Friday 10 January 2014

Misramanjari (మిశ్రమంజరి)

ప్రవేశిక:
అవి దేశం ఉద్యమాల ఉప్పెనలో ఊగిసలాడుతున్న రోజులు! ఒక వైపు స్వాతంత్రోద్యమము, మరోవైపు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమము, మూడవ వైపు సంఘ సంస్కర ణోద్యమము, నాల్గవ వైపు నవ్య కవితోద్యమమూ! - అలాంటి వాతావరణంలో ప్రారంభ మయింది రాయప్రోలువారి సాహిత్య ప్రస్థానం. సాహిత్యంలో అది ఒక విధమైన అస్పష్ట యుగంగా భావించవచ్చు.



రచనల్లో ప్రబంధ యుగంలోని శృంగార ప్రాముఖ్యం, పాండిత్య ప్రకర్ష బలంగా వ్యక్త మవుతూనే వుంది. ఆనాటి (19వ శతాబ్దం) కవిత్వం ఒక నిర్ణీత మార్గమంటూ లేక, దిశాహీనమై, అన్ని వైపులా పరుగులెత్త సాగింది! ఆ స్థితిలో, ఒక నూతన పంథాను చేబట్టి, అధునాతన భావజాలంతో కవిత్వానికి ఒక కొత్త విధానాన్ని రూపొందించినవారు ఆచార్య రాయప్రోలు సుబ్బారావు గారు. అప్పట్లో రాయప్రోలు వారు ప్రారంభించిన కవితా విధానాన్ని అభినవ కవిత అని పిలిచారు. తర్వాత, తర్వాత ఆ కవితా రీతినే భావకవిత్వమని వ్యవహరించారు. ఆ కొత్త పద్ధతికి ఆద్యుడు శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారని విజ్ఞుల అభిప్రాయం.



రాయప్రోలు వారి దేశ భక్తి గీతాలు కవితావేశంతో పాటు అత్యంత మాధుర్యం నిండియుండుట వలన ఎక్కువ ప్రచారాన్ని పుంజుకొన్నాయి. వారి ఇతర కావ్యాలు తా త్త్విక చింతనతో కూడినవి కాబట్టి సామాన్యులు అవగాహన చేసుకొనుటలో కొంత కష్టం ఉండవచ్చు. అందుకే ప్రజా బాహుళ్యం దేశభక్తి ప్ర బోధ కవిగా వారికి పట్టం కట్టింది! తెలుగు దేశం, తెలుగు భాష, తెలుగు సంస్కృతి వీరిని ఆవహించి కావ్యాలన్నింటినీ తెలుగు దనంతో నింపింది. తెలుగు భాష తియ్యదనం, తెలుగు జాతి ఔన్న త్యం వీరి కావ్యాలలో గోదవరిలా ప్రవహిస్తుంది. అంతేకాదు, నిత్య వ్యవహారము లోని సామాన్య పదాలను, లోకోక్తులను, ప్రయోగించి కవిత్వానికి ఎనలేని ఆకర్షణ సృష్టించారు రాయప్రోలు వారు. వైదిక సాంప్రదాయానికి సంబంధించిన పదజాలాన్ని కూడా ఎక్కువగానే ప్రయోగించారు. రాయప్రోలువారి కావ్యాలలో వాడుక భాష, వైదిక భాషా, రెండూ సమాన వేగంతో పయనిస్తాయి. రాయప్రోలువారు సాంప్రదాయ సిద్ధాంతాలను అభిమానిస్తారు. అందుచేత వీరి కావ్యాలలో ఆ ప్రభావం మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మన ప్రబంధాలలో వ్యక్తమయ్యే శృంగార వర్ణనలు వీరికి సమ్మతం కాదు. అలాగని ప్రేమకు వ్యతిరేకి కారు. వారి రచనలలో స్త్రీలోని వాత్సల్యాది అమృత గుణాలకు ప్రాముఖ్యత కనిపిస్తుంది. వారి కావ్యాలలో మనకు పరి పూర్ణమైన స్త్రీరూపం దర్శన మిస్తుంది. మరో ముఖ్య విశేషం రాయప్రోలువారి ఛందోరీతుల లోని విశిష్టత. రాయప్రోలువారు పాటించిన విధానం గతి గమనాన్ని, లయ విన్యాసాన్ని సాధించడమే గాక, భాష, భావాలు, భావాభివ్యక్తన లాంటి విషయాలలో వారి ఉక్తి వైచిత్రి కవిత్వానికి నూతనత్వం సమకూరుస్తుంది. నవ కవులకు భాష కంటే మరో తపస్సు లేదని వీరి అభిప్రాయం. తెలుగు లోని మాధుర్యాన్ని ఎవరికి వారు చవి చూడ వలసిందే గాని - "ఎదుటి వారికి మాటల్లో ఆ రసాను భూతిని అభి వ్యక్త పరచుట అతి కష్టం" అంటారు రాయప్రోలువారు.



1909 లో "లలిత" తో మొదలయిన రాయప్రోలు వారి "సాహితి ప్రస్థానం" దాదాపు అర్థ శతాబ్ధం పాటు అత్యంత స్ఫూర్తితో సాగింది. ఈ సుదీర్ఘ కాలంలో రాయప్రోలు వారి తెనుగు తోటలో అనేక పువ్వులు పుష్పించాయి. కొన్నిటి పరిమళాలు భారత దేశంలోనే కాక, ఖండాంతరాలకు ప్రాకి పోయి "శాశ్వత సౌరభాలు వెదజల్లు తున్నాయి". రాయప్రోలు వారి రచనలలో అత్యంత ప్రసిద్ధి కెక్కిన కొన్ని రచనలను గూర్చి సంక్షిప్తంగా తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. విజ్ఞులు ఈ వివరణను కేవలం పృష్ఠ భూమిగా పరిగణిస్తారని ఆశిస్తాను.

రాయప్రోలు వారి రచనలు:

ఆచార్య రాయప్రోలు సుబ్బారావు గారు తమ కవితా జ్యోతితో సాహిత్య రంగాన్ని తేజోవంతం చేశారు. అనేకమంది నవ కవులకు మార్గదర్శకు లైనారు. భావ కవిత్వ విధానానికి వీరిని "పితామహులు" గా పేర్కొంటారు. భావ కవిత్వంలో అనేక శాఖలు రూపొందాయి. వాటిని ప్రణయ కవిత్వం, ప్రకృతి కవిత్వం, దేశభక్తి కవిత్వం, సంఘ సంస్కరణ కవిత్వం, భక్తి కవిత్వం, స్మృతి కావ్యాలు అనే ఆరు శాఖలుగా వ్యవహరిస్తారు. రాయప్రోలు వారిని కొందరు విమర్శకులు నవ్యకవితా యుగకర్తగా పేర్కొంటారు. అయితే ఈ విషయమై సాహితీ రంగములో భిన్నాభిప్రాయాలున్నవి. ఏది ఏమైన, రాయప్రోలు వారి రచనల ప్రభావం ఎవ్వరూ తగ్గించ ప్రయత్నించ లేదు. మీదు మిక్కిలి వారి కావ్యాలు చదివి ఆనందించిన వారు ఆంధ్రదేశ మంతటా వ్యాపించి ఉన్నారు. వారి ప్రసిద్ధ రచనలను కొన్నింటిని పరిశీలిద్దాం!

లలిత: ఈ రచనను తమ "తొలితొడిమ" గా పేర్కొన్నారు ఆచార్యుల వారు. "లలిత" 1909 లో ప్రచురిత మైనది. గ్రంథ సారాంశము: వియోగ దుఃఖములో నున్న ఒకానొక వ్యక్తి (పాంథుడు) అడవిలో తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతున్న కొంత సేపటికి అతనికి (పాంథునికి) ఒక ముని ఆశ్రమం కనిపిస్తుంది. అతడచ్చటికి వెళ్తాడు. ముని అతనిని పలుకరిస్తాడు. విచారముతో వున్న పాంథుని మంచి మాటలతో ఊరడించి ఆశ్రయ మిస్తాడు. మరుసటి రోజు ఉదయం ముని పాంథుని రూపలావణ్యాలు చూచి ఆకర్షింప బడతాడు. అతని విచారానికి కారణం అడుగుతాడు. అప్పుడు పాంథుడు తను జనపాలుడనే రాజు కూతురినని, తను మనసారా ప్రేమించిన సత్య వర్థనుడను యువకుడు నిరాశతో అరణ్యాల పాలైనాడని తెలుసుకొని, అతనిని వెతుకుతూ పురుష వేషంలో తిరుగు తున్నానని చెబుతుంది. సంభాషణ ద్వారా ఆ మునియే సత్య వర్థనుడని తెలిసి పోతుంది. అంతటితో కథ సుఖాంతం గా ముగుస్తుంది! "లలిత" ఇంగ్లీషులో ప్రచురితమైన "హెర్మట్" (Oliver Goldsmith’s Hermit) అనే రచనకు అనువాదమని పేర్కొన బడినది. అనువాద మైనప్పటికీ, అది చదివిన వారికి అది స్వతంత్ర కావ్యమనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఈ పంక్తిని గమనించండి -

"హారము భారమై వన విహార సమాప చయ ...

తొలగె రథాంగ దంపతుల ... వనితా రత్నము - దాప నేటికిన్ ...".

ఇలా సాగుతుంది "లలిత" కావ్యంలో చాలాభాగం. దీని శైలిని బట్టి చూస్తే, మనుచరిత్ర, వసు చరిత్రల ధోరణి లో సాగుతున్నట్ల నిపిస్తుంది!

అనుమతి: ఈ కావ్యం ఆంగ్లములో టెన్నిసన్ రచించిన "డోరా" కు అనువాదం. రాయప్రోలు వారు "డోరా" పాత్రను "అనుమతి" గా మార్పు చేశారు. ఇది కూడా ఒక విధమైన భగ్న ప్రేమికుని కథ. అనుమతిని పెండ్లి చేసుకొన వలసిన యువకుడు వేరొకరిని వివాహం చేసుకుంటాడు. కాని, అతడు ఎక్కువ కాలం జీవించడు. విధి వశాత్తు మరణిస్తాడు. విశేష మేమిటంటే అతని భార్యా పిల్లలను పోషించు నిమిత్తమై "అనుమతి" త్యాగం చేస్తుంది. ఈ కావ్యంలో రాయప్రోలు వారు స్త్రీలోని త్యాగ భావాన్ని హృద్యమంగా చిత్రిస్తారు. ఈ పుస్తకం 1910 లో ప్రచురింప బడినది.

కష్టకమల: ఈ కావ్యం లోని వస్తువు యెక్కడో జరిగిన విషయమే! ఎవరో కథగా చెప్పు కొనగా రాయప్రోలు వారు విని దీనిని రచించినట్లు తెలియు చున్నది. "పూర్ణ" అనే ఇల్లాలు తన పొరుగింట్లో ఉంటున్న వారి అబ్బాయి "కుమారుడు" అనే బాలుని పెంచుకుంటుంది. కమల అనే మరొక అమ్మాయికి పూర్ణ మేనత్త. వాండ్ల ఇండ్లు దగ్గరగానే ఉంటాయి. కమల, కుమారుడు స్నేహితులగా ఒకరితో ఒకరు పరిచయ మవుతారు. పూర్ణ వారి స్నేహం పెంచే విధంగా వ్యవహరిస్తుంది. కొంత కాలానికి కుమారుడు చదువులకై పట్టణానికి వెళ్తాడు. అతనికి కమలపై వాంఛ కల్గుతుంది. తన ప్రేమను తెలియ జేస్తూ కమలకు ఉత్తరం వ్రాస్తాడు. కమల పసిపిల్ల కావటం మూలాన ఆమెలో కుమారుడి పై సోదర భావమే గాని ప్రణయ వాంఛ అంకురించదు. హఠాత్తుగా పెండ్లి విషయం ఆమెకు అర్థం కాదు. ఆలోచనలతో అన్యమనస్కంగా ఉయ్యాల ఊగుతూ పడిపోయి మరణిస్తుంది. సోదర సోదరీ ప్రేమ ఉన్నచోట కామం ప్రవేసింప జాలదన్న భావాన్ని రాయప్రోలు వారు రమ్యంగా తీర్చి దిద్ది కథను విషాదాంత కావ్యంగా ముగిస్తారు. ఇది వారి తాత్విక దృష్టికి నిదర్శనము. ఈ పుస్తకం 1909-1912 మధ్య కాలంలో ప్రచురిత మైనట్లు తెలియు చున్నది.

