Friday, 10 January 2014

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తెలుగు పుస్తకాలు ఆంధ్రుల సాంఘిక చరిత్ర

మనిషి బాగుపడటానికైన, చెడిపోవటానికైనా, స్నేహితులు, పుస్తకాలు అత్యంత ప్రయోజనకరమైన వుపకరణాలు.


స్నేహం వొకవ్యక్తిజీవితంలోనె మార్పుతెస్తుంది. కాని శక్తివంతమైన పుస్తకం అనేక పాఠకుల వైఖరితో సహితం, ప్రవర్తనలోనూ మార్పుతెస్తుంది. మంచిపుస్తకాలు, విజ్ఞనాన్ని కల్గించవచ్చు, వినోదాన్ని పంచవచ్చు. కొన్ని సంధర్భాల లో రెండిటినీ సమకూర్చ వచ్చు. అటువంటి పుస్తకాలు ప్రసిద్ధ మౌతాయి.మంచి పుస్తకాలు చదవుటకు అందరూ ఆసక్తి చూపిస్తారు. అయితే, యేది మంచి పుస్తకమో నిర్ణయించటం సులభం ఐనపని కాదు. అయినప్పటికీ, ప్రతివిషయ నిర్ణయానికీ కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఏర్పడి వున్నవి. అటువంటి ప్రమాణాలను అనుసరించి మంచి పుస్తక నిర్ణయం జరుగుతుంది.


పుస్తక పఠనం మనిషి ఆలోచనలకు ఒక వుదాత్తతను కల్పించి, స్వార్ధపరత్వాన్ని, సంకుచిత తత్వాన్ని, తగ్గించుట యేగాక, అతనిలో విశ్వమానవతను పెంపొందించేదిగా వుండాలి. "మంచి పుస్తకం మంచి మనసుకు మరో పేరు" అంటారు కొందరు!తెలుగు సాహిత్యము లో మంచి పుస్తకాలకు కొరత లేదు. మంచి రచయితలూ చాలమందే వున్నారు. ఇటీవలి కాలంలో (అంటే 1955వ సంవత్సరం నుండి) కేంద్ర సాహిత్య అకాడమీ ఈ విషయం లో చెప్పుకో దగిన కృషి చేస్తున్నది. భారతీయ భాష లన్నిటి లో ప్రచురింప బడుతున్న వుత్తమ రచనలను, విజ్ఞులైన పండితుల సహకారం తో పరిశీలింప జేసి, ఉత్తమ రచనలుగా నిర్ణయమైన గ్రంధాలకు జాతీయ బహుమతులను ప్రకటించి, ఆయా రచయితలను గౌరవిస్తున్న విషయం, విజ్ఞులందరికీ విదితమే! గత యేబది సంవత్సరాల కాలం లో తెలుగు లో దాదాపు 45మంది రచయితలకు సాహిత్య ఆకాడమి జాతీయ అవార్డ్ లభించింది. వీరిలో కవులూ, నవలా రచయితలూ, కధా రచయితలూ, సాహిత్య విమర్శకులు, జీవిత చరిత్రలు రచించినవారు,సాంఘిక చరిత్రలు రచించినవారు, వాగ్గేయకారులు వున్నారు. వారి రచనలు, వారివారి ప్రజ్ఞా పాటవాలను చక్కగా చిత్రించడమే కాక, అత్యంత శ్రమ కోర్చి వారు సంతరించిన జ్ఞానసుధను, అందరికి అర్ధమయ్యే భాషలో చదువరులకు అందజేయుట సంతోషకరమైన విషయము. పైన వుల్లేఖించిన రచనలు చదువ తగిన మంచి పుస్తకాలని భావించుట సమంజసము.సాహిత్య అకాడమి "జాతీయ బహుమతి" గెలుపొందిన పుస్తకాలలోని విశేషాలను సూక్ష్మరూపంలొ పాఠక లోకానికి అందజేయుటయే ఈ వ్యాసకర్త వుద్దేశం. ఈప్రయత్నం చదువరులలో పఠనాసక్తిని పెంపొంద చేస్తుందని ఆకాంక్ష! ప్రస్తుత వ్యాసంలో చర్చిత రచన కీ.శే. సురవరం ప్రతాప రెడ్డిగారు రచించిన "ఆంధ్రుల సాంఘిక చరిత్ర".కీర్తిశేషులు శ్రీ సురవరం ప్రతాప రెడ్డిగారు బహుభాషా కోవిదులు. వారికి తెలుగు సంస్క్ర్స్తతం, ఉర్దూ, హిందీ, పారసీ, ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యం కలదు. సాహిత్య రంగంలో అత్యంత ఖ్యాతిగడించినవారు. సురవరం ప్రతాప రెడ్డిగారు స్పౄసించని సాహిత్య ప్రక్రియ లేదు. పరిశోధనాత్మక రచనలలో వారిది అందె వేసినచేయి! ఆంధ్రుల చరిత్ర పట్లా, సంస్కృతి పట్ల వారి అభిమానానికి హద్దులంటులేవు! శ్రీ సురవరం ప్రతాప రెడ్డిగారి పరిశొధనాత్మక రచనలలో విషేషించి పేర్కొన దగినవి నాలుగు: 1] "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" 2] హిందువుల పండుగలు, 3]రామాయణ విశేషాలు, 4] హిందుస్థాన చరిత్ర.పై పేర్కొనిన రచనలలో "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" చాలామంది మేధావుల మెప్పునూ, విమర్శకుల అభిమానాన్ని, అశేష ప్రశంసలను అందుకొనిన ఉద్గ్గ్రంధము. ఈ రచనకు సెంట్రల్ (కేంద్ర) సాహిత్య అకాడమీ 1955వ సంవత్సరపు జాతీయ బహుమతిని యిచ్చి గౌరవించింది.సమాజంలోని సామాన్య ప్రజల సాంఘిక జీవనాన్ని [ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, వినోదాలు, జీవనశైలి, ఇత్యాదులు] ప్రత్యేకంగా చిత్రిస్తే - ఆ రచనను సాంఘీక చరిత్ర అంటారు. సాంఘిక చరిత్రలు ఆయాకాలపు ప్రజల జీవిత విశేషాలను విపులంగా తెలుసు కొనుటకు హెచ్చుగా వుపయోగ పడతాయి.తెలుగు భాషలో సాంఘిక చరిత్రలు అరుదుగా కనిపిస్తాయి. చారిత్రక రచనలు వ్రాయుటకు చాలా మంది రచయితలు ప్రయత్నించారు. అట్టివారిలో చిలుకూరి వీరభద్ర రావు గారు, డా. నేలటూరు వెంకటరమణయ్య గారు ముఖ్యులు. ఈ విషయం లో అశేష పరిశోధన చేసిన వారిలో శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు అగ్రగణ్యులు. వారు వ్రాసిన రెడ్డిరాజుల చరిత్ర - ప్రముఖ చరిత్రకారుల మన్నల నందుకొనినది.ఆ గ్రంధ రచన లో శ్రీ శర్మగారు వుపయోగించిన చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే - మల్లంపల్లివారి శోధనా పటిమ, రాగి శాసనాల లోను, తాళపత్రాల లోను, మరుగుపడి జీర్ణావస్థలో నున్న హస్తలేఖా ప్రతులు శోధించి చారిత్రక సత్యాలను వెలుగులోనికి తెచ్చి - ఆయా అంశాలను సమన్వయ పరచి అర్థవంతమైన నిష్కర్షలు రూపొందించుటలో శర్మగారి ప్రజ్ఞా పాటవాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి. నిష్పక్ష చారిత్రక సత్యాలను వెలికి తెచ్చుట సోమశేఖర శర్మగారి వంటి నిస్వార్థ పరిశోధులకే సాధ్యం.సాంఘిక చరిత్రను గురించి వివరిస్తూ శ్రీ ప్రతాప రెడ్డిగారు అంటారు: - "రాజుల చరిత్రలు మనకంతగా సంబంధించినవి కావు. సాంఘీక చరిత్రలు మనకు పూర్తిగా సంభందించినవి... సాంఘిక చరిత్ర మానవ చరిత్ర... ప్రజల చరిత్ర, అది మన సొంత కధ. అది మన జనుల జీవనమును ప్రతి శతాభ్ద మందెట్లుండెనో తెలుపు నట్టిది. అది మన తాతా ముత్తాల చరిత్ర. వారి యిండ్లు, కట్టు, తిండి, ఆటలు, పాటలు, పడిన పాట్లు, మన కిచ్చి పోయిన మంచి చెడ్డలు, ఇవ్వన్ని తెలిపి మనకు సహాయ పడును". పైన పేర్కొనిన వాక్యాలు శ్రధ్ధతో పరిశీలిస్తే ప్రతాప రెడ్డి గారి లక్ష్యమేమిటో అర్ధమౌతుంది. ఆలక్ష్య సాధన కోసమే "ఆంధ్రుల సాంఘీక చరిత్ర" రూపొందింది. 1929 నుండి 1949వరకు అంటేరెండు దశాబ్దాల పాటు నిర్విరామంగా వారు చేసిన కౄషి ఫలితమే "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" రచన రూపంలో ప్రచురణమైనది. శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారి ఈ విశిష్ట రచనలో దాదాపు వెయ్యి సంవత్సరముల ఆంధ్రుల సాంఘీక చరిత్ర నిక్షిప్తమైనది. కొన్ని నిక్షిప్తాలను ఆవిష్కరించుకొందామా!సాహిత్యం ద్వారా సాంఘిక జీవనాన్ని నిరూపించడం ఈ గ్రంధం యొక్క ప్రత్యేకత. ఒక సంస్కృతి యొక్క పుట్టుక, వికాసాలను గురించి ఆధారలతో విశ్లేషిస్తే అది ఆ సంస్కృతీ, సభ్యతల చరిత్రగా పరిగణింప బడుతుంది. నిజమైన సాహిత్యం యేకాలనికి సంబంధించినదైనా ఆకాలపు ప్రజా జీవితానికి అద్దం పడుతుందని చాలామంది రచయితల నమ్మకము. "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" లో మొత్తము ఎనిమిది ప్రకరణాలు ఉన్నవి. అందులో మొదటిది తూర్పు చాళుక్య యుగం. నన్నయ కాలము నుండి కాకతీయుల ప్రాబల్యం దాక దాదాపు క్రీ.శ.1000 నుండి 1200 వరకు తెలుగు దేశము లోని ఆచార వ్యవహాలను సురవరం వారు ఈ ప్రకరణంలో చర్చించారు. ఈ ప్రకరణంలో చర్చించిన విషయాలకు ముఖ్యంగా నన్నెచోడుని "కుమార సంభవము", తెలుగు భారతము (విరాట పర్వము), చాళుక్య సోమేస్వరుడు రచించిన "అభిలషితార్ధ చింతామణి" ఆధారాలగా పరిగణించారు శ్రీ ప్రతాప రెడ్డిగారు.వివాహానికి సంబంధించిన ఆచార పద్ధతులను వివరిస్తూ - ఆకాలం తెలుగువారి యిండ్లలో నాలుగు రోజుల పెళ్ళి సాధారణమని, వివాహ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నాలుగు రోజుల పాటు జరుగుతూ వుండేవని పెర్కొన్నారు. మహాభారత కాలాన్ని పురస్కరించుకొని, ఉత్తర వివాహం నాల్గు రోజులు జరిగినదనియు, వివాహానంతరం (దిన చతుష్టయానంతరం) బంధువులు యెవరిళ్ళకు వాళ్ళు వెళ్ళి పోయినట్లుగా చిత్రించారు. అలాగే మేన మరదలిని పెళ్ళాడే ఆచారం తెలుగు వారిదేనని సురవరం వారు అభిప్రాయ పడ్డారు. ఆకాలపు వేష భూషలను గురించి ముచ్చటిస్తూ స్త్రీలు మట్టెలు ధరించడం కూడా తెలుగు వాళ్ళ ఆచారమేనని, వైదిక పధ్ధతిలో యిటువంటి రివాజు లేదని వెల్లడిస్తూ "తాళిబొట్టు" ద్రావిడాచారముల లోనిదని పేర్కొన్నారు.చరిత్ర కారునికి విషయ సేకరణ యెంతముఖ్యమో విమర్శ చేయటం అంతేముఖ్యం. సురవరం ప్రతాప రెడ్డి గారు తూర్పు చాళుక్య యుగమును గురుంచిన చర్చలో ఆనాటి మత విషయమై ప్రస్థావించి, శైవ మతవ్యాప్తికి కారణాలు, రాజరాజనరేంద్రుని క్షత్రియ వంశ విశేషాలు బ్రాహ్మణ జాతి ప్రాముఖ్యత, ఆనాటి కవితారీతులు, యిత్యాది విషయాలను సహేతుకంగా విమర్శించారు. (ఆ.సా.చ.పుట 1o4). వారు పరిశీలించిన పుస్తకాలలో ప్రతిబింబించు జనజీవన స్రవంతిలోని వినోద విషయాలను వివరిస్తూ, అవి యే గ్రంధాలలో వున్నాయో సూచించారు. ఇది శ్రీ రెడ్డిగారి సత్య శోధనకు నిదర్శనం. "అంకమల్ల వినోదము", కోళ్ళ పందెము, లావక పిల్లల కొట్లాట, మేష మహిష యుధ్ధాలు, పావురాళ్ళ పోట్లాట, శ్వేనముల వేట, గీతావాద్య నృత్యములు, పహేళికా, చతురంగము, పాములాట మొదలైన వినోదాలు "అభిలషితార్థ చింతామణి" గ్రంధంలో వర్ణించినారని పేర్కొన్నారు. (ఆ.సా.చ. పుట 7).నాటి కవుల రచనల లోని సందిగ్ధమైన కొన్ని శభ్దాలను (పదాలను) నిఘంటువుల సహాయముతో వివరించారు.పరిపాలనా వివరాలను గూర్చి ముచ్చటిస్తూ, తూర్పు చాళుక్యుల కాలంలో పంచాయితీ సభలు వుండే వనియు, సభ్యులు, సభలకు వచ్చే అభియోగాలు, శిక్షా తీర్మానాలు మొదలగు విషయాలను విశ్లేషించుటయేగాక,ఎటువంటి వ్యక్తులు పంచాయితీ సభాసభ్యులగుటకు అర్హులో సూచించారు. (ఆ.సా.చ. పుట7).ఇదే సందర్భంలో విశ్లేషిస్తూ "చరిత్ర భవన నిర్మాణనికి - సద్విమర్శ, కాల నిర్ణయము, సత్య శోధన, ఆధార విషయాలు పునాది రాళ్ళ వంటివి. వీటిని పునహ్ పరిశీలించుకొని సవరించు కోవటం చరిత్ర కారునికి అత్యంత అవసరము" అని రెడ్డిగారి ధ్రుఢ నమ్మకం. ఆ నమ్మకం తోనే పూర్తి గ్రంధ రచన సాగించారు సురవరం వారు.ద్వితీయ ప్రకరణాన్ని కాకతీయుల యుగం (క్రీ.శ.1050 నుండి 1323 వరకు) గా పేర్కొన్నారు ప్రతాప రెడ్డి గారు. ఈ ప్రకరణం లో కాకతీయుల కాలమునాటి జీవన స్రవంతిని కనులకు కట్టినట్లుగా చిత్రించారు రచయిత. కాకతీయుల పరిపాలనా కాలము నాటికి అంధ్ర ప్రాంత మంతట బౌద్ధ మతం క్షీణించింది. జైన మత ప్రభావం యెక్కువగా వుండేది. జైన మత ప్రభావాన్ని వీర శైవులు అణచివేశారు.కాకతీయుల పరిపాలనా కాలంలో మత సామరశ్యం లేని కారణాన మత కలహాలు తరుచుగా జరుగు తుండేవి. జైన, శైవ, వైష్ణవ మతాలు పరస్పర ప్రభావం కోసం పోరాడు తుండేవని పేర్కొన్నారు.ఈ కాలంలో ప్రత్యేకించి పేర్కొన దగిన విషయం, కాకతీయులు అనుసరించిన వ్యాపార విధానము. ఆ కాలంలో యితర దేశాలతో వ్యాపార సంబంధాలు అభివృద్ధి చెందాయి. తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుండి రేవుల ద్వారా రాజ్యం లోనికి అనేక రకములైన వస్తువులు వస్తుండేవి. రేవుల దగ్గర సుంకములు వసువులు చేసేపధ్ధతి అమలులో వుండేది.సుంకములకు సంబంధించిన సమాచారం శాసనముల ద్వారా ప్రజలకు తెలియ పరచే వారు.ఓరుగల్లు కోటకు బయటి భాగంలో "మైల సంత" జరుగు తుండేదని, ఆసంతలో నువ్వులు, గోధుమలు, వడ్లు, జొన్నలు, మొదలైన ధాన్యంతో పాటు, బెల్లం, చింతపండు, నెయ్యి, మసాలా దినుసులు, రకరకములైన కూరగాయలు అమ్ముతుండే వారని పేర్కొన బడినది. కాకతీయుల కాలమునాటి సంస్కృతీ సాంప్రదాయలతో మిళితమైన జీవనవిధానాన్ని అద్దంపట్టినట్లు చూపించారు రచయిత ఈ ప్రకరణం ద్వారా."ఆంధ్రుల సాంఘిక చరిత్ర" లోని మూడవ ప్రకరణము - రెడ్డి రాజుల యుగానికి (క్రీ.శ.1324 - 1434వరకు) సంబంధించినది. రచయిత ఈ ప్రకరణంలో రెడ్డి రాజుల పరిపాలన కాలం నాటి ప్రజా జీవనానికి సంబంధించిన అనేక విషయాలను చర్చించారు.రెడ్డి రాజుల పరిపాలనలో సామాన్య జీవనం - అనగా సామన్య ప్రజలు అనుసరించిన మతమూ, వారి భక్తి విశ్వసాలు, ఆరాధించిన దేవతలు, వ్యవసాయ పద్ధతులు, శివపూజ సమయంలో కొంతమంది చేసే ఆత్మ బలిదానం, సామాన్యుల వేడుకలు, ఆటలు మొదలగు విశేషాలతో భరితమైన సాంఘిక జీవనం అతి రమ్యంగా వర్ణించారు ప్రతాప రెడ్డిగారు. శైవశక్తి పేరుతో గోగులమ్మ, శ్రీ మండల్లి, నూకాంబ, ఘట్టాంబిక, మాణికా దేవి, అనే శక్తులను, కామాక్షి, మహంకాళి తదితర దేవతలను ప్రజలు పూజించేవారని పేర్కొన్నారు. శివ పూజల్లో ఆత్మబలిదానమివ్వటం, అలా బలిదానమిచ్చేవారిని వీరులుగా పరిగణించడం, అప్పటి ఆచారంగా వివరించారు.ఆ కాలంలో వ్యవసాయ భూమిని మాగాని (తరి), మెట్ట అని వ్యవహరించేవారు. వరి పండించే భూమిని "మాగాని" అని, జొన్న, రాగి మొదలైన ధాన్యము సాగుచేసే భూమిని మెట్ట అని పిలిచేవారు. ఆ కాలంలో, సామాన్యులు చదరంగం, పులిజూదము, చర్ పర్, మొదలైన ఆటలను ఆడేవారని పేర్కొని, ఆయా ఆటలను విశేషించి వివరించారు,ఈ ప్రకరణంలో శ్రీ రెడ్డిగారు.రెడ్డి రాజులు అత్యంత వీరశైవాభిమానులు. అందుచేత శైవ మతమునకు వ్యాప్తినిచ్చిరి. రెడ్లు శైవులైనప్పటికి పరమతస్తులను యెలాంటి భాధలకు గురి చేయలేదు. శివక్షేత్రములను యెక్కువగా అభివృద్ధి చేసిరి. కాని రెడ్డి రాజ్యం చివరి కాలంలో, వైష్ణవ మతము దక్షిణ తమిళ ప్రాంతం నుండి తెలుగు దేశము లోని కెగుమతి కాజొచ్చెనని పేర్కొన్నారు రచయిత.రెడ్డి రాజుల పరిపాలనా సమయంలో సముద్ర వ్యాపారం అభివృద్ధి చెందినట్లుగా వర్ణితమైనది. ఈ కాలంలో, కళా పోషణం బాగా జరిగినట్లు చారిత్రక ఆధారలతో నిరూపించారు ప్రతాప రెడ్డీ గారు. ఈ ప్రకరణంలో కవి సౌర్వభౌముడు శ్రీనాధుడు రెడ్డి రాజుల కాలంలోని వాడని పేర్కొంటూ, విధ్యాధికారిగా శ్రీనాధ మహాకవి ప్రవేశ బెట్టిన కొన్ని పధ్ధతులను చర్చించారు.ఈ ప్రకరణంలో ముఖ్యముగా పేర్కొనిన విషయమేమంటే, రెడ్డ్లు, వెలమలు, తెలుగు వారు కారని, ఉత్తరాది నుండి వచ్చిన రాష్ట్ర కూటులు రెడ్డ్లుగా పరిగణించ పడినారని, అదే విధముగా తమిళ దేశము నుండి వచ్చిన వెల్లాలు అనువారు తెలుగు దేశములో వెలమలుగా ప్రసిధ్ధి పొందారని శ్రీ సురవరం వారు అభిప్రాయ పడినారు. మరియు, వెలమలు సంఘ సంస్కర ణాభిలాషులని, రెడ్లు పూర్వాచార పరాయణులనీ, యీ రెండు వర్గాల మధ్యెప్పుడూ స్పర్ధ వుండేదని వివరించి, శ్రీనాధుని కాలంలో మాత్రం యిద్దరూ సమానులుగా పరిగణించ పడ్డారని పేర్కొన్నారు. ఇది చారిత్రకంగా గమనింప దగిన విశేషం.ఈ రచన లోని 4,5 ప్రకరణాలు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినవి. ఈ ప్రకరణాలలో క్రీ.శ. 1339 నుండి 1630 వరకు గడచిన సాoఘిక చరిత్రను చక్కగా విశ్లేషించారు ప్రతాప రెడ్డిగారు.విజయనగర సామ్రాజ్యము 1336 లో స్థాపితమైనది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అది అత్యంత విస్తరించి,అన్ని రంగాలలోను గణనీయమైన అభివృద్ధిని సాధించి, స్వర్ణయుగంగా ప్రసిద్ధి నార్జించింది. “విజయనగర సామ్రాజ్య మందు ఆంధ్రులది పైచేయిగా నుండినది. ఆంధ్ర దేశము మహావైభవముతోను, ఐశ్వర్యముతోను నిండియుండెను. ఆంధ్రులుత్సాహవంతులై కళా పోషకులై దేశాంతరము లందును ప్రఖ్యాతి గాంచిరి. అది మంచి చెడ్డలతో నిండిన ప్రభంధ యుగము. సుందర నిర్మాణములు, చిత్రలేఖనములు, ఇతర శిల్పములు దేశమంతటను సువ్యక్తములయ్యెను. ధనికుల భోగలాలసత యిదే కాలమందు విజృంభించెను.”విజయనగర సామ్రాజ్య కాలం నాటి ఆంధ్రుల ప్రాబల్యం, పై వాక్యాల ద్వారా పేర్కొనుటయే కాకుండా, నాటి ప్రజా జీవనాన్ని అద్దం పట్టినట్లు చిత్రించారు రచయిత ప్రతాప రెడ్డిగారు, ఈరెండు ప్రకరణాలలో.ఆనాటి రాజుల వేష భూషలను గరించి ముచ్చటిస్తూ, నాటి రాజులు పన్నీటిలో కలిపిన కస్తూరిని పూసుకునే వారని, పొడగైన కుచ్చుల టోపీలను పెట్టుకొనే వారని, చెవులకు ముత్యాల పోగులు పెట్టుకొని, మెడలో ముత్యాల హారములు వేసుకొని, యెర్రని అంచులతో కూడిన తెల్లని వస్త్ర్రాలు ధరించే వారని, బంగారు పిడితో కూడిన కత్తిని చేపట్టే వారని వివరించారు. రాజులకు, రాజబంధువులకు వేటపై యెక్కువ ఆసక్తి వుండేదని, చిరుత పులులను జింకలను వేటాడెడు వారని వివరించారు.ఆటవికులు రాజదర్శనానికి వచ్చినప్పుడు, రిక్త హస్తాలతో కాకుండా, కానుకలుగా పక్షి పిల్లలు, దుప్పి కొమ్ములు, యేనుగు దంతములు, పులి గోర్లు, జింక చర్మం, తేనె, చారపప్పు మొదలగునవి యిచ్చుట అనే సదాచారం పాటించేవారని పేర్కొన్నారు సురవరంవారు.సాధారణ జన జీవనాన్ని గూర్చిన చర్చలో రెడ్లు సాధారణ జనులలో ముఖ్యు లనియు, వ్యవసాయమును తమ ప్రధాన కుల వృత్తిగా పాటించే వారని వివరించారు. ఆ కాలం లోని రెడ్లు తమ చేల వద్ద గుడిశలు వేసుకొని మంచెలు కట్టుకొని పిట్టల నుండి, దొంగల నుండి చేలకు కావలి గాసేవారలని, వారి స్త్రీలు ముసురు పట్టిన వర్షా కాలంలో అంబలి పాత్రను నెత్తిమీద పెట్టుకొని దానిపై జమ్ముతో అల్లిన గూడను వేసుకొని కావలిగావున్న తమ పురుషులకు యిచ్చెడివారట! రాయలవారు, చిన్న ప్రదేశములందు సహితము, చెరువులు, కుంటలు, కాలువలు త్రవ్వించి, రైతులకు తక్కువ పన్నులపై భూములిచ్చి,వ్యవసయదారులను ప్రోత్సహించిన విధాన్ని ప్రతాప రెడ్డిగారు చారిత్రక ఆధారలతో సహితం వర్ణించారు. విజయనగర రాజుల కాలంలో దేశీ, విదేశీ వ్యాపారము అత్యంత అభివృధ్ధి చెందెను. "విజయనగర సామ్రాజ్యము తూర్పున కటకము నుండి రామేశ్వరము వరకును, పడమట గోవానుండి కన్యాకుమారి వరకును వ్యాపించి యుండెను. అందువలన తూర్పున బర్మా, మలయా, ఇండోనేషియా, చైనా దేశములతో వ్యాపారము జరిగెనని వివరింప బడినది. పడమట గోవాలో, కాలికట్టు రేవులో ఎక్కువ వ్యాపారము జరిగెను. కాలికట్టు వంటి మంచి రేవులు సామ్రాజ్యమందు 300 వరకు వుండెను". వ్యాపార విశేషాలను వివరిస్తూ - "విజయనగర సామ్రాజ్యము నుండి బట్టలు, బియ్యము, ఇనుము, చక్కెర, సుగంధ ద్రవ్యాలు యెగుమతి యయ్యెను. తమిళ దేశపు రేవగు పులికాటు నుండి మలకా, పెగూ, సుమత్రా దేశాలకు రంగు అంచుల ముద్రలుకల [కలంకారి} వస్త్రములు నెగుమతి చేసిరి".ఆ కాలములో మిరియాలకు చాలా గిరాకి వుండెడిదనియు, మళయాళ దేశ మందు మిరియాలు సమృధ్ధిగా పండుట వలన వ్యాపారులు వాటి నక్కడి నుంచి తెప్పించి, తెలుగు దేశమంతట అమ్మినారని ప్రతాప రెడ్డిగారు అభిప్రాయ పడినారు. విజయనగర పరిపాలనా కాలంలో పరిశ్రమలను గూర్చి ముచ్చటిస్తూ - తెనుగు సీమ ప్రాచీనము నుండి వజ్రాల గనులకు ప్రసిధ్ధి చెందిన దని, "గుత్తి" కి 20 మైళ్ళ దూరములో నున్న "వజ్రకారూరు" వజ్రాలకు ప్రసిధ్ధి చెందిన దనియు, గుత్తి దుర్గా ధీశుడు అక్కడి వజ్రాలను చక్రవర్తులకు పంపెడివాడని, ఇటువంటి వజ్రపు గనులు రాయల సీమ ప్రాతంలో మరి నాల్గు వుండెడి వనియు, చారిత్రక ఆధారలతో నిరూపించారు శ్రీ ప్రతాప రెడ్డిగారు.రెడ్డి గారి దృష్టిలో విజయనగర కాలమునాటి ప్రజల వేష ధారణ ప్రత్యేకించి గమనింపదగిన విషయం. ముఖ్యముగా "పాలవేకరి కదరీ పతి" చూపించిన వేషాలను సురవరం వారు వర్ణించారు. వీనిలో ఎరుక పాలెగాడు, వేటవేషం, కోమటి శెట్టి వేషం, దాసరి సాని, కరణము, తురక జవాను, పురోహితుడు, ఎరుకలి, రాజు, భటుడు, బ్రాహ్మణ స్త్రీ , రెడ్డి స్త్రీ, మొదలైన పాత్రల వేష ధారణా విశేషాలను సవివరంగా చిత్రించారు. ఈ పాత్రలన్ని, విజయనగర కాలమునాటి సమాజ ప్రతిబింబాలని శ్రీ రెడ్డిగారి అభిప్రాయం. విజయనగర సామ్రాజ్య కాలములో పంచాయతి సభలు ప్రతి గ్రామమందు స్ధిరముగా నున్నట్లు తెలియు చున్నది. పంచాయితీ పధ్ధతి తమిళ దేశ మంతటా క్రీ.శ. 800 సంవత్సరము నుండియే ప్రసిధ్ధి చెందినది. కుల వివాదాలు, సంఘ సంస్కారపు కట్టుబాట్లు, నేరముల విచారణ, పన్నుల వసూళ్ళు గ్రామ ముఖ్యులే చేయు చుండిరట. అన్ని తీర్పులకు కూడా వారే భాద్యులు. ఆ పధ్ధతులే తెలుగు సీమలోను బలపడినట్లు తెలియు చున్నది. తెలుగు సీమలో పంచాయితీలకు యెన్నికలు మాత్రం జరిగిన నిదర్శనలు మాత్రం కనిపించవు. పంచాయితీ విధానము మాత్రము బాగానే అమలు జరిగినట్లు తెలియుచున్నది.క్రీ.శ. 1600 నుండి 1757 వరకు జరిగిన సాంఘిక చరిత్రను ఆరవ ప్రకరణంలో చర్చించారు సురవరం ప్రతాప రెడ్డి గారు.విజయనగర సామ్రాజ్య పతనము ఆంధ్రుల పతనానికి దారి తీసిందని రెడ్డి గారి అభిప్రాయము. క్రీ.శ. 1630 ముందే హిందువుల పతనం, ముసల్మానుల విజృంభణ జరిగినట్లు చారిత్రక ఆధారాలతో నిరూపితమైనది.తళ్ళికోట లేక రక్షస తగడి యుధ్ధం క్రీ.శ. 1565 లో జరిగింది. ఆయుధ్ధము తర్వాత ఆంధ్ర దేశములో రాజకీయ దౌర్బల్యం మొదలైంది. కొంత కాలం పెనుగొండలో ఆంధ్రరాజుల పాలన సాగింది. కాని, అక్కడి నుండి పీఠము చంద్రగిరికి మారగానే ఆంధ్రుల రాజకీయౌన్నత్యం పరిసమాప్తి అయిందనే చెప్పాలి. క్రీ.శ. 1600 వరకు ఆంధ్ర దేశము లో ఒక్క గోల్కొండ సుల్తానులు తప్ప తక్కిన తురక లెవ్వరునూ రాజ్యము చేయలేదు. అప్పటికి గోల్కొండ నవాబుల ఆధిక్యము తెలంగాణలో వున్నప్పటికి, ప్రక్కన విజయనగర చక్రవర్తుల ప్రభావ మున్నందు వలన నవాబులు ఆంధ్రులను దుష్టముగా పాలించిన వారు కారు. కాని, తళ్ళికోట అనంతరం తెలుగు దేశములో తురకల విజృంభణము యెక్కువయ్యెను. క్రీ.శ. 1600 తర్వాత 150 ఏండ్ల వరకు తురకల దాడు లెక్కువై కర్నూలు,కడప,గుంటూరు నవాబు లేర్పడి, ఉత్తర సర్కారులు వారి వశమై దుష్పరిపాలన వొకవైపు సాగుచుండగా, మరో ప్రక్క, పిండారీలు, దోపిడి గాండ్లు తురకల దండ్లు యెక్కువై జనుల హింసించి, చంపి, దోచి, చెరచి, గుడులను కూల ద్రోసి, నానా ఘోరాలు చేయగా ఆంధ్రులు భయ భీతులై వర్ణించజాలని బాధలకు లోనైరి. ఆనాటి ప్రజల దైన్యస్థితి, అప్పటి కావ్యాలలోను, ప్రభంధాలలోను, చాటువులలోను ప్రతి బింబితమైనది. ఈ ప్రకరణములో పేర్కొనిన సాంఘిక చరిత్రకు వేమన పద్యములు, వెంకటాధ్వరి విశ్వగుణ దర్శనము, గోగులపాటి కూర్మనాధుని - సింహాద్రి నారసింహ శతకము, భల్లా పేరకవి భద్రాద్రి శతకము మొదలగునవి ఆధార భూతములుగా పరిగణించ బడినవి. పైన పేర్కొన్న గ్రంధాలను నిశిత విమర్శకా దృష్టితో పరిశీలించి చారిత్రక విషయాల నిగ్గును తేల్చుట ప్రతాప రెడ్డి గారి వంటి పరిశోధకులకు తప్ప అన్యులకు అసాధ్యము. దక్షిణ దేశములో రఘునాధ రాయని కాలములో [1614-1633] ఆంధ్రుల గొప్పదనము నిలిచి యుండెనని తెలియు చున్నది. అతని కాలములో తెనుగు వారిపై మహమ్మదీయుల ఆక్రమణలు కాని, యుధ్ధాలు కాని సాగనేరక పోయెను.తెలుగు ప్రజల సంస్కృతీ సభ్యతలను పరిరక్షణ చేయుటయే కాక, వాని వికాసనికి రఘునాధ రాయల పాలన దోహదాన్నిచ్చింది.ఇతర ప్రాంతాలలో తెలుగు వారు తమ పూర్వులు నిర్మించిన శిల్పాలను కోలుపోయిరి కాని, తంజావూరులో పాతవి నిలుపుటయే కాక రఘునాధ రాయలు చక్కని శిల్ప సౌందర్యము కల దేవాలయాలను, రాజభవనాలను, కోటలను నిర్మింప జేసెను.రఘునాధ రాయల కాలంలో, సంగీత, సాహిత్య, నృత్యకళలు అభివృధ్ధి పొందెను. కాని అతని కుమారుని రాజ్య కాలంలో తంజావూరు స్వాతంత్ర్యం మట్టిలో కలసి పోయెను. క్రీ.శ. 1600 నుండి 1757 వరకు గల కాలములో ముసల్మానుల నీడలు తెలుగు వారిపై అధికముగా పారెను. 1700 తరువాత తెనుగు వారి పతనము పూర్తిదశకు చేరుకొనెను, అని ఆంధ్రదేశ సాంఘిక స్థితిని విశ్లేషించారు శ్రీప్రతాప రెడ్డి గారు.క్రీ.శ. 1757 నుండి 1857 వరకు జరిగిన సాంఘిక చరిత్రను సమీక్షించారు శ్రీప్రతాప రెడ్డిగారు ఈ ఏడవ ప్రకరణం లో. క్రీ.శ. 1197 లో మహ్మద్ ఖిల్జీ ప్రారంభించిన తురక రాజ్యం అనేక విజయ పరంపరల తో 550 సంవత్సరాల తరువాత 1757 లో ప్లాసీ యుధ్ధంతో పరాజయం పొందింది. ఇంగ్లీషువారు భారత రoగం మీద ప్రత్యక్ష మైనారు. ఈ కాలం లో ఆంధ్రుల ఆర్ధిక పరిస్ధితిని గూర్చి చర్చించారు రచయిత. ప్లాసీ యుధ్ధం తరువాత దేశం ఇంగ్లీషు వారి చేతుల లోనికి అతి వేగంగా పోయింది. 600 ఏండ్ల భీభత్స పాలనతో తురకలు భారత దేశమును పూర్తిగా గెలువ లేక పోయినారు. కాని 100 సంవత్సరముల లోనే యావద్భారత దేశాన్ని ఇంగ్లీషువారు గెలుచుకొనిరి. ఇంగ్లీషు వారికి ప్రజల సౌకర్య సమాలోచనం కించిత్తు కూడ లేకుండెను. వారిది ప్రత్యక్ష పరోక్షా పహరణమే. తమ దేశపు సరుకులను ఇచ్చట అమ్ముటకై మన దేశపు పరిశ్రమలు నాశనము చేశారు. వారి పాలనలో క్షామాలు యెక్కువగా నుండెను. ముస్ల్మానులు హిందువులను దోచిన దంతయు దేశమందే వుండి మరల క్రమముగా అది అంతయూ జనులకే చెందెను. కాని ఇంగ్లీషు వారు వ్యాపారం ద్వారా, పన్నుల ద్వారా, దోపిడీల ద్వారా గ్రహించిన దంతయు తిరిగి రాకుండా ఇంగ్లాండు చేరెను. ఇది మన ఆర్ధిక పతనానికి ముఖ్య కారణం.ఉత్తర సర్కారులను, రాయల సీమ అను కర్నూలు, కడప, బళ్ళారి, అనంత పురం జిల్లాలు, గుంటూరు జిల్లాయు, క్రీ.శ. 1800 లోపలనే ఇంగ్లీషువారి ఆధీనము లోనికి పోయెను. 1857 నాటికి తెలుగు దేశమంతా ఇంగ్లీషు వారి వశ మయ్యెను. ఉత్తర సర్కారు నాలుగు జిల్లాల లోని భూమి అంతా జమిందారుల పాలెగారు తెగకు చెందినది. ఈ జమిoదారులు మొగలు సుల్తానులకు కప్పము కట్టి, ఇంచుమించు రాజులై వ్యవహరించారు. ఈ పాత పధ్ధతిని మార్చి శాస్వత భూమి పన్ను పధ్ధతిని ప్రవేశ పెట్టారు.ఇంగ్లీషు ప్రభుత్వం దేశం లో ఆర్ధిక స్థితిని క్షీణ దశకు చేర్చింది. ఇంగ్లీషు ప్రభుత్వ ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థ పైననే కాక, దేశ జనుల ఆచారముల పై కూడ, యెక్కువైనది.1857 కు పూర్వముండిన ఇస్లాం మత వ్యాప్తి,తర్వాత ఆగిపోయెను. క్రైస్తవ మత వ్యాప్తి సంఘములు [మిషనరీలు] అనువైన స్థలములందు స్థాపిత మయ్యెను. నానా విధములైన సేవల ద్వారా మిషనరీలు జనులను క్రైస్తవ మతము లోనికి ఆకర్షించు చుండిరి. తమ మత గ్రంధమైన బైబిల్ ను భారతీయ భాష లన్నిటి లోనికి అనువదించి, ముద్రించి అందరికి వుచితముగా పంచి పెట్టిరి. విశేషముగా అంటరాని జాతుల వారు తమ తమ కులాలను విడచి క్రైస్తవ మతము లోనికి చేరి పోయిరి. కొన్ని జిల్లాలో రెడ్ల లాంటి యితర కులాల వారు కూడా క్రైస్తవ మతము లో చేరిరి. మిషనరీలు, ఫాదరీలు తమ మతము గొప్పదనాన్ని ప్రచారము చేసు కొనుటలో తృప్తి చెందక, హిందువుల ఆచారలను గురించి, ఆంధ విశ్వాసలను గూర్చి దుష్ప్ర్రచారము చేసి, హిందూ సంఘము లోని లోటు పాట్లు బయలు పరచి, జనులలో హిందూ మతముపై విశ్వాసమును, భక్తిని, ఆదరమునూ పోగొట్టు ప్రయత్నాలు విరివిగా సాగించిరి. ఈ పరిస్థితులలో ఆర్య సమాజం ఆధ్వర్యాన సనాతన హిందూ మత ప్రచారం, బ్రహ్మ సమాజం ద్వారా సంఘ సంస్కార ప్రయత్నాలు మొదలైనవి.రాజా రామమోహన్ రాయల బ్రహ్మ సమాజ శాఖలు కొన్ని కృష్ణా, గోదావరి జిల్లాలో స్థాపిత మాయెను. ఆర్య, బ్రహ్మ సమాజ భావములు జనులలో బాగా వ్యాపించెను. కందుకూరి వీరేశలింగం ఫంతులు కులముల తార తమ్యముల మీద, మూఢ విశ్వాసాల మీద, అవైదికమగు మూర్తి పూజల మీద దెబ్బ తీసెను. స్త్రీలపై జరుగు అత్యాచారములను, ముఖ్యముగా వితంతువుల పునర్వివాహము చేయక నిరోధించుటను ప్రతిఘటించి, వితంతు వివాహములను చేయించి, అనేక వితంతు శరణా లయాలను స్థాపించారు. ఆయన సంఘ సంస్కరణ ప్రయత్నాల మూలముగాను, ప్రచార పధ్ధతుల మూలముగాను, తెలుగు దేశములో అపూర్వ సంచలనము కలిగెను.అనేక దురాచారములు, స్త్రీ సహగమనం లాంటివి సమాప్త మయ్యెను. పారతంత్ర్య విముక్తికి ముఖ్య సాధనము సంఘ లోపముల సంస్కారమని, ప్రజలలో చైతన్యాన్ని మేల్కొల్పి, అనేక సంఘ సంస్కరణలకు మార్గ దర్శకు లైరి.

