వ్యాసుడ్ని గురించి అనేక రకాల ఆలోచనలు వెదజల్లారు. కచ్చిత మైన నిష్కర్ష తెలియ పరచ లేదు. వ్యాసుడు వ్యక్తియా? వ్యవస్థా పరంపరా అనే సంశయాన్ని అలాగే వదిలేశారు. ముగింపుగా "పురాణాల విషయం వచ్చేసరికి ప్రపంచం అంతా చర్చా పరిధి లోకి వస్తుంది. కనుక వేదాల పూర్వం నుంచి సర్వత్రా, వ్యాపించి ఉన్న పురాణాలను క్రోడీకరించి అక్షరబద్దం చేసి అష్టాదశ పురాణాలుగా విభజించి మనదేశానికి అనుగ్రహించిన ఆ వ్యాస మహర్షి ఎవరో ఆ వ్యాస సాంప్రదాయానికి నా నమస్కారము" అంటారు శేషేంద్రశర్మగారు! వివాద గ్రస్థమైన విషయానికి గల అనేక పార్శాలను చూపెట్టారు శర్మగారు పాఠకులకు ఈ వ్యాసం ద్వారా.

తులనాత్మక సాహిత్యము :

కాలరేఖ వ్యాస సంపుటిలోని ప్రముఖ వ్యాసాలలో పేర్కొనదగినది తులనాత్మక సాహిత్యమనే వ్యాసం. తులనాత్మక సాహిత్యమంటే కంపారెటివ్ లిటరేచర్ (comparative literature) అంటే ఒకటి కంటే ఎక్కువ భాషల సాహిత్యాన్ని కలిపి పోలుస్తూ పరిశీలించే సాహిత్య విమర్శ ప్రక్రియ. తులనాత్మక సాహిత్యానికి స్వతంత్ర రచనలే సామాగ్రి. ఆ రచనలు సహజ జాతములై ఉండాలి. అప్పుడే అవి తులనాత్మక సాహిత్యానికి లాభదాయక మౌతాయి. తులనాత్మక సాహిత్యంలో ప్రధానతః సిద్ధమయ్యే సత్య మేమిటంటే మనుష్యులు ఈ భూగోళంపై ఎక్కడ ఉన్నాసరే వాళ్ళ భావాత్మక సంఘటనలు సుఖ దుఃఖాలు సామాజిక స్థితి గతులు, చరిత్ర, ఇతిహాస పురాణావళీ ఇత్యాది మానవీయతా జన్య జీవన చిత్రాలు సందర్భాలు ఎన్ని భేదాలున్నప్పటికీ సాధారణతః సమానంగా ఉంటాయి. ఈ విషయాన్ని గ్రీకు, సంస్కృత, ఫ్రెంచి, ఆంగ్ల సాహిత్యాల నుండి అనేక ఉదాహరణ లిస్తూ దృఢ పరచారు శేషేంద్రశర్మగారు.

అన్య భాషా సాహిత్యాధ్యాయనం చేత మన భాషలో సాహిత్యకారుల స్థాయి ఏమిటో మనకు తెలుస్తుంది. మన అల్పిష్టి కవిని చూచి వీడే మహానుభావుడనే మూర్ఖత్వానికి లొంగే ఆవశ్యకత ఉండదు. అంతేకాదు, విజ్ఞులకు తెలుస్తుందితెలుస్తుంది ఏ ఒక్క భాషసాహిత్యమూ సమగ్రం కాదని. ఆ ప్రజల సాంప్రదాయ, సంస్కృతి, చరిత్ర, అనుభూతి ఇత్యాదుల్లో ప్రవేశించే వైకల్యాల మూలంగా అసమగ్రత సంభవించుట సహజం. ఒక్కో భాషలో, ఒక్కో సాహిత్య ప్రక్రియ ఉజ్వలంగా ఉంటుంది. జీవనానుభూతులు సహితం ఒక్కో సాహిత్యంలో ఒక్కో విధంగా సంపూర్ణతను పొందుతాయి. ఈ విషయంలో తులనాత్మక సాహిత్య వేత్త హెన్రీ జిప్ఫర్డ్ ఏమంటారో గమనించండి “Is any one literature enough to the end of providing in itself a true education? We are bound to admit that some parts of European experience hardly entered into English literature. Certain kinds of writing were better alone elsewhere”. కనుక, బహు భాషా సాహిత్యాల అధ్యాయనం ఆధునిక మానవుడికి అనివార్య కర్తవ్యం అంటారు శేషేంద్రశర్మ.

