Friday, 10 January 2014

Timiramto Samaram (తిమిరంతో సమరం)

ప్రవేశిక:

తెలంగాణ మాగాణం పండించిన కవి శ్రేష్ఠులలో మహారథి శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు గారు. కవితా పయోనిధిగా ప్రఖ్యాతి గాంచిన దాశరథి బహుముఖ ప్రజ్ఞానిధి. దాశరథి గారు కవి, ఉద్యమశీలీ, మహావక్త, అనువాద ప్రక్రియా దురంధరులు, అన్నిటి కన్నా మించి మానవత రూపు కట్టిన స్నేహశీలి. దాశరథి గారు 22-07-1925న శ్రీమాన్ వేంకటాచార్యులు, శ్రీమతి వేంకటమ్మ గారికి జన్మించారు. వారి స్వస్థలం అప్పటి వరంగల్ జిల్లా (ఇప్పటి ఖమ్మం జిల్లా) లోని చిన గూడూరు గ్రామం. కృష్ణమాచార్యుల వారి పూర్వికులు భద్రాచలం నివాసులు. విశిష్టాద్వైత శాఖకు చెందిన వారు. శ్రీరామ భక్తులు కావడం మూలాన వారి ఇంటి పేరు "దాశరథి" అయినదని ప్రసిద్ధి. కృష్ణమాచార్యుల తండ్రి గారైన వేంకటాచార్యుల వారు గొప్ప సంస్కృత విద్వాంసులు. వారి తల్లి గారు సహితం, తెలుగు సాహిత్యం లో మంచి ప్రావీణ్యం కలవారని చెప్పుకొంటారు వారి కుటుంబ పరిచితులందరూ. అటువంటి తల్లి తండ్రుల పెంపకం బాలుడైన కృష్ణమాచారిలో సాహిత్య బీజాలు నాటింది. తర్వాత కాలంలో "కృష్ణమాచార్యులు" మరుగున పడి, దాశరథిగా ఆయన పేరు స్థిర పడింది.

దాశరథి విద్యాభ్యాసం ఖమ్మంలో మొదలైంది. నాటి నిజాం ప్రభుత్వం ఉర్దూ భాషను బోధనా భాషగా నిర్ణయించి నందున విద్యాభ్యాసం పూర్తిగా ఉర్దూ లోనే జరిగింది. "ఇంట్లో మాత్రం మా నాయనగారు సంస్కృత భాషాధిక్యత గురించి చెప్పే వారు..." అంటారు దాశరథి. దాశరథిని కవితా కన్య బాల్యం లోనే వరించింది! పూవు పుట్టగానే పరిమళిస్తుందని కదా నానుడి! ఆ విధంగా దాశరథి ఏడో తరగతి లో జరిగిన ఒక సంఘటన సమకాలిక మిత్రులు ఇలా చెప్తారు. "పాఠశాలలొ కవి సమ్మేళనం జరిగి నప్పుడు 12 సంవత్సరాల బాలుడైన దాశరథి గంభీరముగా పెద్దల ముందు 25 పద్యాలు చదివారుట! ఆ ధారకీ, కవితా శక్తికీ, పఠన మాధుర్యానికీ, అబ్బుర పడిన ఆనాటి సభాథ్యక్షులు (సుబేదార్ నారాయణ రావు), దాశరథిని కౌగలించు కొని, నాకు అంతగా తెలుగు రాక పోయినా, నీ కవిత్వం బాగుందని అంటూ "ఏక్ దిన్ తెలుగుకా శాయిర్ అజమ్ బనేగా" (ఒక రోజు మహాకవి వి కాగలవు) అని ఆశీర్వదించి, వంద రూపాయలు బహుకరించారట! ఆ భవిష్యవాణి నిజమై, దాశరథి మహాకవిగా పరిణమించుట యే కాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆస్థాన కవిగా నియమితులై అపార కీర్తి గడించిన విషయం విజ్ఞులైన పాఠకులకు విదితమే! ఆ విధంగా 12వ యేట మొదలైన దాశరథి కవితా ప్రస్థానం దాదాపు 50 సంవత్సరాలు నిరంతరంగా సాగింది. వారి జీవిత సమర విశేషాలు పాఠకులకు విదితమే!

దాశరథి సాహిత్య ప్రస్థానం:

దాశరథి గారి కవితా ప్రస్థానం, కవితా సాధన ప్రధానంగా మూడు విషయాలపై ఆధార పడి ఉంది. మొదటిది దేశభక్తి భావన, రెండవది అభ్యుదయ దృక్పథం, మూడవది సాంప్రదాయ వివేకం. ఈ మూడే కాక, నాల్గవ అంశం కూడా దాశరథిలో అంతర్లీనంగా ఉంది. అదే, శృంగార భావన! ఈ భావన కొంత మేరకు అగ్నిధార, కవితా పుష్పకం మొదలైన కావ్యాల లోను, చలన చిత్ర లలిత సంగీత గేయాల్లోను, వ్యక్త మౌతుంది. అర్థ శతాబ్ది కాలంలో దాశరథి గారు దాదాపు 31 గ్రంథాలు రచించారు. వానిలో అన్ని రకాల సాహిత్య ప్రక్రియలు చోటు చేసుకున్నాయి. అన్ని గ్రంథాల వివరాల విశ్లేషణ, మరో గ్రంథంగా రూపొందుతుంది. అందుచేత ఆ ప్రయత్నం ఈ వ్యాస కర్త ఉద్దేశ్యము కాదు. అయినప్పటికీ, దాశరథి సమగ్ర సాహిత్య విహంగ వీక్షణానికి, ఈ వ్యాసం ద్వారా ప్రయత్నిస్తాను. ఇది సాహసంతో కూడిన ప్రక్రియ. సహృదయులైన పాఠక మహాశయులు దీనిని కేవలం పృష్ఠ భూమిగా గ్రహించి, స్థూల దృష్టితో స్వీకరిస్తారని ఆశిస్తాను. కాని తిమిరంతో సమరం అను కావ్యాన్ని మాత్రం సూక్ష్మ దృష్టితో పరిశీలించు యత్నం జరిగింది. ఆ కావ్యం 1974వ సంవత్సరంలో ప్రచురితమైన తెలుగు గ్రంథాలలో ఉత్తమ మైనదిగా ఎంపికై, కేంద్ర సాహిత్య అకాడెమీ జాతీయ పురస్కారాన్ని అందు కొన్నది. అది ఈ వ్యాసం లోని ప్రధానాంశం.

దాశరథి రచనలు:

ఇది వరలో పేర్కొన్నట్లుగా దాశరథి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కలం రకరకాల పరవళ్ళు త్రొక్కింది! ఆయన కలం నిప్పు లెంతగా కురిపించిందో, పూల సౌరభాన్ని అంతగానూ పంచింది. సాహిత్యం లోని దాదాపు అన్ని ప్రక్రియల లోను ఆయన రచన చేశారు. ప్రక్రియా వైవిధ్యమే కాక, రచనా వైశిష్ట్యము సహితం దాశరథి గారి రచనలో మనకు స్ఫురిస్తుంది. సాహిత్యమే ఊపిరిగా గల దాశరథి, వివిధ రచనలు చేయడం సహజమే కదా?! 1949 -1987 మధ్య కాలంలో దాశరథి గారు రచించి న కొన్ని ముఖ్య రచనలను పరిశీలిద్దాం!

అగ్నిధార:

దాశరథి అచ్చైన పుస్తకాలలో మొదటిది "అగ్నిధార", ఇది 1949 లో ప్రచురిత మైనది. శ్రీ దేవులపల్లి రామానుజ రావు గారు దీనికి తొలి పలుకు వ్రాశారు. అగ్నిధార లోని కవితా ఖండికలు చాలావరకు దాశరథి జైలు లోను, జైలు నుండి విడుదలైన కొత్త లోను వ్రాసినవి. నిజాం రాష్ట్రం లో ప్రభుత్వ నిరంకుశత్వం, ప్రజల అగచాట్లు, భారత స్వాతంత్ర్యం, భారత సైన్యాల హైదరాబాదు ప్రవేశం, నైజాం ప్రభుత్వ పతనం - ఈ కావ్యం లోని రచనలకు పునాదులు. అగ్నిధార అనే పేరునే చాలా మంది ఆక్షేపించారు! అగ్ని ధారలా ప్రవహిస్తుందా?! అగ్ని అనేది చైతన్యానికి సంకేతం. ఆ చైతన్యం ఒక మానవుని హృదయములో నుండి మరొకని లోనికి ప్రవహించి ఇట్టే జాతి నంతటినీ ఏక సూత్రాన బంధిస్తుంది. దాశరథి అనగానే మన స్మృతి పథంలో పరుగులెత్తే పద్యం:

ప్రాణము లొడ్డి ఘోరగహనాటవులన్ పడగొట్టి మంచి మా

గాణములన్ సృజించి ఎముకల్ నుసి చేసి పొలాలు దున్ని భో

షాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే, తెలం

గాణము రైతుదే; ముసలి నక్కకు రాచరికము దక్కునే?

