Saturday 5 October 2013

మయూరుని సూర్యశతకం

భూమిక:

తెలుగు సాహిత్యంలో "శతక శాఖ" విశేష ప్రాముఖ్యతను సంతరించు కొన్నది. అన్ని వర్గాల పాఠకులను ఆనంద పరచ గల్గింది. సంస్కృత భాష తర్వాత, శతక సాహిత్య సంపద మరే భారతీయ భాషలోను ఇంతగా వికసించ లేదంటే అది అతి శయోక్తి కాదు.

శతకములు పురాణములవలె కథా ప్రధానములు గావు. ప్రబంధము లాగా వర్ణనలకు ఎక్కువ ప్రాముఖ్యత నివ్వవు. గేయ కావ్యములవలె  సంగీత విశేషత కలిగినవి అసలే కాదు. అయినప్పటికీ, పండిత పామరులకు సులభ గ్రాహ్యము లైనవి. తరచుగా శతకాలలో ఆత్మానుభవము హెచ్చు పరిమాణంలో వ్యక్త మౌతుంది. అందుచేత, శతకాలు మన హృదయాలకు అత్యంత సన్నిహితము లైనవి.

తెలుగు భాషలోని శతకాలు హెచ్చు భాగం స్వతంత్ర రచనలే! సంస్కృత అనువాదముల సంఖ్య తక్కువ. సామాన్యంగా శతకాలలో కనిపించే ముఖ్య లక్షణాలు: సంఖ్యా నియమం, మకుట నియమం మరియు రసా నియమమం. సంఖ్యా నియమ పద్ధతి సంస్కృత స్తోత్రముల నుండి గ్రహింప బడినది. ఈ పద్ధతి ననుసరించి సాధారణంగా శతకములలో నూరు కాని, నూట ఎనిమిది కాని పద్యము లుండును. తెలుగు సాంప్రదాయాన్ని బట్టి చూస్తే, హెచ్చు భాగం శతకాలలో నూరు పద్యములే ఉంటవి. కొన్ని సందర్భాలలో 108 పద్యముల శతకాలు సహితం చూడవచ్చును.    

మకుట నియమం 

సర్వ సామాన్యంగా శతకము లన్నియు సంబోధనాంతములు. సంబోధనలలో నామోచ్చారణ ప్రధానము. ఆనామము నూరు పద్యములలోను ఒకే రీతిగా ఉంటుంది. మకుట నియమము ననుసరించి వృత్త నియమము ఉంటుంది. ఉదాహరణకు "విశ్వదాభిరామ వినుర వేమ" అను మకుటం ఆటవెలదిలో కుదిరినట్లు తక్కిన వృత్తములలో (ఛందస్సులో) కుదరక పోవచ్చు. అలాగే, శ్రీగిరి మల్లికార్జున శతకములోని మకుటము "శ్రీగిరి మల్లికార్జునా" చంపకమాల, ఉత్పలమాల వృత్తాలలో చక్కగా అమురుతుంది. అదే విధంగా, శతకములలో ప్రతి పాదితమైన రసం వైరాగ్యం కాని, శృంగారం కాని, భక్తి రసము కాని, యేదైననూ సరే శతక మంతటిలోను ప్రతి పాదిత మౌతుంది.  

పైన పేర్కొనిన విషయాలను మనసులో ఉంచుకొని, శతకమును చదివి ఆనందించ వచ్చును. ప్రస్తుత వ్యాసంలో మయూర మహాకవి సంస్కృతంలో రచించిన సూర్య స్తుతి పరమగు "సూర్యశతకము" చర్చ నీయాంశము. ఇందు ముచ్చటించిన విశేషాలు పాఠక మహాశయులకు నచ్చుతాయని ఆశిద్దాం.
 

 సూర్యశతకము: 

ఈ శతక కర్త సుప్రసిద్ధ మహాకవి మయూరుడు కీ||శ|| 7వ శతాబ్ది (అంటే 620 ప్రాంతం) వాడని తెలియు చున్నది. మయూర మహాకవి భోజరాజు ఆస్థానంలో ఉన్న మహాకవులలో ఒకరని బాణుడికి సమకాలికుడని పరిశోధనా శిరోమణి కీ||శే|| కళాప్రపూర్ణ నిడదవోలు వేంకట రావుగారు తమ "మయూరకవి - ఆంధ్ర వాఙ్మయం" అను గ్రధంలో పేర్కొన్నారు. అతిభయంకర కుష్ఠు రోగంతో బాధ పడుచున్న తరుణంలో అత్యంత భక్తి పారవశ్యతతో స్రగ్ధరా వృత్తములలో రచింపబడిన కావ్యమిది. దీని రచన పూర్తి అయిన కొద్ది కాలములోనే మయూర మహాకవి కుష్ఠురోగ  విముక్తు డైనట్లు చెప్పబడినది. దీనిని బట్టి సూర్య శతక మహత్మ్యం విశదమగు చున్నది.

