Friday 10 January 2014

Narla Venkateswara Rao (నార్ల వెంకటేశ్వర రావు)

భూమిక:

రామాయణాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించే వారికి దానిలో అనేక వైరుధ్యాలు దర్శన మిస్తాయి. ప్రప్రథమంగా రామాయణం జరిగిన విషయమా? అలాగైతే దానిని దృఢ పరిచే చారిత్రక ఆధారాలేమైనా లభ్యమైనవా? వాటి వివరాలేమిటి? అవి సత్యాన్ని వెల్లడించ గల్గినవా? ఏయేచరిత్ర కారులు ఎలాంటి నిష్కర్షలకు రాగలిగారు? అవి సమగ్ర వివేచనతో కూడి, తర్క సహిత మైన శాస్త్రీయ దృక్పథంతో కూడినవేనా?



పైన వివరించిన ప్రశ్నలు అనేక మేధావులను, ఆలోచనా పరులను చేసి కలచి వైచాయి. వారి నిరంతర పరిశోధనకు, కృషికీ కారణ మయ్యాయి. అలాంటి మేధావులలో నార్ల వెంకటేశ్వర రావుగారు (వి.ఆర్.నార్ల) పేర్కొన తగిన వారు.



నార్లవారు అర్థ శతాబ్దికి పైగా భావ ప్రకటనా స్వేచ్ఛకై అవిరాళ కృషి సల్పిన ప్రతిభాశాలి. తెలుగు ప్రత్రికా రంగంలో "ఎవరెస్టు" శిఖరాన్ని అధిరోహించిన అగ్రగణ్యులు (అతిరథుడు). అజ్ఞాన తిమిరం, మూఢ నమ్మకాలు, నియంతృత్వం మొదలైన సంఘ నిరోధక శక్తులకు విరుద్ధంగా అలసటెరుగని పోరాటం సల్పిన సంస్కర్త. అంతేకాదు, నార్లవారు కవీ, నాటక కర్త, వ్యాస రచయిత, పరిశీలనాత్మక విమర్శలో అందెవేసినచేయి. అనేక గ్రంథాలను రచించి పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన వారు. అంతటి విశిష్ట వ్యక్తి రామాయణాన్ని నిశిత విమర్శనా దృష్టితో పరిశీలించి, అనేకమంది విద్వాంసులు, చరిత్రకారులు, విమర్శకులు రామాయణాన్ని గురుంచి పరిశోధనలు జరిపి రచించిన పలు గ్రంథములను ఆ మూలాగ్రంగా చదివి, వానిలోని గుణగణాలను మూల్యాంకణము చేసుకొని, తమకు సమంజసమని తోచిన విషయాలను గ్రహించి, వాటిని స్వీయ పరిశోధనా విశేషాలతో మేళవించి రామాయణాన్ని గూర్చి కొన్ని నిశ్ఛిత అభిప్రాయాలను స్పష్ట పరచారు. ఆ వివరాలను పురస్కరించుకొని, రామాయణ కథా వస్తువు ఆధారంగా "జాబలి", "సీత జోస్యం" అను రెండు నాటకాలు వ్రాశారు.



ప్రస్తుత వ్యాసం "సీతజోస్యం" అను నాటకానికి సంబంధించినది. అందుచేత, రామాయణాన్ని గూర్చిన నార్ల వారి దృక్పథం తెలుసు కొనుట ఆవశ్యకమే కాక, సమంజసము కూడ. రామాయణాన్ని గురించి తమ పరిశోధనా వివరాలు, నిష్కర్షలు పాఠకులకు తమ పీఠిక ద్వారా అందజేశారు నార్లవారు. వివరాలన్నీ, రామాయణంలో నిజమెంత?, ఏది జన స్థానం?, ఎక్కడి లంక?, రాక్షసులెవ్వరు?, ఋషు లెవరు?, ఋషుల కుట్రలో రాముని పాత్ర అను శీర్షికల క్రింద అయిదు ప్రకరణాలుగా వర్ణితము లైనవి. వానిలోని ముఖ్యాంశాలను తెలుసు కొందాము.



రామాయణంలో నిజమెంత?



పై ప్రశ్నకు జవాబుగా ఈ వివరాలను స్పృజించారు నార్లవారు. వేదాలను చరిత్ర దృష్టితో పరిశీలిస్తే, వాటిలో పేర్కొన్న ఇక్ష్వాకునికి, రామాయణంలోని ఇక్ష్వాకునికి ఏమీ సంబంధము లేదని తెలుస్తుంది. ఋగ్వేదంలో ఒకసారి, అధర్వణ వేదంలో ఒక్కసారి, మొత్తం రెండుసార్లు వేదాలలో ఇక్ష్వాకుని ప్రసక్తి వున్నది. కాని ఇతడు రాముని వంశానికి మూల పురుషుడు కాడు. అలాగే, ఋగ్వేదంలో పేర్కొనబడిన సీత నాగేటి చాలు గాని, రామాయణ నాయిక కాదు. ఋగ్వేదంలోనే ఒక "ఋక్కు" లో "రామమ్" అనే మాట ఉన్నది. అయితే ఆమాటకు సాయనాచార్యుడు సందర్భాను సారంగా చెప్పిన అర్థం "రాత్రి" అని. ఇదే అర్థాన్ని తన ఋగ్వేద అనువాదంలో ఆర్.టి.హెచ్.గ్రిఫిత్ స్వీకరించాడు. ఋగ్వేదంలోని "లక్ష్మణ" శబ్దం "వేదిక్ ఇండెక్స్" వివరణ ప్రకారం ఒక దానశీలి తండ్రి పేరును సూచిస్తోంది. క్రీస్తు శకానికి పూర్వపు ఏశాసనంలోను రాముని ప్రసక్తి కనబడ లేదని మోరిట్స్ వింటర్ నిట్స్ వ్రాశాడు....



అలాగే సీతకు వ్యవసాయంతో గల సన్నిహిత సంబంధానికి సాక్ష్యంగా పారస్కర గృహ్య సూత్రాన్ని చూపించ వచ్చు. పొలం పైరుపై వుండగా "సీతయజ్ఞం" జరపాలని అది నిర్దేశిస్తున్నది. ఈ యజ్ఞానికి సంబంధించిన ఒక మంత్రం సీతను ఇంద్రుని భార్యగా సంబోధిస్తున్నది. జైనమత గ్రంథాలలో సహితం "సీతజన్నం" ప్రసక్తి వున్నట్లు పేర్కొంటూ జగదీశ్చంద్రజైన్ వాల్మీకి రామాయణానికి ఎంతమాత్రం చారిత్ర కాధారం లేదన్న తీర్మానానికి వచ్చాడు.



పైన పేర్కొనిన విధంగా అనేక మంది విద్వాంసుల పరిశోధన వలన తేలిన అంశాలను నార్లవారు తమ తార్కిక దృష్టితో పరిశీలించి, సమంజసమైన వాటికి తమ నిర్దిష్ట అభిప్రాయాలను మేళవించి ఈ క్రింది విధంగా వివరించారు. రామాయణంలో పేర్కొన బడిన విషయాలు నూటికి 75 వంతులు పుక్కిటి పురాణం మాత్రమే! మిగతా భాగం సహితం, సాధారణంగా అన్ని రాజ కుటుంబాలలో సింహాసనానికై కొనసాగే కుట్రలూ, కుహకాలు మొదలైనవి మాత్రమే! రాముడు వింధ్య పర్వతములను దాటి రాలేదు. రావణుడు గోండ్ రాజు కావచ్చు. లేదా మరొక ఆదివాసి తెగకు చెందిన రాజు కావచ్చు. అంతేకాని, రాక్షసరాజు అనుట ఉచితంగా తోచదు. ఆ విధంగానే రావణుని లంక, ఈ నాటి శ్రీలంక, ఒకటి కావు. రామాయణ యుద్ధాన్ని రెండు విభిన్న జాతుల మధ్య సంఘర్షణ అనుట కంటే ఆహారోత్పత్తి వ్యవస్థకు (Food Production Economy), ఆహార సేకరణ వ్యవస్థకు (Food Gathering Economy) మధ్య జరిగిన సంఘర్షణ అనడమే ఎక్కువ సమంజసము.



అదే విధంగా దండకారణ్య ప్రాంతానికి వ్యవసాయ విస్తరణతో రామునికి కొంత సంబంధము కలదు. కనుక రాముని భార్య పేరు సీత. కనుక, వేదకాలపు సీత మారి, మారి రామాయణం సీతగా పరిణ మించినట్లు చెప్పడానికి వీలు కలిగింది.



ఏది జన స్థానం? ఎక్కడి లంక?



ఆలోచనాపరులను రామాయణం జాగ్రఫీ ఎంతగానైనా తికమక పెడుతుంది! వనవాసానికి అయోధ్యలో బయలు దేరిన రాముడు సుదీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి చేరు కొనడానికి ఏదారులవెంట, ఏయేదిక్కులలో పయనించాడో, ఏయే నదీనదాలను, ఏయే పర్వతాలను, లోయలను దాటినాడో, మార్గ మధ్యంలో ఎక్కడెక్కడ ఎంత కాలం విశ్రమించాడో ఈ వివరాలలో దొసగులు కానరావు. ఉత్తర, వాయవ్య, ఈశాన్య భారతాలకు సంబంధించిన భౌగోళిక వివరాలు సవ్యంగానే వున్నాయి. దక్షిణ భారతం వద్దకు వచ్చేసరికి తప్పులు విశేషంగా కనబడు చున్నవి. దీనికి కారణం వాల్మీకి రచనకు ఇతరులు జోడించిన మార్పులేయని తెలియనగు చున్నది. మరీ హెచ్చు తప్పులు కిష్కింధా కాండ లోని 40, 41, 42, 43 సర్గలలో చోటు చేసుకున్నవి. రామాయణాన్ని విమర్శక దృష్టితో పరిశీలించిన పండితు లందరు ఇవి ప్రక్షిప్తాలని నిర్ణయించారు. ఒక ముఖ్య విషయాన్ని మనం గమనించాలి. సీతను చెరబట్టిన రావణుడు దక్షిణంగా వెళ్ళినట్లు రామ లక్ష్మణులకు జటాయువు స్పష్టంగా చెప్పాడు (అరణ్య కాండ, 68వ సర్గ) ఋష్య మూకను దాటి రావణుడు వెళ్ళడాన్ని తాను చూచినట్టు సుగ్రీవుడు స్వయంగా రాముడితో చెప్పాడు. అయినా, సీతాన్వేషణకై తక్కిన మూడు దిక్కులకు వానర బలగాలను సుగ్రీవుడు పంపిన కారణం తెలియుట లేదు. దీనిని బట్టి సుగ్రీవుని భౌగోళిక జ్ఞానం అతి తక్కువని మనం అంచనా వేసుకోవచ్చు. సుగ్రీవుని అంచనా మేరకు రావణుని లంక చేరాలంటే కిష్కింధ నుండి దక్షిణంగా బయల్దేరి, వింధ్య పర్వతాలను దాటి, నర్మద, మహానది, కృష్ణ ... కావేరిని దాటాలి, తామ్రపర్ణిని దాటి అటుపైన నూరు యోజనాలు సముద్ర యానం చేసి కాని లంకకు చేరరు. అంగదుని నాయకత్వాన బయలు దేరిన వానరులు వింధ్య పర్వతాలలో దిక్కు తోచక తిరుగుతూ ఉండగా వారికి సంపాతి తటస్థపడతాడు. లంక ఎక్కడ ఉన్నదీ అతడు వారికి వివరించి చెప్తాడు. దక్షిణ సముద్ర తీరంలోని వింధ్య పర్వత భాగం ప్రసక్తిని తెస్తాడు (కిష్కింధా కాండ 60వ సర్గ). కాని మనకు తెలిసిన వింధ్య పర్వత శ్రేణి దక్షిణ సముద్రము వరకు విస్తరించదు. కాబట్టి ఆ తీరంలో మరో వింధ్య పర్వత శ్రేణి ఉన్నట్లుగా మనం ఊహించు కోవాలి!