ఓ నిజాము పిశాచమా! కానగ రాడు - నిన్ను బోలిన రాజు మా కెన్నడేని;

తీగెలను తెంపి, అగ్నిలో దింపినావు - నా తెలంగాణ, కోటి రత్నాల వీణ.

రతనాల వీణ తెలంగాణా భూమి అయితే, రతనాలు తెలంగాణ ప్రజలైతే, తీగలు ఆ ప్రజల మనో భావాలు! ఆ మనో భావాలను అవమానించి, అవహేళన చేసి, బాధలకు గురిచేసిన కారణంగా –

వీణియ తీగపై పదును పెట్టిన నా కరవాల ధారతో

గానము నాలపించిన స్వకంఠము నుత్తరణం బొనర్చి స్వ

ర్గానకు భూమి నుండి రస గంగలు చిమ్మెద పీడిత ప్రజా

వాణికి మైకమర్చి అభవాదులకున్ వినిపింప చేసెదన్

జైల్లో రజాకార్లు ప్రవేశించి దాశరథిని చితకబాది, పడవేసి త్రొక్కారు, మూతి పగుల గొట్టారు. మూడు రోజులు అన్న పానీయాలు మ్రింగుడు పడలేదు. ఆ అనుభవాన్ని అంతా పద్యాలలో పలికించారు. అందుకే స్వకంఠమ్మునుత్తరణం బొనర్చి స్వర్గానకు భూమి నుండి రస గంగలు చిమ్మెద నన్నాడు. పీడించేవారు స్వర్గంలో విహరిస్తున్నారు, వారికి కనువిప్పు కలిగేలా కరుణ రస గంగలను చిమ్ముతా నంటున్నాడు. పీడిత ప్రజలకు మైకుగా మారి వారి వ్యధలను, కథలను అభ వాదులకు (పునర్జన్మపై నమ్మకం లేనివారికి) వినిపింప జేస్తా నంటాడు. తురుష్కులు అంటే, నిజాం ప్రభువులని అర్థం.

"దాశరథి కవితా శరములు చాలా వాడి యైనవి. కాని ఈ కవితా శరము లన్నీ అగ్ని బాణము లను కోవడము న్యాయము కాదు, వీనిలో అనేకము మదిలో మధుర భావాలను పులకెత్తించే కుసుమ శిరాలు" అని దేవులపల్లి రామానుజ రావు గారు పేర్కొనుట సమంజసం. ఋతు వర్ణన కవిత్వంలో అనాదిగా ఉన్నదే. ఒక్కొక్క కవి ఒక్కొక్క విధంగా వర్ణించడం అయా కవుల ప్రతిభను వెల్లడిస్తుంది. కాని, దాశరథి ప్రకృతి వర్ణనలో ప్రణయాన్ని, హృదయ తాపాన్ని వినూత్నంగా వెల్లడించారు గమనించండి:

వానల లోన క్రొంజలువ వాగులలో, వడగండ్లలో పసం

దైన పయంటయున్ పిరుద నంటిన చీరయు, నానిపోవ రా

వే ననకన్నె! కొంగున చలించెను నీ తనువల్లి యెల్ల! శీ

తానిల ధారలో వలువ లారగ గట్టుము నా బుజాల పై.

పైన పేర్కొనిన వానా కాలం వర్ణనలో ప్రణయారాధన చివరి పంక్తిలో ప్రస్ఫుటంగా వ్యక్త మౌతుంది. కవికి ఉండవలసిన ఆత్మవిశ్వాసమునకు దాశరథిలో లోటు లేదు. తన కవితను గూర్చి, కావ్యాలను గూర్చి ఆయన వ్యక్త పరచిన అభిప్రాయాలు ఏమాత్రము అతిశయోక్తులు కావు. ఆత్మ విశ్వాసానికి అవి నిదర్శనాలు. ఈ క్రింది పద్యాన్ని పరికించండి:

నా దొక వెర్రి; త్రాగుడున - నాడును వీడును అమ్ముకొన్న ఉ

న్మాది వలెన్ కవిత్వమున - నా సకలమ్మును కోలుపోయి రా

త్రీ దినముల్ రచించితిని - తీయని కావ్య రస ప్రపంచముల్;

వేదన యేదియో కలత - వెట్టును గుండియ నెందుచేతనో?

అగ్నిధార కావ్యం లోని అనేక ఖండికలను గూర్చి యెంతైనా విశ్లేషించ వచ్చును. కాని స్థలాభావం అందుకు అనుమతించదు. ఈ కావ్యాన్ని దాశరథి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ వట్టికోట ఆళ్వారు స్వామికి అంకిత మిచ్చారు. ఆ కవితలోని కొన్ని పంక్తులు:

స్వార్థం రాచరికం నెరపే లోకంలో - నిస్వార్థి

ఆశ్రయింపు లెరుగని వాడు - విశ్రాంతి తెలియని వాడు

స్వసుఖం కోరని వాడు - వారం వారం మారని వాడు . . .

మనిషి మనస్సులో మంచినే గాని - చెడు అనే మాలిన్యాన్ని వెతక తల పెట్టని వాడు

మిత్రుని కోసం కంఠం ఇవ్వగల వాడు - అతని కీ అగ్నిధార అంకితం.

రుద్రవీణ:

ఈ ఖండ కావ్యం 1950 లో ప్రచురిత మైనది. ఇందులో దాదాపు 18 కవితా ఖండిక లున్నవి. పద్య రచనా విధానములో ఆరితేరిన వారు దాశరథి. గాఢమైన భావన, రస నిర్భరంగా పలికే శబ్ద విన్యాసం, అప్పుడప్పుడూ వ్యంగ్యార్థం, సాధారణ పద్య భావాన్ని మరిపించి పాఠకుల మనసులను ఆర్ద్రత తో నింపుతాయి, ఇందులోని కవితలు.

మూర్ఛన అనే కవితలోని ఒక పద్యాన్ని పరిశీలించండి.

చింతల తోపులో కురియు చిన్కులకున్ తడి ముద్దయైన బా

లింత యొడిన్ శయనించు పసి రెక్కల మొగ్గను వోని బిడ్డకున్

బొంతలు లేవు కప్పుటకు; బొంది హిమం బయిపోవు నేమొ? సా

గింతును రుద్ర వీణ పయి నించుక వెచ్చని అగ్ని గీతముల్.

పై పద్యంలో నాటి తెలంగాణా ప్రాంతంలో తలదాచు కోవటానికి ఇండ్లు లేని పేదల ఇక్కట్లు స్పష్టంగా వ్యక్త మౌతాయి. కనీసం బాలెంత అని కనికరించి ధనవంతు లెవ్వరూ తలదాచు కోవడానికి ఇంత చోటు ఇచ్చిన పాపాన పోలేదని ధ్వని. బొంతలు బీదరికానికి ప్రతీక. కప్పుకోడానికి కనీసం అవి కూడా లేవు. బీద వారికి పూరి పాకలే మహాసౌధాలు. వాటికి కూడా వారు నోచుకోలేదు. చివరకు చింత తోపే గూడు. ఆ దీన స్థితిని కండ్లార చూచిన దాశరథి పద్యంలో పలికించాడు. రుద్రవీణపై మ్రోగిస్తానన్నాడు. రుద్రవీణ అంటే తెలంగాణా అని భావం. అగ్ని గీతాలంటే చైతన్యం రగిలించే పద్యాలు. శరీరం వేడెక్కడానికి, పుట్టిన బిడ్డకు కూడా విప్లవ భావాలతో వేడి పుట్టించి బ్రతికిస్తాను అంటాడు కవి దాశరథి! ఎంతటి గొప్ప భావన!

