Saturday 5 October 2013

Balantrapu Rajanikantarao

 భూమిక:

 కేంద్ర సాహిత్య అకాడమీ 1955 నుండి నేటి వరకు అనేక తెలుగు పుస్తకాలకు జాతీయ స్థాయిలో పురస్కారాలు ప్రకటించింది. వరుస క్రమంలో శ్రీయుతులు బాలాంత్రపు రజనీకాంతరావు గారి రచన "ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము" అయిదవది. ఈ గ్రంధము రజనీకాంతరావు గారి అనేక సంవత్సరాల పరిశోధనా ఫలితం. సంగీత శాస్త్రపరమైన యీ రచన, యెంతో పరిశోధనతో,  పరిజ్ఞాన సంపదతో కూడిన ప్రామాణిక గ్రంధం. దీని ప్రశస్తిని పూర్తిగా అవగాహన చేసుకొనుటకు పాఠకునికి సహితం సంగీతాన్ని గురుంచిన కొన్ని సామాన్య విషయాలు వివరింప వలసిన ఆవశ్యకత, ప్రాముఖ్యతను సంతరించు కొంటుంది. ఆ కారణాన, సంగీత విషయాలు యీ వ్యాసంలో సూచన ప్రాయంగా పేర్కొనడమైనది.     

   భారతీయ సంగీతం:  సంగీతం 64 కళలలో శ్రేష్టమైనదని   విజ్ఞుల భావన. సంగీతం సామ వేదానికి అనుబంధ వేదముగా చెప్ప బడిన గాంధర్వ వేదమైన వుపవేదం. ప్రాచీన కాలంలో గంధర్వులు యీ విద్యను అభ్యసించి, వృద్ధి పరచి వ్యాప్తి లోనికి తెచ్చిన మూలాన యీ విద్యకు గాంధర్వ మని పేరు వచ్చి యుండును!? ఇతిహాస కాలానికి పూర్వమే సంగీతం అభ్యసించ బడిన విషయం గమనిస్తే, ఇది అతి ప్రాచీన కళ అని ధృఢ మవుతుంది. కాల క్రమాన  

 భారతీయ సంగీత వాహిని రెండుగా చీలి ఉత్తర, దక్షిణ సాంప్రదాయాలుగా రూపొందినది. "ఆధునిక కర్ణాటక సంగీత పద్ధతిని" స్థాపించినది శ్రీ వేంకటమఖి ("చతుర్దండి ప్రకాశిక" గంథకర్త - క్రీ.శ.1637) అని కొంత మంది సంగీత శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడితే, మరి కొందరు భిన్నాభి ప్రాయాన్ని   వ్యక్త   పరచారు. ఏది యేమైనప్పటికి, తెలుగు వారు ఆదినుండి సంగీతజ్ఞులన్న విషయం సృష్టపడుతుంది. 

   భారతీయ సంగీత కళ రెండుగా చీలిపోయి రెండు విధములుగా రూపొందిన కాలంలో ఉత్తరాదిని వ్రజ భాష, దక్షిణాది పధమున తెలుగు భాష సంగీత భాషలుగా ప్రాముఖ్యం గడించాయి. తెనుగు మాతృ భాష కాని దక్షిణాది కవులు, గాయకులు, పండితులు, కళా వేత్తలు కూడా తెలుగు భాషను అభ్యసించి ఆ భాషలో సంగీత రచనలు చేసి, కర్ణాటక సంగీతాన్ని అభివృద్ధి పరిచారు.దీనికి ముఖ్య కారణం తెనుగు భాష లోని మాధుర్యం! శ్రీ రజనీకాంత రావు గారు యీ విషయాన్ని గ్రహించిన వారు కాబట్టి తమ రచనకు "ప్రసిద్ధ వాగ్గేయ కారులను గురుంచి ఆంధ్రము (తెలుగు) లో వ్రాసిన చరిత్రము" అనే అర్ధాన్ని పురస్కరించు కొని పేరు పెట్టుకొని వుంటారని మనం భావించ వచ్చును. అందుకే కాబోలు, యీ పుస్తకం లో ఆంధ్రేతర వాగ్గేయ కారులైన జయదేవుడు, గోవింద దీక్షితులు, మొదలైన వారి జీవిత విశేషాలను పొందు పరచారు.   

   మన పెద్దలు (పూర్వీకులు) సంగీతాన్ని రెండు వర్గాలుగా పేర్కొన్నారు. అవి: మార్గ సంగీతము, దేశీ సంగీతము. శాస్త్ర సమ్మతమై పూర్వమున లాక్షణీకులు అమర్చిన లక్షణ విధులను తప్పక, వాటిని అనుసరించి అభ్యసించు రాగమును, గీతమును, రెండు లక్ష్యముల చేరిక మార్గ సంగీతముగా నిర్వ చించారు. (అనగా విద్వాంసులు, పండితులు వ్యాకరణ విధులను అనుసరించి వ్రాయు నట్టిదియో, ప్రసంగము చేయు నట్టిదియో నుండు భాష వలే నుండునది) అంటే (classical language) గ్రాంధిక భాష అని అర్ధం చేసుకోవచ్చు. అలాగే, శాస్త్ర నియమాలను పాటించక, ఆయాప్రాంత పామరులకు కూడా హృదయ రంజక మైన గానము దేశీసంగీతము. (ఇది ఒకే భాషను అనేకులు వారి వారి ప్రాంతముల లోని వాడుకను బట్టి వేరు వేరు విధములుగా వాడు వ్యవహారిక భాష వలె నుండును. అంటే, (ordinary, colloquial or spoken language) వ్యవహారిక భాష.  

   సంగీత లక్షణమును వివరిస్తూ మన పూర్వికులు యీ విధంగా పేర్కొన్నారు. వీణా వేణు వాదనలు గాత్ర గీత గానమును అనుసరించియు, నాట్య నృత్యము ఆ వాద్య వాదనల ననుసరించి యుండుటను బట్టి, గీతమే సంగీతమునకు ముఖ్యమైన లక్ష్యముగా చెప్ప బడినది. ఆ కారణాన గాన విద్య "సంగీత" మను పేరు గాంచినది. పౌరాణిక మతములో బ్రహ్మ సామ గానలోలుడు, శివుడు నృత్యగీత ప్రియుడు, కృష్ణ పరమాత్మ వేణుగాన లోలుడు, సరస్వతి వీణాపాణి - గా వర్ణించ బడినారు!

దక్షిణాది శాస్త్రీయ సంగీతాన్ని అయిదు విధములుగా చెప్ప వచ్చును:

1. సంకీర్తన సంప్రదాయము,  2. పద సంగీతము,  3. యక్షగాన సంప్రదాయము, 

4. కలాప, ప్రబంధ సంప్రదాయము,   5. గాత్ర కచ్చేరీ పద్ధతి.

పైన వివరించిన సంగీత పరిజ్ఞాన అవగాహనతో "ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము" అనే రచనను గురించిన విశేషాలు తెలుసుకొని ఆనందించే ప్రయత్నానికి ఉపక్రమిద్దాం! 

ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము:

ప్రసిధ్ధ వాగ్గేయ కారులను గురుంచి తెలుగులో వ్రాసిన పరిశోధనాత్మక రచన యీ మహా గ్రంధం. దీనిని రచించిన వారు శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు గారు. వీరు ఆకాశవాణిలో అనేక ఉన్నత పదవులను అత్యంత దక్షతతో నిర్వహించి 1978 లో పదవీ విరమణ చేసినారు. రజనీ గారు సంగీత సాహిత్యాలలో    అపార ప్రజ్జ్జ్ఞావంతులు. అశేష శేముషీ సంపన్నులు. 'శతపత్ర సుందరి" కవితా సంపుటితో ప్రారంభించి, అనేక యక్ష గానములు రచించుటయే గాక, శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిచే క్షీరసాగర మధనం, విప్రనారాయన, యక్ష గానాలను రచింప జేసి, తన సంగీతం ద్వారా వాటిని రేడియోలోను, కూచిపూడి వేదికల పైన ప్రదర్శింప జేసారు. అనేక యక్ష గానాలను రచించి వాటి ప్రదర్శనలకు దర్శకత్వం వహించి, ఆధునిక యక్ష గాన ప్రగతికి మార్గ దర్శకు లయ్యారు.

ఆంధ్ర వాగ్గేయకార చరిత్రమునకు తెలుగు భాషా సమితి వారి పురస్కారమే కాకుండా, కేంద్ర సాహిత్య అకాడమీ జాతీయ అవార్డును కూడా పొందారు. ఈ గ్రంధములో భరతముని మొదలు, బాల మురళీ కృష్ణ వరకూ గల కర్ణాటక వాగ్గేయ కారుల వివరాలు, విశేషాలు యేర్చి కూర్చే సాహస ప్రయత్నం జరిగింది. పాఠక మహాశయుల సౌలభ్యం కోసం యీ గ్రధం యొక్క విశిష్ఠతను విశ్లేషించడ మైనది.    

   వాగ్గేయకార చరిత్రము రెండు సంపు టములుగా ప్రచురిత మైనది. తొలి భాగంలో 21 అధ్యాయము లున్నవి. మొదటి అధ్యాయములో గ్రంధ రచనాను క్రమణిక అందు నిమిత్తం రచయిత పరిశీలించిన ఆధారాలు, వివరింప బడినవి. ఆధారాలు సమకూర్చు కొనుటలో రచయిత చేసిన పరిశోధన శ్లాఘనీయం. విద్వాంసుల మన్ననలను తప్పక పొందు తుంది.

రెండవ అధ్యాయంలో సంగీత పరిణామ చరిత్ర, విశేషించి ప్రాచీన యుగానికి సంబంధించిన పద్ధతులను, ముఖ్యముగా "పాణీ యం" లోనూ, నారదుడు వ్రాసిన "శిక్షా" అనే ప్రాచీన సంగీత శాస్త్ర గ్రంధము లోను, వివరింప బడిన విధానాలను గురించి, ఆకాలపు గాయన పద్ధతి "సామిక" పరిణతిని, ఆకాలంలో మన దేశంలో వాడుకలో నున్న తాళ వాద్యాలను చక్కగా విశ్లేషించారు. స్వర సప్తకంతో కూడిన స్థాయీ పరిజ్ఞానం కలగడం మూలాన సంగీత శాస్త్రాభి వృద్ధికి బీజారోపణ క్రీస్తు పూర్వం 2500 ఏళ్ళకు 1500 ఏళ్ళకు నడుమ జరిగిందని నిరూపిత మైనది.

   భరతుడూ, నారదుడు, మతంగుడు, మమ్మటాచార్యుడు, పార్శ్వ దేవుడు, చాళుక్య సోమేశ్వరుడు, సోమనార్యుడు, జాయప సేనాని, శార్ఙదేవుడు, సింహ భూపాలుడు యిత్యాదులు సంగీత శాస్త్ర వికాసానికి చేసిన విశిష్ఠ సేవలను, వారి వారి ప్రత్యేకతలను ఉదాహరణ సహితముగా సులభ శైలిలో పాఠకుల ముందుంచారు.

"సంగీత రత్నాకరం" కాలం వరకూ ఉత్తర దక్షిణ దేశాలకు ఒకే సంగీత పద్ధతీ, ఒకే ప్రామాణికత వుండేవని పేర్కొన్నారు. దాదాపు 16వ శతాబ్థిలో అనగా వేంకటమఖి కాలంలో సంగీత పద్ధతులు మార్పు చెంది కర్ణాటక సంగీత సాంప్రదాయం వికసించి, ప్రాముఖ్యత సంతరించు కొనినదని రచయిత నిరూపించారు. స్థూలంగా, సంగీత పరిణామ క్రమం, దానికి కారకు లైన లక్షణ కర్తల వివరాలు ఈ అధ్యాంలో చర్చిత మైనవి.

వాగ్గేయ కారుల లక్షణం:

శార్ఙదేవుడు తన "సంగీత రత్నాకరం" లోని ప్రకీర్ణ కాధ్యాయంలో వాగ్గేయ కారుని లక్షణాలను పండ్రెండు శ్లోకాలలో చెప్పాడు. గేయం అనే మాటను ఈ కాలంలో పాటకు పర్యాయ పదంగా వాడు తుండేవారు.  

"వాఙ్మాతు రుచ్యతే గేయం ధాతు రి త్యభిథీయతే

వాచం గేయం చ కురుతే యః స వాగ్గేయ కారకః" 

   పైన ఉదాహరించిన శ్లోకంలో శార్ఙదేవుడు మాటల కూర్పును వాక్కుగాను, మాటల నుండి వేరు చేసిన సంగీతపు కూర్పును గేయముగాను వ్యవహరించారు. అంటే పాటలోని మాటల కూర్పును "మాతువు" అనీ, సంగీతపు కూర్పు (గేయము) ను "ధాతువు" అనీ అంటారని, వాక్కునూ, వరుసను తానే చేయ గల వాడు వాగ్గేయ కారుడనీ శార్ఙదేవుడు నిర్దేశించాడు. అయితే ఈ రెండూ వాగ్గేయ కారుడనే పేరు లోనే యిమిడి వున్న ప్రధానావశ్యక లక్షణాలు. పైన పేర్కొనిన విశేషములే కాక, వాగ్గేయ కారుని ఘనతకు ఆవశ్యక మైన ముఖ్య ధర్మాలను మరొక ఏడు శ్లోకాలలో పేర్కొన్నాడు.
“శబ్దాను శాసన జ్ఞాన మభిదాన ప్రవీణతా

ఛందః ప్రభేద వేదిత్వ మలంకారేషు కౌశలం”

    శబ్దాను శాసన జ్ఞాన మంటే వట్టి వ్యాకరణ జ్ఞానమే కాదు, సుశబ్దాపశబ్ద వివేచనము కలిగి యుండాలి. శబ్దముల మంచి చెడ్డలను వ్యాకరణ రీత్యానే కాకుండా, నిర్దుష్టంగా ప్రయోగింప గలిగే పరిజ్ఞానం ఉండాలి.... సంస్కృత చ్ఛందస్సులు మాత్రమే కాకుండా దేశీ చ్ఛందో భేధములు కూడా తెలిసి వుంటే దేశ భాషలలో వాగ్గేయ కారుడు కాగలుగుతాడు. నవ రసములు, వాటీ వాటి స్థాయీ భావములు, విభవానుభవ సంచారీ భావములు మున్నగు వాటిని గూర్చిన పరిపూర్ణ జ్ఞానమే రస భావ  పరిజ్ఞానం. ఈ లక్షణ ప్రక్రియ యింతటితో ఆగలేదు! 