లంకపై దండ యాత్రకు రాముడు హనుమంతుడు, జాంబవంతుడు వెళ్ళిన మార్గాననే వెళ్ళి వుండాలి కదా? కాని రాముడు వింధ్య పర్వతాలను దాటినట్లు యుద్ధకాండ చెప్పడం లేదు. ఈ విధంగా రామాయణం లోని జాగ్రఫీ, ముఖ్యంగా దక్షిణ భారతం జాగ్రఫీ అనేక సందేహాలను కలిగించి ప్రశ్నలను రేకిత్తి స్తున్నది. "రామాయణ విషయమై, అంతకంటే ముఖ్యంగా లంక విషయమై జరిగిన - జరుగుచున్న ఈ భిన్న వివాదాలలో నాకు ఏదీ నచ్చ లేదు. నాకు నచ్చిన వాదం – ఇదే, ఎవరైనా శ్రద్ధాసక్తులతో పరిశీలించ దగువాదం - రావణుని లంక వింధ్య పర్వత పరిసరాల లోనే ఎక్కడో వున్నట్లు చెప్పేది మాత్రమే!" లంకను గూర్చి వివాద చర్చను ముగిస్తూ, నార్లవారు ఈ క్రింది విషయాలు దృఢ పరచారు: రెండూ, రెండున్నర వేల సంవత్సరాల నాటి గ్రీకు రచయితలు చరిత్రలో సింహళాన్ని "తామ్రపర్ణి" గా పేర్కొన్నారు. అశోకుని కాలం నాటి భారతీయులకు తెలిసినది కూడా, "తామ్రపర్ణి" మాత్రమే! శ్రీలంక కాదు. అంతేకాక, భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడైన "వరాహ మిహిరుడు" లంకను, సింహళ ద్వీపాన్ని విడి విడి ద్వీపాలుగా పేర్కొన్నాడు. మరియు, కిష్కింధ ఉజ్జయినికి ఆగ్నేయ దిశలో ఉండేదని వ్రాశాడు. లంక అనే పదం తెలుగు నుండి సంస్కృత భాషలోనికి వెళ్ళిన మాట అని కొంతమంది భాషాశాస్త్రజ్ఞులు అభిప్రాయం వ్యక్త పరచారు. క్రీస్తుశకం అయిదవ లేదా ఆరవ శతాబ్దికి చెందిన "కౌముది మహోత్సవ నాటకం" కిష్కింధ, పంచవటి మొదలైన వన్నీ వింధ్య పర్వత ప్రాంతములో వున్నట్లు వివరిస్తున్నది. లంకాపురి సముద్ర తీరాన త్రికూట పర్వతంపై వున్నట్టుగా రామాయణం వివరిస్తున్నది. కాని, సింహళం ఉత్తర తీరంలో ఒక్క పర్వతమైనా లేదు. సింహళం రావణుని లంక కాదనటానికి పైన పేర్కొనిన కారణాలు చారిత్రకాంశాలుగా పరిగణించ వచ్చును.



రాక్షసులెవరు?:



ఈ ప్రశ్నకు సమాధానంగా నార్లవారు అనేక విశేషాలను వివరించారు. వారి పరిశీలనాను సారంగా ఋగ్వేదంలో, అధర్వ వేదంలో, మరికొన్ని వైదిక గ్రంథాలలో రాక్షసుల ప్రసక్తి విశేషముగా వున్నది. ఈవిషయం అవినాశ చంద్ర దాస్ అనే రచయిత "ఋగ్వేదిక్ కల్చర్" అనే తన పుస్తకంలో క్రోడీకరించారు. ఆయన క్రోడీకరణ ప్రకారం, రాక్షసులు కుక్కల, రాబందుల, గుడ్ల గూబల ఆకృతులలో వుంటారు. ఒక చోటు నుండి మరొక చోటికి పిట్టల వలే ఎగిరి పోతూ వుంటారు. అవసరాన్ని అనుసరించి వివిధ రూపాలు ధరించినా, మానవాకృతిలోనే వారు అధికంగా వుంటారు. అయితే ఏదో ఒక వైకల్యం తప్పదు, వికారం తప్పదు, వైపరీత్యం తప్పదు. కొందరికి మూడు తలలు, కొందరికి నాలుగు కళ్ళు, కొందరికి చేతులపై కొమ్ములు ఇత్యాదులు సహజ లక్షణాలు. యజ్ఞ యాగాలను రాక్షసులు ధ్వంసం చేస్తారు.... పచ్చి మాంసం తింటారు, నరమాంసాన్ని ఎక్కువ ఇష్ట పడతారని చెప్ప బడినది. ఒక్క అగ్ని దేవుడంటేనే వారికి భయం. అందుచేత రాక్షసుల పీడ తప్పించడానికి అగ్ని దేవుని దీటగు వారు మరి ఎవ్వరూ లేరు! "అసుర" అనే పదం ఋగ్వేదంలో దుష్టార్థంలో ప్రయోగించ బడినది. (రమేశ్ చంద్ర దత్) ఆర్యులలో ఇండియాకు చేరిన శాఖ వారికి (ఇరాన్‌లో స్థిర పడిన వారికి) "అహుర" అనే పేరుతో అసురుడు దేవాది దేవుడుగా నిలిచాడు! అనంత ప్రసాద్ బెనర్జీ శాస్త్రి వాదన ప్రకారం ఇండియాకి తొలిగా వలస వచ్చిన ఆర్యులు వరుణ దేవుని చలువతో సముద్ర మార్గం వెంట వచ్చారు. వారు వచ్చింది అసీరియా నుండి కాబట్టి వారికి అసురులనే పేరు వచ్చింది. వారు నిర్మించిన అసుర నాగరికతే హరప్పా మొహెంజోదారోలు ప్రధాన కేంద్రాలుగా సింధులోయలో పరిఢ విల్లింది.



లోతుగా పరిశీలిస్తే "పర జాతుల పట్ల ఆర్యుల వైర విద్వేషాల నుంచి, వారి భయ విభ్రాంతుల నుంచి పుట్టుక వచ్చిన వారే రాక్షసులైనా, పిచాచులైనా, వేద కాలం నాటి ఆర్యులు, అంతకు పూర్వమే ఇక్కడ స్థిర పడిన వారితో హోరాహోరిగా సంఘర్షించ వలసి వచ్చింది. ఆయుధ బలంలో ఆధిక్యం తమదే, యుద్ధ పద్ధతులలో పైచేయి తమదే. అయితే, సంఖ్యా బలం తక్కువ అందువల్ల పైకి ఎంత ధైర్యంగా కనబడినా, లోలోపల భయం వారిని పీడిస్తూనే వుండేది.... అవధు లెరుగని క్రౌర్యం ద్వారా అన్య జాతుల వారిని జయించ కోరి నప్పుడు వారి పట్ల జుగుస్స పెంచుకోవాలి. ఇది మానవ స్వభావం. ఇందుకు అనుగుణంగానే ఋగ్వేద కాలం నాటి ఆర్యులు ప్రవర్తించారు. తమతో పోల్చినప్పుడు ఇక్కడి అనార్య జాతుల వారే అన్ని విధాలా ఎక్కువ నాగరికులు. అయినా, లేని పోని ఘనతను తమకు తామే ఆపాదించుకొని, ఇక్కడి వారి రూపు రేఖలను, వేష భాషలను, ఆచార వ్యవహారాలను, వారికి సంబంధించిన సమస్తాన్నీ నిరసించారు, నిందించారు.... ఇక్కడి వారు ఏవిధంగా చూచినా నీచ జనులట; మానవులుగా సంభావించ డానికైనా తగని వారట! ఆర్యులు వలస రావడానికి పూర్వం ఇక్కడ స్థిర పడిన వారిలో ... ద్రావిడు లున్నారు వీరందరినీ కలగా పులగం చేసి, దాసులనీ, దస్యులనీ, ఆర్యులు వీరికి నామ కరణం చేసారు... వారిని రాక్షసులుగా, పిశాచులుగా వర్ణించి వారితో పోరాటం మొదలెట్టారు. (రామప్రసాద్ చాందా. మానవ వికాస శాస్త్రవేత్త) ... వైదిక వాఙ్మయం నిషాదులుగా పేర్కొన్న వారు వింధ్య పరిసరాలలో, ఛోటానాగపూర్ ప్రాంతంలో, బస్తరులో, ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్ ఈశాన్య దిశలో నివసిస్తున్న మూండా, గోండ్, సవర, చెంచు, ఖోండ్ మున్నగు తెగల వారు. ఈ తెగల వారిలో కొందరు ఆర్య, ద్రావిడ కుటుంబాల భాషలను యాసతో మాట్లాడుతున్నా అవి వారి స్వభాషలే.... ఇంత దూరం వచ్చినా, రాక్షసులెవరో చెప్పక పోవడానికి కారణం - కచ్చితంగా చెప్ప గలిగింది ఏమీ లేక పోవడమే! రాక్షసులు ఆర్యులు కారంటే, మరి వారెవరు? ఆర్యుల మతాన్ని సాంప్రదాయాలను వ్యతిరేకించి నందున ఆర్య సంఘం నుంచి వెలివేయ బడిన వారా? రామాయణాన్ని విమర్శక దృష్టితో పరిశీలించిన వారిలో అది పేర్కొంటున్న రాక్షసులు ద్రావిడులు కావచ్చునని అధిక సంఖ్యాకులు, కాదు నిషాదులని తక్కిన వారు తీర్మానిస్తున్నారు. ఈఅధిక సంఖ్యాకుల దృష్టిలో సింహళ ద్వీపమే రావణుని లంక. అయి నప్పుడు ద్రావిడులే రాక్షసులని తీర్మానించడం సహజమే....



నార్ల వారి దృష్టిలో రాక్షసులు ఏదో ఒక తెగకు, లేదా ప్రాంతానికి చెందిన వారు కారు. ఎక్కడ వైర విద్వేషా లుంటే. ఎక్కడ భయ విభ్రాంతులుంటే, అక్కడ రాక్షసు లుంటారు. రాక్షసులు దేశ దేశాలవారి కున్నారు. ఇప్పుడు మన ప్రశ్న రామాయణం రాక్షసులు ఎక్కడి వారని? సింహళద్వీపం రావణుని లంక కాదని గుర్తిస్తే, రాక్షసరాజ్యం కోసం చూడ వలసినది వింధ్య పర్వతాలకు ఉత్తర దిశలో, లేదా ఆపర్వతాల పరిసర ప్రాంతాలలో. ఎం.వి.కిబే, జి.ఎన్.హిరాలాల్, టి.పరమశివ అయ్యర్, టి.అమృతలింగం, డి.ఆర్.మన్‌కడ్ ప్రభృతులు రామాయణం లోని రాక్షసులు మధ్య భారత ప్రాంతానికి చెందిన వారని అభిప్రాయ పడ్డారు. రామాయణ యుద్ధానికి రంగం మధ్య భారతమని, ప్రత్యేకించి వింధ్య పరిసర ప్రాంతమని గుర్తించిన నాడు, ఆయుద్ధం జరిగింది నిషాద జాతికి చెందిన ఏదో ఒక తెగతో అని సంభావించడానికి ఎక్కువ అవకాశా లున్నాయి.



ఋషులెవరు?



ఈప్రశ్నకు టూకీగా సమాధాన మివ్వక అతిదీర్ఘ చర్చకు ఉపక్రమించారు నార్లవారు. ఒక లోకోక్తిని బట్టి నదీ మూలాన్నీ, ఋషిమూలాన్నీ విచారించరాదు. అంటూనే, ఋషులను గూర్చిన దీర్ఘ చర్చ జరిపారు దేశదేశాల నాగరికతల చరిత్రను చదివిన వారు కనుక, ఒక నగ్న సత్యాన్ని పాఠకుల ముందుంచారు. అదేమంటే, ఈ నాడు మనం డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, శాస్త్రజ్ఞులుగా పరిగణిస్తున్న వారు అలనాటి మంత్ర వేత్తలని, మానవ చరిత్రలో పసుపోషణ వ్యవస్థ, వ్యావసాయిక వ్యవస్థ, ఒకదాని తరువాత మరొకటి నెలకొన్న తర్వాత, విద్యా, వైజ్ఞానిక విషయాలను గురించి, ఆలోచనలు చేయడానికి, పరిశోధనలు జరపడానికి కొందరికి విరామం లభించింది. వీరిలో అధికులు మేధావు లైన వారే, దేవతలకు పూజారు లైనారు, రాజులకు పురోహితు లైనారు. అగ్ర వర్ణాల, వర్గాల పౌరులకు విద్యా గురువు లైనారు. అన్ని రకాల అవిష్కరణలు, అభివృద్ధి సాధించిన వారు ఈ అగ్ర వర్గాల విద్యా గురువులే. అయితే, ప్రజా బాహుళ్యానికి సంబంధించినంత వరకు తమకు తెలిసిన విద్యలను గుప్తంగా ఉంచారు. తమ ప్రధాన పోషకులకు సహితం తమకు తెలిసిన విషయాలు విడమర్చి చెప్పలేదు. అమోఘ శక్తులను, సర్వజ్ఞతను తమకు ఆపాదించుకొన్నారు. ఋషుల నడవడి, పూజారి వర్గం వైఖరికి భిన్నమైనది కాదు. "ఋషి అనగానే అతడు సర్వసంఘ పరిత్యాగి అని మనం భావిస్తాం. ఇది మన పౌరాణిక ఋషుల విషయంలో వలె, మన వైదిక ఋషుల విషయంలో సహితం నిజం కాదు.