సూర్యశతకము అత్యంత ప్రశస్తిని గడించిన గ్రంధం. ఈ శతకమునకు పదునాలుగు వాఖ్యానాలు ఉన్నట్లుగా పేర్కొన బడినది. అంతేకాక సూర్యశతకానికి ఖండాంతర భాషలలో అనువాదము లున్నట్లు పేర్కొన బడినది. ఆనంద వర్ధనుని వంటి లక్షణకారులు సూర్యశతకము నుండి ఉదహరించిరని, జగన్నాధ పండితరాయలు "సుధాలహరిని" సూర్యశతకము ననుసరించి యే స్రగ్ధర లోనే రచించారని ప్రతీతి!

"మయూరుని సూర్యశతకం ప్రౌఢం ... పేరుకే శతకం గానీ కావ్యలక్షణాలు పుష్కలంగా పండాయి. శబ్దార్థాలపై సంపూర్ణాధికారం, వస్తువును సూక్ష్మీక్షికతో దర్శింప జేసే లక్షణాలు సూర్యశతకమును కావ్యగతిలో నడిపించాయి.... రచనంతా అలంకార హారం "కావ్యం గ్రాహ్యమలంకారాత్" అన్న వామనోక్తి బట్టి ఇది కావ్యమే" అంటారు ఆచార్య బేతవోలు. 

తెలుగు కవులలో చాలామందిని మయూర మహాకవి సూర్యశతక కావ్యం ఆకర్షించింది. ఆయన కవితా శక్తికి ఆకర్షితులైన వారిలో శ్రీనాథుడు, పోతన, పెద్దన, రామరాజ భూషణుడు, జగన్నాధ పండితరాయలు, తర్వాత వారిలో ఆకుండి వ్యాసమూర్తి శాస్త్రి, వడ్డాది సుబ్బరాయ కవి, మహాకవి దాసు శ్రీరాములు, పింగళి లక్ష్మీకాంతం మొదలైన వారు ముఖ్యులు. వీరిలో కొందరు సూర్యశతకాన్ని తమ రచనల ద్వారా (కొందరు కొన్ని శ్లోకాలు, మరి కొందరు పూర్తి శతకాన్ని) తెలుగు వారికి పరిచయం చేశారు. ఆయా వివరాలు ఈ వ్యాసంలో పొందు పరచడమైనది. పఠితలు ఇది హర్షిస్తారని  ఆశిస్తాను.  

మయూరుడు రచించిన సూర్యశతకములో నూరు శ్లోకము లున్నవి. అవి అన్నియూ స్రగ్ధరా వృత్తములు. వాని ఛందో లక్షణం మ-ర-భ-న-య-య-య గణములు. ప్రతి పాదమున ఏడింటిపై రెండు యతులుండును. అనగా 8,15వ అక్షరములు, యతి స్థానములుగా గ్రహింప నగును. మయూర మహాకవి శతకాన్ని: కిరణ వర్ణనము, అశ్వ వర్ణనము, అనూరు వర్ణనము, రథ వర్ణనము, మండల వర్ణనము, సూర్య వర్ణనము అను శీర్షికలుగా విభజించెను. అందులో కూడా, కిరణ వర్ణనానికి 43, అశ్వ వర్ణనానికి 6, అనూరు వర్ణనకు 12, రథ వర్ణనకై 11, మండల వర్ణనకు 8, సూర్య వర్ణన నిమిత్తమై 20 శ్లోకాలు రచించెను. మరో రెండు శ్లోకాలు ఫల శ్రుతి శ్లోకములుగా పేర్కొనెను. మొత్తం కలిపితే 102 శ్లోకముల కావ్యంగా సూర్యశతకము రూపొందింది. గ్రంధాన్ని పూర్తిగా అనువదించిన తెలుగు కవులు కూడా పై విభజనా క్రమాన్నే అనుసరించారు. 

 సూర్య శతకాన్ని మొట్ట మొదట తెలుగు వారికి పరిచయం చేసిన ఘనత కవిసార్వభౌమ శ్రీనాధునికే చెల్లుతుంది. మయూరకవి సూర్యశతకం వైపు ఆకర్షితుడై శ్రీనాధుడు అందులోని 15 శ్లోకములను కాశీఖండమున, మరికొన్ని శివరాత్రి మహత్మ్య మున అనువదించి పొందు పరిచి నట్లుగా పేర్కొన బడినది. కాని శ్లోక పరి వర్తితములు హెచ్చు భాగం సీస పద్యరూపం లో వర్ణితమైనవి. కవిసార్వభౌముడు మయూరుని ఆ వేగోద్ధతికి వశీ భూతు డైనట్లు తెలియు చున్నది. శ్రీనాధుని రచన అత్యంత ప్రౌఢమై మయూర కవికే పోటీ పడు విధంగా రూపొందింది (కళాప్రపూర్ణ నిడదవోలు వేంకటరావు)! కవిసార్వభౌముని శైలి నారికేళ పాకమని విజ్ఞులకు తెలిసినదే కదా! 