"తూర్యత్రితయ చాతుర్యం హృద్యశారీర శాలితా

లయతాల కలాజ్ఞానం, వివకో నేకకాకుషు"

తూర్యత్రియ మంటే నృత్య, గీత, వాద్యాలు. ఈ మూడింటి లోను  నేర్పుండాలి. శారీరం అంటే, గాత్రం హృద్యమంగా వుండాలి. లయలోని ద్రుత మధ్యమాది భేధాలు చచ్చత్పుట, చాచపుట యిత్యాదిగా ఆదిమ లక్షణ కర్తల చేతా, ఆది, త్రిపుట, రూపక, జంపె యిత్యాదిగా తరువాతి కాలపు లక్షణ కర్తల చేత వివరింప బడిన 108 తాళములను గురించి తెలిసి వుండటమే లయతాల కలా జ్ఞానం.

  "కాకువ" అంటే గాన పధ్ధతి లోని "యాస" అని మనం అర్ధం చెప్పు కోవాలి. "యాసలు" ఆరు విధాలుగా వుండవచ్చు. "స్వరకాకు" ప్రత్యేకం స్వరాలకే సంభందించిన "యాస". ఏ స్వరాన్ని, ఏ స్థానం లో, ఏ విధంగా పట్ట వలెనో ఆయాస అన్నమాట. "రాగకాకువు" అనగా ఆయా రాగాల కు ప్రత్యేక లక్షణమై "స్వరూప నిర్దేశక మైన యాస. "అన్యకాకువు" అంటే, కొన్ని రాగాలలో తదితర రాగాలకు చెందిన సంగతులు ప్రయోగించడానికి వీలుకలిగి నప్పుడు - అలా ప్రయోగించి నప్పుడు, కలిగే "ప్రత్యేకపు యాస". వివిధ దేశాలలో ఒక్కొక్క రాగాన్ని "వేర్వేరు యాసలతో" పాడ వచ్చు. అటువంటి సందర్భాలలో ఆయాస లోని తేడాను "దేశకాకు" వంటారు! ఈ విధంగా కాకువ లక్షణాలన్ని వివరింప బడినవి. వాగ్గేయ కారునికి కాకువులన్ని తెలిసి వుండడం అత్యంత ఆవశ్యకం. కాకువల పరిజ్ఞానం, వాగ్గేయ కారునికి వాటికి అనుగుణ్య మైన పద ప్రయోగమూ, పద  బంధానికి సరిపోయే సంగీత రచనా శక్తిని అలవరుచు కొనుటకు ఉపయోగిస్తాయి. 

    గొప్ప వాగ్గేయ కారులు ముఖ్యముగా అనుసరించ వలసిన పధ్ధతిని శార్ఞదేవుడు ఈ విధంగా పేర్కొన్నాడు. "తన రచన యితరులకు అనుసరణీయం కావాలి కాని తాను యితరులను అనుసరించ కూడదు". అంతే కాక తాను రచించిన గేయం తానొక్కడు కూర్చుని పాడుకొని ఆనందించటానికి కాదు. అది పరుల ఆనందానికి మాత్రమే! అందుచేత, అది వారికి ఏలా చేస్తే ఆస్వాద యోగ్య మవుతుందో తెలుసుకొని, ఎప్పటి కప్పుడు కొత్తగాను, వారికి తెలిసిన పుంతలలో స్వీకార యోగ్యంగాను ఉండాలి. దీనికి "పరచిత్త జ్ఞానం ఎంతో అవసరం". దీనినే, "సంగీతసుధా" అనే గ్రంధంలో -

"పరోక్త సందర్భ వివర్జనేన, స్వతంత్ర సందర్భ విధౌ పటుత్వం

స్వతంత్ర మాతు గ్రంధనే పటుత్వం, సంవేదనం చాపి పరాశయస్య" 

అని చెప్పాడు గోవింద దీక్షితుడు. ఈ విధంగా వాగ్గేయకార లక్షణాలను గురుంచిన చర్చ మన ప్రాచీన లక్షణ గ్రంధాలలో కనుగొన వచ్చు. ఇంచు మించు 16వ శతాబ్దం నుంచీ వాగ్గేయ కారుడు అనే శబ్దానికి పర్యాయంగా "బయకారుడు" అనే మాట వ్యవహారంలో వుంది. ఈ బయకార శబ్దానికి వ్యుత్పత్తి "సంగీతసుధా" అనే గ్రంధంలో తృతీయ ప్రకరణంలో ఈ విధంగా చెప్ప బడివుంది. "మాతువునూ, ధాతువునూ, ఉభయమునూ (రెడింటిని) బాగుగా తెలిసిన వాడు ఉభయకారుడు. లోకులంతా ఉభయకారుడు అనడానికి బదులు దాని అపభ్రంశ మైన బయకార శబ్దంతో పిలుస్తారు".   

    గ్రంధ రచయిత రజనీగారు కేవలం వాగ్గేయ కారుల లక్షణ నిర్వచనముతో సంతృప్తి పొందక, వివిధ వాగ్గేయ కారుల సంగీత రచనకు ఆలంబములై, లక్షణ కర్తల నిర్వచనాలకు ఉదాహరణ లైన ప్రభంద రీతులు, ఆయా రీతుల స్వభావాలను, పరిశీలించి ఏయే వాగ్గేయ కారులు ఏయే ప్రబంధాలను ఏ విధంగా రచించారో, ఇలా గానం చేశారో కూడా విశ్లేషించారు.

ప్రఖ్యాత వాగ్గేయ కారులు: 

 12 - 20 శతాబ్ద కాలంలో ప్రఖ్యాతి వహించిన కర్ణాటక సంగీత వాగ్గేయ కారుల వివరణాత్మక పరామర్శ ఈ గ్రధం. వాగ్గేయ కారుల చరిత్ర పరిశీలనార్హ మనే భావమే అభినందనీయం. నిష్పక్షపాతంతో పరిశీలింప దగిన అంశం. గాన విద్యను "ఉపవేదం" గా మన్నించి ప్రచారం చేయడంలో వారిప్రయత్నం సామాన్యం కాదు, అయినప్పటికి, గాయకుల వ్యక్తి జీవితాలను గురుంచి, వారి రచనలను గూర్చి ఇంతటి బృహత్తర ప్రయత్నం ఈ గ్రంధ రచయితకు పూర్వం ఎవరూ ప్రయత్నించ లేదన్న, అది అతిశయోక్తి కానేకాదు.  

   12వ శతాబ్ధిలో గౌడ దేశాన్ని సేన వంశీయులు పరిపాలించారు. వారిలో లక్షణ సేనుడనే రాజు 1116-1160 కాలంలో పరిపాలించాడు. ఆయన కవి పండిత గాయక పోషకుడే గాక, స్వయంగా సంగీత సాహిత్య పాండిత్యమూ, ప్రబంధ రచనా దక్షతా కలవాడు.

ఆయన ఆస్థానంలో వెలిశాడు జయదేవుడు. భారత దేశంలో సంగీత సాహిత్యాత్మక మైన తొలి రచన "గీత గోవిందం" వీరి లిఖితమే! తనను గూర్చి జయదేవుడు చెప్పుకొన్న మాటలు "సందర్భ శుద్ధిః  గిరాం జానీయతే జయదేవ ఏవ" అని. అంటే తన సహచార కవులందరి లోనూ కూడా శబ్దముల సందర్భ శుద్ధి నెరిగినవాడు జయదేవు డొక్కడే అని!! జయదేవుని చరిత్రంతా చంద్రదత్త విరచిత మైన "భక్తమాల" అనే గ్రధంలో విపులంగా వున్నట్లు శ్రీ రజనీకాంత రావుగారు పేర్కొన్నారు.

సాహిత్య రీత్యా "గీతగోవిందం" ప్రామాణిక మైనదని సాహిత్య దర్పణ కారుడైన విశ్వనాథ కవిరాజు పేర్కొనిన విషయం విజ్ఞులకు విదితమే. గోవిందుని గూర్చిన గేయ ప్రబంధము కాబట్టి దీనికి గీతగోవింద మనే నామం ఏర్పడింది. 24 అష్టపదులతో, 80 మించిన శ్లోకాలతో కూడిన 12 సర్గల గేయ ప్రబంధం గీతగోవిందం. దీనిలో ఏ పంక్తి పరికించినా రసం చిప్పిల్లుతూ, హృదయాన్ని పరవశం చేసే మధుర కోమల పదజాలం ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది.!

    జయదేవుడు గీతగోవిందాన్ని పాటలుగా పాడుతూ రచించాడని, అప్పుడు అతని భార్య నాట్యం చేస్తూ అభినయించేదని, ప్రతీతి. పరాశరుడు మొదలైన అతని మిత్రులు కూడా అష్టపదులను గానం చేసేవారని చెప్పుకొంటారు. 17వ శతాబ్దములో రాముడు భాగవతర్ ఈ అష్టపదులకు దక్షిణాదిని ప్రామాణికంగా ప్రచారంలో వున్న సంగీత స్వరాలు రచించారు.  

లీలాశుకుడు:

జయదేవుని తర్వాత యావద్భారత ఖ్యాతి పొందిన వాగ్గేయ కారులలో లీలాశుకుడు అగ్రగణ్యుడు. ఇతడు సంగీత శాస్త్రములో గాని, గానం లో గాని ప్రత్యేక కృషిచేసి ప్రసిద్ధి  పొందినట్లుగా పేర్కొనడానికి తగిన ఆధారాలు లేవు.  కాని ఈ మహా కవి రచించిన "కృష్ణకర్ణామృత" శ్లోకాలు గానం చేయని సంగీత సభలు గాని, గోష్టులు గాని, ఈనాటికీ ఉత్తర భారతం లోగాని, దక్షిణ భారతంలో లేవనుట అతిశయోక్తి కానేరదు. లీలాశుకుడు 13వ శతాబ్ది వాడని చాగంటి శేషయ్యగారు తన కవి తరంగిణిలో ఉల్లేఖించారు. లీలాశుకుడు ఆంధ్రుడా? కాడా? అన్న విషయమై అభిప్రాయ భేధాలున్నవి. అతడు ఆంధ్రుడేనని కొందరు విద్వాంసులు అభిప్రాయ పడితే, మరికొందరు భిన్న అభిప్రాయాలను వ్యక్త పరచారు. కాని బాలాంత్రపు రజనీకాంత రావుగారు లీలాశుకుడు ఆంధ్రుడేనని తీర్మానించారు. ఉభయ పక్ష విద్వాంసులు కూడా ఆంధ్ర దేశంలో నాటకంగా బహుజన ఆదరణ పొందిన "చింతామణి" కథలోని బిల్వమంగళుడు లీలాశుకుడేనని ఒప్పుకున్నారు. కాని గంభీరంగా ఆలోచించ వలసిన విషయమేమంటే "కృష్ణకర్ణామృతం" ఒక్క తెలుగు భాషలోనికే అనువాదమైనది. మరే యితర భారతీయ భాషల్లోను దానికి అనువాదాలు ప్రచురితం కాలేదు. ఏది ఏమైనా సంగీతానికీ, నృత్యానికీ, అభినయనానికీ, చిత్రలేఖనానికీ, శిల్పానికీ ప్రదర్శన యోగ్యాలైన గేయ చ్ఛందస్సులు కృష్ణకర్ణామృతం ద్వారా మనకు అందజేసిన లీలాశుకుడు వాగ్గేయకారులలో గణుతి కెక్కిన వాడు. అంతేకాక  శిశుసౌందర్యంలో పరబ్రహ్మను చూపి, భక్తి, శృంగార పరమావధి దశలలో ఆధ్యాత్మిక బ్రహ్మానందం కలిగించిన ప్రముఖ వాగ్గేయ కారుడు లీలాశుకుడు.            

 తాళ్ళపాక వాగ్గేయకారులు:

తాళ్ళపాక వంశంలో అన్నమా చార్యుడు, ఆయన రెండవ కుమారుడైన పెద తిరుమలా చార్యుడు, పెద్ద తిరుమలా చార్యుని పెద్ద కుమారుడు చిన తిరుమలయ్య, నాల్గవ కుమారుడైన చిన్నన్న సుప్రసిద్ధ కవులు. వీరిలో మొదటి ముగ్గురూ సంగీత, సాహిత్య కళా నిష్ణాతులైన వాగ్గేయకారులు. చిన్నన్న అన్నామాచార్యుల చరిత్ర ద్విపదలో రచించాడు.

సుప్రసిధ్ధ పరిశొధనా చార్యులైన వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, వారు జీవించిన కాల నిర్ణయాన్ని ఈ క్రింది విధంగా సూచించారు.

అన్నమాచార్య        --- 1408-1502.

పెదతిరుమలాచార్య  --- 1460-1547.

చినతిరుమలయ్య     --- 1485-1550.

చిన్నన్న                 --- 1498-1561.

రకనీకాంత రావుగారు తాళ్ళపాకవారి సంగీత పరిజ్ఞానము, వారు సంగీత వికాసానికి చేసిన అకుంఠిత సేవలను వివరణాత్మకముగా విశ్లేషించారు.

   తెలుగు వాగ్గేయ కారులలో భీష్ముని వంటి వారు తాళ్ళపాక అన్నమయ్యగారు.పరిణామంలోను, వైవిధ్యం లోను, ఈయన రచనలు సాటిలేనివి! వీరు దాదాపు 3200, సంకీర్తనలు రచించారని ప్రసిద్ధి. ఈయన రచనలలో వివిధము లైన దేశీ ప్రబంధముల స్వరూపం మనకు తెలుస్తుంది. అన్నమాచార్య తన సంకీర్తనలలో శృంగార, భక్తి, వైరాగ్యములను సమాన దక్షతతో నిర్వహించారు. అన్నమాచార్య వారి కీర్తనలు వారి తరువాత వాగ్గేయ కారులకు మార్గ దర్శకాలుగా పరిణ మించాయి అనుటలో అతిశయోక్తి వీసమాత్రం కూడా లేదు. అన్నమయ్యగారు "సంకీర్తన లక్షణం" అనే గ్రంధాన్ని రచించారు. పదము, ఏలా అనే సంగీత ప్రబంధాల లక్షణా లిందులో నిర్వచింప బడ్డాయి. అన్నమయ్యగారి మనుమడు చినతిరుమలా చార్యుడు (చినతిరుమలయ్య) తెనుగించాడు. రజనీగారి విశ్లేషణ ప్రకారం అన్నమయ్య గారు అద్వితీయ ప్రతిభాశాలీ, ఋషి కల్పుడూ పదం యొక్క అనంత రూపాలను తన రచనలలో ప్రదర్శించిన ప్రజ్ఞాశాలి!      