అంగిరసుడు, అగస్త్యుడు, భృగుడు, భరద్వాజుడు, వసిష్ఠుడు, విశ్వామిత్రుడు మొదలైన వారు వేద వేదాంగాలలో వలె, పురాణేతిహాసాలలో మనకు తటస్థిస్తారు. ఇవి వంశ నామాలు కాబట్టి, వీరికి సంబంధించిన ఏ వృత్తాంతమైనా, ఏ విశేషమైనా, ఒకే వ్యక్తికి సంబంధించింది కావడానికి వీలు లేదు. వీరి పుట్టు పూర్వోత్తరాలను గురించి అనేక రకాల కథలు ఉన్నవి. అగస్త్య, వసిష్ఠ, విశ్వామిత్రులు గాని, అత్రి భరద్వాజులు గాని, సన్యాసులు కారు. సంసారులే! శరభంగుడు, సుతీక్ష్ణుడు, సుదర్శనుడు, ధర్మభృత్తు మున్నగు వారు సంసారులని రామాయణం స్పష్టంగా చెప్పక పోయినా, వారు సహితం సన్యాసు లైనట్లు తోచదు. వేదాలలో గాని, దశోపనిషత్తులలోగాని "సన్యాసి" "పరివ్రాజకుడు" అనే మాటలు కన బడవు. ఋగ్వేద కాలం నాటి ఋషులకు, ఉపనిషత్తుల కాలం నాటి వారి దృక్పథానికి విశేష వ్యత్యాసం గోచరిస్తుంది. పురాణ కాలం నాటికి, ఈ వ్యత్యాసం మరింత పెరిగింది. ఋగ్వేదాన్ని చదివితే ఋషుల యజ్ఞాలు, యాగాలు, క్రతువులు మొదలైన వన్నీ ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుర్దాయం కోసమేనని మనకు తెలుస్తుంది. అంతేతప్ప "ఈ జగం మిధ్య" అనలేదు. "ఈ బ్రతుకు బుద్బుద ప్రాయం" అనలేదు. ఆ సిద్ధాంతాలను ప్రతి పాదించిన వారు ఉపనిషత్తుల నాటి ఋషులు. వారిలో అతి ముఖ్యుడైన యాజ్ఞవల్క్యుడు పారమార్థిగ సత్యంగా "ఆత్మే సర్వస్వం" అని జనక మహారాజుకు బోధించాడు. కాని, పారమార్థిక సత్యం కడుపు నింపదు కాబట్టి, వ్యావహారిక సత్యాన్ని పాటించి, ఆ మహారాజు నుంచి పదివేల గోవులను దానంగా పుచ్చుకొన్నాడు. తన కాలంలో యాజ్ఞవల్క్యుని మించిన వేదాంతి లేడు (దేవీ ప్రసాద్ చట్టోపాధ్యాయ). ఇచ్చట మనం రామాయణ ఋషులను గురించి మాత్రమే కొంత తెలుసు కుందాము. ఋగ్వేదంలో పేర్కొన బడిన అగస్త్యుడు, వసిష్ఠుడు, రామాయణంలో సహితం ప్రముఖ పాత్ర వహిస్తారు. అయితే వారే వీరు కాదు. ఆ మూల పురుషుల వంశానికి చెందిన వారు. ఈ విషయమై డి.డి.కోశాంబి తన పుస్తకంలో అనేక విషయాలు పేర్కొన్నాడు. కోశాంబి పరిశోధనల ప్రకారం, గోత్ర ఋషులు ఎనిమిది మందిలో ఒక్క విశ్వామిత్రుడే స్వచ్ఛమైన ఆర్యుడు, తక్కిన వారు మిశ్ర సంతానం. అత్రి, అగస్త్యాదుల విషయంలో రామాయణం "ఋషి", "ముని", "తాపసి" అనే వాటిని పర్యాయ పదాలుగా ప్రయోగించింది. కాని ఈ పదాల మధ్య అర్థ భేదాలు వున్నవి. కేవలం ఋషినే తీసుకొన్నా - వేద కాలంలో అతడు యజ్ఞయాగాదులను చేసేవాడు, ఉపనిషత్తుల కాలం వచ్చేసరికి, యజ్ఞయాగాదులను విరమించి వాదోప వాదాల పట్ల శ్రద్ధ వహించాడు. మునులనేవారు మౌనాన్ని పాటిస్తూ, ఏదో మంత్రాన్ని జపిస్తూ పోయేవారు. తాపసులనే వారు శరీర క్లేశాల ద్వారా నిర్లిప్తతను సాధించడానికి యత్నించే వారు. విభిన్న మైన ఈ ఆధ్యాత్మిక సాధనలను పరిపాలించే వారిని "ఒకే కాడి క్రింద కట్టడం" భావ్యం కాదని నార్ల వారి అభిప్రాయం. అంతేకాక, దండకారణ్యములోని ఆర్యులను వాన ప్రస్థులుగా పెక్కుచోట్ల రామాయణం పేర్కొంటున్నది. వానప్రస్థా శ్రమాన్ని వనాలలోనే గడపాలంటే, ఆర్య ప్రాంతాలలో అవి లేనట్లు దండకారణ్యానికే ఎందుకు వెళ్ళాలి? తమ కథనం ప్రకారమే అక్కడి వారు ఘోర రాక్షసులు, నరమాంస భక్షకులు. వారి మధ్యకు కావాలని వెళ్ళటం దేనికి? ప్రాణాపాయం ఆహ్వానించడం దేనికి? ఇన్ని ప్రశ్నలకు అవకాశ మివ్వటంతో పాటు, దండకారణ్యంలోని ఋషులను గురించి రామాయణం వింతలను, విడ్డూరాలను పెక్కింటిని పేర్కొంటున్నది. ఉదాహరణకు వైఖానసులనే ఋషులు బ్రహ్మదేవుని గోళ్ళనుండి, వాలఖిల్యులు ఆయన రోమాలనుంచి పుట్టిన వారుట! ... ఆధ్యాత్మి కోన్నతిని కోరి, కఠోర సాధనలు చేసినా, వీరు ఆయుధాలను విసర్జించినట్లు కనబడదు. విశ్వామిత్రునికి తెలియని అస్త్ర శస్త్రాలు లేవని ప్రసిద్ధి. కావాలంటే, కొత్తవాటిని ఆయన పుట్టించ గలరట! (బాలకాండ, 21వ సర్గ) పైగా ఈ ఋషులకు సకల దివ్య శక్తులూ ఉన్నాయి. వారు త్రికాలజ్ఞులు. ఎంతటి శాపమైనా యివ్వగలరు. అయినప్పుడు రాక్షసులకు ఏదో శాపం యిస్తే, తమకు వారి పీడ వదిలేది కదా? ఆపని చేయక రాముని రక్షణ కోరడం దేనికి? ఇదే ఋషులు పన్నిన కుట్ర! ఈ కుట్రలో రాముడు షరీకు అయినాడు.!



ఋషుల కుట్రలో రాముని పాత్ర:



నగర సంబంధమైనది నాగరికత. ఆటవికులకు నగరం నచ్చదు. అందుకే వారు నగరాలు నాశనం చేస్తారు. క్రీస్తుశకం అయిదవ శతాబ్ది నాటికి తెలిసిన ప్రపంచంలో అధిక భాగాన్ని జయించిన "హూణులు" నగరాలను ధ్వసం చేసి ఆరు బయట డేరాలను వేసుకొని వాటిలో బ్రతుకుతూ వుండేవారని చరిత్రలో చెప్ప బడినది. నగరానికి, నగర జీవనానికి వారు అలవాటు పడ్డానికి చాలాకాలం పట్టింది. ఋగ్వేద కాలంలో ఇచ్చటికి వచ్చిన ఆర్యులు ఆటవికులు కాక పోవచ్చు గాని, ఆటవిక స్థితికి ఒకటి రెండు మెట్లు పైగా వున్నటువంటి వారు. అందువల్ల హరప్పన్ నగరాలను వారు ధ్వంసం చేయుట ఆశ్చర్య జనకం కాదు. కాని, వారు వ్యావసాయిక వ్యవస్థను ఎందుకు నాశనం చేసినది తెలుసు కొనుట కొంత కష్ట తరమైన విషయం. ఋగ్వేదాన్ని పరిశీలిస్తే - అందులో కృత్రిమ రోధస్సులను (చెలియలి కట్టలు మున్నగునవి) ఇంద్రుడు తెగ గొట్టగా వాటి రాళ్ళు రథచక్రాల వలె దొర్లుకు పోయినవని, అటు తర్వాత నదీ జలాలు నిరాటంకంగా ప్రవహించాయనీ స్పష్టంగా పేర్కొన బడినది. "వృత్రహుడు" అంటే ఆనకట్టలు తెగ గొట్టు వాదని అర్థము చెప్పబడినది.



ఆన కట్టలపై ఆర్యులకు కోపకారణం ఆనాటి హరప్పన్ వ్యవసాయ పద్ధతి. అది వరదసాగు పద్ధతిగా పేర్కొన బడినది. వ్యవసాయం కోసం హరప్పనులు ఆనకట్టలు కట్టారని మనం భావించవచ్చు. పసు పాలన ప్రధాన జీవికగా గల ఆర్యులు ఆలమందల మేతకొరకు చదరపు భూమి అవసరమై ఈ ఆనకట్టలను (హరప్పన్ రైతులు అడ్డుపడుతుండగా) తెగగొట్టటం ఒకగడ్డు సమస్యగా పరిణమించింది. పసుపోషణ కోసం ఒక ఘట్టంలో ఆనకట్టలను ఆర్యులు, మరొక ఘట్టంలో వ్యవసాయ విస్తరణ కోసం అడవులను తగల బెట్టడం మొదలు పెట్టారు! సప్త సింధు ప్రాంతంలో స్థిర పడిన కొంత కాలానికి వారి జన సంఖ్య పెరిగి వుండాలి. వారు విస్తరించ గల్గింది ప్రాగ్దిశకే. అది గంగా యమునల ప్రాంతం. వర్షపాతం అధికంగా వున్న ప్రాతం; అక్కడ స్థిర నివాసం ఏర్పరచు కోవలెనన్నా, వ్యవసాయం మొదలు పెట్టాలన్నా అందుకు ముందుగా చేయవలసిన పని అక్కడి అడవులను తగల బెట్టడమే. ... మరి కొంత కాలం తర్వాత అరణ్యాలను దగ్ధం చేస్తూ తూర్పు దిక్కుకు ఆర్యులు ఏ విధంగా విస్తరించారో శతపథ బ్రాహ్మణం లోని ఒక ఘట్టం విశదీకరిస్తున్నది (డి.డి.కోశంబీ). ...



ఇక్కడ ముఖ్యంగా పేర్కొన దగిన విషయం రామాయణంలో మనకు దర్శనమిచ్చే విశ్వామిత్రుడు, భరద్వాజుడు, అత్రి, శరభంగుడు, సుతీక్ష్ణుడు, సుదర్శనుడు, అగస్త్యుడు మొదలగు ఋషులు ఆశ్రమాల పేరుతో దండకారణ్యంలో వ్యవసాయ క్షేత్రాలని నెలకొల్పినారని, వాటిని నెలకొల్పడానికి ముందు యజ్ఞయాగాదుల పేరుతో దండకారణ్యంలో విశాల ప్రాంతాలని దగ్ధం చేశారని, ఈవిషయం శతపథ బ్రాహ్మణాన్ని విమర్శాత్మక దృష్టితో పరిశీలిస్తే తెలుస్తుంది. వాజపేయం మొదటిలో అన్న పానీయాలకు సంబందించిన యజ్ఞమని ప్రజాపతి చెప్పాడట. ఈ యజ్ఞ సందర్భంలో మరుత్తుల స్తోత్రం జరుగుతుంది. మరుత్తులు కర్షకులని, కర్షకులే అన్నదాతలని శతపథ బ్రాహ్మణం స్పష్టం చేస్తున్నది. మానవుడు నాగరికుడు కావడానికి ముందు రెండు వ్యవస్థల గుండా పయనించాలి. వాటిలో మొదటిది ప్రాకృతావస్థ (శావేజరీ), రెండవది బర్బరావస్థ (బార్బరిజం). దండకారణ్య వాసులను (రాక్షసులన్న పేరుతో) ప్రాకృత వ్యవస్థను దాటని వారిగా కొన్ని చోట్ల రామాయణం సూచిస్తున్నది; వారు అయోధ్యావాసులను మించి పోగల నాగరికులైనట్లు కొన్ని చోట్ల పేర్కొంటున్నది. కాని, నిజానికి అక్కడి వారు బర్బరావస్థకు చెందినవారు. ప్రాకృతావస్థకు చెందినవారై తే వారు నరమాంస భక్షకులు కావాలి. కాని, నరమాంస భక్షకులుగా రామాయణం విస్పష్టంగా పేర్కొన్నట్టి వారు విరధుడు, ఇల్వలుడు, వాతాపి, కబంధుడు మాత్రమే. అందువలన రాక్షసులు నరమాంస భక్షకు లనడం, వారు ప్రాకృత వ్యవస్థకు చెందిన వారనడం నిరాధారమైన నిందలుగానే పరిగణించాలి. రామాయణన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, దండకారణ్యము లోని వారు ఆహారసేకరణ వ్యవస్థకు చెందిన వారని తెలుస్తుంది.