తృణకంకణము : ఈ కావ్యం 1913వ సంవత్సరంలో మొదటిసారి మద్రాసులో అభినవ కవితా మండలి వారు అచ్చువేసి నట్లు పేర్కొన బడినది. ఆ కాలంలో ఒకే సంవత్సరంలో మూడు ముద్రణలు పొందిన పుస్తకం ఇదే. "తృణకంకణం" అనే ఈ ఖండ కావ్యం అత్యంత మేధావిగా ప్రసిద్ధి కెక్కిన శ్రీ కట్టమంచి రామలింగా రెడ్డి గారి దృష్టిని అమితంగా ఆకర్షించిందని,వారు స్వయంగా రాయప్రోలు వారిని పిలిపించి కావ్యాన్ని చదివించుకొని విన్నారని, ఎంతో ఆనందించారని చెప్పబడినది. అది రాయప్రోలు వారి కవిత్వ పటుత్వాన్ని వివరిస్తుంది! ఈ పుస్తకాన్ని దాదాపు ఐదు విశ్వవిద్యాలయాలు పాఠ్య గ్రంథంగా ఎన్నుకొన్నారంటే ఈ గ్రంథ ప్రాశస్త్యాన్ని ఊహించ వచ్చు! చదువూ, సాంప్రదాయం వున్న కుటుంబం లో పుట్టి, అదుపాజ్ఞలలో పెరిగిన యువతీ యువకులను పాత్రలనుగా ఎంచుకొని రచించిన కావ్యం "తృణకంకణం". "అంటీ అంటక పచ్చని తృణ పత్రమును అందగించిన అచ్ఛజల కంకణము వలె కృతిలో సుతి మెత్తని సుహృత్కరణీయము జరిగింది. అందువల్ల దీనిని "తృణకంకణ" మంటిని" అని పేర్కొన్నారు రాయప్రోలు వారు తృణకంకణము గూర్చి ప్రస్తావిస్తూ. కావ్యం ఒకవిధమైన నాటకీయ పద్ధతిలో మొదలవుతుంది! మండు టెండలో ఓ పదునాల్గేళ్ళ బాలిక నడచి పోతుడటంతో కావ్యం ప్రారంభ మవుతుంది. అదే సమయంలో ఒక యువకుడు విచార గ్రస్థుడై, బరువైన హృదయంతో తనలో తాను ఏదో మాట్లాడు కొంటూ చేనుకంచె దాటుతుంటాడు. ఆ సమయంలో యువతీ యువకు లిద్దరూ కలుసుకొని చేతితో చేయి కలుపుకొని కుశల ప్రశ్నలు వేసుకుంటారు. వారిద్దరూ ప్రేమికులు. ప్రేమించుకొన్న తరువాత ఒకరి కొకరు దూరమవుతారు. ఆ అమ్మాయికి వివాహమై, సంసార బంధం లో కట్టుబడి పోయింది. ఆ కుర్రాడు మాత్రం ఆ అమ్మాయిని మరువలేక వివాహానికి విముఖుడై ఏకాంత జీవితం గడప నిశ్ఛయించు కొంటాడు. ఆ విషయం తెలిసిన ఆ యువతి మనో క్లేశానికి లోనవుతుంది. వారి స్నేహాన్ని పురస్కరించుకొని మిత్రునికి హితబోధ చేస్తుంది. "కలిసిన యంతనే చెలి కారము కాదని", "అంతరంగంబుల నతుకంగ జాలిన అపూర్వపు లంకెయె స్నేహ మౌనని వివరిస్తుంది. అతడిలో మార్పు తెస్తుంది. వారి ప్రేమ చిహ్న మైన పట్టు తోరాన్ని విప్పి, పవిత్ర స్నేహానికి గుర్తుగా తృణకంకణాన్ని తొడుగుతాడు. ఆ అమ్మాయి కూడా తన చేతి నుండి ఒక ఉంగరాన్ని తీసి అతనికి తొడుగుతుంది. ఈ సంఘటనను కవితలో వివరిస్తూ –

"కడిగిన మృగమద పాత్రిక

విడువని పరిమళము పగిది విధి నియమములన్

విడబడియును వారల పెం

పుడు మైత్రి ప్రేమ బంధములు తెగవవురా!"

అని ముగిస్తారు అద్భుతంగా కావ్యాన్ని ఆచార్య రాయప్రోలు వారు! ఈ కావ్యం సుప్రసిద్ధమైన వారి అమలిన శృంగార సిద్ధాంత తత్వాన్ని ప్రబోధిస్తుంది. "తృణకంకణం ఆ (రాయప్రోలు వారి) అభినవ కవితకు అంకురారోపణమే. అక్కడి నుంచి పూర్ణావతారం పొందిన రాయప్రోలు కవితే భావకవిత్వయుగ మహావాహినిక మూల స్రోతస్సు". అంటారు శేషేంద్ర శర్మ.

స్నేహలత: ఆ కాలం లో అంటే (1913-1914) ప్రాంతంలో ఆంధ్రదేశంలో వరకట్న దురాచారం ప్రభలంగా ఉండేది. ఈ దురాచారానికి ఒక అమాయకురాలు బలికావటం "స్నేహలత" అనే ఖండ కావ్యానికి ఇతివృత్తం. వార్తా పత్రికలో 14 సంవత్సరాల స్నేహలత బలికావడం ఫోటోతో సహ ప్రకటిత మైనది. కట్నాలు ఆశించిన వరునికి కట్నాలు ఇవ్వలేని తన తండ్రి పేదరికానికి బాధ పడిన స్నేహలత అగ్నికి ఆహుతి అయినట్లు ఆ వార్త సారాంశము. అది చదివి రాయప్రోలు పొందిన స్పందన "స్నేహలత" కావ్య రచనకు దారి తీసింది. "జ్వర పీడితుడనై యుండి నేనీ యుదంతము చదివితిని. చాలా వరకు జ్వరముతోనే దీనిని వ్రాసితిని ... ఆ లేఖను యథా తథంగా ఛందోబద్ధము గావించితిని. ... అనురక్తితో నాలించి స్నేహలతాదేవి పవిత్ర కృతిని ప్రచురణ చేయు అవకాశమును కల్పించిన శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతుల గార్కి కృతజ్ఞతా పూర్వక వందనములు" అంటారు రచయిత స్నేహలత ఖండ కావ్యాన్ని గురించి ముచ్చటిస్తూ.

తెనుగుతోట: తెలుగు దేశం లోని ప్రకృతిని కన్నులకు కట్టినట్లుగా చిత్రించిన ఖండ కావ్య సంపుటి తెనుగుతోట. ఇందులో "ఆవాహన", "గీతా సఖి" వంటి కవితా ఖండిక లున్నాయి. ఆవాహనలో సెలయేరు, మనసుకు ఆహ్లాదాన్ని గూర్చే తోటలు, చెంగు చెంగున గంతులేసే లేళ్ళు, రకరకాల పువ్వులు అత్యద్భుతంగా వర్ణించ బడినవి. గీతా సఖిలో "గీత" అనే పదాన్ని రెండర్థాలు వచ్చే విధంగా - అంటే "పాట" అని, భగవద్గీత - అని ప్రయోగించారు రాయప్రోలు వారు. పరపాలనను విమర్శిస్తూ కొన్ని ప్రబోధాత్మక కవితలు ఈ కావ్యంలో పొందు పరచారు. రాయప్రోలు వారు ప్రకృతి వర్ణనకు బాపట్ల పరిసరాలు పృష్ఠ భూమిగా ఉపకరించాయి. తెనుగుతోట కవితా సంపుటిని 1914 లో ప్రచురించారు.

మాధురీ దర్శనమ్: ఇది నవ్యాంధ్ర కవిత్వ లక్షణాలను ప్రధానంగా చర్చించిన లక్షణ కావ్యం. దీనిలో ముఖ్యంగా "భావము", "రసము", స్త్రీపుంస యోగము మొదలయిన విషయాలను గూర్చి పూర్తి వివరణ పొందు పరచారు రచయిత. ఈ కావ్యం చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారికి అంకితం చేయ బడింది. దీనిని 1949 లో రచించారు రాయప్రోలు వారు.

రమ్యాలోకమ్: ఇది 40 పుటల చిన్న కావ్యం. ఇందులో నవ్య కవిత్వ తత్వానికి సంబంధించిన అనేక విషయాలు చర్చించారు ఆచార్య రాయప్రోలు. దీనిని నవ్య సాహిత్య పరిషత్తు, గుంటూరు వారు ప్రచురించారు. ఈ కావ్యం "మామిడి కొమ్మ మీద ..." అనే పద్యం తో ముందుగా వాల్మీకి మహాకవిని ధ్వన్యాత్మకంగా నమస్కరించి, మరో పద్యంలో కాళిదాస మహాకవిని స్మరించి ప్రారంభించారు. ఆనంద వర్ధనుని ధ్వన్యాలోకము మీద వున్న అభిమానముతో ఈ కావ్యానికి "రమ్యాలోకమ్" అని పేరు పెట్టారు రాయప్రోలు వారు. భాష గొప్పదనము, కవుల గొప్పదనము, కవికీ, లాక్షణికునికి భేధాలు, ఆధునిక కవిత్వ లక్షణము, స్నేహ, వాత్సల్య, శృంగార రస స్వరూపము, ఆనంద లక్షణము లాంటి ఎన్నో కవిత్వ లక్షణాలను విపులంగా చర్చించారు రచయిత రాయప్రోలు వారు. అంతేకాదు, వేదాంత లక్షణాలు కూడా చర్చించారు ఈ కావ్యంలో. రమ్యాలోకమ్ లోనే మధుర మధురం బయిన తెన్గుభాష అంటూ మాతృభాష తెనుగు పై తమ అభిమానాన్ని వ్యక్త పరచారు.

రాయప్రోలు వారు తమ దీర్ఘ సాహిత్య ప్రస్థానంలో అనేక రచనలు చేయుటయే గాక మహాకవిగా కీర్తి ప్రతిష్ఠ లార్జించారు. ఉస్మానియా, తిరుపతి విశ్వ విద్యాలయాల తెలుగు ఆచార్య పీఠాన్ని అలంక రించి ఆయా విభాగాలను అత్యంత దక్షతతో నిర్వహించి వేల కొలది శిష్యులను తయారు చేశారు. పలు సంస్థల నుండి సన్మానాలు, బిరుదులు అందుకొన్నారు. ఒక గొప్ప సాహిత్య వేత్తగా ఆదర గౌరవాలందు కొన్నారు. వారు 1963వ సంవత్సరం లో ప్రచురించిన "మిశ్రమంజరి" అనే కావ్య సంపుటికి సెంట్రల్ సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ వారి ప్రతిష్టాత్మక మైన జాతీయ పురస్కారం 1965వ సంవత్సరానికి "మిశ్రమంజరి" కావ్యం అందుకొంది. "మిశ్రమంజరి" లోని విశేషాలను పాఠకుల ముందుంచడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. విజ్ఞులైన పాఠక మహాశయులు సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తాను.