తులనాత్మక సాహిత్యం పాశ్చాత్యదేశాల్లో పరిశీలన శాస్త్ర రూపంలో ఇటీవలనే ప్రారంభ మయింది. కాని భారత దేశంలో తులనాత్మక సాహిత్యం ప్రాచీన కావ్య శాస్త్రంలో ఒక భాగంగా ఉండేదని అందులోను ప్రధమ భాగంగా పరిగణించ బడేదనీ, దండి, వామన, రాజశేఖరాదుల గ్రంథాలు చదివితే తెలుస్తుందంటారు శ్రీశర్మగారు. దీనికి కారణం సంస్కృత సాహిత్యమే ఒకే ఒక భాషకు సంబంధించిన సాహిత్యం కాదు. మన దేశంలో ఉన్న అనేక భాషల మిశ్రమ ప్రయోగం జరిగిన ఒక విచిత్ర సాహిత్యం సంస్కృత సాహిత్యం అంటారు శర్మగారు. అంతేకాదు, దండి ప్రథమ పరిచ్ఛేదంలో, మాగధ్యాది ఏడు పాకృత భాషలు అపభ్రంశ, పైశాచిక భాషలు అన్నింటినీ కలిపి, సర్గబంధ ఆఖ్యాయిక కథ నాటకాదుల కావ్య విభజన చేసిన తరువాత అంటాడు "తదేత ద్వాఙ్మయం భూయః సంస్కృతం ప్రాకృతం తథా! అపభ్రంశ మిశ్రం చేత్యాహురా ర్యాశ్చతుర్విధం ". అని కనక, సంస్కృత సాహిత్యం అనగా దేశంలో ఉన్న అన్నిభాషల మిశ్రమ సాహిత్యం అని ఆనాటి భావన! ఈ విధంగా నానా భాషా సాహిత్య సమైక్య దృష్టి ఈ దేశంలో మూలతంగా ఉండటం చేతనే అన్ని భాషల సాహిత్యాల అన్యోన్య పరిశీలన సహజంగానే సంభవించింది" అంటారు శేషేంద్రశర్మ.

మనదేశపు ఒకనాటి వలస రాజ్య స్థితి మూలంగా మనకు సంక్రమించిన సాహిత్య సంస్కృతిచేత మనం ఆంగ్ల భాష గవాక్షం ద్వారా ఆధునిక సాహిత్యాన్ని మూలంగా చూడటంలో ఒక సౌలభ్యం ఉంది. అది ఇలాంటి సందర్భాలలో లాభదాయకం. ప్రపంచ భాషల్లోని (గణనీయమైన) సాహిత్యం ఆంగ్ల భాషలోనికి అనువదించ బడుతుంది కనుక ఆంగ్ల విద్య మనకు లాభసాటి.

మరొక ముఖ్య విషయ మేమిటనగా, ఆధునిక ప్రపంచానికి తులనాత్మక సాహిత్యం అనివార్యం. హింసా పీడితమైన వర్తమాన ప్రపంచానికి తులనాత్మక సాహిత్యం ఒక విధమైన మతం. ఆధునిక మానవుడు అన్ని మతాలు విడిచి, ఈ సాహిత్య మతాన్ని స్వీకరించి ప్రజల్లో విశ్వవిద్యాలయాల్లో ప్రచారం చేయాలి. ఒక విధమైన నూతన అంతర్జాతీయ సాహిత్య చైతన్యాన్ని ఉత్పన్నం చేయాలి అని అంటారు శేషేంద్రశర్మ. అంతేకాదు, నానా భాషల్లో ఖైదీలుగా పడివున్న సాహిత్యాల్ని ఆభాషా జైళ్ళు బద్దలు కొట్టి విడుదల చేయ్యాలి. దానికి ముఖ్యమార్గం అనువాదం, అని వక్కాణిస్తారు శర్మగారు. ఈ ప్రక్రియ ఐరోపాలో భారీ ఏత్తున జరుగుతున్న విషయమని విశద పరచారు శేషేంద్రగారు. ఐరోపా ఒక ఐక్య బౌద్ధిక సమితిగా మారుటకు అదే ముఖ్య కారణమంటారు వారు. నేషనల్ బుక్ ట్రష్టు వంటి సంస్థలు ఈ విషయంలొ ఉల్లేఖనీయమైన సేవ చేయు చున్నారని శర్మ గారి నమ్మకం. అనువాద ప్రక్రియమీద ఈనాడు ఇండియాలో ఉన్న అపనమ్మకం అత్యంత గర్హనీయ మంటారు శేషేంద్రగారు.