సంపూర్ణానువాదములు:  

తర్వాతి కాలంలో ఆకుండి వ్యాసమూర్తిశాస్త్రిగారు (1893), వడ్డాది సుబ్బరాయుడుగారు (1899) మరియు మహాకవి దాసు శ్రీరాములు గారు 1902 లోను మయూరకవి సూర్య శతకాన్ని తెలుగు లోనికి అనువదించారు. వారి అనువాద కృతులు లభ్య మగుచున్నవి. ఈ ప్రసిద్ధ కవులందఱూ మయూరిని అనుసరించి అన్ని శ్లోకములను తెలుగు లోనికి అనువదించారు. ఎవరికి వారు తమ తమ ప్రజ్ఞా ప్రతిపత్తుల ననుసరించి వారి వారి ప్రత్యేక శైలిలో సూర్యశతకాన్ని తెలుగు చేశారు. ఈ వ్యాసం వారి అనువాదముల తులనాత్మక పరిశీలన కాకపోయి నప్పటికీ, శ్రీ దాసు శ్రీరాములు గారి అనువాదం తెనుగు నుడికార యుక్తమై, సుందర శైలిలో సుబోధకమని కొందరి అభిమతమైనందున దాసు శ్రీరాములుగారి కి ముందు అనువదించిన శ్రీనాధ మహాకవి పద్యము, ఆకుండి వారి పద్యము, వడ్డాది వారి పద్యము, తర్వాత కాలం వారైన ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారి పద్యం మూల శ్లోకాలతో జోడించి ఉదాహరణల రూపంలో పాఠకుల ముందుంచడ మైనది. విజ్ఞులైన పాఠకులు సహృదయంతో స్వీకరిస్తారని, మహాకవి దాసు శ్రీరాములుగారి అనువాదాన్ని అవగాహన చేసుకొనుటలో ఈ ప్రక్రియ సహకరిస్తుందని ఆశిస్తూ దాసు శ్రీరాములవారి రచన లోని విశేషములు ఈ వ్యాస రూపంలో వివరించడమైనది.


ఉల్లేఖిత పద్యవివరణ:                  

 మూలము:                    
శ్లో|| జంభారాతీభ కుంభోద్భవమివ దధతః సాంద్రసిందూరరేణుం
రక్తాః సిక్తాఇవౌఘైరుదయగిరితటీధాతుధారాద్రవస్య
ఆయాంత్యా తుల్యకాలం కమలవనరుచేవారుణా వో విభూత్యై
భూయాసుర్భాసయంతో భువనమభినవా భానవో భానవీయాః.

 వ్యాసమూర్తి తెలుగు సేత:

చ|| తొలుదెస హత్తికుంభముల దోరపు జెందిరపుం స్రజంబునన్

బలె నుదయాద్రి సానువుల భాసిలు జేగురు టేటివెల్లువన్

బలె నపుడొప్పు నంబుజ నిభంవలె నెఱ్ఱని డాలుమీఱు వే

వెలుగు వెలుంగు మీకు శుభవృద్ధి నిరామయసిద్ధి జేయుతన్.


శ్రీ ఆకుండి వ్యాసమూర్తి గారు 1893వ సంవత్సరములో మయూరుని సూర్యశతకము పూర్తిగా తెలుగు లోనికి అనువదించారు. తర్వాత కాలంలో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు తమ "మధుర పండిత రాజము" అనే పద్య కావ్యంలో మయూరకవి సూర్యశతకం లోని నాలుగు శ్లోకాలకు స్వేచ్ఛానువాదం చేశారు. పింగళి వారు మయూరుని తొలి శ్లోకానికి చేసిన తెలుగు పద్యాన్ని ఉదాహరణ రూపంలో ఈవ్యాసంలో సూచించడ మైనది. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు సీస పద్యాన్ని ఎంచుకొన్నారు.

సీ|| ఉదయాద్రి శిఖర సానూద్భూత ధాతుధా

రామజ్జన క్రీడ రక్తి నొంది

జంభారి భద్రేభ కుంభస్థలీ సాంద్ర

సిందూర రజముతో జెలిమి చేసి

త్రిదశ కన్యాక రార్పిత హేమ జలజాత

బలి పుష్ప పరిచితిన్ బ్రౌఢి మెఱసి

దర హసితాం భోజదళ దళాంతర రాగ

సంగ్రహోత్కంఠచే   జాజువాఱి

గీ|| యబ్జజాండ ఘటీ బహిరంతముల

దళుకు జలపోత గావించి వెలుగు నవిగొ

నవనవారుణ భానుభానువులు ప్రార్థ

నాంజలి ఘటింపు డభ్యుదయమ్ము లొసగు. 