మిశ్రమమంజరి లోని కవితలను పూర్తిగా అవగాహన చేసుకోవలె నంటే రాయప్రోలు వారి "కవిత్వ తత్త్వం" (Philosophy of Poetry) ను గురించి తెలిసి కొనుట ఆవశ్యకం.





రాయప్రోలు వారి కవిత్వ తత్త్వం:

రాయప్రోలు వారి కవిత్వ తత్త్వ వివేచన పై విమర్శకులు ఆంగ్ల సాహిత్య ప్రభావాన్ని పసి కట్ట వచ్చు! అలాగే, భారతీయ అలంకారికులు చెప్పిన కవిత్వ లక్షణాలు కూడా సాదరంగా స్వీకరించారు ఆచార్యుల వారు. అంతేకాదు, వీటినన్నిటినీ, సమన్వయ పరచుకొని, సమర్థ వంతమైన నవ్య కవితా లక్షణాలను, తత్త్వాన్ని నిర్థారించు కొన్నారు. ఈ లక్షణాలన్నీ క్రోడీకరించి, వ్యాఖ్యాన సహితంగా "రమ్యాలోకమ్", "మాధురీ దర్శనమ్" అను గ్రంథాలు రచించారు. పూర్వ లక్షణ కర్తలను విమర్శించుట రాయప్రోలు వారి ఉద్దేశ్యము కాదు. కేవలం నవ్యుల దృష్టి వైశిష్ట్యాన్ని స్పష్ట పరచుటయే వారి ధ్యేయం. దండి, ఆనంద వర్ధనుడు, అభినవ గుప్తుడూ, జగన్నాథ పండిత రాయలు, వామనుని వంటి లాక్షణికులు ఆచార్యుల వారిని కొంత మేరకు ప్రభావితం చేశారు. ముఖ్యంగా రాయప్రోలు వారికి ఆనంద వర్థనుని పై అభిమానం యెక్కువ!? ఆ విషయం వారి లాక్షణిక గ్రంథానికి "రమ్యాలోకమ్" అని పేరు పెట్టుటలోనే సూచిత మౌతుంది. అలాగే "ఈ అపార సంసార మందున కవి యొకండె బ్రహ్మ" అనే మాటలు ఆనంద వర్థనుని గుర్తుకు తెస్తాయి. అలాగే సహృదయ రంజక మైన కావ్యాన్ని గూర్చి ముచ్చటిస్తూ "కావ్యం పాడి ఆవు వంటిదని" చమత్కరిస్తారు. రాయప్రోలు వారి దృష్టిలో "కావ్యంలో వాచ్యార్థం కంటె ధ్వని ప్రథానంగా చెప్పడంలో రమణీయత ఉందనీ, అంతేకాక, గూఢత తొలగితే జుగుస్స కలిగే అవకాశం ఉందని ఆచార్యుల వారి భావన. ఈ విషయం "మిశ్రమంజరి" లోని "క్షమధ్వమ్" అనే కవితలో గమనించ వచ్చు:

"స్పష్టత లేదని యెద వీ - సృష్టిని విస్పష్ట మయిన దేదోయి బుధా!

క్లిష్టా వరణము చీలిచి - ఇష్ఠార్థ ఫలంబు వెదుక రేమొ సహృదయుల్"

సహృదయులు తమ బుద్ధి కుశలత నుపయోగించి, కష్ట తరంగా కనిపించే కావ్యార్థాన్ని సుబోధకరంగా మారుస్తారు. కావ్యధ్వనిలో సుతారంగా, సూక్ష్మంగా రమ్యార్థం భాసిస్తూ ఉంటుంది. మిశ్రమంజరి లోని

"శ్రీరవ్యాత్" అనే కవితలో సరళ మైన భాష రచనకు రమ్యత కలిగిస్తుందని సూచిస్తూ -

"చెవికి తీయము చిలుకు శబ్దము - కంటి కింపగు కొంత కల్పన-

కలిసి హృత్కోశమును తడిపే - తొలక రింపులె కావ్యముల్" అంటా రాయన.

మనోహరమైన వాఙ్మయ సృష్టికి మధురమైన భాష అత్యంత అవసరమని వారి నమ్మకం. మరియు కావ్యంలో ఉపయోగించే పదజాలం సామాజికులకు (చదువరులకు) శ్రుతి సుఖ మియ్యాలె. కర్ణ కఠోరంగా ధ్వనించ కూడదు. రాయప్రోలు వారి దృష్టిలో నవ్య కవిత్వానికి వస్తు నియతి లేదు. "కవి తన కౌశలం చేత, రాళ్ళను ఏడిపించ గలడు, సెల యేళ్ళతో జోల పాడించ గలడు"!

రస విషయమై చర్చిస్తూ మిశ్రమంజరి లోని కవితా ఖండిక "శ్రీరవ్యాత్" లో

"కరుణ శృంగార రసముల రెండే - ఋతురస ప్రతి పత్తి నందెడి;

ఒకటి కలుషము కడుగు; మరొకటి - కాల్చు కాయము శుద్ధికై"

అంటారు రచయిత. అంటే ఆయన దృష్టిలో కరుణ, శృంగార రసాలు రెండే ప్రధాన రసాలు. అందుకే కాబోలు అదే కవితా ఖండిక లోనే

"జన్మ వర్థన విలయములలో - త్రిగుణముల వలె నణగి పెనవడు

శోకమే బ్రహ్మాండ లీలా - బంధమౌ నేమో కవీ"!

రాయప్రోలు వారి అభిమతానుసారం సాహిత్యం లో రమణీయ కల్పనలకు శోకమే ఆలంబనము (పట్టుకొమ్మ). కరుణా రస ప్రధాన రచనలు హృదయ క్షాళన గావించ గలవని వారి నమ్మకం. కావ్యంలో దుఃఖము సహితం ఆనందాన్నే కలుగ చేస్తుందని ప్రాచీన లాక్షణికుల భావన. కావ్య గతమైన దుఃఖ వర్ణన పాఠకుల హృదయాల్లో ఆనందాన్నే కలిగిస్తుంది?!

"ఈ ప్రకృతి అనంత రూపాల్లో ఆనందాన్నే ధరిస్తోంది కనుక ఆ ఆనందాన్నే కావ్యాలు ప్రధానం చేసుకోవా లన్న ఆకాంక్ష" రాయప్రోలు సుబ్బారావుది. "కవులు మంగళ మిత్రులు, మాధుర్యోపదేశకులు, లోకానికి మంగళం కావలెను" అని ప్రబోధిస్తారు మహాకవి. రాయప్రోలు వారి ప్రబోధంలో అంతటా ఉత్సాహ ప్రవాహమే గాని దుఃఖం వెతికినా కనబడదు". ఈవిధమైన ఉన్నత భావాలతోను, నిర్దిష్ట అభిప్రాయాల తోను, భావ కవిత్వోద్యమానికి ఆద్యులై నిలిచారు ఆచార్య రాయప్రోలు వారు. పైన పేర్కొనిన వివరాలు రాయప్రోలు వారి కావ్యాలను అవగాహన చేసుకొనుటలో ఉపకరిస్తాయని ఇచ్చట చర్చించడ మైనది.

మిశ్రమంజరి:

ఇది ప్రసిద్ధి పొందిన 54 కవితలతో కూడిన ఖండ కావ్యం. పీఠికలో ఆచార్య రాయప్రోలు వారు ఇలా పేర్కొన్నారు.

"పాయలు పాయలుగా విడి - పోయిన నా కన్నె రచన ముంగురులకు వే

ణీ యోగ్యముగా "కుచ్చులు" - పాయనమై నిలుచుతన్ శుభంబన సుహృదుల్.

అని జడ కుచ్చులు సమర్పించుచూ వ్రాసి కొంటిని".

వ్రాసినది సురక్షితంగా ఉంచుకోవడము మొదటి నుంచీ అలవాటు లేదు. ఇటీవల పాత కాగితాలన్నీ వెతకడం మొదలెట్టాను. ఏవో లభించినవి, కొన్ని వెలుతురు చూడనివి ... అన్నిటినీ కలిపి "మిశ్రమంజరి" పేరుతో ప్రకటిస్తున్నాను. కలగూర గంపలాగా తయారయింది. ఇందులో పుల్లనివీ, తీయనివి, చప్పనివి కూడా మిశ్రమమై గుత్తి కొన్నవి... రుచులలో భేధం సుతారం. నిమ్మ పండు పులుపూ, దానిమ్మ పండు పులుపూ ఒక్కటే అనదు నాలుక. తీపికీ, చెరుకు పాల తీపికీ ఏదో రవపాలు భేదం లేకపోలేదు. ఇక కావ్య స్వాదిమం అంతటా ఏకైకంగా ఉండునన గలమా!" అంటూ కవితాత్మకంగా ముగిస్తారు పీఠిక.

మిశ్రమమంజరి ఖండ కావ్యంలో కొన్ని కవితలు అత్యంత ప్రసిద్ధి కెక్కినవి. వానిని గురించిన విశేషాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

ఓం: పరమ పుణ్యవతికి - భరత భూదేవతకు

తేనె చవుల శ్రుతికి - తెనుగు వాగ్భవతికి

శారదా భిరతికి - సాహితి శ్రీమతికి

సహృదయ సుకృతులకు - సాదర సమర్పణము.

అను కవితతో మొదలవుతుంది "మిశ్రమమంజరి". మాతృదేశం రాయప్రోలు వారికి ఉపాస్య దేవత. అందుచేత తమ సాహిత్య సంపదను ముందుగా భూదేవికే సమర్పించారు.

అలాగే "నమోవాకమ్" అనే కవితలో పూర్వ కవులను స్తుతిస్తూ "కాళిదాసుని భణితి కళలు సమర్తాడె" అన్న ప్రయోగం శేషేంద్ర శర్మ వంటి గొప్ప కవులను ఆకర్షించింది. ఆ కవితలో వాడిన పదజాలం అత్యంత సరళం గానూ, చక్కగాను అమరింది.

"శూద్రకుని భావాల సుడిసె కోమలి కములు

అలసాని వీణె బ్రహ్మానందము ధ్వనించె"

"హాలు పదాలలో తేలె ననురాగంబు

చేమకూర పొలాల చినికె కమ్మ దనాలు".

ఆంధ్రనవమి: ఈ కవిత ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తరుణంలో రచించినది. రాయప్రోలు వారి కావ్య భాషలో తరచు వైదిక పదాలు మనకు ప్రత్యేక్షమౌతాయి. ఈ కవితా ఖండికలో

"జననీ! ఆంధ్ర మహా మహీ ఇది - భవత్స్వాతంత్య్ర పుణ్యాహవా

చన పారాయణ; మేల వించితిమి - స్వేచ్ఛా రక్త కంఠశ్రుతుల్"...