సాహిత్యం ఎక్కడ ఉన్నా అది మనదే! సాహిత్యము ఏకము, అవిభాజ్యము. కళ విశ్వజనీనము, సృజనాత్మక కళ అయిన సాహిత్యం ఏభాషలో కైనా ప్రవేశించ గలదు. ఆ భాష ప్రజల సంపదగా ప్రతిష్ఠ కాగలదని గట్టిగా వాదిస్తారు శేషేంద్ర్శర్మగారు ఈ వ్యాసం ద్వారా! అలాగే ప్రాచీన గ్రీకు, భారతీయ నాటకాల తులనాత్మక పరిశీలన వివరాలను విశ్లేషించారు శర్మగారు మరో వ్యాసంలో. పాఠకులందరు చదువదగిన వ్యాసం ఇది.

కాలరేఖ సంపుటిలో సంకలితమైన మరో ముఖ్య రచన ఇద్దరు ఋషులు ఒక కవి అన్న వ్యాసం. ఇందు ఉల్లేఖించ బడిన ఇద్దరు ఋషులు - ఒకరు వాల్మీకి మహర్షి, రెండవ వారు వ్యాస భగవానులు. రామాయణంలో కనిపించే భారతీయ సంస్కృతిని విస్తృత పరుస్తూ వ్యాస మహర్షి వాల్మీకి అడుగు జాడల్లో పయనిస్తూ, కావ్య తంత్రాన్ని, కావ్య వస్తువును, నిర్మాణ సామాగ్రిని, భాషను తన కావ్య సృజనా ప్రక్రియకు వాడుకొన్నారు అనే భావన వ్యక్త పరచారు శ్రీశర్మగారు. అదే విధంగా వ్యాస మహర్షిని అనుసరించాడు మహాకవి కాళిదాసు. ఈ విషయాన్ని సృష్టీకరించారు వారు. వాల్మీకి వ్యాస మహర్షులు దేశానికి వారసత్వంగా యిచ్చి పోయిన సాహిత్య సంస్కృతికి కాళిదాసు చివరి కాపలాదారు, అంటారు శేషేంద్రశర్మగారు. కాళిదాసు తదనంతరం, ప్రవాహమాన భాషగా ఉన్న సంస్కృతం జడత్వం పొందుట, ఆ భాషలో కృత్రిమత్వం, నిరర్థకత, పాండిత్య ప్రకర్ష ప్రవేశించడం కారణాన, సంస్కృత సాహిత్య వాహిని ఒక పిల్ల కాలువగా మారి, చివరకు బిందు బిందువుగా కారే బలహీన ధారగా మిగిలి పోయింది. అని ఆందోళన వ్యక్త పరుస్తారు శర్మగారు. ఉత్తర రామచరితము, మృచ్ఛకటికము, కర్పూర మంజరి, లాoటి కాళిదాసానంతర కాలపు కృతులను నిర్లక్ష్యం చేయలేము కాని, ఆ కాలపు దోషాలు ఆ కావ్యాలలో లేవని చెప్పలేము. ఒక విధంగా చెప్పాలంటే, కాళిదాసు తర్వాత మరి అలాంటి కవులు జన్మించ లేదంటే, అది అతిశయోక్తి మాత్రం కాదు. కాళిదాసుపై ప్రసిద్ధ వ్యక్తులు చాలామంది కృషి చేసి, అనేక విశేషాలు వెల్లడించారు. అయినప్పటికీ వారి దృష్టి కందని విశేషాలు వెల్లడించారు శేషేంద్రశర్మగారు.

ముఖ్య విశేషాలు :

శేషేంద్రశర్మగారి ఉద్దేశ్యంలో కాళిదాసు మూలస్థానాలు ప్రత్యక్షం కాకపోతే, కాళిదాసీయ కళ, దాని పాత్ర ఔచిత్యం అర్థం కాదు. అలాంటి సమగ్ర అవగాహన ఒక క్లిష్ట సాహస యాత్ర! అది నిర్వహించడానికి వాల్మీకి పాత్రను సరైన దృక్కోణం నుంచి అర్థం చేసుకోవాలి.