దాసువారి తెలుగుసేత:    
 శా|| జేజేరాయని కుంభికుంభ గతమౌ సిందూరముల్ తాల్చియో

యోజం జేగురు వాగు లయ్యుదయశైలోపాంతమం దంటి యో

రాజీవ ప్రభ లేక కాలమున బ్రారంభించియో యెఱ్ఱనై

తేజుల్ చిమ్ము నవార్క భాను లిడు నెంతే మీకు నైశ్వర్యముల్.


ఆకుండి వారి అనువాదం చంపకమాల పద్యరూపంలో ఉన్నది. మూలమున జంభారాతీ కుంభము ప్రత్యేకముగా ప్రారంభముననే చెప్ప బడినది. ఆపద విశిష్టత యిందులేదు. "తొలుదెసహత్తి" కుంభము అంటే తూర్పు దిక్కునగల ఏనుగు అని అర్థము వచ్చును. కాని జంభారాతిని మొదట చెప్పుటలో విశేషమున్నది. అతడు తూర్పు దిక్కునకు అధిపతి, స్వర్గమున కధిపతి. అతడు సూర్యుని వలె ప్రాతః కాలమున నైరావతమునెక్కి బయలు వెడలును. ఐరావతము తెల్లనిది కావున సిందూర రేఖలు స్పష్టముగా ప్రకాశిస్తాయి. వైదిక వాఙ్మయంలో ఇంద్రుని సూర్యునిగా ప్రస్తుతిస్తారు .     

మహాకవి దాసు శ్రీరాములుగారు 1902లో అనువదించిన సూర్యశతకములోని పైన ఉదహరించిన పద్యం మయూరుని మొదటి శ్లోకానికి తెనుగు సేత. శ్రీరామకవి శార్దూల వృత్తంలో మయూరుని శ్లోకంలోని భావాన్ని చక్కగా వ్యక్త పరచారు. మహాకవి అనుసరించిన అనువాద రీతి ప్రాచీన కవులు అనసరించిన పద్ధతిని సూచిస్తూ స్వతంత్ర రచన వలె భాసిల్లు చున్నది. తెనుగు దనము వారి రచన ప్రత్యేకత!  

పైన రెండవ ఉదాహరణగా పేర్కొనిన పద్యం ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారిది. పింగళి వారు సూర్యశతకములోని నాలుగు శ్లోకాలకి మాత్రమే స్వేచ్ఛానువాదం చేసినట్లు తెలియు చున్నది. తొలి శ్లోకానికి ఆచార్యుల వారు అమర్చిన తెలుగు సేత పైన ఉల్లేఖిత మైనది. పింగళి వారి తెలుగు సేతను గురించి "సంస్కృత సమాసాలు యథామూలంగా వున్నా, జాజు వాఱడం, తళుకు జలపోతగావించడం ... వంటి ప్రయోగాలలో తెలుగుతనం ఉంది. సూర్య కిరణాలు ఐరావత కుంభస్థలం లోని సింధూర వర్ణంతో గలసి స్వర్గంలో, ఉదయాద్రిపై గైరికాది, ధాతువుల వల్ల ఆకాశం లోనూ, ప్రకాశిస్తున్నాయన్న ఉల్లేఖాన్నే పింగళి వారు స్వీకరించారు" అంటారు ఆచార్య బేతవోలు. 

పైన ఉల్లేఖించిన మూడు పద్యాలు ముగ్గురు మహాకవులవి. మయూరుని కవితను అనువదించుటలోని భిన్న పద్ధతులు, కవుల యొక్క విశిష్టతను సూచిస్తాయి. అంతేకాక, మహాకవి శ్రీరాములుగారి అనువాదశైలి తెనుగు నుడికారంతో నిండి, భావ వివృత్తి ప్రస్ఫుటిస్తూ, సుబోధకంగా ఉంటుదన్న విషయాన్ని సూచిస్తాయి. 
  
మూలం:                       
శ్లో|| మీలచ్చక్షురి జిహ్మ ప్రతి శ్రుతి జడ రసనం నిఘ్నిత ఘ్రూణ వృత్తి

స్వవ్యాపారక్ష మత్యక్సరి ముషిత మనః శ్వాస మాత్రా వశేషం

వి స్ర స్తాంగం పతిత్వా స్వపద ప హరతాద శ్రియంవోర్కజన్మా

కాలవ్యాళా వలీఢం జగదగద ఇవోత్థా పయ న్ప్రా క్ప్రతావః.  