పుణ్యాహవచనం అనేపదం వైదిక విధులకు సంబంధించినది. ఇటువంటి పదాలు అవలీలగా ఇతర పదాలతో కలిపి వాడుతారు రాయప్రోలు వారు. ఇదివారి ప్రత్యేకత. అలాగే, జాతి అభ్యుదయానికి ప్రజలు సహృదయంతో వ్యవహరించ వలసి ఉంటుంది. రాష్ట్రావతార తరుణ ప్రబోధనలో పురోగమనాన్ని నిరోధించే దుష్ట శక్తులను కనిపెట్టి వాటి నిర్మూలనా వశ్యకతలు సూచి స్తూ వ్రాసిన పద్యాన్ని పరిశీలించండి:

"బంగారు పాతళ్ళ ప్రాణాలు విడిచె మ

హా కుబేరుల కాంక్షకాక దిగజార వలె

పెనుచీకటి బజార్ల ధనము రాసులు చేయు

వర్తకుల నడతలో వంకరలు తీరవలె

లంచాలు త్రాగి కల్మషమైన అధికార్ల

ముసుగు బొందల చాళ్ళు మొదలంట కదల వలె

పుట్టింటికే నిప్పు పెట్టగల రాక్షసుల

ఇనుప గుండెల తిత్తు లిరిగించి విరియ వలె

కూటికై అల్లాడి గుడ్డకై అఱ్ఱాడు

జన ఘోష పగబారి - రగిలి ప్ర

చండమై మండితే చల్లార్పగా రాదు

కాదోయి ఇది భేద వాదాల కాలంబు"

అని అంటూ బంగారుకై ప్రాణాలు విడిచే ధనవంతుల దాహం, చీకటి బజారుల్లో డబ్బు పోగుజేసే వర్తకుల ప్రవత్తన, అధికార్లలో లంచగొండి తనము, దేశద్రోహుల ఘాతుక చర్యలూ, అరికట్టాలనీ, అప్పుడే దేశం ప్రగతి మార్గంలో పయనిస్తుందని భావించారు. అలాగే తినుటకు తిండి, కట్టుటకు గుడ్డాలేని బీదల ఆక్రందన నాగరిక సమాజాభ్యుదయానికి ఆటకం అని, బీదల ఆక్రందన రగిలి రగిలి మండుతే ఆమంట చల్లార్చుట అసంభవమని ఆంధ్రదేశాన్ని హెచ్చరిక జేసారు. అలాగే రాష్ట్ర ప్రజలు ఏవిధంగా నడుచు కోవాలో, రాష్ట్రం ఏవిధంగా ప్రస్ఫుటించాలో సూచిస్తారు మహాకవి.

"మూడు మూలల మేయు పాడి యావుల పాలు

ఏక భాండమునందు పాకమై పొంగాలె,

గింజ కుంచంబుగా గెలవేల గుత్తిగా

పండ్ల తోటలు చేలు పండాలె నిండాలె

గౌతమీ కృష్ణానదీ తీర్థ బద్ధమై

రామపద సాగరము రావాలె రావాలె

వేంకటేశ్వర విశ్వవిద్యాలయమునందు

తెలుగు కన్యకు పసుపు తలబ్రాలు పోయాలె"

అని ఆకాంక్షిస్తారు. పై కవితలో రాయప్రోలు వారి సామాజిక దృక్పథం మనకు విశద మౌతుంది.

ఆంధ్రాభిషేకం అనే మరో కవితా ఖండికలో "విశాలాంధ్ర జననీమ తల్లికా" అని ఆంధ్ర మాతను సంబోధించి జయనాదాలు వినిపిస్తూ - రాష్ట్ర వికాసాన్ని కొనియాడి, తర్వాత అంటారు -

"జయస్తే విశాలాంధ్ర జననీమ తల్లికా!

శ్రియస్తే తెలంగాణ చికుర నవ మల్లికా,

నాలుగు కోట్ల మహాంధ్ర నాగరక జనకాంక్ష,

నలుబదేండ్ల నిరూఢ బలవదుద్యమ దీక్ష,



ఇరుగు పొరుగులు నచ్చ - హితులు నహితులు మెచ్చ

ఈడేరినది ఆంధ్రులేకీభవింపండి

దేశ ప్రతిష్టల్ ప్రకాశంబు కావాలె

నడపండి రాష్ట్ర తంత్రము ముళ్ళు పడకుండ"

అని హిత వచనాలు పలికారు. విధి విపరీతం కదా! రాష్ట్ర తంత్రము ముళ్ళు పడుతున్నది. కవులు ఋషి తుల్యులు వారి ఆకాంక్షలు, ఆశీస్సులు జరిగి తీరాలి కదా?!

"పిలుపు", సోదరీ! సోదరా", భద్ర యాత్ర" అను కవితా ఖండికలు చైనాదేశము మనపై అధర్మ యుద్ధము మొదలెట్టిన సమయంలో చింతా క్రాంతుడై, వ్యధిత హృదయంతో ఆచార్య రాయప్రోలు స్పందించిన వైఖరి వెల్లడిస్తాయి."పిలుపు", సోదరీ! సోదరా" చిన్న కవితా ఖండికలు కాని "భద్ర యాత్ర" అను కవిత వాటి రెంటికన్నా కొంచెం పెద్దది. ఈ కవిత రెండు భాగాలుగా రచింప బడినది. రాయప్రోలు వారికి భరతమాత పుత్రుడనని చెప్పుకొనడమే అత్యంత గర్వించ దగిన విషయం. వారి దృష్టిలో జన్మ రాహిత్యంతో మోక్షం పొందుట కంటె భారతీయుడిగా తిరిగి జన్మించుట ప్రీతిపాత్రం. పురాకృత సుకృత ఫలంగా భారత దేశమనే స్వర్గంలో జన్మించుట కవకాశం కలిగింది. అవకాశం లభించినదే తడవుగా దేశ ఋణాన్ని తీర్చు కోవాలి. అందుకే చైనా దేశాన్ని ఆక్రమించి నప్పుడు -

"ఎత్తవోయి - పయికెత్త వోయి – నీ స్వేచ్ఛా భారత సీమల జెండా

మూడు వన్నెలును ముచ్చిచ్చులుగా - చీనా సేనల కాల్చాలోయ్" ...

నీతి నియమములు పాతర పెట్టీ - కల్ల గజ్జలను కత్తులు దాచీ

కొండల మాటున కోడి పందెమును - చౌలై ఆడెను జాగ్రత్తోయ్.

సావాసంబని సంధి మాటలని - ఏమరించి వంచించి పయింబడె

మిత్ర ద్రోహము - మాతను తాకిన - మత్తుల హతమార్చాలోయ్ …

దేశ ఋణమును - దేవ ఋణమును - మాతృ ఋణమును - మనిషి ఋణమును

తీర్చ గలిగిన దీక్షితుడనని - తెలిసి తెలిపే సమయమోయ్

మానిసివిగా మసల వలెనో - బానిసవుగా బ్రతుక వలెనో

తేల్చుకో - తెగటార్చ వలెనోయ్ - దొంగ చైనా యెత్తులన్

అని ఉద్భోధిస్తారు. రాయప్రోలు వారికి దేశం భగత్స్వ రూపం. అందుకే వారికి దేశఋణం, దేవఋణం, ఒకటిగానే కనిపిస్తాయి. ఆ ఋణాలు ప్రతి ఒక్కరూ తప్పక తీర్చు కోవలసినవి.

మంగళ మాఘమ్: ఈ కవితా ఖండికలలో వివిధ ఋతువులను వర్ణించారు రాయప్రోలు వారు. వర్ణన లన్నీ కొత్తదనం ప్రకటిస్తూ ఆధునిక భావజాలాన్ని స్పష్టంగా వ్యక్త పరుస్తాయి.

ఉదాహరణకు: "కొప్పు కందని కురుల పోలిక, - వెదల బెదిరిన పెయ్య లట్టుల,

కొదమ మబ్బులు పొదివికొన - పులకించె లోకము తొలకరిన్" ...

జున్ను గడ్డల భంగి చుక్కల - వెన్నెలను పెరుగన్న మట్టుల -

మింగె దయ్యము వంటి చీకటి - జడలు విడ మిట్టాడుచున్

ఆచార్య రాయప్రోలు వారికి పెరుగన్నంపై ప్రత్యేక మక్కువ! అందుకే కాబోలు వెన్నెల వారి దృష్టికి పెరుగన్నంలా కనిపించుట! చుక్కలు "జున్నుగడ్డల" మాదిరి చిత్రిత మౌతాయి! చీకటి మాత్రం దయ్యంలాగానే గోచరిస్తుంది! వారి భావుకతకు తార్కాణంగా

"మెరప తోటలు మెరిసినవి పగ - డాల బోలిన పండ్ల గుత్తుల,

బంతి మొక్కల చాళ్ళు గొబ్బికి - పసుపు ముద్దలు పెట్టగాన్"

"మంగళమాఘమ్" లోని కవితలన్నీ అలంకార యుక్త పుష్పగుచ్ఛాలే! ఒకదానిని మించి మరొకటి!

విశ్వవిఖ్యాతి నార్జించిన మేధావి, తెలుగు గడ్డపై ఉదయించిన ప్రచండ భానుడు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆ మహామహుడు "రాష్ట్రపతి" అయిన సందర్భములో మహాకవి స్పందన గమనించండి! అపార గౌరవ ప్రాంజలి :-

"నీధ్యాన ధారణకు - నీ యోగ సాధనకు

శత శతాయుః స్ఫూర్తి - అగును రాధాకృష్ణ!

అభినవ విద్యారణ్యుడ - వుభయ ప్రజ్ఞాన దీప్త సూక్తిని, అర్పిం

తు భవన్మూర్తికి, ఈ సుప్రభాత మంగల్య మాల - రాధాకృష్ణ!

పెండ్లిలగ్నం: రాయప్రోలు సుబ్బారావు గారికి తెలుగు భాష, తెలుగు దేశం, తెలుగు ప్రజలు అంటే చెప్పరాని అభిమానం. వారి కావ్యాలలో తెలుగు దేశ ప్రకృతి సౌందర్యం, తెలుగింటి పరిసరాలు, ప్రజల జీవన విధానం, భోజన పద్ధతులు, పండుగలు, వేడుకలు, ఆటపాటలు, అన్నీ ప్రాముఖ్యతను సంతరించు కొని తెలుగు దేశ చిత్రణ అతిమనో హరముగా దర్శన మిస్తుంది. "పెండ్లిలగ్నం" అనే కవితా ఖండిక "మిశ్రమమంజరి" సంకలనము లో ప్రసిద్ధి కెక్కిన కవిత. పల్లె జీవనంలో రైతులకు పంట పొలాలు, పాడి పసువులే సిరి సంపదలు. అందు వలన పల్లె ప్రజల్లో పూర్తిగా తెల్ల వారక ముందే, మంచం మీద పడుకొనే తమ పసువులను గురించి, పాకలను గురించి, పంటల వివరాల ఆలోచనలు మొదలెడతారు!. నీరు లేక వరి చేలు పొల్లుపోయాయని, సేద్యానికి వానలు ఆలశ్యంగా కురిశాయని, చెరువు నిండింది కాబట్టి ఆయేడు కరువు రాదని, మిరపతోటకు పురుగు పట్టలేదని, జొన్న కంకులు అప్పుడే పాలు పోసు కుంటున్నవనీ, పూత పట్టిన కొతిమేర (ధనియాల పంట) మంచు తాక కుండా బాగా కాయాలనీ, అలా జరిగితే ఆ సంవత్సరమే ఎడ్లపాక కప్పించు కోవాలనీ, వానలకు పడిపోయిన గోడలకు మెత్తులు వేయించాలనీ, అప్పుల మీద వడ్డీ పెరిగి పోతున్నదనీ, ముచ్చటగా పెరుగుతున్న పెయ్య దూడలను అమ్మి అయినా సరే ఆ అప్పు తీర్చు కోవాలనీ, ఆలాంటివే ఇంకా ఎన్నెన్నో ఆలోచనలతో సతమత మయ్యే గ్రామ వాసులను అద్భుతంగా చిత్రిస్తారు రాయప్రోలు వారు! వారి ఆలోచనలకు అద్దం పట్టినట్లు వర్ణించారు కవితలో! పరిశీలించండి.

"వెండి లాంతరు వెలిగించి వెడలె రజని - ఒడలు తెలియక నిదురించు చున్న జీవ

కోటి నరసి కాపాడ - పక్షులను బోలె - చెట్లునున్ కదలవు సొమ్మ సిలిన యట్లు" ...

