Friday, 10 January 2014

Sri Ramakrishna Jivitacharitra (శ్రీ రామకృష్ణ జీవితచరిత్ర)

భూమిక:

శ్రీరామకృష్ణ పరమహంస జగద్గురువు. సర్వమత సమన్వయ స్వరూపం. శ్రీ రామకృష్ణుల జీవితం ఆయన ఉపదేశాల కంటే సహస్ర గుణాధికంగా ఉపనిషత్తులపై సజీవ భాష్యం; మానవ రూపం దాల్చిన ఉపనిషత్సారమే ఆయన అని చెప్ప వచ్చు... ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతాలు ఆత్మవికాస క్రమావస్థలనే ఈయన సిద్ధాంతము వలననే వేదాలు అర్థవంతా లవుతున్నవి. శాస్త్రాలకు సమన్వయత ఏర్పడుతుంది. అన్యమతాల పట్ల సహనం పాటించాలనడమే కాక, అన్య మతాలూ మోక్ష మార్గాలే అని మనస్ఫూర్తిగా అంగీకరించాలనీ, సత్యమే సకల మతాలకు మూలాధారమనీ ఆయన ఉపదేశం". (వివేకానంద స్వామి).చాలామంది పూర్వా చార్యుల ఉపదేశాలకంటే, పరమహంస దేవుల ఉపదేశాలు స్వతంత్రాలు, ఉదారాశయ సమంచితాలు. ఆయన ఒక అధ్యాత్మిక సాగరం. బ్రహ్మజ్ఞానానికైనా పరిమితి కనుగొన వచ్చునేమో కాని, శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవుల మనస్తత్వం ఇలాంటిదని నిర్ణయింప జాలము (స్వామి వివేకానంద).

పరమహంస అవతార పురుషుడు. ఆయన వాణి "ఒక భాషకు, ఒక జాతికి, ఒక మతమునకు, ఒక దేశమునకు మాత్రమే సంబంధించినది కాదు. అది సర్వ భాషలకు, సర్వజాతులకు, సర్వమతములకు, సర్వదేశములకు గాలి వలె, వలయునది (విహితమైనది).అటువంటి మహనీయుని చరిత్ర శ్రీ చిరంతనానంద స్వాములవారి ద్వారా తెలుగు వారికి లభించుట వారి పూర్వజన్మ సుకృతం. శ్రీ చిరంతనానంద స్వాములవారి గురువు శ్రీ విజ్ఞానంద స్వామి స్వయాన శ్రీ రామకృష్ణుల శిష్యులు. అంతేకాదు వారు పరమహంస గారితో కుస్తీ, వైగారా, వ్యాయామ ప్రక్రియల్లో పాల్గొనే వారని పేర్కొన బడినది. శ్రీ విజ్ఞానానందుల వారు గుప్త బ్రహ్మజ్ఞుడని చెప్పుకొంటారు. నారదముని రచించిన పాంచ రాత్రమును, బృహజ్జాతకమును, సూర్యసిద్ధాంతమును ఆంగ్లములోనికి అనువదించి నట్లు తెలియు చున్నది. అంతటి గొప్ప పండిత స్వామి అంతేవాసులు శ్రీ చిరంతానానంద స్వామి గారు. తాము స్వయంగా ఆంధ్ర, ఆంగ్ల, వంగ, సంస్కృత భాషల లో పండితులు.రామకృష్ణ పరమహంస జీవితచరిత్రను - ముఖ్యముగా వారి బోధనలను, సంభాషణలను, ఇతర దినచర్యలను యధార్థముగా విన్నవి విన్నట్లు, కన్నవి కన్నట్లు తిథివార పూర్వకముగా వ్రాసిన శిష్యులలో ముఖ్యముగా పేర్కొనతగిన వారు శ్రీ మహేంద్రనాథ గుప్త ("మ" అను గుప్తనామము). "మ" గారు శ్రీ రామకృష్ణుల వారి చరమ జీవిత కాలమున రమారమి అయిదు సంవత్సరములు తమకు వీలైన వేళలందు శ్రీపరమహంస గారి పాదముల చెంత కూర్చొని విన్నమాటలు విన్నటుల వ్రాసి ప్రచురించారు. ఆంగ్ల, ఫ్రెంచి భాషలలో శ్రీపరమహంస జీవిత చరిత్రలు వెలువడినవి. శ్రీ చిరంతనానంద వంగ భాషలోనున్న మూల రచనలే గాక, ఇతర మూలాధారాలను పరిశీలించి, వాటికి తమ గురువులైన విజ్ఞానానందుల వారు, పరమహంసని గూర్చి తెలియపరచిన విషయాలతో జోడించి శ్రీరామకృష్ణుల జీవితచరిత్ర మను మధు చక్రమును తెనుగు భాషలో నిర్మించారు. ఎంత వ్రాసినను, ఎంత చెప్పిననూ శ్రీ పరమహంసను గూర్చిన గాథలు మిగిలియే యుండును.! అయినప్పటికీ, "ఇంత తక్కువ పుటలలో, ఇంత నాదైశ్వరముతో మిళితమైన మహానంద మిముడ్చుట శ్రీచిరంతనానందుల శక్తి స్ఫూర్తియే! ఈగ్రంథమును చదువు కొనుచూ బోదుమేని, శ్రీరామకృష్ణులే తమ కథను తాము చెప్పుకొని పోవుచుండగా మనము వినుచున్నట్లుండును... ఈగ్రంథ పురుషుడు, చరిత్ర, బోధ, గ్రంథకర్త, రచన మధురము. సర్వము మధురము" (శతావధాని వేలూరి శివరామశాస్త్రి)."శ్రీరామకృష్ణుల జీవితచరిత్ర" అనే ఈ పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ వారు 1956వ సంవత్సరములో ప్రచురింప బడిన తెలుగు పుస్తకాలలో ఉత్తమ రచనగా ఎంపికచేసి తమ జాతీయ పురస్కారాన్ని అందజేశారు. అంతేకాదు, ఈ గ్రంథాన్ని ఆంధ్ర, మద్రాసు, ఉస్మానియా, మైసూరు, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయాల వారు పాఠ్య గ్రథంగా నిర్ణ యించుట ఈ రచన యొక్క ప్రాశస్త్యాన్ని ఇనుమడింప జేస్తున్నది. దీనిని గురించిన విశేషాలు ఈ వ్యాస రూపంలో పాఠకుల ముందుంచు చున్నాను. ఈ వివరాలు మూల గ్రంథాన్ని చదివి ఆనందించుటలో పాఠకులకు ఉపయోగిస్తాయని ఆశిద్దాం.శ్రీ రామకృష్ణుల జీవితచరిత్ర - విశ్లేషణ.ఈ పుస్తకంలో 29 విభాగాలు (శీర్షికలు) ఉన్నవి. శ్రీరామకృష్ణ పరమహంస వంశ చరిత్రతో మొదలెట్టి, శ్రీరామకృష్ణ మఠసేవా సంఘోదయం తో గ్రంథాన్ని ముగించారు రచయిత. ఈ వ్యాసంలో కొన్ని ప్రథానాంశాలనే చర్చించడమైనది.పరమహంస జననం , బాల్యం.వంగదేశం (ఇప్పటి పశ్చిమ బెంగాలు) లో హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ గ్రామంలో 1836వ సంవత్సరం ఫిబ్రవరి నెల 18వ తేదీన (ఫాల్గుణ శుక్ల ద్వితీయ, బుధవారం) రామకృష్ణులు ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు క్షుదీరామ్ చట్టోపాధ్యాయ, తల్లి పేరు చంద్రమణీదేవి. క్షుదీరామ్ దైవ భక్తి పరాయణుడు, సత్య నిష్ఠా గరిష్ఠుడు, సుశీలవ్రతుడు. కుటుంబానికి ఎలాంటి కష్టాలు వాటిల్లినా కూడా, జీవితాంతం అతడు సత్య సంధతను విడిచి పెట్ట లేదు. ఒకానొక సమయములో కామార్పుకూర్ జమిందారు ఆయనకు అనుకూలంగా దొంగ సాక్ష్యాన్ని చెప్పమని క్షుదీరామ్‌ని నిర్బందిస్తే, క్షుదీరామ్ అతని మాటలను తృణీకరించిన కారణాన, జమిందారు అతనిపై పగ బట్టి, ఒక తప్పుడు వ్యాజ్యాన్ని తెచ్చి, క్షుదీరామ్ పిత్రార్జితాన్ని అతని ఇంటితో సహా హరించి వేశాడు. అయినా, క్షుదీరామ్ చలించ లేదు. న్యాయ మార్గాన్ని వీడనూ లేదు.శ్రీరామకృష్ణుని జననానికి ముందే క్షుదీరామ్ దంపతులు తమకు పుట్టబోయే కుమారుని దివ్యత్వాన్ని సూచించే అనేక దివ్య దర్శనాలను, దివ్యానుభవాలను పొందినట్లు ప్రతీతి.శ్రీ రామకృష్ణులకు తల్లి దండ్రులు గదాధర్ అని పేరు పెట్టారు. తర్వాత కాలంలో ఆయనకు శ్రీరామకృష్ణ నామం జగత్ప్రసిద్ధ మయ్యింది.

పూవు పుట్టగానే పరిమళించినట్లు గదాధరుని భావ ఔన్నత్య సూచనలు బాల్యం లోనే వ్యక్తం కాసాగాయి. ప్రకాశించే అతని శరీర ఛాయ, అతడి ప్రియ నడవడి జనాన్ని ఎక్కువగా ఆకర్షించ సాగాయి. గదాధరుడంటే ఇరుగు పొరుగులకు అల్లారుముద్దు. తోటి బాలురకందరకూ గదాధరుడే నాయకు డయ్యాడు. కళా కౌశలానికి నిలయమైన అతని హృదయం ప్రకృతి సౌందర్యం వైపు ఎక్కువగా ఆకర్షితమైనది. అనుకరణ, హాస్యం, మట్టితో విగ్రహాలు చేయడం, వీధి నాటక ప్రదర్శనలు, పురాణ కాలక్షేపాలు ఇవే గదాధరుడి చిన్ననాటి ఆటలు. బడి లోని విద్యావిధానం అతనిని ఏమాత్రం ఆకర్షించ లేకపోయింది! ప్రకృతి రసాస్వాదనం ముందు బడి చదువు అతడికి ఏమాత్రం నచ్చ లేదు. లోలోపల తలెత్తుతున్న అతడి బ్రహ్మానంద పిపాసే ఇందుకు కారణమని చెప్పవచ్చు. అతని అసాధారణ ధారణ శక్తి పండితులను ఆకర్షింప సాగింది. పిన్న వయసులోనే గదాధరుడు భారతీయ విజ్ఞాన ఖనులైన భారత, భాగవతాది గ్రంథాల రసాన్ని పూర్తిగా గ్రోలాడు. ప్రకృతి అనే పుస్తకాన్ని చదివి దానిలోని తత్త్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకొన్నాడు.గదాధర్ బడి చదువు అలస్యం చేస్తున్నాడన్న విషయం తెలుసుకొని అతని అన్నయ్య రామకుమార్ ఒకసారి మందలించగా "అన్నా ఈ పొట్టకూటి చదువు నాకెందుకు? ఇందుకు బదులు శాశ్వతానందదాయకం, శ్రేయస్కరం అయిన తత్త్వజ్ఞానాన్ని ఆర్జించ గోరుతాను" అని జవాబిచ్చాడు. నిజమే! ఆత్మజ్ఞాన దాయకమైన విద్యే విద్య కాని తక్కినదంతా అవిద్య కదా?! ధైర్య సాహసాలకు, స్వాతంత్ర్యానికి తోటి బాలురందరి లోను గదాధరుడే మిన్నగా ఉండేవాడు. ధృడగాత్రుడూ, తెజోనిధి అయిన గదాధరుడు తాను న్యాయమని నమ్మిన విషయాల్లో ఒకరి బెదిరింపులను లెక్కబెట్టే వాడు కాడు. పెద్దలు వద్దన్నా, ధర్మమని తన అంతరాత్మ తెలిపిన విషయాలను గదాధర్ విడిచేవాడు కాడు. ధని అనే కమ్మ ఇల్లాలుకు ఒకప్పుడు తాను చేసిన వాగ్దానం మేరకు గదాధర్ తన ఉపనయన సందర్భంలో అందరూ ప్రతిఘటించినా లక్ష్య పెట్టక, ఆమె వద్ద ప్రథమ బిక్షను స్వీకరించాడు. సత్యానికీ ధర్మానికే గాని అర్థం లేని ఆచారాలకు అంజలి ఘటించని గదాధర్ ఆ గ్రామ పూర్వాచార పరాయణులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. బైరాగులన్నా, సన్న్యాసులన్నా గదాధర్ కు చిన్నప్పటినుండి చాలాఇష్టం. సందు దొరికి నప్పుడల్లా వారితో తిరుగుతూ స్వేచ్ఛగా మాటలాడే వాడు, ఎక్కువకాలం గడిపేవాడు. పెద్దవాడయ్యే కొద్దీ గదాధర్ భక్తి భావాలు ప్రస్ఫుటం గాజొచ్చాయి. అతడు ఈశ్వరధ్యాన నిమగ్నుడై సాక్షాత్కారంలో సంగమిచే దివ్యభావాలను పొంద సాగాడు. చిన్నప్పుడు జరిగిన ఇలాంటి మహోత్కృష్ట సంఘటనలలో మూటిని గురించి చెప్పు కొంటారు:వర్షా కాలంలో మేఘాలు ఆవృతమైన నల్లని ఆకాశంలో తెల్లని కొంగల బారులను చూచినపుడూ ఒకసారి, శివరాత్రి సందర్భంగా గ్రామంలో నాటక ప్రదర్శనలో తాను శివుని వేషం ధరించి నప్పుడు రెండవ సారి; తీర్థయాత్రా సమయంలో భగవన్నామ సంకీర్తన చేసేటప్పుడు మరొకసారి - గదాధర్ అత్యుత్తమ సమాధి స్థితిని అనుభూతి చెందాడు. గదాధర్ లో ఈ భక్తి భావాలే క్రమంగా అతిక్రమించి, అతడి గుణ గణాలను పరమాత్మాన్వేషణలో పాదుకొల్పాయి. ఆమార్గం లో గదాధర్ సాధించిన అఖండ విజయాలే మానవ కోటికి అతణ్ణి ఆదర్శ పురుషుడిగా తీర్చిదిద్దాయి.సాధనదశ: శ్రీరామకృష్ణుల దివ్యత్వం.1855వ సంవత్సరంలో, కలకత్తా నగరంలోని దక్షిణేశ్వరంలో రాణి రాస్మణి నిర్మించిన కాళికాలయం శ్రీరామకృష్ణుల అఖండ వ్యక్తిత్వ వికాసానికి అనువైన వాతావరణాన్ని కల్పించింది. ఆ సంవత్సరంలో గదాధర్‌ను కాళికాలయానికి ప్రధానార్చకునిగా నిత్య పూజావిధులు నిర్వర్తించడానికి నియమించారు. ఆవిధుల నిర్వహణ గదాధర్‌లోని భక్తిని పెంపొందించాయి. అతడు బాహ్య లోకాన్నే మర్చిపోయి గాఢధ్యానంలో, దివ్య సంకీర్తనంలో గంటల పాటు గడిపేవాడు. అంతేకాదు, రాత్రివేళల్లో సమీపములోని చిట్టడవికి వెళ్ళి, భక్తికి బాహ్య వేషాలెందుకని, కట్టుబట్టను, తుదకు జందేన్నీకూడా విసర్జించి, దీర్ఘకాలం భగవద్ధ్యానంలో గడుపుతూండే వాడు. శ్రీ రామకృష్ణులకు (గదాధర్) కు సన్నిహితుడు, మేనల్లుడైన హృదయరాం (హృదయ్) అలాచేయ వద్దని నిరోధింప ప్రయత్నించాడు. కాని, రామకృష్ణులు అతని మాటను పెడచెవిన పెట్టాడు. దేవీ పూజా విధానంలో బాహ్యాచారాలు క్రమంగా సడలి పోగా, జగజ్జనని సన్నిహిత సంబంధం మానసాన్ని ఆక్రమించగా, శ్రీరామకృష్ణులు అపూర్వరీతిలో దేవిని అర్చించ సాగారు. శ్రీరామకృష్ణులలో భగవత్పరితాప బడబానలం హెచ్చైంది. అతనిలో తాను అర్చించు ఆలయము లోని కాళికాదేవి కేవల నిర్జీవ శిలావిగ్రహమా, లేక నిజమగు సృష్టిస్థితిలయకారిణి అయిన పరమేశ్వరా? అనే ప్రశ్న ఉత్పన్న మైనది. నిజమైన పరమేశ్వరి అయితే జగజ్జనని తన కెందుకు దర్శన మివ్వదు? ఇలాంటి పరితాపం హృదయాన్ని దహించగా, ఒకరోజు రామకృష్ణులు దేవిని ఇలా ప్రార్థింప మొదలెట్టారు. అమ్మా! ఆనందమయీ! నీ కృపాకటాక్షాన నువ్వు నాకు సాక్షాత్కరింపక తప్పదు" అంటూ ముఖం నేలకేసి రాసుకోగా గాయాలై రక్తం కారేది. హతాసుడై ఒకరోజు గర్భాలయంలో ఉన్న ఖడ్గంతో జీవితాన్ని అంతం చేసుకో ప్రయత్నిస్తున్నంతలో అకస్మాత్తుగా జగజ్జనని సాక్షాత్కరించింది. దేదీప్యమానమైన అనంత చైతన్య సాగర రూపంలో దైవాన్ని గాంచి ఆయన సమాధి మగ్నులయ్యారు. కాని, ఈ అనుభవం శ్రీరామకృష్ణులకు అఖండ బ్రహ్మానంద అనుభూతిని కలిగింపలేదు. నిరంతర బ్రహ్మాను ప్రాప్తికై పరితప్త హృదయుడై ఆయన రోజులు గడుపుతున్నాడు. సర్వకాల సర్వావస్థలలోను బ్రహ్మానుభూతిని పొందడానికి శ్రీరామకృష్ణులు రోదన మొదలెట్టారు. తీవ్ర వ్యాకులతతో జగజ్జననిని ప్రార్థింప సాగారు. రాణి రాస్మణి అల్లుడూ, ఆలయ నిర్వాహకుడూ అయిన మధురనాథ్ రామకృష్ణుల స్థితిని చూచి ప్రేమ గౌరవాలతో ఆయన్ను పూజావిధులనుండి విశ్రాంతి కలిగించి, సాధనకు తగిన సదుపాయాలను సమకూర్చారు. అటుతర్వాత శ్రీరామకృష్ణుల వారు లోకాతీతమైన భగవత్ పరితాపంతో, ధ్యానాది సాధనాల్లో నిమగ్నమైపోయారు. ఈ సమయములోనే వివాహం చేస్తే, రామకృష్ణుల వారి భగవదున్మాదం తగ్గుతుందని భావించి ఆయన తల్లి చంద్రమణీదేవి శారదామణీదేవి అనే బాలికతో వివాహం చేశారు.ఇంతవరకూ శ్రీరామకృష్ణులు తన భక్తి సాధనలను ఏ గురువు సహాయము లేకుండానే స్వయంగా సాగిస్తున్నారని చెప్పవచ్చు. దైవ నియంత్రులై గురువులు ఆయన్ను వెతుక్కొంటూ రాసాగారు. శ్రీరామకృష్ణుల ప్రథమ గురువు భైరవీ బ్రాహ్మణి అనే యోగిని. ఈమె విశేష విద్యావంతురాలు. తాంత్రిక సాధనాల్లో అఖండ విజయాన్ని పొందిన మహనీయురాలు. అరవైనాలుగు శాక్తేయ తంత్రాల్లోని ప్రధాన సాధనా లన్నిటినీ శ్రీరామకృష్ణులు వీరి శిక్షణలో జయప్రదంగా సాధన చేశారు. భగవంతుని జగజ్జననిగా భావించి సాగించ వలసిన యోగసాధనాల్లో అనేకం కష్టాత్కష్టతరాలు, సామాన్య సాధకులకు అసాధ్యాలు, పైగా ప్రమాద కరాలు. సంపూర్ణమైన ఇంద్రియ నిగ్రహం ఉంటేనేకాని, సమీపానికి కూడా పోదగని సాధనలివి. కాని శ్రీరామకృష్ణులు వీటన్నింటిలో అవలీలగా సిద్ధిని పొందారు. ఈ తాంత్రిక సాధనా ఫలంగా పరమేశ్వరి నానారూపాల్లో ఆయనకు సాక్షాత్కారాన్ని ప్రసాదించడమే గాక, ప్రతి స్త్రీ సాక్షాత్తు జగజ్జనని స్వరూపమే అనే నిశ్చయాన్ని ఆయన హృదయంలో నెలకొల్పింది. శ్రీరామకృష్ణులు అవలంబించిన సాధనల్లో వైష్ణవ సాధనలు తరువాత పరిగణింప దగ్గవి. శ్రీరామకృష్ణులు అన్నిటినీ సాధించారు. అంతేగాక, ఈ భావాలు ఎవరిలో రూపు దాల్చాయో అలాంటి పౌరాణిక పాత్రలలో సాధన కాలంలో ఆయన తాదాత్మ్యం పొందేవారు.తర్వాత, 1864వ సంవత్సరంలో అద్వైత వేదాంతీ, యతివరేణ్యుడూ అయిన తోతాపురితో శ్రీ రామకృష్ణులకు సాహచర్యం లభించింది. శ్రీ తోతాపురి శ్రీ రాంకృష్ణులకు సన్యాస దీక్షను ఇప్పించారు. ఇంతవరకూ రామకృష్ణులు సగుణ స్వరూపంలో దైవాన్ని ఉపాసిస్తూ ఉండేవారు. శ్రీ తోతాపురి శిక్షణలో శ్రీ రామకృష్ణులు నిర్గుణ నిరాకార బ్రహ్మ ధ్యానంలో ఉత్తీర్ణుడై అఖండ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందారు. సమస్త సాధకులకూ పరమావధీ అయిన నిర్వికల్ప సమాధి శ్రీ రామకృష్ణులవారు మూడు రోజులలోనే పొందగలిగారు. ఇది గొప్ప విశేషం. ఎక్కడా మూడు రోజులకంటే ఎక్కువ కాలం నిలువని పరివ్రాజకోత్తముడైన తోతాపురి శ్రీ రామకృష్ణుల అఖండ ప్రతిభకు ముగ్ధుడై దాదాపు ఒక ఏడాది వారి సాహచర్యంలో గడిపారు! శ్రీ రామకృష్ణుల వారు గురువుకే గురువై సగుణ బ్రహ్మ భావాన్ని, జగన్మాతృ భావాన్ని తోతాపురికి అలవరించాడు (ఒప్పించాడు, అబ్బేటట్లు చేశాడు). ఇది అధ్యాత్మిక సాధన చరిత్రలో సంభవించిన ఒకానొక అద్భుతముగా పరిగణింప దగినది. 