స్వామిపూజ అనే మరో కవితలో భారతదేశం పర పాలనలో పడుతున్న ఇక్కట్లను సహించ లేని దాశరథి, తెల్లవారి చర్యలకు కోపించి కన్నులు నెత్తురు చిమ్ము తున్నాయని ప్రతీకాత్మకంగా నిందిస్తాడు. ఆ పద్యాన్ని ఆస్వాదించండి:

పడమర గాలి తాకిడికి వాడియు రాలిన పూలజాలులో

యెడదయు వాడి పోయినది యెట్టుల నిన్ గయి సేతు నింక? నీ

అడుగుల సవ్వడిన్ వినిన యంతనె నా నవ నాడు లెందుకో

గడగడ లాడు, నెత్తురులు కన్పడు నా నయనాంచలమ్మున్.

పడమర గాలి తెల్ల దొరల పాలనకు చిహ్నం. వారి నిరంకుశత్వంలో వాడిపోయిన పూలు భారత ప్రజానీకం. పై పద్యం లోని వ్యంగ్యార్థం గ్రహించ దగ్గది! భారత దేశం స్వతంత్ర మైంది. అదే తరుణంలో నిజాం రాజు తెలంగాణా ప్రజలపై విషాన్ని గుప్పించాడు. కాశిం రజ్వీ చేతికి పెత్తన మిచ్చి ప్రజలను నానా హింసలకు లోను చేసి, అనేకుల మాన, ప్రాణాలను దోచు కున్నాడు. ఆనాటి అనుభవాలను వర్ణించిన తీరును గమనించండి.

మత పైశాచి వికార దంష్ట్రి కలతో మాభూమి లంఘించి మా

కుతుకల్ గోసెడి వేళ గూడ యెటు దిక్కున్ తోచకున్నప్పుడున్

బ్రతుకే దుర్భరమైన యప్పుడును ఆంధ్రత్వమ్మును పోనాడ లే

దు, తుదిన్ గెల్చితి మమ్మ యుద్ధమున రుద్రుల్ మెచ్చ నాంధ్రాంబికా.

పై పద్యంలో తన అనుభవాలను స్పష్టంగా చిత్రించాడు కవి. ధైర్యంతో రజాకార్ల నెదిరించి పల్లెలను కాపాడు కొన్నారు ప్రజలు. అప్పుడు జరిగిన అమానుష చర్యలకు బాధ పడి, మానవత్వము తనను తానే తిన్నదని విలపించాడు దాశరథి. జంతు జాతిలో సహితం, పాము, పెద్ద పులి మాత్రమే తమ సంతానాన్ని తింటాయట! అటువంటి చర్యగానే ఆనాటి పరిస్థితిని విశ్లేషించారు దాశరథి.

నాడు మానవతీ నయనమ్ములందు - నాగ సర్పాలు తలలెత్తి నాట్యమాడె

నాడు మానవతా నవ నాగరకత - తన్ను తిన్నది రాక్షసత్వముతోడ.

దాశరథి కవిత్వంలో ఏ పద్యం ముట్టుకున్నా ఒక చరిత్ర, ఒక ప్రతీక, ఓ అగ్ని శకలం జ్వలిస్తూనే ఉంటుంది.

మహాంధ్రోదయం:

తెలంగాణాలో దేశాభిమాన ప్రబోధక గీతము లాలపించిన కవులలో దాశరథి ది అగ్రస్థానం. ఈయన కవిత్వం లలిత పద చమత్కార సంపన్నమై, చదివిన కొలదీ, చవులూరించు చుండును. భావావేశము దేశాభిమాన కవిత్వానికి ప్రధాన లక్షణము. ఈ లక్షణం దాశరథిలో పుష్కలంగా ఉంది. మహాంధ్రోదయం కావ్యం దేశాభిమానోద్దీపక కవితా సంపుటి. ఈ కావ్యం 1955 లో ప్రకటిత మైనది. దీనిని దాశరథిగారు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారికి అంకితము చేశారు. ఈ కావ్యానికి శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు పీఠిక వ్రాశారు. ఇందులో దాదాపు 15 కవితా ఖండిక లున్నవి. ముఖ్యమైన కవితలు ఆస్వాదిద్దాం! దాశరథిగారిలో పూర్వ కవుల పోకడలతో పాటు, అధునాతన కవుల రాకడలు నున్నవి! ఈ క్రింది గేయాన్ని పరికించండి:

తెలుగు నింగి దారులలో - వెలుగు పులుగు రెక్కలార్చి

చిమ్మివైచె తర తరాల - చిక్కని చీకట్ల నెల్ల.

పైన ఉదహరించిన పంక్తులు మహాంధ్రోదయం అనే గేయం లోనివి. ఎంత చక్కని శబ్ద చిత్రణ మో, ఎంతటి భావ గర్భిత కృతి యో గమనించండి! మనసును రంజింప జేయుటలో శబ్ద చిత్రణములు అమోఘంగా పని చేస్తాయి. ఆ కళలో ఆరితేరిన వాడు దాశరథి! గాఢ దేశాభిమానం వ్యక్త మవుతుంది ఈ కవితా ఖండికలో. అందుకే అంటారు కవి:

తెలుగు ఊరులు - తెలుగు వారలు

ప్రతి ఫలించే మహా కావ్యం - నాకు కావలె, నాకు కావలె.అంతటితో ఆగక -

కోటి తమ్ముల కడ రెండు కోట్ల తెల్గు - టన్నలను గూర్చి వృత్తాంత మంద జేసి

మూడు కోటుల నొక్కటే ముడి బిగించి - పాడి నాను మహాంధ్ర సౌభాగ్య గీతి.

ఆ నాటి తెలంగాణా జనాభా కోటి మంది. ఇతర తెలుగు వారు రెండు కోట్ల మంది. అందుకే ముక్కోటి ఆంధ్రులన్న గణన! ఈ నాటి జనాభా అంతకు రెండున్నర రెట్లయినది. దాశరథి వ్యక్త పరచిన అభిమతం తారుమారుగా అయ్యే సంకేతాలు దగ్గిర పడినవేమో? అనిపిస్తుంది!

దాశరథి కవితలో పూర్వ కవుల పోకడలు కనిపిస్తవని ఇదివరలో చెప్పడం జరిగింది. అందుకు ఉదాహరణగా ఈ పద్యం తిలకించండి!

పౌషము వనితా మధురా - శ్లేషము, శృంగార రస విశిష్ట జగత్సం

తోషము, నగ్నాయిత తరు - శేషము, శిశిరాని లోపచిత వేషంబున్.

పైన పేర్కొనిన పంక్తులు మహాకవి పోతన్న గారి శైలిని పుణికి పుచ్చు కొనినట్లు తెలియ పరుచు చున్నవి. ఇది "పౌష లక్ష్మి" ఖండిక లోనిది. అలాగే,"మాధురి" అనే కవిత నుండి మరో పద్యాన్ని పరిశీలించండి. అందులో ప్రబంధ కవుల పోకడలను చూడ వచ్చును.

గుమగుమ లాడి నా మనసు గొన్న నవాబ్జ సఖీ ముఖాను రా

గమున సుమించె చంపకము; కౌగిలిలో ప్రసవించె గోరటల్;

సుమ రమణీయమై తగె నశోకము తచ్చరణాహతిన్; ప్రహా

సమున సుమించె పొన్నలు పసందగు నందన దివ్య వాటిలో.

నూతన సంవత్సరమును నాతితో పోల్చి ఆమె ముఖ రాగమున కౌగిలిని చరణాహతిని ప్రహసనమున నందన దివ్య వాటిక లోని చంపక, కురంటక, అశోక, పున్నాగ చెట్లు పూచినవట! అలాగే, "కాపయ నాయకుడు" అనే ఖండికలోని ఈ పంక్తులు విశేషించి గమనింప దగినవి:

ముక్కలైన మాతృమూర్తి గేహమ్మును - కూర్చి కట్టుడోయి కొమరు లార!

మనము మనము కలహమున మునింగిన యెడ - మన మహాంధ్రలక్ష్మి మనకు రాదు.

మూర్తీభవించిన తెలుగు తనమే దాశరథి. ఆయన మహాంధ్రోర్వరనున్న తెలుగు వారి కందరికి మంగళాశంసనముగా సమర్పించుచున్న కానుక ఈ మహాంధ్రోదయము.