వాల్మీకి ఇతిహాసం స్వయం కల్పిత బాధ్యతల మూలంగా అంతకు ముందు కాలం లో లేని అభివ్యక్తులని సృష్టించి దానితో శ్రోతలని ఆశ్చర్య పూర్వక ఆహ్లాదంతో ముంచి వేసింది. ప్రకృతి, నదీ నదాల వర్ణనలు, అభివ్యక్తులు అందరి కవుల చేత ఆయా సందర్భాలలో వాడుకో బడ్డాయి.

వ్యాస మహర్షి కథన కళా విధానంలో వాల్మీకిని అనుసరించారు. వాల్మీకిని అనుసరించిన మొట్ట మొదటి కవి వ్యాసుడే! తరువాతనే కాళిదాసు ఆయన అడుగుజాడల్ని అనుసరించి వాల్మీకి వారసత్వాన్ని నిష్ఠతొ నిర్వహించాడు. వాల్మీకి ఉపదేశించిన ముఖ్యమైన మానవ విలువలలో రాజు, ఋషి మూలతః సమానులు అనేది, ఒకటి. అంటే, ప్రభుత్వానికి బుద్ధి జీవులకు మధ్య ఉండవలసిన సంబంధం. ఈ మానవీయ విలువల్ని వ్యాసుడు, కాళిదాసు సందర్భం వచ్చి నప్పుడల్లా సమగ్రంగా పాటించారు. ఉదాహరణకి రామాయణంలో రాజు ఋషి ముందు వినమ్రుడుగా ఉంటాడు. ఋషి కూడా రాజుకు తన కంటే ఉన్నత స్థానమిస్తాడు. ఈ విషయాన్ని దృధ పరచడానికి శేషేంద్రశర్మగారు రామాయణం నుండి అనేక సందర్భాలు సూచిస్తారు. అలాగే వ్యాసుడిని గురించి కూడా అనేక సందర్భాలు వివరిస్తారు. అదే విధంగా కాళిదాసు విషయంలో అనేక ఉదాహరణలు పొందు పరచారు శర్మగారు. కాళిదాస కృతి మేఘదూతం భారతీయ సాహిత్యంలో ఒక బ్రహ్మాండ మైన మలుపుగా అభివర్ణించారు వారు. మేఘదూతం మూలంగా భారతీయ సాహిత్యంలో ఒక గొప్ప యుగ కర్తృక సంఘటన జరిగింది అంటారు శేషేంద్ర గారు. ఈ వ్యాసం ద్వారా భారతీయ కావ్యశాస్త్రం మీద మేఘదూతం చూపిన ప్రభావాన్ని విశదీకరించ ప్రయత్నించారు శర్మగారు. ఈ విషయమై మర్మజ్ఞులైన కావ్య వేత్తలు పరిశీలిస్తారని ఆశిద్దాం!

శేషేంద్రశర్మగారు కాలరేఖ వ్యాస సంపుటిలో పొందు పరచిన వ్యాసము లన్నియు వివరింప దగినవే! దేనికది నూతన ఆలోచనలు పాఠకునిలో ప్రేరేపిస్తుంది. సరికొత్త వ్యాఖ్యా విధానాన్ని సృజిస్తుంది. ఉదాహరణకు "శాకుంతల నాందీ శ్లోకము దేవీస్తోత్రమే" అన్న దాన్ని గురించిన వ్యాఖ్యను పరిశీలిద్దాం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన "అభిజ్ఞాన శాకుంతలమున గల నాందీ శ్లోకమును ఇంత వరకు కేవలము ఈశ్వర స్తోత్రముగానే భావించు చున్నారు. దానిలో మంత్ర శాస్త్రార్థ ప్రతీతి గలదన్న సత్యాన్ని శేషేంద్రగారు వెలికి తెచ్చారు.

యా సృష్టి స్స్రష్టురాద్యా, వహతి విధిహుతం యా హవిర్యా చహోత్రీ,

యే ద్వే కాలం విధత్తః శ్రుతి విషయాగణా యా స్థితా వ్యాప్య విశ్వం,

యా మాహుః సర్వభూతప్రకృతి రితి, యయా ప్రాణినః ప్రాణవంతః,

ప్రత్యాక్షాభిః ప్రపన్నస్తనుభి రవతు వ స్తా భి రష్టాభి రీశః.

