Friday 10 January 2014

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తెలుగు పుస్తకాలు ఆంధ్రుల సాంఘిక చరిత్ర

మనిషి బాగుపడటానికైన, చెడిపోవటానికైనా, స్నేహితులు, పుస్తకాలు అత్యంత ప్రయోజనకరమైన వుపకరణాలు.


స్నేహం వొకవ్యక్తిజీవితంలోనె మార్పుతెస్తుంది. కాని శక్తివంతమైన పుస్తకం అనేక పాఠకుల వైఖరితో సహితం, ప్రవర్తనలోనూ మార్పుతెస్తుంది. మంచిపుస్తకాలు, విజ్ఞనాన్ని కల్గించవచ్చు, వినోదాన్ని పంచవచ్చు. కొన్ని సంధర్భాల లో రెండిటినీ సమకూర్చ వచ్చు. అటువంటి పుస్తకాలు ప్రసిద్ధ మౌతాయి.మంచి పుస్తకాలు చదవుటకు అందరూ ఆసక్తి చూపిస్తారు. అయితే, యేది మంచి పుస్తకమో నిర్ణయించటం సులభం ఐనపని కాదు. అయినప్పటికీ, ప్రతివిషయ నిర్ణయానికీ కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఏర్పడి వున్నవి. అటువంటి ప్రమాణాలను అనుసరించి మంచి పుస్తక నిర్ణయం జరుగుతుంది.


పుస్తక పఠనం మనిషి ఆలోచనలకు ఒక వుదాత్తతను కల్పించి, స్వార్ధపరత్వాన్ని, సంకుచిత తత్వాన్ని, తగ్గించుట యేగాక, అతనిలో విశ్వమానవతను పెంపొందించేదిగా వుండాలి. "మంచి పుస్తకం మంచి మనసుకు మరో పేరు" అంటారు కొందరు!



తెలుగు సాహిత్యము లో మంచి పుస్తకాలకు కొరత లేదు. మంచి రచయితలూ చాలమందే వున్నారు. ఇటీవలి కాలంలో (అంటే 1955వ సంవత్సరం నుండి) కేంద్ర సాహిత్య అకాడమీ ఈ విషయం లో చెప్పుకో దగిన కృషి చేస్తున్నది. భారతీయ భాష లన్నిటి లో ప్రచురింప బడుతున్న వుత్తమ రచనలను, విజ్ఞులైన పండితుల సహకారం తో పరిశీలింప జేసి, ఉత్తమ రచనలుగా నిర్ణయమైన గ్రంధాలకు జాతీయ బహుమతులను ప్రకటించి, ఆయా రచయితలను గౌరవిస్తున్న విషయం, విజ్ఞులందరికీ విదితమే! గత యేబది సంవత్సరాల కాలం లో తెలుగు లో దాదాపు 45మంది రచయితలకు సాహిత్య ఆకాడమి జాతీయ అవార్డ్ లభించింది. వీరిలో కవులూ, నవలా రచయితలూ, కధా రచయితలూ, సాహిత్య విమర్శకులు, జీవిత చరిత్రలు రచించినవారు,సాంఘిక చరిత్రలు రచించినవారు, వాగ్గేయకారులు వున్నారు. వారి రచనలు, వారివారి ప్రజ్ఞా పాటవాలను చక్కగా చిత్రించడమే కాక, అత్యంత శ్రమ కోర్చి వారు సంతరించిన జ్ఞానసుధను, అందరికి అర్ధమయ్యే భాషలో చదువరులకు అందజేయుట సంతోషకరమైన విషయము. పైన వుల్లేఖించిన రచనలు చదువ తగిన మంచి పుస్తకాలని భావించుట సమంజసము.



సాహిత్య అకాడమి "జాతీయ బహుమతి" గెలుపొందిన పుస్తకాలలోని విశేషాలను సూక్ష్మరూపంలొ పాఠక లోకానికి అందజేయుటయే ఈ వ్యాసకర్త వుద్దేశం. ఈప్రయత్నం చదువరులలో పఠనాసక్తిని పెంపొంద చేస్తుందని ఆకాంక్ష! ప్రస్తుత వ్యాసంలో చర్చిత రచన కీ.శే. సురవరం ప్రతాప రెడ్డిగారు రచించిన "ఆంధ్రుల సాంఘిక చరిత్ర".



కీర్తిశేషులు శ్రీ సురవరం ప్రతాప రెడ్డిగారు బహుభాషా కోవిదులు. వారికి తెలుగు సంస్క్ర్స్తతం, ఉర్దూ, హిందీ, పారసీ, ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యం కలదు. సాహిత్య రంగంలో అత్యంత ఖ్యాతిగడించినవారు. సురవరం ప్రతాప రెడ్డిగారు స్పౄసించని సాహిత్య ప్రక్రియ లేదు. పరిశోధనాత్మక రచనలలో వారిది అందె వేసినచేయి! ఆంధ్రుల చరిత్ర పట్లా, సంస్కృతి పట్ల వారి అభిమానానికి హద్దులంటులేవు! శ్రీ సురవరం ప్రతాప రెడ్డిగారి పరిశొధనాత్మక రచనలలో విషేషించి పేర్కొన దగినవి నాలుగు: 1] "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" 2] హిందువుల పండుగలు, 3]రామాయణ విశేషాలు, 4] హిందుస్థాన చరిత్ర.



పై పేర్కొనిన రచనలలో "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" చాలామంది మేధావుల మెప్పునూ, విమర్శకుల అభిమానాన్ని, అశేష ప్రశంసలను అందుకొనిన ఉద్గ్గ్రంధము. ఈ రచనకు సెంట్రల్ (కేంద్ర) సాహిత్య అకాడమీ 1955వ సంవత్సరపు జాతీయ బహుమతిని యిచ్చి గౌరవించింది.



సమాజంలోని సామాన్య ప్రజల సాంఘిక జీవనాన్ని [ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, వినోదాలు, జీవనశైలి, ఇత్యాదులు] ప్రత్యేకంగా చిత్రిస్తే - ఆ రచనను సాంఘీక చరిత్ర అంటారు. సాంఘిక చరిత్రలు ఆయాకాలపు ప్రజల జీవిత విశేషాలను విపులంగా తెలుసు కొనుటకు హెచ్చుగా వుపయోగ పడతాయి.