 శ్రీనాధుని తెనుగింపు:   సీ|| నేత్రంబులు న్మేష నిస్పృహత్వము నొంద

శ్రుతి పుటంబుల శక్తి పొక్కువడగ

ఘ్రూణేంద్రియ జ్ఞాన కళయౌరు సౌరుగా

జిహ్వ వివేకంబు చిఱుత వోవ

నంత రంగమున మోహాంధకారము గ్రమ్మ

దనువు చేష్టా దరిత్రత వహింప

బ్రాణముల్ శ్వాస మాత్రమున బర్యవసింప

దల చీర యెఱుగని దశ ఘటిల్ల

 గీ|| బాముగఱచిన మూర్ఛిల్లి పడినయట్లు

పడిరి పాశ్చ్యాత్య దేశంబు పంచ జనులు

తరణ దీధి లేమి జైతన్య మెడలి

వితత నిద్రా సమావేశ విహతులగుచు.             

  వడ్డాది సుబ్బరాయకవిగారి అనువాదం:

కనుమోడ్పున్ వినరాని కర్ణము జడఘ్రాణంబు జిహ్మత్వచం

బు నిరర్థంపు రసజ్ఞు ఖండిత మనంబున్ ద్రిక్కు శ్వాసంబు ప్ర

స్త నిజాంగబయి వ్రాలు కాల ఫణీ దష్టం బౌ స్వపద్విశ్వమ

ల్లన దెల్పం బరమౌషదంబు రవి కల్య జ్యోతి ప్రోచున్ మిమున్.

దాసు శ్రీరాములుగారి ఆంధ్రీకరణం:

మ|| కను వ్రాలన్ శ్రుతి మ్రాన్పడన్ రసన నాకం బోక ముక్కెద్దియు

న్గన కాత్వక్కు స్పృశింప కుల్లము నడంగన్ శ్వాస యొక్కండు ద

క్కను వేరొక్కటిలేక తూలి పడు నక్కాలాహి సందష్టమౌ

జనమున్ లేపెడి వెజ్జు బాల రవి తేజం బార్చు మీ యాపదల్.


 పైనుదహరించిన మూలశ్లోకం లో కాల భుజంగ దష్టుని యవస్థలో గల యను భావము పంచేద్రియముల స్వకర్మ త్యాగము, దక్కిన విష చిహ్నములు సూచింప బడినవి. ఔషదమను భావమును గ్రహించిన వడ్డాది వారు వైద్యుని అనువాదమున పరివర్తింప జేసినారు. శ్రీనాధ మహాకవి ప్రకరణోచితంగా కొంత వర్ణించి తెనుగించినారు. దాసు శ్రీరాములుగారి అనువాదంలో కనులు కనబడక చెవిటి వారై ముక్కు చడియగా, శరీరము స్పర్శను కోల్పోయి, ఊపిరి మాత్రమే నిలచి కాల సర్పం చే కరువ బడిన ప్రాణి లోకానికి, ఆరోగాన్ని పోగొట్టి చైతన్య మిచ్చు సూర్యదీప్తి వారికి తేజస్సు కలిగించుగాక అని ఆశీస్సులు అందించారు.  

మూల శ్లోకాలలోని భావం ఏమాత్రం పోకుండా, శైలి బిగువు సడల కుండ మహకవి దాసు శ్రీరాములు గారు ఎలాంటి దక్షతతో తెనుగు చేశారో ఈ దిగువ సూచించిన ఉదాహరణలు రుజువు చేస్తాయి. 

మూలం:                  
"తన్వానా దిగ్వధూనాం సమథిక మధురాలోక రమ్యా మవస్థా

మా రూఢ ప్రౌఢి వేశోత్కలిత కపి విమలాంకృతిః కేవలై వ

ఉజ్జృభాంభోజ నేత్ర ద్యుతిని దిన ముఖే దుద్భిద్యమానా

శ్మశ్రు శ్రేణీవ భాసాం దిశతు దశశతీ శర్మ ఘర్మత్విషోవః".


తెనుగుసేత:             
"కలయ దిశావధూటులకు గన్నుల పండువుగా గనస్ఫుటో

త్కలనను నూగునూగు టెఱదాళువు సొంపులు నింప నుల్ల స

న్నళిన విలోచనంబగు దినంబు మొగంబున మొల్చినట్టి మీ

సల నునురేక బోలు దివసప్రభు నంశులు మీకువేలిడున్".