ఈ శ్లోకానికి మామూలుగా చెప్పబడుతున్న అర్థం - అష్ట తనువుల చేత ప్రసన్నుడై ఈశుడు మిమ్ములను రక్షించుగాక. శాకుంతల శ్లోకము ఒక కవియొక్క సాధారణమగు ఒక ఊహపై గాక శాస్త్ర సిద్ధాంతము పై నాధార పడియున్నది. అది తెలిసినచో ఈ శ్లోక మేట్లుద్భవించినదో తెలియ గలదు. 1) పంచ భూతాద్యష్టతన్వాకమగు సృష్టి, సమాహారమున శక్తియే అనియును, 2) శక్తి శివుని తనువనియును, 3) శివ శక్తులు అభిన్నములు లింగ రహితములనియును, 4) అట్టి శక్తి అభేదము చేత అష్టమూర్తి మత్వాది సర్వ శివ లక్షణములు కలిగి యున్నదనియును నిగమాగములు సిద్ధాంతము చేసినవి.

నిగమాగములకు పరమార్థమైయున్న ఈశాస్త్ర విషయమునే మన శ్లోకము చెప్పుచున్నది. అందును ప్రథమాంశమైన శక్తి యొక్క సర్వకర్త్రిత్వమును ప్రతిపాదించుటయే దేవీ ఉపాసకుడగు కాళిదాసుని యొక్క ఆశయము. అందుచేత ఈ విషయము జగత్ప్రసిద్ధమగు నాటకముయొక్క నాందీ శ్లోకమునకు వస్తువుగా గైకొనెను. ఈ శ్లోకములో శాస్త్రవేత్తయగు మహాకవి కాళిదాసు మూడు విషయాలను ప్రతిపాదించాడు: 1) పరాశక్తి సర్వకర్త్రి : అందుచేత శ్లోకమంతయు శక్తి పరముగా అన్వయమగును. అప్పుడు ఆది పూర్వక విశేషము లన్నియు శాస్త్రోక్త వివిధ శక్తి లక్షణములను ధ్వనింప జేయును. ఈశః శబ్దము ప్రతిబింబ మాత్ర తత్వము చేత శక్తినే ప్రతిపాదించు నట్టి శాస్త్రము ఇందు నిక్షిప్త మైనది. 2) పరాశక్తి శివుని తనువు అని : ఈ పక్షమున యాదిపూర్వవిశేషణములు అష్టమూర్తులను వ్యష్టిగా ప్రతిపాదించి, ఆది సర్వనామముల చేతను తను శబ్దము చేతను సమిష్టిగా శక్తిని ధ్వనింపజేసి అట్టి శక్తి చేత ప్రసన్నుడైన శివుడు అని అన్వయము నిచ్చును. అనగా అట్టి తనువు లేనిచో శివుడు కార్య సమర్థుడు గాడనియు, 3) శివశక్తులు అభిన్నములనియును, కనుక అష్టమూర్తి యగు శివుడు మిమ్ములను రక్షించుగాక అను సామాన్యార్థమునకు అన్వయమగును.

ఇలాంటి శ్లోకమున శబ్దములు యాదృచ్ఛికముగా ఆశుకవిత్వమల్లే దొర్లినవికావు. భావము ఏదో ఒక "మానుషానంద" దృష్టితో గైకొన్నదికాదు, భావము బ్రహ్మానంద బంధురము, భాషాశ్రౌత లక్షణసంపన్నము. దీనిని మహాకవి కాళిదాసు పరమార్థ స్పృహతో శబ్ద సామాగ్రిని, భావప్రపాదానా పద్ధతిని, భాషా మర్యాదను శాస్త్ర సాంప్రదాయం నుండి గైకొని ఈ విధంగా రూపొందించాడు.