అన్నమయ్య - దేవుడు :

"అన్నమయ్య గారి కళ్ళకు దేవుడు ఒకసారి పాలపాపడి లాగా కనబడు తాడు. ఒకప్పుడు పరమాత్ముని లాగా నిలబడుతాడు. ఇంకోసారి చెంచికలతో చెలగాటమాడే ధూర్త విటునిలాగ చూస్తాడు. మరొకసారి మంగతాయారమ్మ మక్కువను చక్కగా చేసే శృంగార లాయిలలాగ సక్షాత్కరిస్తాడు! ఏ వూరు వెళ్ళినా, ఏ దేవుణ్ణి చూచినా, అన్నమయ్య దృష్టికి ఆ దేవుడు వేంకటేశ్వరుని లాగే గోచరిస్తాడు"! (ఆరుద్ర)

   చూచిన దేవుళ్ళందరూ తిరుపతి వెంకటేశ్వరునితో అభేద వ్యక్తులుగా భావించి వాళ్ళపై ఆయన సంకీర్తనలు పాడారు. అన్నమయ్య దృష్టిలో దేవుడొక్కడే! అన్నమయ్య శృంగార సంకీర్తనల కొమ్మ, క్షేత్రయ్య పదాల తోటలో ఎన్నో పూవులు పూచింది. అలాగే, వారి ఆధ్యాత్మిక సంకీర్తనల శాఖ త్యాగరాజు గారి పెరట్లో కల్పకమైంది. అన్నమయ్య వాడిన కొత్త పదాల మొగ్గలు తర్వాత వచ్చిన వాగ్గేయ కారుల రచనలలో విప్పారి వికసించాయి! అయితే "ఇవ్వాళ అన్నమయ్య పాటలన్ని సులభంగా బోధ పడవు. ఎందుకంటే ఆనాటి పలుకుబళ్ళు పదాలు వేరు. ఆ నాటి వ్రాత తీరు వేరు. ఆ

పద్ధతిలో వ్రాసిన పాటలను అలాగే అచ్చు వేస్తే కొంత అర్థం కాదు. ఆనాటి మాటలు నేడు అన్ని ప్రాంతాలలోను ప్రచారంలో లేవు. కొన్ని ప్రయోగాలు మరుగున పడ్డాయి.కొన్ని సంకీర్తనల లోని సాంప్రదాయము మనకు తెలియదు... దురదృష్ట వశాత్తు అన్నమయ్య పదాలన్ని మన నిఘంటువులకెక్క లేదు". తాళ్ళపాక కవుల పట్టికలను (concordances) తయారు చేసి దేశ్య పదాలకు పద ప్రయోగ సూచికలు చేసి ప్రచురిస్తే అది ముందు తరాల వారికి అత్యంత ఉపయోగిస్తుంది. ఈ కర్తవ్యాన్ని కేంద్ర సాకిత్య అకాడమీ వంటి సంస్థలు చేబడితే, తెలుగు భాషా వికాసానికి తోద్పడిన వారవుతారు.

   సాధారణ ప్రజలు అన్నమయ్యను చదివి, ఆయన పాటలు పాడుకొని ఆనందించడానికి పైన పేర్కొనిన పరికరాలు (అంటే indexes and concordances) ఎంతో ఉపకరిస్తాయి. అన్నమయ్య పదసంపద, ఆయన ఆడిన మాటల్లా అమృత గుళిక. పాడిన పాటల్లా పరమ పదసోపానం! కేవలం ఆస్వాదించుటయే మన వంతు!

 పురందరదాసు :

ఈయన క్రీ. శ. 1484-1564 మధ్య కాలమున జీవించిన వాడని విద్వాంసులు నిర్ణయించారు ఈయన కొంతకాలం ఆనాడు కర్ణాటక, మహరాష్ట్రా ప్రాంతాల సరిహద్దుల్లో వున్నటువంటి పునహానగరం (నేటి పూణె) లోను, తరువాత కన్నడ దేశం లోని విజయనగరం లోను గడిపినట్లు పూర్వీకుల రచనల వలన తెలియు చున్నది. విజయనగర రాజులైన సాళువ నరసరాయలు, తుళువ వీరనరసిం హరాయలు, శ్రీకృష్ణదేవరాయలు పురందరదాసు సమకాలికులుగా పేర్కొనబడ్డారు.

పురందరదాసు అన్నమయ్య కాలంలో యువకుడై తరువాత కాలాన కన్నడంలో లక్ష వరకు సంకీర్తనములు (దాసరపదగళు) రచించి, కర్ణాటక దేశం లోనేగాక ఆంధ్ర, ద్రావిడ, మహరాష్ట్రా ప్రాంతములలో ఆరాధ్యుడైన వాగ్గేయ కారునిగా  ఖ్యాతి గడించారు. సంగీత చరిత్రలో 15, 16 శతాబ్దాల లో వుండిన ఈయన రచనలలో సంకీర్తనలే ఎక్కువ. భారతీయ సంగీతానికి భక్తి సంకీర్తనములను ప్రసాదించిన కాలము ఇదే. సూరదాస్, తులసీదాస్, మీరాబాయి ఆకాలము వారలగుట ముదావహం. మతతత్వ ప్రభోధకము లైన భక్తిరసాత్మక మైన పురందరదాసు పదగళు మధ్వ పీఠాలలో నేటికి వేదముగా పరిగణిస్తారు. పురందరదాసుకు వ్యాసరాయలు ఉపదేశ గురువు. తమ గురువుల కన్నడ పదాలకు తోడు, మహారాష్ట్రం లోని జ్ఞానదేవాదుల సంకీర్తనముల ప్రభావం పురందరదాసు రచనలకు ఉద్బోధకమై ఉండవచ్చును.

పూర్వాశ్రమంలో పురందరదాసు కోటీశ్వరుడనీ, పిల్లికి బిచ్చం పెట్టని పిసినిగొట్టని తన జీవితం లో జరిగిన ఒక విచిత్ర సంఘటన మూలంగా ఈయన వైరాగ్యవంతుడై, మహాభక్తాగ్రేసరుడుగా మారి, లక్షలాది సంకీర్తనలకు పద కర్తగా మారాడని ఆయన జీవిత చరిత్రలో పేర్కొనబడినది. పురందరదాసు తన 40వ ఏట సుప్రసిద్ధ మధ్వ గురువులైన శ్రీవ్యాసతీర్థుల ఉపదేశం పొంది, పురందరదాసుగా తన పేరు మార్చుకొనినట్లు తెలియు చున్నది. ఈ పురందరదాసు అనే పేరు వ్యాసతీర్ధుల తర్వాత, వారి మఠమునకు అధికారి యైన సత్యధర్మ తీర్ధు లనేవారు ఇచ్చినట్లూన్నూ, అప్పటి నుండి ఆపేరు వ్యవహారంలో నిలిచినట్టున్నూ, సాంబమూర్తి గారు వ్రాశారు. శ్రీత్యాగరాజ మహాశయులు తన ప్రహ్లాద "భక్తివిజయం" లో పురందరదాసును స్తుతించాడు. పురందరదాసు కీర్తనలను దాసపదగళు అనీ, దేవరనామ అనీ వ్యవహరిస్తుంటారు. సులభ గ్రాహ్యమైన సంవాద శైలిలో చక్కనిజాతీయములైన సామెతలతో, అందమైన సామ్యాలతో, ఉదాత్త భావాలతో ఈయన కీర్తనలు వేదాంత పరతత్వ భోధకములై, లోకవృత్త విమర్శాత్మకములై, స్వానుభవ ప్రభోధకములై ఉంటాయి. పురందరదాసు మాయామాళవగౌళ మేళానికిచ్చిన ప్రాముఖ్యం వల్లనే తర్వాత 72 మేళకర్తల పరిణామం కలిగినట్లు విజ్ఞులు పేర్కొంటారు. పురందరదాసును కర్ణాటక సంగీత పితామహుడని కీర్తించారు. అయినప్పటికీ, ఈయన అన్ని పద్ధతులను ఆకళించుకొనిన తర్వాతనే కర్ణాటక పద్ధతికి ఒక రాచబాట వేశాడని విద్వాంసులు పేర్కొంటారు. అన్నమాచార్యుల తర్వాత పురందరదాసు ద్వారా సంకీర్తన రచన వ్యాప్తి పొందినది.    నారాయణ తీర్థులు :

అన్నమయ్యగారి తర్వాత వాగ్గేయకారులుగా సర్వ జనాదరణ పొందినవారు నారాయణ తీర్థులు. సంగీత వికాసానికి వీరు చేసిన సృజనాత్మక సేవలు పేర్కొన దగినవి. ఆంధ్ర, కేరళ, కర్ణాటక ప్రాంతాలలో వీరి తరంగాలను గురుంచి తెలియనివారు కాని, పాడనివారుగాని, సంగీత విద్వాంసులు అరుదుగా ఉంటారు. వారి రచన "శ్రీకృష్ణలీలాతరంగిణి" ఒక మహా యక్ష గానమని కొందరి విద్వాంసుల అభిప్రాయము. యక్షగానం ఒట్టి సాహిత్య ప్రక్రియ కాదు. సంగీత, నృత్య కళలకు కూడా  సంగమ స్థానమై మన దేశీయ సంస్కృతికి ప్రతీకగా రాణించింది. తెలుగులో నేటికి తెలియవచ్చి నంతలో కందుకూరి రుద్రకవి రచించిన "సుగ్రీవవిజయం" ప్రాచీన మైనదిగా పరిగణింప బడుతూవుంది. ఈనాడు యక్షగానాన్ని దేశీసరణికి చెందిన నాటకంగా పండితులు పరిగణిస్తారు.    

   "శ్రీకృష్ణ లీలా తరంగిణి" కర్త శివనారాయణ తీర్థులు, కీ.శ.1580-1680 కాలము వాడని పరిశోధకులు నిర్ణయించారు. తీర్థుల వారి జన్మ స్థలాన్ని గురుంచి విద్వాంసులు భిన్నాభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. శ్రీ తల్లావజ్ఝల శివశంకర స్వామి పండితుల వ్రాతప్రతు లన్నిటినీ పరిశీలించి నారాయణ తీర్థులను గురుంచిన కొన్ని అంశాలు వివరించారు. వారుతేల్చిన విషయాలు తీర్థులు ఆంధ్ర బ్రాహ్మణుడని, ఆయన తండ్రి పేరు నీలకంఠ శాస్త్రి అని. గాంధర్వ దేవుడనేది ఆయనకు సంగీతంలో ప్రజ్ఞ వలన వచ్చిన బిరుదు. వారి నివాస స్థానం కాజ గ్రామం. తీర్థుల వారు కాజలో జన్మించి, పెరిగి కాల క్రమాన దక్షిణ దేశం వెళ్ళి శీర్ణ మహాదేవిలో ఉండి, తిరిగి, ఉత్తర దేశ యాత్ర చేస్తూ మరల కాజ, కూచిపూడి గ్రామాలు సంచారం చేసి,దక్షిణ దేశం లోని "తిరుప్పూందురుత్తి" లో సిద్ధి  పొందారు అని.

"శ్రీకృష్ణ లీలా తరంగిణి" భాగవత పురాణ దశమ స్కంధములోని కృష్ణ గాథలో ప్రధానమైన వాటిని తీసుకొని నారాయణ తీర్థులు "శ్రీకృష్ణ లీలా తరంగిణి" 12 తరంగములు (అంకాలు)గా రచించారు. "తరంగం" అనే మాట ఆ గ్రధంలో ఒకొక్క అంకమునకు ఉద్దేసించిన పేరు కాదు. 12 అంకముల నాటకంలోని ఒకొక్క అంకమునూ ఒకొక్క తరంగా పేర్కొన్నాడా మహాకవి. ప్రతి అంకము ప్రారంభించే ముందు దానిలోని కథను శ్లోకాలలో సూచించి, తర్వాత పాటలతో, శ్లోకాలతో, సంధి గద్యాలతో ఆ కథనే విపులీ కరించారు.

తరంగిణి లోని 156 కీర్తనల లోనూ, ఆంధ్ర ప్రదేశంలో భజన పరుల ద్వారాను జనరంజకత పొందిన తరంగాలు 16. ఈ కీర్తనల స్వరాలు ఏ తాళ పత్ర గ్రంధాల లోను దొరక లేదు.  సాంప్రదాయ గాయకులు పరంపరాగతంగా నేటికీ పాడుతూ వస్తున్న కీర్తనలు చాలా వున్నవి. 150 కీర్తనలకూ మొత్తం 36 రాగాలు వాడ బడుతున్నాయి.

   తరంగిణీ కీర్తనలన్నింటిలోను భక్తి రసం ప్రధానంగా కనిపిస్తుంది. ప్రతి కీర్తనలోనూ కృష్ణుడు కేవలం అవతార మూర్తిగా మాత్రమే కాక, మూల విరాట్టయిన పరమాత్మగానే దర్శనమై, అన్నిపాత్రల చేత స్తుతింప బడతాడు. అంతేకాదు, భగవద్గీత ఘట్టంలో అర్జునితో సంభాషించిన విధంగానే ఇంద్రుడు, బ్రహ్మ, గోపికలు, యశోద మొదలైన పాత్రలతో మాట్లాడుతాడు.

తరంగిణీ రచన నిర్దుష్ణమైన పదకూర్పుతో, అమరిన అలంకార ప్రయోగాలతో, ఆధ్యాత్మిక భావ ప్రకటనతో నల్లేరుపై బండి నడక వలె సాగిపోతుంది. కొన్ని సందర్భాలలో నారయణ తీర్థుల వారు జయదేవుడినే మరపిస్తారు!

తీర్థులవారి గేయ (తరంగ) రచన తన ముందు తరం రచయితల స్వభావ సిద్ధమైన సంకీర్తన సౌరభాన్ని యినుమడింప చేసుకొని, తమ తర్వాతి యుగానికి చెందిన వాగ్గేయ కారుల లక్షణమైన యక్షగాన స్వరూపం పరిపూర్ణంగా అవలింబించు కొని, జయదేవాదుల శృంగార భక్తి భావం కంటే వేరైన భక్త్యా ధ్యాత్మిక భావంతో ఉదాత్త తరములై, నారాయణ తీర్థులను "సంకీర్తన యక్షగాన సార్వభౌమత్వమనే" పదవికి అర్హునిగా చేసాయి.

నారాయణ తీర్థుల వారిని గూర్చి శ్రీ రజనీకాంత రావుగారు ఎన్నో విశేషాలను వివరణాత్మకంగా విశ్లేషించారు. అందులో వివరాలను కొన్నిటిని మాత్రమే ఇచ్చట సూచించట మైనది. అన్య వివరాలకు ఉత్సుకులైన పాఠకులు మూల గ్రంధాన్ని తప్పక చదువుతారని ఈ వ్యాస కర్త నమ్మకము.            