ఎదిగినది పిల్ల పెండ్లికి – ఎట్టులైన - ఎడ్ల కొట్ట మీ ఏడు నేయింప వలయు -

వానలకు కారిపోయిన పడమ టింటి - గోడ కండ వేయక యున్న కొప్పు కూలు - …

అనుచు తలపోయు చుండె "రామన్న" - చుక్కపొడిచి బారెడెక్కె - ఇరుగు పొరుగు లందు

చల్ల చిలుకు చప్పుళ్ళు - కావళ్ళ మ్రోత లును కలిసి చెట్ల మీద పక్షులను లేపె.

రామన్న భార్య భూదేవి ఒక ఆదర్శ పల్లెటూరి పత్ని. ఆమెను రాయప్రోలు వారు ఎంత మనోజ్ఞంగా చిత్రించారో పరికించండి.

బక్క పలచని నెమ్మేను పచ్చి పసుపు - కొమ్మువలె మంగళ చ్ఛాయ క్రుమ్మరింప -

ఇంతలేసి కాటుక కండ్ల ఇంపు తోడ - మగువ ఆకలి దప్పులు మాయ చేయు.

ఇల్లు మాయ నీయ దిల్లాలు – మాయదు - కొప్పు గాని కట్టు కోక గాని -

అబల కబ్బె నిర్మలాభ్యాసములు – తన నిర్మలాత్మ వృత్తి నీడ లట్లు.

అంతేకాదు, గృహిణిగా ఆమె –

కడవతో నీళ్ళు తోడి, ముక్కాలి పీట - వేసి, చాకింటి ధోవతి తీసియుంచె; -

భర్త కుపచారములు చేయ ప్రాలు మాల - దెంత పని యున్న భూదేవి ఇంటిలోన

కూతురి పెండ్లి మాటలకు ఆ ఊరి పెద్దలు రామన్న ఇంటికి వచ్చినప్పుడు ఒక సంస్కార వంతమైన గృహిణిగా భూదేవి వచ్చిన వారిని ఆదరించి తగిన మర్యాదలు చేస్తుంది. ఆ విధానం గమనించండి;

నిలువు చెంబులతో వేడినీళ్ళు తెచ్చె - అనువు గని పెట్టి భూదేవి అంతలోనె -

కిఱ్ఱుచెప్పులు విడచి ... కాల్కేలు కడిగి -కూరు చుండిరి వారును కుశలమడిగి ...

వడ్డనలు చేసె చవులూరు వంటకములు - క్రొత్త సాంబారు కారమున్ కొసరి కోర;

పైర వంకాయ తాలింపు – దోరవేపు - కంది పప్పు కమ్మదనాలు చిమ్ము చుండ

ఇంట కాచిన కపురము వంటి నెయ్యి - జిడ్డు మీగడ గట్టిన గడ్డ పెరుగు -

చవులు తెలిసిన భూదేవి స్వాదు పాక - మే పదార్థ మింపితముగా దెవరి కేని - ...

మనువు తెచ్చిన పెద్దలు - మాట లాడ - వచ్చినట్టి పెత్తన దార్లుభయ జనులకు

నచ్చజెప్పి ...

రంగు చీరె - పదారు వరాల పసిడి -ఉభయ గృహయోగ్యము లటంచు నొప్పికొనిరి; ...

పెండ్లి లగ్నము జరిగెను పెద్ద లలర.

పై విధంగా పల్లె జీవనం అద్భుతంగా చిత్రించి చలన చిత్ర శైలిలో మన ముందుంచారు నవ్య కవితా చక్రవర్తి రాయప్రోలు "పెండ్లిలగ్నం" కవితలో!

తెలుగు వారి సాంఘిక జీవనం లో పండుగలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆంధ్రదేశంలో సంక్రాంతి, ఉగాది, నవరాత్రి, విజయదశమి, ఈ పర్వదినాల వైపు ఆకర్షితులు కాని కవులు చాలా అరుదు. తెలుగు దనం అభిమానించి, ఆరాధించు రాయప్రోలు వంటి వారికి నోములు, వ్రతాలు, పండుగలు వారి సామాజిక దృక్పథాన్ని వ్యక్త పరచుటకు సందర్భాలను కలిపిస్తాయి. అందుకే ఆసమయాల్లో వారు దర్శించిన అనుభూతులను కవితా ఖండికల రూపంలో మన ముందుంచారు. "మిశ్రమంజరి" కావ్యంలో పండుగలను పురస్కరించుకొని వ్రాసిన కవితలు పొందు పరచారు రాయప్రోలు వారు. కవితల లోని వర్ణనలు తెలుగు దేశాన్ని అద్దం పట్టి చూపిస్తాయి. మచ్చుకు -

తెల్లవారగ మేలుకొలుపులు - పాడుచును హరిదాసు లాడగ

గొంతులెత్తు శకుంతములు ఆ - నందముగ సుతి కలుపుచున్ ...

నవ్య ధాన్య సువాసనలతో - పాలునిండిన భాండములతో

ఇండ్లు సిరి ముంగిడ్లయిన ఈ - పచ్చి పండుగ సందెలన్.

అలాగే "నవరాత్రి" కవితా ఖండికలో

నీలగిరులను బట్ట బయలున - పెరుగు ముద్దలు పంచు శారద

కవి కులంబుల కామెతలుగా - అందుకొను డిరు సందెలన్ …

ఆషాఢి: "మిశ్రమంజరి" సంకలనము లోని మరొక ముఖ్య కవితా ఖండిక "ఆషాఢి". అతి దీర్ఘ మైన ఈ కవితను ఏడు భాగాలుగా విభజించారు రాయప్రోలు వారు. "ఆషాఢి అని ఈ కవితకు పేరెందుకు పెట్టారో కవి హృదయం లోకి ప్రవేశించి అర్థం చేసుకొనుట కొంత క్లిష్ట తరమే! ఆషాఢి అంటే "బ్రహ్మచారి" అనే అర్థాన్ని సూచిస్తుంది నిఘంటువు. కాని, మనం "సన్యాసి" అనే అర్థం లో గ్రహించ వచ్చు. చేతనాచేతనాల్లో దేశమాత దివ్య స్వరూపాన్ని దర్శించి, తామారాధించిన భరత మాతకు హృదయ పూర్వక నివాళులు అర్పించారు ఆచార్య రాయప్రోలు గారు ఆషాఢి లో. పరికించండి -

తుహిన ముక్తా సరులతో కొం - డంత కబరీ భరము శోభిల -

చీర చెఱగులు సాగరములై - జాఱు దేవీ రూపమున్

ఒక విధంగా పరిశీలిస్తే, ఈ కవితా ఖండి కలో తత్వ వివేచన స్ఫురిస్తుంది. ప్రాణికి, కర్మాను సారంగా భగవంతుడు జన్మను అనుగ్రహిస్తాడన్న సంప్రదాయ దృష్టినే రాయప్రోలు వారు వ్యక్త పరచారు ఈ కవితలో. అందుకే -

ఈశ్వరున కుప సర్జనీ కృతు - డయిన మనుజుని సంస్కృతికి బహు

జన్మ జన్మాంతర కృతాకృత - ఫలవిపాకము కావలెన్

ఈశ్వరుడు ప్రసాదించే జన్మలలో మానవ జన్మ ఉత్తమ మయినది. మానవులలో కూడ విద్వాంసునిగా జన్మించుట సుకృత ఫలం అంటారు మహాకవి. మానవునిలో ఆధ్యాత్మికత రానురాను సన్న గిల్లుతున్నదని భౌతిక సుఖాలకే ప్రాముఖ్యం పెరుగు చున్నదన్న భావాన్ని వ్యక్త పరుస్తారు.

"పరము వెనుకై ఇహము పైకొన - తన్నుకొనె సంశయ ఘనా ఘన

ఘటనమున మనుష్య వృత్తము - బురద బడ్డ గజం బటుల్".

జాతులలో ఆచార వ్యవహారలలో అనేక మార్పులు వచ్చాయి. ఆదర అభిమానాలు తగ్గి, మనిషి భయ భ్రాంతులకు లోనయినాడు. వ్యక్తి స్వాతంత్ర్యాన్ని కోల్పోయాడు.

ఇంట మమతన్ బయటభీతిన్ - మానవుని వ్యక్తి స్వతంత్రము

అల్ల అల్లన కారి పోయెను, - చిల్లి కుండ జలా లటుల్.

కాల క్రమేణ పరిస్థితులు మారి పోయాయి. అంతేకాదు, మార్పు సహజం. పాత నశిస్తుంది. క్రొత్తకు దారి తీస్తుంది.

విత్తు నశియించి మొలకాయెను - పెరిగి పూచి ఫలించి విత్తన

మిచ్చుటకె; యిది సృష్టి నైజము - ఆది బీజము రాదెటున్.

కవులను "రాగరక్తుల" గా భావిస్తారు రాయప్రోలు వారు. అటువంటి వారికి వైరాగ్యం అంతగా అభిలాషణీయం కాదు. అందుకే -

కనుకనే వాచామ గోచర - మనిరి అపరోక్షాను భూతిని;

వదలు డది నిస్సంగులకు – ఏ - టికి గృహస్థులు తడవగన్.

అద్వైతం అందనిదన్న భావం రాయప్రోలు వారి లో అక్కడా కనబడుతుంది. కాని వారు అద్వైత తత్త్వానికి వ్యతిరేకులు మాత్రం కాదు. భూత, వర్తమాన, భవిష్యత్తులను గురించి వాదోప వాదాలతో సమయాన్ని వృధాపుచ్చుట మంచిది కాదని ఆచార్యుల వారి అభిప్రాయం. ఆ విషయాన్ని ఈ విధంగా వ్యక్త పరుస్తారు.

మునుపు మునుపని మొత్తు కొందుము - మును పు కాదో నేడు రేపటి

కక్షయంబగు నీ ప్రవృత్తము - ఆగు టెపుడో ఎక్కడో,

పరిమితము ఆయుఃప్రమాణము, - సగము నిద్దుర; మిగత సగమున,

ఎందుకీ వంధ్యా స్తనంధయ - రూపరే ఖా తర్కముల్.

రాయప్రోలు వారి దృష్టిలో మానవ జీవితంలో కష్ట సుఖాలు వెలుగు - చీకట్ల లాగా, ఒకదాని వెంట మరొకటి వచ్చి పోతుంటాయి. అందు వలన కష్ట కాలంలో నిరాశ చంద కూడదనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తారు. అంతేకాదు, వర్తమాన కాలం కంటే, భవిష్యత్తులో మంచి రోజులు రాగలవన్న ఆశతో నిరాశ, నిస్పృహ, నిరుత్సాహాలను దూరం చేసుకొని ముందుకు సాగిన నాడు జాతి అభ్యుదయాన్ని తప్పక పొందగల దన్న ఆశా తత్వం వెల్లడిస్తారు.

కలదు కల దధిక ప్రకాశము - తోడ నారీ నర సమాజము

శాంతిగని సుఖించు కాలము; - ఏటికీ గుంజాటనల్?

అని వక్కాణిస్తూ, కలతలు, కల్లోలాలు మరచి, రాబోయే మంచి రోజులకై శాంతితో నిరీక్షించమని ప్రబోధించారు.