సంస్కృత సాహిత్యంలో అత్యంత ఖ్యాతి నార్జించిన పుస్తకం మయూరిని సూర్యశతకము. ఈ పుస్తకము అనేకమంది విద్వాంసుల దృష్టి నాకర్షించింది. సూర్యశతకానికి వ్యాఖ్యానాలు హెచ్చు సంఖ్యలోనే ఉన్నాయి. ఈ శతకానికి తెలుగు సేతలు దాదాపు ఎనిమిది వరకు ఉన్నాయి. వానిలో మహాకవి శ్రీ దాసుశ్రీరాములుగారి అనువాదం ప్రసిద్ధి గాంచింది. కవి సౌర్వభౌమ శ్రీనాధమహాకవి, జగన్నాధపండితరాయల వంటి వారిని యెంతో ఆకర్షించిన గ్రంథం సూర్యశతకము. దీనిలో కొన్ని పద్యాలు పింగళిలక్ష్మీకాంతం వంటి విద్వాంసులు తెలుగు చేశారు. ఈ పుస్తకం శేషేంద్రశర్మ లాంటి విద్వత్త్కవులను ఆకర్షించుటలో ఆశ్ఛర్య మేమిలేదు! "వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అనే గనుల్నుంచి త్రవ్వితీసిన మణులతో చెక్కిన మహత్తర శిల్పం సూర్యశతకం" అంటారు శేషేంద్రశర్మగారు. సూర్యశతకములోని విశేషాలను కొన్ని ఎత్తిచూపించారు పాఠకులకు. "సూర్యశతకము - ఒక అధ్యయనము" అను వ్యాసం ద్వారా. ఈ శతకంలో అక్కడక్కడా దర్శనమిచ్చే కాళిదాసమహాకవి ప్రభావాన్ని మనకు ఎత్తి చూపారు శేషేంద్రగారు.

విప్లవ కవిత్వము - సాహిత్య విమర్శ అనే వ్యాసంలో వ్యక్త పరచిన అభిప్రాయాల లోని సారాంశాన్ని పాఠకులీ విధంగా గ్రహింప వచ్చు. సాహిత్య విమర్శ కేవలం సాహిత్యాన్ని గురించి మాత్రమే కాని సాహిత్య కర్తను గూర్చి కాదు. విమర్శించే కావ్యంలో విమర్శకుడు మూడు విషయాలు పరిశీలించాలి. అవి : భాషా, అలంకారము, వస్తువు. వస్తువు అంటే కవి చెప్పదలచినది. కవి చెప్పే విషయ మేదైతే ఉందో, దేన్ని వస్తువంటున్నామో అదే అలంకారంగా మారుతుంది. దీనినే కావ్య మర్మ మంటారు. వస్తువు కావ్యానికి రంగు నిస్తుంది. విప్లవాత్మక వస్తువు తీసుకుంటే విప్లవ కావ్యం రూపొందుతుంది. కవికి కావ్యానికి చెందిన విశేషణాల్ని తగిలించడం శాస్త్రీయం కాదు. విప్లవ కవిత్వం వ్రాయటానికి షరతులు పాలించాల్సిన అవసరం లెదు. కవిత్వ మనేది రెండు విధాలుగా ఉత్పన్న మౌతుంది - స్వానుభూతిచేత, సహానుభూతిచేత. ఒక్కోసారి సహానుభూతే, అనుభూతి కంటే తీవ్రంగా సిద్ధిస్తుంది. నిత్య జీవనంలో అన్యాయం మీద చేసే తిరుగుబాట్లే అసలు విప్లవం! అన్యాయాన్ని, అసమానతను ఎదుర్కొనే చైతన్యం వలన పుట్టిన కవితయే నిజ మైన విప్లవ కవిత్వం. సాహిత్య విమర్శకుడి పాత్ర స్వప్రయోజనా పేక్ష విసర్జించి విప్లవ కావ్యాన్ని నిర్ధ్వంద్వంగా ప్రోత్సహించడం. సాహిత్య విలువలమీదా, సాహిత్య సూత్రాలమీద ఆధార పడి విమర్శ వ్రాయాలంటారు శేషేంద్రశర్మ.

గ్రీకు, భారతీయ నాటకాలలోని సామ్య వైషమ్యాలని తెలిపే వ్యాసం, గజల్ కవిత్వాన్ని గురించిన విశ్లేషణాత్మక వ్యాసాలు శెషేంద్రశర్మగారి పాండిత్య విస్తృతికి నిదర్శనలుగా పేర్కొన వచ్చును. తెలుగు కవుల గూర్చి వారు వ్యక్త పరచిన విశేషాలు పాఠకులు తెలుసుకొన దగినవి. తెలుగు కవులలో తిరుపతి వెంకటకవులు, గురజాడ అప్పారావు, పానుగంటి లక్ష్మీనరసింహారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహారావు, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, రాయప్రోలు సుబ్బారావు గార్లను గురించి విశ్లేషణాత్మక వ్యాసాలు వ్రాశారు.