సిద్ధేంద్రయోగి :

నారాయణ తీర్థులవారి తర్వాత, కర్ణాటక సంగీత వికాసానికి ఉపకరించిన ముఖ్యులలో సిద్ధేంద్రయోగి పేరు తప్పక స్మరించ దగినది.

మామూలు ప్రజలు చెప్పుకొనే కథలు తప్ప సిద్ధేంద్రుల జీవిత విశేషాలను గూర్చి స్పస్ట మైన చారిత్రక ఆధారాలు పరిశోధకులకు లభ్యము కాలేదు. ఆయన రచించారని భావింప బడుతున్న పారిజాతాదులను సహితం మరెవ్వరో వ్రాస్తే, సిద్ధేంద్రుడు కూచిపూడి నటకులకు అభినయ, నాట్యాలు నేర్పి, నటింప జేశారని, కొందరి విద్వాంసుల అభిప్రాయం. ఆచార్య పి.ఎస్.ఆర్.అప్పారావుగారి పరిశోధనలను బట్టి సిధ్ధేంద్రుడు కీ.శ.14వ శతాబ్ధి చివరి భాగంలో వుండినవారని మనం గ్రహించాలి. కూచిపూడి వారు పారం పర్యంగా చెప్పుకొంటున్న కథల ననుసరించి సిద్ధేంద్రుడు బాల్య దశలో చదువు సంధ్యలు లేక అల్లరి చిల్లరగా తిరుగుతూ దురభ్యాసలకు అలవాటు పడినవాడని, ఆ సమయం లోనే, నాటక ప్రదర్శనలతో సంభందాలు ఉండేవని, ఆయన వివాహం కూడా ఆ కాలం లోనే జరిగిందని చెప్పు కొంటారు.

తన చదువు లేని తనాన్ని,గురుంచి అవమానితుడై, ఊరు విడచి దూర ప్రాంతాలకు వెళ్ళాడని, అచ్చట ఎవరి వలననో మంత్రోప దేశం ద్వారా, సకల విద్యా పారంగతుడై యింటికి తిరిగి వచ్చినట్ట్లు చెప్పు కొంటారు. ఏది ఏమైనా, ప్రసిధ్ధ యోగీశ్వరుడూ, సిద్ధుడు, వాగ్గేయ కారుడైన సిద్ధేంద్రుడు కూచిపూడి వారి సాంప్రదాయాన్ని ప్రతిష్ఠా పించిన వాడని పారం పర్యంగా వస్తున్న చరిత్రను మనం త్రోసిరాజన లేము! వీరిని గూర్చిన పూర్తి విశేషాలు రజనీగారు అత్యంత నిబద్ధనతో  గ్రంధస్తము చేశారు. అది వారి పరిశోధనా పటిమను వెల్లడిస్తాయి!

   సిద్ధేంద్రుని భామా కలాపాన్ని గూర్చి అనేక విషయాలను చర్చించి "సిద్ధేంద్రయోగి ప్రవెశ పెట్టిన దరువులు చూస్తే దేశీ సాంప్రదాయం చొప్పున సంగీతానికీ, తాళానికి కావాలిసిన విధంగా పాటలోని పొట్టి అక్షరాలు దీర్ఘాలవుతూ సాహిత్యం సంగీతం చెప్పినట్లు లొంగు తున్నట్టు కనిపిస్తుంది" అని అభిప్రాయం వ్యక్త పరిచారు. మరియు "సిద్ధేంద్రుడు శృంగార రసాన్ని జాతీయమైన తెలుగు నుడికారంతో సూటియైన రచనల లో పోషించాడు. ఆయన రచనలో కవికి సహజ పాండిత్యం కలిగి గురు వరప్రసాద లబ్ద కవితా శక్తి కలిగినట్లు తోస్తుంది... సిద్ధేంద్రుడు యక్ష గానాలే జన సామాన్యాన్ని ఉద్దేశించి రచించడం చేత, వ్యంగ్యంగా గాని, వాచ్యంగా గాని తత్వబోధ పొంతకు పోక, మానవ స్వభావ మధు రోక్తులతో సత్యభామకు కృష్ణ పరమాత్మపై గల ప్రేమను చిత్రించి తరించాడు" అని తమ వివక్షతను వెల్లడించారు.

భద్రాచల రామదాసు :

    భద్రాచల రామదాసు అని పేరుపొంది, నాటి నుండి నేటి వరకు ఆంధ్ర దేశంలో ఆబాల గోపాలనికే కాక, భారత దేశం లోని భక్తాగ్రేసరులలో ఒకడుగా గణుతి కెక్కిన వాగ్గేయ కారుడు రామదాసు. ఈయన అసలు పేరు కంచెర్ల గోపన్న. కీర్తి శేషులు భావరాజు వెంకట కృష్ణారావుగారు రామదాసు జీవితం లోని ముఖ్య ఘట్టాలకు కాల నిర్ణయం చేస్తూ, ఆ నిర్ణయం ప్రకారం రామదాసు గారు క్రీ.శ.1620-1687 మధ్య కాలం వాడని వారు భారతి లో రచించిన వ్యాసంలో పేర్కొన్నారు. ఈయన సిద్ధేంద్ర యోగికి, క్షేత్రయ్యకు ఇంచు మించు సమకాలీకుడని చెప్పుకొంటారు.భక్త కబీరుకు శిక్ష్యుడని కొందరి అభిప్రాయం. కొంత మంది భక్తులు రామదాసు చరిత్రను యక్ష గానం గాను, హరికథా రూపంలోనూ వ్రాసి పాడు కొనేవారు. వీరి జీవితంలోని అనేక ముఖ్య ఘటనలు శ్రీ రజనీగారు విపులంగా వివరించారు.

రామదాసు త్యాగరాజ స్వామినే ప్రభావితం చేసిన వాగ్గేయ కారుడు! ముఖ్యంగా భజనభిత్తు పాటలలో మేటి దివ్యనామ సంకీర్తనలూ, ఉత్సవ సాంప్రదాయ సంకీర్తనలు ఈ కోవ లోనికి చెందినవి.

రామదాసు కీర్తనలు, సంగీతం:

"రామదాసు రచనలుగా గుర్తుపట్ట దగిన కీర్తనలు దాదాపు 100 నుండి 108 దాకా దొరుకుతాయి. పరిశోధనలు చేసి రామదాసు కీర్తనలు ఇన్ని అనిగాని, ఇవే అనిగాని నిర్ణయించే ప్రయత్నాలు చేయలేదు. సంప్రదాయ సిద్ధంగా భజన కూటాలలోను, గాయక వర్యుల పాఠాలలోను ఈ కీర్తనలు పాడ దగిన స్వరాలను సేకరించి గ్రంధ రూపంలో ప్రకటించటం ఎంతైనా అవసరము. రామదాసు కీర్తనలలోని రమ్యతా, రక్తి వినాలంటే ఆంధ్ర దేశం లోని చిన్న గ్రామాలలోని రామ మందిరాలలో పామరులు పాడేటప్పుడు వినాలి, తికాలాల చిరతలు వాయిస్తూ, చిటిదళం వేస్తూ, బృంద గానం చేస్తున్నప్పుడు రామదాసు రచనలోని రస రూపం ప్రత్యేక్షం కాగలదు!   కచేరి పద్ధతిలో ఈ పాటలు పాడి రక్తి కట్టించడం ఏ బాలమురళీకృష్ణ లాంటి కొందరికే సాధ్యమౌతుంది. ఈ సందర్భములో "పామరజనానికి ఇంతగా ప్రమోద దాయకాలైన ఈ కీర్తనలలోని సంగీతాన్ని ఆంధ్రులు పునరుద్ధరించు కొని త్యాగరాజ సంగీతంలాగా స్వర నిబద్దం చేసి, సంగీత సభలకు తీసుకొని రాకపోతే, ఇప్పటికే నష్టపడి లుప్తమై పోతున్న, తెలుగు కళలకు మరింత ద్రోహం చేసుకున్న వారమవుతాము". అన్న రజనీగారి ఆతురుతను విజ్ఞులందరూ గమనిస్తారని ఆశిద్దాం.

రామదాసు కీర్తనలలో సంస్కృత సమాసాలు అక్క డక్కడా దొర్లినా, అవి సర్వజన సుభోధక మైన శైలిలో వుంటాయి. వాటి వాటి పక్క పక్కనే అచ్చమైన తెలుగు నుడికారపు చరణాలు వుంటూ వుంటాయి! రామదాసు కీర్తనలు కొన్ని, అవిపాడు కొను రాగ, తాళ సహితంగా రజనీగారు ఈ గ్రధంలో పొందుపరచారు. సంగీతం నేర్చుకొనే అభిలాష కల వారికి ఈ సూచన ఉపయోగిస్తుంది.

కేవల భక్తి మార్గమే కాక, ఙాన మార్గమును కూడా తోడు చేసుకొని, వైరాగ్యం సిధ్ధింప చేసుకొన్న యోగి పుంగవుడు శ్రీ భద్రాచల రామదాసు!

"భళీ వైరాగ్య మేంతో బాగై యున్నది చంచల మైన

                                           నా మనసు నిశ్ఛల మైయున్నది..."

అనే కీర్తన ఈ విషయాన్ని సృష్ట పరుస్తుంది.

రామదాసు తానూ,తన చుట్టూ జేరిన భక్త సమాజమూ, దేశం లోని దీన పీడిత ప్రజలతో సహా గొంతులు కలిపి చేసే ప్రార్థనలూ, అడుగులు తొక్కుతూ పాడే భజనలూ, సమకూర్చారు. ఇది మనమంతా ఆనందించ వలసిన విషయం.

 క్షేత్రయ్య:

ఇంతకుముందు పేర్కొనిన నారాయణ తీర్థులు, సిధ్ధేంద్ర యోగి, భద్రాచల రామదాసు, సమకాలికులని విజ్ఞులైన పరిశోధకుల అభిప్రాయము. కాని క్షేత్రయ్యకు ఆ ముగ్గిరిలో ఏ ఒకరి తోను సంపర్కాలు కలిగి ఉన్నట్లు నిష్కర్ష చేయడానికి తగిన చారిత్రక ఆ ధారాలు లభ్యం కాలేదు. ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పవచ్చు. 17వ శతాబ్దం లో సంకీర్తన రచన మూడు నవ్య మార్గాలు తొక్కింది."తీర్థుల కృషిలో సంకీర్తనం ఆత్మ బోధను ఆదర్శంగా పెట్టుకొని, శృంగారాన్ని ఔపచారికంగా ఉంచుకొని, ఒక ప్రక్క నాట్యాభినయ యుక్తములైన యక్ష గానాల కు ఉపాంగం అవుతూ, ఇంకొక భజన పద్ధతి ప్రాచుర్యానికి దారి తీసింది. ఇది మొదటి మార్గం. ఇక రామదాసు కీర్తనలు - భక్తిరస పరమావధి పొంది పామర జనం కూడా భక్తి మార్గంలో సాధన చేయడానికి అనువయిన భజన గోష్ఠుల వ్యాప్తికి కారణ మైనాయి, ఇది రెండో మార్గం. మూడవది, సిద్ధేంద్ర - క్షేత్రయ్యలకు ఆలంబ మైన మార్గం".

సిద్ధేంద్రుని యక్ష గానములు, క్షేత్రయ్య పదములూ, తీర్థుల తరంగాలతో పాటు నాట్యాభినయ ప్రదర్శనలకు అనుకూల మైనవి, క్షేత్రయ్య అనుసరించిన పధ్ధతి తర్వాతి వాగ్గేయ కారులకు మార్గ దర్శక మైనది.

   క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. ఈయన నివసించిన కాలం క్రీ.శ.1600-1680 అని పరిశోధకులు తేల్చారు. ఆయన స్వస్థలము కృష్ణా జిల్లాలోని మొవ్వా అనే గ్రామం. క్షేత్రాటనం చేసినందు వలన ఆయనకు క్షేత్రయ్య అనే పేరు వచ్చిందని విజ్ఞుల అభిప్రాయము. శ్రీయుతులు విస్సా అప్పారావు గారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు క్షేత్రయ్యను గూర్చి పరిశోధనలు చేసి, ఆయన జీవిత విశేషాలను విశ్లేషించారు. వారి నిష్కర్షలను పేర్కొంటూ, తాము సంగ్రహించిన మరి కొన్ని విషయాలతో శ్రీ రజనీకాంత రావుగారు విపులమైన వ్యాసాన్ని వాగ్గేయ కారుల చరిత్రము రెండవ భాగంలో పొందు పరచారు. అందులో క్షేత్రయ్య గారి జీవిత ఘటనా చక్రం సంపూర్ణంగా చర్చించారు. (చూడు: వాగ్గేయకార చరిత్రము, 2వ భాగం: 204-231 పుటలు).

    అభినయ కళను ఒక విషిష్ట కళా రూపంగా, కళా లోకాని కి సమర్పించినవారు తెలుగు వారు. క్షేత్రయ్య పదముల రచనతో స్వాత్వి కాభినయ విధానం పెంపొందినది. ...మువ్వగోపాలుని పై కొన్ని వేల పదములువ్రాసి తద్వారా స్వాత్వి కాభినయాన్ని ఒక ప్రత్యేక కళాంశముగా పెంపొదింప చేసినవాడు క్షేత్రయ్య... క్షేత్రయ్య పదములు భావ, రాగ ప్రాధాన్యత కలిగినట్టి రచనలు. పదములు విలంబిత లయ కల్గి, ఒక్కొక్క రాగములో ఒక్కొక్క భావమును ఎన్నో విధాలుగా సంచారము చేయుటకు అనువైన రీతిలో వుండును (నటరాజ రామకృష్ణ)".

క్షేత్రయ్య తీర్థ యాత్ర వాంఛ తోనో, లేక రాజ సందర్శన సత్కారాల ఆశ తోనో ఇత మిధ్ధమని చెప్ప లేము కాని, స్నేహితులు పురి కొలుపగా దక్షిణ యాత్ర చేసాడు. ఈ క్షేత్రాటనం లో ఆయన దాదాపు 18 పుణ్య క్షేత్రాలు దర్శించి అచ్చటి దేవతలకు అంకితముగా పదాలు రచించాడు. ఆ సమయం లోనే నాలుగు రాజా స్థానాలకు వెళ్ళి, అక్కడి రాజుల కోర్కె కూడా చెల్లించి వారిపై పదాలు చెప్పారు.