 

మూలం:  
"బిభ్రాణః శక్తి మాశుప్రశమిత బలవత్తార కౌర్జిత్య గుర్వీం

కుర్వాణో వీలయాధః శిఖినపి లసచ్చంద్ర కాంతావభాసం

ఆదద్యాదంధకారే రతిమతిశయినీ మావహ న్వీక్షణానాం

బాలో లక్ష్మీ మపారా మపర ఇవ గుహోహుర్పతే రాత పోవః".
   

 తెనుగుసేత:
 "ప్రశమిత తారకోజ్వల బలంబగు శక్తిని దాల్చి చంద్రకాంత

శిఖి నడంచి యయ్యతను దర్పత మోహర విస్ఫురన్మహో

తిశయినియైన వీక్షణ రతిం దగి రెండవ క్రౌంచ భేది నా

గుశలత గాంచు భానురుచి కుఱ్ఱ యొసంగుత మీకులక్ష్మాలన్".


"సూర్యుని బాలా తపమునకు కుమరస్వామితో పోలిక చెప్పే ఈ శ్లోకంలో ఉపమానోపమేయాలకు సమాన ధర్మాలు శ్లిష్ట పదాల నాశ్రయించి ఉన్నవి. శ్రీరామకవిగారు ఈ శ్లిష్ట పదాలను కడు నిపుణంగా అనువాదం లోకి తెచ్చు కున్నారు. "అంధకారేరతిం" అన్నచోట "అంధకారి" అన్నమూలాన్ని "అతను దర్పత మోహన" అని అనువదించి మెరుగు పెట్టినారని పిస్తుంది. శివపరంగా "అంధకారి" అనడం కంటె "అతను దర్పత మోహర" అనడమే ప్రకృతానికి ఎక్కువ దీప్తి కలిగిస్తుంది. కుమారస్వామి శివుని వీక్షణాలను ప్రీతి కలిగించె సందర్భంలో శివుని అంధక వధ ప్రసంగం కంటే మదన గర్వ హరణ ప్రసంగం ఎక్కువ సమంజసం కదా?! గుహ శబ్దాన్ని క్రౌంచఛేది శబ్దంగా మార్చడం కూడా కుమారస్వామి ప్రతాపాన్ని వ్యజిస్తూ ప్రకరణోచితంగా ఉన్నది.  

విస్తృతములయిన స్రగ్ధలలో ఉన్న మూలాన్ని చంపకోత్పలమాలలో అనువదించడం కూడా కవిగారి రచనలోని చక్కదనానికి నిదర్శనంగా ఉన్నది." (పాటిబండ మాధవశర్మ).       

పైనుదహరించిన కవులంతా అత్యంత ప్రజ్ఞాధురీణులు వారివారి అవగావహనము ననుసరించి మయూరుని శతకాన్ని తెలుగు ప్రజలకు అందించారు. ఎవరిశైలి వారిదై నప్పటికీ - సామాన్యులకు సుబోధకరమైన రచనను తప్పక గ్రహింపగలరు.
 కీ||శే|| కళాప్రపూర్ణ నిడుదవోలు వెంకట రావు గారు దాసు శ్రీరామకవిగారి అనువాదం తెలుగు సీమలో యెక్కువ వ్యాప్తికి వస్తుందన్న భావాన్ని వ్యక్తపరచారు. తెలుగు భాషలోకి అనువదించబడిన సూర్యశతక రచనల తూలనాత్మక వివరణ ఈవ్యాసం ఉద్దేశ్యము కాదు. కేవలం మహాకవి దాసు శ్రీరాములుగారి సూర్య శతకంలోని కొన్ని విశేషాలు పాఠకుల ముందుంచడమే నా ఉద్దేశం.          

మహాకవి శ్రీరాములుగారు అనువదించిన సూర్యశతకమంతా ప్రసన్న రచనకు ఉదాహరణమని పండితుల అభిప్రాయ పడినప్పటికీ, మూలమున మయూరకవి వ్యక్త పరచిన గంభీర భావములను సులభ గ్రాహ్యమగు పదజాలాన్ని వాడి, తేట తెనుగులో రచించినారని రుజువు చేయుటకు మరికొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. 

ఉ|| ముక్కిడి గుంటు మొండి వ్రణి మూలుగు వానిని దోషకారినే

యొక్కడు సక్క చేయు దెవులోఱిచి తక్కక యట్టిసద్దయా

దృ క్కలి తార్కు సిద్ధగణ దృష్ఠ మహార్ఘ్యము లైన యంశువుల్

గ్రక్కున మీ దొసంగులు విఘాతములై చన జేయు గావుతన్. 

పై పద్యము కిరణ వర్ణనము లోనిది. దీని భావం దిగువ పేర్కొనిన విధంగా అన్వయించు కొన వచ్చును. కాళ్ళు, చేతులు, ముక్కు వికృతమై (తెగి) మూలుగుతున్న రోగిని, కరుణామయుడైన కంజ హితుడు, తానొక్కడు మాత్రమే తన కిరణములచే చక్క జేయ గలడు. అటువంటి వాడైన సూర్యుడు మీకందరకు భద్రత చేకూర్చుగాక! అన్న ఆశీస్సు.  