ఈ వ్యాసాల్లో గమనించదగ్గ విశేషమేమిటంటే రాయప్రోలు సుబ్బారావుగారు తప్పక, మిగిలిన కవులు తమతమ నాటకముల ద్వారా, ఉద్యోగ విజయాల ద్వారా తిరుపతి వెంకటకవులు, పాదుకా పట్టాభిషేకం, గయోపాఖ్యానాల ద్వారా పానుగంటి, చిలకమర్తి వారు, అనేక నాటకాల ద్వారా ధర్మవరం రామకృష్ణాచార్యులు, కన్యాశుల్కం ద్వారా గురజాడ అప్పారావు గారు, ఆంధ్రదేశ మంతటా మారుమూల గ్రామాలలో సహితం పేరు ప్రఖ్యాతులు గడించారు. తిరుపతి వేంకటకవులు తమ అష్టావధాన, శతావధానముల ద్వారా రాజస్థానములలో సహితం అత్యంత ప్రఖ్యాతి గడించారు. వారిని గూర్చి " సాహిత్య రాజసూయంచేసిన దుర్ధర్ష ప్రతిభా దురంధరులు . . . వారి అపూర్వ కవితా శక్తి ముందు ఎవరూ నిలవలేక పోయారు. వారి పాండవ ఉద్యోగ విజయాల్లోని పద్యాలు ఒకటి రెండన్నా కంఠతా రాని తెలుగు వాడు లేడంటే అది అతిశయోక్తి కాదు" అంటారు శర్మగారు.

రాయప్రోలు సుబ్బారావుగారు కవిత్వంలో ఒక నూతన పద్ధతిని ప్రవేశ పెట్టారు. దానినే ఆ రోజుల్లో భావ కవిత్వంగా పేర్కొన్నారు. శేషేంద్రశర్మగారి దృష్టిలో రాయప్రోలు వారి కవిత్వంలో కీలకం వ్రక్రోక్తి. వాచ్యార్థం ఏక్కడా కనిపించదు. రాయప్రోలు వక్రోక్తి ఆత్మ కళ. ఒక కృత్రిమ కల్పన కాదు. "అమృతాం ఆత్మనః కళాం" అన్న భవభూతి మాటకు రాయప్రోలువారు రక్తమాంసాకృతి. రాయప్రోలు కవిత్వాన్ని గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే - ఆయన పద్యాలే మంత్రాలుగా జపించుకొంటూ వాటి మద్య మాధురిలో మునిగిపోయి, మళ్ళీ పునర్జన్మ లేనట్లుగా మనిషి తరించి పోవచ్చు" అంటారు శ్రీ శేషేంద్ర .

ముగింపు :