       వెళ్ళిన క్షేత్రాలలో వున్నటు వంటి వేల్పులను గూర్చి పదాలు రచించి నప్పటికీ, ఆ వేల్పులకు మువ్వ గోపాలునితో అభేదం పాటించాడు. తను స్వయంగా గోపాల భక్తు డైన శివ కేశవాభేదం పాటించాడు. క్షేత్ర దైవాంకితములుగా  క్షేత్రయ్య రచించిన పదాలలో కంచిలోని వరద రాజును గురుంచి 13 పదాలు, చిదంబర మందలి చెవంది లింగని గురించి 2 పదాలు వున్నాయి.

"చక్కని దయగలదా యిది నీ జాగా చెవంది లింగా

యికడికి వచ్చిన దేమో హెచ్చు కంచి వరదా

చెలికాడ నిను చూడ వచ్చితి చెవంది లింగా

మువ్వ గోపాలుడు గాక మరెవ్వరు కంచి వరదా..."

"చెవంది లింగా, కంచి వరదా అని నాయిక ఒక్కరినే సంబోధిస్తున్నట్లు రచించాడని శ్రీ రజనీకాంత రావుగారి అభిప్రాయము. శివ కేశవాద్వైతము నిరూపిస్తూనే, ఈ పదములో "గోత్రస్ఖలనం" అనబడే కామశాస్త్ర లక్షణానికి కూడా దృష్టాంతంగా నాయిక సంభాషణలలో ఔచిత్య భంగం లేకుండా ముగ్గురు నాయకుల పేరులు సంబోధింప జేసాడు... ఇదీ, ఇంకా ఎన్నో దృష్టాంతాలు క్షేత్రయ్యకు కామ శాస్త్రం లోను, నాయికా నాయక మనస్తత్వ చిత్రణ లోను కూలంకుషమైన అనుభవమూ, జ్ఙానమూ, ఉన్నవని చాటుతాయి".  

    అన్నమాచార్యుల రచనలనూ, క్షేత్రయ్య రచనలనూ పరిశీలిస్తే సామ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. క్షేత్రయ్య అన్నమయ్యను అను కరించాడన్న భావం స్థూల దృష్టికి కల్గుతుంది. కాని, "విస్తృతంగా కృషి చేసిన ఒక పూర్వ వాగ్గేయ కారుని రచనలను లెస్సగా చదివియో, పాడు కొనియో ఉండిన సత్ఫలితం క్షేత్రయ్య పదములలో ప్రతి ఫలించిందని" రజనీ గారి అభిమతం. ఇద్దరి రచనలలో పోలికలు మాత్రం హెచ్చు గానే కనిపిస్తవి"!

   క్షేత్రయ్య పదాలలోని సంగీత రచనను గురించీ, వాటిని పాడవలసిన పధ్ధతిని గురించీ శ్రీ విస్సా అప్పారావుగారు వ్యక్త పరచిన అభిప్రాయం గమనార్హం.

"క్షేత్రయ్య పదముల లోని పల్లవి, అను పల్లవి చరణములతో క్రమముగా రాగ వృద్ది ఎట్లు చేయ బడినదో, ఒకే రాగ మందలి వివిధ పదముల లోని స్వర సంచారములు, గమక భేదములకు ఒక్క సంగీతా అనుభవము ఎంత ప్రభావంత మైనదో వ్యక్తము కాగలదు. ఎత్తుగడ, తర్వాతి నడక, స్వర సంచారములు, కూడికలు, పోకడలు రాగము యొక్క జీవకళను పద గమనములో చిప్పిల్ల జేయు చుండును... రాగమునకు గల ఉన్నత స్థానమును నిర్ణయించి, క్షేత్రయ్య, తర్వాత వాగ్గేయ కారులకు, సంగీత వేత్తలకు మార్గదర్శి యైనాడు". (చూడు: పుటలు: 220-222).

 సంగీత త్రిమూర్తులు :

దక్షిణ భారత సంగీతానికి అఖండ పరివ్యాప్తిని చేకూర్చిన అవతార మూర్తులైన వాగ్గేయ కారులు: త్యాగరాజు, శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు. వీరి మువ్వురిని సంగీత రత్న త్రయమని పేర్కొంటారు. శ్యామ శాస్త్రులు (1762-1827), త్యాగరాజు (1767-1847), ముత్తుస్వామి దీక్షితులు (1776-1836) కాలాలో వున్నవారు. ఒక విధంగా చెప్పాలంటే సమకాలికులు. అంతేకాక, ముగ్గురూ తమిళనాడు లోని తంజావూరుకు జిల్లాలోని తిరువారూరుకు సంబం ధించిన వారు. వారి రచనలలో రాగ స్వరూపము పరిపూర్ణమై స్పష్టంగా దర్శిస్తుంది. సౌమ్యమైన పద శిల్పానికి, విశిష్ఠ మైన సంగీత శిల్పానికి మొట్ట మొదట వీరిని స్మరించి గాని, మిగిలిన వారిని తలుచు కొనరు. ముగ్గురూ వేదశాస్త్ర నిష్ణాతులు. ముగ్గురూ వరప్రసాదు లైన కారణ జన్ములు. త్యాగరాజుల వారి సాహిత్య శైలి ద్రాక్షా పాకంగాను, శ్యామ శాస్త్రుల వారిది కదళీ పాకంగాను, దీక్షితులవారిది నారికేళ పాకంగాను పేర్కొన వచ్చును. ఇక సంగీత రచనను పరిశీలిస్తే, త్యాగరాజుది గోదావరివలే వి స్తృతమైతే, శ్యామశాస్త్రుల వారిది కృష్ణవలే గంభీరమై,దీక్షితుల వారిది ఉభయ తారకంగా త్రివేణి ప్రవాహము వలే సాగింది. ఆధునిక సంగీతానికి వీరి రచనల కంటే మంచి లక్ష్యాలు (ఉదహరణలు) కనిపించవు. ముగ్గురూ ఆథ్యాత్మిక తత్త్వ వేత్తలు మాత్రమే కాక అంతర దృష్టి కల యోగి పుంగవులు.

విడి విడి గా వీరిని గూర్చిన విశేషాంశలను క్లుప్తంగా పాఠక శయులకు తెలియ జేయడ మైనది.

 త్యాగరాజు:

శాహభూపాలుని ఆస్థాన వాగ్గేయ కారుడైన గిరిరాజ కవికి పౌత్రుడు మన త్యాగయ్య. సీతమ్మ, రామబ్రహ్మం దంపతులకు శ్రీ త్యాగరాజ స్వామి స్వప్నంలో కనిపించి, కుమారుని పుట్టుకను సూచించి, అతడు మహా వాగ్గేయ కారుడు అవుతాడని, ఆ పుత్రునికి త్యాగరాజ స్వామి అని పేరు పెట్టమని చెప్పారుట.

త్యాగయ్య గారు క్రీ.శా.1767వ సంవత్సరం, ఆ దంపతులకు వర ప్రసాదిగా జన్మించాడు. తల్లి తండ్రుల ఆ బాలునికి త్యాగరాజ బ్రహ్మమని నామకరణం చేసు కొన్నారు. త్యాగయ్యగారి ఇలవేల్పు శ్రీరాముడు. తల్లి తండ్రుల పూజా మందిరం వద్ద బాల్యంలోనే త్యాగయ్య రామ భక్తు డైనాడు. తల్లి పూజా సమయాలలో త్యాగయ్యకు జయదేవుని అష్ట పదులూ, పురంద ర దాసు, రామదాసు కీర్తనలనూ నేర్పి, ఆయన చేత పాడించే వారట. తండ్రిగారి వద్ద సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించి, పాండిత్యాన్ని సంపాదించారు. నాటి వారి కుటుంబ పరిస్థితులను, మరియూ జీవిత విశేషాలను ఆధార సహితంగా విశ్లేషించార గ్రంధ రచయిత రజనీకాంత రావుగారు. (చూదు: ఆ.వా.చ. పు:322-351).

శ్రీరామ సాక్షాత్కారం:

త్యాగయ్యగారు రామకృష్ణానంద స్వామి ఉపదేశాను సారంగా రామ తారక మంత్రాన్ని తిరువయ్యారు లోని పంచనదీశ్వర దేవలయం లో నిష్ఠగా జపించి శ్రీరామ సాక్షాత్కారాన్ని పొందారు. ఆనంద పారవశ్యంలో, త్యాగయ్య అప్పుడు చెప్పిన కీర్తనే - అఠాణా రాగంలోని "ఏల నీ దయరాదు, పరాకు జేసేవేల" అనేది. కీర్తనలోని విశేషాలు అన్నిటిలోను త్యాగయ్యకు ఆ నాడు దర్శనమిచ్చిన దివ్య మంగళాకృతి ఆ తర్వాతి జీవిత కాలంలో అత్యంత ప్రభావ కారి అయినట్లు ఆయన రచించిన కీర్తనల ద్వారా  స్పష్ట మవుతుంది.

    త్యాగయ్యగారి అపార పాండిత్య ప్రతిభ తెలిసి కొనిన కాంచీపుర పీఠాధి పతి ఉపనిషద్ర్బ్రహ్మేంద్ర స్వాముల వారు త్యాగయ్యను కాంచీపురం రమ్మని ఆహ్వానించారు. శిష్యులను వెంట బెట్టుకొని త్రోవలోని క్షేత్రాలను దర్శిస్తూ, త్యాగయ్య కాంచీపుర యాత్ర చేశారు. కొన్ని చోట్ల వింత అనుభవ, అనుభూతులకు లోనైనారు. ఈ విశేషాలన్ని రజనీకాంత రావుగారు చక్కగా చిత్రించారు. ముఖ్యంగా తిరుపతిలో త్యాగయ్యగారు పొందిన అనుభూతి విద్వాంసులను ఎక్కువగా ఆకర్షిస్తుంది.

త్యాగయ్య కీర్తన రచనా శిల్పము:

 ఆ కాలంలో త్యాగయ్యకు వున్నంత మంది శిష్యులు మరే వాగ్గేయ కారునికి లేరని ప్రతీతి. దీనికి కారణం త్యాగరాజుగారి నిరాడంబర జీవితం, వారి సంగీత శిక్షణా విధానమని చెప్పు కొంటారు.    త్యాగయ్యగారి కీర్తనలన్నీ ఆయన పారవశ్య స్థితిలోనో, ఆవేశం లోనో ఉండగా వెలువడినవే! ఆ సమయంలో గురువు గారిని చుట్టుముట్టిన శిష్య బృందం పలకలపై వ్రాసేవారని చెప్పు కొంటారు. కీర్తన పూర్తి అయ్యేసరికి శిష్యులలో ఒకరు స్వరాల కూర్పులో పల్లవినీ, ఇంకొకరు చరణాన్నీ,వేరొకరు సాహిత్యాన్నీ,పలకల మీద వ్రాసు కొనేవారట! అటు తర్వాత, అందరూ కలిసి కీర్తన పాఠం నేర్చుకొని, గురవుగారి సమక్షాన వినిపించే వారని చెప్పబడినది.

అన్నమాచార్యతో మొదలైన సంకీర్తన కాలక్రమేణ మార్పులతో త్యాగరాజు నాటికి పరిపక్వత పొంది కృతి అనే పేరు వహించింది. కృతులు బయలు దేరేనాటికి, రాగాల స్వరూపంలో వివిధ మార్పులు సంత రించు కొన్నాయి. రాగ స్వరూప దర్శనానికి త్యాగరాజ కృతులు అద్దం పడతాయి. సాహిత్యంలోని అంతరార్థం సులభంగా తెలియడానికి రాగ సంచారం లోని విశేష ప్రయోగల ద్వారా రాగ భావాన్ని సాహిత్య భావంతో కలిపి విస్తరించడానికి "సంగతుల" ప్రయోగాన్ని విరివిగా చేసారు త్యాగయ్య. పటిష్ఠ మైన పద్య కవిత్వ భాషకంటే, ఉదాత్త మైన గద్యమే పాటలకు యోగ్య మైన దని త్యాగయ్య భావన. గద్యం లోనే యమక, అంత్య ప్రాసాది అలంకారములు వుంటే, కృతి శ్ర్యావ్యత పొందగలదని నిరూపించారు ఆమహనీయులు. "సులభంగా అర్థమయ్యే లలిత మైన పద జాలమూ, ఉదాత్తము లైన భావాలూ, సదాశయాలు, నిత్య జీవిత సంభాషణలలో వాడుకొనే లోకోక్తులూ, త్యాగరాజ కృతులను, సంగీతాన్ని సామాన్య జనులకు కూడా ఆస్వాద యోగ్యాలుగా చేసినవి. ఉపనిషత్తుల లోని పరమ సత్యాలను కూడా సులభ శైలిలో తన కృతులలో చొప్పించి నందు వలన త్యాగయ్య పాటలను తాత్వికులు "త్యాగబ్రహ్మోపనిషత్తు" అని కొని యాడారు". త్యాగరాజు దాదాపు 2400 కీర్తనలు రచించారని  చెబుతారు పెద్దలు. కాని, ఇప్పటికి అచ్చయిన పుస్తకాలలో 660 వరకూ ప్రచురిత మైనాయి. త్యాగరాజు గారు 72 మేళకర్త రాగాల లోను కీర్తనలను రచించారు. ప్రాచీన సంగీత కర్తలకు కూడా తెలియని రాగాలలో కొన్ని కృతులను రచించారని ప్రతీతి. ఈ రాగాలు కర్ణాటక సంగీతానికి అమూల్య నిధులుగా సంగీత విద్వాంసులు పరిగణిస్తారు.  

 ఘన రాగ పంచరత్న కీర్తనలు:

జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక….  (నాట-ఆది.)

దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా... (గౌళ-ఆది)

సాధించెనే ఓ మనసా... (ఆరభి-ఆది.)

కనకనరచిరా కనక వసన నిన్ను… (వరాళి-ఆది.)

ఎందరో మహాను భావులు అందరికి వందనములు… (శ్రీ-ఆది.)

 పైన పేర్కొనిన కీర్తనలలో భాషా శైలి జటిలంగా వుంటాయి. వీటిని గానం చేసేటప్పుడు ఎన్నో సంగతులతో విస్తరించి విజ్ఞులైన విద్వాంసులు పాడడానికి అను గుణ్యంగా వుంటాయి. వీటిలో కొన్నింట్లో అనర్గళ గంగా ప్రవాహం లాంటి సంస్కృత కవితా, మరి కొన్నింటిలో జాను తెనుగు కవితా, యమక, అను ప్రాసాది శబ్ధా లంకార మాధుర్యం నిక్షిప్తమై వుంటుంది. త్యాగయ్యగారు రచించిన పంచ రత్నముల లో అత్యంత ప్రసిధ్ధి చెందినవి: నారద పంచ రత్నములు, తిరువత్తియూరు పంచ రత్నములు, కోవూరు పంచ రత్నములు, నాగపూర పంచ రత్నములు, శ్రీరంగ పంచ రత్నములూ మొదలయినవి.