పునర్నవం:

"ఏదో చెప్పాలనే కోర్కె, చుట్టు పక్కల మనుష్యుల్లో, వాళ్ళ క్రియా కలాపాల్లో ఆసక్తి, కనబడే లోకంలో కనబడని లోకంలో కాంక్ష, ఆకారం మీద అనురాగం - ఈ నాలుగూ గుండెను కవ్వించి కలం చేపట్టిస్తాయి. అచ్చంగా సొంత అనుభవాలు, వ్యక్తికీ సంఘానికీ గల చుట్టరికం, ప్రకృతికి మనకు గల పారస్పరిక బాంధనం, నవ సృష్టి కోసం కృషి - ఈ అయిదు కవితా సౌధ రచనకు వాస్తు శాస్త్రంలా తోడ్పడతాయి" అంటారు దాశరథి పునర్నవం అనే కావ్యంలో! ఈ కావ్యం 1956 లో ముద్రిత మైనది. ఇందులో దాదాపు 22 కవితా ఖండిక లున్నవి. దీనికి తొ లి పలుకుగా పి.వి.రత్నం గారు ప్రచురించిన పునర్నవం విమర్శను పొందు పరచారు. సుదీర్ఘమైన ఈ విమర్శలో కావ్యాన్ని గురించిన అనేక విషయాలు తెలియ పరచారు. దాశరథి గురించి చెబుతూ ఆయన నిద్రాణమైన తెలంగాణాను తన కవిత ద్వారా మేల్కొలిపిన వైతాళికులని అభివర్ణించారు. దాశరథి గారి స్వాతంత్ర్య భావాలు, అభ్యుదయ పోకడలు అపారమని పేర్కొంటూ, ఆయనకు బానిసత్వం, అన్యాయం అంటే అసహ్యం అని ఉద్ఘాటించారు. "తెలంగాణం" అనే కవితను ఉల్లేఖించి, ఆ ఖండికలోని కొన్ని పంక్తులు పేర్కొన్నారు, పరికించండి:

తమ మంత్రం పారదింక - ఉచ్చు త్రెంచు కొనెను జింక

ఇక స్వేచ్ఛా ప్రయాణము - ఇదే తెలంగాణము. తెలుసా?అన్నాడు.

మనిషి జీవితంలో బాల్యం అతి మధురమైన దశ. "బాల్యం" గురించి దాశరథి చెప్పిన తీరును చదివి మనం ఆశ్చర్య పోతాం. ఆనందిస్తాం. ఆహా! అనుకుంటాం. బాల్యం అనే గేయాన్ని సాహిత్యంలో ఒక కోహినూర్ అని అభివర్ణిస్తారు రత్నం గారు. ఆ కవితలోని కొంత భాగం ఆస్వాదించండి:

దుర్మార్గాలకీ, దుఃఖాలకి ఇవతలి గట్టున - తొంగి తొంగి చూస్తున్న లోకం బాల్యం ...

"అసలు బ్రతుక్కి ఆనందపు పొలిమేర - పసితనం గాక మరేముంది చెప్పండి" అంటాడు.

మీరు ఆలోచనలో పడి పోతున్నప్పుడే -

"డబ్బు సంపాదనకు కావలసిన రహస్యాలు - దానికోసం చేయ వలసిన సదస్యాలు

బ్రతుకులో ఏ భాగంలో వుండ వంటే - ఇదో ఈ భాగంలో, బాల్యంలో".

కవితలోని ప్రతి పదంతో మనలో ఆలోచన రేకెత్తించి, అనుభూతులు కలిగించి, మనల్ని వినూత్న లోకాల్లో విహరింప జేస్తాడు దాశరథి. భాషలో మాధుర్యం, చెప్పడంలో సొగసు గమనించండి. విచిత్ర మేమిటంటే బాల్యం గురించి చిన్న పిల్లలకు సహితం అర్థమయ్యేలా వ్రాశాడు! చూడండి:

నాగ జెముడు గుచ్చు కుంటుందనీ - నాగసర్పం కరుస్తుందనీ -

నమ్మించి మోసం చెయొచ్చనీ, -

అన్నల్ని తమ్ముళ్ళూ, తమ్ముళ్ళని అన్నలూ - అనాయాసంగా పొడి చేసుకో గలరనీ ...

ఉన్న దాన్ని ఉన్నవాళ్ళందరిలో పంచి - ఉన్నంతలో అందరం కలిసి భోంచేసి

ఉజ్వలంగా ఆటల్లో పాటల్లో పడి - ఊరంతా తిరగడం ఎంత బాగుంటుంది?

దాశరథి అందరూ హాయిగా జీవించాలని కోరుకుంటాడు! అంతకంటే సామ్యవాదం మరేముంది?నా పేరు ప్రజా కోటి అనే మరో గేయంలో

గతాన్ని కాదనలేను - వర్తమానాన్ని వద్దన బోను

భవిష్యత్తు వదులు కోను; - కాలం నా కంఠమాల;

నా పేరు ప్రజా కోటి - నా ఊరు ప్రజా వాటి.

అంటూ తానెవరో ప్రజలకు తెలియ జేస్తాడు. వినండి దాశరథి గర్జనలు! పునర్నవం అను ఖండికలో నిజమైన కవిత్వానికి నిర్వచనం చెప్తాడు! పరిశీలించండి:

రోజూ పొందని ఆనందానుభూతి - పొందడం అంటేనే కవిత్వం ...

మనసు మల్లె పొదల్లోంచి - పసందైన వాసనలు వీచి

అవి పద్యాల సీసాల్లో - అనంత కాలం నిలిస్తే కవిత్వం.

"ఔను. దాశరథి కవిత కలకాలం నిలుస్తుంది. ఆ కవితలో కొత్తదనం వుంది, కమ్మదనం ఉంది, ఘాటు వుంది, గర్జన ఉంది, అనుభూతి ఉంది. ఒక్కమాటలో వర్ణించాలంటే నవరత్నాలు, నవరసాలూ వున్నాయ్". "పునర్నవం" లో ఎక్కువమంది మెచ్చుకొని, ప్రయోగాత్మక కవితగా పేరు పొందిన కవిత మస్తిష్కంలో లేబొరేటరీ విజ్ఞానశాస్త్ర విషయాలను మేళవించి తన భావాలను చెప్పటం "పునర్నవం" లో వ్యక్త మౌతుంది. మానవ మస్తిష్కమే ఒక ప్రయోగశాల అంటారు దాశరథి. ఈ ప్రయోగశాలలో అణ్వస్త్రాలు, బాంబులు వంటి విధ్వంస పరమైనవి తయారు చేయ బడవు. మానవ ప్రగతికీ, శ్రేయస్సుకీ ఉపయోగ పడేదే మస్తిష్కం. వినాశానికి దూరంగా వుండాలన్నదే దాశరథి ఆశ.

మస్తిష్కంలో వెలిగే - మా ఇంటికి ముందుండిన

లేబొరేటరీ తెరిచి వుంది - మధన పడే మేధావుల

శిధిలాశలు చివురించే - రస రాజ్యం లేబొరేటరీ.

అని దీర్ఘ కవితా ఖండికను ముగిస్తారు కవి.

దాశరథి ప్రతిభను చూపటానికీ, చాటడానికీ, మనం సగర్వంగా చెప్పుకోడానికి ఒక్క "పునర్నవం" కావ్యం చాలు ననే అభిప్రాయాన్ని వ్యక్త పరచారు పి.వి.రత్నం తమ విమర్శలో.

అమృతాభిషేకము:

అమృతాభిషేకం అనే కావ్యాన్ని దాశరథి గారు 1959వ సంవత్సరంలో వ్రాశారు. దీనిని డా. బెజవాడ గోపాలరెడ్డి గారికి అంకితము ఇచ్చారు. అమృతాభిషేకానికి ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు దాశరథి కవితా లోకము అను పేరిట విపుల ప్రవేశిక వ్రాశారు. ఈ కావ్యంలో 16 కవితా ఖండిక లున్నవి. కవితలన్నీ దేనికది చదివి ఆనందింప తగినవి. కవిగా దాశరథి పాత కొత్తల మేలు కలయికకు మంచి ఉదాహరణ. అసలు కవిత్వ మంటేనే "పాత విషయాన్ని కొత్త మాటల్లో చెప్పడం". అమృతాభిషేకము మొదటి కవిత సుప్రభాతము వృత్తాల్లోను, సీస గీతాల్లోను రచించారు దాశరథి. ఆ మేరకే దాని సాంప్రదాయ బంధనం. దాశరథి భావాలు మయూర కవి సూర్య శతకం భావాల వలె ఉన్నత మైనవి కాని సూర్య శతకం లోని కాఠిన్యత సుప్రభాతములో లేదు. మనం ప్రతి నిత్యం చూస్తున్న లోక బాంధవుని గూర్చిన కవిత ఇది. కొన్ని పద్యాలలోని అనుభూతులను ఆస్వాదిద్దాం:

ఈత డీతడే కావచ్చు నింద్ర దిశకు - పశ్చిమాశకు నడుమ రే బవలు నడచి

ఒకరి వృత్తాంతము మొక్కరి కొసగి యొసగి - స్నిగ్ధ బంధము గూర్చెడి స్నేహితుండు.

కేవలం స్నిగ్ధ బంధాన్ని కూర్చే స్నేహితుడే కాదు -

దైహి కారోగ్యమునే గాక తన కరాల - హృదయ మందలి రుజ నెల్ల వదల గొట్టి

ఆత్మకానందమును గూర్చు నట్టి వైద్యు - డతని కభివాద మొనరింతు నంజలింతు. ...

చేతనమ్ముల కెల్ల సంప్రీతి గూర్చి - బీజముల నుండి మొక్కలు వెలికి తీసి

తీవె లందున పుష్పాలు ప్రోవు బోసి - జగతికి విలాసమును గూర్చె సౌరమూర్తి.

ఈ శీర్షికలోనే మరో చోట -

ఇంక నిద్దుర పోయెదవేమె, సుదతి! - ఇరులె కురులయి పడి మొగ మెత్త నీక

బరువుగా నిన్ను నిద్రతో బాధ పెట్టు - తొలగ ద్రోచితి లెమ్ము మత్తు, విడి రమ్ము.

అంటారు ఇందులోని అలంకార భావాన్ని గమనించండి. దీపము - చీకటి, ఇవి జ్ఞానా జ్ఞానములకు ప్రతీకలుగా విజ్ఞులు గుర్తిస్తారు. సామాన్య పాఠకుడు వీని యందు దీపాన్ని - చీకటిని మాత్రమే చూస్తాడు. దాశరథి భావనలో ఇరులు (చీకట్లు) అందమైనవే! తిలకించండి:

ఇరుల కన్న అంద మెచట గానరాదు - ఇరులే సౌఖ్యములకు దరులు సుమ్ము

ఇరులు లేని నాడు నరులు కానగ రారు - నరులు లేని నాడు ధరణి లేదు.

చీకటిని ప్రేమించటం యోగికి, కవికి, ఎంత సహజమో వెల్తురిని ప్రేమించడం అంత సహజమే! జ్యోతిస్తమములు సత్య పదార్థము యొక్క మహా దశలు. దాశరథి గొప్ప వేదాంతిగా మనకు గోచరిస్తాడు. జ్యోతిస్తత్వము, దీపాంగన, చేతనా జ్యోతి అనే ఖండికలలో కూడా ప్రస్ఫుటించింది. ఈ విషయాన్ని ఆయా కవితలు వెల్లడిస్తాయి. వీనిలో ఉర్దూ, పర్షియన్ కవిత్వాల భావాలు మెఱుస్తూ ఉన్నాయి. ఈ క్రింది పద్యాన్ని పరిశీలించండి:

ఎరుకలు కాలిపోవునని ఎంత యెరింగియు - గూడ, దీపికా

తరుణి నవోప గూహమున తప్పు కొనన్ - బ్రయతింప బోని, ఈ

పురువుల ప్రేమ బంధమును బోలునె, - గొప్పలు చెప్పు చున్న ఈ

నరుల యధాను కూల - కుహనా వచనాంచిత రాగ బంధముల్?

దాశరథి దేశభక్తి నీటి యందు పడ వైచిన ఘన పదార్థము వంటిది. అది క్రమాభి వృద్ధి నొందు వలయములచే నిత్య విస్తృతము. మహాంధ్రి మున్నగు రచనలు ఈ విషయాన్ని దృవపరుస్తాయి. వధూనిక (వదినె) అను కవిత గుండె నిండిన కరుణ ఊట చెలమ! ఈ నాటి విభక్త - కలహాంతరిక జీవిత మందు ఎన్నియో దివ్య ప్రేమ దుర్గములు నేలమట్ట మగుచున్నవి. వదినె తల్లి పిట్ట అని దాశరథి చెప్పినమాట అక్షర లక్షలు చేస్తుంది! గమనించండి:

వానా కాల మందు కానల కోనల - చెట్ల కొమ్మ లందు చిన్ని గూట

రెక్క గొడుగు క్రింద డొక్కల ప్రక్కల - పట్టి గాచు తల్లి పిట్ట వీవు.

దాశరథి గారు శబ్దబ్రహ్మారాధకుడు అని అంటారు. అంటే అనవసరంగా వాగ్వ్యయము చెయ్యడం ఆయనకు ఇష్ట ముండదు. ఈ విషయాన్ని పాఠకులు వాగ్వజ్రం అనే కవితా ఖండికలో గమనింప వచ్చు.

మనిషి మనసును గెలుచు - మాట నారాధింతు - మాట లోపలి వజ్ర మర్యాద నెంతు ...

మాట కడుపున నున్న జ్వాల పై కెగసెనా - మరి పయోధులె యింకు మందరాద్రి వడంకు, ...

నరజాతి చించి చెండాడ లేచిన చేయి – తెగి నేల బడును నా సొగసు పద్దెపు జడికి.

అమృతాభిషేకము అనే ఖండికలో కూడా కవి ఈ భావమునే మరింత స్పష్టము చేశారు.

ద్వేషాగ్ని యార పీయూష ధారలు వార - పద్యాలు కొన్నింటి పాడ వలయు,

కాఠిన్యములు డింద కరుణమ్ము పెంపొంద - పదముల గొన్నింటి వాడ వలయు

విసమెల్ల డుల్ల రస ముప్ప తిల్లగా - వివిధ భావముల కల్పించ వలయు,

అసహనమ్ముల ద్రుంచ నైక మత్యము పెంచ - నిర్మల స్నేహమ్ము నించ వలయు,

వేప పూవులో చేదు విరిగి పోవ - రసన పై తీయ మాటలు విసర వలయు,

ఉదయమే లేని గాఢాంధహృదయమందు - చిత్రభాను సూనము వికసించ వలయు.

కవితాపుష్పకం:

ఈ కావ్యాన్ని 1966 లో రచించారు దాశరథి గారు. ఈ పుస్తకాన్ని వారి ఆప్తమిత్రులు శ్రీ దేవులపల్లి రామానుజ రావు గారికి అంకిత మిచ్చారు. ఇందులో 40 కవిత లున్నవి. అన్నీ గొప్ప రచనలే! చదివి మననం చేసుకుంటూ ఆనందింప తగినవి. వివరణ లేకుండానే అర్థ మవుతాయి. మచ్చుకు ఈ క్రింది పద్యాన్ని పరిశీలించండి:

పాల సముద్రమే నడచి వచ్చిన రీతి హిమాచలాగ్ర శృంగా

లు కరాలు సాచి మనకై అరుదెంచిన భాతి, శాంతి స

త్యాలు మనుష్య రూపమును దాలిచి నేలకు డిగ్గి నట్లు గాం

ధీ లలితాత్ము డుజ్వల మతిన్ భరతావని పైన కాలిడెన్.

పై పంక్తులు "అమృత మూర్తి" అను ఖండిక నుండి గ్రహించినవి. మహాత్మాగాంధిని గురించినవి. అలాగే "ప్రపాలిక" అనే కవిత నుండి ఈ పద్యాన్ని ఆస్వాదించండి:

పెదవిని దొండపండనేడి వెఱ్ఱి గతించెను! గోస్తనీ రసా

స్వద మధురాధరోష్ట పరిపక్వత నేమని ప్రస్తుతింతు! నీ

హృదయము నుండి లేచె రస హిండన మండిత దాడిమీద్వయం;

బెద నెద చేర్చి నన్ను మురిపింపుము నింపుము పానపాత్రికన్.

ప్రేయసి ఎరుపు అధరాలను దొండపండుతో పోల్చడం ప్రాచీన పద్ధతి. ఆ వెఱ్ఱి గతించినదట! అధరము లోని మధురాస్రవం ద్రాక్షాఫలాస్రవంతో సమానమని దాన్ని ప్రస్తుతించమని చెప్పడం చమత్కారం. పద్యంలో శృంగారం కొంత శృతిమించి నట్టే కనిపిస్తుంది! అలాగే "క్రాంతి కాంత" అనే గేయం లోని ఈ పంక్తులు పరికించండి:

భయపెట్టే ఈ లోకానికి - ప్రియ భావన కలిగించేవో?

నరకంలా కనబడు జగతిని - సురా లయము గావించేవో?

అని చెప్పడంలో వాక్య చమత్కారం బహుళార్థద్యోతకంగా ఉంది. చింతలతో, చికాకులతో, కష్టాలతో నిండిన ఈ లోకం సామాన్యునికి నరకంలా తోచడం సహజమే. మనసులో చింతలను మర్చిపోయి, తిరిగి ఉత్తేజాన్ని, ఉల్లాసాన్నీ పొందడానికి శృంగార స్మృతులు మంచి ఔషధంగా పనిచేస్తాయని సూచిస్తారు మహాకవి దాశరథి.

నేత్రపర్వం:

1988 లో ప్రచురింప బడిన నేత్రపర్వం లో అభ్యుదయ భావాలు, శాంతియుత ప్రశంసలు దర్శన మిస్తాయి. ఈ కావ్యం లోని కవితలలో మార్తాండుని మరణదండన అనే కవితా ఖండిక ప్రతీకాత్మకంగా సాగుతుంది. ఆ కవితలో వ్యంగ్యం తొంగి చూస్తుంది! మార్తాండుడు నిరంతర పోరాట వీరునికీ, తిరుగు బాటు దారునికీ చిహ్నంగా మనం గ్రహించాలి. అతన్ని జైలులో పెట్టాలని అన్యాయ పీఠం ఆదేశిస్తుంది. అయితే, తన కిరణ ఖడ్గాలతో విజృభించగానే అరెస్టు చేయడానికి వచ్చిన వారు పలాయనం చిత్తగిస్తారు! ఆ ఖండికలోని కొన్ని పంక్తులు పరికించండి.

మార్తాండునికి వేసిన మరణ దండన - మరో కల్పాంతం దాకా అమలు కాదు

మార్తాండుని శిక్షించే వాళ్లని చూసి - మహీమండలం నవ్వు తోంది.

మరణదండన పొందిన మార్తాండుడు

అంధకార రాక్షసుల్ని - హత్య చేస్తూ వెళ్ళి పోతున్నాడు

రక్కసులకు వత్తాసీ ఇచ్చే వ్యవస్థ - ముక్కలై పోవడం ఖాయం.

పేదల పక్షాన కల మెత్తుతారు దాశరథి వారి స్థితిని వినూత్నంగా చిత్రిస్తారు.అగ్గిపెట్టె అంత గుడిసెలో - అన్నం వండు తోంది

అగ్గిపుల్లంత కర్ర పుల్ల - సిగ్గు పడుతూ పొగచూరుతోంది. ...

పేదల బాధలు బేరీజు వేసుకొంటూ - పెద్ద మేడల్లో నుంచి ప్రసంగిస్తున్నాడు

బానంత కడుపు నాయకమ్మన్యుడు - ప్రజలు అమాయకులు కనుక ధన్యుడు.

పై మాటలు నేటికీ సత్య సన్నిహితాలే! నేత్రపర్వం అనే మరో కవితలో కన్ను గురించి వివరిస్తూ గన్ను చేయలేని పని కన్ను చేస్తుందన్నారు. కన్ను గురించి ఇలా అంటారు -

సమాజం శరీరమైతే - సత్కవి - కన్ను

తనువు ఎక్కడో వేదన పడినా - చినుకులు కురుస్తుంది కన్ను.

తిమిరంతో సమరం:

ఈ కావ్యాన్ని1973 లో రచించారు దాశరథి. దీనిని తన తల్లి శ్రీమతి వేంకటమ్మకు అంకితం చేశారు. "తిమిరంతో సమరం" కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడెమీ వారు తమ 1974 సంవత్సరపు జాతీయ పురస్కారాన్ని అందజేసి మహాకవి దాశరథిని గౌరవించారు. ఈ కావ్యంలోని విశేష వివరాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. తిమిరంతో సమరం మున్నుడి "కాంతి కవాటం" లో "పీఠికలు అవసరమైన కవి కాదు దాశరథి. పేరు ఊరు కాదు పెరిమా పేర్మి ఉన్నవాడు. నిజమైన కవికి ఉండ వలసిన హృదయ స్పందనం, నిశిత దృష్టీ, మానవతా, భావిజగత్కల్యాణం మీద అపార విశ్వాసమూ కల వాడు" అంటారు. ఇంకా తిమిరంతో సమరం అనారతం కొనసాగిస్తున్న కవికి కావలసింది ఏమిటి? కవిత్వ మంటే అసలు అదే అని నమ్మకమున్న వాడను నేను. "తమసో మా జ్యోతిర్గమయ" - అన్న వేదర్షి వాక్కే నేటికీ కవుల ధ్యేయం. అనుకునే వాణ్ణి నేను ... ప్రాచీన మహర్షుల్లాగా కవులు లోకం లోని అన్యాయాన్నీ, అజ్ఞానాన్నీ, తిమిరాన్నీ, జనం కష్టాలను తొలగించ గలరేమో?!" అంటూ ముందు మాట వ్రాసి, దాశరథి కవితా హృదయాన్ని పట్టుకొన్నారు, విద్వాన్ విశ్వం. దాశరథి స్వయంగా వ్రాసుకొన్న ముందు మాటలో "దురంతమైన తిమిరంతో అనంత మైన సమరం ఇది. మూఢత్వానికీ, మూర్ఖత్వానికీ తిరోగమనానికి తిమిరం ప్రతీక. ఈ తిమిరంతో సమరం చేసే సైనికుడు కవి. విజ్ఞానానికీ, అజ్ఞానానికీ జరిగే హోరాహోరీ పోరాటంలో మేధావి వర్గానికి చెందిన ప్రతి వ్యక్తీ సైనికుడై పాల్గొనక మానడు" అని వివరిస్తారు.

రావమ్మా శాంతమ్మా! అనే కవితతో మొదలవుతుంది తిమిరంతో సమరం. కవి అనే వాడు ప్రతి మనిషి హృదయం లోనూ చైతన్యం చిమ్ముకొని వచ్చేలా చేయాలి. పై నేపథ్యంతో కావ్యానుస్వాదం మొదలెడుదాం!

నీవు రావన్నాయి మ్రోళ్ళు - నీవు లేవన్నాయి ముళ్ళు

నిజం నిజమన్నాయి రాళ్ళు - నమ్మ లేకున్నాయి నా కళ్ళు.

పై నుదహరించిన పంక్తులలో "నీవు అంటే శాంతమ్మ; అంటే శాంతి. శాంతి దేవత రాదనీ, ఈ మానవ లోకంలో హింసే తాండవించి రాజ్య మేలుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో శాంతమ్మను (శాంతి దేవతను) ఆహ్వానిస్తున్నాడు మహాకవి దాశరథి. శాంతి స్వభావం మానవ సహజ మైనదనీ, దానిని అడ్డుకోగలవారు ఎవ్వరూ లేరని కవిత్వ పరంగా ప్రకటిస్తారు దాశరథి. అందుకే

ఇరువదవ శతాబ్దంలో - ఇంచు మించు ముప్పాతిక గడచి పోతున్నా

పుచ్చి పోయిన కులాలతో - చచ్చి పోయిన మతాల పేరుతో

తన్నుక చచ్చే మమ్ములను చూచి - ఖిన్నవై, ఎన్నడూ రానన బోకు.

అంటూ శాంతి దేవిని దాశరథి అభ్యర్థిస్తున్న వైనం మన మనసులను ఎంతైనా కదిలిస్తుంది. ఈ క్రింది పంక్తులు గమనిస్తే, శాంతి కాముకులు కాని వారు చేసే యత్నాలను గర్హిస్తాడు, వ్యంగ్యంగా హేళన చేస్తాడు.

నీవు రాకుండా బాంబులతో - పకడ్బందీగా గోడల కట్టించే వారికి

నీవు గగనాలు దాటి రాగలవని తెలియదు! - నిజానికి బాంబుల నిర్మాణ శాలలో

పరిశోధనలు చేసే శాస్త్రజ్ఞుని హృదయంలో - ఏదో ఒక అరలో - నీవుంటావని వారికి తెలియదు! ...

స్వాగతమే శాంతమ్మా - చైతన్య నిశాంతమ్మా!

నాగార్జున సాగరం ప్రాజెక్టు కవుల భావుకతను ఆకర్షించింది. ఆ కవులలో దాశరథి గారొకరు. క్షీరసాగరం అనే ఖండికలో నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మాణాన్ని మెచ్చుకొంటూ భవిష్యత్తులో తెలుగు దేశ ప్రాంతం సస్య శ్యామలంగా మారుతుందని ఆశిస్తూ, ఈ విధంగా అంటారు.

కృష్ణ నాపి నిరుపేదల - తృష్ణ బాపి నట్టి వారు

విష్ణువు కంటే ఘనులని - వేయినోళ్ళ చాటింతును. ...

కలత లెల్ల తొలగి పోయి - తెలుగు వార లందరు

ఇలను సస్య సంపదతో - కళ కళ లాడింతురు. ...

నవ చరితకు నాందియైన - నాగార్జున సాగరము

తెలుగింటను కలిమి నింప - గలుగు క్షీరసాగరము.

ఇటువంటి రచనా రీతిని వచన గేయం అనాలన్న విమర్శకులూ ఉన్నారు. వలయాలు అనే గేయం లో

సరస్సులో - జల వలయాలు - ఉషస్సులో

హిమ వలయాలు - మనస్సులో - విష వలయాలు.

ఈ విషవలయాలను చూచి విసుగెత్తి పోయిన దాశరథి తన భావాలను ఇలా వెల్లడిస్తాడు.

అశాంతినీ అరాచకాన్నీ - అన్ని దిశల వ్యాపింప జేసే

ఆ విష హృదయాలపై - దాడి చేయండి గళాలతో

ఆ విష వలయాలను - దండించండి కలాలతో.

అంతేకాదు. మీ కర్తవ్యం మీరు నెరవేర్చండి - లోకానికి నిజం తెలియ చెప్పండి.

అని మనలను అభ్యర్థిస్తున్నాడు!

అక్షర నక్షత్ర మాల లోని భావాలు పరిశీలించండి!

చంపి సంపెంగ పరిమళాలు - నింపుతా మంటున్నాయి దుర్విప్లవ భుజంగాలు

చంపితే శవాల కంపు తప్ప - సంపెంగలు నింపలేరు అంటున్నాయి

ప్రశాంత కురంగాలు ...

పచ్చ నోట్లతో కొందరు - కత్తి పోట్లతో కొందరు

ప్రజల వోట్ల విలువను - పడ గొట్టాలని చూస్తున్నారు ...

హింసా వాదాలన్నీ - ఇర్రింకు లింకాలి

మానవతా వాద మొక్కటె - మహిలో విలసిల్లాలి.

దాశరథిగారు ఆశావాది. ఆ నమ్మకం తోనే కదా మనం బతుకుతున్నాం, మన జనం బతుకు తున్నారు, మన కవిత బతుకు తున్నది. అందుకే పలాశ కుసుమాలు అనే ఖండికలో ఈ విధంగా ఆయన భావాలు వ్యక్త పరుస్తారు.

వాడిన వసంత వన వాటిక - మరల పల్లవిస్తుంది

"ఛిన్నోపి రేహరి తరుః - క్షీణోప్యుప చీయతే పునశ్చంద్ర".

తెలుగు మాతృభాషగా ఉన్న ప్రజానీక మంతా ఒకటిగా ఉండాలని దాశరథిగారి ఆకాంక్ష. ఆ భావాన్ని పలు కవితలలో పలు విధాలుగా వ్యక్త పరచారు. ఒక్క తెలుగు - ఒక్క వెలుగు అనే కవితలో ఇలా అభిప్రాయ పడతారు. పరికించండి:

ఎన్ని వందలేండ్లకు మనమేకమైతిమి? - ఎన్నెన్ని పిశాచముల నెదిరించితిమి!

కలిసియుండు మార్గమునే కనుగొన వలెను - విడిపోయే ఆలోచన విడిచి వేయ వలెను

నిజం తెలిసి, భుజం కలిపి నిండు మదిని సాగాలి - పరిష్కారమును త్వరలో తెర బయటికి లాగాలి

ఒక దేహం, ఒక గేహం, ఒక దేశం మనది - తెలుగు వెలుగు దిశ దిశలా దీపింప గలది.

అని నొక్కి చెబుతారు దాశరథి.

జీవగీతం అను కవితలో కవి వ్యక్త పరచిన అభిప్రాయాలు గమనార్హం.

నింగి ఆవులించి - నేలను కౌగిలించిన వేళ -

మనకు కనిపించని చోట - మహి - మహాకాశాన్ని చుంబించిన వేళ -

మంచు కంచుకం పికిలిన వేళ - మంచి దానిమ్మలు పెకలిన వేళ

నదీ చేలం తొలగిన వేళ - చైతన్యం సకల దిశలా గీతం వినిపిస్తున్నది. ...

గడియారం నడవని - పాత కోట గోడ కన్న

సూర్యుణ్ణి ఉరికించే - ఫ్యాక్టరీ కూత మిన్న.

అన్న ఆధునికుడు దాశరథి. అలాగే "వ్రణాల తోరణాలు" అను ఖండికలో:

నా మానని గాయాల వజ్రాయుధాలతో - అధికార మదాంధుల

బధిర హృదయాలను - బ్రద్దలు కొడతాను;

దయా హీన మానవ - మనో మరుభూమిలో

కృపా వృష్టి కురిపిస్తాను - కవితాంభోధర గణాలతో

తుపాకుల నోళ్ళు మూయిస్తాను - బాంబుల చెంపలు వాయిస్తాను

నా అరుణారుణ హృదయ శకలాల తోరణాలతో

అవనిని ఆనంద భవనంగా కళకళ లాడిస్తాను.

అదే కావలసినదల్లా. ఆ పని చేయగలమన్న విశ్వాసం ఉంటే, మనో బలం తో మహా పర్వతాలను క్రక్కదలించే చేవగల ప్రాచీన మహర్షుల లాగా కవులూ లోకం లోని అన్యాయాన్ని, అజ్ఞానాన్ని, తిమిరాన్ని, జనం తిప్పలనూ తొలగించ గలరేమో!? ఈ తిమిరంతో సమరం ఆ పని చేయుటలో, ఆ మహాయజ్ఞం లో ఒక సమిథగా ఉపకరిస్తే, అంతకంటే వాంఛించ దగినది మరేమున్నది?

తిమిరంతో ఘన సమరం - జరిపిన బ్రతుకే అమరం

కవితా తేజోమయం - అవని శాంతి కది నిలయం.

అలాగే "విన్నపం" కవితలోని హృదయ తాపం ఆలకించండి -

నాడు అనుజుడు విడిపోతా నంటే - నేడు అగ్రజుడు వెళిపోతానంటే

తగదంటున్నది తమను కన్నతల్లి - ఆంధ్రమాత అమృతవల్లి ...

ఈ కవి మాట కాస్త ఆలించండి - ఇక కలహాలు చాలించండి

ఆంధ్ర జాతిని ఒకటిగా వుంచండి - ఆ కీర్తిని మీరంతా పొందండి.

విధి బలీయం! ప్రస్తుత వీరులన బడే వారు వినిపించుకోరు కదా?! ఈ దాశరథి గారి హృదయ వేదనను!

గాలిబ్ గీతాలు:

దాశరథి గారు రచించిన 31 గ్రంథాలలో అనేక రకములైన రచన లున్నవి. ఖండ కావ్యాలు, గేయాలు, కథా కావ్యాలు, వ్యాసాలు, వ్యాఖ్యానాలు, నవల, నాటికలు, స్వీయ చరిత్ర, పీఠికలు, సమీక్షలు మొదలైనవి. స్వీయ రచనలే గాక, అనువాద రచనలు సహితం ఉన్నవి.

దాశరథి బహుభాషా కోవిదులు. ముఖ్యంగా ఉర్దూలో పండితులు. గజల్, రుబాయీ ప్రక్రియలు ఉర్దూ, పారశీ భాషల లోనివి. ఈ ప్రక్రియలను తెలుగు లోకి ప్రవేశపెట్టిన ఖ్యాతి దాశరథికే చెందుతుంది. ఉర్దూ సాహితీ ప్రపంచమునకు గాలిబ్ కవి సూర్యుని వంటి వాడు. ఉర్దూ సారస్వతమున అత్యున్నత స్థానం ఆయనది అని చరిత్రకారుల అభిప్రాయం. దాశరథి గాలిబ్ కవిత్వమును తెనుగించుట మిక్కిలి సంతోషకరమైన సంగతి. గాలిబ్ గీతాల తెనుగుసేత మిక్కిలి ప్రతిభావంతంగా నిర్వహించారు. అనువాద ధోరణి అత్యంత సరళముగా ఉన్నది. మూల గ్రంథ కర్తతో సమాన భావనా శక్తి దాశరథికి సంపూర్ణంగా కలదని అనువాదం లోని ప్రతి పంక్తి నిరూపించు చున్నది. హైందవే తర వాతావరణమును హైందవ వాతావరణముగా మార్చుటలో దాశరథి ప్రత్యేక ప్రతిభ చూపినారు. గమనించండి:

"ఏడి మాంధాత? పురుకుత్సు డేడి నేడు?"

"గుడిని శివుడు దొరక కున్న కాశికి గాని - పరుగు లెత్తి నేను బడయ గలను". ...

"లోకమందు సుఖము, శోకమ్ము గలవండ్రు - శోక మొకటే యిచ్చె నాకు బ్రహ్మ".

పైన ఉదహరించిన పద్య పదములు దాశరథికి ఉర్దూ పారశీ భాషలో గల ప్రావీణ్యమునకు, ఆ సాంప్రదాయములో గల పరిచయమునకు దానిని మన వాతావరణము లోనికి మార్చు శక్తి సామర్థ్యాలకు ఉదాహరణ. దాశరథి యేరి కూర్చిన ఈ ఖండ కృతులలో గాలిబ్ కవి ప్రేరార్థ హృదయాన్ని పసిగట్ట వచ్చు. ఒకానొక సందర్భములో గాలిబ్ ప్రేయసికి ఆయన ఏకైక ప్రియుడు కాదట. ఆ పద్మం మీద మరి కొన్ని భృంగములు ఝుంకరించుచున్నవి. ఇది నిరుపమాన ఘటన! అప్పుడు గాలిబ్ అంటారు:

"ఒరుల కొసగ లేదె ఉవిద నీ యధరంబు? - నాకు కూడ నోరు లేక పోదు".

దాశరథి గాలిబ్ గీతాలలో మానవ జీవితమును ప్రతిబింబించు గీతము లున్నప్పటికీ, ఎక్కువ భాగం ప్రేయసికి ప్రేమకు సంబంధించినవే! గాలిబ్ గీతాలు అత్యంత ప్రజా రంజకము లైనవి. తెలుగు ప్రజానీకం యొక్క అభిమానాన్ని చూర గొన్నవి. గాలిబ్ గీతాల్లోని ఎన్నో పంక్తులు చాలామందికి కంఠస్థమై Quotable quotes గా ప్రసిద్ధికెక్కాయి. అందుకే అంటారు దాశరథి "కవితా గ్రంథాలు కొనే వాళ్లు తక్కువ. అందులో అన్య భాషా కవిత్వానికి అనువాదాలు కొనే వారు అంతకన్నా తక్కువ. కాని నా అదృష్ట మేమిటో గాలిబ్ గీతాలు మొదటి ముద్రణ ప్రతులు అంతలోనే అమ్ముడు పోయాయ్". ఇప్పటికి దాదాపు ఎనిమిది ముద్రణలు పొంది నదంటే, గ్రంథం యొక్క గొప్ప దనాన్ని పాఠకులు ఊహించుకో గలరు!

"ఏను స్వయంగా కవితను వరించ లేదు, - తానే వరియించె కైతల రాణి నన్ను"

పై పంక్తులు మహాకవి గాలిబ్ వి అయినా, దాశరథికి కూడా పూర్తిగా అన్వయిస్తాయనుటలో సందేహం లేదు.

సినీ పాటలు:

"నా కంటి పాపలో నిలిచి పోరా - నీ వెంట లోకాల గెలువ నీరా" అన్న పాటతో సినీలోక హృదయాన్ని గెలిచిన దాశరథి అనేక చిత్రాలకు పాటలు వ్రాశారు. వానిలో అత్యంత ప్రసిద్ధి కెక్కిన సినిమాలు: వాగ్దానం, ఇద్దరు మిత్రులు, కుల గోత్రాలు, మంచి మనసులు, రక్త సంబంధం, పునర్జన్మ మొదలగునవి. దాశరథి పాటలలో అన్ని విధాల కవిత్వం చోటు చేసుకుంది. ఉర్దూ పదాలతో సమాసాలు చేసి తెలుగు సినిమా పాటలు వ్రాసిన తొలి కవి దాశరథి. "ఖుషీ ఖుషీగా నవ్వుతూ - చెలాకి మాటలు రువ్వుతూ" రూపొందింది. అలాగే ఆయన రచించిన భక్తి గీతాలు విలక్షణ మైనవి. " నడిరేయి ఏ జాములో" శ్రీ వేంకటేశ్వర స్వామి వారి "చిన్నింటి" ప్రేమాయణాన్ని మనవి చేస్తూ "విభునికి మా మాట వివరించ వమ్మా" అని అలివేలు మంగమ్మని ఆర్తిగా బ్రతిమాలు కొనడాన్ని గడుసుగా చిత్రించారు!. దాశరథి పాటలకు నవ్యత, రమ్యతా ప్రధాన గుణాలు. దాశరథి వారి పాటలలో రక రకాల ప్రతీకల్ని వాడినప్పటికీ, ఎక్కువగా కనిపించేది దీపం. మచ్చుకు - "దీపాలు వెలిగె పరదాలు తొలగె" (పునర్జన్మ), "తొలి చూపులు నాలో నె వెలిగించె దీపాలు" (చదువుకున్న అమ్మాయిలు). దీపాన్ని చైతన్యానికి, ప్రణయానికి, విప్లవానికి, ఆశావాదానికి తరచు ప్రతీకగా వాడారు. 1961-1987 మధ్య కాలంలో దాశరథి దాదాపు 2000 పాటలు వ్రాశారు. దాశరథి గారి పద్యం తెలుగు సరస్వతికి నైవేద్య మైతే, వారి సినీ సంగీతం చలనచిత్ర భారతి గళ సీమలో విరిసిన పద పారిజాతం.

ముగింపు:

దాశరథి కవితా వ్యక్తిత్వం సుస్పష్టం. ఆయనకు కవితా రూపం పై పట్టింపు లేదు. ఆయన మాటల్లో "నా అభిప్రాయంలో ఒకొక్క భావానికి తగ్గట్టు రూపకల్పన జరుగుతుంది. హృదయంలో నుండి పెల్లుబుకిన భావం పద్య రూపంలో రావచ్చు, గేయ రూపంలో రావచ్చు. అదెట్లా వస్తే అట్లా. అంతేగాని మనం కేవలం పద్యం లోనే వ్రాయాలని గానీ, బొత్తిగా రాయొద్దని గాని, అటు వంటి సంకుచిత భావాలున్న వాణ్ణి కాదు... నా కవితా సిద్ధాంతం ఒక్కటే. నేను కవితలో చెప్ప దలుచు కొన్నది ప్రపంచంలో శాంతి స్థాపించడం. యుద్ధాలు, కక్షలూ, కాలుష్యాలు లేనటు వంటి మానవ సమాజం రావాలి. నా వాదం మానవతా వాదం. నా ధ్యేయం ప్రపంచ శాంతి".

ఏ సిద్ధాంతాలకూ, ఇజాలకూ, అమ్ముడు వోని స్వేచ్ఛా పథ సంచారి దాశరథి. కాల్పనికతనూ, అభ్యుదయాన్నీ, నవ్య సాంప్రదాయాన్నీ, దేశాభిమానాన్ని, జాతీయతనూ, సామ్య వాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, విశ్వ మానవతనూ, శాంతి విప్లవ చైతన్యాన్నీ, ఆత్మీయమైన శృంగారాన్ని, అంగారాన్ని - అన్నింటినీ తన విశాల కవితా విశ్వంభరాలలో పొదుగుకున్న అమృత కవితా మూర్తి దాశరథి" అన్న డా. తిరుమల శ్రీనివాసాచార్య మాటలతో ఈ వ్యాసాన్ని ముగిద్దాం.

కృతజ్ఞతలు: ఈ వ్యాసం రూపొందించుటలో దాశరథిగారి రచనలతో పాటు, ఇతర రచయితల వ్యాసాలు, పుస్తకాలు పరిశీలించ వలసి వచ్చింది. కొందరి రచయితల భావాలు ఉదారంగా వాడుకున్నాను. ఆయా రచయిత లందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలను ఇందు మూలముగా తెలియ పరుస్తున్నాను. ఈ వ్యాసం సహృదయులందరూ ఆదరించుటయే కాక, మహాకవి దాశరథి రచనలను చదివి ఆనందిస్తారని ఆశిస్తాను.

No comments:

Post a Comment