ఫాల్గుణి: తెలుగు పంచాంగానుసారం కాలమాన గణన అరువది సంవత్సరముల ఆవృత్తము. ఒక సంవత్సరములో పన్నెండు నెలలు ఉంటవి. అందులో ఫాల్గుణి చివరి నెల. ఫాల్గుణి సంవత్సరాంతపు పౌర్ణిమ. వసంత కాల ఆగమనాన్ని సూచిస్తుంది. ఈ కవితా ఖండికలో రాయప్రోలు వారి భావపరంపర కాల గమనం వైపు ప్రసరిస్తుంది. అరువది సంవత్సరాల ఆవృత్తము పూర్తి అవుతుంది. కాల చక్రం తిరుగుతునే ఉంటుంది. కాలాను క్రమంగా ప్రకృతిలో మార్పులు సంతరించు కొంటవి. గతం వర్త మానానికి, వర్తమానం భవిష్యత్తుకు దారి నిస్తుంది. కని పెంచిన పెద్దలు గతించారు. శిశువు పెరిగి పెద్ద వాడై - మొలక మొగ్గకూ, మొగ్గ పూవుకూ, ఫలానికి మారి చివరకు విత్తు రూపాన్ని ధరిస్తుంది. ఈ జీవ చక్రం సాగుతూనే ఉంటుంది.

మనిషి జీవనోపాధికి బంజరు భూమిని బాగుజేసి, మల్లె తోటగా మార్చి పూలు పూయిస్తాడు, అరణ్యాలను నరకి కలప తయారు చేస్తాడు, గడ్డు భూమిని త్రవ్వి బొగ్గు తీస్తాడు, ఈ విధంగా ఒకొక్కడు ఒక్కో వృత్తికి అలవాటు పడతాడు! పూవు లమ్మి ఒకడూ, కట్టె లమ్మి మరొకడూ, బొగ్గు లమ్మి మూడవ వాడూ తమ తమ జీవనోపాధులను కల్పించు కొంటారు. వీరిలో ఎవరు ఘనులో ఎవరు కాదో అనేది ఎడ తెగని వివాదం! కాల చక్రం తిరుగుతూ యుగాలు గడుస్తాయి! జీవిత గమనంలో పండుగ రోజులు యేర్పడతాయి.

ఇంట పుట్టిన రోజు పండుగ - దోరపాకపు గారెలరిసెల

భోజనమునకు వేళ తప్పెను - కూరుచుంటిని అలసటతన్ ...

సృష్టి విచిత్రమూ, అనంతమూ ఎటు చూచినా ఒకటిగా కనిపిస్తుంది. చేతనాచేతనలు రెండుగా జగతి పరిణమిస్తుంది. మనిషి వికసిస్తాడు.

పర్ణ శాలల తపము సలిపెను - క్షేత్రముల కృషి కర్మ జరిపెను

గురువుగా కుల పెద్దగా – జన - నాయకుడుగా భాసిలెన్.

ఆత్మ యమ దమ నియత ధారణ - బాహు బల శస్త్రాస్త్ర సాధన -

లక్ష్య లక్షణ శిక్షలన్ – మా - నవులలో తెగ లేర్పడెన్ ...

రాజులు రాజ్యాలు ఏర్పడ్డాయి. దాయాద మాత్సర్యాలు - రాజ్యాల కోసం యుద్ధాలు, మతాలు, కులాలు ఉద్భవించాయి. మనిషి ఆలోచనలు మారి భేదభావానికి దారితీసింది.

కుచ్చితంబో – మచ్చరంబో - అంకురముగా అల్లు కొనె పగ

దాలివలె; సుడిగాలి కెపుడో - మండి గృహమును కాల్చదే! అదే జరిగింది. ...

కాల క్రమంలో భరత భూమి భాగ్య సీమగా మారి విదేశస్థుల దృష్టి నాకర్షించ మొదలెట్టింది! కనుమల ద్వారా, భూమార్గాన, ఓడలలో సముద్ర యానాన పరదేశీయులు తండోప తండాలుగా వచ్చి దేశ సంపదలను కొల్ల గొట్ట నారంభించారు. వ్యాపారాల పేరుతో విచ్చేసిన విదేశీయులు రాజ్యా లేర్పరచు కొన్నారు. క్రమేణ భారతమాత పర హస్తాలలో చిక్కు కొన్నది. అన్యాధీన - అన్య ప్రభుత్వం పాతు కొని పోయింది. అనర్థాలకు ఆటపట్టు అయింది.

కుల విభేదము - మత విరోధము - పొటమరించెను స్ఫోటకము వలె

ఇరుగు పొరుగుల యిష్ట బంధము - తెగెను పురి విడి కటకటన్

ఎగుమతులలో దిగుమతులలో - నిధులు నిక్షేపములు కరిగెను

ధనికులే అతి ధనికులుగ – నిరు - పేదలయి పో పేదలున్ ...

క్షుద్రమైనను సుస్వతంత్రము - అఖిల సుఖములకాట పట్టగు -

గొప్పదేని పరాయి పాలన - చీడ పురుగగు జాతికిన్

పర పాలనలో మన సంస్కృతీ సభ్యతలు మంట కలిశాయి. సంపదలు సన్నగిల్లాయి. దేశం సర్వనాశన మయింది.

ఒకటి వెనుక మరొకటి ఇటులా - నాటి భారత భార రూపము

పీడకలవలె కలత పెట్టెను; - తెల్ల వాఱవొ చీకటుల్.

సూక్ష్మంగా పరిశీలిస్తే ఫాల్గుణి కవితా ఖండిక రాయప్రోలు వారి సామాజిక దృక్పథం వెల్లడిస్తుంది. వారు జాతి మతాలకు విరుద్ధులనీ, మతమనేది దైవాన్ని చేరడానికి సహాయ పడేది మాత్రమే ననీ, ఏమతమైనా మనుగడకు మార్గ దర్శకం కావాలి. విశ్వ శాంతికీ, సాంఘిక సహజీవనానికి దోహదం కావాలని రాయప్రోలు వారి ఆకాంక్ష!

"పల్లెపడచు", "కాపుకన్నె" "మిశ్రమమంజరి" సంకలనము లోని మరో రెండు ప్రసిద్ధ కవితా ఖండికలు. ఈ కవితలలో రాయప్రోలు వారు తెలుగు దేశపు గ్రామ ప్రాంతాలను, అచ్చటి ప్రజల జీవన విధానం, స్త్రీల కట్టు బొట్టు, అలవాట్లు, అద్దం పట్టినట్లు చూపిస్తారు. వీరి స్త్రీ వర్ణనలో పూవులో తావిలా సహజత్వం ఉట్టి పడుతుంది. తెలుగు పల్లె పడచు సౌదర్యం రమణీయంగా వర్ణింప బడినది. రాయప్రోలు వారి వర్ణన లలో అత్యుక్తులు గాని, పదాడంబరము గాని కని పించవు. స్త్రీల సౌందర్యాన్ని వర్ణించుటలో వారు నిర్ణయించుకొన్న పరిథి, నియమావళి అత్యంత ప్రశంస నీయము. వీరి రచనలలో ఎక్కువగా స్త్రీ కన్నులు, శరీర కాంతి, ప్రాయము వంటి వాటిని గూర్చిన వర్ణనలే కనిపిస్తాయి. మొగలి పూవు వంటి దేహకాంతితో, పచ్చి పసుపు కొమ్ము వంటి మంగళ ఛాయతో స్త్రీలు వారి రచనలలో మనకు దర్శన మిస్తారు! రాయప్రోలు వారు తమ కవితా ప్రతిభ అనే ప్రత్యేక సొమ్ముతో స్త్రీలను అలంకరించి తీర్చిదిద్దుతారు. ఆశ్లీలత మైక్రోస్కోపు తో పరిశీలించినా కనిపించదు! ఈ విషయాన్ని రూఢి పరచే ఉద్దేశంతో కొన్ని కవితలు తిలకించుట భావ్యమేమో!





పల్లె పడచు నుండి:

"ఊరికావలి చెరువులో నీరు తెత్తురు నిరతమున్

జారు సందెలు మెరయగా పల్లె పడచులు కడవలన్" ...

పెద్దకాపయి గ్రామమున్ దిద్దు నాతడు చదురుతో

సద్దు చేయరు జనములున్ రద్ది రచ్చలు లేమిచే.

కూతురొక్కతె అతనికిన్ చూత పల్లవ మన దగున్

మంచి గంధపు మొలకయో మించు ముద్దుల గిలకయో!

పూచి పూయవు చెలి యొడల్ లేచి లేవవు మనసులున్,

బాల మోమున చిరు నవుల్ తేలవింకను తేటగా

పాలధారల కడిగిరో పూల పొత్తుల పొదివిరో

బాలికా మణి ముఖ కళల్ చాల దుర్లభ మవనిలో.

ఏమి కావలె నంచునూ ప్రేమ తీయగ అడుగు నూ ...

గువ్వ జంటల దరియుచున్ బువ్వ పెట్టెద తినుమనున్

పూవుపై పడు తుహినమో - ఆవు పిండిన అమృతమో

అనగ ఆచెలి చెలువముల్ - పెనగె ప్రాయపు చేష్టలన్.

పై కవిత చదివి నంతనే పాఠకుల కనుల ముందు ఆ పల్లె పడుచు సజీవంగా ప్రత్యక్ష మవుతుంది. తెలుగు పల్లెపడుచు పొలంలో తనకు తాను పసు పక్ష్యాదులతో మమేకమై ఆడుచూ, పాడుతూ సంతోషముతో ఎలా కాలక్షేపం చేస్తుందో సహజంగా చిత్రిస్తారు రాయప్రోలు వారు. అంతేకాదు ప్రకృతి సౌందర్యాన్ని స్వల్ప వర్ణనలతో చలనం, చైతన్యం మూర్తీ భవించు విధంగా చిత్రపట ఫక్కీలో ప్రదర్శంచి కళాను భూతిని పాఠకులకు అందిస్తారు రాయప్రోలు వారు.

"కాపుకన్నె" లోని ఈ దిగువ పేర్కొనిన కవితా ఖండికను పరిశీలించండి:

నడకల కుల్కు కల్కి చరణంబుల కింపులు పెంప చిన్ని చే

కొడవలి త్రిప్పి కొంచు కళుకుల్ వెదజల్లెడు కన్నులం, దెడా

పెడ నెరి వోయి కాటుక ద్రవింపగ పోవుచు నుండె కాపు లే

బడతుక యొంటిగా వయసు వాలకముల్ మురిపింప పాంథులన్.

స్త్రీ సౌందర్యం దానంతట అదే పాఠక హృదయాలల్లో రూపు దిద్దు కొంటుంది! చలనాన్ని, చేతనాన్ని, మిళిత పరచి పాఠకుని కనుల ముందు చలన చిత్రాన్ని ప్రదర్శిస్తుంది! మృదు పదాలతో భావాన్ని పఠితకు అందజేస్తుంది. అందుకే "ఈయన తెనుగు పడుచుల ప్రణయాలు, ప్రకృతి విలాసాలు సొగసుగా ప్రదర్శిస్తారు" అంటారు దేవులపల్లి కృష్ణశాస్త్రి.

శ్రీ రవ్యాత్: ఈ కవితా ఖండిక, రచయితలు - ముఖ్యంగా కవులుపయోగించ దగిన భాషను గురించి విశ్లేషిస్తుంది. సరళ మైన భాష రచనకు రమ్యత కలిగిస్తుంది. మృదువైన శబ్దజాలం మనసుకు ఆహ్లాదం కలిగించుటయే గాక, కావ్యానికి శ్రావ్యతా శక్తి నిస్తుంది. గొప్ప కవులు శ్రావ్యమైన శబ్దాన్ని ఆదరిస్తారు. మహాకవులు, శ్రవణ సుఖానికి భంగకరాలు, భావాలకు బాధకాలు, రసభంగకాలు అయినటు వంటి పద ప్రయోగాన్ని గర్హిస్తారు. మనోహర మయిన వాఙ్మయ సృష్టికి తీయని భాష అత్యవసరమని రాయప్రోలు వారి వాదం. అందుకే -

చెవికి తీయము చిలుకు శబ్దము - కంటి కింపగు కాంత కల్పన -

కలిసి హృత్కోశమును తడిపే - తొలకరింపులె కావ్యముల్.