   త్యాగయ్యగారి దివ్యనామ సంకీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలూ సులభ మైన "ధాతుమాతు" నిర్మాణంతో సామాన్య జనానికి భక్తి సాధనకు గాని, భగవత్సేవా కైంకర్య సమయాల లోను, పాడు కొనుటకు వీలుగా వుంటాయి. రాగాలను శాస్త్ర పరిథి నుంచి, కళా శిల్ప ప్రపంచానికి తీసుకొనిన్వచ్చిన త్యాగయ్య, కీర్తన రచనలో నూతన పోకడలకు ఆద్యుడయ్యాడు. త్యాగయ్య కాలం వరకూ, కీర్తనా క్రమం పల్లవీ, అను పల్లవీ, యీరెంటి ధాతువులు కలయిక వల్ల ఏర్పడిన చరణం సూత్రం గానే ఉండేది.త్యాగయ్యగారు తన భావావేశాన్ని వ్యక్త పరచడానికి ఎక్కువ పరిపూర్ణత గల కృతిని సాధించారు.

సంగీత విశేషణాలను అనుసరించి త్యాగయ్య కీర్తనలను అయిదు రకాలుగా విభజించ వచ్చును.

1. అతి సులభ కీర్తనలు (ఉదా: వినవే ఓ మనసా - వివర్ధని)

2. సులభ కీర్తనలు     (ఉదా: సుజన జీవనా - కమాస్)

3. మధ్య్హ రకం కీర్తనలు (ఉదా: ఎవరని - దేవామృతవర్షిణి)

4. కష్టసాధ్య కృతులు   (ఉదా: నా జీవా ధార - బిలహరి)

5. అతి క్లిష్ట కృతులు    (ఉదా: దారిని తెలుసు కొంటి- శుద్ధ సావేరి) 

    కీర్తనలలో వ్యక్త పరచిన సాహిత్య భావాలను బట్టి ఈ క్రింది విధంగా పరిగణించ వచ్చును:

1. వేదాంత బోధకములు (శాంతము లేక - సామ)

2. నీతి బోధకములు (మనసు నిల్ప శక్తి లేక పోతే - అభొగి)

3. నమస్కృతులు (విదులకు మ్రొక్కెద - మాయా మాళవ గౌళ)

4. సంగీత ప్రశంసాత్మకములు (స్వర రాగ సుధా - శంకరాభరణం)

5. మానస బోధకములు (వినవే ఓ మనసా - వివర్ధని)

6. ఆత్మ ప్రవర్తన విషయమై పశ్ఛా త్తాపాత్మక ప్రార్ధనములు (ఎటుల బ్రోతువో - చక్రవాకం)

7. విన్నపములు (నాదుపై బలికేరు - మధ్యమావతి)

ఈ క్రింది పేర్కొనిన కృతులు త్యాగయ్య రచనలనే భ్రమకు చాలామంది లోనవుతారు కాని అది నిజం కాదు.

1. వినుతా సుత వాహనుడై -  (హరి కాంభోజి)

2. నీదు చరణములే - (సింహేంద్ర మధ్యమం)

3. నతజన పరిపాల -  (సిం హేంద్ర మధ్యమం)

 పై మూదు రచనలు రామనాధ పురం కె.వి.శ్రీనివాసయ్యంగారి రచనలు.

4. పరాజ్ముఖ మేలరా - సురటి

5. అభిమాన మెన్నడు - వివర్ధని 

ఈ రెండూ శ్రీమన్నారుగుడి రాజగోపాలయ్యంగారు రచించినవి.

6. దినమే సుదినము - లతాంగి  (గిరీశయ్యంగారి రచన) 

7. వెడలెను కోదండ పాణి - తోడి

తంజావూరు కృష్ణ భాగవతార్ రచన.   

 భాషలు వేరైనా, రాష్టాలు వేరైనా, ఆంధ్రుల గాని, తమిళులు గాని, కేరళీయులు గాని - అందరిదీ ఒకే సంసృతి, సంగీతం, ఒకే వేదాంతమని తమ కీర్తనల ద్వారా చాటిన నాద బ్రహ్మ, శ్రీత్యాగయ్య. ఆయనను భారతీయ అవతార పురుషులలో ఒకరినిగా పూజించుట మన ధర్మం.

శ్యామశాస్త్రులు:

సంగీత జిజ్ఞాసువులకు అనేక సంగీత విశేషాలను తెలియ పరచిన సాంబమూర్తి గారు శ్యామశాస్త్రుల వారిని గూర్చి వ్రాస్తూ, ఆయన "వడదేశత్తు వడమాళ్" అనీ, దక్షిణ భారత దేశంలో తమిళం మాట్లాడే బ్రహ్మణుడని పేర్కొన్నారు.

సంగీత పరిశోధకులు తెలియ పరచిన అంశాలను బట్టి శ్రీశ్యామశాస్త్రుల వారి పూర్వికులు ఆంధ్ర దేశంలోని కర్నూలు జిల్లా కంబంలో వుండే వారని తెలియు చున్నది.

ఆది శంకరుల కాలం నాటికి, శామశాస్త్రులవారి పూర్వికులు కాంచీనగరం వచ్చి, శంకరాచార్యుల వారి ఆదేశాను సారం అచ్చటి కామాక్షీ దేవి విగ్రహానికి అర్చకత్వం వహించారుట. తర్వాత కాలంలో తులజాజీ మహరాజు ఆదరం సంపాదించి తంజావూరు లోని కామాక్షి ఆలయాన్ని కట్టించి, శ్యామశాస్త్రుల గారి తండ్రిగారైన శ్రీవిశ్వనాథ శాస్తి గారు ఆ ఆలయానికి అర్చకత్వాన్ని నిర్వహించినట్ట్లు విదితమగు చున్నది.

శామశాస్త్రుల వారు విశ్వనాథశాస్త్రుల వారికి 25వ యేట జన్మించారు. యుక్త వయస్సు వచ్చే సరికి, సంస్కృ తాంధ్రాలలో విద్యాభ్యాసం జరిగింది. శ్యామశాస్త్రి గారి మేనమామ ఆయనకు సరళీ వరుసలు మొదలుకొని, స్వర జ్ఞానం వరకు నేర్పించారుట. సంగీత శాస్త్ర వేత్త అయిన ఒక యోగీశ్వరుడు యాత్రార్థియై తంజావూరు వచ్చి - శ్యామశాస్త్రిలో దాగివున్న సంగీత శక్తులను గుర్తించి మూడు సంవత్సరాలు పాటు శ్యామశాస్త్రికి సంగీత లక్షణ మర్మాలన్నింటిని తెలియ పరచారుట!

   తండ్రి గారి తర్వాత, కామాక్షమ్మను అర్చన చేసే అధికారం శ్యామశాస్త్రుల వారికి వచ్చింది.  శ్యామశాస్త్రుల వారి జ్ఞాన సుధ వికసించి, వారి కృతులు విద్వత్ప్రసిద్ధి పొంద నారంభించినవి. సామాన్య రాగాలలోనే కాక, అపూర్వ రాగాలలోను, అతిక్లిష్ట మైన నడకలు గల తాళాలలోను ఆయన సునాయాసంగా కృతులు రచించ మొదలిడినాడు. ఆయన మొదటి కృతి "జననీ నతజన పరిపాలినీ పాహిమాం భవానీ". శ్యామశాస్త్రుల వారి అపార భక్తికి, సంతసించిన దేవి సాక్షాత్కరించి శాస్త్రులతో సంభాషించేదని విజ్ఞుల విశ్వాసం. పూజా సమయాలలో భక్తితో పరవశం చెంది ఆయన అద్భుత రచన లొక్కొక్కటి, వెలువడు తుండేవని ప్రతీతి, శ్యామశాస్త్రులు యెక్కువ జీవితం తంజావూరు లోనే గడిపారు. శిష్యుడైన అలనూరు కృష్ణయ్యతో కలిసి ఒకసారి మధుర వెళ్ళారని, అచ్చట దేవి సన్నిధిలో తొమ్మిది కృతులు రచించి పాడినారట. ఆ కృతులను "దేవీ నవరత్న మాలిక" అంటారు. శ్యామశాస్త్రి గారి రచనలన్నీ దాదాపు 300 వరకూ వుండవచ్చు నని పేర్కొంటారు. విద్వాంసులు తాళ ప్రస్తారాన్ని గురించిన పథకాలలో ఆయన వ్రాసిన తాళ ప్రతులు దొరికినవట. శాస్త్రుల వారు తెలుగు,సంస్కృతం, తమిళ భాషలలో కృతులను రచించారు. శ్యామశాస్త్రుల వారికి ఆనంద భైరవి రాగం పైని ప్రత్యేకాభిమానం ఉడటం మూలాన ఆరాగం లోనే ఎక్కువ కృతులను రచించారు. 

 ముద్దుస్వామి దీక్షితులు:

దీక్షితులవారు వేంకటమఖి పౌత్రుడైన వేంకటవైద్యనాథ దీక్షితులవారి శిష్యులైన రామస్వామి దీక్షితుల పుత్రునిగా పేర్కొంటారు. రామస్వామి దీక్షితుల వారు ముద్దు కుమారస్వామి సంకీర్తన చేయగా వరప్రసాదియై జన్మించినవాడు ముద్దుస్వామి దీక్షితులు. తమిళు లీయనను ముత్తుస్వామి దీక్షితర్ అని పేర్కొంటారు. ముత్తుస్వామి బాల్యంలోనే విధ్యాభ్యాసం ప్రారంభించి, అచిర కాలం లోనే వేదాధ్యాయనం లోను మరియు అనేక శాస్త్రములలో పాండిత్యం సంపాదించారు. వీరి జీవిత విశేషములను వివరంగా చర్చించారు గ్రంధ కర్త రజనీకాంత రావుగారు. (చూడు ఆ.వా.చ. 357-363 పుటలు).

దీక్షితులవారు తెలుగులో తక్కువ రచనలు చేసి నప్పటికీ, సంస్కృతంలో ఎక్కువ కీర్తనలు రచించారు. ముత్తుస్వామివారి కీర్తనలన్నిటి లోను, వేకటమఖి ఏర్పరిచిన 72 మేళకర్త రాగాలకు లక్ష్యప్రాయాలుగా సంస్కృతంలో కీర్తనలు రచించారు. ఆయా కీర్తనలు రాగ భావాన్ని సృష్టంగా జీవగ్రహాంశ స్వరాది విశేషాలు విపులంగా పట్టి చూపించే ఉదాహరణలు. "ఈ కృతులలో చాలా వరకు చౌక కాలంలో ప్రారంభించినా, చరణాలలో మధ్య కాలంలో నడిచే సాహిత్యం ఉంటుంది". దీక్షితులవారి కృతులకు దేశంలో మంచి ప్రచారమే లభించింది. దీని ఖ్యాతి అత్యంత సమర్థ వంతులైన సోదరులకు చెందుతుంది. సోదరులతో సహా, దీక్షితులవారికి మంచి శిష్య వర్గం ఉండుట దీనికి సహకరించింది.

    త్యాగరాజ సమకాలీనులు, తర్వాతి వారు కర్ణాటక సంగీత వికాసానికి అనేక విధాలుగా తోడ్పడినారు. వారి ప్రభావం, వారందర్ని గూర్చిన విశేషాలు తగురీతిలో చిత్రించారు శ్రీరజనీకాంత రావుగారు. (చూడు ఆ.వా.చ. పుటలు:352-419). ఇంత వరకు, ఈ వ్యాసంలో 17వ శతాబ్దం ప్రారభం నుండి 20వ శతాబ్దం వరకు, అనగా గడచిన మూడు శతాబ్దాలలో కర్ణాటక సంగీతపు క్రమ పరిణామానికి తోడ్పడిన వాగ్గేయ కారుల జీవిత విశేషాలను, రచనల గూర్చి చెప్పు కొన్నాము. ఆ క్రమ పరిణామమే, వివిధ శాస్త్రీయ రచనా రీతుల పుట్టుకకు, సంగీత సభా సాంప్రదాయాల అభివృధ్ధికీ, దోహదం కల్పించి, ఆధునిక కర్ణాటక సంగీత స్వరూపాన్ని తీర్చి దిద్దినది.     

కాలజ్ఞాన త త్త్వకర్తలు:

తాళ్ళపాక ఆధ్యాత్మ సంకీర్తనలు వరవడిగా తీసుకొని, తర్వాతి కాలంలో కాలజ్ఞాన తత్వాలు అనే పేరుతో ఆధ్యాత్మిక ప్రబోధం చేసే కీర్తనలను రచించిన వాగ్గేయ కారులు చాలామంది పుట్టుక వచ్చారు! వీరిలో చాలామంది పామర జనోద్దరణమే ఆశయంగా భావించిన వారూ, బ్రాహ్మణేతర కులాలో జన్మిచిన వారూ, వేదాలలోను, ఉపనిషత్తులలోను చెప్పబడిన పరమార్థ తత్త్వాన్ని సులభ భాషలో పామర జనానికి అర్థ మయ్యే శైలిలో కీర్తనలు వ్రాసి ప్రబోధం చేశారు. ఇలా రచించినవారు సంగీత శాస్త్రజ్ఞానం కలిగిన వారనిగాని, భాషాకోవిదు లనిగాని అనుకొనుట వీలుపడదు. వీరి వలన సంగీత పరిణామానికి, వికాసానికి ఎటువంటి ప్రయోజనం కలుగక పోయినా, శాస్త్రీయ గేయ రీతుల నూతన ప్రవాహ వేగంలో దేశీయ గేయ రీతులు కొట్టుకొని పోకుండా కాలజ్ఞాన తత్త్వాల రూపంలో నిలిచి పోయాయి! ఇట్టి తత్త్వ జ్ఞుల వివరాలు సమగ్రంగా పేర్కొన్నారు రజనీకాంత రావుగారు.   అలాగే హరికథా వాగ్గేయ కారుల వివరాలు కూడా పొందు పరచ బడ్డాయి ఈ గ్రథంలో!

ఆధునిక వాగ్గేయ కారులు: (1850-1956)

 స్థూలంగా నూట యాభై సంవత్సరాల కాలాన్ని ఆధునిక యుగంగా నిర్దేశించు కొన్నారు గ్రంధకర్త రజనీకాంత రావుగారు.