తెలుగు భాషలో సాంఘిక చరిత్రలు అరుదుగా కనిపిస్తాయి. చారిత్రక రచనలు వ్రాయుటకు చాలా మంది రచయితలు ప్రయత్నించారు. అట్టివారిలో చిలుకూరి వీరభద్ర రావు గారు, డా. నేలటూరు వెంకటరమణయ్య గారు ముఖ్యులు. ఈ విషయం లో అశేష పరిశోధన చేసిన వారిలో శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు అగ్రగణ్యులు. వారు వ్రాసిన రెడ్డిరాజుల చరిత్ర - ప్రముఖ చరిత్రకారుల మన్నల నందుకొనినది.



ఆ గ్రంధ రచన లో శ్రీ శర్మగారు వుపయోగించిన చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే - మల్లంపల్లివారి శోధనా పటిమ, రాగి శాసనాల లోను, తాళపత్రాల లోను, మరుగుపడి జీర్ణావస్థలో నున్న హస్తలేఖా ప్రతులు శోధించి చారిత్రక సత్యాలను వెలుగులోనికి తెచ్చి - ఆయా అంశాలను సమన్వయ పరచి అర్థవంతమైన నిష్కర్షలు రూపొందించుటలో శర్మగారి ప్రజ్ఞా పాటవాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి. నిష్పక్ష చారిత్రక సత్యాలను వెలికి తెచ్చుట సోమశేఖర శర్మగారి వంటి నిస్వార్థ పరిశోధులకే సాధ్యం.



సాంఘిక చరిత్రను గురించి వివరిస్తూ శ్రీ ప్రతాప రెడ్డిగారు అంటారు: - "రాజుల చరిత్రలు మనకంతగా సంబంధించినవి కావు. సాంఘీక చరిత్రలు మనకు పూర్తిగా సంభందించినవి... సాంఘిక చరిత్ర మానవ చరిత్ర... ప్రజల చరిత్ర, అది మన సొంత కధ. అది మన జనుల జీవనమును ప్రతి శతాభ్ద మందెట్లుండెనో తెలుపు నట్టిది. అది మన తాతా ముత్తాల చరిత్ర. వారి యిండ్లు, కట్టు, తిండి, ఆటలు, పాటలు, పడిన పాట్లు, మన కిచ్చి పోయిన మంచి చెడ్డలు, ఇవ్వన్ని తెలిపి మనకు సహాయ పడును". పైన పేర్కొనిన వాక్యాలు శ్రధ్ధతో పరిశీలిస్తే ప్రతాప రెడ్డి గారి లక్ష్యమేమిటో అర్ధమౌతుంది. ఆలక్ష్య సాధన కోసమే "ఆంధ్రుల సాంఘీక చరిత్ర" రూపొందింది. 1929 నుండి 1949వరకు అంటేరెండు దశాబ్దాల పాటు నిర్విరామంగా వారు చేసిన కౄషి ఫలితమే "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" రచన రూపంలో ప్రచురణమైనది. శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారి ఈ విశిష్ట రచనలో దాదాపు వెయ్యి సంవత్సరముల ఆంధ్రుల సాంఘీక చరిత్ర నిక్షిప్తమైనది. కొన్ని నిక్షిప్తాలను ఆవిష్కరించుకొందామా!



సాహిత్యం ద్వారా సాంఘిక జీవనాన్ని నిరూపించడం ఈ గ్రంధం యొక్క ప్రత్యేకత. ఒక సంస్కృతి యొక్క పుట్టుక, వికాసాలను గురించి ఆధారలతో విశ్లేషిస్తే అది ఆ సంస్కృతీ, సభ్యతల చరిత్రగా పరిగణింప బడుతుంది. నిజమైన సాహిత్యం యేకాలనికి సంబంధించినదైనా ఆకాలపు ప్రజా జీవితానికి అద్దం పడుతుందని చాలామంది రచయితల నమ్మకము. "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" లో మొత్తము ఎనిమిది ప్రకరణాలు ఉన్నవి. అందులో మొదటిది తూర్పు చాళుక్య యుగం. నన్నయ కాలము నుండి కాకతీయుల ప్రాబల్యం దాక దాదాపు క్రీ.శ.1000 నుండి 1200 వరకు తెలుగు దేశము లోని ఆచార వ్యవహాలను సురవరం వారు ఈ ప్రకరణంలో చర్చించారు. ఈ ప్రకరణంలో చర్చించిన విషయాలకు ముఖ్యంగా నన్నెచోడుని "కుమార సంభవము", తెలుగు భారతము (విరాట పర్వము), చాళుక్య సోమేస్వరుడు రచించిన "అభిలషితార్ధ చింతామణి" ఆధారాలగా పరిగణించారు శ్రీ ప్రతాప రెడ్డిగారు.



వివాహానికి సంబంధించిన ఆచార పద్ధతులను వివరిస్తూ - ఆకాలం తెలుగువారి యిండ్లలో నాలుగు రోజుల పెళ్ళి సాధారణమని, వివాహ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నాలుగు రోజుల పాటు జరుగుతూ వుండేవని పెర్కొన్నారు. మహాభారత కాలాన్ని పురస్కరించుకొని, ఉత్తర వివాహం నాల్గు రోజులు జరిగినదనియు, వివాహానంతరం (దిన చతుష్టయానంతరం) బంధువులు యెవరిళ్ళకు వాళ్ళు వెళ్ళి పోయినట్లుగా చిత్రించారు. అలాగే మేన మరదలిని పెళ్ళాడే ఆచారం తెలుగు వారిదేనని సురవరం వారు అభిప్రాయ పడ్డారు. ఆకాలపు వేష భూషలను గురించి ముచ్చటిస్తూ స్త్రీలు మట్టెలు ధరించడం కూడా తెలుగు వాళ్ళ ఆచారమేనని, వైదిక పధ్ధతిలో యిటువంటి రివాజు లేదని వెల్లడిస్తూ "తాళిబొట్టు" ద్రావిడాచారముల లోనిదని పేర్కొన్నారు.



చరిత్ర కారునికి విషయ సేకరణ యెంతముఖ్యమో విమర్శ చేయటం అంతేముఖ్యం. సురవరం ప్రతాప రెడ్డి గారు తూర్పు చాళుక్య యుగమును గురుంచిన చర్చలో ఆనాటి మత విషయమై ప్రస్థావించి, శైవ మతవ్యాప్తికి కారణాలు, రాజరాజనరేంద్రుని క్షత్రియ వంశ విశేషాలు బ్రాహ్మణ జాతి ప్రాముఖ్యత, ఆనాటి కవితారీతులు, యిత్యాది విషయాలను సహేతుకంగా విమర్శించారు. (ఆ.సా.చ.పుట 1o4). వారు పరిశీలించిన పుస్తకాలలో ప్రతిబింబించు జనజీవన స్రవంతిలోని వినోద విషయాలను వివరిస్తూ, అవి యే గ్రంధాలలో వున్నాయో సూచించారు. ఇది శ్రీ రెడ్డిగారి సత్య శోధనకు నిదర్శనం. "అంకమల్ల వినోదము", కోళ్ళ పందెము, లావక పిల్లల కొట్లాట, మేష మహిష యుధ్ధాలు, పావురాళ్ళ పోట్లాట, శ్వేనముల వేట, గీతావాద్య నృత్యములు, పహేళికా, చతురంగము, పాములాట మొదలైన వినోదాలు "అభిలషితార్థ చింతామణి" గ్రంధంలో వర్ణించినారని పేర్కొన్నారు. (ఆ.సా.చ. పుట 7).