పినతల్లి కైకేయి కోర్కె ప్రకారం తాను వనవాసానికి పోనున్నట్టు తల్లి కౌసల్యకు చెబుతూ రాముడన్న మాట దండకారణ్యములో తాను "తేనె, గడ్డలు, దుంపలు, పండ్లు" తింటూ కాలక్షేపం చేయబోతున్నానని (అయోధ్యాకాండ, 20వ సర్గ). సరిగ్గా ఇదేమాటను రాముడు గుహునికి సహితం చెబుతాడు (అయోధ్యాకాండ, 50వ సర్గ). అరణ్య వాసాన్ని గడపడానికి చిత్రకూట పర్వత ప్రాంతం ఉత్తమ మైనదని "మీకు కావలసిన తేనె, దుంపలు, పండ్లు" అక్కడ సమృద్ధిగా లభిస్తాయని భరద్వాజుడు చెబుతాడు (అయోధ్యాకాండ, 54వ సర్గ). దండకారణ్యములోని ఆటవికులు తమ పద్ధతి ప్రకారం తాము బ్రతకాలని మాత్రమే కోరుకొని ఉండాలి (ఆహార సేకరణ విషయంలో) కాని, అకోర్కెను ఆర్య ఋషులు సాగనివ్వ లేదు. గంగా, యమున ప్రాంతం నుంచి ఆర్యౠషులు దక్షిణాదికి క్రమంగా విస్తరించారు. దండకారణ్యంలో ఆశ్రమాలను స్థాపించారు. యజ్ఞ యాగాదుల పేరుతో విస్తృత ప్రాంతాలను దగ్ధం చేశారు; దగ్ధం చేసిన ప్రాంతాలను వ్యవసాయ క్షేత్రాల క్రింద మార్చారు. వ్యవసాయానికి కావలసిన పసు సంపదను రాజుల నుంచి గోదానం రూపంలో సంపాదించారు. వ్యవసాయానికి కావలసిన కార్మికులను ఛాత్రుల రూపంలో సమీకరించారు. ఇక్కడ గమనించ వలసిన ముఖ్య విషయమిది; దండకారణ్యానికి వలస వచ్చిన వారి ఆర్థిక వ్యవస్థ స్థానికుల వ్యవస్థకు పూర్తిగా విభిన్న మైనట్టిది. వలస వచ్చిన వారు అరణ్యాలను దగ్ధం చేయాలి, లేకపోతే తాము కోరినట్టు ఆహారోత్పత్తిని వారు కొన సాగించలేరు. స్థానికులు అరణ్యాల దగ్ధ కాండను నిరోధించాలి లేకపోతే, ఆహార సేకరణ వారికి అసాధ్యం కాగలదు. ఈ విభిన్న జీవిత విధానాల మధ్యగల ఈ వైషమ్యం, వారి మధ్య సంఘర్షణను అనివార్యం చేస్తుంది. ఈ విషయంలో రాముని సహాయం పొందడానికి ఋషులు కుట్రను పన్నారు. రామాయణాన్ని (వాల్మీకి కృతిగా సంస్కృతంలో ప్రచారంలో ఉన్నదాన్ని) విజ్ఞుల వలె చదివితే మీకు విదిత మవుతుంది. వాల్మీకి రామాయణం (సంస్కృత మూలము) విశేషించి అరణ్య కాండ లోని తొమ్మిదవ, పదవ సర్గలను పరిశీలిస్తే సీతాదేవి ఆటవికులను గూర్చి భర్తతో వాదించిన విధానము మనకు విదిత మవుతుంది గమనించండి. "ఈ ఆటవికులు మనకు ఏమి అపకారం చేస్తున్నారని భర్తను ప్రశ్నిస్తుంది. ఈ స్థానికులను చంపటమే పనిగా పెట్టుకొనడం మీకు తగునా? తప్పు లేని ప్రజలను హింసించుట ఘోరమని చెబుతుంది. మనతో వైరము లేక దండకారణ్యమున వున్న వారిని, తమ బ్రతుకు తాము నెమ్మదిగా బ్రతుకు తున్న వారిని చంపడం అతిఘోరమని హెచ్చరిక చేస్తుంది. బొంకు లాడడం మహా పాతకం కాగా, పరదారాభిగమనం, వైరం లేకుండా సంహారం మరింత నికృష్టమైన పాపాలని, ఈ చివర పాపాన్నే మీరు చేస్తున్నారని భర్తతో అంటుంది. సీత పలుకులకు రాముడు "నేను ప్రాణాల నైనా విడుస్తాను, నిన్ను విడుస్తాను, లక్ష్మణుని విడుస్తాను అంతే తప్ప, ఋషులకిచ్చిన మాటలను విడువను" అని ప్రత్యుత్తర మిస్తాడు. రామాయణాన్ని భక్తి భావంతో కాక, విచక్షణా దృష్టితో చదివి నప్పుడు పఠితలకు రామాయణం లో ఆహారోత్పత్తి, ఆహార సేకరణ వ్యవస్థల మధ్య సంఘర్షణ స్పష్టంగా గోచరిస్తుంది. అప్పుడు దండకా రణ్యము లోని కుట్రలో రాముని పాత్రను సరిగా అర్థం చేసుకో గలుగుతారు.



ఆయుధాల ప్రశ్న:



రామాయణ కాలంలో ఆయుధాలను గురించి కొంత తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. ఒక విషయం మాత్రం అందరికీ తెలుసు. రామునికి సంబంధించి నంత వరకు ఆయన ప్రధాన ఆయుధం కోదండం అని. అందు వల్లనే ఆయనకు "కోదండ రాముడు" అనే బిరుదు వచ్చింది. కోదండం తోపాటు ఆయన ఖడ్గాన్ని కూడా వినియోగించే వాడని పేర్కొంటారు. అయితే దాని ఉపయోగం సకృత్తుగానే అని మనం గ్రహించాలి. ఆకాలంలో కోదండం, కార్ముకం, అస్త్రము, చాపము, ధనువు, ధన్వము, ధనస్సు, సింగాణీ, అనే పదజాలం కూడా వాడుకలో వున్నట్లు చెప్పబడినది. ధనుస్సులకు వేరువేరు పేర్లు వున్నట్లు తెలియు చున్నది. ధనుస్సు త్రివిధము - టంకార ధనువు, ఝంకార ధనువు, మహాధనువు అని. ఆయుధాలకు, ఆయుధ ప్రయోగానికి సంబందించిన విద్యను "ధనుర్వేద సంహిత" అని పేర్కొన్నారు. రాముడు వినియోగించే ధనుస్సు ఏదో మనకు స్పష్టంగా తెలియదు. విశ్వామిత్రుడు రామునికి ఏవో దివ్యాస్త్రములను మంత్రోపదేశం ద్వారా అందజేసాడని రామాయణంలో చెప్పబడినది.



లంకలో జరిగిన యుద్ధంలో రామ లక్ష్మణులపై ఇంద్రజిత్తు ప్రయోగించిన ప్రథమాయుధం నాగపాశం. అది వారిని పడ గొట్టి, చేతులను కట్టి వేసిందట. అలాగే కుంభకర్ణుడు యుద్ధానికి బయలు దేరింది విల్లమ్ములతో కాదు, మొనవాలుతో. అతని వెంట వెళ్ళిన సైనికులు పుచ్చుకొని వెళ్ళినవి రోకళ్ళు, గుదియలు, గొడ్డళ్ళు, త్రిశూలాలు, ఈటెలు. రాక్షసులు, వానరులవలె ధనుర్భాణాలు వినియోగించే వారు కాదేమో? ఒకవేళ వారికి ధనుస్సు లుంటే, అవి శక్తిమంతమైనవి కాకపోవచ్చు. ఆయుధాల విషయంలో ఆధిక్యం ఏదో లేకపోతే, రామ లక్ష్మణులు సంఖ్యా బలంగల ఆటవికులను జయించ గలిగే వారు కాదు.



ఏమైనా, ఆయుధ బలం తక్కువైనందు వల్లనే, రామాయణంలో రాక్షసులుగా పేర్కొన్న వారు "గెరిల్లా' యుద్ధ పద్ధతులను అనుసరించ వలసి వచ్చింది. ఎదుట నిలిచి పోరడానికి వీలులేనప్పుడు చాటునుంచి దెబ్బ తీయక తప్పదు. పగలు దాడి జరపడానికి వీలు లేనప్పుడు చీకటి మరుగున ముట్టడించక తప్పదు. అవసర మైనప్పుడు మారు వేషములను వేసుకొని పగతురపై దూకక తప్పదు. రాక్షసులనే వారు ఇటువంటి యుద్ధ పద్ధతులను అనుసరించు వారు కాబట్టే వారికి "నిశాచరు" లని, "కామరూపు" లని, "మాయావు" లని పేర్లు పెట్టారు.



"సీతజోస్యం" నాటకం:



రామాయణ ఇతివృత్తాన్ని నూతన దృక్పథంతో పరిశీలించి, సాంప్రదాయబద్ధం కాని పద్ధతిలో పాత్ర చిత్రణ చేసి, హేతువాద రీతిలో సంభాషణలు సృజించి, సరళ భాషలో, సులభ శైలిలో వ్రాసిన నాటకం సీతజోస్యం. ఈ నాటకాన్ని, 1981వ సంవత్సరంలో తెలుగు భాషలో ప్రచురించ బడిన ఉత్తమ రచనగా ఎంపికజేసి, తమ ప్రతిష్టాత్మకమైన జాతీయ పురస్కారాన్ని ప్రకటించారు కేంద్ర సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ వారు. సాహిత్య అకాడెమీ చరిత్రలో తొలిసారిగా ఈ పురస్కారం ఒక నాటకానికి ఇవ్వబడినది. ఇది విశేషించి పేర్కొన దగిన విషయం. ఆ ఘనత నార్ల వెంకటేశ్వరరావు గార్కి లభించుట అత్యంత ముదావహం!



సీతజోస్యం నాటకం రెండు ముఖ్య విషయాలను స్పస్టం చేస్తుంది. మొదటిది రామాయణ గాథకు చారిత్రక ఆధార మంటూ వుంటే, అది ఒక ప్రక్కన ఆహారాన్ని సేకరించుకొని కాలం గడిపే సామాజిక ఆర్థిక వర్గానికీ, మరో ప్రక్కన ఆహారాన్ని ఉత్పత్తి చేసే, సామాజిక ఆర్థిక వర్గానికీ మధ్య సంఘర్షణకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక రెండవ విషయం:- ఈ ఘర్షణలన్నీ వింధ్య పర్వత శ్రేణికి ఉత్తరంగా ఉన్న ఏదో ప్రదేశంలో జరిగినవేగాని, ఆ పర్వత శ్రేణి దక్షిణంగా మాత్రం కాదు. పైన పేర్కొనిన విషయాలు యం.వెంకటశేష అయ్యంగారు కన్నడంలో రచించిన "ఆదికవి వాల్మీకి" ఇత్యాది రచనలు చదివిన వారికి క్రొత్తగా తోచక పోవచ్చు. అటువంటి ప్రయత్నాలు దైవత్వమని విశ్వసించే విషయాలలో మానవ వ్యవహారాలను అందరికీ ఎత్తిచూపే ఉద్దేశ్యముతో వ్రాసిన వ్రాతలే! పైన భూమికలో విశద పరచిన వివరాలను దృష్టిలో ఉంచుకొని సీతజోస్యం నాటకాన్ని పరికిద్దాం!