ఆధునిక యుగపు వాగ్గేయ కారుల రచనలను మూడు విధాలుగా పరిగణించారు. 1) మొదటి విధానానికి చెందినవారు - పూర్తిగా సంగీత విద్వాంసులు, సాహిత్యం లో ప్రవేశం కలిగి గేయ రచన చేసినవారు. 2. పూర్తిగా సాహితీ పరులై కొద్దిగా సంగీతాభిరుచి కల్గి గేయ రచనలు చేసిన వారు. 3) సంగీత సాహిత్యాలలో సమాన ప్రతిభ కలిగి గేయ రచనలు చేసినవారు. పై మూడు శ్రేణులకు అనుగుణ్యమైన చాలా మంది విద్వాంసుల వివరాలను సేకరించి, పొందు పరచడమైనది. ఈ పుస్తకంలో వారిలో అత్యంత ప్రతిభా వంతులను గురించి క్లుప్తముగా పేర్కొనడ మైనది ఈవ్యాసంలో.

తంజావూరు విద్వచ్చతుష్టయము:

ముత్తుస్వామి దీక్షితులకు శిష్యులై స్వాతి తిరునాళ్ ఆస్థాన విద్వాంసులైన చిన్నయ్య, పొన్నయ్య, శివానందం, వడివేలు లను తంజావూరు చతుష్టయంగా పేర్కొంటారు. ఈ నలుగురు సోదరులు తెలుగు లో అనేక వర్ణాలు, కీర్తనలు, జావళీలు రచించారు. వీరు రచించిన పాటలు చాలా వరకూ బృహదీశ్వరుడికి అంకితముగా రచించినవి. ఈ సోదరులలో చిన్నయ్య తానవ వర్ణాదులు రచించినట్లు తెలియు చున్నది. వీరి వర్ణాలు గౌళ, లలిత, ఆనంద భైరవి, కళ్యాణి, శంకరాభరణం, కాంభోజి వంటి ప్రసిధ్ధ రాగాలలో ఉన్నవి.

మహాకవి దాసు శ్రీరాములుగారు: (1846-1908)

వీరు 19వ శతాబ్ది చివరి భాగంలో సాహిత్య, వికాస చరిత్ర లోను, సంఘాభ్యుదయ చరిత్ర లోను అత్యంత ప్రధాన పాత్ర వహించిన యుగ పురుషుల కోవకు చెందినవారు. కందుకూరి వీరేశలింగం పంతులుగారికి సమ కాలికులు. శ్రీరాములు గారికి, చిన్న నాటి నుండియే పద్య కవిత లోను, గేయ కవిత లోను కౌశలం ప్రస్ఫుటించింది. 12వ యేటనే సోమలింగేశ్వరునిపై ఒక శతకమూ, 14వ యేటనే సాత్రాజితీ అనే యక్షగానం రచించారు! మహాకవి కలం నుండి అనేక రచనలు వెలువడ్డాయి. వీరు దేవీ భాగవతం, ఆసువుగా ఆరు నెలల్లో తెనుగించారు. ప్రఖ్యాతి వహించిన సూర్య శతకంతో పాటు, అభిజ్ఞాన శాకుంతలం, మారుతీ మాధవం, మాళవికాగ్ని మిత్రం, ముద్రా రాక్షసం వంటి ప్రముఖ సంస్కృత నాటకాలు ఆంధ్రీ కరించారు.

ఏలూరులో, ఈయన ఆధ్వర్యంలో ఒక గాన పాఠశాల చాలా కాలం నడిచింది. దాసు శ్రీరాములు గారు అనేక కృతులు, స్వర జతులు, పదాలు, జావళీలు రచించిన గొప్ప వాగ్గేయ కారులు. శ్రీరాములగారి సంగీత రచనలు కొన్నింటిలో సహగేయ కారులైన పిఠాపురం వీణాచార్యులు, తుమురాడ సంగమేశ్వర శాస్త్రిగారు స్వర వరుసలను సమ కూర్చి నట్లు శ్రీద్వారం వెంకటస్వామి నాయుడుగారు రజనీగార్కి వెల్లడించి నట్లు తెలియుచున్నది. అంతేకాక, ఆకాలములో నట్టువ వార్లు రెండు రకాల నాట్య ప్రదర్శనలు చేస్తుండే వారట. ఒకరకం నాట్యాన్ని, భరత నాట్యమనీ, రెండవ విధానాన్ని కర్ణాటక అభినయన మని పిలుస్తుండే వారు. కర్ణాటక అభినయనానికి ఉపకరించే, జావళీలు కొన్ని శ్రీదాసు శ్రీరాములుగారు రచించారు.


కర్ణాటకాభి నయనానికి ఉపయోగ పడే జావళీలు: (ఉదాహరణ)

1.మోహన రాగం (పరకీయ నాయిక)
తత్తర పడనేల తాళు తాళుర సామి
అత్తింటి కోడలురా - కొత్తగా నే వచ్చి కొన్ని నెల లాయెరా –

2. (ఖండనాయిక)
అడవి ముషిణి కాయ, అది నీకు ప్రియ మామ
అయ్యో నిన్నే మందురా! 

3. ఆనంద భైరవి - (పోషిత భర్తృక యైన నాయిక)

ప|| వనితరొ యీ వన్నెలేలనే - యీ వేళ నాకు

అను ప|| ఆకులేల పోకలేల అగరేల గంధమేల మగనికి దయలేక మేను సగమై యున్నవేళ||

చర|| భాసురాంగి తోటలేల, ఆటలేల పాటలేల

దాసు రామ పాలు బాసి ఆశలుడిగి యున్న వేళ||

ఇటీవలి కాలంలో మహాకవిగారి పదములు, జావళీలు శ్రీయుతులు ఎన్.సి.హెచ్. కృష్ణమాచార్యుల గారు, నూకల చిన సత్యనారాయణ, తదితరులు స్వర కూర్పు చేసి, "పదాలు-జావళీలు" అనే పేరుతో గ్రంథ రూపంగా వెలువరించారు. దాసు వారి రచనలు "దాసు రామ" అనే ముద్రను కలిగి వుంటాయి.

    మహాకవి తర్వాత పేర్కొన తగిన, ప్రఖ్యాతి గాంచిన వాగ్గేయ కారులు ముత్యయ్య భాగవతర్ (1877-1945). వీరు తెలుగు, కన్నడ, సంస్కృత, తమిళ భాషలలో అపూర్వ రాగాలలో వివిధ లయ రీతులలో వర్ణాలు, కీర్తనలూ, దరువులు, రాగ మాలికలు, తిల్లానాలు రచించారు. మద్రాసు మ్యూజిక్ అకాడమీ వారు ఈయనను అధ్యక్షునిగా యెన్ను కొనుటయే గాక, సంగీత కళానిధి" అనే బిరుదు నిచ్చి సత్క రించారు.

వివిధ వాగ్గేయ కారుల రచనల తోను, తమ సంగీత శాస్త్ర పరిశోధ నాంశాలను జత పరచి "సంగీత కల్పద్రుమ" అనే గ్రంధాన్ని తమిళంలో రచించారు. వీరికి తిరువాంకూరు విశ్వవిద్యాలయం 1942లో డాక్టరేట్ గౌరవ పట్టాన్ని ఇచ్చారు. భాగవతర్ తమ పరి శోధనల మూలాన చాలా నూతన రాగాలను కను గొన్నారు. ఆరాగాలలో కొన్నిటికి బహుళ ప్రచారం లభించింది. ఈయన గోటు వాద్యం, వయోలిన్, మృదంగ వాద్యాలను వాయించడంలో ప్రతిభ గడించారని పేర్కొంటారు విజ్ఞులు.

మైసూరు వాసుదేవా చార్య (1865-     )

వాసుదేవా చార్యుల వారు కృష్ణరాజ వడయారు ఆస్థానంలో పౌరాణిక     విద్వాంసు లైన సుబ్రహ్మణ్యా చార్యుల వారి పుత్రుడు. ఈయన 1865లో జన్మించాడు. శతవర్ష జీవి. అత్యంత ప్రతిభా వ్యుత్పత్తులు గల వీరు మైసూరులో సుబ్బరాయరు గారి వద్దను, వీణ పద్మనాభయ్య గారి వద్దను ప్రాధమిక విద్యాభ్యాసము చేసి, తదుపరి, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ గారికి, ఆరు ఏళ్ళు శిష్యరికం చేసి, సంగీత శాస్త్ర మర్మాలను గ్రహించారు. మైసూరు వాసుదేవాచార్య గారి విద్వత్తును ప్రశంశించి వివిధ పరిషత్తులు ఆయనకు వివిధము లైన బిరుద ప్రదానం చేసి సత్కరించాయి. వాసుదేవా చార్యుల వారు అడయారు లోని కళాక్షేత్రం లో సంగీతా చార్యులుగా అనేక సంవత్సరాలు పని చేశారు. వాసుదేవా చార్యుల వారు తెలుగు లోను, సంస్కృతం లోను దాదాపు 300 కీర్తనలనూ, వర్ణాలనూ, రాగమాలికలనూ, స్వరజతులనూ రచించారు. వీరి రచనలు భక్తి రస ప్రధాన మైనవి, ఈయన కృతులు "వాసుదేవ కీర్తన మంజరి" పేర ప్రచురిత మైనవి. వాసుదేవా చార్యుల వారు వ్యాకరణ, సాహిత్యాలలో కూలంకష జ్ఞానం గల పండితులు.  హరి నాగభూషణం గారు: (1884) 

ఆంధ్రమాత ప్రసాదించిన వాగ్గేయ కారులలో శ్రీహరి నాగభూషణం గారు అత్యంత ప్రఖ్యాతి గడించిన వారు. నాగభూషణం తండ్రి గారైన హరి నరసిం హ శాస్త్రి గారు పట్నం సుబ్ర్హ్మణ్యయ్యర్ గారి వద్ద సంగీతాభ్యాసం చేశారు. మైసూరు వాసుదేవా చార్యులు వారు వీరి సహాధ్యాయులు. నరసిం హ శాస్త్రిగారు వయోలిన్ వాద్యం లో సిద్ధ హస్తులని పేర్కొంటారు. హరి నాగభూషణం గారికి వీరే ప్రత్యేక్ష గురువులు. శ్రీ నాగభూషణం గారు సంగీత సాహిత్యా లలోను, సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషలలో ప్రజ్ఞాశాలి అయిన పండితులు. వీరికి "వాగ్గేయ కార రత్న", "సంగీత సాహిత్య భావనా పరాయణ", "వేదాంత పారీణ", "గాయక సార్వ భౌమ" వంటి అనేక బిరుదాలు వున్నాయి.

పైన సూచించిన బిరుదుల వలన హరి నాగ భూషణం గారు సంగీత శాస్త్ర వికాసానికి, సంగీత కచేరి విధాన ప్రభావానికి చేసిన అపారసేవ విశద మగు చున్నది. శ్రీ నాగభూషణం గారు అనేక భక్తి రసాత్మక కీర్తనలూ, కొన్ని తాన వర్ణాలను, మరియు కొన్ని హరి కథలను రచించారు. హరి నాగభూషణం గారి తాన వర్ణాలలో అత్యంత ప్రసిద్ధ మైనవి: గమన శ్రమ రాగంలో    "నంద గోపాబాల యశోదా తనయా" అనేది ఒకటి, మరియు శంకరా భరణ రాగంలో "శ్యామ సుందరాంగ చలము చేయ మేర గాదురా" అనేది ఒకటి. ఈయన కొన్ని రాగాలను స్వయంగా కల్పించారు. వీరి కీర్తన లలో "త్యాగ" అని స్వనామాంకిత ముద్రగా ప్రయోగించారు. 

రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు:

శ్రీ శర్మగారు ప్రాకృత, సంస్కృత, కన్నడ, తెలుగు భాషలలో కూలంకష పండితులు. సంగీత విద్వాంసులుగా, సాహిత్య విమర్శకులుగా వీరికి గల ఖ్యాతి చాలా తక్కువ మంది విద్వాంసులకు లభించిం దంటే, ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అనంతకృష్ణ శర్మగారు మైసూరు విశ్వ విద్యాలయంలో సంస్కృతం లోను, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సంగీతం లోను ఆచార్యులుగా పనిచేసికృతకృత్యులైన శేముషీ సంపన్నులు. ఈయన ప్రాచీనాంధ్ర కర్ణాటక తమిళ వాగ్గేయ కారుల గాన కళా శిల్ప రహస్యాలను, తమ గురువు గారైన బిడారం కృష్ణప్ప గారి శుశ్రూషలో గ్రహించిన సూక్ష్మగ్రాహి. అనంతకృష్ణ శర్మగారు స్వయంగా "పెనుగండకొండ", "సంధ్యాగేయము" వంటి ఆధునిక కవితా గేయములను రచించి పాడిన వాగ్గేయ కారులు.    తాళ్ళపాక వారి గేయ సహస్రమును, సంస్కరించి,ప్రచురిస్తూ, ఆనాటి రాగముల స్వరూపములను, సంగీత క్రమ పరిణామ వికాసాన్ని పరిశోధనల ద్వారా కనుగొని, ఆకీర్తనలకు స్వర సంపుటలను పునర్నిర్మించి ప్రకటించారు. శర్మగారు చేసిన ఈ సంగీత సేవను హర్షించి, ప్రశంసించని సంగీత విద్వాంసులు లేరంటే - అది వారి ఘనతకు తార్కాణం.

 మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారు:

శ్రీ బాలమురళీకృష్ణగారు 1930వ సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి పట్టాభి రామయ్యగారు గొప్ప సంగీత విద్వాంసులు. గాత్రజ్ఞులే కాక, ఫ్లూటు, వయోలిన్, వీణా వాద్యాలలో ప్రసిద్ధులు. బాలమురళీకృష్ణ గారి తల్లిగారు కూడా, వీణా వాద్యములో అభినివేశము కలవారు. ఐదారేళ్ళ చిరు ప్రాయం లోనే బాలమురళీకృష్ణ గారికి సంగీతంపై మక్కువ కలిగింది. అది గమనించిన పట్టాభి రామయ్యగారు బాలమురళీకృష్ణ గారిని పారుపల్లి రామకృష్ణయ్య పంతులగారి వద్ద శిష్యునిగా చేర్చారు.దైవదత్తంగా లభించిన ఉపజ్ఞతకు గాయక సార్వబౌములైన పారుపల్లివారి గురుత్వం మెరుగు పెట్టింది. 8 యేండ్ల ప్రాయము నుండి సంగీత కచేరీలు ప్రారంభించారు. మురళీకృష్ణగారి గురు పరంపర సోపానములు వేసుకొంటూ, తిన్నగా త్యాగరాజు వరకు తీసుకు పోతుంది! సామాన్య మాటలలో చెప్పాలంటే బాలమురళీ గారు త్యాగరాజ ప్రశిష్యులు! అంతేకాక వీరి మాతామహులు ప్రయాగ రంగ శర్మగారు సంగీత విద్వాంసులు. ఎక్కువగా భజన సాంప్రదాయ కీర్తనలు రచించారు.

   అటువంటి వాగ్గేయ కారుల కోవలో పెరిగిన బాలమురళీకృష్ణ స్వయంగా వాగ్గేయ కారుని స్థాయికి యెదిగి, స్వయంగా 72మేళకర్త రాగాలలోను, రాగానికి ఒక్కొక్క కృతి చొప్పున "జనకరాజ కృతిమంజరి" అనే గ్రంధాన్ని రచించారు. ఈగ్రంధానికి పండిత ప్రకాండు లైన కాశీకృష్ణాచార్యుల వారూ, విశ్వనాథ సత్యనారాయణ గారూ తొలిపలుకు, పీఠికా వ్రాయుట ముదావహం! విశ్వనాథవారు తమ పీఠికలో "చి|| మురళీకృష్ణ ప్రతిభయు, శాస్త్ర జ్ఞానము, నిత్యాభ్యాసము, పండి సముద్భవించినది... శ్రీత్యాగరాజ కృతులు మినహా యించినచో,తక్కిన వారు వ్రాసిన కృతులయందు భావ సమృద్ధి తక్కువగా యుండును. ఆకృతి యేదేవత నుద్దేశించి వ్రాయ బడినదో తద్దేవతా సంభోధన బాహుళ్య ముండును... ఈ కృతులలో చాలా భాగ మట్టివే. అంతతో ముగిసినచో వ్రాయ దగినదేమియు నుండెదిదికాదు! అతకు మించిన యొక ప్రతిభ, కవి యొక్క భావనా విశేషము ఇతని యందు కనిపించు చున్నది... ఈగ్రంధము వయసు చేత చిన్న వాడైనను, విద్య చేత ఆంధ్ర దేశస్థ గాయక వతంసులలో నొకడైన చి|| మురళీకృష్ణకు కీర్తి పతాకయే"! అని పేర్కొన్నారు.  

    ఇప్పటికి దాదాపు 25,000 పైగా కచేరీలు చేసి పండిత, పామర ప్రశంసలను అపరిమితంగా పొందిన శ్రీబాలమురళీకృష్ణ గారు హిందుస్థానీ సంగీత విద్వాంసులైన "పండిత్ భీమసేన జోషీ" గారికి సహకార వాద్యా న్నందించారు. వారితో జుగళ బందీ గానంలో పాల్గొన్నారు. ఈ బృందంలో పండిత్ హరిప్రసాద్ చౌరసియా, కిశోరి అమోంకర్ లాంటి ఉద్దండులు పాల్గొనటం విశేషం. బాలమురళీగారు తెలుగు భాషలోనే కాక కన్నడం, తమిళం, మళయాలం, హిందీ, బెంగాలీ, పంజాబి భాషలలో సహితం గానం చేసి, ఆయా ప్రాంత పండిత, పామరుల ప్రశంసలను అందుకొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా, అనేక దేశాలలో తన గాన మాధుర్యం చవి జూపి, రసికులను ఆనంద సాగరంలో ముంచేత్తారు! ఇది తెలుగు వారంతా ఆనందించ వలసిన విషయం.  

   శ్రీ బాలమురళీకృష్ణ గారు తెలుగు, సంస్కృతం, తమిళ భాషల్లో షుమారు 400 కీర్తనలు రచించారు. ఇక చెప్పాలంటే బిరుదులూ, గౌరవ పట్టాలు, సన్మానాలు 16వేల గోపికలై వీరిని విడజాలని కౌగిలిలో బిగించాయి! బిరుద పరంపరలో విశేషించి పేర్కొన దగినవి మద్రాసు మ్యూజిక్ అకాడమీ వారి అద్యక్ష పదవితో కూడిన "సంగీత కళానిధి", ఆంధ్ర విశ్వవిద్యాలయము వారి "కళాప్రపూర్ణ", భారత ప్రభుత్వ "పద్మవిభూషణ్" ఫ్రెంచి ప్రభుత్వ "షెవలియర్" పేర్కొన దగినవి. దేశం లోని అనేక సంగీత విద్యా పీఠాలకు వీరు ఆస్థాన విద్వాంసులు. ఇది అత్యంత గర్వ కారకము.

మద్రాసు మ్యూజిక్ అకాడమీ అధ్యక్షోపన్యాసములో "విద్వత్కళాకారులు నూతన సృష్టి కోసం సంప్రదాయాన్ని ఏమాత్రమూ అలక్ష్యం చేయ గూడదు. ఆ సృష్టి కర్ణాటక సంగీత చట్రం లోనే నిబద్ధ మై ఉండాలి. అయితే శిష్యుడైన వాడు ఎన్నడూ తన గురువు శైలిని గాని, మరొక ప్రఖ్యాత కళాకారుని శైలిని గాని అనుకరించ గూడదు. తన వ్యక్తిత్వాన్ని రూపొందించు కుంటూ తను నేర్చిన విద్యనూ, సృష్టిని సమన్వయము చేసుకొంటూ పోవాలి... ఇది వరకు దానిని అంతకంటే మేలు రకంగా ప్రదర్శించే ప్రయత్నం చేయాలి. లేదా కొత్త మార్గం తొక్కాలి. దీనికి సరైన అభ్యాసమూ, ఉపజ్ఞా, దీర్ఘకాలం పరిశ్రమాన్విత మైన కృషి కావాలి - అది లేనిదే సాధ్యం కాదు". పైన పేర్కొనిన వారి మాటలు అందరిని ఆలోచింప చేస్తాయి.

   శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావుగారు తమ పుస్తకము లోని చివరి అధ్యాయంలో ఆధునిక సాహిత్య పరులలో గేయ కర్తలు అనే విషయాన్ని చర్చిస్తూ - అతి ముఖ్యులైన గేయకర్తలను గూర్చి ప్రస్తావించారు. ముఖ్యంగా గురజాడతో ప్రారంభించి ఆధునిక గేయ కర్తలలో బహువిధ గేయాలను రచించి దేశ హృదయాన్ని చూరగొన్న కవి త్రయాన్ని: బసవరాజు అప్పారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, నండూరి వేంకట సుబ్బారావు గార్ల విశిష్టతను వివరించారు.

విప్లవ పంధాలకు దారిజూపిన శ్రీశ్రీ గేయాలకు, అదే ధోరణిలో వ్రాసిన అనిశెట్టి గేయాలకు యువ లోకంలో ప్రత్యేక అభిమానం లభించిన విషయాన్ని వక్కాణించారు. సుకుమార భావనా, కోమల పద శిల్పముగల వేదుల వారి గేయాలు, పుటపర్తి నారాయణాచార్యుల వారి పదాలు, విస్తృత లోకానుభవమూ, రచనా శిల్పంతో కొత్త పోకడలు గల నార్ల వేకటేశ్వరరావు గారి గేయాలూ, ఆంధ్ర లలిత గాయక లోకానికి ఎన్నోకొత్త వరుసలను ప్రసాదించి, తెలంగాణా వీణ మ్రోగించిన దాశరథీ, నారాయణరెడ్డి గార్ల గేయాలను, తాపీ ధర్మారావు, సముద్రాల రాఘవాచార్యుల వారు, పింగళి, మల్లాది, సదాశివ బ్రహ్మంగారు, ఆత్రేయ, కొసరాజు గారు గేయాలను రచించి తెరపై వెలయించిన విధానాన్ని విశ్లేషించారు.     

   గ్రంధం ముగింపులో అత్యంత నమ్రతతో రచయిత తాము స్వయంగా చేసిన కృషి వివరిస్తూ: స్వయంగా ధాతు మాతు కల్పన చేయగల్గిన వాగ్గేయ కారత్వంలో "శతపత్ర సుందరీ" గేయ సంపుటమునూ, విశ్వవీణా, మధురానగరీ, చండీ దాసాది గేయ నాటికలను రచించి, అనేకాధునిక కవుల గేయాలకు ధాతు కల్పన చేసి, తాను పాడి, పలువురుచే పాడించి, మెప్పించిన యీ గ్రంధకర్త ఇప్పుడీ వాగ్గేయ కార చరిత్రమును ఆంధ్ర లోకానికి అంద జేస్తున్నాడు". అని పేర్కొన్నారు.

ఈ ఉత్తమ రచనను, సంగీత సాహిత్య విద్వాంసులే కాక, సంగీతాన్ని అభ్యశించేవారు, సంగీత విషయాలు తెలుసుకునే కుతుహలం కలవారూ - చదువుటయే గాక, సద్వినియోగ పరుచు కొంటారని ఆశిస్తూ ఈ వ్యాసంలో సూచించిన ముఖ్య విశేషాలను సింహావలోకనం చేసు కొందాము.

సింహావలోకనం:

 సామాన్యముగా వ్యాస రచనలో సింహావలోకనము చేయ వలసిన అవసరము వుండదు. కాని ఈ పుస్తకం అతి విశాల విషయమైన సంగీత శాస్త్రానికి సంబంధించినది. అనేక అంశాలు ఇందులో చర్చించడం జరిగింది. ఆకారణాన వ్యాస రచయిత దృష్టిలో సిం హావలోకనం ఆవశ్యక మైనది. ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము 524 పుటలతో కూడిన పెద్ద పుస్తకం. దీనిలో నిక్షిప్త మైన విషయాలు పాఠక లోకానికి వెల్లడించడ మైనది. పాఠకులు ఏకబిగిన చదువుటకు అంతగా అనుగుణ్యము కాదు. ఆ కారణాన కూడ సింహావలోకనం ఉపకరిస్తుందనే ఆశా భావంతో వ్యాస రచయిత ఈ పనికి ఉపక్రమించుట.

తెలుగు వారు మొదటి నుండియు సంగీతజ్ఞు లన్న విషయం, ఈ పుస్తకం లోని వివరాలు స్పష్ట పరుస్తాయి. తెలుగు వారిలో కొందరు లక్షణ కర్తలుగాను, కొందరు లక్ష్య కర్తలు గాను, మరి కొందరు కేవలం ప్రయోక్తలు గాను ప్రఖ్యాతి పొందారు. ఈ విషయం ఉదాహరణ సహితంగా తమ పరి శోధనాంశములు జతపరచి సామాన్య పాఠకులకు అర్థ మయ్యే శైలిలో విశ్లేషించారు రచయిత శ్రీ రజనీకాంత రావుగారు. లక్షణ కర్తలలో జాయప్ప సేనాని, కల్లి నాధుడు, శార్ఙదేవుడు, సింగభూపాలుడు, సంగీత శాస్త్రానికి సంబంధించిన స్వతంత్ర గ్రంధాలే కాక వ్యాఖ్యలు వ్రాసిన లాక్షణికులు. అన్నమయ్య గారు "సంకీర్తనలక్షణ" అనే గ్రంధాన్ని రచియించి నట్లు గా పేర్కొన బడినది. వీరుగాక, అహోబల పండితుడు, గోవింద దీక్షితుడూ, పోలూరు గోవిందకవి, వేంకటమఖి, సుబ్బరాయ దీక్షితుల పేర్లు ఉల్లేఖించ బడినవి. లక్షణ కర్తలు, వాగ్గేయ కారుల గూర్చిన చర్చలో అనేక మంది ప్రముఖులను గూర్చి వివరాలు పొందు పరచారు రచయిత.

   ప్రత్యేకించి జయదేవుడు, లీలాకుసుడు, పురందర దాసు, శివనారాయణ తీర్థులు, సిద్ధేంద్ర యోగిని గూర్చి విపులంగా చర్చించారు. భజన సాంప్రదాయానికి చెందిన ముఖ్యులను గూర్చిన చర్చలో శ్రీ భద్రాచల రామదాసు గారి కీర్తనలను గూర్చి చర్చించారు. సంగీత మూర్తి త్రయం: త్యాగరాజు, ముద్దుస్వామి దీక్షితులు, శ్యామశాస్తి గారలు సంగీతశాస్త్ర వికాసానికి చేసిన సేవలు, కర్ణాటక సంగీతం పైన వారి ప్రభావాన్ని చక్కగా విశద పరుచుట జరిగింది. ఆధునిక వాగ్గేయ కారులలో శ్రీయుతులు హరినాగభూషణం, ఆదిభట్ల నారాయణదాసు, మహాకవి దాసు శ్రీరాములు, మైసూరు వాసుదేవాచార్యులు గణనీయులని వెల్లడించారు. అత్యాధునికులలో శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు, శ్రీ బాలమురళీకృష్ణ గారిని అత్యంత ప్రముఖంగా చిత్రించారు.

ఇటీవల కాలంలో వస్తు వైవిధ్యంలో కొత్త తీరులు ఎన్నోవచ్చాయి. ఈ మార్పుకు కారకులైన వాగ్గేయ కారులను గురించిన వివరణ చివరి అధ్యాయంలో పొందుపరచారు రచయిత.  స్వగతంతో అత్యంత ఆకర్షణీయ పద్ధతిలో ముగించారు ఈ పుస్తకాన్ని గ్రంధకర్త రజనీకాంత రావుగారు. 

   ఇంతటి మహత్తరమైన గ్రంధాన్ని గురించి వివరణ వ్రాయటం శులభ మైన పని కాదు. కఠినమైన ఈ కార్యానికి సంగీత - సాహిత్యాలలో అభినివేశం అవశ్యకం. ఈపనికి సమర్థత చేకూర్చుకొనే ప్రయత్నంలో సంగీత శాస్త్రానికి సంబంధించిన అనేక రచనలు చదువ వలసి వచ్చింది. "నే చదివినవి కలవు పెక్కులు" వానిలోని మర్మం మాత్రం గ్రహించ గల్గితే, అత్యంత సంతోషం ఈ వ్యాస కర్తకు!  విషయగ్రహణం లోపిస్తే, విజ్ఞులు మన్నించి క్షమింప ప్రార్థితులు. ఈ వ్యాసం పరికించిన తరువాత, కొద్ది మందిలో అయినా మూల గ్రంధాన్ని చదివే ఉత్సుకత కలిగితే - ఈ వ్యాస కర్త శ్రమ ఫలించిందని సంతసిస్తాడు.
ఈ రచనకు ఉపకరించిన వ్యాసాలు రచించిన రచయిత లందరికీ ఇందు మూలమున కృతజ్ఞతలు తెలియ జేయడమైనది.    

1 comment:

  1. మీ బ్లాగు చదివి చాలా ఆనందం కలిగింది. కాని మీరు బ్లాగును కొద్దినెలలపాటు నిర్వహించి విరమించారు! కారణం తెలియదు. మీరు తరచుగా వ్రాస్తే తెలుగుపాఠకులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది.

    ReplyDelete