నాటి కవుల రచనల లోని సందిగ్ధమైన కొన్ని శభ్దాలను (పదాలను) నిఘంటువుల సహాయముతో వివరించారు.



పరిపాలనా వివరాలను గూర్చి ముచ్చటిస్తూ, తూర్పు చాళుక్యుల కాలంలో పంచాయితీ సభలు వుండే వనియు, సభ్యులు, సభలకు వచ్చే అభియోగాలు, శిక్షా తీర్మానాలు మొదలగు విషయాలను విశ్లేషించుటయేగాక,ఎటువంటి వ్యక్తులు పంచాయితీ సభాసభ్యులగుటకు అర్హులో సూచించారు. (ఆ.సా.చ. పుట7).



ఇదే సందర్భంలో విశ్లేషిస్తూ "చరిత్ర భవన నిర్మాణనికి - సద్విమర్శ, కాల నిర్ణయము, సత్య శోధన, ఆధార విషయాలు పునాది రాళ్ళ వంటివి. వీటిని పునహ్ పరిశీలించుకొని సవరించు కోవటం చరిత్ర కారునికి అత్యంత అవసరము" అని రెడ్డిగారి ధ్రుఢ నమ్మకం. ఆ నమ్మకం తోనే పూర్తి గ్రంధ రచన సాగించారు సురవరం వారు.



ద్వితీయ ప్రకరణాన్ని కాకతీయుల యుగం (క్రీ.శ.1050 నుండి 1323 వరకు) గా పేర్కొన్నారు ప్రతాప రెడ్డి గారు. ఈ ప్రకరణం లో కాకతీయుల కాలమునాటి జీవన స్రవంతిని కనులకు కట్టినట్లుగా చిత్రించారు రచయిత. కాకతీయుల పరిపాలనా కాలము నాటికి అంధ్ర ప్రాంత మంతట బౌద్ధ మతం క్షీణించింది. జైన మత ప్రభావం యెక్కువగా వుండేది. జైన మత ప్రభావాన్ని వీర శైవులు అణచివేశారు.కాకతీయుల పరిపాలనా కాలంలో మత సామరశ్యం లేని కారణాన మత కలహాలు తరుచుగా జరుగు తుండేవి. జైన, శైవ, వైష్ణవ మతాలు పరస్పర ప్రభావం కోసం పోరాడు తుండేవని పేర్కొన్నారు.



ఈ కాలంలో ప్రత్యేకించి పేర్కొన దగిన విషయం, కాకతీయులు అనుసరించిన వ్యాపార విధానము. ఆ కాలంలో యితర దేశాలతో వ్యాపార సంబంధాలు అభివృద్ధి చెందాయి. తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుండి రేవుల ద్వారా రాజ్యం లోనికి అనేక రకములైన వస్తువులు వస్తుండేవి. రేవుల దగ్గర సుంకములు వసువులు చేసేపధ్ధతి అమలులో వుండేది.



సుంకములకు సంబంధించిన సమాచారం శాసనముల ద్వారా ప్రజలకు తెలియ పరచే వారు.ఓరుగల్లు కోటకు బయటి భాగంలో "మైల సంత" జరుగు తుండేదని, ఆసంతలో నువ్వులు, గోధుమలు, వడ్లు, జొన్నలు, మొదలైన ధాన్యంతో పాటు, బెల్లం, చింతపండు, నెయ్యి, మసాలా దినుసులు, రకరకములైన కూరగాయలు అమ్ముతుండే వారని పేర్కొన బడినది. కాకతీయుల కాలమునాటి సంస్కృతీ సాంప్రదాయలతో మిళితమైన జీవనవిధానాన్ని అద్దంపట్టినట్లు చూపించారు రచయిత ఈ ప్రకరణం ద్వారా.



"ఆంధ్రుల సాంఘిక చరిత్ర" లోని మూడవ ప్రకరణము - రెడ్డి రాజుల యుగానికి (క్రీ.శ.1324 - 1434వరకు) సంబంధించినది. రచయిత ఈ ప్రకరణంలో రెడ్డి రాజుల పరిపాలన కాలం నాటి ప్రజా జీవనానికి సంబంధించిన అనేక విషయాలను చర్చించారు.



రెడ్డి రాజుల పరిపాలనలో సామాన్య జీవనం - అనగా సామన్య ప్రజలు అనుసరించిన మతమూ, వారి భక్తి విశ్వసాలు, ఆరాధించిన దేవతలు, వ్యవసాయ పద్ధతులు, శివపూజ సమయంలో కొంతమంది చేసే ఆత్మ బలిదానం, సామాన్యుల వేడుకలు, ఆటలు మొదలగు విశేషాలతో భరితమైన సాంఘిక జీవనం అతి రమ్యంగా వర్ణించారు ప్రతాప రెడ్డిగారు. శైవశక్తి పేరుతో గోగులమ్మ, శ్రీ మండల్లి, నూకాంబ, ఘట్టాంబిక, మాణికా దేవి, అనే శక్తులను, కామాక్షి, మహంకాళి తదితర దేవతలను ప్రజలు పూజించేవారని పేర్కొన్నారు. శివ పూజల్లో ఆత్మబలిదానమివ్వటం, అలా బలిదానమిచ్చేవారిని వీరులుగా పరిగణించడం, అప్పటి ఆచారంగా వివరించారు.



ఆ కాలంలో వ్యవసాయ భూమిని మాగాని (తరి), మెట్ట అని వ్యవహరించేవారు. వరి పండించే భూమిని "మాగాని" అని, జొన్న, రాగి మొదలైన ధాన్యము సాగుచేసే భూమిని మెట్ట అని పిలిచేవారు. ఆ కాలంలో, సామాన్యులు చదరంగం, పులిజూదము, చర్ పర్, మొదలైన ఆటలను ఆడేవారని పేర్కొని, ఆయా ఆటలను విశేషించి వివరించారు,ఈ ప్రకరణంలో శ్రీ రెడ్డిగారు.



రెడ్డి రాజులు అత్యంత వీరశైవాభిమానులు. అందుచేత శైవ మతమునకు వ్యాప్తినిచ్చిరి. రెడ్లు శైవులైనప్పటికి పరమతస్తులను యెలాంటి భాధలకు గురి చేయలేదు. శివక్షేత్రములను యెక్కువగా అభివృద్ధి చేసిరి. కాని రెడ్డి రాజ్యం చివరి కాలంలో, వైష్ణవ మతము దక్షిణ తమిళ ప్రాంతం నుండి తెలుగు దేశము లోని కెగుమతి కాజొచ్చెనని పేర్కొన్నారు రచయిత.



రెడ్డి రాజుల పరిపాలనా సమయంలో సముద్ర వ్యాపారం అభివృద్ధి చెందినట్లుగా వర్ణితమైనది. ఈ కాలంలో, కళా పోషణం బాగా జరిగినట్లు చారిత్రక ఆధారలతో నిరూపించారు ప్రతాప రెడ్డీ గారు. ఈ ప్రకరణంలో కవి సౌర్వభౌముడు శ్రీనాధుడు రెడ్డి రాజుల కాలంలోని వాడని పేర్కొంటూ, విధ్యాధికారిగా శ్రీనాధ మహాకవి ప్రవేశ బెట్టిన కొన్ని పధ్ధతులను చర్చించారు.



ఈ ప్రకరణంలో ముఖ్యముగా పేర్కొనిన విషయమేమంటే, రెడ్డ్లు, వెలమలు, తెలుగు వారు కారని, ఉత్తరాది నుండి వచ్చిన రాష్ట్ర కూటులు రెడ్డ్లుగా పరిగణించ పడినారని, అదే విధముగా తమిళ దేశము నుండి వచ్చిన వెల్లాలు అనువారు తెలుగు దేశములో వెలమలుగా ప్రసిధ్ధి పొందారని శ్రీ సురవరం వారు అభిప్రాయ పడినారు. మరియు, వెలమలు సంఘ సంస్కర ణాభిలాషులని, రెడ్లు పూర్వాచార పరాయణులనీ, యీ రెండు వర్గాల మధ్యెప్పుడూ స్పర్ధ వుండేదని వివరించి, శ్రీనాధుని కాలంలో మాత్రం యిద్దరూ సమానులుగా పరిగణించ పడ్డారని పేర్కొన్నారు. ఇది చారిత్రకంగా గమనింప దగిన విశేషం.



ఈ రచన లోని 4,5 ప్రకరణాలు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినవి. ఈ ప్రకరణాలలో క్రీ.శ. 1339 నుండి 1630 వరకు గడచిన సాoఘిక చరిత్రను చక్కగా విశ్లేషించారు ప్రతాప రెడ్డిగారు.



విజయనగర సామ్రాజ్యము 1336 లో స్థాపితమైనది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అది అత్యంత విస్తరించి,అన్ని రంగాలలోను గణనీయమైన అభివృద్ధిని సాధించి, స్వర్ణయుగంగా ప్రసిద్ధి నార్జించింది. “విజయనగర సామ్రాజ్య మందు ఆంధ్రులది పైచేయిగా నుండినది. ఆంధ్ర దేశము మహావైభవముతోను, ఐశ్వర్యముతోను నిండియుండెను. ఆంధ్రులుత్సాహవంతులై కళా పోషకులై దేశాంతరము లందును ప్రఖ్యాతి గాంచిరి. అది మంచి చెడ్డలతో నిండిన ప్రభంధ యుగము. సుందర నిర్మాణములు, చిత్రలేఖనములు, ఇతర శిల్పములు దేశమంతటను సువ్యక్తములయ్యెను. ధనికుల భోగలాలసత యిదే కాలమందు విజృంభించెను.”విజయనగర సామ్రాజ్య కాలం నాటి ఆంధ్రుల ప్రాబల్యం, పై వాక్యాల ద్వారా పేర్కొనుటయే కాకుండా, నాటి ప్రజా జీవనాన్ని అద్దం పట్టినట్లు చిత్రించారు రచయిత ప్రతాప రెడ్డిగారు, ఈరెండు ప్రకరణాలలో.



ఆనాటి రాజుల వేష భూషలను గరించి ముచ్చటిస్తూ, నాటి రాజులు పన్నీటిలో కలిపిన కస్తూరిని పూసుకునే వారని, పొడగైన కుచ్చుల టోపీలను పెట్టుకొనే వారని, చెవులకు ముత్యాల పోగులు పెట్టుకొని, మెడలో ముత్యాల హారములు వేసుకొని, యెర్రని అంచులతో కూడిన తెల్లని వస్త్ర్రాలు ధరించే వారని, బంగారు పిడితో కూడిన కత్తిని చేపట్టే వారని వివరించారు. రాజులకు, రాజబంధువులకు వేటపై యెక్కువ ఆసక్తి వుండేదని, చిరుత పులులను జింకలను వేటాడెడు వారని వివరించారు.



ఆటవికులు రాజదర్శనానికి వచ్చినప్పుడు, రిక్త హస్తాలతో కాకుండా, కానుకలుగా పక్షి పిల్లలు, దుప్పి కొమ్ములు, యేనుగు దంతములు, పులి గోర్లు, జింక చర్మం, తేనె, చారపప్పు మొదలగునవి యిచ్చుట అనే సదాచారం పాటించేవారని పేర్కొన్నారు సురవరంవారు.