ఈ సందర్భము లోనే క్రీ.శ. 1885 అఖిల భారత జాతీయ మహా సభ [నేషనల్ కాంగ్రేసు] స్థాపిత మయ్యెను. కాంగ్రేసు అవతరణ జాతీయతకు పునాదిగా భావించ వచ్చును.ఇంగ్లీషు పరిపాలన ఆర్ధికముగా దేశానికి గొప్ప నష్టం కలుగ జేసింది. దేశములోని పరిశ్రమలు నసించాయి. కొత్త పరిశ్రమలను ఇంగ్లీషు వారు అణగ ద్రొక్కిరి! ఆకారణంగా, జనసామాన్యం వ్యవసాయముపై ఆధార పడవలసి వచ్చెను. తరచుగా క్షామములు వచ్చుట చే అపార జన నష్టము జరిగెను. 1876 - 78 సంవత్సరాలలో దక్కను లో మహా క్షామము సంభ వించెను. ఆ క్షామము [ధాత కరువు] దెబ్బ తెలుగు సీమపై విశేషముగా పడెను. ధాత కరువులో లక్షల కొలది జనం తెలుగు సీమలో మరణించిరి. ధాత కరువును గూర్చిన కథలు, పాటలు నేటికిని ప్రచారము లో వున్నవి.ఈ సమీక్షా కాలము [1857 నుండి 1907 వఱకు] లో సామాన్య జనుల ఆచార వ్యవహారాల ల్లోను, మత విశ్వాసల లోను అనేక మార్పులు చోటు చేసుకొన్నట్లుగా చిత్రించారు, ప్రతాప రెడ్డి గారు. ఇంగ్లీషు వారు తమ నూతన భావాలతో హిందువుల లోనే కాకుండా, ముస్లీముల లోను మార్పులు తెచ్చిరి. ఇంగ్లీషు విద్యా వంతుల లో కొందరు ఇంగ్లీషు వేషములను [సూటు, బూటు] ధరించుట గౌరవ సూచకంగా భావించ మొదలిడిరి. కాలముతో పాటు ప్రజలు ఆధునిక యుగము లోకి అడుగు పెట్టారు. టపా, రైలు, తంతీ సౌకర్యాలు వృధ్ధి కాజొచ్చెను. ముద్రణా యoత్రములు విడివిగా వాడి దిన, వార పత్రికల ప్రకటనా, ప్రచారము లెక్కువ గా జొచ్చెను.ఇంగ్లీషు వారి ప్రభావము తెలుగు భాషపై చాల పడెను. ఇంగ్లీషు చదివిన విద్వాంసులు కందుకూరి వీరేశ లింగంగారు, కొమర్రాజు లక్ష్మణ రావు, గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు, కట్టమంచి రామ లింగా రెడ్డి గారు, గిడుగు రామమూర్తి పంతులు గారు, ఆంధ్ర వాఙ్మయ పంధానే మార్చినారు. కట్టమంచి వారి కవిత్వ తత్త్వ విచారము సనాతనపు కోటలో గుండు ముట్టడి చేసి పెద్ద సంచలనము కలిగించెను. వీరేశ లింగం గారి ప్రతిభ సర్వతో ముఖాభి వృద్ధి జెంది, పలు రకాల సాహిత్య ప్రక్రియలకు నాందీ వచనము పల్కెను. కొమర్రాజు వారు, గాడిచర్ల వారు, రావిచెట్టు రంగా రావు గారు, [అంటే ఉత్తర సర్కారు, రాయల సీమ, తెలంగాణ ప్రతినిధులు] కలిసి 1907 వ సంవత్సరములో హైదరాబాదు లో "విఙ్ఞాన చంద్రికా" గ్రంధ మాలను స్థాపించారు. ఇది చారిత్రాత్మక సంఘటన. ఆ గ్రంధ మాల తొలి ప్రచురణ గాడిచర్ల వారి అబ్రహం లింకన్ చరిత్ర,, కొమర్రాజు వారి పీఠికతో ప్రచురితమైనది. భాషా వికాసానికి గద్య రచనల ఆవశ్యకతను గుర్తించిన పరవస్తు చిన్నయ సూరి, కందుకూరి వీరేశ లింగం గారు గద్య రచనలు వ్రాసి ప్రచురించిరి. ఆ కాలం లో అనేక వార, మాస పత్రికలు స్థాపితమై, వుపయోగము కొరకు వాఙ్మయం పుట్టించి, తెనుగు భాషను యొక నాగరిక భాషగా పెంపొందించుటకు వారు చేసిన కృషి అత్యంత ప్రశంస నీయం. ఆ ప్రయత్నములో యొక సహస్ర భాగ మైనా యిప్పుడు [ఈ కాలంలో] జరిగితే సంతోష కారణ మగును. చంద్రికా గ్రంధ మాల తెలుగు భాషా వాఙ్మయ వికాసమునకు చేసిన సేవ యెంతయో మెచ్చు కొన దగినది. 1900 ల తర్వాతి కాలం లో తెనుగు లో ఇంగ్లీషు, సంస్కృత పధ్ధతులపై నాటకాలు, నవలలు, వచన రచనలు, విమర్శలు, చరిత్రలు, జీవిత చరిత్రలు, ఖండ కావ్యాలు, విరివిగా ప్రచురించ బడసాగెను.బెంగాలు విభజన వ్యతిరేకతతో బెంగాలులో మొదలైన జాతీయోద్యమం గాలి తూర్పు తీర మందలి యుత్తర సర్కారు తెలుగు జిల్లాల పై వీచెను. దానితో మన పూర్వ సంస్కృతి గర్వింప దగినది కాదనిన అపోహ మారి భాషాభిమానం యుప్పొంగి, రక రకాల సాహిత్య, సంగీత, నాట్య కళల పునర్వికాసానికి మార్గ మైంది. 1857 విప్లవానంతరం తెలుగు సీమలో యెక్కువ పురోభి వృధ్ధి సర్కారు జిల్లాలో జరిగింది. అనేక కారణాల వలన, రాయల సీమ, తెలంగాణ ప్రాంతాలలో అభివృధ్ధి మందకొడిగా సాగింది. ఈ అసామనత అనేక కష్టాలకు దారి తీసింది. ప్రాంతీయత తెలుగు జాతి దౌర్బల్యానికి హేతువై, తెలుగు జాతి సమైక్యతకు గొడ్డలి పెట్టుగా పరిగణించింది."ఆంద్ర్హుల సాంఘిక చరిత్ర" అనే ఈ గ్రంధములో దాదాపు వెయ్యి సంవత్సరములు తెలుగు జాతి యేవిధముగా బ్రతికిందో కళ్ళకు కట్టినట్లు చిత్రించ బడినది. ఈ చరిత్ర ఒక జీవిత కాలపు పరిశోధనా ముక్తా ఫలము.కీర్తి శేషులు నార్ల వెంకటేశ్వర రావుగారు అన్నట్లు గా "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" ఆంధ్ర జాతి గత చరిత్రను తెలుసు కొనడానికి యుపక రించుటయే కాక, యేయే కారణాలు దాని అభ్యుదయానికి తోడ్పడినవో, మరి యేయే కారణాలు దాని పతనానికి దోహద మిచ్చినవో సందర్భాను సారంగా వివరిస్తున్న యీ మహా గ్రంధం, ఆంధ్రులకు భావి కర్తవ్య పధాన్ని నిర్దేశిస్తున్నది కూడ". ఆంధ్ర జాతి చరిత్రను ప్రతిభా పూర్వకముగా చిత్రించిన శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారు సంస్తవ నీయులు. తెలుగు వారంతా యీ పుస్తకాన్ని చదివి ఆనందించాలని కోరుకొంటూ - యావత్తెలుగు జాతి శ్రీ రెడ్డి గార్కి సదా ఋణ పడి వుంటుందని నమ్ముతూ వారికి కృతజ్ఞతలు తెలియజేసు కొంటున్నాను.ఈ వ్యాస రచనలో ఈ దిగువ పేర్కొనిన రచనలు వుపకరించినవి. ఆయా రచయితలకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను.1.] ప్రతాపరెడ్డి, సురవరం, 1896 - 1953.

ఆంధ్రుల సాంఘిక చరిత్ర., హైదరాబాదు, ఓరియంటల్ లాజ్మన్, 1996. xv, 364 పుటలు.

2.] శాస్త్రి. ద్వా. నా.

శత జయంతి సాహితీ మూర్తులు. హైదరాబాదు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 1997. 135 పుటలు.

3.] రమణ, కె. యస్.

సురవరం ప్రతాప రెడ్డి : సంక్షిప్త జీవిత పరిచయం. హైదరాబాదు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2009. 46 పుటలు.

4.] వల్లభ రాయుడు, వినుకొండ.

క్రీడాభి రామము. బి. వి. శింగరాచార్య సంపాదితం. హైదరాబాదు, ఎమెస్కో, 2009. 189 పుటలు.ఈ వ్యాసం కీ.శే. సురవరం ప్రతాప రెడ్డి గారి "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" ను గురించిన విశిష్టతా వివరణ మాత్రమే కాని, విమర్శ కాదు. చదువరుల దృష్టిని మంచి రచనల వైపు ఆకర్షించి, పఠనా సక్తిని పెంపొంద జేసే, సాహిత్య వ్యాసంగ ప్రసారణా ప్రయత్నం. ఈ ప్రయత్నం ఫలిస్తుందని రచయిత నమ్మకం.


ఈ వ్యాసం స్వీయ రచన. ఎవరి రచనకూ - అనువాదం కాని, కాపీ కాని కాదు.

ప్రొ.రావినూతల సత్యనారాయణ.

Vijayavilaasamu (విజయవిలాసము)

ప్రస్తావన:

కృష్ణదేవరాయల పరిపాలన తెలుగు సాహిత్య చరిత్రలో సువర్ణాక్షర లిఖిత మైనది. ఆ కాలంలో తెలుగు సాహిత్య సరస్వతి సర్వతో ముఖంగా అభివృద్ధి చెందినది. రాయల వారు భాషా సాహిత్య పోషకులేకాక, బహు భాషా కోవిదులై స్వయంగా "ఆముక్తమాల్యద" వంటి ప్రబంధాన్ని రచించి పేరుగాంచిన సాహిత్య సమరాంగణ చక్రవర్తి. ఒక చక్కని సాహిత్య సంప్రదాయ చైతన్యమును చరిత్రలో సృష్టించిన మహా మనీషి రాయలవారు! తెలుగు సాహిత్యం అనువాద పద్ధతిని అధిగమించి, స్వతంత్ర కావ్య రచన పద్ధతి మొదలెట్టినది రాయలవారి యుగం లోనే!