సీతజోస్యం రెండంకముల నాటకం. ఈ నాటకంలో ప్రవేశ పెట్టిన పాత్రలు అయిదు. అందులో ప్రధాన పాత్రలు సీతా రామ లక్ష్మణులు. సహ పాత్రల రూపంలో ఇద్దరు ఋషులను ప్రవేశ పెట్టారు రచయిత. నాటకం దండకారణ్య ప్రాంతంలోని జనస్థానం లో సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమ ప్రాగణంలో జరిగినట్లు వర్ణిత మైనది. రంగ వర్ణన నాటకీయతకు తగు విధంగా (అనుగుణ్యంగా) వివరింప బడినది. కథ జరుగు నాటికి సీత వయసు పదిహేడు సంవత్సరాలుగా పేర్కొన బడినది.లక్ష్మణుని వయసు కూడా దరిదాపు ఒకటిగానే చెప్పబడినది. లక్ష్మణుడు మంచి పొడగరిగాను, కనుముక్కు లమరిక చక్కగా కుదిరి, అందగానిగా కనిపించుటయే గాక, కండలు తిరిగిన మంచి దేహదార్ఢ్యం కలిగి, రాజ ఠీవితో కూడిన అందగానిగా చిత్రింప బడినాడు.



సీత సహజ రూపవతి. నగలూ, ఇతర అలంకరణలు లేకపోయి నప్పటికీ, అందచందాలు కలిగి, ఆహ్లాద కరమైన కంఠ స్వరముతో చూపరుల గౌరవాదరాలను చూరకొనే విధంగా దర్శన మౌతుంది. చూడగానే ఆమె దృఢ చిత్త, అవసర మైనప్పుడు నిష్కర్షగా మాట్లాడ గలిగిన వ్యక్తిత్వం గల వనిత అని విదిత మౌతుంది. ఆత్మాభి మానంలో గాని, బుద్ధికుశలతలో గాని, ఆమెతో సరితూగ గల్గిన వారు బహు కొద్దిమంది! అంతేకాదు, ఆమెది హాస్య ప్రవృత్తి. అందరి వదినెల లాగానే, మఱిదితో చతురతా పూర్వకంగా సంభాషించు లక్షణం కలదిగా చిత్రించారు నార్ల వారు. సహ పాత్రలైన ఋషులలో మొదటి ఋషి వయసు అరవై పైగా, రెండవ ఋషి వయసు అంతకంటె పదేళ్ళు చిన్నగా చిత్రిత మైనది. మొదటి ఋషి పొట్టివాని గాను, రెండవ ఋషి పొడవు వాని గాను వర్ణించారు రచయిత.



ఋషి పుంగవులు రామునితో ఏదో విన్నవించి, ఆయన సహాయం అర్థించే యోచనతో సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమ స్థానానికి వస్తారు. కథా సందర్భం: వనవాసానికి సీతా లక్ష్మణ సమేతుడై వచ్చిన దశరథ రాముని మునులందరూ కలిసి దండకారణ్యములోని రాక్షసు లంతా తమతమ యజ్ఞ, యాగాదులకు విఘ్నాలు కల్పించి అనేక విధములైన కష్టములు కల్పిస్తున్నారని, వారిని సంహరించి తమతమ క్రతువులు నిరాటంకంగా జరుగునట్లు చేయమని రాముని కోరుట, దానికి రాముడు ఒప్పుకొని రాక్షస సంహారానికి మాట ఇచ్చుట జరుగుతుంది. రాముడు ఆవ్యవహారముల లోనే నిమగ్నుడై ఉంటాడు. అలాంటి నేపథ్యంలో నాటకం మొదలౌతుంది.



సీతజోస్యం లోని మొదటి అంకం సీతా లక్ష్మణుల సంభాషణతో మొదలవుతుంది. ఒంటరిగా ఆశ్రమానికి తిరిగి వచ్చిన మఱదిని చూచి, చిలిపి తనంతో కూడిన స్వరంలో చిరునవ్వుతో "ఒంటరిగా దయ చేస్తున్నారు, తమ ఇనవంశోద్భవ ప్రభువు లెక్కడా?" అని ప్రశ్నిస్తుంది సీత! ఆప్రశ్నతో ప్రారంభమైన సంభాషణ ఇనవంశీయులు అఖిల జగత్తునూ పదే పదే జయించుట, అశ్వమేధాలను జరుపుట, సాగర త్రవ్వకం, గంగను స్వర్గం నుండి భూతలానికి తెచ్చిన విషయం వెటకారంగా ఉల్లేఖిస్తుంది సీత! అది వినిన లక్ష్మణుడు "అది నిజం కాదా వదినా" అని అడుగుతాడు. దానికి జవాబుగా ఇక్ష్వాకులు పొగడ్తలకు సులభంగా లోనౌతారని, తాము సాధించిన విజయాలను హెచ్చు స్థాయిలో అంచనా వేసుకొని గర్విస్తారని, ముఖస్తుతికి లోనై, అనాలోచితంగా తమ ప్రతాప ప్రదర్శనకు దిగుతారని మఱదిని కవ్విస్తుంది! దానికి లక్ష్మణుడు "మీమాటలు చాలా విచిత్రంగా వుంటాయి వదినా" అంటాడు. "మీభ్రమల కంటేనా" అని యెదురు ప్రశ్నిస్తూ - "లేని పోని గొప్పలకు పోయి మీ అన్నగారు ఏమి ముప్పులు తెస్తారో అని నేనెంత తల్లడిల్లుతూ వుంటానో నీ కేమి తెలుసు అంటూ, ఇంతకూ ఆయన ఎచ్చటికి వేంచేశారు?" అని అడుగు తుంది లక్ష్మణుని. "తమ పుణ్యాశ్రమానికి వచ్చి దాన్ని పావనం చేయవలసిందని మహర్షు లెవ్వరో కోరగా...". "ఈ కొత్త మహర్షు లెవరు? మన ప్రాణానికి వీరెక్కడ దాపురించారు?" అంటుంది సీత! "ఇక్కడికి ఒక యోజనం దూరం లోనే వారుంటున్నారట, తప్పక ఒకసారి రమ్మని మోమాట పెట్టగా కాదన లేక వెళ్ళారు వదినా". "కాదన లేక వెళ్ళలేదు. కావాలనే వెళ్ళారు! మీ అన్నగారి సంగతి నాకు తెలియదా? రఘుకులతిలకా! రణరంగ ధీరా! రాక్షస సంహారకా అంటూ ఉబ్బివేస్తే చాలు, తమంత వారు ఈలోకంలో లేరని తబ్బిబ్బు లైపోతారు... త్వరగా వేరెక్కడకైనా వెళ్ళి, మన పర్ణ శాల మనం వేసుకొని, మన బ్రతుకు మనం బ్రతకడం అన్ని విధాల మనకు శ్రేయస్కరం" అంటూ చెబుతుంది సీత. "ఒక రాజర్షి కుమార్తె ఇలా అన వచ్చునా వదినా" అని ఆశ్చర్య పోతాడు లక్ష్మణుడు. దానికి బదులుగా "మా నాన్న గారు జటా జూటాలు ధరించిన ప్రతి కపటిని, ఒక మహర్షిగా నెత్తిన పెట్టుకోరు. జ్ఞానులైన వారినే చేరదీసి సన్మానిస్తారు" అనేసరికి, లక్ష్మణుడు "ఈజనస్థానం లోని ఋషులందరూ కపట వేషధారులని మీఅభిప్రాయమా?" అని అడుగుతాడు వదినెగార్ని! ఈ లోపల నగలమూట నొకదానిని లక్ష్మణునికి అందించి భద్ర పరచమని చెబుతుంది. దానిని అందుకొనిన లక్ష్మణుడు ఈ పూట వీటిని బయటికి తీశారెందుకు వదినా" అని అడుగుతాడు. ఇంతలోనే, సీత విచార గ్రస్తురాలై తన కష్టాలను తలచు కొని చింతింస్తుంది. ఆ ఆభరణములలో ఏది ఎప్పుడు ఎవరిచ్చినది జ్ఞప్తికి తెచ్చుకొని పరి పరి విధాల కలత చెందుతుంది.ఈ ప్రవాస కాలాన్ని ఎలాగో ముగించుకొని, అయోధ్య చేరుదా మనుకొంటే ఇచ్చటి ముని మ్రుచ్చులు ఈకారడవులనుండి మనలను బయటపడ నిచ్చేటట్టు లేరని మఱదితో అంటుంది. ఇంతలోనే లక్ష్మణుడు "ఈ మహర్షు లందరు ధూర్తులని మీరు అకారణంగా భయపడుతున్నారు వదినా" అంటాడు. "కార్యార్థులై వచ్చిన వారు తమరు ఇంద్రులని, చంద్రులని భట్రాజుల కంటే హీనంగా ముఖస్తుతులకు దిగితే, వారిని ధూర్తులను కొనక మహర్షు లను కొంటానా? ఏమయ్యా! అమాయక మఱదీ!" అంటుంది.



ఇంతలో రాముని స్తుతిస్తూ, స్తోత్ర పాఠాలు వినిపిస్తాయి. "లక్ష్మణా అరుగో! వస్తున్నారు మళ్ళీ మీవంధి మాగధు లెవరో!" అంటుంది సీత. లక్ష్మణుడు పర్ణశాల ద్వారం వైపు రెండడుగులు వేయక మునుపే, ఒక ఋషి లోనికి వస్తాడు! లక్ష్మణుడు చేతులు జోడించి నమస్కారం తెలియ జేస్తాడు ఆఋషికి. ఆయన కూడా "శతమానం భవతు" అని ఆశీస్సు లందిస్తాడు. ఇంతలో చికాకుతో ఉన్న సీతకూడా ఆఋషికి నమస్కరిస్తుంది. "దీర్ఘసుమంగళీభవ" అని ఆమెను దీవిస్తాడు ఋషి. ఇంతలోనే మరో ఋషి పండ్ల బుట్టతో ప్రవేశిస్తాడు. "తమ పాద పద్మాలతో మా పర్ణ కుటీరాన్ని"... అంతలో సీత అందుకొని "పావనం చేయగలిగిన వారు వీరు కాదు, వీరి అన్నగారు" అంటుంది, మొదటి ఋషి వర్యునితో! అంతలోనే మొదటి ఋషి "ఓహో తమరు రామచంద్ర ప్రభువుల సోదరులా? లక్ష్మణ స్వాములా?" అంటాడు మొదటి ఋషి. తర్వాత కొంతసేపు ఋషి మధ్యా సీతాలక్ష్మణుల మధ్యా కొంత సంవాదము జరుగుతుంది. ఋషి పొగడ్తలు సీతకు నచ్చవు. ఋషుల మధ్యా సీత మధ్యా జరుగుతున్న వాద వివాదాలు లక్ష్మణునికి ఆట్టేనచ్చవు. వదినెగారు ఋషులతో కొంత వ్యంగ ధోరణిలో ప్రసంగిస్తున్నారని గ్రహించి సంభాషణా ధోరణిని మార్చాలని ప్రయత్నిస్తాడు. కాని అందులో సఫలం కాడు. సీతకు ఋషులు తనను తల్లీ, అమ్మా అని సంభోదించుట నచ్చదు. అది గ్రహించిన లక్ష్మణుడు ఋషులను త్వరలో పంపించే ఉద్దేశ్యంతో "మా అన్నగారు ఇచ్చటికి సమీపంలో నివసించు ఋషు లెవరో ఆహ్వానించగా వారి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వెళ్ళారు. వారు తిరిగి వచ్చేసరికి చాలా పొద్దెక్కి పోవచ్చు, తాము వెంటనే తిరుగు ప్రయాణం చేయుట మంచిదేమో?" అని ఋషులకు సూచిస్తాడు. కాని మొదటి ఋషి జవాబుగా "శ్రీవారి దర్శన భాగ్యం పొంది, వారికి మానివేదనను చేసుకోకుండా తిరిగి వెళ్ళము" అంటాడు. ఇంతలో సీత కలుగ జేసుకొని "ఏ నివేదనతో తమరు వచ్చారో అది నాకు తెలుసు చెప్పమంటారా? రాక్షసుల పీడ మాకు విశేషంగా ఉంటున్నది, మాయజ్ఞ యాగాదులకు వారు విఘాతాలు కల్పిస్తున్నారు. వారిని సంహరించి, వారి దురాగతాల నుంచి ప్రభువులు మాకు విముక్తి కలిగించాలి, ఇదే కదా మీ నివేదన?" అని ప్రశ్నిస్తుంది. ఈమాటలతో రెండవ ఋషి ఆశ్చర్య చకితుడై "మా నివేదన మా మనసులో ఉండగానే సరిగ్గా గ్రహించారు, సీతమ్మ తల్లిగారు" అంటాడు. దానికి సీతమ్మ "తమ బోటుల సాంగత్యము వలన నాకు కూడా కాస్త కాస్త దివ్య దృష్టి అబ్బుతున్నది లెండి" అని వ్యంగ యుక్తంగానే జవాబు లిస్తుంది, ఋషి వర్యులకు. తర్వాత మొదటి ఋషికీ సీతకు దీర్ఘమైన వివాదస్పద సంవాదం జరుగు తుంది. ఇది ఏమాత్రం నచ్చదు లక్ష్మణునికి! కాని వదినెగారిని నివారించ జాలక మౌనంగా తిలకించుట కంటే మరేమి చేయ జాలడు. మొదటి ఋషికి వదినెగారికీ వచ్చిన వివాదంలో ఋషి వర్యుల లక్ష్యం, న్యాయ సంగతం కాదని వారు రాక్షసులుగా చిత్రించే ఆటవికులు రాక్షసులు కాదని, అడవులలో ఆహారం సమ కూర్చుకొని తమ జీవితాలు తమ పద్ధతిలో జీవించు అమాయకులని, యజ్ఞ, యాగాల రూపంలో అడవులన్నిటినీ ధ్వంసం చేసి ఋషులే వారికి నష్టం కలిగిస్తున్నారన్న వాదన స్పష్ట పరుస్తుంది! మచ్చుకు వారి సంభాషణను పాఠకులు తిలకించండి!