సాధారణ జన జీవనాన్ని గూర్చిన చర్చలో రెడ్లు సాధారణ జనులలో ముఖ్యు లనియు, వ్యవసాయమును తమ ప్రధాన కుల వృత్తిగా పాటించే వారని వివరించారు. ఆ కాలం లోని రెడ్లు తమ చేల వద్ద గుడిశలు వేసుకొని మంచెలు కట్టుకొని పిట్టల నుండి, దొంగల నుండి చేలకు కావలి గాసేవారలని, వారి స్త్రీలు ముసురు పట్టిన వర్షా కాలంలో అంబలి పాత్రను నెత్తిమీద పెట్టుకొని దానిపై జమ్ముతో అల్లిన గూడను వేసుకొని కావలిగావున్న తమ పురుషులకు యిచ్చెడివారట! రాయలవారు, చిన్న ప్రదేశములందు సహితము, చెరువులు, కుంటలు, కాలువలు త్రవ్వించి, రైతులకు తక్కువ పన్నులపై భూములిచ్చి,వ్యవసయదారులను ప్రోత్సహించిన విధాన్ని ప్రతాప రెడ్డిగారు చారిత్రక ఆధారలతో సహితం వర్ణించారు. విజయనగర రాజుల కాలంలో దేశీ, విదేశీ వ్యాపారము అత్యంత అభివృధ్ధి చెందెను. "విజయనగర సామ్రాజ్యము తూర్పున కటకము నుండి రామేశ్వరము వరకును, పడమట గోవానుండి కన్యాకుమారి వరకును వ్యాపించి యుండెను. అందువలన తూర్పున బర్మా, మలయా, ఇండోనేషియా, చైనా దేశములతో వ్యాపారము జరిగెనని వివరింప బడినది. పడమట గోవాలో, కాలికట్టు రేవులో ఎక్కువ వ్యాపారము జరిగెను. కాలికట్టు వంటి మంచి రేవులు సామ్రాజ్యమందు 300 వరకు వుండెను". వ్యాపార విశేషాలను వివరిస్తూ - "విజయనగర సామ్రాజ్యము నుండి బట్టలు, బియ్యము, ఇనుము, చక్కెర, సుగంధ ద్రవ్యాలు యెగుమతి యయ్యెను. తమిళ దేశపు రేవగు పులికాటు నుండి మలకా, పెగూ, సుమత్రా దేశాలకు రంగు అంచుల ముద్రలుకల [కలంకారి} వస్త్రములు నెగుమతి చేసిరి".



ఆ కాలములో మిరియాలకు చాలా గిరాకి వుండెడిదనియు, మళయాళ దేశ మందు మిరియాలు సమృధ్ధిగా పండుట వలన వ్యాపారులు వాటి నక్కడి నుంచి తెప్పించి, తెలుగు దేశమంతట అమ్మినారని ప్రతాప రెడ్డిగారు అభిప్రాయ పడినారు. విజయనగర పరిపాలనా కాలంలో పరిశ్రమలను గూర్చి ముచ్చటిస్తూ - తెనుగు సీమ ప్రాచీనము నుండి వజ్రాల గనులకు ప్రసిధ్ధి చెందిన దని, "గుత్తి" కి 20 మైళ్ళ దూరములో నున్న "వజ్రకారూరు" వజ్రాలకు ప్రసిధ్ధి చెందిన దనియు, గుత్తి దుర్గా ధీశుడు అక్కడి వజ్రాలను చక్రవర్తులకు పంపెడివాడని, ఇటువంటి వజ్రపు గనులు రాయల సీమ ప్రాతంలో మరి నాల్గు వుండెడి వనియు, చారిత్రక ఆధారలతో నిరూపించారు శ్రీ ప్రతాప రెడ్డిగారు.



రెడ్డి గారి దృష్టిలో విజయనగర కాలమునాటి ప్రజల వేష ధారణ ప్రత్యేకించి గమనింపదగిన విషయం. ముఖ్యముగా "పాలవేకరి కదరీ పతి" చూపించిన వేషాలను సురవరం వారు వర్ణించారు. వీనిలో ఎరుక పాలెగాడు, వేటవేషం, కోమటి శెట్టి వేషం, దాసరి సాని, కరణము, తురక జవాను, పురోహితుడు, ఎరుకలి, రాజు, భటుడు, బ్రాహ్మణ స్త్రీ , రెడ్డి స్త్రీ, మొదలైన పాత్రల వేష ధారణా విశేషాలను సవివరంగా చిత్రించారు. ఈ పాత్రలన్ని, విజయనగర కాలమునాటి సమాజ ప్రతిబింబాలని శ్రీ రెడ్డిగారి అభిప్రాయం. విజయనగర సామ్రాజ్య కాలములో పంచాయతి సభలు ప్రతి గ్రామమందు స్ధిరముగా నున్నట్లు తెలియు చున్నది. పంచాయితీ పధ్ధతి తమిళ దేశ మంతటా క్రీ.శ. 800 సంవత్సరము నుండియే ప్రసిధ్ధి చెందినది. కుల వివాదాలు, సంఘ సంస్కారపు కట్టుబాట్లు, నేరముల విచారణ, పన్నుల వసూళ్ళు గ్రామ ముఖ్యులే చేయు చుండిరట. అన్ని తీర్పులకు కూడా వారే భాద్యులు. ఆ పధ్ధతులే తెలుగు సీమలోను బలపడినట్లు తెలియు చున్నది. తెలుగు సీమలో పంచాయితీలకు యెన్నికలు మాత్రం జరిగిన నిదర్శనలు మాత్రం కనిపించవు. పంచాయితీ విధానము మాత్రము బాగానే అమలు జరిగినట్లు తెలియుచున్నది.



క్రీ.శ. 1600 నుండి 1757 వరకు జరిగిన సాంఘిక చరిత్రను ఆరవ ప్రకరణంలో చర్చించారు సురవరం ప్రతాప రెడ్డి గారు.విజయనగర సామ్రాజ్య పతనము ఆంధ్రుల పతనానికి దారి తీసిందని రెడ్డి గారి అభిప్రాయము. క్రీ.శ. 1630 ముందే హిందువుల పతనం, ముసల్మానుల విజృంభణ జరిగినట్లు చారిత్రక ఆధారాలతో నిరూపితమైనది.



తళ్ళికోట లేక రక్షస తగడి యుధ్ధం క్రీ.శ. 1565 లో జరిగింది. ఆయుధ్ధము తర్వాత ఆంధ్ర దేశములో రాజకీయ దౌర్బల్యం మొదలైంది. కొంత కాలం పెనుగొండలో ఆంధ్రరాజుల పాలన సాగింది. కాని, అక్కడి నుండి పీఠము చంద్రగిరికి మారగానే ఆంధ్రుల రాజకీయౌన్నత్యం పరిసమాప్తి అయిందనే చెప్పాలి. క్రీ.శ. 1600 వరకు ఆంధ్ర దేశము లో ఒక్క గోల్కొండ సుల్తానులు తప్ప తక్కిన తురక లెవ్వరునూ రాజ్యము చేయలేదు. అప్పటికి గోల్కొండ నవాబుల ఆధిక్యము తెలంగాణలో వున్నప్పటికి, ప్రక్కన విజయనగర చక్రవర్తుల ప్రభావ మున్నందు వలన నవాబులు ఆంధ్రులను దుష్టముగా పాలించిన వారు కారు. కాని, తళ్ళికోట అనంతరం తెలుగు దేశములో తురకల విజృంభణము యెక్కువయ్యెను. క్రీ.శ. 1600 తర్వాత 150 ఏండ్ల వరకు తురకల దాడు లెక్కువై కర్నూలు,కడప,గుంటూరు నవాబు లేర్పడి, ఉత్తర సర్కారులు వారి వశమై దుష్పరిపాలన వొకవైపు సాగుచుండగా, మరో ప్రక్క, పిండారీలు, దోపిడి గాండ్లు తురకల దండ్లు యెక్కువై జనుల హింసించి, చంపి, దోచి, చెరచి, గుడులను కూల ద్రోసి, నానా ఘోరాలు చేయగా ఆంధ్రులు భయ భీతులై వర్ణించజాలని బాధలకు లోనైరి. ఆనాటి ప్రజల దైన్యస్థితి, అప్పటి కావ్యాలలోను, ప్రభంధాలలోను, చాటువులలోను ప్రతి బింబితమైనది. ఈ ప్రకరణములో పేర్కొనిన సాంఘిక చరిత్రకు వేమన పద్యములు, వెంకటాధ్వరి విశ్వగుణ దర్శనము, గోగులపాటి కూర్మనాధుని - సింహాద్రి నారసింహ శతకము, భల్లా పేరకవి భద్రాద్రి శతకము మొదలగునవి ఆధార భూతములుగా పరిగణించ బడినవి. పైన పేర్కొన్న గ్రంధాలను నిశిత విమర్శకా దృష్టితో పరిశీలించి చారిత్రక విషయాల నిగ్గును తేల్చుట ప్రతాప రెడ్డి గారి వంటి పరిశోధకులకు తప్ప అన్యులకు అసాధ్యము. దక్షిణ దేశములో రఘునాధ రాయని కాలములో [1614-1633] ఆంధ్రుల గొప్పదనము నిలిచి యుండెనని తెలియు చున్నది. అతని కాలములో తెనుగు వారిపై మహమ్మదీయుల ఆక్రమణలు కాని, యుధ్ధాలు కాని సాగనేరక పోయెను.తెలుగు ప్రజల సంస్కృతీ సభ్యతలను పరిరక్షణ చేయుటయే కాక, వాని వికాసనికి రఘునాధ రాయల పాలన దోహదాన్నిచ్చింది.



ఇతర ప్రాంతాలలో తెలుగు వారు తమ పూర్వులు నిర్మించిన శిల్పాలను కోలుపోయిరి కాని, తంజావూరులో పాతవి నిలుపుటయే కాక రఘునాధ రాయలు చక్కని శిల్ప సౌందర్యము కల దేవాలయాలను, రాజభవనాలను, కోటలను నిర్మింప జేసెను.రఘునాధ రాయల కాలంలో, సంగీత, సాహిత్య, నృత్యకళలు అభివృధ్ధి పొందెను. కాని అతని కుమారుని రాజ్య కాలంలో తంజావూరు స్వాతంత్ర్యం మట్టిలో కలసి పోయెను. క్రీ.శ. 1600 నుండి 1757 వరకు గల కాలములో ముసల్మానుల నీడలు తెలుగు వారిపై అధికముగా పారెను. 1700 తరువాత తెనుగు వారి పతనము పూర్తిదశకు చేరుకొనెను, అని ఆంధ్రదేశ సాంఘిక స్థితిని విశ్లేషించారు శ్రీప్రతాప రెడ్డి గారు.



క్రీ.శ. 1757 నుండి 1857 వరకు జరిగిన సాంఘిక చరిత్రను సమీక్షించారు శ్రీప్రతాప రెడ్డిగారు ఈ ఏడవ ప్రకరణం లో. క్రీ.శ. 1197 లో మహ్మద్ ఖిల్జీ ప్రారంభించిన తురక రాజ్యం అనేక విజయ పరంపరల తో 550 సంవత్సరాల తరువాత 1757 లో ప్లాసీ యుధ్ధంతో పరాజయం పొందింది. ఇంగ్లీషువారు భారత రoగం మీద ప్రత్యక్ష మైనారు. ఈ కాలం లో ఆంధ్రుల ఆర్ధిక పరిస్ధితిని గూర్చి చర్చించారు రచయిత. ప్లాసీ యుధ్ధం తరువాత దేశం ఇంగ్లీషు వారి చేతుల లోనికి అతి వేగంగా పోయింది. 600 ఏండ్ల భీభత్స పాలనతో తురకలు భారత దేశమును పూర్తిగా గెలువ లేక పోయినారు. కాని 100 సంవత్సరముల లోనే యావద్భారత దేశాన్ని ఇంగ్లీషువారు గెలుచుకొనిరి. ఇంగ్లీషు వారికి ప్రజల సౌకర్య సమాలోచనం కించిత్తు కూడ లేకుండెను. వారిది ప్రత్యక్ష పరోక్షా పహరణమే. తమ దేశపు సరుకులను ఇచ్చట అమ్ముటకై మన దేశపు పరిశ్రమలు నాశనము చేశారు. వారి పాలనలో క్షామాలు యెక్కువగా నుండెను. ముస్ల్మానులు హిందువులను దోచిన దంతయు దేశమందే వుండి మరల క్రమముగా అది అంతయూ జనులకే చెందెను. కాని ఇంగ్లీషు వారు వ్యాపారం ద్వారా, పన్నుల ద్వారా, దోపిడీల ద్వారా గ్రహించిన దంతయు తిరిగి రాకుండా ఇంగ్లాండు చేరెను. ఇది మన ఆర్ధిక పతనానికి ముఖ్య కారణం.



ఉత్తర సర్కారులను, రాయల సీమ అను కర్నూలు, కడప, బళ్ళారి, అనంత పురం జిల్లాలు, గుంటూరు జిల్లాయు, క్రీ.శ. 1800 లోపలనే ఇంగ్లీషువారి ఆధీనము లోనికి పోయెను. 1857 నాటికి తెలుగు దేశమంతా ఇంగ్లీషు వారి వశ మయ్యెను. ఉత్తర సర్కారు నాలుగు జిల్లాల లోని భూమి అంతా జమిందారుల పాలెగారు తెగకు చెందినది. ఈ జమిoదారులు మొగలు సుల్తానులకు కప్పము కట్టి, ఇంచుమించు రాజులై వ్యవహరించారు. ఈ పాత పధ్ధతిని మార్చి శాస్వత భూమి పన్ను పధ్ధతిని ప్రవేశ పెట్టారు.ఇంగ్లీషు ప్రభుత్వం దేశం లో ఆర్ధిక స్థితిని క్షీణ దశకు చేర్చింది. ఇంగ్లీషు ప్రభుత్వ ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థ పైననే కాక, దేశ జనుల ఆచారముల పై కూడ, యెక్కువైనది.



1857 కు పూర్వముండిన ఇస్లాం మత వ్యాప్తి,తర్వాత ఆగిపోయెను. క్రైస్తవ మత వ్యాప్తి సంఘములు [మిషనరీలు] అనువైన స్థలములందు స్థాపిత మయ్యెను. నానా విధములైన సేవల ద్వారా మిషనరీలు జనులను క్రైస్తవ మతము లోనికి ఆకర్షించు చుండిరి. తమ మత గ్రంధమైన బైబిల్ ను భారతీయ భాష లన్నిటి లోనికి అనువదించి, ముద్రించి అందరికి వుచితముగా పంచి పెట్టిరి. విశేషముగా అంటరాని జాతుల వారు తమ తమ కులాలను విడచి క్రైస్తవ మతము లోనికి చేరి పోయిరి. కొన్ని జిల్లాలో రెడ్ల లాంటి యితర కులాల వారు కూడా క్రైస్తవ మతము లో చేరిరి. మిషనరీలు, ఫాదరీలు తమ మతము గొప్పదనాన్ని ప్రచారము చేసు కొనుటలో తృప్తి చెందక, హిందువుల ఆచారలను గురించి, ఆంధ విశ్వాసలను గూర్చి దుష్ప్ర్రచారము చేసి, హిందూ సంఘము లోని లోటు పాట్లు బయలు పరచి, జనులలో హిందూ మతముపై విశ్వాసమును, భక్తిని, ఆదరమునూ పోగొట్టు ప్రయత్నాలు విరివిగా సాగించిరి. ఈ పరిస్థితులలో ఆర్య సమాజం ఆధ్వర్యాన సనాతన హిందూ మత ప్రచారం, బ్రహ్మ సమాజం ద్వారా సంఘ సంస్కార ప్రయత్నాలు మొదలైనవి.



రాజా రామమోహన్ రాయల బ్రహ్మ సమాజ శాఖలు కొన్ని కృష్ణా, గోదావరి జిల్లాలో స్థాపిత మాయెను. ఆర్య, బ్రహ్మ సమాజ భావములు జనులలో బాగా వ్యాపించెను. కందుకూరి వీరేశలింగం ఫంతులు కులముల తార తమ్యముల మీద, మూఢ విశ్వాసాల మీద, అవైదికమగు మూర్తి పూజల మీద దెబ్బ తీసెను. స్త్రీలపై జరుగు అత్యాచారములను, ముఖ్యముగా వితంతువుల పునర్వివాహము చేయక నిరోధించుటను ప్రతిఘటించి, వితంతు వివాహములను చేయించి, అనేక వితంతు శరణా లయాలను స్థాపించారు. ఆయన సంఘ సంస్కరణ ప్రయత్నాల మూలముగాను, ప్రచార పధ్ధతుల మూలముగాను, తెలుగు దేశములో అపూర్వ సంచలనము కలిగెను.అనేక దురాచారములు, స్త్రీ సహగమనం లాంటివి సమాప్త మయ్యెను. పారతంత్ర్య విముక్తికి ముఖ్య సాధనము సంఘ లోపముల సంస్కారమని, ప్రజలలో చైతన్యాన్ని మేల్కొల్పి, అనేక సంఘ సంస్కరణలకు మార్గ దర్శకు లైరి.





ఈ సందర్భము లోనే క్రీ.శ. 1885 అఖిల భారత జాతీయ మహా సభ [నేషనల్ కాంగ్రేసు] స్థాపిత మయ్యెను. కాంగ్రేసు అవతరణ జాతీయతకు పునాదిగా భావించ వచ్చును.



ఇంగ్లీషు పరిపాలన ఆర్ధికముగా దేశానికి గొప్ప నష్టం కలుగ జేసింది. దేశములోని పరిశ్రమలు నసించాయి. కొత్త పరిశ్రమలను ఇంగ్లీషు వారు అణగ ద్రొక్కిరి! ఆకారణంగా, జనసామాన్యం వ్యవసాయముపై ఆధార పడవలసి వచ్చెను. తరచుగా క్షామములు వచ్చుట చే అపార జన నష్టము జరిగెను. 1876 - 78 సంవత్సరాలలో దక్కను లో మహా క్షామము సంభ వించెను. ఆ క్షామము [ధాత కరువు] దెబ్బ తెలుగు సీమపై విశేషముగా పడెను. ధాత కరువులో లక్షల కొలది జనం తెలుగు సీమలో మరణించిరి. ధాత కరువును గూర్చిన కథలు, పాటలు నేటికిని ప్రచారము లో వున్నవి.



ఈ సమీక్షా కాలము [1857 నుండి 1907 వఱకు] లో సామాన్య జనుల ఆచార వ్యవహారాల ల్లోను, మత విశ్వాసల లోను అనేక మార్పులు చోటు చేసుకొన్నట్లుగా చిత్రించారు, ప్రతాప రెడ్డి గారు. ఇంగ్లీషు వారు తమ నూతన భావాలతో హిందువుల లోనే కాకుండా, ముస్లీముల లోను మార్పులు తెచ్చిరి. ఇంగ్లీషు విద్యా వంతుల లో కొందరు ఇంగ్లీషు వేషములను [సూటు, బూటు] ధరించుట గౌరవ సూచకంగా భావించ మొదలిడిరి. కాలముతో పాటు ప్రజలు ఆధునిక యుగము లోకి అడుగు పెట్టారు. టపా, రైలు, తంతీ సౌకర్యాలు వృధ్ధి కాజొచ్చెను. ముద్రణా యoత్రములు విడివిగా వాడి దిన, వార పత్రికల ప్రకటనా, ప్రచారము లెక్కువ గా జొచ్చెను.