అని వక్కాణించారు. జన బాహుళ్య వ్యవహారము లోని సజీవ భాషకు సాహిత్య గౌరవం దక్కాలని రాయప్రోలు వారి అభిప్రాయం. నవ కవికి శ్రవణ సుఖదత్వమే ముఖ్యం. భాషకు మాధుర్యాన్ని చేకూర్చి వినసొంపుగా వుంటే, అన్యదేశ్యా లయినా, ప్రాచీన వాఙ్మయ ప్రయోగాలైనా, సమానంగానే స్వీకరిస్తారు. ఇటువంటి పదాల ఎన్నికలో మధురత్వం, అర్థ గౌరవము ముఖ్యమైన విషయాలు. తెలుగు భాషకు సహజ సౌందర్యము అబ్బిన పలుకు బడులను నవ్యులు ఆదరిస్తారు. లాక్షణికుల దృష్టిలో దోషాలన దగినవి సంధుల వంటివి శ్రావ్యతముందు లెక్క చేయదగినవి కాదని రాయప్రోలు వాదిస్తారు. అంతేకాదు -

కావ్యమును రూపించె "విబుధో - ద్యాన" మని ఆనందవర్థను

డుపనిషత్తులు పలికెడి "రసో - వైస హ" యటంచు ను కవీ!

కరుణ శృంగారములు రెండే - ఋతరస ప్రతి పత్తి నందెడి

ఒకటి కలుషము కడుగు; మఱొకటి - కాల్చు కాయము శుద్ధికై.

రాయప్రోలు వారి దృష్టిలో నవకవులు (భావకవులు) సంభోగ శృంగారం కంటే వియోగ మాధుర్యాన్నే అధికంగా అభిమానిస్తారు. అదే విధంగా కరుణా రసాన్ని కూడా ప్రధానమైన రసం గానే స్వీకరిస్తారు ఆచార్య రాయప్రోలు. సాహిత్యంలో అత్యంత రమణీయ కల్పనలకు శోకమే ప్రధానమైనదని రాయప్రోలు భావిస్తారు. ప్రధాన కావ్యా లన్నిటిలో శోకమే ముఖ్యంగా ఆలంబన అయినప్పటికీ హృదయ వేదనలో కొద్ది భేదం రసాను భూతిలో విశిష్టతను చేకూరుస్తుందని వారి నమ్మకం.



లౌకిక సుఖదుఃఖాలు, హెచ్చుగా దుఃఖాన్నే కలిగిస్తున్నప్పటికీ, ప్రాచీన లాక్షణికుల అభిమతాను సారం కావ్యంలో దుఃఖము కూడా ఆనందాన్నే కలిగిస్తుంది. పాఠకులు ఆనంద రసాను భూతిని పొందుతారు.

లోకమును చిత్ర మని రార్యులు - ప్రకృతి పురుష పరస్పరాంతర

విరహ శోకము శ్లోకములుగా - కవులు ధ్యానింతురు కవీ!

జన్మ వర్థన విలయములలో - త్రిగుణములవలె నణగి పెనవడు

శోకమే బ్రహ్మాండ లీలా - బంధమౌనేమో కవీ! ...

పెంచి పాలించిన శకుంతల - అంపకాలకు డడరె కణ్వుడు;

స్నేహ ధారణ చిందగా విల - పించె యక్షుడు విరహతన్.

పెంచి పెద్ద దాన్ని చేసిన కణ్వ మహాముని శకుంతలను కాపురానికి పంపించు సమయాన దుఃఖానుభూతిని పొందుతాడట! ఆ మహర్షి సుఖదుఃఖాల కతీతుడు! అయినా ఆమహర్షి కావ్యగతమైన రసానందం పొందాడని మనం ఊహించుకోవాలి.

శుభమ్: సాధారణముగా రాయప్రోలు వారి దేశభక్తిని గూర్చిన చర్చలో వారి దేశ భక్తికి ఆధ్యాత్మిక చింతన మూలాధారమని చెప్పారు. కాని, "శుభమ్" అనే కవితా ఖండిక రాయప్రోలు వారి దేశభక్తిని భౌతిక రూపంలో వెల్లడిస్తుంది. తల్లి దండ్రులు, తమ్ములాప్తులు, ఆశన, శయన, నివాస సుఖములు వదలి ... నాళ్ళు నరములు కొఱుకు చలిలో, రక్త మాంసము లుడుకు వడలో, ఓర్చి కిమ్మనకుండా - మర తుపాకులకు గుండె లొడ్డి దేశరక్షణకు కంకణము ధరించిన సైనికుల త్యాగ నిరతిని స్మరిస్తూ భావోద్వేగంలో రచించిన కవిత "శుభం" హర్షించ దగినది. సైనికుల యందు వారు వ్యక్త పరచిన ఆదరగౌరవాలు సైనికులకు ప్రేరణ నిస్తాయి. మచ్చుకు రెండు ఖండికలు పరికించండి –

అగ్ని కురిసే బాంబులకు, పెను -సుళ్ళు తిరుగుచు త్రెళ్ళుపొగలకు, -

భయము విడి రొమ్మిచ్చి నిలుతువు - భాయి! సైనిక కులమణీ! ...

సూర్య చంద్రులు వాయు జలములు - కాల దేవత లోషదులు నిను

పృథివిలో కాపాడుదురుగా - భాయి! సైనిక కులమణీ!

ఆలోచనా పరులకు "మిశ్రమమంజరి" కావ్యం లోని కవిత లన్నిటిలోను ఏదో ఒక విశిష్టత గోచరించక మానదు. ఆచార్యుల వారు తమ మున్నుడిలో పేర్కొనినట్లు ఈసంకలనములో అన్ని రుచుల కవితలు పొందు పరచ బడ్డాయి. వాటిలో నాకు తీయని అనుభూతిని కలిగించిన కొన్ని ఖండికల లోని విశేషాలను నాదైన పద్ధతిలో పాఠకుల ముందుంచడమైనది. విజ్ఞులైన పాఠకులు సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తాను. నా అవగాహనలోని కొఱతను తమ, తమ భావనా పటిమతో పూర్తి చేసుకొనెదరని నా నమ్మకం.

ఆచార్య రాయప్రోలు వారి కావ్య వివరణ, విశ్లేషణా ఎవరు ప్రయత్నించినా అది రాయప్రోలు వారి "అమలిన శృంగార తత్త్వమును" స్పృశించ కుండా పూర్తికాదు. అందుచేత ఈ వివరణాత్మక వ్యాసంలో సహితము ఆవిషయమై కొంత చర్చ ఆవశ్యనీయమని, ఆతత్త్వమును గూర్చిన వివరములు పొందు పరచడ మైనది. రస వికాసమునకు కరుణ శృంగార రసములు రెండే సమర్థములని రాయప్రోలు వారి అభిప్రాయం. పూర్వానందా స్వాదమునకు శృంగార రసము, మనోదోష శుద్ధికి కరుణ రసము ఉపయుక్తములని వారి భావము. రాయప్రోలు వారు ఈ సిద్ధాంతాన్ని ప్రతి పాదించుటకు రెండు కారణము లూహకందు చున్నవి. ఒకటి: ప్రబంధ కావ్యములలో ప్రాయికము (తరుచు) గా స్త్రీ భోగ్య వస్తువుగా చిత్రింప బడినది. కచ, కుచ వర్ణనలతో కవులు తృప్తి పడక నాభిని, నూగారును, వళులను గూడ వర్ణింప సాగిరి. ఈ విధముగా స్త్రీని కేళీ వస్తువుగా పరిగణించుట రాయప్రోలు వారికి బాధాకరముగా తోచినది. రెండవది: ఆ నాటి సమాజమున అప్పుడప్పుడే ఆంగ్ల విద్యా నాగరికతల సంపర్కము వలన నూతన భావములు వీవసాగినవి. "కాలేజి విద్యల" వలన యువతీ యువకులు పరస్పరము చూచు కొనుటకు, కలసి తిరుగుటకు వీలు చిక్కినది. వారు ఒకరి నొకరు ప్రేమించు కొన సాగిరి. సమాజములో ప్రాచీన విశ్వాసములింకను పెళ్ళగిళ్ళి పోలేదు. నవీన భావములు స్థిరపడ లేదు. ఒక విధముగా ప్రాచిన, నవీన భావములు ఘర్షణ స్థితిలో ఉన్న సంధి యుగమది. ఈ స్థితిలో యువతీ యువకుల స్వచ్ఛంద ప్రేమ ప్రతి ఘాతములకు దారితీసినది. ... ఈ విధముగా నాటి సమాజములో ప్రేమ సిద్ధాంతము వలన కలుగుచున్న దుష్పరిణామాలను గమనించి రాయప్రోలు వారు దానికి పరిస్కారముగా "అమలిన శృంగార" తత్త్వమును, వియోగాధిక్యమును సిద్ధాంతీకరించిరి (సి.నా.రె.). స్త్రీని కేవలము భోగ్య వస్తువుగా చిత్రించిన ప్రాచీన వ్యవస్థను అదుపులో పెట్టుటకే "అమలిన శృంగార" సిద్ధాంత ప్రతిపాదన జరిగినది.

ఆచార్య రాయప్రోలు సంభోగ శృంగారము అప్రధానమని పేర్కొని నప్పటికీ, స్త్రీని తక్కువగా చిత్రించ లేదు. మీదు మిక్కిలి స్త్రీని పురుషుని కంటే ఒక్క మెట్టు ఎత్తుగానే సూచించారు. రాయప్రోలు వారి దృష్టిలో ప్రకృతికి ప్రతినిధి స్త్రీ. ఆమె అవస్థా భేదమును బట్టి ప్రేయసిగా, ఇల్లాలుగా, భగినిగా, సహచారిగా, జననిగా రూపొందునని, "పురుషవృషభము" ల అంతరంగములను మసృణీక రించునది స్త్రీయే యని రాయప్రోలు వారి విశ్వాసం. వారి కావ్యములలో నాయికా, నాయకులు సమాన స్థాయిలో నుండి స్నేహము నెరపినారు.

అందుకే - కనుల నొండొరులను జూచుకొనుట కన్న

మనసు లన్యోన్య రంజనల్ గొనుట కన్న

కొసరి "యేమోయి" యని పిల్చుట కన్న

చెలుల కిల మీద నేమి కావలయు సఖుడ. అనిపిస్తారు తృణకంకణ నాయిక చేత.

"రాయప్రోలు వారు శృంగార రస తత్త్వాన్ని అభినవంగా దర్శించారు. వారు శృంగారాని కిచ్చే అన్వయం వేరు. కామం వర్తిస్తే అది పాశవికావస్థను దాటలేదు. సంతతి కోసం స్త్రీ పురుషులు దాంపత్యాన్ని భరిస్తారనేది ధర్మ సూత్రం. దంపతుల మధ్య చిరస్థాయిగా నిలిచే స్నేహం స్థాయిగా వర్తిస్తుంది." అని రాయప్రోలు వారు తమ దర్శన వివేచనాన్ని వివరించారు. అదే, అమలిన శృంగారం. సూక్ష్మంగా పరిశీలిస్తే, తాత్వికత, సంప్రదాయం, రాయప్రోలు వారి కవితకు ఆధారాలు. నవ్యత జీవం. అమలిన శృంగార సిద్ధాంతం శరీరం. సంప్రదాయ కవిత్వ పద్ధతులను గౌర విస్తూనే, తమదైన నూతన మార్గాన్ని తామే నిర్ణయించుకొనినారు. వారివెంట ఎందరినో నడిపించారు. మిశ్రమమంజరి కావ్యంలోని వారి కవితా సౌరభాలను ఆఘ్రానించ వలసినదిగా పాఠకులకు అభ్యర్థన.