మొదటి ఋషి: వారు రాక్షసులు తల్లీ! క్రూర రాక్షసులు!



సీత: వారి కంటికి మీరే క్రూర రాక్షసులుగా కనబడ వచ్చు గదా! వారు మాకోసల రాజ్యం లోనికి రాలేదు, మీ కాశీ రాజ్యం లోకైనా రాలేదు. అన్యాయంగా వారి సీమలోకి చొచ్చుకు వచ్చింది మీరే! వారి నివాస స్థానాలకు చిచ్చు పెడుతున్నది మీరే! వారి బ్రతుకులను బుగ్గి చేస్తున్నది మీరే!



మొదటి ఋషి: అదేమిటి, తల్లీ! అదేమిటి? మాహోమగుండాలలో నీళ్ళుపోసి, వాటిని చల్లార్చి వేస్తూ, వారు మమ్ము వేధించుకు తింటూ ఉంటే, మేమే వారికి ఏదో కీడు తల పెట్టి నట్టు మమ్ము నిందిస్తున్నారు?



సీత: హోమ గుండాలను మీ రెందుకు వెలిగి స్తున్నారు? ఈ అడవులను కాల్చడానికి కాదా? అందు వల్ల మీకు పంటలు పండ వచ్చు, మీ గరిశెలు నిండ వచ్చు, మీ సంసారాలు ఉండవచ్చు. కాని, ఇక్కడి వారి మాటేమిటి? వీరు కాయ లేరుకొని, కంద మూలాలు తవ్వుకొని బ్రతక వలసిన వారు కారా? పిట్టలను పట్టుకొని, జంతువులను కొట్టు కొని పొట్ట పోసుకో వలసిన వారు కదా? ఈ అడవులను మీరు ధ్వంసం చేస్తే వారి బ్రతుకులు నాశనం కావా?



పై విధంగా సాగుతుంది వారి సంవాదం. ఈ వాద ప్రతి వాదనల తర్వాత ఋషు లిద్దరూ తిరిగి వెళ్ళి పోతారు.



ద్వితీయాంకం.



సమయం: మరునాటి ఉదయం పదకొండు గంటల ప్రాంతం. సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమములో అతిథి గృహం. రంగం లోకి కొత్తగా ప్రవేశించు పాత్ర రాముడు. వయస్సులో లక్ష్మణుని కంటే ఎక్కువ పెద్ద వాడు కాడు. లక్ష్మణుని వలె నార బట్టలు ధరి స్తాడు. ఎలాంటి రాజలంకరణలు లేకపోయినా, మోము తీరులో, మాట తీరులో, నడక వైఖరిలో రాజ ఠీవి ఉట్టి పడుతూ ఉంటుంది! వంశ గౌరవాన్ని కాపాడ వలసిన భారం, దానిని పెంపొదించ వలసిన భాధ్యత, ఇవి తనకు విధి విహితాలన్న ప్రగాఢ విశ్వాసం, ప్రస్ఫుట మయ్యే వ్యక్తిత్వం ఆయనది. రచయిత రాముని పాత్రను వాల్మీకంలో వర్ణించ బడిన విధంగా చిత్రిస్తాడు. ధీరో దాత్తుడు, శరణాగత రక్షకుడు, ఆడిన మాట తప్పని వాడు!



సీత పాత్రను సద్విమర్శకు రాలిగా, వాస్తవికతను అంచనా వేయగల ఉదాత్త మహిళగా రూపొందిస్తాడు నార్ల. లక్ష్మణునితో తనకు గల చనువును ఉపయోగించుకొని ఋషి వర్యుల మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది! ఋషులు హోమ గుండాలను వెలిగించి, అడవులను కాల్చి, స్థానికులను నిరాశ్రయులుగా చేయడం, వారి దురాక్రమణకు చిహ్నమని ఆమె అభిప్రాయం. ఆ దురాక్రమణలు ఎక్కువగా సాగించి దక్షిణా పథాన్ని వశ పరచుకోవడం వారి లక్ష్యమని ఆమె నమ్మకం. దానికి స్థానికులైన అనార్యులు ఎదురు తిరగగా, వారిని నిర్మూలించుట కొరకై రాముని సహాయం అవసర మైనది. ఈ విషయం గ్రహించిన సీత ఋషుల ప్రవర్తన బాహాటంగా విమర్శిస్తుంది. ఇది కేవలం నార్ల వారి ఊహాజనితం కాదు. దీనికి వాల్మీకి రామాయణం లో మాతృక ఉన్నట్లు తెలియు చున్నది. ఈ విషయం సరస్వతుల సుబ్బరామ శాస్త్రులవారు చేసిన వాల్మీకి రామాయణ అనువాదం (వావిళ్ళ వారి ప్రతి) లో పేర్కొన బడినది. అందుచేత నార్ల వారి సీత పాత్ర చిత్రణకు ఇతర ఆధారాలు ఉన్నట్లు తెలియు చున్నది. నార్ల వారు సీతను భక్తి ప్రపత్తులతో పతివ్రతా ధర్మాన్ని నిర్వహించు యాంత్రిక మనస్తత్వం గల మహిళగా కాక, స్వయంగా ఆలోచించి, మంచి చెడ్డలను నిర్ణ యించుకో గల్గిన హేతు వాదిగా చిత్రించారు. అదే, నార్ల వారి నూతన దృక్పథం, రామాయణాన్ని సరైన పద్ధతిలో అధ్యయనం చేసి, దైవత్వమని విశ్వసించే విషయాలలో మానవ వ్యవహారాలను ఎత్తి చూపుట వారి ఉద్దేశ్యంగా మనకు స్ఫష్ట మవుతుంది. ఈ విషయాలను దృష్టిలో నుంచుకొని "సీతజోస్యం" ద్వితీయాంకం పరిశీలించ వలసి ఉంటుంది. అప్పుడే ద్వితీయాంకములోని సంభాషణా విశేషాలను పాఠక మహాశయులు ఆనందించ గలుగుతారు.



కథా సందర్భం:



అన్న రాకకై, ఆతురతో గుమ్మం బయట లక్ష్మణుడు ఎదురు చూస్తూ నిలబడి ఉంటాడు. అశాంతిని, ఆగ్రహాన్ని సూచిస్తున్న ముఖంతో సీత పర్ణశాలలో పచార్లు చేస్తూవుంటుంది. "వాకిలి ముందట పడిగాపులు కాచినంత మాత్రాన రాముడు రాడని, లోపలికి వచ్చి నీడలో ఉండమనీ మఱదికి చెబుతుంది. ఒకవిధమైన చిరుకోపంతో భర్త తిరిగి రాలేదన్న మానసిక వత్తిడిని కప్పి పుచ్చుకొని "ఆటవిక సంహార కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నులైన వారికి భార్య జ్ఞాపకం ఉంటుందా? తమ్ముడు గుర్తుంటాడా? తమ శౌర్య ప్రతాపాలను, పూర్తిగా చూపించి, రఘువంశ ప్రతిష్టను కాపాడి, ఋషుల స్తోత్ర పాఠాలను విని, నెమ్మతిగా వస్తారులే! మీ అన్నగారు. రాక ఎక్కడికి పోతారు?" అని దెప్పి పొడుపు ధోరణిలో అంటుంది సీత మఱదితో. ఈ మాటలతో ప్రారంభమౌతుంది రెండవ అకం. సీత ఆలోచనా ధోరణి, మానసిక వ్యధ, ఈ జనస్థానంలోని ఋషులు తన భర్త రాముని అనైతికమైన తమ లక్ష్య సాధనకు వాడు కుంటున్నారనే చింత, రాముడు నిరపరాధులను దండిస్తున్నారన్న ఆందోళన సీతను కలవర పెడుతుంది. ఆయనకు (రామునికి) తోచక పోతే, "నీవైనా ఆటవికులను వేటాడ్డం కోసమే మనం అరణ్య వాసానికి రాలేదని మీ అన్నగార్కి చెప్పరాదా?" అంటుంది. "ఆయనకు నేను హితోపదేశం చేయగల పాటివాడనా? వదినా" అంటాడు లక్ష్మణుడు జవాబుగా! మాటల మధ్యలో ఉండగా రెండవ ఋషి పర్ణశాలలో ప్రవేశిస్తాడు. రాముడు తిరిగి వచ్చాడా లేదా అన్న సంగతి తెలుసుకొనే నిమిత్తం, రెండవ ఋషి ప్రశ్నలు సీతకు చికాకు కలిగిస్తాయి. అది పసి గట్టిన లక్ష్మణుడు రెండవ ఋషిని పంపి వేసే ప్రయత్నం చేస్తాడు. అంతలోనే మొదటి ఋషితో - రాముడు పర్ణశాల ప్రవేసిస్తాడు. మొదటి ఋషి ద్వారా విశేషాలన్ని తెలుసు కొంటాడు. ఆస్థితిలో తిరిగి మొదటి ఋషి మధ్యా సీత మధ్యా కొంత సంవాదం జరుగుతుంది. రాముడు మొదటి ఋషిని కూర్చో పెడతాడు తానూ ఆశీనుడౌతాడు. అప్పుడు మొదటి ఋషి సీతను కూడా కూర్చో వలసినదిగా అభ్యర్థిస్తాడు. అప్పుడు సీత భర్త నుద్దేశించి, "నిన్న పొద్దుననగా వెళ్ళిన వారు, మీరు చూస్తూనే ఉన్నారుగా, ఇప్పుడే తిరిగి వచ్చారు. స్నాన పానాదులు పూర్తి చేసుకొని, వారిని కాస్త విశ్రాంతి తీసుకో నివ్వండి. వారితో మీరు మాట్లాడ దలచినది సాయంత్రం మాట్లాడ వచ్చు...". అంతలోనే రాముడు మొదటి ఋషితో..."తమ ఆదేశ మేమో సెలవివ్వండి" అంటాడు. మొదటి ఋషి మొదలెట్టక ముందే, సీత ఆయన వచ్చిన పనీ, చెయ్య దలచిన విన్నపాన్ని గురించి విపులంగా వివరిస్తుంది. రామునికి సీత జోక్యం నచ్చదు. మందలింపు స్వరంతో ఆమెను నివారిస్తాడు. కాని ఋషి రామునితో సీతను సహితం తమ సంభాషణలో పాల్గొన నివ్వ వలసినదిగా కోర్తాడు. అంతేగాక లక్ష్మణుడు సహితం అచ్చటనే ఉండుటకు రాముని అనుజ్ఞ తీసుకొంటాడు. అందరి సమక్షం లోనే సంవాదం జరుగు తుంది. ఆసందర్భములో చర్చకు వచ్చిన విషయాలు: అయోధ్యా పౌరులు కాని వారు అయోధ్య ప్రభువుల రక్షణ కోరుట భావ్యమా? దానికి రాముని అభిప్రాయం కోర వచ్చునని. లక్ష్మణుడు సహితం అన్నతో ఏకీభవిస్తాడు. సీత జవాబు మాత్రం కోరుట భావ్యం కాదని. మొదటి ఋషి దృష్టి లో అయోధ్య ప్రభువులకు రాజ్యాధి కారం కన్నా, వారి నైతికాధికారం విస్తృత మైనదనీ, ఆ సద్గుణమే వారికి ఆర్యావర్తం పై సర్వ నాయకత్వం కట్ట బెడుతున్నదని. దానికి రామ లక్ష్మణు లిద్దరూ కూడా అంగీకరిస్తారు. సీత మాత్రం ఆ విషయానికి సమ్మ తించదు. అయోధ్యా రాజులకు పొగడ్తలకు పొంగిపోవుట సహజమనీ, ఆకారణాన ఆర్యా వర్తం పై నైతికాధికారం స్వీకరించడానికి వెనుదీయరని చెబుతుంది. ఆబాధ్యతకు వారికి ఏవిధమైన రాజస్వమూ లభ్యమగుట లేదని వివరిస్తుంది. కాని, మొదటి ఋషి తమ యజ్ఞ ఫలంలో నాల్గవ వంతు పంచి పెడుతున్నామని చెప్తాడు. దానికి జవాబుగా సీత "ముని వర్యులు తమ యజ్ఞ సంపదను తమతోనే ఉంచుకొని దానితో తమ ఆత్మ రక్షణ చేసు కొన వచ్చును గదా! ఆయుధాల ద్వారా రాముని రక్షణ కోరుట అవసరమా?" అని అడుగు తుంది.