తర్వాత కాలంలో తంజావూరి నేలిన రఘునాథ నాయక రాజు, ఆంధ్ర భోజునివలె, తెలుగు సంస్కృత భాషల లోను, సంగీత భరత నాట్య శాస్త్రాల యందును అఖండ పాండితి నార్జించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వయంగా (పుష్టిగల) బహు కావ్య నిర్మాత. ఉద్దండ సంస్కృత పండితుడైన యజ్ఞనారాయణ దీక్షితునికి గురువు కాగలిగిన మహావిద్వాంసుడు.కృష్ణదేవరాయల వారి "భువన విజయము" వలే రఘునాథ నాయకునికి, "విజయభవన" మను ప్రసిద్ధ సభామందిర మున్నట్లు చరిత్రలో పేర్కొన బడినది. అందు బహు శాస్త్రవేత్తలు, కవులు, గాయకులు, నట్టువరాండ్రు మొదలైన పలువురు ప్రసిద్ధులు రఘునాథ నాయకుని కొలువు నలంకరించి ఉండెడివారని చరిత్ర చాటుచున్నది. అంతేకాక, రఘునాథనాయకుని సభాంగణానికి, దేశము నలువైపుల నుండి విద్వాంసులు వచ్చి పాల్గొంటూ ఉండేవారని, ఆవిద్వత్సభ లో మాట్లాడుటకు యెంతటి ప్రజ్ఞావంతులైనా వెనుకాడే వారని ప్రతీతి. "విద్వద్ కవీనాం విదధాసి హర్షం" అని రఘునాథనాయకుని గురువు, మంత్రి అయిన గోవింద దీక్షితుడు "సంగీతసుధ" లో ప్రశంసించి యున్నాడు. అంతటి సర్వతో ముఖ ప్రజ్ఞాశాలి అయిన రఘునాయక రాజు ఆస్థానానికి చెందిన వాడు చేమకూర వేంకటకవి.!తన జీవితాన్ని గూర్చి వేంకట కవి చెప్పినది చాలా తక్కువ. ఇతరులు అతనిని గురించి చెప్పిన మాటలను బట్టి, విజయవిలాస కావ్య ఆశ్వాసాంత గద్యాలను బట్టి మనం ఆయన జీవితాన్ని పునర్నిర్మించు కోవాలి. అది అత్యంత అవసరం. ఎందుకంటే కవిని గూర్చి బాగా తెలియక పోతే ఆయన రచనను సరిగా అవగాహన చేసుకొనలేము. అందుచేత కవిని గూర్చిన వివరాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.మనకు తెలియ వచ్చిన వివరాల ననుసరించి శ్రీయుతులు వేంకట కవిగారికి చిన్న వయసులోనే కవిత్వ మబ్బినట్లు పేర్కొన బడినది. దీనిని సూర్యనారాయణ వర ప్రసాదంగా చెప్పు కొంటారు. వేంకటకవి తెలుగు సాహిత్యం సుప్రసిద్ధ గురువుల పాదాల చెంత నేర్చు కొనినట్లు గాని, సంస్కృత భాషలో పాండిత్యము సంపాదించి నట్లు గాని దాఖలాలు పరిశోధకులకు లభ్యం కాలేదు. అయినప్పటికీ, రాజుగారు నిర్వహించే పండిత గోష్టులలో పాల్గొంటూ అచ్చట జరుగు సాహిత్య చర్చలను శ్రద్ధగా వింటూ, తనకు తెలియని విషయాలు అచ్చటి పెద్దల నడిగి తెలుసుకుంటూ ఉండేవాడని, అలా తెలియ జెప్పిన పెద్దలనే చేమకూర వేంకట కవిగారికి గురువులుగా భావించ వలసి ఉంటుందని అభిప్రాయాన్ని చాలామంది వ్యక్త పరచారు. విజయవిలాస కావ్య రచనకు ముందుగానే చేమకూర కవిగారికి కావ్య రచన చేయాలన్న కుతూహలం కలిగిందట. సారంగధర అనే కావ్య రచన ఆరంభించాడు. తీరిక కల్గినప్పు డల్లా ఆరచన లోని కొంత భాగం పండితులైన వారికి వినిపించి వారి విమర్శన తెలుసు కొనడమూ మొదలెట్టాడు. ఆవిషయం పండితులు మెల్లగా విద్వద్గోష్టిలో రఘునాథ నాయక రాజు గారి దృష్టికి తెచ్చారు. ఆవిధంగా చేమకూర వేంకట కవి కవనము లోని మంచిని రఘునాథరాజు గుర్తించ గలిగారు. గోష్టివారి మెప్పులవల్ల మరింత ఉత్సాహంతో సారంగధర రచన సాగించాడు. సాహిత్య విమర్శతోపాటు, ఆత్మ విమర్శ కలవాటు పడ్డ చేమకూరకవి తన సారంగధర కావ్యంలో అక్కడక్కడా రచన అపరిపక్వ స్థితిలో ఉన్నదనీ, కొన్ని కల్పనలు కుంటుతూ ఉన్నాయన్న సంగతి గుర్తించ గలిగాడు. అందుకే ఆ కావ్యంలో ఎన్ని అమోఘమైన విషయాలున్నా, ఎంతటి కవితా విశేషమున్నా, అది గౌరన కృతికి అనుకరణ కాబట్టి, స్వతంత్ర రచన అనిపించుకోదు. అందుకని "విజయవిలాస" రూపంలో మరో స్వతంత్ర కావ్య రచన కు సంకల్పించాడు. మరోవిషయం, తంజావూరు రాజ్యం రఘునాథనాయక రాజు పాలనలో విజయ పరం పరలతో విజృంభించి, పాడి పంటలతో సంవృద్ధిచెంది, శిరి సంపదలతో నిత్య కల్యాణం పచ్చ తోరణంగా ఉండేదిట! అటువంటి స్థితిలో ప్రజలను ఆకర్షించేది, ఆహ్లాద పరిచేది శృంగార రసమేకాని, మరొకటి కాదని వేంకటకవి నిశ్చయించు కొన్నాడు. తానుచేసిన సారస్వత కృషికీ, తనకున్న భావసంపదకూ శృంగార రసము చక్కగా అమరుతుందని ఊహించాడు. శృంగారమే ఏకైక రసంగావుండే కథ కావ్య రూపంలో వ్రాయాలనుకొని "విజయవిలాసము" ఎత్తుకున్నాడు. ఫలితంగా "విజయవిలాస" కావ్యం రూపొందింది. పలువురు పండితుల మన్ననల నందుకొన్న ఈప్రబంధము రఘునాథ నాయక రాజుపై తనకు (చేమకూరకవికి) ఉన్న గౌరవాతిశయానికి తగినట్టు తన కావ్యాన్ని తనకు తానై అంకిత మివ్వడానికి సిద్ధమయ్యాడు. ఉత్తమ కావ్య గుణాలతో విరాజిల్లు గ్రంథాలను ఎన్నోవ్రాసిన రఘునాయకరాజుకు కృతిని ఇవ్వడానికి యోగ్యమైన కావ్య రచన కోసం చేమకూర వేంకటకవి బహుధా తపస్సు చేశాడని చెప్పడం సమంజసంగా వుంటుంది. ఆతపః ఫల ఫలితంగానే "విజయవిలాసం" అనే కావ్యాన్ని సర్వాలంకార శోభితంగా తీర్చిదిద్ద గలిగాడు.విజయవిలాసము - కథావస్తువు.రసవత్తరమైన ఈ కావ్యం మూడు అశ్వాసాలలొ రచింప బడినది. ఈ కథకు మూలం మహాభారతం - ఆదిపర్వంలోని సుభద్రా వివాహం. భారత కథలో అవసర మైన కొన్ని చక్కని మార్పులు చేసి, ప్రత్యేక్ష చమత్కారముతో పరిపక్వమైన తన నైపుణ్యానంతా చొప్పించి స్వతంత్ర కావ్యంగా "విజయవిలాసాన్ని" రూపొందించారు రచయిత చేమకూర వేంకటకవి.ఈ కావ్యంలో నాయికలు ముగ్గురు! ముగ్గురూ మూడు రకముల వారు. ఉలూచి పాతాళ కన్య, చిత్రాంగద మర్త్య కన్య, సుభద్ర అవతార పురుషులైన బలరామ కృష్ణుల ముద్దుల చెల్లెలు కావున దేవకన్య. మరో విష మేమిటంటే నన్నయ భారతంలో వర్ణితమైన ఉలూచి తనను గూర్చి "ఏ నులూచి యను నాగకన్యక నైరావత కుల సంభవుండయిన కౌరవ్యుని కూతుర" ... అని చెప్పింది. కాని సంస్కృత భారతం భీష్మ పర్వంలో –"ఐరావతేన సాదత్తాహ్య నవత్యా మహాత్మ నా

పత్యాహతే సువర్ణేన కృపాణ దీన చేతసా

భార్యార్థం తాంచ జగ్రాహః కామవశానుగాం"అని, ఉలూచి వితంతువనీ, ఆమెను నాగరాజే అర్జునుడికి వివాహం చేసినట్లు వుందని కీ||శే|| కందుకూరి విరేశలింగం పంతులుగారు ప్రకటించారు. దీనిని గూర్చి తెలుసుకొన కోరే పాఠక మహాశయులు సంస్కృత మహాభారతములోని భీష్మ పర్వాన్ని నన్నయ్య భారతంతో సరిపోల్చి నిజానిజాలు తెలుసుకొన కోర్తాను. ఈ విషయమై విజ్ఞులు మన్నిస్తారని ఆశిస్తాను.

చేమకూర వేంకటకవి చాలావరకు మహాభారత కథనే అనుసరించినా, పాత్ర ప్రవేశ గోపనాల కోసం, కథా కథన సౌలభ్యం కోసం, నాటక పద్ధతి అనుసరించడానికి అక్కడక్కడా కొన్ని మార్పులు చేసుకొన్నట్లు మనకు విశద మవుతుంది.భారత కథనంలో గంగా నదీతీరంలో హోమం చేయడానికి వచ్చిన అర్జునుని చూడగానే ఉలూచి కామ పరవశయై ముందు వెనుకలు చూడక అతడ్ని మాయావిధిని నాగలోకానికి తీసుకొని పోయినట్లు తెలియ నగుచున్నది. కాని, వేంకట కవిగారు చిత్రించిన ఉలూచి అటువంటి తెగువ తనం కనబర్చలేదు. అర్జునుని పరాక్రమం విని, వలచి, అతడికి భార్య ననిపించుకొని, ఇలావంతుని వంటి వీర కుమారుడికి మాత అయి గృహిణిగా ఉండదగిన కాంత మాత్రమే! కాబట్టి మహాబలవంతుడు, రూపవంతుడైన అర్జునుని చూచిన వెంటనే కామ పరవశయై అతనిని తీసుకొని పోవుటకు సమ్మతించలేదు.

ఆ|| "హిమరసైక సైకతము నందు విహరించు

రైర వేషు వేషు ఘననిభాంగు

నెనరు దవుల దవులనే కాంచి క్రీడిగా

నెఱిగి యౌరా! యౌరగేందు వదన"ఉలూచి, పైపద్యాన్ని బట్టి దూరాన చూచి నంత మాత్రాననే, తన హృదయాన్ని ఆకర్షించ గలిగిన ఈతడే, అర్జునుడని నిశ్చయించుకొంది. ఈవిధమైన నిర్ణయానికి వచ్చుటయే కవిగారి మెప్పుకు గురియై "ఔరా"! అనే మెప్పుదల, పద ప్రయోగానికి దారితీసింది. అలా అర్జునుని గుర్తించ గలిగింది కనుకనే, మాయాన్వితయై దగ్గరకు పోయి అతని సౌందర్యాన్ని కన్నులారా గాంచింది! చూడగానే అర్జునుని నాగలోకానికి తీసుకొని పోలేదు! ఈవిషయంలో అత్యంత ఔచిత్యాన్ని పాటించాడు వేంకటకవి. ఈవిథంగా భారతము లోని కథా విధానంలో చేమకూరకవి ప్రవేశ పెట్టిన మార్పులు గంథంలోని శిల్ప చాతూర్యాన్ని నిరూపిస్తాయి! మరికొన్ని పద్యాలు (వి.వి. 1-24, 1-197) ఈవిషయాన్ని రూఢి పరుస్తాయి.మార్గదర్శకులు:"విజయవిలాస" కావ్య రచనలో చేమకూర వేంకటకవికి ప్రధానంగా ముగ్గురు పూర్వ కవులను కొంతమేరకు మార్గదర్శకులుగా పరిగణింప వచ్చును. వారిలో మొదటి వారు వసుచరిత్ర రచించిన రామరాజ భూషణుడు, రెండవ వారు పారిజాతాపహరణ కర్త ముక్కు తిమ్మనార్యుడు, మూడవ వారు ప్రభావతీ ప్రద్యుమ్న కర్త పింగళి సూరన. చేమకూర వేంకటకవి పై రామరాజ భూషణుని ముద్ర హెచ్చుపరిమాణంలో ప్రస్ఫుటిస్తుందని విజ్ఞుల అభిప్రాయం. అందుకే కాబోలు విజయవిలాస కావ్యాన్ని "పిల్ల వసుచరిత్రము" గా పేర్కొంటారు! విజయవిలాసము లోని బహు శ్లేషలను బట్టి ఆపేరు వచ్చిందని చాలామంది అభిప్రాయం.ఈ కావ్యంలో కవి సమయములు యెక్కువగానే పదర్శిత మౌతాయి! "ఇచ్చట సమయమన్న శబ్దము యొక్క అర్థం దానిది దానిదే"! శుక్లపక్షపు వెన్నెల; కృష్ణపక్షపు చీకటి. శుక్ల పక్షంలో రాత్రుల మొదళ్ళు వెన్నెల. కృష్ణ పక్షంలో రాత్రుల చివళ్ళు వెన్నెల! వెన్నెల సమానమే! కాని కృష్ణపక్ష మంతయు చీకటి యన్నట్లు, శుక్లపక్ష మంతయూ వెన్నెల యన్నట్లు వ్రాయుట ... నదులలో తామర పువ్వులున్నట్లు వర్ణించుట, నదులలో నవి యుండవు. ఇట్టివి కవి సమయములు" (విశ్వనాథ సత్యనారాయణ). విజయవిలాసములో కవి శ్లేషలు, యమకములుహెచ్చుగానే ఉపయోగించాడు. చేమకూర వేంకటకవి విజయవిలాసమున అనేక అద్భుతాలను ప్రదర్శించాడు. అయినప్పటికీ, ఆయన సమకాలికులు విజయవిలాస కావ్యాన్ని అంత మెచ్చుకొన్నట్లు లేదు! అందుకే "ఏగతి రచించిరేని సమకాలము వారలు మెచ్చరే గదా!? అని వ్రాసు కొన్నాడు!విజయవిలాస కథా సంగ్రహము:ఇదివరకు విజయవిలాస కావ్యాన్ని చదవని పాఠకుల సౌకర్యార్థం కావ్యంలో చర్చితమైన కథను సంగ్రహ రూపంలో ఇందుపొందు పరచడమైనది.ఇంద్రప్రస్థ పురమును ధర్మరాజు పరిపాలించుచుండెను. ఆయనకు భీమార్జున నకుల సహదేవు లనుజ జన్ములు. వారిలో అన్నల యెడను తమ్ముల పట్లను సముడై నృపకోటిలో వన్నెయు వాసియు గలిగి ధార్మికుడైన అర్జునుడు తనరారు (శోభించు) చుండెను. అలా ఉండగా ఒకనాడు యదువంశ భవుడైన గదుడు కృష్ణుడు పంపగా పాండవుల క్షేమసమాచారము తెలుసు కొనుటకై ఇంద్రప్రస్థానికి వస్తాడు. పాండవులు గదుడిని ఆదరంతో ఆహ్వానిస్తారు. ఔపచారిక సత్కారాల తరువాత, ద్వారక లోని విశేషాలడిగి, కృష్ణ బలరాముల కుశల వార్తలను తెలుసుకొని ఆనందిస్తారు.కొంత సమయము గడిచిన తరువాత గదుడు అర్జనుని ఏకాంతంగా కలుసుకొంటారు. ద్వారకలోని విశేషాలను వివరిస్తాడు. ఆసందర్భములో ద్వారక నగరిలోని కన్యలను గురించి ప్రస్తావించి, అర్జునుని ఎదుట సుభద్ర సౌందర్యమును వర్ణించి చెప్తాడు. అర్జునుడా వర్ణన విని పట్టరాని అనురక్తితో సుభద్రను త్వరలో చూడాలన్న కోరికను మనసులో పెంచుకుంటాడు! ద్వారకకు వెళ్ళడానికి సరైన అవకాశము ఎప్పుడు దొరుకుతుందా? అనే ఆలోచనలో ఉంటాడు. ఆసమయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆనగరములోని బ్రాహ్మణుని గోవును దొంగలు అపహరిస్తారు. ఆవిషయమై బ్రాహ్మణుడు అర్జనునికి మొరపెట్టు కొంటాడు. తన గోవును ఎలాగైనా తనకు తిరిగి లభింప చేయమని ప్రార్థిస్తాడు. అర్జునుడు విల్లంబులు తెచ్చుటకు ధర్మరాజు కేళీమందిరమునకు వెళ్తాడు. ఆకారణాన వారు పూర్వం చేసికొన్న నియమాన్ని ఉల్లంఘించిన వాడౌతాడు. ఆనియమము ననుసరించి అర్జునుడు ఒక యేడు భూప్రదక్షిణము చేసిరావలసి వచ్చెను. ఆవిషయము అర్జునుడు ధర్మరాజుకు తెలిపి భూప్రదక్షిణానికి అనుమతి కోరతాడు. ధర్మజునికి అర్జునుని ఎడబాటు ఇష్టం లేనందున గోప్రదక్షిణ ముర్వీప్రదక్షిణముతో సమానమే కావున గోప్రదక్షిణచేసి నియమపాలన చేయమని సలహా యిస్తాడు. అర్జునుడు దానికి సమ్మతించక తన్ను భూప్రదక్షిణకు పంపమని ప్రార్థిస్తాడు. అప్పుడు ధర్మరాజు తనపురోహితుడైన ధౌమ్యుని కుమారుడైన విశారదుని, మరికొందరు పరిజనులను యిచ్చి అర్జునుని పంపిస్తాడు. అర్జునుడు బయలుదేరి పుణ్యతీర్థములు సేవించుకొంటూ, పవిత్ర నదులలో స్నానమాచరిస్తూ, తన పరిజనులతో సహా గంగానదీ తీరాన్ని చేరుకొంటాడు. పవిత్ర గంగా నదిలో స్నానములు చేయుచు, అచ్చట దానధర్మము లొనరించుచూ, హరికథా శ్రవణ పరాయణుడై కాలము పుచ్చుచుండెను. భోగవతి నుండి యెప్పుడునూ భాగీరథి కడ కరుదెంచు ఉలూచి యను నాగకన్యక అర్జునుని చూచి, అతని సౌదర్యమును మెచ్చుకొని, అంతకు ముందే అర్జునుని వీరవిహారాలను గురించి తెలిసికొనినది గావున, అతనిని మోహిస్తుంది. పెండ్లి చేసికొన వలెనని కాంక్షిస్తుంది. మాయారూపంలో అచ్చటే రాత్రి సమయము వఱకు వేచియుండి, మాయా విధిని నాగలోకానికి తీసుకు వెళ్ళి తన నిజాంగణానికి చేరుస్తుంది. అర్జునుడు జపము పూర్తి చేసుకొని, కన్నులు తెరిచి చూస్తాడు. తనముందు నిల్చొని యున్న అందమైన ఉలూచిని చూచి ఆశ్ఛర్య చకితుడౌతాడు. "ఎవరివి నీవు? నీ పేరేమి? ఇక్కడ ఒంటరిగా నివసించుటకు కారణ మేమి?" అని అడుగుతాడు. ఉలూచి తన వృత్తాంతమంతయు అర్జునునికి తెలియచేస్తుంది. తను అర్జునుని ప్రేమించినదనియు, పెండ్లి చేసుకో దలచినదనియు, తెలియ జేస్తుంది. అందుకే మాయావిధిని నాగలోకానికి తీసుకు వచ్చినానని అర్జునునికి చెపుతుంది. దానికి జవాబుగా అర్జునుడు తాను వ్రత దీక్షలో నున్నాడనని, నియమాను సారం భూప్రదక్షిణ చేయుచున్న వాడనని, అలాంటి స్థితిలో తనను ఈ విధంగా కోరుట ధర్మం కాదని, ఆమె కోర్కెను తాను తీర్చజాలనని చెప్తాడు. అందుకు ప్రత్యుత్తర రూపంలో "సాటిలేని విలాస రేఖచే ముల్లోకములలోని కాంతలను అలయించుటయే నీవ్రతమా? నీవు భూప్రదక్షిణము చేయ వచ్చుటకు కారణము తెలుసు నని తన వ్యూహాన్ని వెల్లడిస్తుంది. అంతేకాక తాను మోహావేశంలో మదనుని బారి సహింప లేకున్నానని, తన యవ్వనమంతా అర్జునునికే ధారాగతం జేయ వేచియున్నానని తన కోర్కె తీర్చి మన్నించ వలసిందని ప్రార్థిస్తుంది. అప్పుడు అర్జునుడు "నీవు ఫణిజాతి కన్యవు, నేనేమో మనుష్య జాతివాడను మన కలయిక ఆమోద యోగ్యం కాదు" అంటాడు. అప్పుడు ఉలూచి కుసుండు కుముద్వతిని, పురుకుత్సుడు నర్మదను పెండ్లియాడిన యుదాంతము అర్జునునికి తెలిపి తనను పెండ్లియాడి ధన్యురాలిని చేయమని వేడుకొంటుంది. అటుతర్వాత అర్జునుడు "ఓ ఇంతీ! నా వ్రత చందమును తెలిపితిని అంతేకాని, నీచక్కదనానికి ముద్ధుడను కాక కాదు" అంటాడు. తదుపరి అర్జునుడు పర్యంకం (మంచం) మీదనే ఉలూచి కరగ్రహణ మొనరించి, ఆమెతో క్రీడించెను. అంతట ఉలూచి గర్భమును దాల్చి సుపుత్రుని కంటుంది. ఆకుమారునికి ఇలావంతుడని పేరుపెడతారు. తనరాకకై గంగా తటిని తనతో వచ్చిన తైర్థీకులు యెదురు చూచుచుందురు గావున తాను వెంటనే తిరిగి పోవలయునన్న కోరిక ఉలూచి కి తెలియ జేస్తాడు. ఉలూచియు దానికి సమ్మతించి అర్జునుని గంగా నది తీరమునకు చేర్చి, బరువైన హృదయముతో తిరుగు ముఖం పడుతుంది. తిరిగి నాగలోకం పోవుటకు మనసొప్పక తిరిగి, తిరిగి అర్జునుడున్న స్థలాన్నే చూస్తూ వెళ్ళి పోతుంది. హటాత్తుగా తిరిగి వచ్చిన అర్జునుని చూచి ఆప్త పురోహితాదు లందరూ సంతోషిస్తారు. అర్జునుడు విశారదునితో కథ నంతా చెప్తాడు.కొంత కాలం తరువాత అర్జునుడు తన పరివారము తో కలసి హిమవత్ పర్వతమును చూచుటకు వెళ్తాడు. హిమాలయాలనుండి, ఉత్తర దక్షిణ ప్రాంతాలలోని అనేక తీర్థ క్షేత్రములను దర్శించి, దానధర్మము లొనరించి, 13వ నెలలో పాండ్యరాజగు మలయ ధ్వజుడు పరిపాలించే మణిపురానికి వెల్తాడు. అచ్చట (మణిపురంలో) మలయధ్వజ మహారాజు కూతురు చిత్రాంగద తన చెలికత్తెలతో కూడి వన విహారానికి వస్తుండటము అర్జునుడు చూచాడు. ఆవనవిహారంలో చిత్రాంగద తన చెలికత్తెలతో రకరకాల ఆటపాటలతో చేయు కార్య కలాపాలు రాజకుమారికి త్వరలో కాబోయే వివాహాన్ని సూచిస్తాయి! వనవిహారము చేసి తిరిగి వెళ్తున్న చిత్రాంగదను చూచి అర్జునుడు ఆమె సౌందర్యాన్ని మనసులో మెచ్చుకుంటాడు. అది చూచి విశారదుడు తన ప్రభువు ఆంతర్యాన్ని గ్రహించి, చిత్రాంగదను గూర్చిన భోగట్టా అంతా చేసి చాలా విషయాలు సేకరిస్తాదు. చిత్రాంగద కన్య యనీ, మలయధ్వజ రాజోత్తముని గారాబు బిడ్డయనీ, స్వభావమూ, గుణాలు అన్నీ ఉదారమైనవని తెలుసుకొంటాడు. విశారదుడు తెలియజేసిన వివరములతో అర్జునుడి మనసులో కోరికలు కొనలు సాగాయి! ఆఉద్యాన వనంలో కొంత సమయం గడుప నిశ్చయించు కుంటాడు. ఇంతలో సాయం సమయ మౌతుంది. అర్జునుడు ఆవన మందలి మామిడి చెట్టు క్రింద కూర్చుని మదన తాప మనుభవిస్తాడు. మలయధ్వజ రాజుకు తాను ఆనగరానికి వచ్చిన విషయాన్ని తెలియ జేయమని విశారదుని పంపుతాడు. "మలయధ్వజ క్షితీశ కమల హితునకు మామ కాగమన వార్త తెలుపు" అంటాడు. ఇంతలో విశారదుడు మలయధ్వజ మహారాజు మంత్రికి అర్జునుని రాక తెలియ పరుస్తాడు. మలయధ్వజుడు యెదురు వచ్చి అర్జునుని నగరానికి లాంఛన ప్రాయంగా ఆహ్వానించి తీసుకు వెళ్ళుతాడు. అర్జునుని లాంటి వీరుడు తనకు అల్లుడైతే యెంతో బాగుంటుందని యోచించి, తగు సమయానికై ఎదురు చూస్తాడు. ఈలోపల అర్జునుడు వివాహ విషయమై రాజుగారి అభిప్రాయము తెలుసుకొన వలసిందిగా విశారదుని పంపుతాడు. విశారదుడు మలయధ్వజ మహారాజు కొలువై యున్న సమయాన రాజసభకు వెళ్ళి సత్కృతుడై, అర్జునుడు మలయధ్వజ మహారాజు తో వియ్యమొంద కోరుతున్నాడని సూచిస్తాడు. అప్పుడు మలయధ్వజ మహారాజు తన వంశ చరిత్రను తెలియజేసి, తన కూతురికి పుట్టిన కొడుకు తన వంశమునకు నాధునిగా చేసికొనుటకు అర్జునుని అంగీకారము కోర్తాడు. అర్జునుడు అందులకు సమ్మతిస్తాడు. అటుతర్వాత అర్జునునికి చిత్రాంగదకూ వివాహం మహావైభవంగా జరుగుతుంది. అర్జునుడు చిత్రాంగదతో క్రీడించుచూ కాలము గడుపుతాడు. కొంత కాలానికి చిత్రాంగద గర్భవతి అయి నెలలు నిండిన పిమ్మట పుత్ర రత్నాన్ని ప్రస విస్తుంది. తాతా తండ్రు లతనికి బభ్రూవాహను డని పేరు పెట్టిరి. అర్జును డాబాలుని మలయధ్వజరాజు (చిత్ర వాహనునకు) వంశంకరునిగా ఇచ్చి, వారి నుండి వీడ్కోలు తీసుకొని తీర్థ యాత్రాభి ముఖుడై వెళ్తాడు.ఆవిధంగా అర్జునుడు దక్షిణ పుణ్య భూమిలోని తీర్థాలను దర్శిస్తూ, సౌభద్ర తీర్థం చేరుకొంటాడు. ఆతీర్థములో స్నానము చేయ ప్రయత్నించు చుండగా అచ్చట నివసిస్తున్న మునులు అర్జునుని వారించి ఆపంచ తీర్థములలో దాదాపు నూరేండ్లనుండి యెవరూ స్నానము చేయుట లేదని, అలాచేస్తే అందులోని మొసలులు మనిషిని చంపి తినేస్తాయని తెలియ జేస్తారు. తీర్థము లాడ వచ్చి అలాచేయక తిరిగి పోవుట పిరికి తనమని అర్జునుడా తీర్థంలో స్నానం చేయపోగా వెంటనే ఒక మొసలి అతనిని పట్టుకొనెను. అర్జునుడు ఆమొసలిని ఎడమ చేతితో లాగి బయటకీడ్చి వేసెను. వెంటనే ఆమొసలి కోమలి యై అర్జునుని ముందు నిలబడెను. అలా మొసలిగా పడియుండుటకు కారణమేమిటని అర్జునుడు ఆమెను అడుగగా ఆమె తన పేరు నంద యని, తానోయచ్చ కన్యనని, తనస్నేహితులు లలిత, పద్మ, సౌరభేయి, సమీచి కలిసి త్రిలోక యాత్ర చేయుచూ ఒకానొక మునివర్యుని తపస్సునకు విఘ్నం కలిగించినందు వలన, ఆముని శాప మూలాన మొసలులుగా మారి నూరు సంవత్సరాలుగా శిక్షననుభవించు చున్న వారమని తమ వృత్తాంతమంతయూ తెలిపి తమ శాప విమోచనము ఆయన (అర్జునుని) ద్వారానే జరుగ వలసి యున్నదని తెలియ పరచి తన స్నేహితులకు విమోచన కల్పించమని వేడుకుంటుంది. అర్జనుడు జాలిపడి, అలాగే చేస్తాడు. ఆ అప్సరసలు అయిదుగురూ వారివారి నిజ రూపాలను పొంది అర్జునునికి కృతజ్ఞతలు తెలియజేసి, దీవించి, వీడ్కోలు తీసుకొంటారు.అర్జునుడు గోకర్ణేశ్వరుని గొల్చి, పశ్చిమసముద్ర తీరము నందలి పుణ్య స్థలములు దర్శిస్తూ, ప్రభాస తీర్థానికి చేరుకొంటాడు. అచ్చటకి ద్వారకా నగరం దగ్గఱలోనే యున్నదని తెలుసు కొంటాడు. సుభద్రను వివాహమాడే వాంఛతో యాదవులు యతులకు విధేయులని తెలిసికొని ఎవరునూ గుర్తించని విధంగా యతి వేషాన్ని ధరిస్తాడు. తనతో సుభద్ర వివాహానికి, బలరాముడు అనుకూలుడు కానప్పటికీ, అన్నిటికీ హరి (కృష్ణుడు) ఉన్నాడని ధైర్యంతో కృష్ణుని గూర్చి మనసులో ప్రార్థిస్తాడు. వెంటనే ప్రత్యక్షమైన కృష్ణుని పాదాలకు అర్జునుడు ప్రణమిల్లుతాడు. కృష్ణుడతని కౌగలించుకొని, రథముపై ద్వారకకు తీసుకునివచ్చి రైవతకారామ వాటిక యందు అతనిని ఉండమని చెప్పి తను ద్వారకకు తిరిగి వెళ్తాడు.కొద్ది రోజులైన తర్వాత కృష్ణుడు సభ నాహ్వానించి "రేపు రైవతకాచలోత్సవము" జరుప వలెనని మంత్రులతో చెప్పి తగు ఏర్పాట్లన్ని చేయమని చెప్తాడు. యాదవు లందరూ స్త్రీలతో కూడా రైవత కోత్సవమునకు తరలి వెళ్తారు. ప్రద్యుమ్నుడు, బలరాముడు, కృష్ణుడు తమ తమ స్త్రీలతో కలిసి వెళ్ళిన తర్వాత, సుభద్ర కూడా బంగారు పల్లకీలో అచ్చటకు వచ్చి అర్జునుని పతిగా తలుచుకొని దేవతలకు అర్చన చేయిస్తుంది. చెలికత్తెలతో వున్న సుభద్రను అర్జునుడు చూస్తాడు. ఆమె సౌందర్యాన్ని లోలోన మెచ్చుకొంటాడు! ఉత్సవము ముగియగానే అందరూ ద్వారకకు తిరిగి వెళ్తారు. బలరాముడు అర్జునుడి దగ్గరకు వెళ్ళి, యతి రూపంలో వున్న అర్జునుని నిజమైన యతీంద్రునిగా భావించి, ఆయన దర్శించిన తీర్థముల వివరాలను, విశేషాలను గూర్చి తెలుసు కుంటాడు. తర్వాత చతుర్మాస్యము ద్వారక యందు గడపమని యతీంద్రుని బలరాముడు కోరతాడు. అందుకు యతీంద్రుడు మనఃస్పూర్తిగా సమ్మతిస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన కృష్ణుడితో, బలరాముడు తాను యతీంద్రుని అచ్చటనే ఉండమని అభ్యర్థించిన విషయం కృష్ణునికి చెప్పి, వారిని (యతిని) ఉపవనమున ఉంచి, వారి సేవకు సుభద్రను నియమించమని చెప్తాడు. కన్యను సేవకు నియోగించుటకు కృష్ణుడు సంశయము వ్యక్తము చేయగా, బలరాముడు పూర్వము కన్యకలే యతీంద్రుల శుశ్రూషలు చేసెడి వారని, ఎలాంటి సంశయము లేకుండా సుభద్రను యతీంద్రుని సేవకై నియోగింపమని కృష్ణుని కోర్తాడు. కృష్ణుడు మాయాయతిని ద్వారకకు తోడ్కొని వచ్చి, సుభద్రను అతని సేవకు నియోగిస్తాడు. రుక్మిణీ సత్యభామలకు మాత్రం యతి రూపంలో వున్నవాడు అర్జునుడని నిజం తెలియ చేస్తాడు. కృష్ణుడు యతీంద్రుని నగరానికి దగ్గరలో నున్న కన్యాంతఃపుర కేళీవనమున నివసింపజేసి, సుభద్రను సపర్య లొనరించుటకు ఏర్పాటు చేస్తాడు. ఈవిధంగా కొంత కాలం గడుస్తుంది. ఒకనాడు సుభద్ర భోజనము తెచ్చి వడ్డింపగా భోజనము చేసి - అర్జునుడు ఆమెను జూచి, ఆమెకు అంతా మంచియే జరుగ నున్నదని, మంచి భర్త లభిస్తాడని, త్వరలోనే ఆమె వివాహం జరుగనున్నదని తెలియపరుస్తాడు! తాను చేసిన సేవలకు మెచ్చి యతీంద్రుడు అటుల చెప్పుచున్నాడని అనుకొని సుభద్ర ఆయన చూచిన తీర్థయాత్రల వివరాలు అడుగుతుంది. అంతట ఆమాయా యతీంద్రుడు తాను యెన్నో తీర్థాలను చూచినానని, ఆయాత్రలలో అర్జునుని కలిశానని, అర్జునుడు తాను అత్యంత సన్నిహితులమని, వారిద్దరి మధ్యా ఎటువంటి భేదమూ లేదని చెప్తాడు. ఒకానొక స్థితిలో తానే అర్జునుడనని తెలియ జేస్తాడు. తనకు ఆమెయందు గల ప్రేమా భిమానములను వ్యక్త పరచి, మోహావేశంలో తనకోరిక తీర్చమని చేయిపట్టు కొంటాడు. సుభద్ర అర్జునుని చేతిపట్టును విడిపించుకొని, పెద్దలు తమ మనసులు తెలుసుకొని త్వరలోనే పెండ్లి యేర్పాట్లు చేస్తారని చిలుక నుద్దేసించి తెలియ పరుస్తుంది. తాను ఆలశ్యమును సహింప జాలనని అర్జునుడు చెప్పుచుండగా చెలికత్తెలు వస్తున్నారని మిష పెట్టి సుభద్ర అంతఃపురానికి వెళ్ళిపోతుంది. ఈసంఘటన జరిగిన పిమ్మట సుభద్ర అర్జునుని పరిచర్యకు హాజరు కాలేక పోయింది. విరహ వేదనకు లోనవుతుంది. అర్జునుని పరిస్థితి కూడా అంతకన్నా హీనంగానే తయారవుతుంది. ఈవిషయాన్ని పసిగట్టిన సత్యభామా మొదలైన వదినలు ఆడపడుచు సుభద్రతో పరాచికా లాడుతారు. సుభద్రకు విరహ వేదన తగ్గుటకై అనేక శైత్యోపచర్యలు చెలికత్తెలతో చేయిస్తారు. ఈవిషయం మెల్లిగా దేవకీ వసుదేవులకు తెలుస్తుంది. కృష్ణుడు ఈవిషయం తెలిసికొని, బలరాముని తప్ప మిగిలిన బంధు వర్గమును పిలిపించి, వారికి అర్జునుడు యతిరూపంలో వచ్చుట, సుభద్ర అతనిపై మరులుగొనుట, దెలియ పరచి, ఈవివాహమునకు బలరాముడు వ్యతిరేకి యనియూ, అతడు సుభద్రను తన ప్రియ శిష్యుడైన దుర్యోధనుని కిచ్చి వివాహము చేయుటకై నిశ్ఛయించుకొని యున్నాడని చెప్తాడు . ఆకారణాన ఈవివాహం బలరామునికి తెలియకుండా జరుప వలెనని చెప్తాడు.బలరాముడు ఇరువది రోజులు పశుపతి పూజోత్సవాలలో నిమగ్నులై వుంటారని, ఆసమయములో మంచి ముహూర్తము ఉనందని వధూ వరులకు తెలియజెప్పి వివాహవిధులన్నీ జరిపించ వలయుననీ కృష్ణుడు వివరిస్తాడు. తాను మాత్రం వివాహ ముహూర్త వేళకు వస్తానని తెలియ జేస్తాడు.ద్వారకలో దేవకీ రుక్మిణులు పెండ్లి పెద్దలై కార్య క్రమాన్ని యథావిథిగా నిర్వహిస్తారు. అర్జునుడు తలచి నంతనే ఇంద్రుడు, మహర్షులు, శచీదేవి, అరుంధతి, అచ్చరలు తోడురాగా అచ్చటికి వస్తారు. పెండ్లి యథావిధిగా పూర్తి అవుతుంది. దేవకీ కృష్ణులు ఆ దేవతాదు లందరికీ పరం పరాగత వీడ్కోలిచ్చిన తర్వాత, వధూవరులను ఇంద్రప్రస్థానికి పంపే ఏర్పాట్లు చేస్తారు. సమస్త వివరాలనూ తెలియ జేస్తూ కృష్ణుడు ధర్మరాజుకు వుత్తరము వ్రాసి పంపుతాడు. తదుపరి అతడేమీ తెలియనట్లు బలరాముని వద్దకు చేరుకొంటాడు.దేవకి అత్తవారింటికి వెళ్ళే సుభద్రను ఓదార్చి, దీవించి పంపుతుంది. చెలులు కొంతమంది సుభద్ర వెంట వెళ్ళి అర్జునుడున్న రథంపైకి యెక్కిస్తారు. సుభద్రార్జునులు రథముపై ఇంద్రప్రస్థ పురమునకు వెళ్ళుచుండగా పృథుశ్రవుడు మొదలైన యదు వీరులు అర్జునునితో యుద్ధానికి వస్తారు. అర్జునుడు వారినందఱినీ అవలీలగా ఓడిస్తాడు. ఆసమయంలో సుభద్ర రథసారథ్యము చేస్తుంది. ఆమె సారథ్య కౌశల్యాన్ని అర్జునుడు మెచ్చుకుంటాడు. కృష్ణుడు సూచించిన మార్గమున ఇంద్రప్రస్థము చేరుకొంటారు. వారి రాక విషయం ముందుగానే తెలిసికొన్న ధర్మరాజు నకుల సహదేవులు అర్జున సుభద్రలను స్వాగత పూర్వకంగా ఆహ్వానించి నగరానికి తీసుకొని వస్తారు.ద్వారకలో ఈవిషయమంతా ప్రచారమౌతుంది. కోపోద్రిక్తుడైన బలరాముని కృష్ణుడు సమాధాన పరుస్తాడు. అత్యంత బల పరాక్రముడైన అర్జునుడు చెల్లెలు సుభద్రకు తగిన వరుడేనని అందఱూ సంతోషిస్తారు. బలరాముడు శాంతించి ఇంద్రప్రస్థానికి తమ్ములతోనూ, బంధువులతోనూ కలసి వెళ్ళుటకు సమ్మతిస్తాడు. ధర్మజుడు తమ్ములతో యెదురు వచ్చి బలరాముడూ మొదలగు వారిని గౌరవ లాంఛనాలతో ఇంద్రప్రస్థపురానికి తీసుకొని వెళ్తారు. వివాహ కార్యక్రమాలన్ని అత్యంత వైభవోపేతంగా సంపన్న మౌతాయి! కాలం సతోషంగా గడచి పోతుంది. సుభద్రకు అభిమన్యుడు జన్మిస్తాడు. పాండవు లందఱూ అభిమన్యుని అత్యంత గారాబంగా పెంచుతారు. అభిమన్యుడు క్రమంగా యవ్వనుడై తన తండ్రులవలన సమస్త విద్యలూ నేర్చుకొని విద్వజ్జన విధేయుడై పెరుగు చుండెను. ఈ విధంగా విజయవిలాస కథ సమాప్త మౌతుంది.ఈ కథను రసవత్తర కావ్యంగా రూపొందించుటలో అత్యంత నైపుణ్యాన్ని కనబరచాడు చేమకూర వేంకటకవి. కావ్యములోని, విలక్షణ కల్పనలు, కవిసమయములు, శ్లేషలు, యమకములు, అన్నీ కలిసి విజయవిలాసాన్ని వసుచరిత్ర లాంటి ఒక మహా కావ్యంగా రూపొందించాయి. ఇందులోని ప్రతి పద్యము చదివి ఆనందించ వల సిందని విజ్ఞుల అభిప్రాయము. కావ్యంలోని విశేషాలు అన్నిటినీ ఆస్వాదించాలంటే సామాన్య పాఠకునికి వ్యాఖ్యాన సహాయం ఎంతో ఉపకరిస్తుంది.వాఖ్యానాలు:వ్యాఖ్యాన ప్రక్రియ తెలుగు వారు సంస్కృత వాఙ్మయము నుండి గ్రహించి, పోషించు కొనిన పద్ధతి. అభినవ గుప్తుని అభినవ భారతి, మల్లినాథ సూరి కాళిదాస కావ్య వ్యాఖ్యానాలు విశ్వ విఖ్యాతి వహించాయి. వ్యాఖ్యాన రచన సామాన్యము కాదు. కావ్య మహాతాత్పర్యమునకు, ప్రతి పద్యమునూ అన్వయించి, పద ప్రత్యయాదుల యందలి వ్యంగమును వివరిస్తూ విశ్లేషించ వలయును. కావ్యమునకు వ్యాఖ్యానము సంజీవని లాంటిది. తెలుగులో ఒకటి కంటే ఎక్కువ వ్యాఖ్యానములు గల కావ్యములు చాలావున్నవి. శ్రీనాథుని నైషదము, వసు చరిత్ర ఉదాహరణలుగా భావింప వచ్చును. పెక్కు వ్యాఖ్యానములు వ్రాసి ఖ్యాతి గడించిన ప్రముఖు లున్నారు. వారిలో ముఖ్యులు మహామహోపాధ్యాయ వేదము వేంకటరాయ శాస్త్రి గారు. వారిని మల్లినాథ సూరితో పోలుస్తారు. వేదము వారు మేఘసందేశానికి వ్రాసిన వ్యాఖ్య పండిత లోకాన్ని ఎక్కువగా ఆకర్షించడమే కాకుండా, బహు ప్రశంశలకు లోనైంది.హృదయోల్లాస వ్యాఖ్య:బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, పండితులు, విమర్శకులు, నాటక కర్త, అభ్యుదయ రచయితల ఉద్యమ స్థాపకులు, జీవితాంతం నిర్విరామ సాహిత్య కృషి సాగించిన, ఆంధ్ర విశారద తాపీ ధర్మారావు (తాతాజీ) కొన్ని సంవత్సరాల పరిశోధనా ఫలితంగా, చేమకూర వేంకటకవి రచించిన విజయవిలాస కావ్యానికి - హృదయోల్లాస వ్యాఖ్యను ప్రచురించారు. ఎన్నో సంవత్సరాలనుండి పండిత లోకం ఉత్సుకతతో ఎదురు చూస్తున్న ఈగ్రంధం వెలుగులోకి వచ్చుట ముదావహం. తెలుగు ప్రబంధాలను చదివి ఆనందించే రసికులు, దీనిని ప్రశంసలతో ఆహ్వానించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ వారు ఈరచనను ఉత్తమ రచనగా ఎంపిక చేసి 1970వ సంవత్సరపు జాతీయ పురస్కారాన్ని అందజేసారు. హృదయోల్లాస వ్యాఖ్యలోని విశేషాలు ఈ వ్యాస రూపం లో పాఠక లోకం ముదుంచడ మైనది. విజయవిలాస కావ్యములోని చమత్కారాలు అర్థం చేసుకొని ఆనందించడంలో హృదయోల్లాసం ఇతోధికంగా ఉపకరిస్తుందనుటలో యెలాంటి సంశయమూ లేదు.మరో వ్యాఖ్యాన అవసరం:ఇదివరలో విజయవిలాస కావ్యాన్ని ఉద్దండులైన పండితులు పరిష్కరించి పాఠాంతరాలలోని లోపములను సంస్కరించారు. కొందఱు టీకా సహితంగా ప్రకటించారు. బులుసు వేంకట రమణయ్య వంటి పండితులు వ్యాఖ్యానాలు వ్రాశారు. మహా మహోపాధ్యాయ వేదము వేంకటరాయ శాస్త్రిగారు పూర్తి వ్యాఖ్యానాన్ని రచించారు. అయినప్పటికీ మరో వ్యాఖ్యను రచించుటలోని ఔచిత్యాన్ని గూర్చి తాపీధర్మారావుగారే స్వయంగా వ్యక్త పరచిన భావాలను వారి మాటలలోనే తెలిసి కొందాం."నాకు చిన్ననాట నుండి విజయవిలాసం మీద అభిమానం. అందులోని అనేక పద్యాలకు సరైన అర్థాలు తెలియకుండా ఉండేవి. ఆకాలంలో విజయవిలాసానికి వ్యాఖ్యానాలు యేవీ ప్రచారంలో లేవు. 1911వ సంవత్సరంలో వేదము వేంకటరాయ శాస్త్రిగారు విజయవిలాసానికి వ్యాఖ్య ప్రచురించారని విన్నాను. శ్రీశాస్త్రి గారి వ్యాఖ్యాన నైపుణ్యాన్ని వారి మేఘసందేశ వ్యాఖ్యానం ద్వారా చవిచూచాను. అందువలన ఈ చక్కని కావ్యానికి యోగ్యమైన వ్యాఖ్యానం లభించి ఉంటుందని సంతోషించాను. వేదం వేంకటరాయ శాస్త్రిగారి వ్యాఖ్యానం చూచే అవకాశం 1920 వరకు చిక్కలేదు. అప్పుడు ఆవ్యాఖ్యానాన్ని ఆమూలాగ్రంగా చదివాను... వేదంవారు అనేక పద్యాలకు సరైన వ్యాఖ్యానం యివ్వలేదని, యెన్నో అందాలను ప్రకటించ లేదనీ, కవి వ్రక్రమాది కావ్య గుణాలను, నియమాలను, పూర్తిగా వారు గుర్తించలేక పోయారని అభిప్రాయ పడ్డాను. ఈరసవత్తర కావ్యానానికి సరైన వ్యాఖ్యానం ఇంకా రాలేదని విచారించాను. మిత్రు లంతా నన్ను వేరొక వ్యాఖ్యానం వ్రాయమని ప్రోత్సహించారు. నేను చేసిన సాహిత్య పరిశ్రమ వ్యాఖ్యాన రచనకు చాలదని నాకు బాగా తెలుసు. కావ్యాలు చదవటమూ, అవకాశము దొరికి నప్పుడు ఆయాకావ్యాలను గురించి నాకు తోచిన విషయాలు మిత్రులకూ, అభిమానులకు తెలుపుతూ ఉండడమూ, నాకు అభిమాన విషయాలు. గ్రంథ రచనా కుతూహలం కూడా కొంత లేకపోలేదు! అయినా వ్యాఖ్యాన రచన అంత సులభం కాదుగదా?! అమరాలు - నిఘంటువులు, వ్యాకరణాలు, అలంకారాలు, రసములూ, ధ్వని, మొదలైన వాని లక్షణాలు తెలియాలి. ఆపాండిత్యము నాకులేని కారణాన, ఆప్రయత్నము మానుకుందా మనుకున్నాను. అయినప్పటికీ నాఅభిమాన కవిలో నేను చూడగలిగిన విశేషాలని, నేననుకున్న సొగసులూ, మిత్రులు హర్షించిన అందాలూ - ఇవ్వన్నీ ఏమికావాలి? ప్రయత్నించడమే మంచిదని పించింది. నాకు కావ్యంలో కనబడిన అందాలు, విశేషాలూ ఇలాంటివని లిఖిత రూపంలో ఉంచినట్ట వుతుందని రచనకుప క్రమించాను. బరంపురం నుండి చెన్నై వరకూ ముఖ్యమైన ఆంధ్ర నగరాల్లో పర్యటన జరిపాను. పండిత గోష్ఠులలో నావ్యాఖ్యాన విధాన్ని గూర్చి ఉపన్యసించాను. పెద్దలు అనేకులు శ్రీవేదము వేంకటరాయ శాస్త్రిగారి మీద ఉన్న అభిమాన గౌరవాలతో వారి వ్యాఖ్యానాన్ని సమర్థించ డానికి, నావ్యాఖ్యానాన్ని నిరాకరించడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ నాప్రయత్నం మానలేదు. వ్యాఖ్యానం చేయడానికే పూనుకున్నాను…నా పాండిత్య ప్రకర్ష కోసం గాని, ఇతర వ్యాఖ్యానాల్లో తప్పులు పట్టడానికి కాని నేను ఈ వ్యాఖ్యానానికి పూనుకోలేదు. విజయవిలాసములోని పద్యాలలో కొన్ని చోట్ల నిగూఢంగా నున్న అనేక రకాల చేమకూర చంత్కారాలను సవ్యం గాను, సమంజసముగాను, ప్రకటన చేసి కవియందలి గౌరవాన్ని ఇనుమడింప జేయడానికే నా ఈ ప్రయత్నం. మనకవి (చేమకూర వేంకటకవి) పోకడలను, అభ్యాసాలను సాధ్యమైనంత వరకు పరిశీలించు కొన్నాను. చేమకూరకవి తన వర్ణనలలో ఊహించిన విశేష భావాలను, హవణికలను (అలంకారాలను) నా వ్యాఖ్యానంలో వివరించి చూపడానికి ప్రయత్నించాను. కవి హృదయ పూరిత రచన ఉన్నవాడు కాబట్టే పాఠకుల శ్రద్ధకు పాత్రుడయ్యాడు. ఈ వ్యాఖ్యాన ఫలితంగా పాఠకులకు కవిమీద ఇతోధికమైన గౌరవం కలిగితే నేను ధన్యుణ్ణి".ఈ వ్యాఖ్యలో ధర్మారావు గారు విజయవిలాస కావ్యానికి సంబంధించిన అన్ని విషయాలు సంపూర్ణంగా చర్చించారు. కవి పరిచయంతో ప్రారంభించి సన్ని వేశాలు, పదాలు, చారిత్రక విషయాలు, పరిష్కరణము - పాఠ నిర్ణయము, దిద్దుబాట్లు, కథా వస్తువు, కావ్య గుణాలు, ప్రబంధ వర్ణనలు, కవి సాధన సంపత్తి, నాటకీయ రచన, వ్యాకరణ దోషాలు, సందేహాలు, అర్థంలేని అపవాదాలు, పండిత ప్రమాదము అను శీర్షికల క్రింద అనేక విషయాలు విశ్లేషణా పూర్వకంగా వివరించారు. ఒక్కో విషయాన్ని గూర్చి సూచన ప్రాయంగా చర్చించినా ఈ వ్యాసం పుస్తకంగా మారుతుంది! అందుచేత, హృదయోల్లాసంలో నిక్షిప్తమైన కొన్ని అపురూప మణులను (విహంగ) వీక్షిద్దాం!