1872వ సంవత్సరంలో శ్రీరామకృష్ణులు షోడశీ పూజ అనే మహాసాధనలో తన భార్యను సాక్షాత్తు పరమేశ్వరీ స్వరూపంగా ఆరాధించారు! లోకులు తన భర్త (రామకృష్ణులు) పిచ్చివాడని చెప్పుకుంటున్న ప్రలాపాలను విని, ఆయనను సేవించే తమకం (ఆతురత) లో శారదాదేవి స్వయంగా దక్షిణేశ్వరానికి వెళ్ళింది. దివ్య ప్రేమమూర్తి అయిన శ్రీరామకృష్ణులు సామాన్య సన్యాసుల మాదిరి గాక, శారదాదేవిని అఖండ సానుభూతితో ఆదరించి ఐహికాముష్కికా విషయా లన్నిటిలో ఆమెకు గురుత్వం వహించి ఎన్నో విషయాలు ఆమెకు తెలియ పరచారు. వినిర్మల హృదయ అయిన ఆస్వాధ్వి మగని ఆశయాలను గ్రహించి, తన భర్త సాక్షాత్తు పరమేశ్వరుడనే భావనతో ఆయనను సేవించ సాగింది. ఆదివ్య దంపతుల అన్యోన్య ప్రేమలో కామ ప్రవృత్తికి అణుమాత్రం కూడా స్థానము పసిగట్టదు! తన జితేంద్రియత్వాన్ని పరిక్షించు కొనటానికి అయితేనేమి, స్త్రీ లందరిని జగజ్జననీ స్వరూపులుగా చిత్రించుట కైతేనేమి, శ్రీరామకృష్ణుల వారికి శారదామాత ఉనికి విశేషంగా తోడ్పడింది.శ్రీరామకృష్ణుల వారి జీవితచరిత్ర పరిశీలిస్తే, బాల్యం నుండి వారిలో శుకమహాముని పలుకులు జ్ఞానదీపికలుగా భాసింపసాగాయి. సాధన కాలంలో ఈశక్తి వికసింపసాగింది. దక్షిణేశ్వరాలయ నిర్వాహకులైన రాణీ రాస్మయి, మధురుల పట్ల ఆయన ఎన్నడూ సేవక భావం వహించ లేదు. మీదు మిక్కిలి వారికి ఆప్తులుగా, దివ్యభావాల్లో రక్షకునిగా వర్తించారు. ఆయనకు గురువులుగా విచ్చేసిన బ్రాహ్మణీ, తోతాపురి వంటి జ్ఞానులు సహితం శ్రీరామకృష్ణుల సాహచర్యంతో అపూర్వ మైన భక్తి రహస్యాలను గ్రహించారు. మధుర్‌నాధ్‌తో శ్రీరామకృష్ణులు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు అనేకులు ఆయన సాంగత్యంలో ధన్యులైనారు. వివిధ సాంప్రదాయాలకు చెందిన సాధకులూ, సన్యాసులూ దక్షిణేశ్వరానికి వచ్చి శ్రీరామకృష్ణుల దివ్యసందేశ సుధారసాన్నిగ్రోల సాగారు. పండితులు ఆయన వచనామృతాన్ని ఆస్వాదించి ముముక్షువు లైనారు. శ్రీరామకృష్ణులు - పరమహంస అనీ, దివ్యపురుషుడనీ లోకం గ్రహింప సాగింది. శ్రీరామకృష్ణులవారు సగుణ - నిర్గుణ రెండు భావాలలోను బ్రహ్మానుభూతి పొందగల్గుతూ, దివ్యానుభవంలో ఏమాత్రం భంగం లేకుండానే నిత్యకృత్యాలను అవలీలగా నెరవేర్చ గలిగినట్టి "భావముఖం" ఆయనకు అతి సాధారణం. లోకాన్ని పాప పంకిలంలో ముంచివేసే కామకాంచనాలు శ్రీరామకృష్ణ పరమహంసను అణుమాత్రం కూడా వ్యామోహితుడ్ని చెయ్యజాలక పోయాయి. సమస్త స్త్రీలు ఆయన కంటికి జగన్మాత స్వరూపిణులు గానే కనిపిస్తారు. ధనం కాని, బంగారాన్ని కాని, మరేవిధమైన లోహాన్ని కాని ఆయన హస్తాలతో తాకేవారు కారు. మనిషిలోని అహంకార నిర్మూలనకై రామకృష్ణుల వారు సాగించిన సాధనలు నిరుపమాన మైనవి.బ్రహ్మసమాజంతో సంసర్గం:బ్రహ్మసమాజంతో సంపర్కం శ్రీరామకృష్ణుల దివ్యజీవిత చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించిన ముఖ్య సంఘటన. పరమహంసగారి ప్రధాన శిష్యులు బ్రహ్మసమాజం నుంచి వచ్చారు. అది గమనార్హం. బ్రహ్మసమాజ సంస్థాపకులలో ఒకరైన శ్రీదేవేంద్రనాధ్ టాగూర్ గారి భగవత్ భక్తిని గూర్చి విని శ్రీరామకృష్ణులు మధుర్ బాబు తో వెళ్ళి ఆయనను కలసు కొన్నారు. ఆ సమావేశాన్ని గురించి రామకృష్ణులు ఈ విధంగా భావించారు."...దేవేంద్రునితో ప్రసంగిస్తు న్నప్పుడు నిజంగా ఎవరు ఎలాంటి వారో తెలుసుకోగల విచిత్రమైన మనోస్థితి నన్ను అగస్మాత్తుగా ఆవహించింది. ఆ మనోస్థితిలో వివేక వైరాగ్య రహితులైన మహాపండితులు సైతం నాకంటికి ఆనలేదు... లోలోన నాకు నవ్వు పొంగి పొరలేది. దేవేంద్రునిలో యోగం, భోగం రెండూ కనిపించాయి".... ఆయనతో "నువ్వు సంసారంలో వుంటూ మనస్సును భగవంతునిపై నిలిపి వుంటావని విని చూడ వచ్చాను. భగద్విషయం ఏదైనా వినిపించు" అప్పుడు అతను వేదాల నుండి కొంత వినిపించి, ఇలా అన్నాడు "ఈ జగత్తు వేయి కొమ్మల దీపపు సెమ్మె లాంటిది. దీన్లోని ప్రతి జీవి దాన్లోని ఒక దీపం". 1875వ సంవత్సరంలో బ్రహ్మసమాజ నాయకులైన కేశవచంద్ర సేన్‌ని కలుసుకున్నారు. అప్పటినుండి పరమహంసగారి ఉపదేశామృతం లోకంలో ప్రవహింప సాగింది. పరమహంసగారి అసమాన ప్రతిభను - అద్వితీయ ఔన్నత్యాన్ని గురించి మహావక్త సుప్రసిద్ధ తత్త్వవేత్తా అయిన కేశవచంద్ర సేన్ తమ ఉపన్యాసాల ద్వారా, రచనల ద్వారా లోకానికి చాటనారంభించారు. అందుచేత కలకత్తా పౌరులు - ముఖ్యంగా విద్యాధికులు తండోప తండాలుగా రామకృష్ణ పరమహంస దర్శనార్థమై దక్షిణేశ్వరం రాసాగారు.

ప్రతాపచంద్ర మజుందార్, శివనాథశాస్త్రి, విజయకృష్ణ గోస్వామి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకించంద్ర చట్టోపాధ్యాయ, మైకేల్ మధుసూదన దత్తా, అశ్వినీకుమార్ దత్తా, గిరీశచంద్ర ఘోష్ మొదలైన నాటి సుప్రసిద్ధ వ్యక్తులు శ్రీరామకృష్ణ పరమహంసను సందర్శించి, ఆయన పట్ల తమకు గల పూజ్య భావాన్ని లోకానికి ప్రకటింప సాగారు.1881వ సంవత్సరంలో సుప్రసిద్ధ దేశభక్తుడు శ్రీఅశ్వనీకుమార్ దత్త శ్రీరామకృష్ణులను మొదటిసారి సందర్శించారు. అదే సమయంలో శ్రీకేశవచంద్ర సేన్ కూడా శ్రీరామకృష్ణులను దర్శించు నిమిత్తమై అచ్చటికి వచ్చారు. ప్రసంగ వశాత్తు కేశవ్ తో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారట "కేశవ్ మీ కలకత్తా బాబులు దేవుడు లేడంటారట! నిజమేనా? అలాంటి బాబు ఒకడు ఒకప్పుడు మేడమెట్లు యెక్కుతున్నాడట. ఒక మెట్టెక్కి పైమెట్టుపై కాలు పెట్టేటంతలో స్మృతితప్పి పడిపోయాడు ... వైద్యుడొచ్చే లోగానే తుది శ్వాస విడిచాడు. ఇలాంటి వారా దేవుడు లేడనుట?... ఆ సంభాషణా నంతరం జరిగిన నృత్య సంకీర్తనలో అశ్వనీదత్త తాను చూచిన రామకృష్ణ దివ్యసమాధి స్థితులను ఎన్నటికీ మరువ లేనని పేర్కొన్నారు. మరో సమావేశంలో అశ్వనీకుమార్ రామకృష్ణులను "మహాశయా నేను భగవంతుని ఎలా సందర్శించ గలను" అని ప్రశ్నించారట. దానికి శ్రీరామకృష్ణుల వారు "అయస్కాతం ఇనుమును ఆకర్షించునట్లు భగవంతుడు మనలను సదా ఆకర్షిస్తున్నాడు. కాని, మాలిన్యముచే కప్ప బడిన (కలుషితమైన) ఇనుము ఏవిధంగా ఆకర్షితం కాదో అదే విధంగా మనసును కప్పివున్న మాలిన్యాన్ని కన్నీరు కడిగి వేసి నంతనే మనస్సు భగవంతుని వైపుకు ఆకర్షింప బడుతుంది" అని జవాబిచ్చారు. శ్రీరామకృష్ణుల సాన్నిధ్యాన తాను పొందిన ఆనందం వర్ణనాతీతమని తెలుపుతూ ఇంకా ఇలా వ్రాశరు. "నేను ఠాకూరును (పరమహంసను) నాలుగైదు మారులు మాత్రమే సందర్శించాను. ఆస్వల్ప కాలం లోనే, ఆయనా, నేను సహ పాఠకులమా అన్నంత చనువుగా మెలిగాం. అమృతవర్షం కురుపించు పరమహంసగారి మందహాసం నిరంతరా నందకర మైనది".ఒకరోజు మహారాజా యతీంద్రమోహన్ టాగూరు శ్రీరామకృష్ణుల వారిని సందర్శించారు. ఆ సందర్భమున శ్రీరామకృష్ణుల వారు ఆయనను మానవుని కర్తవ్య మేమిటని ప్రశ్నించారుట! దానికి మహారాజావారు "సాంసారికులం మేము, మాకిక ముక్తి యెక్కడిది? యుధిష్టర మహారాజు సైతం నరక దర్శనం చేయక తప్పింది కాదు" అన్నారట. ఆ జవాబు విని శ్రీరామకృష్ణుల వారు కోపగించు కొని "యుధిష్టిరుని జీవితం లోని ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుంచు కొన్నావు! ఆయన సత్యనిష్ఠ, క్షమశీలత... మంచి విశేషాలన్నీ మరచి పోయావు!" అన్నారట!శ్రీవిద్యాసాగర్ బిరుదాంకితుడు, విశ్వమానవ సౌహార్థ పూరితుడై వాసి కెక్కిన ఈశ్వరచంద్ర విద్యాసాగరును శ్రీరామకృష్ణుల వారు 5-8-1882న సందర్శించారు. ఆ ఇద్దరి మధ్యా జరిగిన మనోహర సంభాషణ లోని కొన్ని ముఖ్యాంశలు ఇందు ఉల్లేఖించడ మైనది. శ్రీరామకృష్ణ పరమహంస గారు విద్యాసాగరు నుద్దేసించి మందహాసంతో నేడు సముద్రుని చేరాను. ఇంత వరకు చూచినవి కాలువలు, వాగులు, నదులు మాత్రమే అన్నారట. విద్యాసాగరు వారు సైతం చమత్కార ధోరణిలోనే, "అయితే కొంచెం ఉప్పు నీరు తీసుకొండి! దాహంగా" అన్నారట! వెంటనే పరమహంస గారు "నువ్వు అవిద్యాసాగరువి కావు , విద్యాసాగరువి - క్షీరసాగర్... నువ్వు చేస్తున్నవి సాత్త్విక కార్యాలు. సత్త్వం యొక్క రాజసికాంశాలవి. సత్త్వ గుణం వలన దయ జనిస్తుంది. దయ వలన చేసే కార్యం రాజసికమైనా, ఈ రాజస్సుకు మూలం "సత్త్వం" కనుక దాన్లో దోషం లేదు... నువ్వు విద్యాదానం చేస్తున్నావు. ఇది మంచిదే... భక్తీ, వైరాగ్యం ఇవ్వన్నీ విద్యా విభూతులు... బ్రహ్మం విద్యకూ, అవిద్యకూ కూడా అతీతం!... బ్రహ్మ మంటే ఎట్టిదో ఇంత వఱకు ఎవ్వరూ చెప్ప జాలిన వారు లేరు కదా?" వెంటనే విద్యాసాగర్ తన మిత్రులతో “నేనొక కొత్త విషయం నేర్చుకొన్నాను”. వెను వెంటనే శ్రీ రామకృష్ణుల వారు “శుష్క పాండిత్యం నిరర్థకం. భగవంతుని పొందే మార్గం తెలుసు కొనడానికే గ్రంథ పఠనం”. శ్రీపరమహంస దివ్య ప్రసంగాలను విద్యాసాగర్ ముగ్ధులై ఆలకించారు అని పేర్కొన బడినది.అలాగే, ప్రసిద్ధ నవలా రచయిత బంకించంద్ర ఛటర్జీ శ్రీరామకృష్ణుల వారిని 6-12-1884న ఒక భక్తుని ఇంట్లో కలిశారు. వారి మధ్య కూడా చమత్కార సంభాషణ జరిగి నట్లుగా పేర్కొన బడినది. శ్రీపరమహంస గారు బంకించంద్ర నామంలోని "బంకిం" (వంగిన) అనే పదాన్ని గూర్చి చమత్కరిస్తూ - "ఎవరి ప్రభావం నిన్ను వంచింది?” అని ప్రశ్నించారుట. దానికి "బంకిం" కూడా చమత్కార యుక్తం గానే "మహాశయా మన తెల్ల దొరల కాలిజోళ్ళు" అని జవాబిచ్చారుట! పరమహంస గారు "బంకిం" ను మానవుని విధ్యుక్త ధర్మాలు ఏమిటని నీ అభిప్రాయం?" అని ప్రశ్నించారట. దానికి బంకిం వెనువెంటనే "భోజనం, నిద్ర, కామోపభోగం" అని జవాబిచ్చారుట. దాంతో కోపగించుకొన్న పరమహంస గారు "అధిక ప్రసంగిగా ఉన్నావు రేయింబవళ్ళు చేసేదేదో అదే నోటి నుండి వెలువడుతుంది ... ధ్యానం, వివేక వైరాగ్యాలు లేకుంటే కేవలం పాండిత్యం వల్ల ఏమి లాభం? భగవంతుని వైపు తన మనస్సు మరల్పనివాడు పండితుడన దగడు" అని అన్నారుట! ప్రసంగా నంతరం జరిగిన దివ్య సంకీర్తనలో శ్రీరామకృష్ణుల సమాధి స్థితిని చూచి బంకించంద్ర ఛాటర్జీ ముగ్ధుడయ్యాడని పేర్కొన బడినది. శ్రీరామకృష్ణుల వారి... సందర్శన దివ్య ప్రసంగ శ్రవణాసక్తి చిత్తులై ఎందరో భక్తులు, మహాపురుషులూ, జిజ్ఞాసువులు, ముముక్షువులూ ఆయన సాన్నిధ్యం పొందినప్పుడు, వారితో పరమహంస జరిపిన ప్రసంగాలే చాలామంది హృదయాలు పరివర్తన జేసాయి.ఒకప్పుడు నారాయణ శాస్త్రి అనే గొప్ప పండితుడు శ్రీరామకృష్ణుల సన్నిధికి వచ్చారు. అతడిలో నున్న సాధన సంపత్తికి శ్రీరామకృష్ణుల వారాశ్ఛర్య పడి, వారితో తత్త్వబోధన ప్రసంగాలతో కాలం గడుపుతున్నారు. ఇది ఇలా ఉండగా, న్యాయవాది, వంగ దేశీయ ప్రముఖకవి అయిన మైకేల్ మధుసూదన దత్తు ఏదో పని మీద దక్షిణేశ్వరం వచ్చి శ్రీరామకృష్ణుల ను చూడగోరాడు. శ్రీరామకృష్ణుల వారు శ్రీనారాయణ శాస్త్రి తో కలిసి మధుసూదన దత్తు వద్దకు వెళ్ళారు. శాస్త్రిగారు దత్తుతో సంస్కృతంలో ప్రసంగిస్తూ, దత్తు తన స్వధర్మం పరిత్యజించి పరమతం అవలంబించడానికి కారణ మేమని ప్రశ్నించారుట! వెంటనే మధుసూదన దత్తు తన కడుపు చూపించి, దారిద్ర్య బాధ చేత క్రైస్తవ మతాన్ని పుచ్చుకొన్నానని సూచించారట! దానికి శాస్త్రి వెంటనే, ఏమిటీ? ఈ మూన్నాళ్ళ జీవితాన ఉదర పోషణార్థం స్వధర్మాన్ని పరిత్యజించటమా? ఎంత అవివేకం? ఎప్పుడో ఒకప్పుడు మరణించక తప్పదు. అలాంటప్పుడు పస్తుండి నువ్వు ప్రాణత్యాగం చేసివుంటే బాగుండేది" అని అతనితో మరి మాట్లాడ లేదుట! తరువాత, మధుసూదన దత్తు తనకు ఏమైనా ఉపదేశించమని శ్రీరామకృష్ణులను బ్రతిమలాడారట! కాని శ్రీరామకృష్ణుల వారు "ఎవరో నా నోరు మూసేస్తున్నారు, ఒక్క మాట కూడా పలుకలేకున్నాను" అని బదులు చెప్పారట! మధుసూదన దత్తు ముఖం చిన్నబుచ్చు కోగా శ్రీరామకృష్ణులు కొన్ని భక్తి కీర్తనలు పాడి అతణ్ణి ఊరట పరచారని పేర్కొనడమైనది.శ్రీపరమహంస గారిని దర్శించ వచ్చే వారిలో రెండు రకాల వారు వుండేవారు. వారిలో కొందరు యువకులైన విధ్యార్థులు; నరేంద్రనాథదత్త (స్వామీవివేకానంద) నాయకత్వంలో కాలాంతరంలో శ్రీరామకృష్ణ మఠ సన్యాసులై గురు సందేశ జ్యోతిని నలుమూలలా ప్రజ్వలింప జేసిన యతీంద్రులు. ఈ బాలశిష్య బృందంలో నరేంద్రనాథ్ రామకృష్ణుల వారికి అత్యంత ప్రీతి పాత్రుడై, అఖండానుగ్రహ పాత్రుడై, వివేకానందుడై, గురువగు పరమహంస సందేశాన్ని ప్రాక్ పశ్చిమ ఖండాల్లో అంతటా వ్యాప్తి గావించిన మహనీయుడు. తమ అఖండ సేవలచే ఈ యతీశ్వరుడు ఆధునిక భారత దేశంలో నూతనోత్తేజాన్ని, నూతన చైతన్యాన్ని ప్రభావింప జేసిన గొప్ప ఆధ్యాత్మిక మేధావి. శ్రీరామకృష్ణుల వారు తమ జీవిత శేషాన్ని ఈ భక్త బృందానికి బోధించడానికై - వారి జీవిత విధానాన్ని మహోన్నతాదర్శ దీపిత మొనరించటానికై వినియోగించారు.శ్రీరామకృష్ణ పరమహంస తమ శిష్యులకు ఆత్మ బంధువు, ప్రాణ మిత్రుడు. తాను గురువని కలలో కూడా తలచి ఎరుగడు. జగజ్జనని చేతులో తాను కేవలం ఉపకరణమని ఆయన భావించారు. ఇలాంటి సంపూర్ణ ఆత్మార్పణ వల్లే ఆచార్య శక్తి శ్రీరామకృష్ణ పరమహంసలో అఖండంగా ప్రకాశించ సాగింది. రామకృష్ణుల వారి సాన్నిధ్యాన్ని పొందిన సమస్తం పవిత్రమై, మహనీయమై వరలింది.కఠిన పరిక్షలకు లోను కానిదే శ్రీరామకృష్ణులు శిష్యులను స్వీకరించే వారు కాదు. పరమహంస గారు తమ అనంత ప్రేమతో శిష్యులను వశం చేసుకొనేవారు. తన అఖండ ప్రేమతో తనను పరమహంస గారు దాసునిగా చేశారని, తమ తల్లి దండ్రులు కూడా శ్తీరామకృష్ణుల మాదిరి తమను ప్రేమించి ఎరుగరని ఇతర శిష్యులకు వక్కాణించారు, వివేకానందులు.బోధనా విధానం:మనుష్యత్వం, ముముక్షత్వం, సంశ్రయం (ఆశ్రయం) అనే ఈ మూడు సమకూరడం ఆత్యంత దుర్లభమని శ్రీశంకరాచార్య వక్కాణించారు. శ్రీరామకృష్ణ పరమహంస గారు తమ శిష్యులకు, తమను ఆశ్రయించిన అనేక మంది భక్తులకు మహోపదేశాలు యిస్తూ, దివ్యానుభూతులు ఒనగూరుస్తూ, భగవత్ప్రాప్తి మార్గంలో వారిని పురోగింప జేశారు.అన్ని రకాలా అర్హులని తోస్తేనే గాని, పరమహంస గారు ఎవ్వరికీ పరమార్థాన్ని ఉపదేశించే వారు కారు. తన బోధనలు శిష్యులు ఆచరించే విషయంలో పరమహంస గారు అతి శ్రద్ధ వహించే వారు. శిష్యులతో ఆయన ఏనాడు తర్కించే వారు కారు. ఒక్క మాటలో, లేదా స్పర్శతో, లేదా కటాక్షంతో ఆయన బోధించే వారు. "ఆత్మ సాక్షాత్కారమే మానవ జన్మకు పరమావధి. ఆత్మానంద ప్రపూర్ణమైన హృదయంలో వాదోప వాదాలకు తావు లేదు. జ్ఞానోదయ మవగానే సంశయాంధకారం పటాపంచ లవుతుంది" - ఇదే ఆయన బోధ. ఆత్మ వికాసంలో ఏదశలో ఉన్నవారినైనా, అవలీలగా ఆకర్షించ గలిగే వారు - సాధకుల అధికారాంతరం మేరకు బోధిస్తూ, తన బోధనలు వారికి విశద పరచేవారు. శ్రీరామకృష్ణుల వారి బోధన నవరస భరితం. అతి గంభీర విషయాలను - ఆధ్యాత్మిక విషయాలను, - అతి విచిత్రంగా ఆయన తెలియ పరచే వారు. పరమహంస గారి సంభాషణలు ఒక్కోసారి నవ్విస్తాయి, మరొకప్పుడు ఆశ్చర్య చకితులను జేస్తాయి! ఒకప్పుడు ఆవేశాన్ని, మరొకప్పుడు ప్రశాంతతను కలిగిస్తాయి. భక్తి పారవశ్యంలో ఆయన ఒక కీర్తన పాడి జగజ్జనని నామం ఉచ్చరిస్తూ నృత్యం చేసేవారు! ఆ తర్వాత భగవంతుని సగుణ, నిర్గుణ స్వరూప సమన్వయం లాంటి వేదాంత రహశ్యాలను సరళ రీతిలో అత్యద్భుతంగా బోధించేవారు. ఇలాంటి మహోన్నత ఆత్మ భావాలనుండి వ్యావహారిక విషయాల లోకి దిగి, లోకజ్ఞానాన్ని, లోకవర్తన విధానాన్ని బోధించే వారు. అమాయకుడైన ఒక యోగీంద్రునికి బేరమాడు పద్ధతిని తెలియ జేశారు. అలాగే తన అంతరంగిక శిష్యుడు కాళీప్రసాద్ చంద్ర గాలం వేసి చేపలు పట్టుచున్నాడని విని, అతడిని పిలిచి అలాంటి క్రూర కృత్యాలు ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించగా అతడు సమస్త జీవులు మరణహితాత్మ స్వరూపులే కనుక, తాను చేపలను చంపిన వాడను కాననీ, తన కార్యం దోష రహితమనీ జవాబు చెప్పాడట! అప్పుడు పరమహంస అతనితో "నాయనా నీవు పొరబడు తున్నావు. ఆత్మానుభూతి పొందిన వాడెన్నడూ పరులను హింసించ లేడు - అది అతడి స్వభావానికే విరుద్ధం ... దీన్ని గురించి ఆలోచించు" అని బోధించారట! గురుదేవుల వాక్కులను గురించి మూడురోజులు పర్యాలోచించి కాళీప్రసాద్ అది యథార్థమని గ్రహించాడు.శ్రీపరమహంస గారి బాల్య శిష్యుడైన యోగీంద్రుడు (జోగీన్) మెత్తని మనసు కల వాడు. ఒకరోజు శ్రీపరమహంస గారి బట్టల లోనికి ఎక్కిన ఒక భరిణె పురుగును చంపమని చెప్పగా, అతను దాన్ని వొదిలి పెట్టి వచ్చాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు "దాన్ని చంపి రమ్మని చెప్పినా వదిలి పెట్టి వచ్చావు. నా మాటలను నువ్వు అక్షరాలా నెరవేర్చాలి, లేకుంటే ముఖ్యమైన విషయాలలో పశ్చాతాప పడవలసి ఉంటుంది" అని మంద లించారు. మరో రోజు యోగీంద్రుడు పడవ మీద వస్తున్నప్పుడు పడవలో ఎవడో రామకృష్ణుల వారిని నిందించ మొదలెట్టాడట. దానికి యోగీంద్రుడు ప్రతిఘటించ లేదట. ఆవిషయం తెలిసి కొనిన పరమహంస గారు శిష్యునికి ఈ విధంగా ఉపదేశించారట "గురు నిందాలాపాలను విని కిక్కురు మనకుండా ఊరకుండి పోయావు. ఈ సందర్భములో శాస్త్రాలు ఏంవక్కాణిస్తున్నవో తెలుసా? గురు నిందకు శిరశ్చేదన మైనా చేయాలి లేదా వెంటనే ఆస్థలం విడిచి వెళ్ళి పోవాలి. కాని గురు నిందను చల్లగా సహించావు"! అని మందలించారుట. అలాగే మరో శిష్యుడు నిరంజన్ పడవపై దక్షిణేశ్వరం వస్తున్నాడట. ఇదివరకి మాదిరిగానే తోడి ప్రయాణికులు కొందఱు పరమహంస గారిని గూర్చి చెడ్డగా మాట్లాడారట! ఉద్రేక స్వభావీ బలిష్ఠుడైన నిరంజన్ అందుకు అసమ్మతి తెల్పినా, వారు వినిపించుకోలేదట! నిరంజన్ కోపంతో "నట్టేట మిమ్మల్నందరినీ ముంచి వేస్తాను" అని భీకరంగా పడవను అటూ ఇటూ ఊపివేయ సాగాడట! ఆదెబ్బతో భయకంపితులై వారందఱూ క్షమాపణ కోరుకొన్నారట. ఈ సంగతి తెలుసుకొన్న రామకృష్ణుల వారు నిరంజన్‌ను తీవ్రంగా మందలించి ఇలా ప్రబోధించారట "కోపం మహాపాపిష్ఠిది నీళ్ళమీద గీచిన గీతలాటిది - క్షణికం. అవివేకులు ఏమేమో వాగుతుంటారు. ఆవాగుడును నువ్వు ఎన్నడూ పట్టించుకోరాదు".అహింసను గూర్చీ, అప్రతీకారాన్ని గూర్చీ వివిధ వ్యక్తుల స్థితి గతులను పురస్కరించుకొని శ్రీరామకృష్ణ పరమహంస గారు భిన్న ఉపదేశాలను చేసిఉండటం గమనించ దగిన విషయం! ఒకే సంఘటన విషయంలో యోగీంద్రునికి ఒక విధంగాను, నిరంజనుకు దానికి వ్యతిరేకంగాను ఆయన ఉపదేశించారంటే, వ్యక్తిగత మనః పరిపాకం లోని భేదమే కారణమని మనం గ్రహించాలి.శ్రీరామకృష్ణ పరమహంస గారి ఉపదేశ సారం :శ్రీపరమహంస గారి ఉపదేశ సారాంశము తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. శ్రీరామకృష్ణుల వారు "మాటల ద్వారాకంటే చేతల మూలంగానే" ఎక్కువ బోధించారనటం నిజం. తమ బోధన లన్నిటినీ సంభాషణల రూపంలో జిజ్ఞాసువులకు తెలియ జేసారు. వీటిలో కొన్నింటిని వారి శిష్యులు అతి జాగ్రత్తగా వ్రాసి భద్రపరిచారని ప్రతీతి. అయినప్పటికీ, ఆయా బోధనలు పరమహంస గారి సందేశాన్ని సమగ్రంగా తెలియ జేస్తాయని చెప్పుట కష్టతరము. కొన్ని విషయాలు ఇతరులు జోడించారన్న ప్రథ కూడా కలదు. శ్రీరామకృష్ణ పరమహంస అమూల్య ఉపదేశాలు యథా రూపంలో "శ్రీరామకృష్ణ బోధామృతం" లో క్రోడీకరింపబడినవి. ఈ విషయాలు వివిధ సందర్భాలలో చెప్పబడిన వైనందున సామరస్యము ఏకవాక్యతా అత్యంత కష్టతరము. అతుకులు కనిపిస్తూనే ఉంటాయి. కొంత వరకైన విషయం ముక్కలు ముక్కలు గానే తోచక మానదు. పరమహంస గారి తత్వ సారాంశములోని విశేషాలను సంక్షిప్త రూపంలో పాఠకుల ముందుంచడమైనది. విజ్ఞులు దీనిని సహృదయంతో స్వీకరిస్తారని ఆశిద్దాం! ఈ దిగువ పేర్కొనిన విషయాలు ప్రత్యేకంగా ఒకమతాన్ని గాని, సంప్రదాయాన్ని గాని నిరూపించేవి కావని పాఠకులు గమనింప ప్రార్థితులు. శ్రీరామకృష్ణ పరమహంస గారి వివిధోపాసనా వాహినులు - వివిధమత సాధనలు - ఆయన విజ్ఞాన సాగరంలో లీనమై ఒప్పుతున్నాయని గమనించాలి.దానిలోని సారాంశం :- సత్యం లేక తత్త్వం స్వయం జ్యోతి. ఏకమైన ఈతత్త్వమే ప్రపంచంలో వివిధ మతాల చేత భగవంతుడు, అల్లా, బుద్ధుడు, శివుడు, విష్ణువు, బ్రహ్మ - మొదలగు పేర్లతో సూచింప బడుతోంది. సాకారం అదే; సగుణం అదే; నిర్గుణమూ అదే.! నిరాకార బ్రహ్మం అనేది, సాకారబ్రహ్మం కంటే తక్కువదని కాక, నిరూపాధికమని భావించ వచ్చును. స్వతః సిద్ధంగా బ్రహ్మం సర్వాతీతమై ఉండీ, పరమేశ్వరాంశములో (లీలారూపంలో) చేతనాచేతన ప్రపంచానికంతకూ మూలాధారమై సృష్టి, స్థితి, లయ కారణమై ఒప్పుతోంది. ఈ భావం లోనే బ్రహ్మం జగత్పిత అని గాని, జగన్మాత అనిగాని, సూచిత మౌతోంది. జీవులు జగత్తు కూడా బ్రహ్మ స్వరూపాలే.భక్తుడికి ఆయన ప్రేమ మూర్తి, జీవన జ్యోతి. సంసార దుఃఖాలు తనను మరచి సంచరిస్తున్న తన బిడ్డలను తిరిగి తన వద్దకు చేర్చుకొనుటకై ఆయన వినియోగించే ఉపాయాలు. సర్వాంతర్యమిగా వెలుగొందుతున్నా, భక్తి పూరితులయ్యే వారికి ఆయన అత్యంత ఆప్తుడు. మానవుడి హృదయాంతరాళం నుండి వెలువడే ప్రార్థనలను ఆయన ఆలకిస్తాడు - తన కటాక్షాన్ని భక్తుని మీద వెద జల్లుతాడు.నిర్గుణ, నిరాకార తత్త్వంలో భగవంతుణ్ణి జ్ఞాన మార్గం చేత ప్రాప్తించుకోవచ్చు. సగుణ సాకార రూపంలో ఆయనను భక్తి మార్గంలో పొందవచ్చు. అయినప్పటికీ, ఆత్మార్పణతో కూడుకొన్న భక్తిమార్గమే మానవునికి ఎంతో సహజమూ, సులభము. భక్తి మార్గం అవలంబించే వారికి భగవంతుడు జ్ఞాన ఫలమై, బ్రహ్మైక్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. భక్తి మార్గంలో భగవంతుణ్ణి, తన తండ్రిగా గాని, తల్లిగా గాని, మిత్రునిగా గాని, పుత్రుడుగా గాని, ప్రాణేశ్వరుడిగా గాని, సన్నిహిత ప్రియతమం అయిన మరే ఇతర సంబంధాన కాని, భావించ వచ్చు, భజింప వచ్చు. భక్తుడి మనోభావాన్ని అనుసరించి, భగవంతుడు వివిధ దివ్య రూపాలతో సాక్షాత్కరిస్తుంటాడు! సాక్షాత్కార వాఙ్మయంలో అద్వైతం అనేది తుదిమాట. అది మనస్సుకూ, మాటకూ అతీతమవటం చేత, యోగసమాధిలో మాత్రమే అనుభూత మౌతుంది. మనస్సూ, బుద్ధీ, మాట - విశిష్టాద్వైతం వరకూ గల విజ్ఞానాన్ని మాత్రమే గ్రహించ గలుగుతాయి. తరువాత స్థాయికి అవి పోలేవు. విశిష్టాద్వైతం యొక్క సంపూర్ణావస్థలో అఖండ సచ్చిదానంద వస్తువూ, తద్బాహ్య రూపముగా సమంగా సత్యాలని కనుగొన వచ్చు.అద్వైత సిద్ధాంతం ప్రకారం, ఉన్నది బ్రహ్మమే. అదే తన మాయా శక్తి వలన జీవుడుగానూ, ప్రపంచంగానూ, భాసిస్తూ ఉంటుంది. ఈ మాయా వసుడైన జీవుడు, మాయ నుండి తప్పించుకో గల్గితే, అతడు అంతా బ్రహ్మమే అనీ ప్రపంచ మనేదే లేదని దర్శించ గలడు. అత్యున్నతమైన అద్వైత స్థితిలో జీవుడు కూడా బ్రహ్మమే కనుక, దర్శించ బడే ప్రపంచం గానీ, దర్శించే జీవుడుగాని మిగులరు. కేవలం సచ్చిదానంత ఘనమైన బ్రహ్మమే ఉంటుంది. ఈ విషయాన్నే శ్రీరామకృష్ణ పరమహంస గారు ఇలా వర్ణిస్తారు. "ఒకసారి ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతు కొలవడానికి పోయింది... నీళ్ళల్లో దిగగానే అది కరిగి పోయింది. ఇక సముద్రపు లోతు చెప్పడానికి ఎవరున్నారు?" ఇలా బ్రహ్మ రూపంగా ప్రపంచాన్ని దర్శించే జీవుణ్ణి పరమహంస గారు విజ్ఞాని అంటారు. సమాధిలో సచ్చిదానంద ఘనమైన బ్రహ్మాను భూతిని పొంది మరలా ఈ వ్యావహారిక జగత్తుకు వచ్చేటప్పుడు అలా ప్రపంచాన్ని బ్రహ్మంగానే చూడ గలగడం జరుగుతుందని వారి అనుభవం.జీవుల పట్ల కారుణ్యంతో భగవంతుడు అవతరిస్తాడు. బ్రహ్మ మార్గాన్ని, ధర్మ మార్గాన్ని లోకానికి తెలుపటానికై ఆత్మశక్తికీ, పవిత్రతకూ నిలయమైన ఒకానొక దివ్య మానవ రూపంలో అతడు ఆవిర్భవిస్తాడు. ఆయనను ఆరాధించడం, ధ్యానించటం ఆత్మ వికాసానికి సులభోపాయాలు. ప్రతి జీవి లోను, దివ్యత్వం, ఈశ్వరత్వం గర్భితంగా ఉంది. బాహ్యాంతర ప్రకృతులను వశం చేసుకొని అంతర్గతంగా ఉన్న ఈశ్వరత్వాన్ని ప్రకాశితం చేసుకొనడమే జీవిత పరమావధి.బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందడానికై జ్ఞానయోగం, కర్మయోగం, రాజయోగం అనే ముఖ్యమైన యోగాల్లో ఏదైనా ఒకటిగాని, కొన్నిటిని గాని, అన్నింటిని గాని అవలంబించ వచ్చు. భగవత్సాక్షాత్కారమే జీవితోద్దేశ్యమని శ్రీరామకృష్ణ పరమహంస గారు ఉపదేశించిరి. అది అందరికీ సాధ్యమేయని వారు నొక్కి వక్కాణించిరి.పారమార్థిక జీవనానికి ప్రధానాంగం బలం - శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బలం. బలానికి మూల కారణం విశ్వాసం (నమ్మకం). ఆత్మ నిరసనం ధర్మ లక్షణం కాదు. అది దౌర్బల్యానికి దారి తీస్తుంది. అలాంటి దౌర్బల్యాన్ని తోసిరాజనాలి! ఎందుకంటే స్వత సిద్ధమైన తన దివ్యత్వాన్ని ధ్యానించటం చేత మానవుడు పాప ముక్తుడు కాగలడు గాని, "నేను పాపిని", అనుకుంటూ దుఃఖించటంతో విముక్తుడు ఎంతమాత్రం కాలేడు. "అమృత పుత్రు" డైన మానవుణ్ణి పాపి అనుట కంటే పాపం నిజంగా మరొకటి లేదు.అవినీతి పరుడైన వాడు, పాపభీతి లేనివాడు – పారమార్థికు డవడం సంభవము కాదు. సమస్త నీతి నియమాలకు మూలాధారం నిస్వార్థం. నిస్వార్థానికి మూలాధారం వైరాగ్యం. అంటే, కామినీ, కాంచన త్యాగం. నిర్మల వర్తనంలో, సర్వ భూత హితాచరణలో, సర్వేశ్వరుడుని పొందాలనే పరితాపంలో వైరాగ్యం ప్రజ్వ లిస్తుంది. అలాంటి వైరాగ్యం వలన నిర్మలమైన హృదయంలో భగవంతుడు ప్రతిఫలిస్తాడు. అతి దుర్లభమైన మానవ జన్మ ఎత్తి భగవద్దర్శనం పొందని మనిషి జీవితం, చివరకు దానికై తగు సాధనైనా చేయని మనిషి జన్మ నిరర్థకం, వ్యర్థం. శుష్క తర్కంలో జీవిత కాలం వ్యర్థం చేయకుండా, మనం జీవితంలో అమలు పరచి లాభం పొంద గలిగే మార్గాన్ని అవలంబించడం బుద్ధిమంతుల లక్షణం. అద్వైత గ్రంథాలు ఇప్పటి వరకూ వాద ప్రతి వాదాలకు ఉపకరించాయేగాని సాధనకు ఉపయోగ పడలేదు. శ్రీరామకృష్ణ పరమహంస ఉపదేశాల ద్వారా అద్వైతాన్ని అర్థం చేసుకొంటే, సాధన వైపు మనస్సు మొగ్గుతుంది.ఒక విషయం గమనార్హం. ఆధునిక కాలమున భౌతిక విజ్ఞాన విజృంభణము వలన మరొకసారి అద్వైత తత్త్వమునకును, అనుభవ ప్రాముఖ్యతకును, పరపతి పెరుగు చున్నది.! భారత దేశమున విజ్ఞాన శాస్త్రమునకును, తత్త్వశాస్త్రమునకును ఏనాడూ విరోధము లేదు. మీదు మిక్కిలి ఆ రెండు శాస్త్రములు పరస్పర సహకారకములై వికసిస్తున్నవి.శ్రీరామకృష్ణ జీవితచరిత్ర కంటె సర్వ ధర్మ సమన్వితమగు గ్రంథమింకొకటి లేదు. మహా వేగముతో ప్రవహించుచు, దోషరహిత భాషతో అందఱినీ ఆకట్టుకొను శైలిలో రచింప బడిన ఈ ఉద్గ్రంథమును అందరూ చదివి ఐహిక - ఆముష్కిక శ్రేయస్సును సాధింతురు గాక! శ్రీవేలూరి వారి మాటలలో "భగవద్వ్యాకులత వలయునా, దీనిని చదువుము! మొఱయు గూతయు విడ గోరుదువా, దీనిని చదువుము! రోమాంచ నేత్రముల దాల్ప దల్తువా, దీనిని చదువుము! బ్రహ్మవారి వర్షించు టెటులో నేర్చు కొందువా, శ్రీరామకృష్ణ జీవితచరిత్ర చదువుము!"

ఓం తత్ సత్! శ్రీరామకృష్ణార్పణమస్తు!

No comments:

Post a Comment