దానికి మొదటి ఋషి యజ్ఞ శక్తి మహత్తర మైనదని, దానితో ముల్లోకాలను మాడ్చి వేయ వచ్చునని, కాని ఆ శక్తిని లౌకిక ప్రయోజనాలకు వినియోగించ రాదని తమకు దైవాను శాసనమని వివరిస్తాడు. సీత వైఖరి రామునికి నచ్చదు. కోపంతో ఆమెను వారిస్తాడు. అయినా, సీత జంకక రామునితో "ఈ ఋషి వర్యులు ముఖస్తుతి చేసి, మీచేత అమాయకులైన ఆటవికులను అన్యాయంగా చంపిస్తున్నారు. వీరి మోసాన్ని కాదనలేక మీరు"... ఇంతలో రాముడు కోపంతో సీతను మంద లించి, మొదటి ఋషితో "తమ వెంట నేను తప్పక వస్తాను. తమ హోమ గుండాలను చల్లారుస్తున్న రాక్షసులను వధిస్తాను. మీరు విడిదికి వెళ్ళి మీ ప్రయాణ సన్నాహాలు పూర్తి చేసుకొండి. నేను నా కోదండముతో తమ సేవలో నిలుస్తా" నని చెప్పి మొదటి ఋషిని పంపించేస్తాడు.



కొన్ని క్షణాలు గడచిన తర్వాత రాముడు శాంతం వహించి, సీతను బుజ్జ గించి అనునయ స్వరం తో "నేను నా కర్తవ్యాన్ని పరి పాలిస్తాను. నాకు రాగల ప్రమాద మేమీ లేదు. నీకు లేని పోని భయం, బాధ దేనికి? అనవసరంగా కంట తడి పెట్టుకోకు." అంటూ భుజం పై చేయి వేసి, ఆప్యాయంగా ఆమె ముఖం తన వైపుకు తిప్పుకొని చెక్కిళ్ళను మృదువుగా తుడుస్తాదు! భర్త అనురాగానికి కరగిన సీతమ్మ "నేనేమి పడితే మీకు దేనికి లెండి! నేను మీకు కావలసి వస్తే కదా?" అని నిష్టూర వచనాలతో పతిని ప్రశ్నిస్తుంది. క్షణ కాలంలో ఆదర్శ దంపతులు ఒకరిలో నొకరు చొచ్చుకుని పోతారు! "అదేమి పిచ్చిమాట" అంటాడు రాముడు అనునయ పూర్వకంగా. వెంటనే సీత భర్త వైపు చూచి "పిచ్చి మాట కాదు, నిజం మాటే! నేను మీక్కావలసి దాన్నైతే, ఇదిగో సంధ్య వార్చి వస్తా నంటూ నిన్న పొద్దుననగా వెళ్ళిన వారు ఇప్పటికి తిరిగి వస్తారా? వచ్చీ రాక ముందే, మరో ఋష్యాశ్రమానికి ప్రయాణం కడతారా?" అని అను నయపూర్వక కోపాన్ని వ్యక్త పరుస్తుంది. ఇద్దరి మధ్యా మరికొంత సంవాదం జరుగు తుంది. మరలా సంభాషణ మునులూ, హోమగుండాలు, ఆత్మరక్షణ, ఆటవికుల సంహరణ విషయాల మీదనే కేంద్రీకృత మౌతుంది! ఆ విషయంలో తన అభిప్రాయాలు నిర్మొహమాటంగా భర్తతో చెబుతుంది సీతమ్మ. "ఇదివరలో నీవు మహర్షులంటె ఎంతో భక్తి చూపేదానివి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందు వల్లానో వారిని విపరీతముగా విద్వేషిస్తున్నావు" అంటాడు రాముడు. "ఇక్కడికి వచ్చిన తర్వాత గాని, వారి నిజరూపం నాకు తెలిసి రాలేదు" అని సీత జవాబు! అలా అంటూనే "మీరు మీ తల్లి తండ్రుల ముందు చేసిన వాగ్దానం పాటిస్తున్నారా?" "ఎందుకు పాటించటంలేదు?" అని అడుగుతాడు రాముడు. మునీంద్రులు అస్త్ర శస్త్రాలను ధరించ రని, వారు నిరాయుధులను చంపి వేయరని వాదిస్తుంది సీత. దానికి జవాబుగా తాను నిరాయుధులను చంపుట లేదని, వారు రాక్షసులని, రక రకాల ఈటెలూ, గొడ్డళ్ళూ, బరిసెలు, వారికున్నాయని, వారు వాటిని వాడు తున్నారని, వారు నిరపరాధు లెంత మాత్రం కాదని చెప్తాడు. వారు రాక్షసులు" అంటాడు. "ఆ పేరు వారికి మీ మహర్షులు పెట్టిన పేరు! వారిని అలా చిత్రించకపోతే వారిని మీచేత చంపించ లేరు" అని సీత ఎంత నిక్కచ్చిగా చెప్పినా, రాముడు తన అభిప్రాయాన్ని మార్చు కొనడు. తాను ప్రస్థుతం రాజు కానప్పటికీ, క్షత్రీయుడనే నని, అందుచేత క్షత్రియ ధర్మం తప్పక నెరవేరుస్తానని అంటాడు. ఇంతలో వారి సంభాషణ చిత్రకూట పర్వత ప్రాంతం లోని వారి పర్ణశాల, అచ్చటి జీవిత సరళి వైపు వెళ్ళుతుంది. ఆ పర్వతంపై విహరిస్తూ, అచ్చటి నదిలో జలక్రీడ లాడుతూ తాము ప్రవాస క్లేశాలను మరచి, సంతోషముతో గడపిన రోజులు రామునికి జ్ఞప్తికి తెస్తుంది సీత! ఆ సౌందర్య గరిమ రాముని ప్రభావితుని చేసి, కవిగా మార్చిన వుదంతం స్మరణకు తెస్తుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుకు తెచ్చుకొని, ఒక చెట్టు కొమ్మ మందాకిని పై వాలి వుండగా, రాముడు ఆ చక్కని దృశ్యాన్ని వర్ణిస్తూ వాడిన ఉపమానం "ప్రేమ కలాపాలాడ్డానికి ప్రేయసి వక్షస్థలం పైకి వాలబోతున్న ప్రియుని వలె నున్న" దని అన్న సందర్భాన్ని జ్ఞప్తికి తెచ్చుకొంటాడు! కొంతసేపు భార్యా భర్తల మధ్య మృదు సంభాషణలు జరుగుతవి. అప్పుడు రాముడు "ఇవ్వన్నీ నువ్వు జ్ఞాపకం చేస్తుంటే, నా మనసు మళ్ళీ ఆ ఆ నందం వైపుకు పరుగు లెడుతున్నది" అంటాడు సీతతో. "అంత సుఖ జీవితాన్ని విడచి ఇక్కడికి రావలసిన అగత్యం ముని వర్యుల కుట్రగా చెబుతుంది సీత. కాని రాముడు సీత అభిప్రాయాలతో యేకీభవించడు. అప్పుడు సీత రాముని ఈ విధంగా అభ్యర్థిస్తుంది. "నా మాట విని ఆయుధాలను వీడండి. ఆయుధానికి రక్తదాహం వుంటుంది; అది నర బలిని కోరుతుంది. ఆయుధ ధారణ చేయగానే కారుణ్యమూర్తులు క్రూరులౌతారు... నా ప్రార్థన మన్నించి కనీసం ప్రస్థుతానికైనా, ఆయుధ విసర్జన చేయండి" అంటుంది. "నీ వేమైనా చెప్పు, నేను ఆయుధ విసర్జన చేయను" అని జవాబిస్తాడు రాముడు. దానికి మారుగా ... "పగలేకుండా, పరులను చంపడం మహాపాపం. మీరు ఇప్పుడు ఆమహా పాపానికి వొడిగడుతున్నారు" అంటుంది సీత. ఆ మాటలకు కోపగించుకొన్న రాముడు "నేను వధిస్తున్న వారు నిరపరాధులని నీవు నిజంగా నమ్ముతున్నావా?" అని అడుగుతాడు. దానికి సీత "ఆటవికులకూ మనకూ ఏవిధమైన వైరం లేదు. మనతో వారు ఏవిధమైన జోక్యం పెట్టుకోవడం లేదు. మనకు కించిత్తు అపకారమైనా తలబెట్టడం లేదు. ... వీరు అన్యం పున్నెము తెలియని ఆటవికులు ... ఋషుల స్వార్థానికి వీరిని బలి పెట్టకండి" అంటూ రాముని పాదాలు పట్టుకొని "నేను ఒక మహరాజు కుమార్తెను, మరో మహరాజుకు కోడలిని; భిక్షమడుగుట నా ప్రవృత్తికి విరుద్ధం. అయినా, ఈ పూట భిక్షమడుగుతున్నాను. ఈ ఆటవికులకు ప్రాణ భిక్ష పెట్టండి" అని సీత భర్తను వేడుకొంటుంది. అప్పుడు రాముడు ఆమె పట్టు విడిపించుకొని, ధనుర్భాణాలను అందుకొని బయటికి వెళ్ళిపోతూ "అవసరమైతే నిన్ను విడుస్తాను, లక్ష్మణుని విడుస్తాను, నా ప్రాణాలనైనా విడుస్తాను, కాని ఋషుల కిచ్చిన మాట మాత్రం తప్పను. ఆడిన మాట తప్పితే మావంశ గౌరవం మంట గలుస్తుంది" అని జవాబిస్తాడు. బయటకు వెళ్ళిపోతున్న భర్తతో "ఔను, మీ వంశ గౌరవమే మీకు కావలసింది, నేను కాదు. వెళ్ళండి, వెళ్ళి నిరపరాధులను చంపి, మీ వంశ గౌరవాన్ని కాపాడుకొండి. కాని, ఆగి ఒక్క మాట వింటారా?" అని అడుగు తుంది. రాముడు ఆగి పోతాడు. "అవసరమైతే నన్ను విడుస్తామన్నారు. మీరు అంతటి వారే! మీ వంశ గౌరవానికి బలిగా ఎప్పుడో ఒకప్పుడు ఏనట్టడవి లోనో నన్ను దిక్కు లేని దాన్నిగా దిగ విడుస్తారు!!" అంటుంది. ఆ మాటలతో ముగుస్తుంది నాటకం. ఆ మాటలు నిజమైనట్లు రామాయణ కథ దృఢ పరుస్తుంది! అందుకే నాటకం సీతజోస్యం అయింది!



విమర్శలు - వివాదాలు:



1981-1982 సంత్సరాలలో తెలుగులో ప్రచురితమైన పుస్తకాలలో "సీత జోస్యం" అత్యుత్తమ గ్రంథమని సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ వారు ఎంపిక జేసి, దానికి పురస్కారాన్ని ప్రకటించారు. ఆ పురస్కారం సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మక మైనదని విజ్ఞులైన పాఠకులకు విదితమే.