తొలిపద్యం: శ్రీ లెల్లప్పుడొసంగ, నీ సకల ధాత్రీ చక్రమున్ బాహు పీ

ఠీ లగ్నంబుగ జేయ, దిగ్వి జయమిన్ డీకొన్న చందాన, నే

వేళన్ సీతయు లక్షణుండు దను సేవింపగ విల్ పూని, చె

ల్వౌలీలన్ దగు రామ మూర్తి రఘునాథా దీశ్వరుం బ్రోవుతన్."ఈ ప్రార్థనలో చేమకూర కవి దృష్టినున్న రాముడు "కోదండ రాముడు" సాధారణముగా ఈ స్వామి పటములోగాని, విగ్రహములో గాని, రాముడు మధ్యను, కుడి ఎడమల సీతా లక్ష్మణులు నిలిచి ఉంటారు. రాముడి ఎడమ చేతిలో నిలువుగా పట్టిన విల్లుంటుంది. వ్రేళ్ళు క్రిందికి చూపుతూ ఉన్న కుడి అరచేయి (వరద హస్తము) కనబడుతూ ఉంటుంది. సీత లక్ష్మీ అవతారము కాబట్టి, సంపదలనూ, లక్ష్మణుడు భూమిని మోసే ఆదిశేషువు అవతారము కాబట్టి భూచక్ర భరణమునూ, విల్లు విష్ణు పంచాయుధముల లోని శార్ ఙ్గ మనే ధనస్సు కాబట్టి దిగ్విజయమునూ రాముడు ఇస్తాడని భావము. చమత్కృతి ఏమంటే ఈ మూడు వరాలను అనుగ్రహించడానికి ఆ రాముడి వరద హస్తమే సూచన. ఈ వరద హస్తమున్న విషయము మాటలతో చెప్పకుండానే ధ్వని మర్యాదను కవి సూచించాడు. అంటారు తాపీవారు!ఇలాగే కృతిపతి వంశ ప్రసక్తి, రఘునాథ నాయకుని గుణగణాల వర్ణన లోను, కృతిసమర్పణము, షష్ఠ్యంతము లగు పద్యములలో ఒక్కొక్క దానిలో గల చమత్కృతిని విపులీకరించారు రచయిత ధర్మారావు గారు. సామాన్య ముగా చారిత్రక విషయాలు చెప్ప వలసి వచ్చినప్పుడు కవులు సాధారణంగా అతిశయోక్తుల తో వర్ణిస్తుంటారు. "నేపాళరాజును రఘునాథుడు సిం హాసనము మీద నెల కొల్పిన వాడని" ఎక్కడ నేపాళము? వేయిమైళ్ళ దక్షిణమున నున్న తంజావూరెక్కడ? ఆరాజు రాజ్య భ్రష్టు డయితే అతనికి సహాయం చేసే వారెవ్వరూ దగ్గరలో లేక పొయారా? ఇది కేవలం అసత్యమని అనుకొని ఆవిషయమై పరిశోధనలు జరిపి - అది అసత్యము కాదని, ఆ పద్యములో (వి.వి.1-62) పేర్కొనిన నేపాళము జాఫ్నాదీవి, ఆరాజు సంగ్లీ కుమార్. పోర్చుగీసులు జాఫ్నా దీవిని ముట్టడి చేసినప్పుడు, సంగ్లీకుమార్ రాజు అభ్యర్థన మీద రఘునాథుడు పోర్చుగీసు వారిపై విజయం సాధించి, సంగ్లీకుమార్ రాజును సింహాసనము మీద ప్రతిష్ఠించాడు! ఆంధ్రులకు గర్వ కారణమైన ఈ విషయ వివరణ 1927 భారతి పత్రికలో "నేపాళ చోలగ" అన్న శీర్షిక క్రింద ప్రకటిత మైనది. ఈ విషయమై వేదం వేంకటరాయ శాస్త్రిగారి వ్యాఖ్యలో పొరపాటు జరిగినదని వొప్పుకొని తర్వాత ఆవ్యాఖ్యను సవరించు కొన్నట్లు పేర్కొన బడినది. అలాగే, కథా ప్రారంభములోని పురవర్ణన పద్యానికి వేదము వారు చెప్పిన అర్థం పేలవంగా వున్నదన్న భావాన్ని తాతాజీ వ్యక్త పరచారు. ఆపద్యంతో పాటు దానికి వేదము వేంకటరాయ శాస్త్రిగారు ఇచ్చిన ప్రతి పదార్థమునకు, తాపీ వారి మెరుగులు పరిశీలించండి:

శా|| చంద్ర ప్రస్తర సౌధ ఖేలన పర శ్యామా కుచ ద్వంద్వ ని

స్తంద్ర ప్రత్య హలిప్త గంధ కలనా సంతోషిత ద్యోధునీ

సాంద్ర ప్రస్పుట హాట కాంబురుహ చంచ చ్చంచరీ కోత్కరం

బింద్ర ప్రస్థ పురంబు భాసిలు రమా హేలా కళావాస మై.దీనికి వేదం వారు "రమా=సిరి యొక్క హేలా=విలాసము యొక్క, కళా=విద్యకు, ఆవాసమై=ఉనికి పట్టై" అని అర్థము చెప్పారు. "ప్రతి పద్య చమత్కారము గల విజయవిలాస కావ్యములో మొదటి పద్యమున రమా హేల కళా వాసమై అనుదానిని రమా=సంపదకు, హేలా=విలాసమునకు, కళా=విద్యకు, ఆవాసమై=ఉనికి పట్టై (ఇంకా - రమా=లక్ష్మికిని, హేలా=పార్వతికిని, కళా=సరస్వతికిని, ఆవాసమై=ఉనికి పట్టై, అనగా త్రిమూర్తుల భార్యలకు,"చల్లని పుట్టినిండ్లు గల చానలకు" ఉనికి పట్టై) భాసిలున్=ఒప్పును.అని అర్థము చెప్పుకొని, తాత్పర్యము చదువు కొన్న యెడల చలువరాతి మేడల మీద ఆడుకొనే ఎల జవ్వనుల వక్షములందు పూసుకొనిన కస్తూరి లేపనముల పరిమళముల వల్ల సంతోషిస్తున్న ఆకాశాగంగ యందుండే బంగారు తామర పువ్వులలో తిరుగు తున్న తుమ్మెదలు కలిగి ఇంద్రప్రస్థ పురము సంపదకు, విలాసానికి, విద్యకు (లక్ష్మీ పార్వతి సరస్వతులకు) ఉనికి పట్టయి ఉన్నది, అని భావము తేట పడుతుంది. మరో చమత్కార మేమంటే, చలువరాతి మేడలు తెల్లనివి. ఆ మేడ మీద ఆడుకొనే శ్యామల కుచ ద్వందములు బంగారు వన్నె కలవి. కస్తూరి లేపనములు నల్లనివి. అటు ఆకాశ గంగ తెల్లనిది. అందలి తామరలు బంగారు వన్నెవి. వాటిలో విహరించే తుమ్మెదలు నల్లనివి. ఇచ్చట బింబ ప్రతి బింబ భావము చేమకూర కవి చక్కగా సూచించాడు! దేవతలకు కస్తూరి లేదని ఒక నమ్మకం మన కవులకుంది. కాబట్టి అక్కడ, ఆకాశగంగ లోని పద్మాలలో విహరిస్తుండే తుమ్మెదలకు ఈ "ప్రత్యహ లిప్త గంధ కలన" అపూర్వము, అపురూపంగా వుంటుంది. అందుకే అవి సంతోషించి తిరుగు తున్నాయి. ఇంతటి చమత్కారాన్ని నింపి అలంకార యుక్తముగా వివరించాడు చేమకూర వేంకటకవి. అందుకే కాబోలు రసికు లెవ్వరో "చామకూర మంచి పాకాన పడినది" అన్నాడట!ఉలూచి అర్జునుని పరాక్రమము గురించి విని తన హృదయాన్ని అతడికి అర్పిస్తుంది. ఇప్పుడు అతని అందచందాలు స్వయంగా చూచి వేగిర పడుతుంది. ఆసందర్భములో వ్రాసిన పద్యమునకు,ఉ|| కమ్మని జాళువా నొరయ గల్గిన చెక్కుల టెక్కువాడు, చొ

క్కమ్మగు జాతి కెంపు వెలగాగొను మోవి మెరుంగు వాడు, స

త్యమ్మగు రూపసంపద ధనాధిప సూనుని ధిక్కరించు వా

డమ్మక చెల్ల! నా హృదయ మమ్మక చెల్లదు వీని కియ్యడన్.కూడా మన పూర్వ వ్యాఖ్యాతలు (వేదము వేంకటరాయ శాస్త్రి మొదలగు వారు) తగినంత చక్కగా వివరణ ఇవ్వలేదని అభిప్రాయ పడినారు ధర్మారావు గారు. కమ్మని జాళువా నొరయ గల్గిన చెక్కుల టెక్కువాడు, అంటే వేదము వారు "చక్కని మేల్మి బంగారమును రాపాడ కల్గినట్టి చెక్కిళ్ళ అందము గల వాడు" అన్నారు. రాపాడ గల్గటములోని అర్థాన్ని బులుసు వారు "ఎదిరింప గలిగిన (సరి పోయినట్టి అనుట)" అని వివరించారు. అర్జునుడు నల్లని వాడని - ఘన నిభాంగుడని, మనము మరిచి పోకూడదు. జాళువాతో రాపాడ గలవాడంటే సరిపోదు కదా! ఇంకా హెచ్చు వివరణ కావాలి."ఒరయ" అన్నమాట స్వర్ణకారుల "ఒరగల్లు" ను జ్ఞప్తికి తెస్తుంది. ఈ ఒరగల్లు సన్నగా నిగనిగలాడుతూ ఉండే సన్నని రాతి పలక. బంగారాన్ని దీనిమీద గీటు పెట్టి స్వర్ణ పరీక్షకులు ఆబంగారము వన్నె నిర్ణయిస్తారు. దీనినే ధరా కట్టిచడం అంటారు. ఉలూచి తన హృదయమనే అమూల్యమయిన రత్నాభరణమును అమ్మ తలచుకుంది. రత్నాభరణము మొదట బంగారు పరీక్షకుడు వన్నె కట్టాలి. తరువాత రత్న పరీక్షకుడా రత్నముల వెల నిర్ణయించాలి. తరువాత ఇంత ఎక్కువ ఖరీదు ఇవ్వగల ధనికుడు కావాలి. అప్పుడు గాని ఆరత్నాభరణమును అమ్మటానికి వీలుండదు. ఈ మూడు గుణములు అర్జునుని యందు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కాబట్టి అక్కడే, అతనికే, అప్పుడే అమ్మక తప్పదు అని నిశ్చయించు కుంటుంది! ఇంతటి అర్థం ఇమిడ్చి నాడు కవి పై పద్యంలో. ఈ పూర్తి విశ్లేషణ వ్యాఖ్యాత వివరిస్తేనే కాని కవి యొక్క ప్రతిభ పాఠకులకు వెల్లడికాదు.అలాగే ఉలూచికి అర్జునునికి మధ్య జరిగిన సంభాషణ వ్యక్త పరచే ప్రతి పద్యం రసవత్తర మైనదే. సంభాషణ చివరి భాగంలో అర్జునుడు ఉలూచిని ప్రశ్నించే ఈ పద్యం పరిశీలించండి:తే|| అనిన ఫణి జాతివీ, నేను మనుజ జాతి,

నన్య జాతి బ్రవర్తించు టర్హ మగునె?

ఏల యీ కోర్కి? యనిన రాచూలి కనియె

జిలువ చెలువంపుల బల్కుల జిలువ చెలువ.ఉలూచికి, తనకు జరిగిన వాదనలో అర్జునుడామెతో ఉత్తమ వంశములోని రాజులు పర సతిని సంభోగించడానికి ఇష్ట పడరు. అది పాప కార్యముగా భావిస్తారని అంటాడు. దానికి ఆమె తను కన్యనని ఎవరి భార్యను కానని జవాబిస్తుంది. తన యవ్వన మంతా అర్జునుని కోసమే మీదు కట్టి ఉంచానని తెలియ జేస్తుంది. అప్పుడు, తను ఉలూచిని పరసతి అన్న మాటను చమత్కారంగా తప్పుకొనే యత్నంలో పైనుదహరించిన పద్యాన్ని తన జవాబుగా అంటాడు అర్జునుడు. మరో విషయం ఏమిటంటంతే ఉలూచి తన్ను వలచిన కాంత. ఆవేశము, తొందరపాటు ఆమెవంతు! అర్జునుడు తటస్థంగా ఉండగలడు! ఆమెను ఇటువంటి ప్రశ్నలతో ఆడించుట కూడా వినోదమే కదా! "చిలువ చెలువంపు బలుకుల జిలువ చలువ": ఇది చక్కని శబ్దాలంకార మున్న చరణము. ఇది వ్యాఖ్యాతలకు కొంత శ్రమకు కొంత కారణమైనది. వేదము వేంకటరాయ శాస్త్రి గారు పై చరణానికి చిలువలు పలువలుగల విలాసముతో కూడు కొన్న పల్కుల చేత అని వ్యాఖ్యానించారు. బులుసు వేంకట రమణయ్య గారు చిలువలు పలువలు, కలిగి చమత్కార మగు మాటలతో, అని వ్రాశారు. మరో వాఖ్యాత నోరి వారు గడుసు తనముతో "చిలువ చెలువ+నాగ కన్యక, చెలువపు పల్కులన్=అందమైన మాటల చేత అని మాత్రం చెప్పి ఒక "చిలువను" మ్రింగి వేశారు! అంతేకాని ఆచిలువలూ పలువలూ ఏమిటో, అవి ఉలీచి పలుకులలో ఎక్కడ కనిపించాయో, పైన పేర్కొనిన వ్యాఖ్యాతలలో యెవరూ, వివరించ లేదు! అన్ని పాఠముల (Texts) లోను ఒకే విధంగా ఉన్నప్పటికీ, చేమకూర వేంకటకవి అభిరుచులు పసికట్టిన వారికి దీనికి మరొక పాఠము ఉండి ఉండవచ్చు ననే ఆలోచన కలిగి ఉండ వలసింది. సరైన అర్థము విశ్లేషించు ప్రయత్నం చేయవలసింది. కాని అలా జరుగలేదు. తాపీ వారు మాత్రం విశేష కృషితో వారికి సమంజసమైన అర్థమును ఈ విధంగా సూచించారు. చిలువ=నాగుపాము (చాలా అందమైన ప్రాణి!) దానియొక్క పడగా, కదలిక, శరీరమూ యెంత చూచినప్పటికీ ఇంకా చూడాలని ఉంటుంది. కాని - భయం! దీనిని బట్టి ఆలోచిస్తే - చిలువ చెలువము అంటే, అందముగా వినడానికి ఇంపుగా ఉండి, భయము కలిగించే భావములు గల మాట లన్న మాట! అది ఎలాగో చూదము. దీని తర్వాత ఉలూచి చెప్పే రెండు పద్యాల లోను, ఆమె అభిలాష, సమర్థన, దీనత్వము అన్నీ అందం గానే ఉన్నాయని మనము అంగీకరించక తప్పదు.ఆ పద్యాలను పరికించండి:

ఉ|| "ఏమన బోయదం దగుల యెంచక నీ విటు లాడ? దొల్లి శ్రీ

శ్రీ రామ కుమారు డైన కుశ రాజు వరింపడె మా కుముద్వతిన్,

గోమల చారు మూర్తి పురుకుత్సుడు నర్మద బెండ్లి యాడడే?

నీ మనసొక్కటే కరగ నేరదు గాని నృపాల కాగ్రణీ."ఉ|| "ఈ కల హంస యాన నను నెక్కడి కెక్కడ నుండి తెచ్చె! నా

హా! కడుదూర మిప్పుడని యక్కున జేర్పక జంపు మాటలన్

వ్యాకుల పెట్టు టేల? విరహాంబుధి ముంపక పోదునన్; జలం

బే కద నీకు; మంచి; దిక నీతకు మిక్కిలి లోతు గల్గునే?""ఈ మందయాన ఇంత దూరము నన్ను తీసుకొని వచ్చిందే, ఆ శ్రమ కయినా ఆమె కోరిక నెర వేర్చాలే" అని తలచ కుండా, ఊరక కాలయాపన చేసి, నన్ను వేధించడమెందుకు? ఈ పరిస్థితిలో వియోగ సాగరం నన్ను ముంచక తప్పదు. నీకు కావలసిందంతా నీ పట్టుదలే కదా. సరే అలాగే కానీ, ఈతకు మిక్కిలి లోతూ, చావును మించిన చింతా ఉంటుందా?" అంటుంది.పద్యం లోని విశేషం: “విరహము వల్ల నాకు చావు తప్పదు. చావబోయే వ్యక్తికి ఎటువంటి దుఃఖం కల్గినా సరకు చేయడు" అని ఉలూచి తన తెగువను తెలియ జేస్తుంది! ఈ చమత్కార మంతా ఎవరు వ్యక్తం చేయాలి? వ్యాఖ్యాత కాదా? అని ప్రశ్నిస్తారు తాపీ వారు! అదే హృదయోల్లాస వ్యాఖ్య ప్రత్యేకత.హృదయా వేగముతో ఉలూచి పై మాటలు చెప్పుతున్నప్పుడు ఆమె ముఖంలో కనిపించిన దీనత్వమూ, కనులలోని కన్నీరూ, కంఠములో కనబరచిన లోస్వరమూ, ఈ మూడూ ఆమె దుఃఖా ధిక్యాన్ని ప్రక టించాయి. దానితో అర్జునుని మనసు కరిగింది. అప్పుడు ఈ క్రింది విధంగా ఉలూచితో అన్నాడు. "సుందరాంగి నా వ్రతం సంగతి నీకు తెలియ జేశాను; అంతే కాని, నీ చక్కదనం చూచిన తర్వాత నిన్ను ఆలింగనం చేసుకోకుండా ఒక్క క్షణమయినా ఉండ శక్యమా? అని అర్జునుడు తన అంగీకారము తెలియ జేయగానే ఉలూచి సిగ్గుతో తలవంచు కుంటుంది! ఇచ్చట చమత్కార మేమంటే తన్ను ఇంత దూరము తెచ్చి నందు కైనా కనికరించి అక్కున చేర్చ మని ప్రాధేయ పడింది ఉలూచి! "కాదు నీ చక్కదనానికే ఆలింగనము అంటాడు అర్జునుడు! సంకోచిస్తున్న ఉలూచి అభిప్రాయము గ్రహించి "నీకా సందేహము అక్కర లేదు. మన్మధుడే పెళ్ళి ముహూర్తము నిర్ణయించాడు, రా" అని ఆమెను చేయి పట్టుకొని మంచము దగ్గరకు తీసుకొని వేళ్ళాడు అర్జునుడు. ఆమాటలు విని గూడా సంకోచిస్తూ ఊరుకున్న ఉలూచి మనసులో "వివాహము కాలేదే, స్పర్శాది సుఖము ఏలాగ పొంద వచ్చును? అన్న అభిప్రాయము కలదని అర్జునుడు గ్రహించాడు. అందుకే "వివాహ ... రమ్మ". అని ఆహ్వానించాడు. ఈ వివాహము మీనాంకు డొనర్చినాడు అన్న మాటలలో ఔచిత్యం కన బడుతుంది. ఇందులో కవి ప్రయోగించిన అలంకారాన్ని శ్లిష్టరూపకము అని లాక్షణీకులు వ్యవహరిస్తారు. పద్యంలోని మరో చమత్కార మేమంటే అర్జునుడు తాంబూలము తాను ఉలూచి కివ్వడమూ, ఉలూచి తన కివ్వడమూ నిశ్చయ తాంబూలాలయి, వివాహం స్థిర పరిచాయన్న మాట! పెళ్ళి తంతు అంతా సక్రమంగా జరిగిందని కవి ధ్వని రూపంలో పాఠకునికి సూచిస్తాడు!ఈ ఘట్టములోనే మరో విశేషము ఉలూచి సద్యో గర్భము. సధ్యః గర్భము - అంటే అప్పటి కప్పుడే నిండు చూలాలగుట! అటువంటి గర్భము ఏర్పడటము ఆ ఇద్దరి సంయోగ మహిమో కాక జాతక యోగమో చెప్పలేనంటారు చేమకూరకవి! అది ఒక చంత్కార శ్లేషయే! ఆ విధంగా ఉలూచికి కొడుకు పుడతాడు. ప్రసవ సమయములోని గ్రహ స్థితి గతులను బట్టి ఆబాలుడు మంచి మాటకారి అవుతాడని నిర్ణయించి, ఆ అర్థం స్ఫురించే లాగా ఇలావంతుడు అని పేరు పెడతాడు అర్జునుడు. అర్జునునికి జ్యోతిష్యము కూడా తెలుసునని కవి సూచన.

ఇంకా నాగ లోకంలో ఆలశ్యము చేస్తే, అక్కడ భూలోకంలో తనతో వచ్చిన ఆశ్రితులంతా ఏమను కుంటారో; "నేను త్వరలో వెళ్ళాలి, నీవూ కుమారుడు తర్వాత రావచ్చును" అని ఉలూచిని ఓదార్చి ప్రార్థనా పూర్వకంగా చెప్పడం ఆజ్ఞా పూర్వకంగా చెప్పడం కంటే ఎక్కువ సమంజసమని కవి అభిప్రాయము. ఆ విధమైన అర్జునుని విన్నపాన్ని ఉలూచి ఆదరముతో మన్నించి అర్జునుని గంగా నదీ తీరానికి తీసుకొని వచ్చి, కంట నీరు గారుస్తూ, గాఢంగా కౌగిలించుకొని దిగులుతో కూడిన మనసుతో వీడు కోలిచ్చి వదల లేక వెళ్ళి పోతుంది. వారు విడి పోవుట సంజను జోడు విడిచి ఎటోపో యే జక్కన పెట్టతో సరి పోల్చడం చాలా మనోహరము. ఇది కూడా కవి లోని భావనా శబలతకు మంచి ఉదాహరణ!తిరిగి వచ్చిన అర్జునుడు తన సఖుడైన విశారదునితో తను నాగ లోకంలో ఉలూచితో అనుభవించిన రస క్రీడలన్నీ వివరంగా వర్ణించి చెప్తాడు! ఆ సందర్భములో కవి రచించిన పద్యాలన్నీ కూడా రస గుళీకలే! తప్పక చదవ వలసినవే!అటు తర్వాత అర్జునుడు తనతో వచ్చిన యాత్రికులతో కలిసి హిమాలయము దగ్గరికి పోయి అందుగల వివిధ శిఖరాలు తిలకించి అనేక చిత్ర విచిత్రములైన విశేషాలను తెలుసుకొని సంతోషిస్తాడు. హిమాలయ మహత్మ్యము దర్శించిన తర్వాత, అక్కడి అగస్త్య వట వృక్షమును, మణి శృంగమును చూచి, హిరణ్య బిందు తీర్థములో స్నానము చేసి, నైమిశా రణ్యములోని బదరీ నారాయణుని సేవించి, గంగా యమునా సరస్వతీ నదుల సంగమ స్థానమైన ప్రయాగలో విష్ణుని పూజించి, పంచ క్రోశమున అన్నపూర్ణ విశాలాక్షీయుతుడైన కాశీనాథుని ప్రార్థించి, గయలో చేయ వలసిన పనులు సక్రమంగా నిర్వర్తించి, పూరీ జగన్నాథుని దర్శించి, గోదావరిలో స్నాన మాచరించి, ద్రాక్షారామ భీమేశ్వరుని ఆరాధించి, కృష్ణానదీ మొదలైన తీర్థాలను చూచుకొంటూ, శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబలకు ప్రణమిల్లి, అహోబల నారసింహుని కొలిచి, తిరుపతి వేంకటేశ్వరుని పూజించి, శ్రీకాళహస్తి లింగాన్ని ఆరాధించి, కాంచీ నగరమున వరద రాజ స్వామిని కొలిచి, శ్రీ రంగనాథ స్వామిని ప్రార్థించి, కుంభకోణం మొదలగు పుణ్య క్షేత్రాలు చూచుకొని రామేశ్వరమునకు పోయి, ధనుస్కోటిలో స్నాన దానాదులు చేసి, రామాయణము పారాయణ జేసి, మలయ ధ్వజరాజు నగర మైన మణిపురమును సమీపిస్తాడు. మణిపురం ఇప్పటి పేరు మణలూరు. మణికర్ణిక కాశీలోని ఒక కోనేరు. దానిని విష్ణుమూర్తి చక్రముతో త్రవ్వాడని పేర్కొంటారు. దానిని చూదటానికి శివుడు వచ్చి చూస్తుండగా అతని చెవిని ఉన్న మణిఖచితమైన ఆభరణము ఆ కోనేరులో పడి పోయిందిట! అందుచేత ఆకోనేరుకు "మణికర్ణిక" అన్నపేరు కలిగింది. ఆకోనేరును గంగానదితో సమానమైన మహిమ గలదిగా పేర్కొంటారు పెద్దలు. అందువలన అర్జునుడు అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక అపూర్వ దృశ్యాన్ని చూస్తాడు. ఆసమయంలో మణిపురాధీశ్వరుడి కూతురు చిత్రాంగద తన చెలి కత్తెలతో కలిసి వన విహారము చేసి వస్తూ ఉండడము అర్జునుడు చూచాడు. ఆవన విహారములో వారు స్నానము చేసి, కోకిల పాటలు ఆలకించి, దోసిళ్ళతో పువ్వులు ఒకరికొకరు ఇచ్చుకుంటూ,అందరూ కలిసి పూతేనెలు త్రాగి నగరికి తిరిగి వెళ్తున్నారు. ఈ కార్యక్రమమంతా ఆరాజకుమారికకు త్వరలో కాబోయే వివాహాన్ని సూచిస్తున్నది. పెళ్ళిలో మంగళ స్నానము చేసి, దవళాలు - పెండ్లి పాటలూ వింటూ తలంబ్రాలు దోసిళ్ళతో పోస్తూ, బువ్వం బంతి భోజనాలు చేస్తునట్టుందని కవి ఉత్ప్రేక్ష! విశేష మేమిటంటే పైన పేర్కొన్న వర్ణనతో చెప్పిన పద్యంలో "పాండ్య రాజ సుత ... పాండు రాజ సుతుడు" అనే శబ్దములతోనే బంధుత్వము తెల్పడము. కాబోయే పెళ్ళిని వర్ణనతో సూచించి కవి ఈనామ సంబంధాన్ని చెప్పడం ఉద్దేశ పూర్వకమేనని పాఠకులు గ్రహించాలి. పద్యంలో ఉత్ప్రేక్షా లంకారాన్ని ఉపయోగించాడు. కవి చేమకూర వెంకన్న! వన విహారము చేసి తిరిగి పోతున్న రాజకుమారి చిత్రాంగద అందాన్ని మనసులోనే మెచ్చు కొంటాడు రసికరాజ శిఖామణి అర్జునుడు!క|| కన్నె నగుమోము తోడం

బున్నమ చందురుని సాటి బోలువ వచ్చున్

నెన్నుదురు తోడ మార్కొని

మున్నందఱు జూడ రేక మోవక యున్నన్."పైన పేర్కొనిన పద్యం చిన్నదైనా, పండితులనూ, పరిష్కర్తలనూ, వ్యాఖ్యాతలనూ మూడు వందల సంవత్సరాలకు పైగా చిక్కుల పాలు చేసింది! వ్యాఖ్యాతలందఱూ, వేదము వేంకట రాయశాస్త్రిగారితో సహా అసంతృప్తి కరమైన అర్థాలు చెప్పి సరి పెట్టు కున్నారు (తాపీ ధర్మారావు). ఈ పద్యంలో "రేక మోవక (మోయక) యున్నన్" అన్న మాటలే ఈచిక్కంతటికీ కారణము అంటారు తాపీ వారు. ఆమాటలకు సరైన అర్థం తెలియ నందున కవి హృదయంలో ఉన్న అమోఘమైన భావమంతా వ్యక్తపడలేదు. పద్యంలో ఒక పోరాటము, పోటి ఉందని తాపీవారి అభిప్రాయము. "కొన్నాళ్ళకు పూర్వం ఆపోటీలో చంద్రుడు చిత్రాంగద నుదురును బహిరంగంగా ఎదిరించి రేక మోవడం అనే అపజయాన్ని - అవమానాన్ని పొందాడు. అందుచేత ఆమె నవ్వు ముఖంతో పోల్చడానికి పున్నమ చంద్రునికి అర్హత లేకుండా పోయిందని తాత్పర్యము". వేదమువారు "అందరు జూడన్=ఎల్లవారి ఎదుట (అనగా బట్ట బయలైన అవమానమునకు పాలై). రేక మోవక యున్నన్=జాబు మోయు పనిని (తపాలా నౌకరీని) చేయకున్న యెడల" అని వ్యాఖ్యానించారు. తాపీవారి దృష్టిలో పోటిలో గాని పోరులోగాని అపజయాన్ని - అవమానాన్ని - తపాలా నౌకరి సూచిస్తుందని నమ్ముట కష్టం. వారి పరిశీలన ప్రకారం "రేక మోవక" ఉండడములోని విశేషార్థాన్ని స్పష్టంగా తెలియ జేస్తూ చేమకూరకవి విజయవిలాస కావ్యంలోనే వివరించాడు. దానికి నిదర్శనగా మూడవ అశ్వాసములో అర్జునుడు సుభద్రను తీసుకపోతు ఉండగా బలరాముడి సైన్యాలు అతడిని ఆపడానికి ప్రయత్నించాయి. యుద్ధం జరిగింది. ఆయుద్ధ సమయాన సుభద్ర అర్జునుడికి సారథ్యం చేసింది. సుభద్ర సారథ్యాన్ని మెచ్చుకుంటూ కౌగిలించు కొంటాడు. అప్పుడు చమట వలన సుభద్ర వక్షస్థలమున పూసుకొని ఉన్న కుంకుమ రేఖలు అర్జునుడి గుండె నంటుకొని కత్తి గంటులు - నరుకులు - వలె కన బడ్డాయి. అదిచూచి అర్జునుడు నవ్వుతూ -

"ఒక్కించుక రేక మోవని నాయురః స్థలంబున

నీకుచ కుంకుమ రేఖ లంటించి మీవారికి సూడు దీర్చితివి . . ."అని నెయ్యమూ వియ్యమూ ప్రకటించాడు... సూడ=పగ దీనిని బట్టి రేక అంటే ఇక్కడ ఆయుధము వలన కలిగిన గంటు - గాయము - అని తేట పడుతుంది కదా!? ఈ పరిశీల నాంతరము మనం విశ్లేషిస్తున్న పద్యానికి అర్థం ఈ క్రింది విధంగా చెప్పుకొన వచ్చును.:మున్ను విదియనాడు చంద్రుడు ఈ కన్య ముఖములో ఒక భాగము మాత్రమైన నుదురును ఎదిరించి "రేక మోశాడు" - రేక (చంద్రరేఖ) ఆకారాన్ని పొంది ఓడిపోయాడు; ఈ రెండో అర్థాన్ని బట్టి - కత్తి వ్రేటు - గాయము - గంటు తిన్నాడు. అదే అపజయమూ అవమానమూను. ఆ విదియ నాడు అందరూ చంద్ర రేఖను చూడడమూ, చంద్రునికొక నూలు పోగు విసరడమూ మనలో వుంది. కాబట్టి కత్తి గంటు తిన్న అవమానము బహిరంగంగా జరిగింది. ఇప్పుడు, పూర్ణిమ నాడు పోటీ కన్య నవ్వు మొగ మంతటితోను, పైన చెప్పిన అవమాన కారణంగా ఈచంద్రుని పోటీకి రానీయరు. అంతేకాదు, ఆనాటి "రేకమోసిన" గంటు - గాయం - మాని, మచ్చ గట్టి చంద్రుడిలో కళంకముగా కనిపిస్తుంది. కాబట్టి, నిష్కళంకమైన నవ్వు మొఖముతో సరి పోల్చడానికి వీలు లేదని ధ్వని. ఇంతటి అర్థం ఇమిడి ఉన్నది మన పరిశీలనలోని చిన్న పద్యం విశ్లేషణలో!అలాగే చిత్రాంగద సౌందర్యముతో భావుకుడయిన అర్జునుడు విశారదునితో చెప్పిన పద్యాన్ని గమనించండి:మ||"తనకు గౌగిలి ఈ వొకప్పుడును, నాథా నీకర స్పర్శనం

బున గిల్గింతలే యంచు బద్మిని కరాం భోజంబునన్ మందమం

దనట ద్వాయు చల ద్దళాంగుళులు గ న్పట్టంగ నవ్వెల్గు రా

యని రారా! యని పిల్చినా దగె ద్విరే ఫా త్యంత దీర్ఘ ధ్వనుల్"అనేకమంది విజ్ఞులు, మహాకవులు (విశ్వనాథ సత్యనారాయణ) ఈ పద్యాన్ని మహాగొప్ప పద్యంగా (రచనగా) భావిస్తారు. అర్జునుడు దూరం నుంచే చిత్రాంగదను చూచాడు కాని ఆలింగనాది కార్యాలకు నోచ లేదు! ఆస్థితి లోనే సూర్యుడు గూడా ఉన్నాడు. నాయిక - పద్మినీ కాంత - ఈ దూరపు గిల్గింతలు చాలు, కౌగిలి సుఖము ఇవ్వడానికి రారమ్మని పిలుస్తునట్టు అర్జునునికి కనబడడము చాలా సహజమూను, తాను సూర్య స్థానం లోనూ, చిత్రాంగద పద్మిని స్థానం లోను ఉన్నట్లు ఊహించు కున్నాడు!పద్యం లోని విశేషము: తుమ్మెద ధ్వనులు "రారా" అని పిలిచినట్టు ఉన్నవనడంలో గొప్ప విశేషముంది. తుమ్మెదలకు ద్విరేఫములన్న పేరు ఉంది. రేఫమూ అంటే "ర్" అనే ఆకారము. ద్విరేఫములు అంటే రెండు "రకారా" లన్నమాట. ఆ రకారము మీద అ రకారము ఉంచితే ర్+ఆ=ర అవుతుంది. దానికి అత్యంత దీర్ఘ మిస్తే రా... అవుతుంది. అలాంటివి ద్విరేఫములలో రెండు ఉన్నాయి. కాబట్టి "రారా" అన్న పిలుపు ఏర్పడుతుంది. అత్యంత దీర్ఘం అంటే పిలిచి నప్పుడు మనము ఉపయోగించే మూడు మాత్రల దీర్ఘ మన్నమాట. పైన పేర్కొనిన పద్యములో పద్మిని నాయిక, అంభోజము (తామర పువ్వు) చేయి, గాలిలో కొంచెముగా కదులు తున్న తామర రేకులు చేతి వేళ్లు, తుమ్మెదల ధ్వనులు పిలుపు అని గ్రహించాలి. ఈపద్యంలో కవి ఉత్ప్రేక్ష, శ్లేష, మొదలైన అలంకారాలను ప్రయోగించాడు.అర్జునుడు చిత్రాంగదను చూచిన రోజు రాత్రి ఆమె తలపులతో గడిపాడు. ఆమె అందచందాలే అతని భావుకతను పెంపొందించి రాత్రంతా నిద్ర లేకుండా చేశాయి. మరుసటి రోజున విశారదుని పిలిచి మలయ ధ్వజ రాజుకు తానిక్కడకు వచ్చిన వార్తను తెలియ జేయమని ఆరాజు దగ్గరకు పంపించాడు. ఆ సందర్భములో చెప్పిన (కవి రచించిన) పద్యం భిన్న వ్యాఖ్యానాలకు గురి అయింది. ఆ వివరాలు తెలుసు కొందాం. మొదట పద్యాన్ని గమనించండి!

తే || అపుడు నృపుడు ప్రఫుల్ల నవాంబుజ ప్ర

సన్న ముఖుడయి మలయ ధ్వజ క్షితీశ

కమల హితునకు మామ కాగమన వార్త

దెలుపు మనుచు విశారదు బిలిచి పనిచె.సర్వ సాధారణముగా మన కవులు సూర్యోదయాదులను వర్ణించుటకు ఎక్కువ ఉబలాట పడతారు. కాని ఈ కవి (చేమకూర వేంకటకవి) కథా నాయకుని (అర్జనుని) తత్తరము (కాలయాపనకు ఓర్వలేక పోవడము) దృష్టిలో ఉంచుకొని చాలా క్లుప్త గతిని సూర్యోదయం సంగతి తెలియ జేస్తాడు. అంబుజములకు స్నేహితుడు - కమల హితుడు. కాబట్టి అంబుజ ప్రసన్న ముఖుడైన అర్జునుడు, క్షితీశ కమల హితుడైన మలయ ధ్వజుడికి, వార్త పంపడము సమంజసము. హిత భావము కార్యానికి అనుకూలము కదా?! విశారదుని అర్జునుడు "పిలిచి పనిచె" అనుటలో అర్జునుని తొందర స్ఫురిస్తున్నది. ఒక విధంగా ఆలోచిస్తే, విశారదుడితో చెప్పిన మాటలే చాలా చమత్కారముగా ఉన్నాయి; "మామ కాగమన వార్త" (నేను వచ్చానన్న సమాచారము) తెలుపుము అన్నాడు. కాని అతని అభిప్రాయము అంత మాత్రమే కాదని అందరికీ తెలుసును.చిత్రాంగదా ఘట్టములో అర్జునుడు అవలంబించిన "అవహిత్థ" (భావగోపనము) ఇంకా కొన సాగిస్తున్నాడని అనాలి. అంటే తన హృదయము లో ఉన్న అసలు అభిప్రాయము (వివాహ విషయం) తెలియ పరచ లేదా అంటే చేమకూరకవి చమత్కారము ద్వారా తెలియ పరచక పోలేదని గట్టిగా చెప్పవచ్చును. ఆ చమత్కారాన్ని చూపించడానికి మన వ్యాఖ్యాతలు ప్రయత్నించారు. జూలూరి వారు (అప్పయ్య పంతులు) "మామకు ఆగమన వార్త అని కూడా చమత్కారము విచారించ వలెనని వ్యాఖ్యానించారు. వేదము వారు "మామకున్ ఆగమన వార్త ... తన కూతురును నాకిచ్చి వివాహము చేయమని ఆయనను అడుగుమని చంత్కారము" అని వివరించారు.మామకున్+ఆగమన వార్త అని పద విభాగము చూపినప్పుడు, ఆ పద భాగాలకున్న అర్థాలు చెప్పి, వాటి సమ్మేళనము వలన కలిగిన శక్తితో విశేషార్థాలు నిరూపించి, తాము చూపిన (తనకూతునిచ్చి వివాహము చేయుమన్న) చమత్కారాన్ని సాధించి ఉండాలి. అలాంటి దేదీ వారు చేయలేదు. సహృదయు లెంత ప్రయత్నించినా అది సాధ్యము కాక పోయింది. చమత్కారార్థము చూపించాలని అభిలాష ఉంటే "ఇదిగో ఈసన్నివేశంలో 'మామా’ అన్నమాట అర్జునుడి నోట విన వచ్చింది కాబట్టి సంతోషించండి" అని పాఠకులను కోరితే ఇంతకంటే మేలుకదా? ఈ వ్యాఖ్యానాలు సందర్భాన్ని బట్టి ఊహించి "కిట్టించిన" వ్యాఖ్యానాలనక తప్పదు. పెండ్లి కాక మనుపే మలయ ధ్వజుడు మామ ఏలాగవుటాడు? మామక ఆగమన వార్త తెలుపు మన్నంత మాత్రాన తన కూతు నివ్వమని అడుగు అన్న అర్థం ఏలావస్తుంది? ఇవి అన్నియూ ఆలోచిస్తే, అర్జునుడు సభ్యత తెలియని మోటు మనిషి కాడు. ఉత్తమ రాజ వంశములో పుట్టిన వాడు. మీదు మిక్కిలి ధర్మరాజు తమ్ముడు. అటువంటి వాడు - ఈ సన్ని వేశములో చిత్రాంగద మీద తనకు మోహము కలిగినంత మాత్రాన, ఆమె తండ్రిని "మామా" అని నీర్దేశిస్తాడా? ఇలా వెకిలిగా బయట పడతాడా? అత్యంత శ్రద్ధతో పాత్ర పోషణ చేస్తూ వచ్చిన చేమకూర వేంకటకవి ఈ ఒక్క మాటతో ఇంతటి పేల కవిగా తేలిపోతాడా?! ఊహాతీతము! తేలిపోడు! అందుచేత అర్జునుడు విశారదునికి చెప్పిన మాటలను "మామ+కాగ+మన వార్త తెలుపుము" అని విడ దీస్తే ప్రశస్తంగా ఉంటుందని తాతాజీ అభిప్రాయ పడ్డారు. అలా చేసి నట్లయితే దాని కర్థము "మామ అయేటట్టు మన వార్త తెలుపుము" అని మామ అయేటట్టు అంటే కూతురి నిచ్చునట్లు; మన వార్త (నా సంగతీ మన వంశము సంగతీ) చెప్ప మన్నాడు. నీవు చెప్పినది విని మలయ ధ్వజుడు మా వివాహాని కంగీకరించాలని కార్య భారమంతా నేర్పుతో విశారదుడి మీద పెట్టాడు! చేమకూర కవి శ్లేషలు "పూ మొగ్గల వలె తమంత తామే వీడును" అని వేదము వారు ప్రశంసించారు. "ఆమాట నాపద విభజన రూఢి పరుస్తుంది" అంటారు తాపీధర్మారావు.అలా అర్జునుడు పంపించగా, విశారదుడు మంత్రి ద్వారా మలయధ్వజరాజుని చూచి, ఆయనతో రాజేంద్రా మత్స్య యంత్రాన్ని తెగవేసి ద్రౌపదిని పాణి గ్రహణము చేసికొన్న అర్జునుడు తీర్థ యాత్రలకు బయలుదేరి ఇప్పుడే ఇచ్చటకు వచ్చియున్నాడని తెలియ జేశాడు. వెంటనే మలయధ్వజ మహారాజు అంతటి పరాక్రమ వంతుడు తన రాజ్యానికి వచ్చాడన్న గౌరవ భావముతో ఎదురువచ్చి ఇది చాలా సుదినమని తన నగరానికి ఆహ్వానించాడు. ఇద్దరు రాజులు భద్రజాతి ఏనుగులపై ఆసీనులై వెళ్తూ వుండగా, ఈ స్వాగతోత్సవము చూడడానికి పౌరు లంతా వీధుల వెంబడి వచ్చి బారులు తీర్చారు. స్త్రీలందరూ అర్జునుని అందచందాలకు ముగ్ధులై మనసులో ఏవేవో కోరికలు ఊహించుకొన మొదలెట్టారు! మలయధ్వజరాజు కూడా, ఇంతటి రూపసి, నిర్మలమైన గుణాలు కల్గిన సమర్థుడు, నాకు అల్లుడైనచో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని ఆలోచించ మొదలెట్టాడు! పెండ్లి సరదాలు తెలిపే అలంకరణలతో ఉన్న మంచి విడిదిని ఏర్పాటు చేసి, అర్జునుని తగిన ఆతిథ్యముతో ఆనంద పరిచాడు పాండ్యరాజు మలయధ్వజుడు. ఈ విధమైన ఆతిథ్యాన్ని పొంది ఆశ్చర్య చకితుడై "విశారదా ఈ రాజు చూపిస్తున్న గౌరవ ఆదరాలు అతిహెచ్చు స్థాయిలో ఉన్నాయి, ఇవి కేవలం స్నేహ సూచకాలేనా?!" అని అంటాడు అర్జునుడు. అయినా రాజాగారి ఉద్దేశ్యము ఏమిటో సంభాషణలలో వాచ్యంగా కాక సూచన చేసి తెలుసు కోవడం మంచిదికదా?" అని అంటాడు. అప్పుడు విశారదుడు "మీ ఆలోచన బాగుంది. మీరు తల పెట్టిన కార్యము తప్ప కుండా జరిగి తీరుతుంది." అని చెప్పి, ఆవేళనే మలయధ్వజునుని చూడడానికి వెళ్ళాడు. ఆరాజు అతనిని సంతోషముతో ఆహ్వానించి, గౌరవించి మీ రాజుగారేమంటున్నారని? ప్రశ్నిస్తాడు. విశేషాలేమిటని విశారదుడు అడిగాడు. అంతటితొ ఆగక "మహారాజా! మారాజుగారు చాలా సంతోషమగా ఉన్నారు. నేను ఇచ్చటికి వచ్చే వరకు వారు తమ ప్రశంసే చేశారు. పాల సముద్రముతో చుట్టరికము చేసిన లక్ష్మీనాధుడి లాగానే, మీరు గుణవంతులు కాబట్టి, మీతో సంబంధము పెట్టుకోవాలని మా ప్రభువు ఆలోచిస్తున్నారు" అన్నాడు. వెంటనే మలయ ధ్వజుడు గ్రహించి "అటువంటి మహారాజుకు బుద్ధిమంతు రాలైన నాకూతురు నివ్వ గలగడం నిజంగా నా భాగ్యమే" అన్నాడు! అతడు వెంటనే తన వంశ వృత్తాన్ని విశారదునికి వివరించి, నాకూతురికి పుట్టిన కొడుకును మావంశ ప్రభువుగా చేయవలసి ఉంటుందని అందుకు అర్జునుని ఒప్పించి ఈ కార్యము తప్పక నెరవేర్చ వలయునని విశారదుని కోర్తాడు.

తే|| అని యతని బంచె, నామాట కర్జనుండు

సమ్మతించె, ముహూర్త నిశ్చయము నయ్యె;

హితుడన విశారదుడె గాక యెందు గలరె

కోర్కి వెలయంగ దొర పెండ్లి కొడుకు జేసె.అటు అర్జునుడికీ, ఇటు మలయ ధ్వజునికీ ఉన్న తహ తహకు అనుగుణంగా ఈ పద్యంలో కథా గమనం పరుగెత్తడం చమత్కారము! ఈ పద్యంలో చూపించిన అలంకారాన్ని కావ్య లింగమని పేర్కొన్నారు లాక్షణికులు!

రాజుగారి ఆజ్ఞలతో అర్జున చిత్రాంగద వివాహానికి కావలసిన యేర్పాట్లన్ని చక చకా జరిగి పోయాయి! వెను వెంటనే రాజ లాంఛనాలతో అత్యంత వైభవోపేతంగా వివాహం జరిగింది!ఉభయ పక్షాల వియ్యాలవారి తత్తరానికి (తొందర పాటుకు) తగినట్లుగా కథా రచనను పరుగు లెత్తించిన వేంకట కవి గారు ఇక్కడ చిత్రాంగద వర్ణనకై కొంత ఆగడం ఆశ్చర్యంగా తోస్తుంది! దీనికొక సమర్థన చెప్పు కోవాలంటే, మొదటి సారిగా రాకుమార్తెను చూచిన ప్రజలు ఆమె అందానికి ఆశ్చర్య పడి, పోలికలు చెప్పు కొన్నారు. ఈ విధంగా పరు గెత్తుతున్న కథను ఆపి కవి ప్రజల ఊహను వర్ణించుట సమంజసమే! ఈ పద్యం లోని సారస్యమును పరికించండి:శా|| పంకే జాతములన్ దిసంతు లడచున్ బాలామణి పాదముల్;

వంకల్ దీర్చు మనోజ సాయకములన్ వాల్చూపు; లేణాంకునిన్

శంకల్సేయు మొగంబు; జక్కవ కవన్ జక్కట్లు దిద్దున్ గుచా

హంకారంబు; మదాళి మాలికల నూటాడించు వేణీరుచుల్.విజ్ఞుల దృష్టిలో ఇది చాలాచక్కని పద్యం. పద సారస్యముతో పాటు ప్రసన్నార్థమూ, గంభీరార్థమూ, మేళవించి సాగించారీ పద్య రచన! ఈ పద్యములోని అందచందాలు మన పూర్వ వ్యాఖ్యాతలు గమనించ లేక పోయారన్న విచారాన్ని వ్యక్త పరుస్తారు తాపీవారు. ఈ ఘట్టం లోని ప్రతి పద్యమూ రస పూరితమైన గుళికయే! అందుచేత విశ్లేషణ ఎంతకూ ముగియదు. ఈ వివాహ ఘట్టంలోని పద్యాలకు కొత్త చమత్కారాలను సొగసుగా ఊహించారు తాతాజీ. ముఖ్యంగా చిత్రాంగద అర్జునుని తలమీద తలంబ్రాలు పోసిన పద్యాన్ని చక్కగా వ్యాఖ్యానించారు. చిత్రాంగద అరుణారుణ హస్తాలతో అర్జునుని తలమీద ముత్యాలు పోయడం తామ్రపర్ణీ నదీజలాలతో తామ్రపర్ణీ నదీతీర భూమిని అర్జునునికి ధారా దత్తం చేసినట్లుందని విశ్లేషించుట ప్రశస్త తరంగా ఉంది. వివాహానంతరం తదుపరి కార్య క్రమాలన్నీ జరిగి పోతాయి! కొంత కాలానికి చిత్రాంగద గర్భం దాల్చింది. ప్రసవ మాసంలో శుభ లగ్న మందు ముద్దుల బాలుని కన్నది. ప్రతాపములో వేయి సూర్యులతోను, కీర్తిలో వేయి చంద్రులతోను, సమాన మై బాలుడు ప్రకాశింప మొదలెట్టాడు. ఆ శిశువు జాతక రీత్యా పచ్చని గుఱ్ఱముల పాలించే వాడౌతాడని తెలుసుకొని, అర్జున మలయ ధ్వజులు బాలునికి బభ్రూవాహనుడని నామకరణం చేస్తారు. కొంత కాలం గడుస్తుంది. ఇచ్చిన మాట తప్ప కుండా అర్జునుడు చిత్రాంగద కుమారుని వంశ కరుడుగా మలయధ్వజునికి ఇచ్చాడు. తర్వాత వారి వీడ్కో లందుకొని, అర్జునుడు దక్షిణ దేశములోని పుణ్య క్షేత్రాలు దర్శిస్తూ వెళ్ళి సౌభద్రము అన్న తీర్థంలో స్నాన మాడ బోగా, అక్కడ ఉన్న మునులు తీర్థములో గల మొసళ్ళ సంగతి చెప్పి వారిస్తారు. "మోక్షమునకు బోవ మొసలెత్తు కొనిపోయె" నన్న లోకోక్తిని వాడుతారు! ఇలా లోకోక్తులు వాడుట చేమకూర వారికి వెన్నతో పెట్టిన విద్య! అర్జునుడు స్నాన మాడుట, మొసళ్ళను బైటకులాగి పారవేయుట, ఆ మొసళ్ళు అప్సరసలుగా మారుట,వారి శాప విముక్తి జరిగి వారి వృత్తాతమంతా నంద అర్జునునికి తెలియ పరచి, వారికి విముక్తి కలిగించి నందులకు కృతజ్ఞతలు తెలిపి, అచ్చరలు అర్జునునికి, కళ్యాణ మౌననీ, వంశాభి వృద్ధి కలుగు ననీ, సర్వత్రా జయమూ, సామ్రాజ్యము ప్రాప్తిస్తుందనీ ఆశీస్సులందజేసి, వారి లోకాలకు తిరిగి పోతారు.అటు తర్వాత, అర్జునుడు గోకర్ణ మందున్న ఈశ్వరుడ్ని సేవించి, పశ్చిమ సముద్ర తీరంలోని క్షేత్రాలను సేవిస్తూ, ప్రభాస తీర్థానికి వెళ్తాడు. ద్వారకా పురి అచ్చటికి సమీపంలోనే ఉన్న విషయం తెలిసి కొని అచ్చటికి వెళ్ళి సుభద్రను చూడాలన్న కోరికతో ఉన్నాడు. ఇది వరలో గదుని ద్వారా సుభద్ర రూపరేఖా విలాసాలను గూర్చి విన్నాడే కాని, చూచే అవకాశం లభించ లేదు. ఇప్పుడు కన్నులకు విందు గొల్పే ఆ అవకాశము కల్గింది కదా అని తనలో తాను సంతసించాడు. స్మృతి ఫలకం పై ఆమె రూపం చోటు చేసుకుంది. అర్జునుడు సుభద్రమీద గల ఆశతో (వాంఛతో) తనను ఇతరులు గుర్తించ కుండా ఉండ వలెనని తలచి, తన వెంట తీర్థ యాత్రకు వచ్చిన పరివారాన్ని దూరముగా పంపివేసి, యతి వేషము వేసుకొని (యాదవులు యతులకు విధేయులై ఉంటారని) ద్వారక వైపు ప్రయణిస్తాడు. ఈ సందర్భములో అర్జునుని రూప ధారణ వర్ణించే విధానాన్ని పరిశీలించండి:సీ|| మృగ నాభి తిలకంబు బుగ బుగ ల్గల లలా

టము పై మృదూర్థ్వ పుడ్రంబు దీర్చి,

తపనీయ కౌశేయ ధౌరేయ మగు కటీ

రమున గాషాయ వస్త్రము ధరించి,

శరణాగతాభయ సంధాకం బైన

దక్షిణ పాణి ద్రిదండ మూని,

రణ చండ కోదండ గుణ కిణాంకం బైన

డాకేల నును గమండలవు దాల్చి,తే || యండెబో శాంత రస మెల్ల నుట్టి పడగ,

నంగనల పొందు రోసి సన్యాసి యగుట

గద యుచిత మెందు, నా నవ మదన మూర్తి

యంగనా మణి గోరి సన్యాసి యయ్యె.ఈ పద్యానికి విపుల మైన వివరణ ఇచ్చారు ధర్మారావు గారు. ప్రతి యొక్క పదానికి ఉచితమైన, సందర్భ శుద్ధిగల అర్థాలను సూచించారు. విశేషము ఏమిటంటే సాధారణంగా స్త్రీల సాంగత్యమును అసహ్యించు కొన్న వారే సన్యాసు లవుతారు. కాని, ఈ విషయంలో అర్జునుడు స్త్రీని కోరి సన్యాసి అయ్యాడు. ఇది లోక వ్యవహారానికి విరుద్ధము. ఈ గీతము లో నున్న విరోధము "సన్యాసి యయ్యెన్". సన్యాసి వేషమును వేసెను అనుట వలన తీరి పోతుంది! మరో విశేష మేమిటంటే, దీర్ఘ పాదముల మొదటి వన్నియు రాజ చిహ్నములు, రెండవవి సన్యాసి లక్షణములు. ఆర్తులు శరణు గోరినపుడు కుడిచేతి తోడనే యభయ మిచ్చుట ఆచారము.త్రిదండము:- మనోదండము, వాగ్దండము, కర్మదండము అని మనో వాక్కాయ నిగ్రహానికి సూచకముగా మూడు కఱ్ఱలను కలిపి యొక్క దండముగా కట్టి సన్యాసులు పట్టు కొని ఉంటారు. అందుకే వారిని త్రిదండు లంటారు. యతి వేషం ధరించిన అర్జునుడు తన అభిమతము నెరవేరుటకు బలరాముడు అడ్డుపడ గలడని ఆలోచించి కృష్ణుని మనసులో తలచు కొంటాడు. వెంటనే సాక్షాత్కరించిన శ్రీకృష్ణుని పాద కమలాలకు అర్జునుడు ఆశ్చర్యానందాలతో సాష్టాంగ నమస్కారము చేసి లేవకుండా అలాగే ఉంటాడు. తను చెప్ప దలిచినది చెప్పుటకు ఎలా ఉపక్రమించాలా అనే ఆలోచనతో ఉండగా - కృష్ణుడు అర్జునుని గాఢాలింగనము చేసుకొని, అతని అభిప్రాయము గ్రహించి "అదుగో అర్జునా ఆ కనిపిస్తున్న రైవత మను కొండ సమీపం లోనే ద్వారక ఉంది. ఇక్కడకి చాలా దగ్గర" అని చెప్పి అతనిని రథము మీద తీసుకొని పోయాడు. ఆ రాత్రి అర్జునుని తోనే గడిపి, అతనిని అచ్చటనే ఉండమని చెప్పి, అతని కోరిక తొందరలోనే తీరుతుంది అనే నమ్మకాన్ని కలిగించి, ద్వారకకు తరలి పోయాడు. కొన్ని రోజుల తర్వాత రైవత కోత్సవ ఏర్పాట్లన్ని చేయించి, తయారై అందరూ రైవత కోత్సవములో పాల్గొనుటకై కొండ పైకి విచ్చేస్తారు.ద్వారక లోని జనమంత యధోచితంగా అలంకరించు కొని స్త్రీ పురుషులు చేరి కొండ పైకి వస్తారు! బలరామ కృష్ణులు వారి పరివారంతో విచ్చేస్తారు. తదుపరి, సుభద్ర చెలికత్తెలు ముందు, వెనుక వెంటరాగా పల్లకి నెక్కి ఉత్సవాలలో పాల్గొనుటకు వస్తుంది.కృష్ణుడూ, బలరాముడు మిక్కిలి భక్తితో పూజలు చేసి, తర్వాత స్త్రీ జనము చేత పూజలు చేయించారు.తర్వాత చెలికత్తెలు దారి చూపు తుండగా సుభద్ర వచ్చి అర్జునుడే తనకు భర్త కావాలను భావంతో విశేషంగా పూజచేసి, నమస్కరించింది. పూజానంతరము చెలికత్తెలతో కలసి కొండ గుహలోనున్న విశేషాలను చూస్తూ, సరస సల్లాపాలాడు కొంటూ ఉన్న సుభద్రను చూచిన అర్జునుడు విన్నదీ కన్నదీ ఒక దానితో ఒకటి పెనవేసు కోగా మహాశ్చర్యముతో చూశాడు. “సుభద్ర శరీర సౌష్టవమును చూచిన తర్వాత ఎటువంటి యతీశ్వరులైనా చలిప కుండా ఉండలేరు" అనుకొంటాడు మనసులో.ఉత్సవానంతరము బలరాముడు యతిరూపములో నున్న అర్జునుని చూచి సంతసించి, ఆయన చూచిన తీర్థాల విశేషాలను వివరంగా తెలుసు కొంటాడు. తర్వాత యతిని చాతుర్మాస్యము ద్వారక యందే ఉండవలసినదని ప్రార్థిస్తాడు. అందుకు యతి రూపంలో నున్న అర్జునుడు ఒప్పు కొంటాడు. ఇంతలో అచ్చటికి వచ్చిన కృష్ణుడికి, బలరాముడు యతి విషయం చెప్పి ఆయనను ఉద్యాన వనంలో ఉంచి, సుభద్రను పరిచర్యకు వినియోగించమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు కృష్ణుడు యతిని చూచి, ఈ యతి గారు పిన్న వయసులో నున్నవారు, పైగా చక్కని వాడు కూడా. అలాంటప్పుడు అతనిని గూర్చి పూర్తిగా తెలిసి కొనకుండా, సుభద్రను పరిచర్యకు నియమించుట శ్రేయస్కరము కాదేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. మునులకు శుశ్రూష చేయడానికి అవివాహితు లైన కన్యలను నియమించుట సాప్రదాయమేనని మందలింపు ధోరణితో కృష్ణుని ఆజ్ఞాపిస్తాడు. కృష్ణుడు సుభద్రకు ఈ విషయం తెలియ జెప్పి, యతిని జాగ్రత్తగా సేవించాలని చెప్తాడు. కృష్ణుడు రుక్మిణీ సత్యభామలకు యతి వేషం లో ఉన్నవాడు అర్జునుడని తెలిపి, ఈ రహస్యం ఎక్కడా పొక్కనీయ కండని చెప్పాడు. కృష్ణుని అతః పురానికి చెందిన ఉద్యాన వనంలో అందమైన ఒక చిన్న భవంతిలో అర్జునునికి (యతికి) యేర్పాట్లు చేయిస్తాడు. సుభద్ర చక్కగా అలంకరించుకొని, చెలికత్తెలతో కలసి, పరిచర్యలు చేయు నుద్దేశ్యముతో అర్జునుని చెంతకు వచ్చింది.సుభద్ర శుశ్రూష: ఉ|| వచ్చిన, దౌల గాంచి తలవంచి జపంబు నెపంబు వెట్టి ని

వ్వచ్చు డొకింత సేపు తన వంక గనుం గొన కున్న, మెల్లనే

యచ్చట నిల్చి నిల్చి, వినయంబున జేరి, కుచంబు లోరగా

హెచ్చిన భక్తి మ్రొక్కి యనియెం జెలి యంజలి జేసి యింపుగన్.సుభద్ర వచ్చి నప్పుడు అర్జునుడు జపం చేస్తున్నట్లు నటించడం చేత, సుభద్ర భక్తి ఎక్కువయింది. "నిల్చినిల్చి" అన్నందు వలన సుభద్ర చాలాసేపు వేచి వున్న తర్వాతనే అర్జునుడు జపము చాలించి కళ్ళు విప్పాడని భావము.

వివ్వచ్చుడు అనగా భయము గొలుపు వాడు. కాబట్టే సుభద్ర జప భంగము జేయడానికి జంకి, మౌనంగా నిలిచిందని ఊహించాలి. యౌవనవతి కావడము వల్ల సుభద్ర చేతులు జోడించి నమస్కరిస్తు నప్పుడు పుష్టి గల కుచములను చేతులు అదుమ వలసి వచ్చినందున అవి ప్రక్క వాటుగా కాన వచ్చుట సహజము. కాబట్టే "కుచంబు లోరగన్" అని అన్నాడు కవి. స్తనముల నిండు దనము చెప్ప కుండా చెప్పటమే చమత్కారము! అనుప్రాసా లంకారముతో వర్ణించారు వేంకట కవి. దీనినే స్వభావోక్తి అని కూడా పేర్కొంటారు లాక్షణికులు.


ఆ సమయంలో సుభద్ర "ఓ మహానుభావా! ఇపుడు దేవపూజకు, ఏమి కావలె? పత్ర పుష్ప ఫల జలాదులు తేవలయునా" అని అడుగగా, ఆ ప్రకారమే చేయమని అర్జునుడు చేతితో సౌజ్ఞ చేస్తాడు! మహానుభావ - ఇది సుభద్ర అర్జునుడి విషయములో చేసిన మొదటి సంభోదన. అత్యంత భక్తి గౌరవాలను సూచిస్తుంది. మరో పద్యాన్ని పరిశీలించండి:సీ|| తన యరుణాధరంబునకు నీడివి యన్న

రమణ నేఱిచి పల్లవములు కొన్ని,

తన తనూ సౌరవంభునకు జోడివి యన్న

చందాన, వెదకి పుష్పములు కొన్ని,

తన మధురాలాపములకు దీటివి యన్న

పగిది, నారసితియ్య పండ్లు కొన్ని,

తన లేత నగవు తేటకును బాటి యివియన్న

పోల్కి దేఱచి హిమాంబువులు కొన్ని,పత్ర పుటికా విధూపల పాత్రికలను

దెచ్చి వినయంబు తోడ నందించె నపుడు

పసిడి గాజుల మిస మిసల్ పైకి బొలయ,

జకిత బాల మృగీ చక చకిత నయన.పద్యం మనోహరంగా వుంది. దీనిలోని చమత్కారమేమిటంటే విశేష మైన భక్తితో, సుభద్ర చక్కని పత్ర పుష్పాదులు జాగ్రత్తగా సంగ్రహించింది, కాబట్టే, ఏరిచి, వెదకి, ఆరసి, తేరిచి అన్న పదాలు, దీని వల్ల పల్లవము లన్నీ తన కెమ్మోవికి సాటి కావనీ, ఏ ఒకటో రెండో మాత్రము సరిరాగలవనీ గ్రహించాలి. అలాగే తక్కిన మూడింటి లోనూ బాగా సరిపోవడానికి వాటిలో శ్రేష్ఠ మైనవి ఎంచి ఎంచి తెచ్చిందన్న భావము సూచించాడు చేమకూర వేంకట కవి! ధర్మారావు గారి విశ్లేషణ లో చూపిన ఉపజ్ఞ ముదావహము. గమనించండి:"ఆకుదొప్పలలో పల్లవములనూ, పుష్పములనూ, చలువరాతి పాత్రలో పండ్లనూ, పన్నీటినీ తెచ్చిందని క్రమము గమనించాలి! పసిడి గాజులు - రత్న ఖచితములై - మెరుస్తుంటాయి. అందుకే మిసమిసలు, పైకి వ్యాపించాయి. తెచ్చిన వస్తువులు చేతికందించి నప్పుడు ఆ మిసమిసలు అర్జునుడి మీద పడక తప్పదు గదా! వెదకి వెదకి, ఎంచి యెంచి ఆయా వస్తువులను తీసుకొని రావడము వల్ల సుభద్రకు యతీశ్వరుడి సేవలయందు గల అపార మయిన శ్రద్ధా భక్తులు తేట పడు తున్నాయి. పోలికలను తెల్పడానికి మొదటి రెండు పాదాలలోను "ఈడివి" "జోడివి" అనీ, తక్కిన రెండు పాదాల లోను "దీటివి" "పాటివి" అని మరో చిన్న సొగసు కవి ఉద్దేసించాడు" అంటారు మన తాతాజీ!! ఉత్ప్రేక్ష, క్రమము, ఉదాత్తము అనే మూడలంకారములను వాడాడు ఈ పద్యంలో చేమకూర వేంకట కవి!

క|| చేసె జప మతడు కడు వి

శ్వాసముచెలి చూపు బేడిసలపై నిగుడన్

జేసినయది జపమున్ మఱి

వేసిన యది గాలమనుట వృధ గాకుండన్."చేసినది జపమూ, వేసినది గాలమూ" అన్న సామెత నిజమయ్యే లాగ అర్జునుడు బేడిస చేపల వంటి సుభద్ర కన్నుల మీదనే శ్రద్ధ నిలిపి తన జపము సాగించాడని భావము!పద్యం లోని విశేషం: ఏదో మంచి పని చేస్తునట్లు కనిపిస్తూ, స్వప్రయోజనాన్ని సాధించు కోడానికి ప్రయత్నించి నప్పుడు ఈ లోకోక్తిని ఉపయోగిస్తారు. ఇచ్చట చేస్తూ ఉన్నది జపమే, కాని శ్రద్ధ మాత్రం బేడిసల మీదనే! లోకోక్తులు విసరడంలో చేమకూర కవి ఘటికు డనుటకు ఇది మరో నిదర్శనం. మరో సొగసైన పద్యాన్ని పరికించండి:

తే|| భామ మోమున మోమున వ్రేలు రూపంబు జూచి,

ముదిత యెద బాయె కుండెడు మూర్తి దలచి,

రమణిమై సగమైన విగ్రహము నెంచి,

ప్రోవుమని వేడు కొను దేవ పూజ వేళ.పద్యం లోని చమత్కారము : భార్యను ఎప్పుడూ ఎదుట పెట్టు కొనే వాడు బ్రహ్మ; సతి నెప్పుడూ మనసులో ఉంచుకొనే వాడు విష్ణువు; భార్య కోసం శరీరం లో సగమిచ్చిన వాడు శివుడు. ఈ ముగ్గురికీ ప్రేమ ఎలాటిదో బాగా తెలుసునని అర్జునుని భావము. అందువలననే ఆ ముగ్గురు దేవులనూ పూజించి, వారిలాగే తనకూ ప్రియురాలితో అవినాభావము కలిగే లాగా అనుగ్రహించమని ప్రార్థిస్తునట్లు ధ్వని!ఇంకా విశేషాలు : ఇందులో, మోమున ఉండుదానిని, యెద నుండు దానిని, సగమైన దానిని క్రమంగా చూచి, తలచి, ఎంచి అన్న క్రియలతో చెప్పడము అందమైన విషయం. అలాగే వ్రేలునది రూపము (పటము లాగా), పాయకుండునది మూర్తి (ఒక్క మూర్తి గా తోచడము వల్ల), సగమైనది విగ్రహము (విభాగము కాబట్టి) అన్న సొగసు కూడా ఉంది. ఈ సొగసు లన్నీ పాఠకులకు అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చూపించారు వ్యాఖ్యాత తాపీవారు! ఆంధ్ర విశారదులు కదా! తాతాజీ! సార్థక బిరుదాంకితులు.మరో పద్యం విషయంలో వాద వివాదాలు జరిగాయి. ఆ పద్యాన్ని పరిశీలిద్దాం:సీ|| ఎగు బుజంబుల వాడు మృగరాజ మధ్యంబు

బుడికి పుచ్చు కొను నెన్నడుము వాడు,

నెఱి వెండ్రుకల వాడు, నీలంపు నికరంపు

మెఱగు జామన ఛాయ మేని వాడు,

గొప్ప కన్నుల వాడు, కోదండ గుణ కిణాం

కములైన ముంజేతు లమరు వాడు,

బవిరి గడ్డము వాడు, పన్నిదం బిడి డాగ

వచ్చు నందపు వెన్ను మచ్చ వాడు,తే|| గరగరని వాడు, నవ్వు మొగంబు వాడు

చూడ గల వాడు, మేలైన సొబగు వాడు,

వావి మేనత్త కొడుకు కావలయు నాకు,

నర్జ నుండు పరాక్ర మో పార్జనుండు.ఈ పద్యానికి విపుల మైన ప్రతి ప్రదార్థము వివరించారు ధర్మారావుగారు. అంతేకాక, పద్యములోని విశేషార్థాన్ని కూడా చక్కగా చెప్పారు. అర్జునుడు సవ్యసాచి కనుక రెండు ముంజేతులున్నూ గుణ కిణాంకములు (కాయలు). అల్లె త్రాటి ఒరపిడి చేత విలు కాండ్రకు మణికట్టు దగ్గరి హస్త భాగమున కాయ లుంటాయి. బాణముతో ఆకర్ణాంతము లాగి వింటి నారి బాణము, విడిచి పెట్టి నప్పుడు, చాలా తీవ్రంగా ముంజేతికి తగులు తుంది. అలా తరచుగా తగిలి నందు వల్ల కాయలు కాస్తాయి.సుభద్ర ఇంతకు పూర్వము అర్జునుని చూచి ఉండలేదు, తాను వినికిడి ద్వారా ఏర్పరుచుకొన్న మనో చిత్రాన్నే ఈ విధంగా వర్ణిస్తున్నది. అర్జునుని గురించి ఇంత ప్రత్యేకంగా తానడుగు తున్నందుకు యతి ఏమనుకుంటారో అని కొంత సమాధానంగా చుట్టరికపు వరుసను తెలియ జేస్తుంది!ఈ పద్యములోని వర్ణనలను చేమకూర కవిగారు ఒక స్త్రీల పాట "సుభద్రా కల్యాణము" లో నుండి తీసుకొని తన కావ్యములో కలుపు కున్నాడని వేటూరి ప్రభకర శాస్త్రిగారు అభిప్రాయం వ్యక్త పరచారు. అది పొరపాటని, తన పరిశోధన రూపంగా తగినంత విషయం వెలికి తెచ్చి, నిరూపించారు ధర్మారావుగారు. దీనికి సంబంధించిన వాద ప్రతి వాదాలు 1932 భారతి సంచికలో వ్యాస రూపంలో ప్రచురించి విజ్ఞుల మన్ననలు అందుకొన్నారు తాతాజీ!సుభద్ర అడిగిన ప్రశ్నలకు యతిరూపధారి అయిన అర్జునుడు "మేము అన్ని ప్రదేశాలు చూచాము, తీర్థ యాత్రలు చేస్తున్న అర్జునుడిని కూడా చూచాము" అని చెప్పే సరికి, సుభద్ర ఉత్సాహం అంతా సంతోషంగా మారుతుంది! అర్జునుని మీరు ఎక్కడ చూచారు? ఇక్కడికి రారా? అంటూ కోరికలు పెచ్చు రేగుచుండగా అడుగుతున్న ఆ సుభద్రపై ప్రయోగించడానికి మన్మథుడు చిగురాకు కత్తులు నూరసాగాడు! దానికి జవాబుగా యతీంద్రుడు చెప్పిన మాటలు తిలకించండి!

ఉ|| కోమలి ఈ గతి న్మది తగుల్వడ బల్కిన, నవ్వి "నిర్జర

గ్రామణి సూను మీ రెచట గంటిరో యంటిమి; కన్న మాత్రమే

యేమని చెప్పవచ్చు, నొకయించుక భేధము లేక యాతనే

మేమయి యున్న వారము సమీ విక చాంబుజ పత్ర లోచనా"చూడడమే కాదు, ఆయనే నేను, నేనే అర్జుడను అన్నంత, అభేదంగా ఉన్నాము, అని చిరునవ్వు నవ్వుతూ అర్జునుడు (యతి) సుభద్ర తో అన్నాడు! అర్జునుడు ఈవిధంగా చెప్పుతూ ఉన్నప్పుడు ఆనందాతి శయము చేత సుభద్ర పెద్ద కన్నులు చేసుకొని చూస్తూ ఉంటుంది! అందుకే వికజాంబుజ పత్ర లోచనా అన్న సంబోధన.! "మొదటిపాదంలో ' మదిదగుల్పడ' అన్న మాటలకు వేదము వారు ' మనసున నాటునట్లు' అని అర్థము చెప్పారు. బులుసు వారు ' మనసునందు నాటుకొను నట్లుగా ' అనే అర్థము ఇస్తూ, ప్రేమ కలుగు నట్లుగా అని కొంత వివరణ నిచ్చారు. వీరి అభిప్రాయము "కోమలి ఆ ప్రకారము ' ప్రేమ కలిగినట్లు' పలికినది అని. ఆ మనస్సు అర్జునుడి మనస్సే కావాలి కదా, అర్జునుడిక్కడికి వచ్చిన దగ్గర నుంచి, - అంతకు ముందు నుంచి గూడా - ప్రేమ కలిగే ఉన్నాడు, ఇప్పుడు కొత్త ఏమీ లేదు. కాబట్టి 'తగుల్పడన్ ' అంటే (ఆమె మనసు) ' పట్టుబడినట్టు' అని మనము చెప్పడము న్యాయము, ' బలిమిని పట్టగా తివురు...' అన్న (145వ) పద్యంలో 'తలపెరుంగకే కలయగ జూచుటల్ తగవు గాదని యుండు 'అని కవి చెప్పాడు. ఆమె మనస్సు తెలుసు కోవాలనే ఇన్నాళ్ళూ కని పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడీ సందర్భములో ఆ' మనస్సు' చక్కగా పట్టు పడింది, అందుకే నవ్వాడు, ఇక బయట పడ వచ్చుననీ బలిమిని పట్టినా ఇట్టాట్టానదనీ నిశ్చయించుకొని ' ఆయనే మేమయి' ఉన్నామన్నాడు. అర్జునుడి ప్రవర్తనలో ఇదొక కీలక మైన సన్ని వేశము. ఆ కీలకము ఈ తగుల్పడడము లోనే కవి ఉంచాడు. దానిని మనము గ్రహించక పోవడము కవికి ద్రోహము చేయడమే అవుతుంది" అంటారు తాపీ ధర్మారావు గారు. ఈ మది తగుల్పడడంతో - సుభద్ర మనసు పట్టు బడడంతో, యతీశ్వరత్వం అంతరించి పోయింది. అర్జునత్వం ప్రస్ఫుట మయింది. యతిగా చూపిన ప్రవర్తనలో అర్జునుడు సుభద్రను ఎప్పుడూ, శృంగార రస సంబధమైన సంబోధనతో పిలువ లేదు. కానీ ఈ పద్యంలో సుభద్రను ' వికజాంబుజ పత్రలోచనా ' అని సంబోధించి అర్జునుడు తన శృంగార నాయకత్వము ప్రదర్శించాడు.సుభద్ర అర్జునుడి గూర్చి ప్రశ్న లడుగు తున్న కొలదీ అర్జునుడి మోహము, అసలుకి వడ్డి వలె, వృద్ధిపొంద నారంభించింది. అప్పుడు అర్జునుడు (యతి వేషధారి) సుభద్ర నుద్దేశించి "తరచి తరచి" అర్జునుడి గూర్చి అడుగు తున్నావు, నీకేమైనా అతనిపై మనసు ఉన్నదని ఊహించ వచ్చా? నాకు దాచ కుండా చెప్పు" అంటాడు.ఉ|| "అక్కరతోడ మంతనము నందిటు వేడెదు గాన, నంతయున్

నిక్కము గాగ దెల్పదగు నీ, కటులైన, సురేంద్ర సూతి యీ

దిక్కున నున్న వాడనుచు దెల్పిన తోడనె మాటలాడకే

యెక్కడ బోదువోయని యొకించుక సంశయ మయ్యెడుం జెలీ"ఇంత కోరికతో అడుగు తున్నావు కాబట్టి, నీకు నిజం చెప్పడం ధర్మము. కాని, అర్జునుడీ దిక్కున ఉన్నాడు అని చెప్పిన వెంటనే, నువ్వెక్కద మాటలాడ కుండా లేచిపోతావో అని సందేహము కలుగు చున్నది అని అంటాడు యతీశ్వరుడు!గూడార్థం: అర్జునుడీ దిక్కున ఉన్నాడు అనడం ఫలానా చోట ఉన్నాడనే కాక, ఇక్కడే ఉన్నాడు అని కూడా అర్థము చెప్పి సంతసిస్తున్నాడు యతీంద్రుదైన అర్జునుడు! మరి కొంత సేపు గడచిన తర్వాత, - ఆ అర్జునుడు యతి వేషంలో నీదగ్గరనే ఉన్నాడు! వచ్చి చాలా రోజులయినా ఈ రహస్యము నీవు తెలుసుకోలేక పోయావే అని రహస్యాన్ని వెల్లడి చేస్తాడు.ఆ మాటలు విని సుభద్ర భయముతో కూడిన ఆశ్చర్యముతో, "అయ్యో, అర్జునుడని అనుమానించి కూడా, ఇన్నాళ్ళూ వృధాగా సేవ చేశానే" అని సిగ్గుతో గబాలున లేచి పోబోగా బాలా నిలు నిలు అంటూ సంతోషమూ, తొందరపాటూ, మోహమూ కలిగి, అర్జునుడు లేచి చేయి సాచి ఆమె చేతిని హఠాత్తుగా పట్టు కుంటాడు! అర్జునుడు చేయి పట్టుకొన్న వెంటనే స్పర్శ వల్ల సుభద్రకు జలదరింపు తో కూడిన స్వేదము, రోమాంచము, కంపము అయినటు వంటి సాత్త్వికోదయ లక్షణాలు ప్రస్ఫుటించాయి! ఆ విధంగా చేయిపట్టి లాగినప్పుడు, సుభద్ర అవ్వలి మొగమై తిరిగి ఉండడము స్వాభావికము (సహజము) అటువంటప్పుడు అర్జునుడికి విలాసముగా కనిపించినది కటి ప్రదేశము (పిరుదులు) కదా! అందుకే వరా రోహ అన్నాడు, చమత్కారంగా చేమకూర కవి! అంతే కాదు, అర్జునుడు సుభద్రను వేడుకొనే విధానం పరికించండి!!ఉ|| శారిక హారి కంకణము సద్దున కంటుట గాదుకేలు, మం

జీర ఝళం ఝళ ధ్వనికి జేరుట గాదు పదంబు లంచ, వా

గ్ధోరణి మాధురీ మహిమకున్ శుక మానుటగాదు చెక్కు; లో

సారస నేత్ర, నా కొఱకు సారెకు వేడెడు జాడ లన్నియున్.భావము: ఆ గోరింక నీ చేయి పట్టడము నీ కంకణాల చప్పుడు వినాలని కాదు. ఆ హంస నీ పాదాల నాశ్ర యించడము నీ అందెల ధ్వనులు ఆశించి కాదు. ఈ చిలుక నీ బుగ్గలు తాకుతూ ఉండడము నీ మాటల తీయ దనము కోసము కాదు; అవన్నీ నీవు నన్ను అనుగ్రహించ వలసిందని ప్రార్థిస్తున్నాయి సుమా!ఒకరిని ప్రార్థంచే టప్పుడు కొందరు చేతులు పట్టు కుంటారు, కొందరు బుగ్గలు పట్టుకొని బతిమి లాడుతారు. ఇవి ప్రార్థించే విధానాలు. ఈ పద్యములో గోరింక చేయి పట్టుకుంది, హంస కాలు పట్టుకుంది, చిలుక బుగ్గ తాకుతుంది. ఆ పద్ధతులే ఈ పక్షు లవలంబించాయని చమత్కరించాడు! కవి. అర్జునుడు ఇంకా ఇలా అంటాడు. నాతో చెప్పడానికి సుభద్రకు సిగ్గయుతే ముద్దు చిలకా, నీతో నైనా చెప్పరాదా? మాటే అంత అపురూపము కావాలా? నేను పరాయి వాడను కాబట్టి సిగ్గు సహజము. కాని, నీవు చిలుకవు, ఆమె చిలుకల కొలికి ఆసంబంధము చూచయినా నీతో చెప్ప వచ్చునని భావము! ఇదో మరో పద్యం ఆస్వాదించండి!మ|| "రతికిన్, భారతికిన్ వినోద కథలం బ్రాగల్భ్యముం జూపి, త

త్పతులం గూరిచి, మాట వాసి గను పెద్దల్ గారె మీవార; లా

చతురత్వం బిట కొంత కానబడ నీ చంద్రానన్ గూర్చి, నన్

బ్రతి కింపం గదె ముద్దు గీరమ! సుధా బంధూ భవద్గీరమా!ఓ ముద్దుల చిలుకా, రతీ సరస్వతులు ప్రణయ కలహ మందు భర్తలతో మాట్లాడక అలిగి నప్పుడు మీ వంశము వారు వినోద కరమైన కథలను నేర్పుతో చెప్పి, వారు తిరిగి భర్తలతో కలిసేటట్టు చేసి ఆ మన్మథ బ్రహ్మదేవుల బొగడ్తలను సంపాదించారు. ఆ మాట నేర్పునే మా విషయంలో కొంత కన బరచి ఈ సుభద్రను నాతో కలిపి నన్ను బ్రతికించుమా! అని చిలకను కోర్తాడు! సుధా బంధూ భవద్గీరమ అంటే అమృతముతో సమాన మైన మాటలు కలది, కాబట్టి నీ మాటల అమృతముతో నన్ను బ్రతికించు అని కోరాడు అర్జునుడు. దీనిని కవి చమత్కార యుతంగా వాడాడు. ఇలాంటి చిలుకల ప్రశంసలు ఇతర ప్రబంధాలు ముఖ్యముగా "కళాపూర్ణోదయము, ప్రభావతీ ప్రద్యుమ్నము" లో కనుగొన వచ్చును.అర్జునుడు చిలుక నుద్దేశించి, సుభద్ర తనకు ప్రసన్న మైనట్లయితే, చిలుక కోరినవన్నీ ఇస్తానని వాగ్దానము చేస్తాడు! చిలుకతో అర్జునుడు చెప్పిన మాటలకు సుభద్ర సంతసించి, జవాబుగా చిలుకను మధ్య నుంచు కొనే తన అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియ జేస్తుంది:

తే|| మేరలా యివి మీయంత వారలకును?

బెద్దలున్నా రెఱిగి వారే పెండ్లి సేయ

గలరు, వేగిర పాటింత వలదటంచు

విన్నపము సేయరాదె యోచిన్ని చిలుక.ఈ మాటలు అనడముతో సుభద్ర పెండ్లికి తన సుముఖత ప్రకటించింది. అంతేకాక, ఆమె ఉచితజ్ఞత పెద్దల యందు ఆమెకు గల గౌరవము, అర్జునుని యందు ఆమెకు గల అనురక్తి వ్యక్తమౌతున్నాయి. కానీ, అర్జునుని జవాబు అతని ఆతురతా, సుభద్రపై ఒక విధమైన నిందా వ్యక్తమౌతున్నాయి! అంతేకాదు, తనను అప్పుడే గాంధార విధిని పెండ్లి చేసుకో మంటాడు! గమనించండి:

సీ|| నన్ను గాధర్వంబునను బెండ్లి యాడవే

సిగ్గేల పడియదే చిగురు బోణి?

రతి దేల్చి మదన సామ్రాజ్య మేలింపవే

తల యేల వంచెదే జలజ గంధి?

చెలులు వచ్చెదరు నా తలపు లీడేర్ప వే

తడవేల చేసెదే ధవళ నయన?

మది నిచ్చగించి నా మనవి యాలింపవే

కడకేల పోయెదే కంబు కంఠి?

తే|| మనసు దాపంగ నేటికే యనుపమాంగి?

చలము సాధింప నేటికే చంద్ర వదన?

మారు మాటాడ వేటికే మధురవాణి?

చింత సేయంగ నేటికే దంతి గమన?ఈ పద్యము లోని విశేష మేమిటంటే సీసపద్య చరణాల మొదటి భాగంలో అర్జునుని ప్రాధేయత, రెండో భాగంలో ఆ మాటలు విన్న తర్వాత సుభద్ర ఏమిచేసిందో ఆ వివరణ కవి నేర్పుతో జోడించాడు. గాంధర్వమున పెండ్లి యాడవే అన్నప్పుడు ఆమె సిగ్గు పడ్డది, రతిని తేల్చ మన్నప్పుడు తల వంచింది... అని పాఠకులు గ్రహించాలి. ఇది నాటక రచనా పద్ధతి. చేమకూర వేంకటకవి లోని మరో ప్రత్యేకత ఇది.!ఇలా ఇద్దరి మధ్య కొంత సవాదం జరిగిన తర్వాత అర్జునుడు సుభద్రతో "నా కోరిక కాదని నీవు అంతఃపురానికి పోతే తీరిపోతుందని అనుకుంటున్నావు కాబోలు, పిచ్చిదాన నీకు తెలియదు. విరహ సముద్రం నిన్ను ముంచేస్తుంది. దాని నీదలేవు సుమా!" అంటాడు. "ఈ దాడంటే కోదాడంటాడు" ఇది ఒక లోకోక్తి. ఎప్పుడు ప్రతి కూలంగా ప్రవర్తించే వాడిని గూర్చి దీనిని ఉపయోగిస్తారు, నీవు తొందర పడరాదని అనుకున్నా, మన్మధుడు అలాగుండ నీయడు, తొందర పెడతాడు, వియోగ సాగర మీదలేవు అని చెప్పుతూ, ఆమెను "లతాంగి" అని సంబోధించుట అందముగా ఉంది. అర్జును డింత ముచ్చటించినా, సుభద్రలో చలనం కనిపించదు! అప్పుడు అర్జునుడు -

క|| ఏలే యాలేఖ్యా కృతి?

యేలే ప్రాలేయకర ముఖీ చూడవయో?

యేలే శైలేయ స్తని?

యేలే బాలేందు నిటల? యేలాతి నటే?

చిత్రపటం లాగా మాట్లాడ వేమి? నావైపు చూడనైనా చూడ వెందుచేత, ఎందుకో చెప్పరాదా? నేను పరాయి వాడను కాదు, నీ బావనే కదా, నన్ను ఏలుకో అని పద్య భావము. కవి శబ్దాలంకార వ్యామోహంలో వ్రాసిన పద్యము. వేదమువారు ప్రాలేయకర ముఖీ అని వాడి కొంత చమత్కారము చూపించారు తమ వ్యాఖ్యానంలో! ఇలాంటి సందర్భములో

మ|| "అని బాహా పరి రంభ సంభ్రమ రసాయత్తైక చిత్తంబునన్

దను నీక్షింప, నెఱింగి యందియల మ్రోతన్ గేకినుల్ రా, 'సఖీ

జను లేతెంచి ' రటంచు వే మొఱగి హస్తంబున్ విడం జేసి నే

ర్పున దప్పించుక పోవ భూవరుడనుం బూబోడికిం గ్రమ్మఱన్"పద్యం లోని విశేషం: అర్జునుడు సుభద్ర చేయి పట్టుకొని ఉన్నాడు. అతడు ఉపయోగించిన పదాలను బట్టీ అతని దృష్టి ఏయే అవయవాల ఏయే గుణాలమీద ప్రస రించిందో తేట పడుతుంది! "ఏల తప్పించు కొనియెదవే లతాంగి" అన్నంత వరకు ఆమె నుండి ఏలాటి బదులు గాని, అంగీకారము గాని బయట పడలేదు. కామోద్రేకములో మార్గాంతరము ఆలోచించాడు! ఆ ఆలోచనతో చూడడాన్నే "బాహా పరిరంభ సంభ్రమ"... అని కవి చాలా సమంజసంగా వర్ణించాడు. స్త్రీ సహజ మైన బుద్ధిచేతనూ, తనకున్న ఇంగిత జ్ఞానము చేతనూ ఆ చూపులోని అర్థము గ్రహించి అతడు అమాంతముగా ఆలింగనము చేసుకుంటాడని అవగాహన చేసుకుంది. బెదిరి పోయింది! అంతలో కాళ్ళ అందెల ధ్వని వినవచ్చింది. అదిగో చెలులు వచ్చారని బొంకింది. అర్జునుడు కూడా ఔనను కున్నాడు. పట్టు విడిచి పెట్టాడు. సుభద్ర ఏమెరుగని ముద్దరాలే అయినప్పటికీ, ఆసన్నివేశం ఆమెకు గడుసు తనాన్ని, నేర్పును కలుగ జేసింది! పాత్ర చిత్రణలో చేమకూర కవి చూపించిన వైవిధ్యము ఇచ్చట గమనింప వచ్చును.సుభద్ర అంతఃపురానికి వెళ్ళిందా, పెళ్ళి జరిగే వరకు తన దగ్గరికి రాదని అర్జునుడికి తెలుసు. అందుకే పోనీయ రాదని తాపత్రయ పడ్డాడు. అయినా, సుభద్ర సిగ్గుచేత అక్కడ నిలువ లేకనూ, అర్జనుడిని వీడిపోలేకనూ, వెనుకకు తిరిగి చూచుకుంటూ ఉద్యాన వనంలో సాగి పోయింది. సుభద్ర వేళ్ళి పోయిన తర్వాత అర్జునుడు విరహ తాపానికి గురి అయ్యాడు. అర్జనుడి స్థితి చిత్ర విచిత్రమైన చమత్కారములతో దాదాపు 16 పద్యాలలో వివరిస్తాడు. మచ్చుకో పద్యం.

ఉ|| చిత్తజు డల్గి తూపు మొనచేసిన జేయగ నిమ్ము; పై ధ్వజం

బెత్తిన నెత్తనిమ్ము; వచియించెద గల్గిన మాట గట్టిగా;

న త్తరళాయతేక్షణ కటాక్ష విలాసరస ప్రవాహముల్

కుత్తుక బంటి తామరలకున్; దల మున్కలు గండుమీలకున్.ప్రవాహము పద్మమునకు మేడవరకున్ను, చేపలకు తల మునుగు నట్లూ ఉండడము సహజము. అదియే కలిగిన మాటయని కవి అభిప్రాయము. సుభద్ర కన్నులు పద్మాల కంటే చేపల కంటె అందముగా ఉంటాయన్న మాట గూడా కలిగిన మాటే అని చమత్కారము. పద్యములో ప్రాధాన్యము వహించిన ప్రవాహమును కవి కటాక్ష విలాస రసముతో నిర్మించు కున్నాడు. అంతకు ముందు పద్యం లో ఓరగా చూచినప్పుడు శృంగార రసము అపారముగా నుబ్బి జాలెత్తె నౌర అని వర్ణించిన శృంగార రసపు జాలు - ప్రవాహమే ఈ పద్యము నందలి కటాక్ష విలాసరస ప్రవాహము. ఇచ్చట అర్జునుడు విరహ స్థితిలో నుండగా, పాన్పు పై కొట్టుకలాడి ఏకాంతముగా చెలికత్తెలు లేని సమయంలో సుభద్ర అర్జునుని తలుచుకొని విరహవేదన పొంద నారంభించింది. ఆమె ఈ స్థితి రమ్యముగా వర్ణించాడు కవి.