రాయప్రోలు రచనా వైశిష్ట్యం:

రాయప్రోలు సుబ్బారావు గారు తమ రచనలన్నీ ఒకానొక పద్ధతి ననుసరించి వ్రాశారు. ఒక్కో కావ్యం, ఒక్కో ప్రేమ లక్షణాన్ని మనసులో ఉంచుకొని వ్రాయ బడినది. వారు దర్శించిన ప్రేమ తత్త్వ స్వరూపాన్ని వస్తువుగా గ్రహించి, కథాకథన శిల్పానికి ప్రాముఖ్యత నివ్వక, సంక్షిప్త పద్ధతిలో వీరు రచనలు సాగించారు. రాయప్రోలువారి కావ్య ఇతివృత్తాలు అధికంగా సామాజికాలనే చెప్పవచ్చు. వీరిని కదిలించిన అనుభూతులు, సంఘటనలూ, సన్ని వేశాలు, అన్నీ వీరికి కవితా వస్తువులే! ఈ విధంగా వస్తు వైవిధ్యానికి, వస్తు నవ్యతకు ఉదాహరణలుగా నిలుస్తాయి వీరి కావ్యాలు. వీరి రచనా విధానం, భావ వ్యక్తీ కరణ, భాష, వాడిన ఉపమానాలు అన్నీ ప్రత్యేకత కలిగి ఉంటాయి. "రాయప్రోలు కవిత్వంలో కీలకం వక్రోక్తి. రాయప్రోలు తొలకరి ఉరుములు తెలుగు మీద వెదజల్లిన రాగరాగిణీల్లో తడిసి తెలుగు కవిత్వ భాషా స్వరూపమే మారి పోయింది" అంటారు శేషేంద్ర శర్మ గారు. "... సమస్త శబ్ద జాలమూ లక్షణా శక్త్యావిర్భావమే. లేకపోతే కన్నె విరులు ఎలా సమర్తాడతాయి? … వెన్నెలలు ఎలా నిద్రిస్తాయి? ఉషస్సు ఎలా పుష్పిస్తుంది?" ఈ పంక్తు లన్నిటి లోను జన వ్యవహార ప్రసిద్ధార్థ వ్యతి రేకముగా శబ్దమును ప్రయోగించుట, తద్విధ ప్రక్రియా వైచిత్రి కారణముగా శబ్దమునందు అయస్కాంత శక్తిని ఉత్పాదన చేయుట అనే విశిష్ట కళా వ్యవహార ముంది!" (శేషేంద్ర శర్మ)

వస్తువును ఎన్ను కొనుట లోనే కాక, కావ్యానికి పేరు పెట్టుటలో కూడా, కొత్త దనాన్ని కన బరచారు రాయప్రోలు వారు. కావ్యాల లోని ముఖ్య పాత్రలు గాని, సంఘటనలు గాని కావ్యాలకు పేర్లు (శీర్షికలు) గా వాడుట ఇదివరలో సాంప్రదాయం. అందుకే "తృణకంకణం", "జడకుచ్చులు" లాంటి పేర్లు కొత్తగా అనిపిస్తాయి. అలాగే, కావ్య పాత్రలకు పేర్లు పెట్టకుండా, కావ్య రచన చేయడం సాహిత్య జగత్తులో మొట్ట మొదట ప్రారభించిన వారు రాయప్రోలు వారే నెమో? కావ్యా రంభము కూడా నూతన ఫక్కీలోనే మొదలేట్టారు. సాధారణం గా ఆంధ్ర సాహిత్య సాంప్రదాయం ప్రకారం కావ్యాన్ని ఇష్ట దేవతా స్తుతి తో ప్రారంభిస్తారు. ఇందుకు భిన్నంగానే "సుగుణాలవాల" అనే పద జాలంతో ప్రారంభిస్తారు తమ తొలి కావ్యం "లలిత" ను రాయప్రోలు వారు.

రాయప్రోలు వారి రచనకు కొత్త దనాన్ని కలిగించి నవి వారి భావాలు. భావనా రీతిలో కొత్తదనం "మిశ్రమమంజరి" కావ్యం లోని కవితా ఖండికలైన "పెండ్లి లగ్నం", "నవరాత్రి", "మంగళమాఘమ్" మరియు "ఏడుపూలు" మొదలగు వానిలో స్పష్టంగా కన బడుతుంది.

వెండి లాంతరు వెలిగించి వెడలె రజని - ఒడలు తెలియక నిదురించు చున్న జీవ

కోటి నరసి కాపాడ - పక్షులను బోలె - చెట్లు ను న్ కదలవు సొమ్మ సిలిన యట్లు

నీల గిరులను బట్ట బయలున - పెరుగు ముద్దలు పంచు శారద

కవి కులంబుల కామెతలుగా - అందుకొను డిరు సందెలన్

జున్నుగడ్డల భంగి చుక్కల - వెన్నెలను పెరుగన్న మట్టుల -

మ్రింగె దయ్యము వంటి చీకటి - జడలు విడ మిట్టాడుచున్.

పైన ఉల్లేఖించిన కవితలలో గమనించ దగిన విశేషాలు: "చంద్రుని లాంతరుగా భావన చేయుట కొఱకు "రజని" అన్న స్త్రీ లింగ శబ్దాన్ని ప్రయోగించి, కవిగారు దానికి మరింత సౌందర్యాన్ని ఆపాదించి అభిసారికను స్ఫురింప జేయుట! వెన్నెలను మన పూర్వ కవు లెందరో వర్ణించారు కాని, "పెరుగన్నంగా భావించిన వారు లేరేమో?! ఆవిధంగానే ఈ క్రింది కవిత పరికించండి

మొగ్గ నవ్వి ఱెక్కలు విచ్చు - పొట్ట పగల

నవ్వి శుక్తి ముత్యంబులన్ రువ్వు - చెట్లు

నవ్వి లేత కెంపుల వాయసంబు లెత్తు

శబ్దములు నవ్వి అర్థకోశముల తెరచు.

సామాన్యుని దృష్టికి, కవి దృష్టికి హస్తిమశ బేధ మున్నది. అదే, కవి భావనా పటిమ. సామాన్యునికి అత్యంత మాములుగా గోచరించిన విషయాన్ని మహాకవి తన కల్పనా చాతుర్యముతో అత్యంత మనోహరం గాను, రసవత్తరంగాను చిత్రిస్తాడు. మొగ్గ విచ్చి పువ్వుగా మారడం, చెట్లు చిగురు తొడగడం, శబ్దం అర్థాన్ని స్ఫురింప చేయడం లాంటి దృశ్యాలను "నవ్వడంగా" భావన చేసి చమత్కరించడం కవి ప్రజ్ఞా పాటవాలను, భావవైశిష్ట్యాన్ని వ్యక్త పరుస్తుంది! అలాగే, మిశ్రమంజరి కావ్యం లోని "కోయిల" అనే కవితా ఖండికలో

మావి కన్నె రికమే మరులు గొల్పెనొ నిన్ను

నీ పిలుపుతో మావి నిలువెల్ల పూచెనో - వచ్చావె కోకిలా -

అన్న మాటలు రాయప్రోలు వారి ఊహాశక్తిని తెలియజేస్తాయి. మిశ్రమమంజరి కావ్యములోని "కృష్ణాష్టపది" అనే ఖండికలో -

అజు సృష్టి కంటె కవిత - ల్లజు శిల్ప సృజన విలస దలంకృతమై ఆ

రజ మగు నంటివి దువ్విన - నిజ కుంతలములు జడ రమణించెడి కరణిన్

అంటారు మహాకవి. రాయప్రోలు వారు ప్రయోగించిన ఉపమానములు అతి సాధారణ విషయాలకు సంబంధించినవి. అందువలన అవి సామాన్య పాఠకులకు విషయ స్వరూపాన్ని స్పష్ట పరచేందుకు సహక రిస్తాయి.

అదే విధంగా, ఉపమానాన్ని ప్రధానం చేసి చెప్పడం, ఉపమాలంకారాన్ని ప్రయోగించడంలో రాయప్రోలు వారు అనుసరించినది కొత్త పద్ధతి. ఆ విషయాన్ని వారే స్వయంగా చెప్పారు."ఉపమేయాన్ని చెప్ప కుండా ఉపమానాన్నే ప్రధానం చేసి చెప్పాను ... తెలుగు కవిత్వం లోకి ఈ విధానాన్ని తెచ్చింది నేనే" పైన పేర్కొనిన సందర్భానికి ఉదాహరణంగా మిశ్రమమంజరి కావ్యం లోని "బ్రహ్మముడి" కవిత లోని ఓ ఖండికను ఉల్లేఖించడ మైనది. -

పడుచు కరి యావులను పిండిన - పాలు పోయుచు కలువ కడవల

పంచదారను పంచ వచ్చెను - చందమామ జగంబునన్

ఈ కవితలో మనం పాల వంటి వెన్నెలను నల్లని ఆవు వంటి ఆకాశాన్ని, ఉపమేయాలుగా అర్థం చేసుకోవాలి. ఆచార్య రాయప్రోలు వారు వాడిన కావ్య భాషలో నవ్యతా - సాంప్రదాయకతా రెండూ మిళితమై వాడబడినవి. వీరి కవితా శైలి ఒకప్పుడు సరళంగాను, మరొకప్పుడు అతి గంభీరంగాను కని పిస్తుంది. ఈ రెండు లక్షణాల సమ్మేళన మే రాయప్రోలు వారి ప్రత్యేకత. ఈ విషయం నిరూపించుటకు మిశ్రమమంజరి కావ్యం లోని "బ్రహ్మముడి", "విజయదశమి" వంటి కవితలను పేర్కొన వచ్చును. పైన వివరించిన విధంగా రాయప్రోలు సుబ్బారావు గారి రచనా వైశిష్ట్యాన్ని గూర్చిన చర్చకు "మిశ్రమమంజరి" కావ్యం నుండి అనేక కవితలను ఉదహరించ వచ్చు.

"రాయప్రోలు వారి కవిత్వాన్ని గురించి ఒక్క మాటలో చెప్పా లంటే - ఆయన పద్యాలే మంత్రాలుగా జపించు కొంటూ వాటి మద్య మాధురిలో మునిగిపోయి, మళ్ళీ పునర్జన్మ లేనట్లుగా మనిషి తరించి పోవచ్చు" అంటూ శేషేంద్ర శర్మ గారి మాటలతో ఈ వ్యాసాన్ని ముగిద్దాం! కృతజ్ఞత: ఈ వ్యాస రచనకై అనేక సుప్రసిద్ధ రచయితల రచనలు పరిశీలించుట జరిగినది. కొందరి భావజాలం నన్ను అత్యంత ప్రభావితం చేసింది. కొందరిని అనుకరించాను కూడా! ఆయా మహారచయితలకు ఎంతో ఋణపడి యున్నాను. ఇందు మూలంగా వారందఱికి నా కృతజ్ఞత వ్యక్త పరచడమైనది. "మిశ్రమమంజరి" కావ్యం ఎంత ప్రయత్నించినా లభ్యం కాలేదని నా చిరకాల మిత్రులు డా|| వెలగా వెంకటప్పయ్య గారి సహాయం అర్థించాను. సుహృద్భావంతో, సహృదయంతో వారు నా అభ్యర్థనను మన్నించి, శ్రమ పడి ఒక Xerox Copy సాధించి నాకంద జేశారు. వారికి నా కృతజ్ఞతా పూర్వక నమస్సులు.

No comments:

Post a Comment