ఆ పురస్కారాన్ని ప్రకటించిన తర్వాత ఆ పుస్తకాన్ని గూర్చిన విమర్శలు రా మొదలెట్టాయి. అయితే Indian Literature అనే ద్వైమాస పత్రిక (మే-జూన్ 1982) ప్రచురించిన సమీక్ష వివాదానికి దారితీసింది. విమర్శకుడు "సీతజోస్యం" పై వ్రాసిన సమీక్ష లోని కొన్ని ముఖ్యాంశాలు!



1) రచయిత నార్ల వెంకతేశ్వర రావుగారు తాము వ్యక్త పరచిన అభిప్రాయాలకు మౌలికతను సంతరింప జేయటం లేదు; (Narla claims no originality for these views) రామాయణ సాహిత్యానంతా అవలోఢనం (పరామర్శనం) గావించి, గొప్ప హేతు బద్ధమైన సారాంశాలను ఎంపిక చేసుకొని తన పద్ధతిలో విస్తృతమైన వాదనలు వినిపించారు.

2) నార్ల నిశితం కాని, స్పష్టంగా, ఒప్పించ నేర్పు కొరవడిన వాదనలు ఒక్కో పర్యాయం తన ప్రతి వాదల్నే దెబ్బ తీశాయి. ఉదాహరణకు నార్లగారు 97వ పేజీ లో, 131వ పేజీలో పేర్కొనిన విషయాలు గమనించ వలసినదిగా పాఠకులకు సూచన.



3) ... ఆర్యేతర నాగరికతా ప్రాభవాన్ని చాటి చెప్పేందుకు నార్ల చక్కటి నచ్చ జెప్పే ధోరణిని చేపట్టారు. కాని, ఇతిహాస నాయకులు ధరించిన మహిమ గల ఆయుధాల్ని హేళన చేస్తూ భారతీయులు పరాయి దురాక్రమణ దారులైన దారస్, అలెగ్జాండర్ లతో తల పడి నప్పుడు భారతీయుల వద్ద అటువంటి ఆయుధాలు వుంటే మరి దురాక్రమణ దారులు లెలా వారిని ఓడించ గలిగారంటూ చేసిన వాదన కళాశాల చర్చలలో కుర్రకారు చేసే వాదనలా ఉంది... మౌలిక ఇతిహాసాల విషయంలో ఒక పండితుడు ముందుగానే కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటి ఋజువుల కోసం ఇరవయ్యవ శతాబ్దపు టార్చి లైటు సహాయంతో ఆచీకటి మలుపుల్లోకి ప్రయాణించటంలో ఎదురయ్యే కనుపిచని గోతుల్ని ఎత్తి చూపేందుకే".



4) ... దశరథ జాతక కథలలో రమా పండితుడు తన సోదరి సీతను వివాహమాడటంలో అభ్యంతరం చెప్పనప్పుడు నార్ల ఆనాడు అమలులో ఉన్న నైతిక సామాజిక కట్టుబాట్లను అనువర్తింప జేయటంలో నిష్పాక్షిక ధోరణి అవలంబించి నట్లే కాని ఋషుల జన్మల విషయానికి వచ్చేటప్పటికి పురాతన సమాజానికి ఇరవయ్యవ శతాబ్దపునాటి భారతీయపు వివేచనతో కూడిన దారుణమైన లైంగిక విశృంఖలత్వాన్ని అనువర్తింపజేసి అసహ్యించు కోవడం జరిగింది. (పుట 87)"



5) ... నార్ల సీతను వాల్మీకి చిత్రించిన విధంగానే చిత్రిస్తున్నారని ఎంత చెప్పుకొన్నా ... నార్ల పనితనం సీతను క్రిందికి దొర్లించింది".



6) ... తన పుస్తకం భక్తి పరుల కోసం కాదని, అవగాహనా పరులైన పాఠకుల కోసమని - దాన్ని ఎంతగా పదేపదే చెప్పటం జరిగిం దంటే హేమ్లెట్లోని రాణి మాటల్ని వేరొకరు ఇలా వల్లె వేసేంతగా - "ఈమె మరీ ఎక్కువగా నిరసించినట్లు అనిపిస్తుంది".



పై సమీక్షకు నార్ల వారి ఒక ప్రత్యాక్షేపం:



ముఖ్యాంశాలు: 1) నేను ప్రతికూలంగా ఉన్న సమీక్షను, అది విష పూరితమైనా సరే స్వాగతించ గలను - కానీ ఆకతాయి పద్ధతిని మాత్రం కాదు. మీ సమీక్షకుణ్ణి అంశాల వారిగా ఖండించే ఉద్దేశ్యం నాకు లేదు, ఆయనలోని చారిత్రక భౌగోళిక అవగాహనా లేమిని, ఆమాట కొస్తే' అసలు వాల్మీకి రామాయణ అవగాహనా రాహిత్యాన్ని పట్టి చూపేందుకే నేను పరిమిత మౌతాను.



2) మొదటగా చారిత్రక అంశాన్ని స్పృశిస్తాను ... డి.యస్.గారు నేను ఆర్యేతర (హరప్పాకు చెందిన) నాగరికతను పూర్వ వైభవ ప్రాపకానికి తగిన వాదం చేసినట్లుగా అంగీకరించారు. ... గతంలోని వారి ప్రతిభ లన్నీ, అది యుద్ధ కౌశలం గాని, శాంతియుత జీవనం గానీ బహు కొద్ది తరాలలోనే కోల్పోయారు; కాల క్రమేణ విజేతలైన ఆర్యులు వాటిని అమితంగా అలవర్చు కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హరప్పన్లను, ఆర్యనులను ఒకేగాటన కట్టనందుకు అసంగత్యాన్నో, కాలేజి చర్చల్లో పాల్గొనే యవ్వనారంభ కుర్రకారు మనస్తత్వాన్ని నాకు అంటగట్టి, నిష్పాక్షికంగా ఆలోచించ గలవారెవరైనా నన్ను నిందించ గలరా? ఏం చేద్దాం? ... పతన మైన నాగరికతను పరిఢవిల్లుతున్న దానితో సమ తూకంతో చూచే పరి పక్వత డి.యస్.ఆర్. గారి వలె బహుశా నాకు లేదేమో!



3) "ఇక భౌగోళిక స్థితిని గూర్చి ఒక మాట. జరవులు ... ఇటువంటి స్థితిలో జరవులు, నికోబారియన్ల కు భిన్నంగా ఉండటంలో డి.యస్.ఆర్. ఆలోచించి నట్లు వింత ఏముంది?" మన ప్రధాన భూభాగంలో కూడ కొద్ది వందల మైళ్ళ దూరంలో నివసించే ఆదిమ జాతి తెగల్లో కూడ ఒక తెగకు మరో తెగకూ మధ్య అలవాట్లల్లో, ఆచారాలలో, వ్యక్తిగత స్వభావాలలో మనం భేదం గమనించటం లేదూ?



4) డి.యస్.ఆర్. చెప్పినట్లు నేను సీతను "మొరసుగా, వాగ్వివాదిగా" చిత్రించాననే దానిని అంగీకరించ వలసి వస్తే ఆయన వాల్మీకి కృతి అసలు చదివి ఉండడనీ, ఒక వేళ చదివినా ఏదో పైపైన తిరగ వేయటం జరిగి ఉంటుందనే తన తప్పును తాను అంగీకరించ వలసి ఉంటుంది ... డి.యస్.ఆర్. కావాలనుకుంటే అరణ్య కాండ 45వ సర్గను చూచి ఋజువు పరచుకో వచ్చు.



5) ... అయినాసరే డి.యస్.ఆర్. గారు సీతకు సంబంధించి సిగ్గుమాలిన ఆయాచిత గౌరవాన్ని ప్రదర్శించాననే అభియోగం నాపై మోపారు. మున్ముందు డి.యస్.ఆర్.గారు రామాయణం ఇతివృత్తం పై వచ్చిన ఆధునిక కృతుల్ని (ఆధునికం స్ఫూర్తిలో అనుకొండి) వ్యంగ ధోరణిలో ఖండించాలనుకొంటే ఆయన ముందుగా కనీసం ఒక్కసారైనా వాల్మీకి రామాయణం చదవ వలసి వుంది, అదీ నిశితంగా అధ్యయనం చేయవలసి ఉంది.



తన సమీక్ష ముగిస్తూ డి.యస్.ఆర్. నన్ను గేలి చేసేందుకు షేక్‌స్పియర్‌ను ... ఈడ్చు కొచ్చారు. వాయనం తిరిగి ఇస్తున్నట్లు నేను షేక్‌స్పియర్ మాటలనే ఉటకించాలా;



"ఓరి అజ్ఞాన భూతమా, నీ వెంతటి కురూపివి"!



తర్వాత ఈ విషయమై సాహిత్య అకాడెమీ అధికారుల మధ్య నార్ల వారి మధ్య ఉత్తర ప్రత్యుత్తరములు జరిగినవి. ఎట్టకేలకు నార్ల వారు "... ఎన్నడూ ఏ పురస్కార గ్రహితనూ అకాడెమీ తన పత్రిక ద్వారా అపనిందలకు గురి చేయ లేదు. అకాడెమీ నా పట్ల ప్రవర్తించిన తీరుకు పురస్కారాన్ని తిరస్కరించటం మినహా మరో మార్గం లేదంటున్న నాతో స్వాభిమానం గల రచయిత లందరూ తప్పక ఏకీభవిస్తారు" అని పురస్కారాన్ని తిరస్కరించారు.



పై విషయాన్ని పురస్కరించుకొని, మాజీ వైస్ ఛాన్సలర్ డా.హోమా. నాయక్, గుల్బర్గా విశ్వ విద్యాలయం నార్ల వారిని సమర్థిస్తూ ఈ క్రింది విధంగా వ్రాశారు:



"... నార్ల అభిప్రాయాలు స్పష్టంగానే ఉన్నాయి. ఆయన నిర్ణయం పరిశుద్ధమైనదే. ఆయనను బాగా ఎరిగి వున్న వారూ, ఈ ఉదతం తెలిసిన వారూ ఆయనను నిశ్చయంగా తప్పు పట్ట లేరు. ... "ఇండియన్ లిటరేచర్" సంపాదకుడు ఆంగ్ల కవితా సృజన కర్త. ఆయన కొంచెం ఔచిత్యాన్ని ప్రదర్శించి ఉంటే అకాడెమీ ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొనాల్సి వచ్చేది కాదు".






ముగింపు:



"మంచి ప్రపంచంలో ఉత్కృష్ట మానవుల కోసం" నార్ల వారి జీవన పోరాటం. ఆ అన్వేషణలో ఒక భాగమే ఈ "సీతజోస్యం". దీనిలో వ్యక్త పరచిన అంశాలు కేవలం నార్ల వారి పరిశోధనల ఫలితం మాత్రమే కాదు, ఆయన పూర్వ పరిశోధకుల ఫలితాలను విస్తృత పరచి, రామాయణం నుండి రుజువులు చూపించారు. నార్ల రచనలు లోతైన ఆలోచనలతో, భావ పరిపుష్టి కలిగి, వివరాలతో నిండివుంటాయి. "సీతజోస్యం" పీఠిక వారి పాండిత్యాన్ని వెల్లడిస్తుంది. దానికై వారు జరిపిన అధ్యయనం విశేషించి హర్షించదగినది. అనితర సాధ్యమంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. "సీతజోస్యం" ఇతర భాషల లోనికి అనువదింప బడుట తెలుగు వారు గర్వించ తగిన విషయం. ఆవేశ రహితంగా ఆలోచించ గలవాడే మేధావి. తర్కానికి భిన్నమైన దానిని, తిరస్కరించుట మేధావుల లక్షణాలలో పేర్కొన దగినది. నిజమైన మేధావులు మనకు చాలా తక్కువ మంది. వారిలో నార్ల వెంకటేశ్వరరావు గారొకరు. ముట్నూరి వారిని ఆదర్శంగా పెట్టుకొని, వ్యక్తి గతమైన రాగ ద్వేషాలకు తావివ్వ కుండా, సంపాదకీయ బాధ్యతలను నిర్వహించిన ప్రముఖ సంపాదకులు నార్ల. వారి మేధకు ప్రణ మిల్లుతూ ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

కృతజ్ఞతలు: ఈ వ్యాస రచనలో నార్ల వారి స్వీయ రచనలే కాక వారు ఉల్లేఖించిన రచనలలో కొన్నిటిని నేను స్వయంగా పరిశీలించే అవకాశం లభించింది. నార్లతో సహా, ఆయా రచయితలకు ఇందు మూలంగా నా కృతజ్ఞతలు తెలియ జేయడమైనది.

No comments:

Post a Comment