శ్రీశేషేంద్రశర్మగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ వ్యాసంలో చర్చించిన విషయాలన్నీ ఆ విషయన్ని దృఢ పరుస్తాయి. శర్మగారి ప్రతిభా విశేషాలు చర్చించేటప్పుడు మనం వారిని గూర్చిన కొన్ని అంశాలను విశేషంగా పేర్కొనక తప్పదు. శేషేంద్రశర్మగారికి సంస్కృత భాషా సాహిత్యలలో గల పాండిత్యం అసాధారణం. ముఖ్యంగా వారు మంత్ర తంత్ర శాస్త్రాలలో ఆర్జించిన జ్ఞానం అనితర సాధ్యమంటే, అది సత్య విదూరము కాదు. సమకాలీన ప్రపంచ సాహిత్య రీతులను గూర్చి శర్మగారి అవగాహన అత్యంత విస్తృత మైనది. తెలుగు భాషా సాహిత్యాల పైనేగాక శర్మగారు ఆంగ్లభాషా సాహిత్యాదులలో, హిందీ - ఉర్దూ భాషా సాహిత్యాలలో ఆర్జించిన జ్ఞానం శ్లాఘనీయం. శర్మగారి కవిత్వ తత్వం పేర్కొన దగినది. కవిత్వానికి వస్తు స్వరూపాన్ని బట్టి రూపం, రూపాన్ని అనుసరించి స్వభావం ఉంటుందని వారి నమ్మకం. అదే కవిత్వమని శేషేంద్ర ప్రకటించారు. అయితే శర్మగారు మనిషి తత్వాన్ని కవిత్వతత్వంగా మలచిన మహాకవి. దేశ పౌరుని ఆత్మ కథే ఆదేశ చరిత్ర అవుతుందని నిరూపించడానికే వారు ఆధునిక మహాభారతం వ్రాశారు. శర్మగారు శబ్దశక్తి తెలిసిన అలంకారికుడు. అందుకే "నేను శబ్దాల అణువులతో పద్యాలు చేస్తా, ఇసుక రేణువులతో చేసిన గ్లాసుల్లా మధుర ధ్వనులు పలికిస్తా" నంటారు శేషేంద్ర. రచనలో రస నిష్పన్నతలొ ప్రగతిని సాధించారు. శబ్దసౌందర్యముతోపాటు వాగార్థాలకు సన్వయాన్ని సాధించారు. శబ్దశక్తిని పూర్తిగా గ్రహించిన వారగుటచే శర్మగారు కవితా ప్రక్రియ లన్నిటినీ పద్యాలుగానే పేర్కొన్నారు. శేషేంద్రశర్మగారిలో మనం ఒక విధమైన దార్శనికత్వం పసికట్ట వచ్చు. ఆయనకు Modernity మీద ఒక గొప్ప విజన్ ఉంది. ఆయన రచించిన ఆధునిక మహాభారతం ఈ విషయాన్ని రూఢి చేస్తుంది. ఉపదేశాల వలన, ప్రబోధాల వల్ల సాహిత్యానికి ఎలాంటి మేలు జరుగదు అని ఆయన గట్టి నమ్మకం. అందుకే శర్మగారు నూతన కవితా ప్రక్రియా ప్రయోగానికి పూను కొన్నారు. వచన కవితా వాహికని ఉపయోగించి కావ్యాన్ని సృజించారు. ఆధునిక మహాభారత మనే కావ్యేతిహాసం మనలని మరోశకం ముందుకు నడిపించింది.

వారి రచనలు - స్వర్ణహంస, సాహిత్య కౌముది, షోడశి, కవిసేన మేనిఫెస్టో, కాలరేఖ విమర్శా సాహిత్యంలో కొత్త పంథాలను సృజించాయి. శేషేంద్రశర్మగారి సాహిత్య మీమాంస శక్తిని, పాండిత్య లోతుపాతులను పుటపర్తి నారాయణాచార్య, విశ్వనాథ సత్యనారాయణ లాంటి ఉద్దండులతో పాటు ఆంవత్స సోమసుందర్ లాంటి ఆధునికులు ప్రశంసించారు. శేషేంద్రశర్మగారిని 21వ శతాబ్దిలోని గొప్ప సాహిత్య వేత్తగా చిత్రించుట సమంజసమని ఈ వ్యాస రచయిత అభిప్రాయము. ఈ వివరణాత్మక వ్యాసం తయారు చేయుటలో శర్మగారి రచనలే కాక, అనేకమంది ఇతర రచయితల రచనలు చదువుటయేగాక, ఆయా రచయితల భావ సంపదను స్వేచ్ఛగా ఉపయోగించు కొన్నాను. ఆయా రచయిత లందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు ఇందుమూలంగా తెలియజేయడమైనది. ఈ వ్యాసం పాఠకుల అభిమానాన్ని చూరగొంటుందని ఆశిస్తాను.

2 comments:

  1. కొండని అద్దంలో చూపించారు. అపారశేముషీ ధురీణుడు, కవిత్వమే శ్వాసించి బ్రతికిన వాడు, ప్రతీ వాక్యమూ కవిత్వమయం చేసిన శేషేంద్ర గురించి ఎంత సంస్మరించినా తక్కువే.తనివితీరదు.మీకు ప్రత్యేక ధన్యవాదాలు

    ReplyDelete
  2. కొండని అద్దం లో చూపించారు. అశేష శేముషీ ధురీణుడు, కవిత్వమే శ్వాసించి బ్రతికినవాడూ, ప్రతీవాక్యమూ కవిత్వమయం చేసిన శేషేంద్ర గురించి ఎంత సంస్మరించినా తక్కువే.మీకు ప్రత్యేక ధన్యవాదాలు

    ReplyDelete