ఇచ్చట సూర్య కిరణ ప్రసారము వలన కుష్టు రోగము నిర్మూలమగుట సూచిత మైనది. కుష్ఠురోగ బాధితుడైన మయూర కవి భక్తి పారవశ్యతతో సూర్యుని ప్రార్థించాడు. అంటే సూర్యునికి అభిముఖుడై - కిరణ రస్మిని సహించి, తాపాన్ని భరించాడు. ప్రస్తుత కాలంలో కూడా, శాస్త్రోక్తంగా సూర్యకిరణ చికిత్స అమలులో వుంది. మరో విశేష మేమిటంటే శబ్దంలో (కవితాశబ్దంలో) అత్యంత మహత్త్వ మున్నది! అందుకే మహత్త్వకవిత్వ పటుత్వం అని పేర్కొన్నాడు మహాకవి పోతనా మాత్యుడు. (సూర్యరస్మితో కూడిన శబ్దశక్తి క్రిములను దహించి (నసింపజేసి) కుష్ఠు రోగాన్ని నిర్మూలిస్తుంది). ఈ భావన శాస్త్ర సమ్మతము. 

   ఉ|| పుట్టదు సంద్రమం దచట బుట్టిన కౌస్తుభ ముఖ్య వస్తువుల్

చుట్టలుగావు పద్మమును జూడము చేతను, విష్ణు వక్షమున్

ముట్టదు లాతి లేవెలుగు ముజ్జగ మందు వ్యవస్థ లేర్పడన్

బు ట్టెడు మండలాగ్రమున బూషున కాసిరి మీకు మేళ్ళిడున్. 

సూర్యకాంతలక్ష్మి సముద్రములో పుట్టలేదు. అందు పుట్టిన కౌస్తుభము, మొదలగునవి తనకు చుట్టములు కావు; చేతిలో పద్మము లేదు; విష్ణు వక్షస్థలం తాకే అవకాశమే లేదు! అయినప్పటికీ, లక్ష్మి వలె సమస్త సిరుల నొసంగి సూర్యకాంత లక్ష్మి సంపదలు చేగూర్చుగాక. అనే అర్థం సులభ గ్రాహ్యం. 

 మరో పద్యాన్ని పరిశీలిద్దాం:

 ఉ|| తమ రుచిచేత బచ్చనగు తట్ల మొగుళ్ళను ఱెక్కలొప్ప గ

ళ్ళెములను లాగ నెత్తురులు లేచిన నోళ్ళను ముక్కు లొప్ప వ్యో

మమునను దుఱ్ఱు మంచు వడి బాఱు సుమేరు శిఖాగచారి కీ

రము లన నొప్పు సూర్యునిగుఱాలు వరాల సరాలు మీ కిడున్. 

పైన ఉదహరించిన పద్యం అశ్వవర్ణనము లోనిది. దీనిలోని భావం గ్రహించండి. ఆకుపచ్చనైన తమ శరీర కాంతి చేత తెల్లనైన మేరుపర్వతపు చరియలను పచ్చదనము కలుగునట్లు చేసి, మేఘములను రెక్కలతో కళ్ళెములు లాగుట వలన నోటి నుండి వచ్చు రక్తపు నెఱ్ఱదనంతో మేరు శిఖరాగ్రమున చిలుకలవలే తుఱ్ఱుమని పారు సూర్యాశ్వములు మీకు శ్రేయము (వరాల సరా) లొసగు గాక! పద్యములో ఉపయోగించిన పదజాలం అందరికీ అర్థమగు శైలిలో తేట తెనుగులో రచింప బడినది. మఖ్యముగా గుఱ్ఱముల వేగాన్ని "తుఱ్ఱుమనే" పదం కండ్లకు కట్టిన విధంలో ఆకాశం పైకి యెగిరే చిలుకల సమూహాన్ని సూచిస్తుంది. పఠిత ఆసక్తిని పెంచుతుంది.
 

 అనూరు వర్ణనములోని ఈ పద్యాన్ని గమనించండి!  

ఉ|| వా నకు దూర్పు  గాలివలె బావకకీలకు ధూమమట్లు లో

కానకు నాదిసృష్టిగతిగా శ్రుతిరాశికి నోంకృతి స్థితిన్

భానుని గ్రుంకునందు నటనం బిడు శూలికి నంది నాందిలా

గై నవి నాప్తు తే ర్నడపు న వ్వినతాత్మజు డేలు మిమ్ములన్. 