తే|| వేగు నంతకు వలవంత వేగునంత,

నంతి పురమున బ్రమద వనాంతరమున,

గృష్ణా! కృష్ణా! అంటు నా కీరవాణి,

రామా! రామా! యటంచు నా రాజసుతుడు.ఈ సంధర్భమున చేమకూర వేంకట కవి రామ, కృష్ణ అను రెండు శబ్దములను అత్యంత చంత్కారముతో ప్రయోగించాడు. "రామ! రామ! యటంచు నా రాజసుతుడు, కృష్ణ కృష్ణ యటంచు నా కీరవాణి (3-25) విరహము ననుభవించిరి! పైపదాలలోని శ్లేషార్థము గమనించ దగినది. కాని ఈ వ్యాసం పొడవు దృష్టిలో ఉంచుకొని ఆ ప్రయత్నం విరమించడ మైనది. కాబట్టి విరహాన్ని తగ్గించుకొని వేగమే వివాహము వైపు పయనిద్దాం!

యతి వేష ధారి అర్జునుడని, అర్జునుడు, సుభద్ర ఒకరి నొకరు గాఢంగా ప్రేమించు కొనుటయే కాక విరహ వేదన అనుభవిస్తున్నారని అందరికీ (సుభద్ర చెలికత్తెలకు, రుక్మిణీ, సత్యభామలకు) తెలిసి పోయింది. అతఃపురంలో సుభద్రకు అనేక రకాల శైత్యోపచారాలు ప్రారంభించారు! ఈ పరిస్థితిలో కృష్ణుడు తల్లిని, తండ్రిని, తమ్ముడు సాత్యకిని, కుమారులను ఏకాంతముగా సమావేశ పరచాడు. వీరందరూ మొదటి నుండీ, సుభద్రార్జునుల వివాహము కోరిన వారే! బలరాముడే ప్రతికూలుడు. అతనికీ సంగతి తెలుస్తే ఈ పెళ్ళి జరగడం అసాధ్యమని, పెండ్లికి తగిన ఏర్పాట్లు రహస్యంగా జరిపించాలని అందరికీ తెలియ జెప్పాడు. త్వరలోనే జరుగ నున్న పసుపతి పూజా ఉత్సవ సమయంలో ఈ వివాహము జరుపుటకు తగిన సమయమని కృష్ణుడు సలహా చెప్పాడు. అది 24గు రోజుల ఉత్సవము. 8వ రోజున పెళ్ళి ముహూర్తము ఉన్నదనియూ, ఆరోజు సుభద్రార్జునుల వివాహము జరిపించుటకు అన్ని ఏర్పాట్లు చేయవలెనని తెలియజెప్పాడు. ఆడ పెళ్ళివారి పక్షమున దేవకీదేవి, మగ పెండ్లి వారి పక్షమున రుక్మిణీదేవి పెండ్లి పెద్దలై కార్య నిర్వాహణకు పూనుకొన్నారు.ఉ|| కట్టిరి మంచి లగ్నమున గంకణముల్ కర పంకజంబులన్

బెట్టిరి మేనులన్ నలుగు మేలి మృగీమద కుంకుమంబులన్;

జుట్టిరి కైశికంబుల విశుద్ధ మనోహర పుష్పమాలికల్;

పట్టిరి పేరటాండ్రు ధవళంబుల పాడుచు నుల్లభంబులన్.

అంతేకాక;

శా|| "ఇన్నాళ్ ప్రోది యొనర్ప గేళివనిలో నిం పొందు న మ్మాధవీ

పున్నాగంబుల పెండ్లి సేయవలె బూబోండ్లార! రారే!" యటం

చు న్నేర్పుల్ దగ నొండొరుం బిలిచి కొంచున్ సత్యభామాది వి

ద్యు న్నేత్రామణు లప్పు డిర్వురకు విందుల్సేసి రందందులన్.ఇన్నాళ్ళూ, మన ఉద్యాన వనములో పెరిగిన మాధవీలతకూ, పొన్న చెట్టుకీ పెండ్లి చెయ్యాలి రండమ్మా అని ఒకరి నొకరు పిలుచు కుంటూ సత్యభామాది యాదవ రాణులు సుభద్రార్జునులకు విందులు చేశారు!పద్యంలోని విశేషం: మాధవుడి సోదరి కనుక సుభద్ర మాధవి! పున్నాగము (పురుష గజము) అనగా పురుషులలో శ్రేష్ఠ మైనవాడు అర్జునుడు. అందువలన, మాధవీ, పున్నాగములని కాంతామణులు (సుభద్రార్జునలకు పెండ్లియని ఇతరులకు రహస్యము తెలియనీయ కుండానే) చమత్కరించారు! దీనినే కవి "నేర్పుల్ తగన్" అను మాట ద్వారా సూచించాడు! దీనినే అప్రస్తుత ప్రశంసాలంకార మంటారు.పనులన్నీ త్వరగా జరిగి పోతున్నాయి. పురోహితు నిర్ణయం సహితం జరిగింది.

క|| అంతర్వాణి పురోహితు

డంత వివాహోచిత క్రియా కాండం బా

ద్యంతము గావించుటకై

సంతసమున జేరి యున్న సమయమునందున్.ఈ వివాహ రహస్యమును పురోహితుడు గాపాడే వాడై యుండాలి. కాబట్టే "అంతర్ వాణి" లోపలి మాటల వాడు. అనగా బయట చెప్పని వాడు పురోహితుడని చెప్పడము చమత్కారం!

.

పెండ్లి పనులన్ని అత్యంత వేగంతో సాగపోతున్నాయి. పెండ్లికి రావలసిన పెద్దలు కూడా సిద్ధమవుతున్నారు.

చ|| “తనయుని పెండ్లి కేగవలె ధాత్రికి, దిక్కుల వారి నెల్ల దో

డ్కొని చనుదెమ్ము నీ” వని కడున్ గుఱి సేసి సురాధినాథు డ

వ్వనపతి కంపినట్టి శుభ వార్తల బంగరు గమ్మ చుట్ట నా

దినకర మండలం బపర ది గ్గిరి కూటము జేరె నయ్యెడన్.అష్టాదశ వర్ణనలోని సూర్యాస్తమయ వర్ణన కొరకు కథను ఆగనీయక మేళవించి చేమకూరకవి ఈ వర్ణన చేశాడు. భూమికి అన్నిదిక్కులా చుట్టి ఉండు వాడు కాబట్టి దిక్కుల వారినందరిని తోడ్కొని రమ్మని సముద్రుడినే ఇంద్రుడడుగుట ఎంతో ఉచితంగా ఉంది. అలాగే పెండ్లికి కావలస్సిన సామాను - మాణిక్యములు తాపిన పెండి చవికె, ముత్తెముల బాసికంబులు, మిక్తారుణుల తలంబ్రాలు, ఐరేని, కులదేవత, ఇవన్ని ఆనాటి వారి ఆచారములు తెలుపు తున్నవి. పెండ్లి ముహుర్తం దగ్గర పడుతున్నది. సుభద్ర మనసు ఆందోళన పడుతోంది.తే|| "తడవుసేసె; ముహుర్తంబు దగ్గరించె;

నేమొకో యన్న రా?" డని యెదురు చూడ

దనదు గారాబు జెలియలి మనసెఱింగి

మాట లోపల వచ్చె న మ్మాధవుండు.అలాగే - ఒకరి వెనుక ఒకరుగా సాత్యకి, సాంబుడు, ప్రద్యుమ్నుడు ఏదో ఒక నెపంతో అంతరీపము (ఉత్సవము జరుగుచోటు) నుండి ఏదో చెప్పి నేర్పుతో రహస్యమును కాపాదుతూ వారందఱూ వివాహ మండపమునకు విచ్చేశారు. అలాగే -

క|| హరి వచ్చు నంతలొ నా

హరియున్ జనుదెంచె దనయుడాత్మ దలంపన్

సుర లచ్చరలు మహర్షీ

శ్వరులు నరుంధతియు గురుడు శచియున్ గూడన్.కృష్ణుడు వచ్చు లోపల, ఇంద్రుడూ, దేవతలు, అచ్చరలు, వసిష్ఠుని భార్య అరుంధతి, బృహస్పతి, శచీదేవి అందఱూ విచ్చేశారు!

మ|| "సుముహుర్తం బిదె, లెం" డటంచు గురు దచ్చో దెల్ప దేవేంద్రుడుం

దమ దేశంబున నుండి తెచ్చిన సువర్ణ క్షౌమ కోటీరము

ఖ్య మణి భూషల తోడ బాసికము సింగారించి, మందార దా

మము కంఠంబున జేర్చి పెండ్లి కొడుకుం బ్రాగ్దంతి నెక్కించినన్.ఆచార ప్రకారం జీలకర్ర బెల్లము నుదుట పెట్టి అలంకరించి బాసికము కట్టడానికి ముహూర్త మంటారు. ఆ సమయంలో -

సీ|| ఉపరిభాగ నిరంత రోన్నమితము లైన

ముత్యాల గొడుగుల మొత్త మలర,

నుభయ పార్శ్వ ముహు ర్ముహు శ్చాలితము లైన

వింజామరల కలా పుంజ మమర,

గళ్యాణ వైభవ కర్ణేజపము లైన

తూర్య నాదముల చాతుర్య మొనర,

బృథుల ప్రదక్షి ణార్చి ర్మేదురము లైన

దివ్వటీల సమష్టి నివ్వటిల్ల,తే||నపుడు ప్రద్యుమ్నుడు, జయంతు డవల నివల

బసిడి బెత్తంబులను బరా బరులు సేయ

నడచి వచ్చిరి హరి పురందరులు మ్రోల

సంభ్రమంబున మంద హాసంబు దొలుక.సందు లేకుండా గొడుగులు కలిసి ఉన్నట్టు ఉండుట చేత మొత్తము అనీ వలయాకారముగా కదులు చున్న తెల్లని వింజామరలు చంద్ర రేఖల సమూహనీ, తూర్య నాదములు చెవినిల్లు కట్టుకొని వినవచ్చుననీ, కర్ణేజపములనీ, శుభ సూచకముగా ప్రదక్షిణార్చి అనీ ప్రయోగించడం చమత్కారము.ఆసమయంలో - చ|| "అనిమిష భావ మీ సమయమందు ఫలించె" నటంచు గోరికల్

వెనుకొన, బైన పైన పడి, యూర్వశీ విలా

సిని మొదలైన యచ్చరలు చెంతల జేరి, సహస్రదృ క్తనూ

జుని యొడలెల్ల గన్నులుగ జూచిరి మానసముల్ కరంగగన్."ఒడలెల్ల గన్నులుగ" అనునది జాతీయము. అలాగే ఒడలెల్ల నోరు, ఒడలెల్ల చెవులు, ఒడలెల్ల భక్తి అని వాడుకలో జాతీయములు కలవు. ఈ అప్సరసల అందరి కన్నులు అర్జునుని శరీర మంతటను లగ్నమయి అతని ఒడలంతా కన్నులయ్యెనని చమత్కారము.కొందరు పేరంటాండ్రు పెండ్లి పాటలు పాడుతూ సుభద్రను తీసుకొని వచ్చిరి. అప్పుడు అప్సరసలు ఆమె అందాన్ని చూచి తమలో తాము "మన మందఱము తిలోత్తమను చూచి ఆమె చాలా అందగత్తె అను కుంటాము. ఈ సుభద్ర ముందు ఆమె అందము తక్కువగా అనిపిస్తుంది" అని గుసగుసలుగా చెప్పుకున్నారు.ఆ నవ దంపతులను చూచి -

తే|| వేయు గన్నులు వలయు బో వీరి జూడ

నని కవుల్ దంపతుల చెల్వు వినుతి చేయ,

గాదు పదివేల కన్నులు గావలె నని

చూచు చుండె సహస్ర విలోచనుండు.సుభద్ర అతిలోక సుందరి. ఆమె అందచందాలు చూచుటకు, వేయి కన్నులు కావలెనని రెండు కన్నుల వారు అంటూ ఉంటే, వేయి కన్నులు కల్గిన ఇంద్రుడు పదివేల కన్నులు కావలెనని కోరుచున్నాడు!

కన్యాదానము కృష్ణుడు చేయదలచిన అడ్డగించు వారు ఎవరూ లేరు. అయినప్పటికీ ఆకార్యానికి వసుదేవుని నియమించి, తాను సమీపమున ఉండి ఇతర చుట్టములవలె ఆసక్తితో చూచుచున్నాడట కృష్ణుడు!

తే|| దేవకి యసంగ నా వసుదేవుడపుడు

చంద్రకాంతంపు గిండి గొజ్జంగి నీట

బసిడి పళ్ళెములో బాదాబ్జములు గడిగి,

తనదు మేనల్లునకు గన్యధార వోసె.

అలాంటిసమయాన:

చ|| పొలయలుకందు వేడుకొను పొందిక దెల్పెడి లీల సిగ్గు దొ

ట్రిలిన ముఖాబ్జమెత్తి, మెడక్రిందికి హస్త యుగంబు సాచి, వే

నలి దెమలించి, సౌఖ్య కలన స్థితి గట్టిగ బట్టి కట్టె న

వ్వెలదుక కంఠసీమ గురువీరుడు మంగళసూత్ర మయ్యెడన్.అర్జునుడు మంగళసూత్రం కట్టిన విధానము పై పద్యంలో వర్ణిత మైనది. పెండ్లి అత్యంత సంతోషదాయకంగా ముగిసింది. తర్వాత -

శా|| ఎంచంగా దగు నత్తమామలను దా నిల్వేల్పు లంగా మనః

ప్రాంచ ద్భక్తిని సాధ్వియందు; రది మీ పట్లన్ నిజం బయ్యె నే

డంచున్ జేరి శచీ పురందరుల కాహ్లాదంబుగా బల్కి మ్రొ

క్కించెన్ దేవకి యప్పు డర్థ హిమరుక్ బింబాలికన్ బాలికన్.శచీదేవి, ఇంద్రుడు సుభద్రకు కొత్తవారు కాబట్టి పాదాభివందనము చేయుటకు సంకోచిస్తున్న సమయంలో కూతురి సంకోచాన్ని గ్రహించిన దేవకి ఆలోపము కనబడనీయ కుండా, ఆశచీ పురంద్రులకు సంతోషము కల్గించే చక్కని మాట చెప్పుతూ సుభద్ర చేత నమస్కారం చేయించి, దేవకీదేవి సమయ స్ఫూర్తిని చక్కగా చిత్రించాదు చేమకూరకవి పై పద్యంలో అని వ్యాఖ్యానించారు తాపీవారు! అదివారి ఉపజ్ఞకు తార్కాణం! రాచవారలలోని మర్యాదలూ, అన్యోన్య ప్రశంసలూ నేర్పుతో వివరించారు వేంకటకవి.సుభద్రార్జునుల పెండ్లి వైభవోపేతంగా ముగిసింది. వియ్యాల వారితో వరుస వావులు, సరసాలు చక్కగా జరిగాయి. ఉచిత రీతిని సత్కారాలు జరిగిన పిమ్మట లాంఛనా యుక్తముగా వీడ్కోలు జరిపారు. నూతన వధూ వరులు ద్వారకలో ఉండుట శ్రేయస్కరము కాదని, బలరామునికి తెలిసిన ప్రమాదమని భావించి, వారిని ఇంద్రప్రస్థం వెళ్ళి అచ్చట మిగిలిన పెండ్లి కార్యకలాపాలు (నాగవల్లి వగైరాలు) జరుపుకొన వలసినదిగా చెప్పి ప్రయాణానికి సిద్ధపరచి, రథం, గుఱ్ఱాలు, వానితో పాటు ధనుర్బాణాలు సమకూర్చి కృష్ణుడు శివోత్సవములలో పాల్గొనుటకు తిరిగి పోతాడు. వెళ్ళేముందు జరిగిన వృత్తాతమంతా వివరిస్తూ ధర్మరాజుకు లేఖవ్రాసి దూతల ద్వారా తెలియ జేస్తాడు. అర్జునుడు ఇంద్రప్రస్థం చేరుకొనే రహస్య మార్గం సూచిస్తాడు.అర్జునుడూ, సుభద్ర రథాన్ని ఎక్కి, ఇంద్ర ప్రస్థానికి ప్రయాణమవుతారు. ఈ విషయం పౌర రక్షక యదు వీరులకు తెలుస్తుంది. వారు అర్జనుని రథాన్ని అడ్డగిస్తారు. వారి మధ్య యుద్ధం జరుగుతుంది. తనకు యుద్ధనిపుణత, రథ సారధ్యం తెలుసునని, తను అర్జునునికి సహాయ పడతానని సుభద్ర అర్జునునితో చెబుతుంది. ఆమె మాటలకు అర్జునుడు చిరునవ్వు వవ్వి, ఆమెతో నేనెవరినో తెలుసు కదా? యుద్ధంలొ నీవు కలుగ చేసుకొన వలసిన ఆవశ్యకత లేదని చెప్తూ, ఆమెను సంతోష పరిచే నిమిత్తం, రథ సారధ్యం చేయమంటాడు. యుద్ధంలో గెలుస్తాడు. ఒకవైపు యుద్ధం చేస్తూనే, మరో వైపు సుభద్ర సారధ్య నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ, ఆమె వైపే తన దృష్టి కేంద్రీకరిస్తాడు! అయినప్పటికీ, యదు వీరులు ఆయన ముందు నిలువ జాలక, తలో వైపు పలాయనం చేస్తారు. అర్జునుడు గొప్ప వీరుడని ద్వారకలోని ప్రజలంతా చెప్పుకొంటారు. ఆ మహావీరుడు సుభద్రకు తగిన వరుడని అందరూ సంతసిస్తారు!

ఈ ఘట్టంలో చమత్కారయుక్తములైన పద్యాలు ఎన్నో రచించారు కవి. ప్రతి పద్యమూ విశ్లేషణాత్మక వివరణకు యోగ్య మైనదే. పద్యాల్లోని సొగసులు విశదపరచారు ధర్మారావుగారు! అది హర్షించదగిన విషయం.సుభద్రార్జునుల రాక ముందుగానే తెలిసికొన్న ధర్మరాజు వారిని ఉచిత రీతిని ఇంద్రప్రస్థాననికి ఆహ్వానించడానికి నకుల సహదేవులను నియమిస్తాడు. నవదంపతులు ఔపచారికంగా ఇంద్రప్రస్థం ప్రవేశిస్తారు.ద్వారకలో పరిస్థితి విషమిస్తుంది. విషయమంతా తెలుసుకొన్న బలరాముడు క్రోధితుడైనాడు. వంచెన చేసినందుకు తగిన శాస్తిచేస్తానని, "వాని రేకు మడంతు" నని కఠినముగా మాట్లాడుతాడు! అప్పుడు కృష్ణుడు అన్నగారితో మాట్లాడుతూ, అర్జునుడు ఒకవిధంగా తప్పుపనే చేశాడని, అన్నగారి కోపము సమంజసమే నని, అంతేకాక, బలరాముని యుద్ధ కౌశల్యము ముందు నిలబడ గలిగిన వీరులు చాలా తక్కువ మంది గలరని, అయినప్పటికీ, ద్రోణ శిస్యుడైన అర్జునుని శక్తిని తక్కువగా అంచనా వేయజాలమని, అన్నీ జరిగి పోయిన తర్వాత, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళుట బంధుత్వాన్ని చెఱపుటకన్నా మరో ప్రయోజనము లేదని, మీదు మిక్కిలి సుభద్రార్జునులు ఒకరినొకరు ప్రేమించుకొని అలాంటి విధానాన్ని పాటించారని, అన్నగార్కి నచ్చజెప్పి శాంతింప జేస్తాడు. విశేష మేమంటే బలరాముడు ఎప్పుడూ తమ్ముని మాటకు ఎదురాడడు!అందఱూ కలిసి ఇంద్రప్రస్థ పురానికి వెళ్ళుట, వారిని అత్యంత గౌరవ మర్యాదలతో ధర్మరాజు ఎదురు వచ్చి లాంఛనప్రాయంగా, రాజలాంఛలానలతో ఆహ్వానించుట జరుగుతుంది. ఇంద్రప్రస్థంలో మరలా అయిదు రోజుల వివాహ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. అంతా సంతోషకరంగా ముగుస్తుంది. బలరామ కృష్ణులు కుటుంబ సభ్యులందరితో ద్వారకకు తిరిగి వస్తారు.సుభద్రార్జునులు అత్యంత ఆనందముతో కాలము గడుపుతారు. పడకటింటి కార్య కలాపాలు వర్ణించుటలో ఇద్దరు కవులు ప్రఖ్యాతి వహించారు. వారిలో పింగళి సూరన ప్రభావతీ ప్రద్యుమ్నము లోను, చేమకూరకవి విజయవిలాసము లోను ఈ విద్యలో పునాదులు వేసి మేడలు కట్టినవారిగా ప్రసిద్ధి కెక్కారు. ఆ కారణాన ఈ ఘట్టంలో అత్యంత శృంగార భరిత మైన పద్యాలు చాలావున్నవి. వాటిలో చమత్కార విశేషాలను, సొగసులను విపులంగా విశ్లేషించి పాఠకుల అభిమానాన్ని దోచుకున్నారు మన తాతాజీ!కాల చక్రము అతి త్వరిత గతిని సాగి పోయింది. సుభద్ర గర్భవతి అయింది. ఆమెకు కొడుకు పుట్టాడు. ద్వారకకు వర్తమానం పంపించారు. అచ్చటి నుండి కృష్ణుని పరివారమంతా ఇంద్రప్రస్థ పురానికి వచ్చి చేరారు. పుత్రోత్సవాలు చక్కగా జరిగాయి! పిల్లవానికి అభిమన్యుడని పేరు పెట్టారు. అభిమన్యుడనగా శోకము లేనివాడు. అభిమన్యుడు పెరిగిన విధానాన్ని కవి వర్ణించిన తీరును గమనించండి.!తే|| కువల యాక్షులు పెనుచు మక్కువల వలన

నేట బెరిగెడువా డొక్కపూట బెరిగి,

మెల్ల మెల్ల శైశవమెల్ల జాఱ

నందె యౌవన మా రాజ నందనుండు.సుభద్ర చెలికత్తెలు చూపిన మక్కువ వలన, ఒక సంవత్సరములో పెరిగెడు వాడు ఒక్కపూటలోనే పెరిగాడట! ఒక్క సంవత్సరములో పెరిగినంత ఏపుచూపుతు, శైశవము కంటి కానరాకుండా జరుగుట వలన - జారినట్లుగా చెప్పబడినది. అంటే ఆరాజకుమారుడైన అభిమన్యుడు అచిరకాలంలోనే యౌవను డయ్యాడట. అతిశయోక్తి అలంకారాన్ని ఉపయోగించి కవి కాల గమనాన్ని కనిపించని విధాన నడిపాడు!

అంతేకాదు అభిమన్యుడికి విద్యా బుద్దులు ఏ విధంగా లభించాయో గమనించండి:సీ|| మను మార్గమున భూమి మను మార్గ మంతయు

స్థిర బుద్ధిగల యుధిష్ఠిరుడు తెలుప,

బాటవవ ద్వైరి పాటన క్రమ మెల్ల

దల వర్జితుడు వృకోదరుడు తెలుప,

రంగ దుత్తుంగాధిరోహ ము

ద్దండబాహుడు నకులుండు తెలుప,

సురభి రక్షణ కీర్తి సురభిళ దిఙ్మండ

లుం డగు త జన్ముండు తెలుప,

తే|| వివిధ కోదండ పాండిత్య విలసనంబు

తానె తెలుపంగ నేర్చిన తనయు డెపుడు

సేవ సేయగ సంతత శ్రీ వెలుంగ

విజయు డలరారె శాశ్వత విజయు డగుచు.అయిదుగురు తండ్రులు అయిదు విద్యలు నేర్పగా అభిమన్యుడు సేవ చేయుచుండ అర్జునుదలరారె (ప్రకాశించె) అనిభావము. ఈ విధంగా ముగిస్తాడు ఈ శృంగారరస భరిత విజయవిలాస కావ్యాన్ని.

ఏ కావ్యము లోనైన 10, 20, చక్కని చమత్కార మున్న పద్యాలుంటే, పండితులే గాక, సామాన్య పాఠకులు కూడా సంతోషించి, ఆకావ్యాన్ని ప్రశంసిస్తారు. విజయవిలాస కావ్యములో ఉన్నటువంటి దాదాపు 600 పద్యాలలో అత్యధిక భాగం చంత్కార యుతములే! ఈ కావ్యములో విశి ష్ఠతను సమగ్ర రూపంలో పాఠకుల ముందుంచి, పండితుల దృష్టిని ఈ కావ్యం వైపు మరల్చడమే ఈ వ్యాఖ్యాత ప్రధానోద్దేశం. ఆ ప్రయత్నంలో పూర్వ వ్యాఖ్యాతల పద విశ్లేషణ విధానానికి మెరుగు బెట్టుత యేగాక, ఆవ్యాఖ్యాతల దృష్టి నాకర్షించని పలు విషయాలపై చర్చించారు నూతన విషయాలను చొప్పించారు "హృదయోల్లాసవ్యాఖ్య" కర్త ఆంధ్ర విశారద తాపీ ధర్మారావు గారు. దాదాపు రెండు దశాబ్దాల పరిశోధనా - పరిశిలనా, పరిశ్రమ ఫలితం ఈ "హృదయోల్లాసవ్యాఖ్య". ఇలాంటి బృహత్కార్యాన్ని సాధించి నందుకు వారికి తెలుగు వారు ఋణపడి యున్నారు.

ప్రముఖుల మాటల్లో:

"విజయవిలాస కావ్యమున వేంకట సత్క వి చూపినట్టి య

క్కజమగు నంది యంద ని యొకానొక చందపు పల్కుటందముల్

నిజములు విప్పి చెప్పితివి నేర్పు దలిర్పగ నీదు వ్యాఖ్యది

గ్విజయము గాంచు గావుత వివేక విధానము ధర్మరాట్కవీ"

కళాప్రపూర్ణ త్రిపురాన సూర్యప్రసాదకవి.

"చతురమగు వేంకట రాయ బుద్ధి

కంద నట్టి యందములు నీదు వ్యాఖ్య జూపి

చూపినాడవు మాకు నీ సూక్ష్మ బుద్ధి

ఔర! ఆంధ్ర విశారదుం దగుదవీవు"

మహామహోపాధ్యాయ ఆచంట సాంఖ్యాయనశర్మ.

ముగింపు: నిఘంటు వులు, నిర్వచనాలు అవసరం లేకుండా ఆంధ్ర జనసామాన్యానికి సుళువుగా అర్థమయ్యే తెనుగు భాషను "జానుతెనుగు" అనిపేర్కొన వచ్చును. దీనిలో మారుమూల పదా లుండవు. సంస్కృత పదాలైన, మరే ఇతర భాష పదాలైన, తెలుగులో ప్రవేశించి, తెలుగు పదాలతో కలిసి పోయి, తెలుగు మాటల క్రిందనే చలామణి అవుతున్న పదాలు కూడా "జానుతెలుగు" లో ఉంటాయి! ఈ దృష్టితో పరిశీలిస్తే, చేమకూర వేంకటకవి విజయవిలాసంలో ఉపయోగించిన భాష జాను తెనుగే! తాను వివరిస్తున్నది ఎటువంటి సున్నితమైన సన్నివేశమైనా, ఎంత క్లిష్టమైన సంఘటనైనా, ఏరసమైనా, ఎలాంటి మనః పరిమాణమైనా, "వీరస పోకుండా ఈ జానుతెలుగులోనే "వాసించే" (భావించే) కవిత్వం చెప్పి, కవిత లోని పటుత్వాన్ని అద్భుతంగా లోకానికి ప్రకటించారు. కొన్ని రకాల భావాలను తెలుగులో వ్యక్త పరచ లేమన్న అభిప్రాయం కలిగిన పండితులకు తెలియ పరచి ఒక గొప్ప విజయాన్ని సాధించాడు విజయవిలాస కావ్యకర్త చేమకూర వేంకటకవి. ఇది అందరికి గర్వ కారణం. ఈ కవి కవితను చదివి ఆనందించాలని ఆశిస్తూ ఈ వ్యాసం ముగించడ మైనది.