ఇంగ్లీషు వారి ప్రభావము తెలుగు భాషపై చాల పడెను. ఇంగ్లీషు చదివిన విద్వాంసులు కందుకూరి వీరేశ లింగంగారు, కొమర్రాజు లక్ష్మణ రావు, గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు, కట్టమంచి రామ లింగా రెడ్డి గారు, గిడుగు రామమూర్తి పంతులు గారు, ఆంధ్ర వాఙ్మయ పంధానే మార్చినారు. కట్టమంచి వారి కవిత్వ తత్త్వ విచారము సనాతనపు కోటలో గుండు ముట్టడి చేసి పెద్ద సంచలనము కలిగించెను. వీరేశ లింగం గారి ప్రతిభ సర్వతో ముఖాభి వృద్ధి జెంది, పలు రకాల సాహిత్య ప్రక్రియలకు నాందీ వచనము పల్కెను. కొమర్రాజు వారు, గాడిచర్ల వారు, రావిచెట్టు రంగా రావు గారు, [అంటే ఉత్తర సర్కారు, రాయల సీమ, తెలంగాణ ప్రతినిధులు] కలిసి 1907 వ సంవత్సరములో హైదరాబాదు లో "విఙ్ఞాన చంద్రికా" గ్రంధ మాలను స్థాపించారు. ఇది చారిత్రాత్మక సంఘటన. ఆ గ్రంధ మాల తొలి ప్రచురణ గాడిచర్ల వారి అబ్రహం లింకన్ చరిత్ర,, కొమర్రాజు వారి పీఠికతో ప్రచురితమైనది. భాషా వికాసానికి గద్య రచనల ఆవశ్యకతను గుర్తించిన పరవస్తు చిన్నయ సూరి, కందుకూరి వీరేశ లింగం గారు గద్య రచనలు వ్రాసి ప్రచురించిరి. ఆ కాలం లో అనేక వార, మాస పత్రికలు స్థాపితమై, వుపయోగము కొరకు వాఙ్మయం పుట్టించి, తెనుగు భాషను యొక నాగరిక భాషగా పెంపొందించుటకు వారు చేసిన కృషి అత్యంత ప్రశంస నీయం. ఆ ప్రయత్నములో యొక సహస్ర భాగ మైనా యిప్పుడు [ఈ కాలంలో] జరిగితే సంతోష కారణ మగును. చంద్రికా గ్రంధ మాల తెలుగు భాషా వాఙ్మయ వికాసమునకు చేసిన సేవ యెంతయో మెచ్చు కొన దగినది. 1900 ల తర్వాతి కాలం లో తెనుగు లో ఇంగ్లీషు, సంస్కృత పధ్ధతులపై నాటకాలు, నవలలు, వచన రచనలు, విమర్శలు, చరిత్రలు, జీవిత చరిత్రలు, ఖండ కావ్యాలు, విరివిగా ప్రచురించ బడసాగెను.



బెంగాలు విభజన వ్యతిరేకతతో బెంగాలులో మొదలైన జాతీయోద్యమం గాలి తూర్పు తీర మందలి యుత్తర సర్కారు తెలుగు జిల్లాల పై వీచెను. దానితో మన పూర్వ సంస్కృతి గర్వింప దగినది కాదనిన అపోహ మారి భాషాభిమానం యుప్పొంగి, రక రకాల సాహిత్య, సంగీత, నాట్య కళల పునర్వికాసానికి మార్గ మైంది. 1857 విప్లవానంతరం తెలుగు సీమలో యెక్కువ పురోభి వృధ్ధి సర్కారు జిల్లాలో జరిగింది. అనేక కారణాల వలన, రాయల సీమ, తెలంగాణ ప్రాంతాలలో అభివృధ్ధి మందకొడిగా సాగింది. ఈ అసామనత అనేక కష్టాలకు దారి తీసింది. ప్రాంతీయత తెలుగు జాతి దౌర్బల్యానికి హేతువై, తెలుగు జాతి సమైక్యతకు గొడ్డలి పెట్టుగా పరిగణించింది.



"ఆంద్ర్హుల సాంఘిక చరిత్ర" అనే ఈ గ్రంధములో దాదాపు వెయ్యి సంవత్సరములు తెలుగు జాతి యేవిధముగా బ్రతికిందో కళ్ళకు కట్టినట్లు చిత్రించ బడినది. ఈ చరిత్ర ఒక జీవిత కాలపు పరిశోధనా ముక్తా ఫలము.



కీర్తి శేషులు నార్ల వెంకటేశ్వర రావుగారు అన్నట్లు గా "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" ఆంధ్ర జాతి గత చరిత్రను తెలుసు కొనడానికి యుపక రించుటయే కాక, యేయే కారణాలు దాని అభ్యుదయానికి తోడ్పడినవో, మరి యేయే కారణాలు దాని పతనానికి దోహద మిచ్చినవో సందర్భాను సారంగా వివరిస్తున్న యీ మహా గ్రంధం, ఆంధ్రులకు భావి కర్తవ్య పధాన్ని నిర్దేశిస్తున్నది కూడ". ఆంధ్ర జాతి చరిత్రను ప్రతిభా పూర్వకముగా చిత్రించిన శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారు సంస్తవ నీయులు. తెలుగు వారంతా యీ పుస్తకాన్ని చదివి ఆనందించాలని కోరుకొంటూ - యావత్తెలుగు జాతి శ్రీ రెడ్డి గార్కి సదా ఋణ పడి వుంటుందని నమ్ముతూ వారికి కృతజ్ఞతలు తెలియజేసు కొంటున్నాను.



ఈ వ్యాస రచనలో ఈ దిగువ పేర్కొనిన రచనలు వుపకరించినవి. ఆయా రచయితలకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను.



1.] ప్రతాపరెడ్డి, సురవరం, 1896 - 1953.

ఆంధ్రుల సాంఘిక చరిత్ర., హైదరాబాదు, ఓరియంటల్ లాజ్మన్, 1996. xv, 364 పుటలు.

2.] శాస్త్రి. ద్వా. నా.

శత జయంతి సాహితీ మూర్తులు. హైదరాబాదు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 1997. 135 పుటలు.

3.] రమణ, కె. యస్.

సురవరం ప్రతాప రెడ్డి : సంక్షిప్త జీవిత పరిచయం. హైదరాబాదు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2009. 46 పుటలు.

4.] వల్లభ రాయుడు, వినుకొండ.

క్రీడాభి రామము. బి. వి. శింగరాచార్య సంపాదితం. హైదరాబాదు, ఎమెస్కో, 2009. 189 పుటలు.



ఈ వ్యాసం కీ.శే. సురవరం ప్రతాప రెడ్డి గారి "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" ను గురించిన విశిష్టతా వివరణ మాత్రమే కాని, విమర్శ కాదు. చదువరుల దృష్టిని మంచి రచనల వైపు ఆకర్షించి, పఠనా సక్తిని పెంపొంద జేసే, సాహిత్య వ్యాసంగ ప్రసారణా ప్రయత్నం. ఈ ప్రయత్నం ఫలిస్తుందని రచయిత నమ్మకం.


ఈ వ్యాసం స్వీయ రచన. ఎవరి రచనకూ - అనువాదం కాని, కాపీ కాని కాదు.

ప్రొ.రావినూతల సత్యనారాయణ.

No comments:

Post a Comment