తూర్పు గాలి వానను అనుసరించు విధంగాను, అగ్నికి పొగవలె, లోకమునకు మొదటి సృష్టి వలె, వేదమునకు ఓంకారమైన రీతి, సంధ్యాకాలమున, శివుని నాట్యారంభమున నాంది భాతి సూర్యుని రథం నడుపు ననూర్య్డు మిమ్మేలుగాక! పద్యంలో వ్యక్తీకరించిన భావం సుబోధకం. తెలుగు నుడికారంతో పద్యం నల్లేరుపై బండి నడకన సాగింది! కఠిన పదాలు కాని, దీర్ఘ సమాసాలుగాని, మచ్చు కైనను లేవు!  

చ|| హరి హరులన్ సదృక్షపతి యక్షములన్ మఱి చక్రి చక్రమున్

సురలు సురంహ మల్ల యరుణు న్వరుణుండును స్థాణుస్థాణుడున్

విరివిగ గూబరంబున గుబేరుడు గొల్వగ నిత్యయు క్తి మై

పరహిత వృత్తి మెచ్చు ఖరభానునిస్యందన మేలు మిమ్ములన్.  

 ఈ పద్యం రథవర్ణనము లోనిది. సూర్యదేవుని రథం సామాన్యమైనది కాదు. దేవతలందరూ దానిని స్తుతిస్తారు. ఆ వివరాలను వర్ణిస్తారు మహాకవి. విశేషాలను గమనించండి. స్వయంగా మహావిష్ణువు ఆ రథ చక్రాన్ని స్తుతిస్తారట! రథాన్ని లాగు అశ్వాలను ఇంద్రదేవుడు శ్లాఘించు చున్నాడట! అంతేకాదు, ఆరథ టెక్కెము (జెండా) శివుని పొగడ్తకు లోనైంది. ఆరథం యొక్క ఇరుసు చంద్రుని స్మరణకు పాత్ర మైనది! రథ నొగను కుబేరుడు స్తుతించుచున్నాడు. దేవతా సమూహ మంతా స్తోత్రము చేయునట్టి మహితాత్మక మగు సూర్య రథం మీకు ఉల్లాసము కల్గించుగాక! రథ వర్ణను పఠితలు మెచ్చు కొంటారనుటలో ఎట్టి సందేహమూ లేదు. అలవోకగా జాలువారిన తెలుగు పదజాలం చదువరిలో అత్యంత ఆహ్లాదాన్ని సృజించి పాఠకులను శతకమంతా ఏకబిగిని చదివిస్తుంది! 

రవివర్ణనము నుండి:  
చ|| చుట్టము పక్కముం గురువు చూపును గాపును జ్ఞాతి జ్యోతియున్

పట్టగు ప్రాణదాతయును భ్రాతయు తల్లియు దండ్రియున్ సదా

పెట్టని కోటయై సకల పృధ్వికి నన్నము నీళ్ళు నిచ్చుచున్

దిట్టపు వెల్గులం దనరు దేవుడు మీకిడు వాంఛితంబులన్.     


ఏ శక్తిని దైవము, గురుడు, తండ్రి, స్నేహితుడు, చుట్టము, కను వెలుగు, రక్షకుడూ అని సర్వజనులు పరి పరి విధముల భావించి, స్తోత్రము చేయుదురో  ఆ సర్వోపకారి యగు సూర్య భగవానుడు మీకోరికలను నిరంతరము నెరవేర్చు గాక! అని పద్యంలోని మూలభావం. సరసము, సౌమ్యమై దైనందిక వాడుకలో నున్న మాటల లో పామరులకు సహితం అర్థమయ్యే శైలిలో రచించిన ముత్యం లాంటి పద్యమిది. ఈ విధంగా వివరిస్తూ యెన్ని పద్యాలైనా పేర్కొన వచ్చును. అలా విశ్లేషిస్తే ఈ వ్యాసం పుస్తకంగా రూపొందుతుంది. ఆకారణాన వ్యాసాన్ని ముగించడ మైనది. విజ్ఞులైన పాఠకులు మన్నింతురు గాక!  

లోక కళ్యానార్థం మయూరుడను మహాకవి సంస్కృత భాషలో రచించిన నూరు శ్లోకముల ఈ స్తోత్రమును తెలుగు జాతి హితాన్ని దృష్టిలో నుంచు కొని, సుళువైన, సుబోధకమైన తెలుగు భాషలో రచించిన మహాకవి దాసు శ్రీరాములవారి ఈ సూర్య శతకాన్ని పఠించి, తెలుగువారు ఆరోగ్యము, కవితా సంపద, ఆయుర్వృద్ధి, తేజస్సు, విద్య, ఐశ్వర్యాలతో పాటు సూర్య భగవానుని అశేష ఆశీస్సులందు కొందురు గాక! 

 

1 comment: