Friday 10 January 2014

Agamagiti (ఆగమగీతి)

ప్రస్తావన:

రెండవ ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతున్న రోజులవి. ప్రపంచ యుద్ధం, పారిశ్రామిక విప్లవ ప్రభావానికి దాదాపు అన్ని దేశాలు కొద్దో, గొప్పో, లోనయ్యాయి. సాంఘిక విలువలు మార జొచ్చాయి. చుట్టూ యుద్ధ వాతావరణం, లోపల అసంతృప్తితో పడగ విప్పుతున్న తుఫాను యువక వర్గాన్ని అస్థిమిత పరిచి తీవ్ర అశాంతికి దారి తీశాయి. ఆ తరుణంలో ప్రవేశించాడు బైరాగి సాహిత్య రంగం లోనికి, యువకునిగా!

బైరాగి జననం 03-09-1925న ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జరిగింది. ఆయన తల్లి తండ్రులు ఆలూరి వెంకట్రాయుడు, శ్రీమతి సరస్వతీ దంపతులు. బైరాగి అనేది కలం పేరుగా అనేకమంది అపోహ పడవచ్చు. కాని, అది ఆయన తల్లి తండ్రులు పెట్టుకొనిన అసలు పేరు. వెంకట్రాయుడు దంపతులు చక్కగా చదువు కొనిన సంస్కారవంతులు. జాతీయ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనుటయే కాక, హిందీ భాషాధ్యాయనం వైపు అశేష కృషి చేసి, ఆ భాషలో ప్రావీణ్యం సంపాదించారు.

యువకుడైన బైరాగి మీద తల్లి తండ్రుల ప్రభావం ఎక్కువగానే ప్రస్ఫుటించింది. తెలుగు ప్రాథమిక విద్యతో బాటు, హిందీ భాషాధ్యయనం బైరాగిని ఆకర్షించింది. హిందీ భాషపై గట్టి పట్టు సాధించే నిమిత్తం, చిన్న వయసులోనే బైరాగి బీహారుకి వెళ్ళారు. అచ్చట నాలుగైదు సంవత్సరములు కృషిచేసి హిందీ భాషను క్షుణ్ణంగా నేర్చు కొన్నారు. హిందీతోపాటు బైరాగి ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో విశేష ఆధిపత్యాన్ని గడించారు. సాహితి పిపాసను పెంపొందించు కొని, మూడు భాషల్లోను సమగ్ర సాహిత్య వేత్తగా రూపొందారు. సృజనాత్మక రచనలు (ముఖ్యంగా కవితలు) ప్రారంభించారు.

తను ఆర్జించిన హిందీ పరిజ్ఞానం పెక్కుమందికి పంచి పెట్టే ఉద్దేశంతో పత్తిపాడు బోర్డు హైస్కూల్లో హిందీ పండితునిగా అధ్యాపక వృత్తిని స్వీకరించారు. కాని, ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగ లేదు. తర్వాత చందమామ (మాసపత్రిక) హిందీ విభాగానికి సంపాదకునిగా కొంత కాలం పనిచేశారు. చిన్న పిల్లల కోసం గేయాలు, కథలు రచించారు. చందమామ సంపాదకునిగా పనిచేసే కాలం లోనే, "పలాయన్" అనే హిందీ కవితా సంకలనం ప్రచురించారు. ఆ సమయం లోనే తెలుగు స్వతంత్ర పత్రికలో బైరాగి కవితలు విరివిగా ప్రచురిత మయ్యేవి.

స్వేచ్ఛా జీవి కావడం మూలాన, చందమామ లో చేసే ఉద్యోగంలో ఇమడలేక పోయారు. ఆ తర్వాత కాలంలో దక్షిణ భారత హిందీ ప్రచార సభలో అధ్యాపకునిగా పని చేశారు. ఆ చిర కాలం లోనే, దానికి సహితం తిలోదకాలివ్వడం జరిగింది! బైరాగి గారు ఏకాంత ప్రియులు, ఒంటరి జీవి, ఎక్కువగా ఎవరితోనూ కలిసేవారు కారు. తల్లి గారి ఆకస్మిక మరణం ఆయనపై అత్యంత ప్రభావాన్ని చూపించింది. కొంత వరకు బైరాగి సంఘానికి అంటీ అంటనట్లుండె ప్రవృత్తికి కారణం ఆయన తల్లి మరణమే నేమో?!

బైరాగి తొలి తెలుగు కవితా సంపుటి "చీకటి నీడలు", రెండవ సంపుటి "నూతిలో గొంతుకలు" 1955వ సంవత్సరంలో ప్రచురిత మైనది. అటు తర్వాత బైరాగి గారు తన రచనలను ప్రచురణకు పంపటమే మానివేసి నారు. ఆయన మరణానంతరం (1978 తర్వాత) లభ్యమైన ఆయన రచనలు "ఆగమగీతి" అను పేరుతో మిలింద్ ప్రకాశన్ వారు ప్రచురించారు. బైరాగి జీవన కాలం లోనే ఆయన కథా సంకలనం "దివ్య భవనం" అచ్చైంది.

కవిగా బైరాగి:

పరిసర వాతావరణం నుండి రవంత తొలిగి నిలిచి, లోకాన్ని ఆత్మీయతతో, జాలితో, ఆవేశంతో చూడగలిగిన కవితాత్మ బైరాగి (వైరాగి)ది. సాటి మనిషి కష్టాలను పంచుకో లేక పోయినా, సొంతం చేసుకొని, వాటికి తన కవితలలో విశ్వజనీనత కలిగించడం బైరాగి సొత్తు. ఏ "ఇజానికి" చెందిన పడికట్టు పదాలు (Jargon) ఆయన కవితలలో మనకు కనిపించవు. పదాలకు, అర్థానికి అందని గూఢ భావాలు (అర్థాలు) సంతరించగల కవితా శక్తి, బైరాగికి స్వంతం. "అర్థమైన దాని కన్నా అధికంగా స్ఫురించేది, చేతలకు చెంద రానిది, మాటలకు అందరానిది కవిత్వం" అనేది ఆయన స్వయంగా ప్రతి పాదించిన కవిత్వ నిర్వచనంగా మనం భావించాలి!

బైరాగిది స్వయం వ్యక్తిత్వం. ఏ ఉద్యమాన్ని, సంస్థనూ ఊతగా చేతగొని పైకి రాలేదు - ఆయన! అనుసరణలు, అనుకరణలు ఆయనకు నచ్చవు. అందుకే "బైరాగి కేటాయింపయిన కవి వ్యక్తి" అంటారు కె.వి.రమణారెడ్డి. "ఉపనిషత్తులోని మహా కావ్యాలను కావ్యాలలో పొదిగి, వర్తమాన కాలం లోని మానవుని పరిస్థితిని వాఖ్యానించేటందుకు సాధనాలుగా చేసుకోవడం, తన భావాలను తగిలించే చిలక కొయ్యలుగా వాడుకోవడం, ఒక కొత్త తరహా ప్రక్రియ, ఈ ప్రక్రియను బైరాగి పూర్తిగా వాడుకున్నాడు". సాహిత్యాది కళలకు, సామాజిక జీవనానికి పూర్తి ఎడబాటు కలిగి నప్పుడు, రచయితలు, మేధావులు తమ చర్మాల లోపలికి దూరి, తమతనానికి బందీ లై పోవడం పరిపాటే! ఎజ్రాపౌండ్ లాంటి మేధావులు ఈ పరిస్థితికి లోనైన వారే!

"బైరాగి కవితలలో నైరాశ్యం, నిస్ఫ్రుహ ముఖ్యమైన ఆవేశాలు. అయితే, బైరాగి నైరాశ్యం మనసును క్రిందికి దిగలాగేది కాదు. అంతరాత్మను ఉర్రూత లూగించే ప్రభంజనం లాంటిది" అని అభిప్రాయ పడ్డారు శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారు. బైరాగి, జీవితంలో తానూహించిన మార్పునంతటినీ ఒక పెను తుఫానుగా భావించాడు! అందుకే, "ఆగబోదు ఈ తుఫాను మీ మేడలు మునుగు వరకు, మీ కోటలు కూలు వరకు" . . . అంటూ ప్రళయ కాలోగ్రుడైన పరశురాముని వలె విజృంభించి కవితా ఘోషణ చేశాడు!

"కవిగా గాని, వ్యక్తిగా కాని, బైరాగిని అర్థం చేసుకొనుట సులభం కాదు. ఎందుకంటే కవిగా ఒక బైరాగి, వ్యక్తిగా ఒక బైరాగి - ఇద్దరు బైరాగులు లేకపోవడం ఇందుకు కారణ మేమో?" అంటారు నార్ల. నార్ల వారి అభిప్రాయానుసారం, "కవిత జీవితాన్ని ప్రతిబింబించాలి; జీవితం అందాలను అది చూపించాలి; జీవితం అర్థాలను వివరించాలి, జీవిత ధ్యేయాలని అది నిర్దేశించాలి. జీవితంతో సన్నిహిత సంబంధం లేనిది కవిత కాదు. అయితే కవితే జీవితం కాదు; ఇదే విధంగా జీవితమే కవిత కాదు. కవితకు, జీవితానికి మధ్యగల సరిహద్దును బైరాగి గుర్తించ లేదు. ఒక వేళ గుర్తించి ఉంటే, దాన్ని చెరిపి వేయడానికి ప్రయత్నించాడు. ఇది చేయరాని ప్రయత్నం. ఇటు కవితకు, అటు జీవితానికి కూడా ఫుల్‌స్టాప్ పెట్టగల ప్రయత్నం" . . . కవితకు జీవితానికి మధ్య అంతరం ఎల్లప్పుడు ఉంటుంది. గొప్ప కవులనే వారు దీనిని తప్పక గుర్తిస్తారు. ఈ సూక్ష్మ విషయాన్ని గుర్తించ లేనటువంటి అవజ్ఞుడు కాడు బైరాగి. అయినా అంగాంగంలో, అణువణువునా, కవిగా తప్ప ఊపిరి పీల్చుకొనుట ఆయనకు తెలియదు! ఆ కారణం వల్ల కవితకు జీవితం ఇంత భిన్నంగా ఎందుకున్నదనీ, కవితను జీవితం ఎందుకు పరిహసిస్తున్నదనీ, బైరాగి ఖిన్నుడై ఉండాలి? తర్వాత కాలంలో ఆయన మౌనవ్రతానికి, వ్యక్తిగా ఆయన మహాభినిష్క్రమణానికి, అదే ప్రబల కారణమై ఉండాలి. ఏదైనా బైరాగి ఒక ప్రహేళిక! ఒక క్లిష్ట సమస్య! అందుకే కాబోలు ఏ కొద్ది మందికో తప్ప, బైరాగి కవిత్వం సుపరిచయ మైనట్లు గోచరించదు!

సుదీర్ఘ సమాసాలు, ఆచ్చిక పదబంధాలు బైరాగి కవితా శైలిని బరువెక్కించాయి. సమాధానాలు దొరకని ప్రశ్నల ప్రస్తావనలూ, జీవన తత్త్వసాధనకు ఉపలక్షించిన భావాలు, తిరుగుళ్ళూ, విరుగుళ్ళూ, సుడిగుండాల్లాగా మడుస్తూ, ఆవర్తాలలా అనుక్రమించే కవి సంశయ సందేహాలు, ఇలాంటివన్నీ బైరాగి రచనలను క్లిష్టం, జటిలం చేశాయి". (రమణారెడ్డి).

"మానవుడి సహజ వేదనలో మధనపడి, పూర్ణత్వాన్ని దాదాపు కవిగా బైరాగి అందుకున్నాడా అనిపించింది. అమ్మా! ఎంత గొప్పగా అన్నాడు కవిత్వ తత్వవేది, అచ్చమైన గొప్ప కవి అయిన బైరాగి" అని ఆశ్చర్యం వ్యక్త పరచారు దేవులపల్లి కృష్ణశాస్త్రి.

అభ్యుదయ కవిగా తన స్థానం గట్టిగా నిలత్రొక్కుకున్న బైరాగి, కవితా దృక్పథంలో, జీవితాన్ని అర్థం చేసుకునే కోణంలో, తర్వాత కాలంలో ఎంతో మార్పు వచ్చినట్లు మనకు కనిపిస్తుంది. "జీవితపు ఇరుకు సందుల్లో తిరిగి, తిరిగి, అలసటతోనో, భయం వలనో, బాధవల్లనో, ఆలోచనాధిక్యత వల్లనో, మేధావి స్పృహవల్లనో, ఏదో ఇదమిద్ధంగా తెలియదు కాని, ఒక కొత్త ఆలోచనా రీతి అతన్ని తనలోకి లాక్కుంది" (కుందుర్తి)... కవి తాను సమాజంలో ఒకడినని భావించినంత కాలం ప్రజల స్థాయి లోనే ఆలోచిస్తాడు. కాని, ఎప్పుడైతే తాను కవిననీ, మేధావి ననే అహంకారం వస్తుందో అతడు మహాకవినని అనిపించుకోవచ్చు, ప్రజలకు దూరమై పోతాడు. అభ్యుదయ కవికి సమాజాన్ని తనతో పాటు ముందుకి తీసుకు పోవడం విద్యుక్త ధర్మం. తనకు ప్రజల కన్నా ముందు పరుగెత్తడం చేతనవును గనుక, ముందుకు పరుగెత్తిన కొలదీ, అతనికీ, వారికీ మధ్య దూరం ఎక్కువవుతూనే వుంటుంది. ఈ ముందు పరుగెత్తడం అనేది అనేక రూపాల్లో వుంటుంది. ఆ విధంగా ప్రజలకంటే ముందు పరుగెత్తిన అభ్యుదయ కవుల్లో బైరాగి ఒకడు".

బైరాగికి రాను రాను లోకం మీద కోపం, కసి ఎక్కువయ్యాయి. ఇది అభ్యుదయ కవులందరి లక్షణమే! కానీ, బైరాగిలో ఇది క్రమేణా అత్యంత నిరాశకు దారితీసింది. అతనికి లోకంతో పాటు, తనమీద తనకే విసుగు పుట్టింది. అదే ఆయన నిర్యాణానికి కారణ మైంది. బైరాగి ఆత్మ హననం మార్గమని సూచించాడు. కవిగా అదే మార్గాన్ని అనుసరించాడు.



బైరాగి రచనలు:

బైరాగి రచనలు (లభ్యమైనవి) నాలుగు సంపుటాల్లో ప్రచురిత మైనవి. వానిలో మూడు కవితా సంపుటాలు, ఒకటి కథా సంపుటి. బైరాగి తొలి రచన "చీకటి నీడలు" అనే కవితా సంపుటి. ఈ సంపుటిలో 21 కవితా ఖండిక లున్నవి. కవితలన్నీ దేని కవే స్వతంత్ర రచనలు. విడివిడిగా చదివ ఆనందింప తగినవి. ఈ సంకలనంలో, కవి (బైరాగి) ఊహకీ, వాస్తవానికీ, క్రియకీ, కదలికకీ, మధ్య వ్యవధిలో నీడలు పడుతున్నట్లు సంభావించి, కవితలు రచించారు! కొన్ని కవితా ఖండికలు దీర్ఘ రచనలైతే, మరికొన్ని చిన్న గేయాలు. పేర్లు సహితం కవి మన స్థితిని వ్యక్తం చేస్తాయి. దీపావళి అనే కవితతో ప్రారంభిస్తారు మొదటి కవితా సంకలనం. దీపావళిని గూర్చి ఆయన వ్యక్త పరిచిన భావాలు గమనించండి.

దీపావళి ఉత్సవ మండి! - దీపావళి చేద్దాం రండి!

ఆకాశం మండిద్దామా? - పాతాళం తగలేద్దామా? ...

నరకాసురు డెందుకు? ప్రపంచ - నరకాన్నే మసి చేద్దామా?

కాటుక నల్లని చీకటి - జ్యోతుల బంధించిన వాకిటి

తలుపులు పగలేద్దామా? - పీడిత దరిద్ర శాపంతో

క్రుంగిన ధరిత్రి కడుపు పగిలి - వెలిగిన ప్రళయ ప్రదీపావళి

దీపావళి వచ్చిందండి! అంటూ ముగిస్తాడు.

యుగసంధి అనే మరో గీతికలో మంచికీ, చెడుకూ, పాతకూ, కొత్తకూ గల కలయికను అద్భుతంగా చిత్రిస్తాడు బైరాగి. కవిత అంతటా అభ్యుదయ కవితా ప్రతీకలు కోకొల్లలుగా ప్రస్ఫుటిస్తాయి. మచ్చుకు:

అరుణ కాంతిలో పొగలా -రాజుతున్న చిర అశాంతి

తిరుగుబాటు జెండాలా - ఆకాశం నెత్తురుతో రంగరించి అరుదెంచిన

సంధియుగం! సంధియుగం!

బైరాగి జీవితంలో తానూహించిన మార్పు నంతటినీ ఒక పెను తుఫానుగా భావించుకొంటాడు. అందుకే,

ఆగబోదు ఈ తుఫాను - మీ మేడలు మునుగు వరకు

మీ కోటలు కూలు వరకు - మీ అంతఃపుర కాంతలు

భూమిపైన దొరలు వరకు - శోకంతో పొరలు వరకు

ఆగరాదు ఈ తుఫాను ...

రేపు బయలుదేరు నావ - చుక్కానీ మనదేనోయ్!

రేపుదయించెడి సూర్యుడు - మీకొరకై తరుణారుణ

మధు కాంతుల జయ మాలలు - సిద్ధంగా ఉంచుతాడు

రేపే మీ కళ్యాణం! - తుఫాను బిడ్డల్లారా!

అంటూ కొంత ఆశా వాదిగా ధ్వనిస్తాడు తుఫాను కవితలో.

వేశ్యా వృత్తి మన సమాజంలోని అత్యంత హేయమైన దురాచారం. హృదయం గల ప్రతి వ్యక్తినీ ఖేద పరుస్తుంది. ఇక బైరాగి లాంటి వారి స్పందన హృదయ విదారకము. మాటలలో వ్యక్త పరచ జాలనిది! వేశ్యా వృత్తిలోని దినచర్యను ఎంత జుగుప్సాకర పదజాలంతో చిత్రించారో చూడండి:

... నెత్తుట తడసిన అడుగుల - కన్నీరుల ఉప్పని మడుగుల

ఒళ్ళంతా పచ్చిపుళ్ళు రసికారే కురుపులు,

మూగుతున్న ఈగలు - ఎందుకు చీదర?

జీవితపు కాళరాత్రి, గుండెలు పిండే చలి

భగ భగ మండే ఆకలి - పాపపు చిరిగిన దుప్పటిలో ...

వెచ్చని చలి మంటల కౌగిలిలో

చక్కలి గింతలు - ఎందుకు చీదర? రా ఇంకా దగ్గిర.

"చారిత్రక జ్యోతులు" అనే కవిత చరిత్ర విలువలను వ్యంగ్యంగా చాటుతుంది. కవి తన దృష్టిలో చరిత్ర విలువలేమిటో పాఠకులకు వివరిస్తాడు. కవితను చదువు తున్నప్పుడు పాఠకుల కనుల ముందు శ్రీశ్రీ రచించిన దేశచరిత్రలు మెదులుతుంది! కవితలోని కొన్ని పంక్తులు పరిశీలించండి:

... సామ్రాట్టుల సంకేతంపై - వర్షాడపు నదులై ప్రవహించిన

మహా సైన్య వాహినిలో - కొట్టుక పోయిన జనపదాలు.

ఏమిటి ఈ చరిత్ర? హత్యలు దోపిల్ళు తప్ప! ...

ప్రాపంచిక సౌఖ్యాలకు - మెరిసే బంగారు నాణ్యాలకు

మానవ మేధస్సును విక్రయించి - తమ హృదయపు నెత్తుటి నమ్మిన

రాజ సభల కవి కుమారులూ ...

చరిత్ర చీకటి గుడిలో - ఆశా నిగూఢ రశ్ములు!

భవిష్య యుగ యాత్రికులకు - నవ్య కథా ప్రదర్శన జ్యోతులు!!

విధ్వంసం:

బైరాగి పడక కుర్చీలో పవళించి, కలలు కంటూ కవితలల్లే ఊహా జీవి కాదు. ఆయన కవిత కమ్మ దనంతో ఉరక లెత్తదు. తీపి దృశ్యాలు చిత్రించదు. చీకటి, తుఫాను, విధ్వంసం, నెత్తురు బైరాగి కవిత్వ మంతటా అలుముకొని ఉంటాయి! మొగ్గలో నిరాశలు, ముళ్లలో హెచ్చరికలు బైరాగిని అమితంగా కలవర పెడ్తాయి. పురాతత్వ శాఖ వెలికి తీసిన భూగర్భ నాగరికతా విశేషాలు, భూగర్భ నాగరికతల మిగిలిన గురుతు మరుగు దొడ్లు, అని జుగుప్సతో వానిని ఈసడించుకొంటాడు! విధ్వంసం ద్వారా ఆయన ఆశిస్తున్న దేమిటో మనకు అర్థం కాదు. బైరాగి కవిగా జీవితం నుండి గత కాలపు ఘనతను గూర్చిన కిరణమునకై వెదుకుట లేదు. ఆయన ఆకాంక్ష మరచిన పాటలోని చరణం అసలే కాదు. కాటుకల చీకట్లను తుడిచే బ్రతుకు సంజె కెంజాయ గుర్తులు! చీకటిలో మంచు బొట్లలా టపటప రాలే అశ్రుబిందువులు - వీడలేక పోతున్న బంధువుల లాంటి అశ్రుబిందువుల ఓదార్పులు. ఈ జీవిత సంఘర్షణలోంచి మార్గం చూపే ప్రపంచాల దివ్వెల కాధారమైన గానుగలోని బ్రతుకుల నెత్తురు తైలం!

అందుకే అంటారు బైరాగి: వినాశ సుందర రూపం - వీక్షించిన వాడెవడూ

వికాస జడ స్తూపం - రక్షింప బూన డెవడూ

జుగుప్స మన ఆదర్శం - ప్రేయసి మన విధ్వంసం.

పైన ఉల్లేఖించిన పంక్తులు అరాచకాన్ని సూచించవు. వానిని మనం వ్యంగ్యంగానే భావించాలి . మరో ముఖ్య విషయ మేమిటంటే బైరాగి కవిత్వాన్ని అందంగా సృజించాలని ప్రయత్నించ లేదు. పట్టరాని ఆవేశంతో రాశాడు. పద చిత్రాలు వాటంతటవే, పుంఖాను పుంఖాలుగా, మంటలుగా ప్రసరించాయి.

గమనించండి: "ఆర్పేయండా సూర్య చంద్రులను - చమురు లేని దీపాలను

చీకటిలో ముంచేయండా - నీడల పాపాలను".

"తాజమహల్ పడ గొట్టండోయ్"!

ఈ కవితను రూపొందించుటలో "తాజమహల్" ను ఒక ప్రతీకగా తీసుకున్నాడు బైరాగి. అయితే, చాలామంది విమర్శకులకు ఈ విషయం స్ఫురించ లేదు. నిజంగా వీరు పోయి తాజమహల్ ను గునపాలు పెట్టి పగుల గొడతారేమో అన్నంత భయం (భ్రమ) వేసింది! ధ్వని వాదం, ప్రతీక వాదం తెలిసిన విజ్ఞులకు ఆ భయం రాకూడదు కదా?! తెలిసిన వారు సహితం కొందరు విపరీతార్థాలు తీసి బైరాగిని విమర్శించారు. అభ్యుదయ కవులకు సౌందర్య వాదంలో నమ్మకం లేదని, ఆ వాదం పై వర్గాల వారు సృష్టించినదని, అభ్యుదయ కవులు దానికి వ్యతిరేకులనే విమర్శలు బయలు దేరాయి. బైరాగి మాత్రం తాజమహల్ ను గతకాలపు ఫ్యూడల్ వ్యవస్థకు చిహ్నంగా భావించి దానిని కఠిన పదజాలంతో గర్హిస్తాడు. మచ్చుకు కొన్ని పంక్తులు పరికించండి:

తాజమహల్ పడ గొట్టండోయ్! - వెన్నెల రాత్రుల్లో కలగా

సౌందర్య సాగరపు అలగా - మా పీడిత హృదయాల్ చీల్చీ

మా ఎత్తిన తలలను వాల్చీ - దరిద్రులను హేళన చేస్తూ

మానవులను చులకన చేస్తూ - ఆకాశం వైపుకు చూపే

ఈర్ష్యలతో హృదయం ఊపే - తాజమహల్ పడ గొట్టండోయ్!

ఈ విధంగా "చీకటి నీడలు" కవితలన్నిటినీ వివరణాత్మకంగా విశ్లేషించ వచ్చును. ఒక చిన్న వ్యాసం ద్వారా ఆపని సంభవము కాదు. విజ్ఞులు క్షమిస్తారని ఆశిస్తాను.

నూతిలో గొంతుకలు:

నూతిలో గొంతుకలు బైరాగికి పర్యాయ పదమై పోయింది. ఈ సంకలనం లో నూతిలో గొంతుకలు, సంఘర్షం, ఒక సమిష్టి ప్రార్థన, కవి సమస్య అనే నాలుగు కవితా ఖండికలు పొందు పరచారు రచయిత బైరాగి. ఈ కావ్యానికి తొలి పలుకు బైరాగి స్వయంగా వ్రాసు కొన్నారు. ఈ విషయమై బైరాగికీ ఆరుద్ర గారికీ మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన పేర్కొనుట అనుచితము కాదేమో? ఆరుద్రగారి "త్వమేవాహం" అనే ఖండ కావ్యం మొదట్లో చాలామందికి అర్థం కాలేదుట. తర్వాత, ఒక వ్యాసంలో దాశరథి గారు ఆరుద్ర భావాలకు వ్యాఖ్యానం చేశారుట. అప్పుడు ఆరుద్రగారు దాశరథికి వ్రాసిన లేఖలో "బైరాగిని లోకం అర్థం చేసుకో లేక పోతున్నందులకు విచారిస్తూ ... బైరాగి తన పద్యాలను అచ్చువేసే ప్రయత్నంలో ఉన్నాడని అవి అచ్చు అయ్యేటప్పుడు నేను (ఆరుద్ర) వ్యాఖ్యానం లేకపోతే కనీసం టిప్పణి రాస్తానని చెప్పాను. బైరాగి ఒప్పుకున్నాడు"... తీరా ఆ పుస్తకం ప్రచురించే టప్పుడు బైరాగి మనసు మార్చుకున్నాడు". ఆ విధంగా "నూతిలో గొంతుకలు" అనే సంకలనానికి తనే స్వయంగా తొలి పలుకు వ్రాసు కొన్నాడు. అందులో కొన్ని భావాలు పరిశీలిద్దాం. బైరాగి అభిప్రాయానుసారం ఏ కావ్యానికైనా భాష్యం అనేది అవసరము లేదు. సామాన్యంగా ప్రతి రచనా స్వతసిద్ధం. దానికి భాష్యకారుని చేయూత అనవసరం. భాష్యకారుడు (వ్యాఖ్యాత) అపరిణత బద్ధులైన పాఠకులకు సహాయకారి కావచ్చు, సాధారణార్థాలు బోధించ వచ్చు, ఆ ప్రయత్నంలో అప్పుడప్పుడూ కావ్యం లోని మసృణత్వాన్ని (సున్నిత భావాన్ని) లేదా మనోహరత్వాన్ని చెరచే అవకాశం కూడా లేక పోలేదు. అతి సున్నితంగా వ్రేలిడవలసిన చోట రసాభాస చేసి కూర్చొంటాడు! అందువలన బైరాగికి భాష్యకారు లంటే సదభిప్రాయం లేదు. భాష్యాలను సమర్థించడు. "నూతిలో గొంతుకలు" విషయం. పాడు పడ్డ నుయ్యి పతనానికి, మరణానికీ, సంకేతం. అందులో జీవనం ఉండదు. అందులో పడి వున్న వారికి వెలుతురు మృగ్యం. పైకి రావటానికి ఆధారం అసలు కనిపించదు. వారు కేకలు వేస్తారు కాని, వారి అరుపులు బయట వారికి వినిపించవు. చీకటి తప్ప వారికి తోడెవ్వరూ లేరు. "వారు గర్వాంధత వల్ల అభిశప్తులైన నహుషులు. ఆ పాపం వారిది మాత్రమే కాదు. అది సమస్త మానవ కోటికీ వర్తిస్తుంది" (బైరాగి).

"నూతిలో గొంతుకలు" ఒక సంశయ కావ్యంగా అభివర్ణించారు బైరాగి. ఈ కావ్యంలో వర్ణితమైన మానవుడు "ఏది త్రోవ?" అని ప్రశ్నిస్తున్నాడు. తనకై తాను ఒక నిర్ణీత మార్గాన్ని నిర్థారణ చేసుకునే స్థితిలో లేడు (కిం కర్తవ్యతా మూఢుడు)! చీకటిలో ప్రారంభమైన ఈ కావ్యం "ఆవేదనల అనంతంలో అంతమైన జీవితాలను" చర్చిస్తుంది. దీనిలోని నాయకులు హామ్లెట్, అర్జునుడు, రాస్కల్నికోవ్ సందిగ్ధావస్థలో ఒక క్రమబద్ధమైన పరిణామాన్ని సూచిస్తున్నారు. ఉదాహరణకు హామ్లెట్ వేదన కర్మ పూర్వం. అర్జునుడి వేదన కర్మ క్షేత్రంలో తక్షణికం, రాస్కల్నికోవ్ బాధ కర్మ తర్వాత. అది మానవుని సహజ వేదన. అది అతన్ని త్రికాలాల్లోను వెంటాడు తుంది. ఆ బాధలలో మధన పడనివాడు పూర్ణత్వాన్ని అందుకో లేడు. ఆ బాధనుండి అతడు తప్పుకొనే మార్గం లేదా అంటే ఉంది. పలాయనం, కృతక శక్తుల పూజనం, ఆత్మ హననం". ఈ కావ్యంలో నేను అంటే కవి కాదు. నేనీ మానవుని అనుభూతిలో అధికః తాదాత్మ్యం. స్వీయ బాధ వెలువరించడం కవి పరమావధి కాదు. ప్రపంచం తో ఏకమైన నాడే కవికంఠం సరిగ్గా పలుక గలుగుతుందని నా నమ్మకం" అని వ్రాశారు తన తొలి పలుకులలో బైరాగి. ఇది కావ్య పఠిత ‍లందరూ గమనించ దగిన విషయం.

"నూతిలో గొంతుకలు" ఆధునిక తెలుగు కావ్యాలలో ప్రముఖ మైనది. దీని లోని కవిత లన్నీ అద్భుత మైనవి, పదే పదే చదివి ఆనందించ తగినవి. నా దృష్టిలో 'ఒక సమిష్టి ప్రార్థన", 'కవి సమస్య" అనే కవితా ఖండికలు ప్రత్యేకంగా పరిగణించ వలసినవి. "సమిష్టి ప్రార్థన" వంటి కవితలు వెక్కిరింత లనిపించవచ్చు. కాని అవి వెక్కిరింతలు కావు. "ఒక్కోసారి భావావేగం ఉపహాసా స్పదంగా కనిపించేటంత తీవ్రమై వక్ర మార్గా లవలంబిస్తుంది. ఆవేదన వ్యంగ్యం వెనుక దాక్కుంటుంది" అంటారు బైరాగి. "సమిష్టి ప్రార్థన" లోని కొన్ని పంక్తులు మీ అనుభూతికై ఉదహరించడ మైనది.

... ఆడపిల్లల జడలు పట్టుకు లాగిన

అపరాధాన్ని, గోడల మీద రాతలను క్షమించు

డిక్షనరీలో (Dictionary) బూతు మాటల కర్థాలు వెదికితే

అది జ్ఞాన దాహమనే ఎంచు

బిత్తరి చూపు, నూనుగు ముద్దు, ఇబ్బందైన ఇరుకు కౌగిలి

ఘనత వహించిన రొమాన్సులు అవి యన్నీ లెక్క గట్టకు

గురుతు తెలియని చీకటుల సౌకర్యాన్ని

గురుతుతెచ్చి మమ్ములను కష్ట పెట్టకు ...

దేవా! క్షమించు మమ్ము, చేసినవి చేసినందుకు

చేయనివి చేయ నందుకు

పిందెలు కోసినందుకు, పండినవి కోయ నందుకు ...

ఖాళీ పౌడరు డబ్బీల, తల నూనె సీసాల

అత్తరు బుడ్ల, అరిగిన బ్లేడ్ల మధ్య మేము

మురికి బట్టల శయ్యపై శాశ్వతంగా కనులు మూసిన తదనంతరం

మా అలసిన శరీరాలను కడిగించు ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీతో

గంధపు చెక్కలు లేకపోతే మాత్రమేమీ

పేర్చమను చితిపై మేము కాల్చిన సిగరెట్టు పీకలన్నీ ...

పడియుండనీ నరకం లోనో నాకం లోనో మమ్ముల నొకమూల,

వై తరణి ఒడ్డయినా పర్వాలేదు, తిరిగి తిరిగి అలసిపోయాం.

సింహానికి పంజానిచ్చి ఏనుగకు దంతామిడిన మహానుభావా!

మ్యాటినీ లేని వేళ మా మొరాలకించవయ్యా ఓ దేవా!

"ఒక సమిష్టి ప్రార్థన" అనే గేయం ఆధునిక వచన కవిత్వానికి ఆనాడే వేసిన బాటలా కనిపిస్తుంది. అందులోని వ్యంగ్యం, చమత్కారం, హాస్య ప్రియత్వమూ తర్వాత అనేకమంది కవులకు మార్గదర్శకమైంది" అంటారు కుందుర్తి.

కవి సమస్య:

"శబ్దాల అసమర్థత ప్రతి కవికీ ఏదో ఒక సందర్భములో తట్టే ఉంటుంది, కవితా కామిని చేలాంచలాల కొస విసురులు ఎప్పుడూ బారెడు దూరానే మాయ మైనట్లు అగుపిస్తాయి" అంటారు బైరాగి. బైరాగికి మాత్రం ఆ కొస విసురులు దూరాన మాయ మైనట్లు గాక, దగ్గరగా వచ్చినప్పుడు అతనిని నిలువునా నిమిరి, అంతరంగాన్ని పలుకరించేవి" (కృష్ణశాస్త్రి). బైరాగి కవి సమస్యలో ప్రత్యేక శబ్ద సమస్యను వ్యక్త పరుస్తారు. అదే భావకుడైన కవికి ఒకానొక ప్రత్యేక మన స్థితిలో ఏదో అస్పష్టమైన అనుభూతి కలుగుతుంది. అది బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఆనందం కావచ్చు, ప్రేమ కావచ్చు, విరాగం కావచ్చు, యేదైనా అస్పష్టంగా ఉంటుంది. యేదైంది తెలియనంతటి అస్పష్టత (cannot be clearly perceived) అలాంటి అనుభూతిని మాటల్లో వ్యక్తం చేయడమెల్లా? అదీ కవి సమస్య. ఆ అనుభూతి

పొగమంచు ముసుగులోని యాకృతిలాగా, గాలి బాట

వెంట మాట తెలియరాని ఆరాటపు దూరపు పాట ...

నిదురించే మోవి మీద ముద్దు లాగ

వ్యక్తా వ్యక్తపు వినీల విపినంలో,

కుసుమ కపోల పాళిపై సౌరభ శ్వసనంలా (ఉంటుంది) ...

చల్లని తల్లి ఒడిలా, మక్కువ నిండిన ముగుద కన్నుల్లా (ఉంటుంది)

అర్థమైన దాని కన్నా అధికంగా స్ఫురించేది,

చేతలకు చెందరానిది, మాటలకు అందరానిది. ...

సిగ్గుపడి తలలు వంచిన శబ్దాలు,

అసమర్థతను గుర్తించిన శబ్దాలు

పరా భూత కవి కరంలో విరిగిన విల్లు లాంటి భాష

మొక్క పోయిన అమ్ములీ శబ్దాలు.

పై విధంగా సాగుతుంది నిర్దేశించిన భావానుభూతులను వ్యక్త పరుచుట లోని శబ్దాల అసమర్థత (అసమగ్రత) చిత్రీకరణ. అంతేకాక, నూతన Expression కోసం, నిత్య జీవితం లోని సామాగ్రితో నూతన ఉపమానాలు సంధించడంలో బైరాగి కృషి శ్లాఘనీయం.

దివ్య భవనం:

బైరాగి రచనా శక్తి కేవలం కవిత్వ రచనకే పరిమితం కాలేదు. ఆయన చందమామలో పని చేసే రోజుల్లో బాలలకై కథలు వ్రాసే వారుట. కాని అవి చాలా వరకు హిందీ భాషలో రచింప బడినవి. అంతేకాదు, బైరాగి తెలుగులో సహితం మంచి కథా సాహిత్య సృష్టి చేశారు. లభ్యమైన వారి కథలు " దివ్య భవనం " పేర సంపుటిగా మిలింద్ ప్రకాశన్ వారు అచ్చు వేశారు. ఈ సంపుటిలో 11 కథలు చేర్చ బడినవి. అందులో దరబాను, స్వప్నసీమ, బీజాక్షరి, జేబుదొంగ, కన్నతల్లి, నాగమణి, తండ్రులూ-కొడుకులూ అందరు చదివి ఆనందింప తగిన ఉత్తమ కథల కోవలోనివి. "తండ్రులూ-కొడుకులూ" అనే కథ ప్రపంచ కథా సాహిత్యంలో చోటు చేసుకొన దగినది. పాఠకులందరూ తప్పక చదవ వలసిన కథ. అందులోని పాత్రలు చిరస్మరణీయాలు. కథను విపులీకరించిన పద్ధతి మెచ్చుకో దగినది. బైరాగి మరిన్ని మంచి కథలు ఎందుకు వ్రాయ లేదా? అని పఠితలు చింతిస్తారు.

ఆగమగీతి:

ఈ కవితా సంకలనం బైరాగి స్వర్గస్తులైన తరువాత ప్రచురిత మైనది. ప్రస్తుత ప్రతి 2006లో ముద్రింప బడినది. ఈ సంకలనంలో దాదాపు 140 కవితా ఖండికలు ఉన్నవి. వానిలో 100 స్వీయ రచనలు, మిగతా 39 కవితలు అనువాదాలు. ఈ కవితలన్నీ వివిధ సమయాల్లో రచించారు బైరాగి. అందుచేత ఏ కవిత కా కవిత అనుకూల సమయాల్లో పఠించి పాఠకులు ఆనందించ వచ్చు. అనువాదాల్లో టి.యస్.ఇలియట్ రచనలు, కొన్ని జర్మను రచనల అనువాదాలు పొందు పరచారు. భారతీయ భాషల్లో బెంగాలీ నుండి జీవానంద దాస్ కవితలు, హిందీ నుండి సుమిత్రా నందన్ పంత్ రచనలు, రామ్ ధారీ సింగ్ (దినకర్) కవితలు, ఉర్దూ, పారసీ, మరాఠీ కవితల అనువాదాల్ని పొందు పరచారు. ఈ సంకలనం లో తెలుగు పాఠకులకు ఇతర భాషల లోని మంచి కవితలు కొన్ని బైరాగి పరిచయం చేశారు. 'ఆగమగీతి" కవితా సంకలనాన్ని ఉత్తమ రచనగా ఎంపిక చేసి కేంద్ర సాహిత్య అకాడెమీ వారు 1984వ సంవత్సరపు జాతీయ పురస్కారాన్ని సమర్పించి బైరాగిని గౌరవించారు. ఈ పురస్కారం బైరాగి జీవన కాలంలో లభించి ఉంటే ఆంధ్ర సాహితీ లోకం ఎక్కువగా హర్షించి ఆనందించి యుండేది. అటుల జరగలేదు. విధి బలీయం కదా?!

"ఆగమగీతి" సంకలనాన్ని కృష్ణశాస్త్రి గారి "నా వాడూ మున్నుడితో అలంకరించుట ముదావహం. ఆ రచనే కృష్ణశాస్త్రి గారి కలం నుండి వెలువడిన ఆఖరి రచనగా మారుట గమనార్హము. "బైరాగి, మన కవులు - వ్రేళ్ళ మీద లెక్క పెట్ట దగిన బహు కొద్ది మందిలో ఒకడు" అని పేర్కొన్నారు కృష్ణశాస్త్రి గారు. ఈ వాక్యం బైరాగి కవితా శక్తిని చాటుతుంది. "బైరాగి వంటి నక్షత్రాలు సాహిత్య రోదసికి అలంకారాలు. ఆంగ్ల సాహిత్యంలో ఫ్రాన్సిస్ థామస్ కెంత ప్రాముఖ్య మున్నదో బైరాగికి మన సాహిత్యంలో అంత ప్రాముఖ్యత ఉంది" అంటారు మహాకవి శ్రీశ్రీ. అలాగే ప్రపంచంలో ఏ ప్రధమ శ్రేణి కవికైనా సరే - వీస మైనా తీసి పోరు అని అభిప్రాయ పడ్డారు ఆరుద్ర. అలాంటి కవి బైరాగి ఆగమగీతి సంకలనం ద్వారా మన ముందుంచిన కవితా స్రవంతిని ఆస్వాదించే ప్రయత్నం చేద్దామా?!

ఆగమగీతి కవితలోని కొంత భాగం -

మానస యజన వాటికపై మరల నేడు

ముసురు తోంది సందేహాల మందేహాంధ దేహచ్ఛాయ

ద్వి దా ధూషిత ద్వ్యాభా సహజాసుర మాయ

సుడిగాలుల వడిలో విడి ఎడమైనాయి

హృదయ వెద హేమంతాల జీర్ణ శీర్ణ వర్ణాళులు

విశ్వాసాలు, ఆస్థలు, శ్రద్ధాసక్తులాచారాలు,

ప్రాత రోత బూతుల తెరిపి లేని ప్రచారాలు

బ్రహ్మాండ కటాహంలో సలసల మరుగుతోంది నూతన జీవన పాకం

ఊహల ఈహల పెనగిన కల్పిత భూతల నాకం.

అంటూ మొదలవుతుంది ఆగమగీతి గేయం! ఆ గీతికను ముగించిన విధానం గమనించండి -

వృధా కాదు, తామస గర్భ వేదన, మనుజుని గరళాస్వాదన తామరసం హసిస్తుంది,

శ్వసిస్తుంది ప్రాతర్వాతంలో తన

పరిమళాలు, నిన్నటి శంకాతంకాచ్ఛాదన తొలగి మరల

విరుస్తుంది ధర రుధిరచ్ఛవి జీవన దీప్తి కెరల.

ఈ వంధ్యా ధూళి నుంచి, వికృత భస్మపాళినుంచి

ఉదయిస్తా డనల సంభవు డాత్మధవుడు, నవ మానవుడు;

అతని కొరకే వేచి ఉంది యుగయుగాలనుంచి ధరణి

అతని వ్యోమమార్గంలో ఉల్కాధర ప్రహరి తరణి.

కవితా సారాంశ మేమిటంటే రోతకు ప్రతీక మైన పాత నశిస్తుంది. నూతనోత్తేజంతో నవయుగం మొదలై మానవాళికి మంచిని తెస్తుంది అని .

"త్రిశంకు స్వర్గం" అనే కవితలో బైరాగి జీవిత దృక్పథాన్ని వర్ణించిన తీరు గమనించండి.

జీవిత మొక ఆవులింత

జీవిత మొక వొళ్ళు విరుపు

జీవిత మొక గజ్జి కురుపు

మెరసే నున్నని చర్మం పై ప్రాకే దురద విసుగు విసుగు! జీవితాల ముసుగు.

"పలాయనం" అనే మరో ఖండికలో -

జీవితం తింటొంది తనను తను,

కాలే కడుపు నింపు కొనేందుకు గాను

క్రొవ్వొత్తిలా తింటోంది తనను తాను ...

చావునుండి పారిపోవటమే బ్రతుకు

బ్రతుకు నుంచి పారిపోవడ మెక్కడికీ? ...

శాంతి నుంచి పారిపోవడమె అశాంతి

అశాంతిని శాంతి పరచట మెలాగా?

జీవితాన్ని గడిపేస్తుంది కాలం

కాలన్ని గడపి వేయట మెలాగా?

ఖైదీలో నున్నది జైలు

జైలు తప్పించు కోవట మెలాగా? అంటారు!

ఈ సంకలనం లోని అద్భుత కవితా ఖండిక "నా క్కొంచెం నమ్మక మివ్వు" అనే గేయం. ఈ గేయంలో, తరువాత వచ్చిన దిగంబర కవితోద్యమానికి బీజాలు కనిపిస్తాయి. ఆ విధంగా చూస్తే బైరాగిని దృష్ట గా పరిగణించ వచ్చు. కొత్త తరహా వ్యక్తీకరణ కోసం నిరంతర కృషి చేశారు బైరాగి. ఈనాడు వచన కవితలో కొత్త కొత్త ఉపమానాలు వాడిన విధంగా, బైరాగి ఆనాడే నిత్య జీవితం లోని సామాగ్రితో ఉపమానాలు సృజించడానికి కృషిచేశారు. అందుకే వారి కవిత ఉత్తేజంతో పాటు ఉత్సాహాన్ని పుట్టిస్తుంది పాఠకుల హృదయాల్లో. ఏ కార్యాన్ని సాధించాలన్నా మనిషికి ఆత్మ నమ్మకం అత్యంత ఆవశ్యకం. "నా క్కొంచెం నమ్మక మివ్వు" అన్న గేయంలో ఆ విషయాన్ని అత్యంత ఆహ్లాద కరంగా చిత్రించారు ఆలూరి. ఈ కవితను మెచ్చుకొని "Grant me a grain of Faith" అనే పేరుతో ఆంగ్లం లోకి అనువదించారు శ్రీశ్రీ. "నా క్కొంచెం నమ్మక మివ్వు" నుండి కొన్ని పంక్తులు ఉదహరించడ మైనది. పఠితలు ఆస్వాదించండి:

నా క్కొంచెం నమ్మక మివ్వు

కొండలు పిండి కొట్టేస్తాను

చితికిన టొమేటో లాంటి సూర్యుణ్ణి

ఆరిన అప్పడం లాంటి చంద్రుణ్ణి

ఆకాశపు ఎంగిలి పళ్ళెం లోంచి నెట్టేస్తాను

నాదగు బాహు బంధనం లో ఈ విశాల

బ్రహ్మాండాన్ని చాపలా చుట్టేస్తాను. ...

ఇంటింటా గగన కుసుమాలు మూడు పూవులుగా

నందన నికుంజాల అమృత ఫలాలు ఆరు కాయలుగా

పూయిస్తాను, కాయిస్తాను. ...

ఆకాశపు ఊదారంగు తాను చించి

చొక్కా లేని వారందరికీ కుట్టిస్తాను

ఒకటేమిటి, ఏదైనా చేస్తాను ...

నమ్మకం లేని బొంది ఖాళీ సిగరెట్టు టిన్ను

నమ్మకం లేని ఆత్మ పుల్లలు లేని అగ్గిపెట్టే

నమ్మకం లేని బ్రతుకు కాలిన సిగరెట్టు బూది

అన్నీ ఉన్నాయి కాని నమ్మక మొకటే లేదు

నా క్కొంచెం నమ్మక మివ్వు! నమ్మక మివ్వు!

నమ్మక మివ్వు! నమ్మక మివ్వు!

"వాగ్దత్త వసుంధర" అనే ఖండికలో బైరాగి వాస్తవ ప్రపంచం ఎటు మొగ్గు తున్నదో దానితో పాటే తనూ అటే మొగ్గాడు. అందుకే ఆయన కవితా తత్వంలో కొంత మార్పు కనబడుతుంది. గమనించండి -

మనిషికి మనిషికీ మధ్య సంఘర్షణం ఉండదింక సహ జీవన పావన హర్షం తప్ప,

మనిషికి మనిషికీ మధ్య అమర్షం ఉండదింక సహజ సులభ స్నేహాకర్షణ తప్ప,

మనిషికి మనిషికీ మధ్య గోడ లుండవు గోతులుండవు, అదృష్టం గీచిన గీతలుండవు

విప్లవపు బుల్‌డోజర్‌తో మిట్టపల్లా లేకం చేసి మకిలి గుంటలు పూడ్చేశాం ...

మేధకూ క్రియకూ మధ్య, ఆశయానికీ, సంశయానికీ మధ్య

సాధనకూ, సాధ్యానికి మధ్య పడిన నీడలు తుడిచేశాం.

బైరాగి తను చెప్ప దలచిన దానిని పఠితల మనస్సు హత్తు కొనేటట్టు చెయ్యడానికి ఒక్కొక్కప్పుడు ఆశ్చర్యావహకంగా పద ద్యోతక ధ్వనితో చెబుతుంటాడు. పరికించండి:

పత్తనాల రాజ వీధుల పందులు తిరుగు తున్నవి

ఎంగిలికై ఎగబడే నరులను చూచి కుక్కలు మొరుగు చున్నవి.

బియ్యపు కొట్ల వద్ద బారులు తీర్చి నిలబడిన వారు పౌరులు

అమృతం పొంగే ఏరులు పారుతూనే ఉన్నాయి.

శ్రమించే తనువుల స్వేదాలు కారుతూనే ఉన్నాయి.

గిడ్డంగులు, చీకటి కొట్లు, వినాయకుల జేబులు నిండుతూనే ఉన్నాయి.

అయినా అన్న పూర్ణ భాండంలో తండులాలు నిండు కొన్నవి.

పొయ్యి లోన రాజని చిచ్చు కడుపులో రగులుతోంది

కన్నీరుల ఆరని మంట ఎదలో ఎదుగు తోంది

పగ సెగలై పొగులు తోంది.

కలలు అడుగంటాయి, వెలలు మిన్నంటాయి.

కడుపు కరువు, గుండె చెరువు, బ్రతుకు బరువు

ఈ స్వరాజ్యం స్వారాజ్యానికి రాచబాట.

అంటూ మన సమాజంలోని దౌర్భాగ్య స్థితికి వ్యధ వ్యక్త పరుస్తాడు "పాంచజన్యం" అనే కవితలో!

"పెంచిన తల్లి" అనే గేయం ఆంధ్రరాష్ట్రం ఉమ్మడి మద్రాసు నుండి విడిపోయిన కాలంలో రచించారు బైరాగి. తమిళ దేశాన్ని పెంచిన తల్లిగా సంభావించు కొన్నారు బైరాగి. తమిళ తల్లీ నీకు నేను ప్రేమతో, గౌరవంతో వందనము చేస్తున్నాను అంటారు. బైరాగి ఉద్దేశ్యం లో -

కన్నతల్లి కన్నను

పెంచిన తల్లి ఋణ మెక్కువ

ఏమంటే అందు కన్న తల్లి కుండే నెత్తురు బంధం లేదు.

సహజ రహస్నేహం తప్ప మరొక ఆనందం లేదు.

మాతృ మమతా నిహిత స్వార్థ ద్వందం లేదు.

వెలుగు లాగు, గాలి లాగు, నీరు లాగు అదే గదా ప్రేమంటే.

అని పెంచిన తల్లిని అభివర్ణిస్తారు.

ఆగమగీతిలోని ఖండికలన్నీ వివరణాత్మక, విశ్లేషణీయములే! కాని స్థలాభావముచేత ఆ పని విరమించడ మైనది. విజ్ఞులు మన్నింతురుగాక! ఇంతవరకు స్వీయ కవితలను గూర్చి చర్చించు కొన్నాము. అనువాద కవితలను గూర్చి కొద్దిగా ముచ్చటించుకొని, విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అనువాద కవితలు పరిశీలిస్తే, టి.యస్.ఇలియట్ రచనలంటే బైరాగికి ఎక్కువ అభిమానమని గ్రహించ వచ్చును. ముఖ్యంగా వారి కవితలు బైరాగిని అధికంగా ప్రభావితుని గావించాయి. ఫ్రెంచి కవితలు సహితం ఆయనను ఆకర్షించాయి. అందుకే అనువాదాలలో ఎక్కువ భాగం ఫ్రెంచి కవితలు. వానిని ఆంగ్ల మాధ్యము నుండి తెలుగు చేశారు. భారతీయ భాషల్లో హిందీ నుండి సుమిత్రా నందన్ పంత్, దినకర్ బైరాగి అభిమాన కవులని మనం భావించ వచ్చును. మరాఠీ కవులలో విందా కరందీకర్, బెంగాలి కవులలో జీవానందదాస్ బైరాగిని ఎక్కువగా ఆకర్షించి, ప్రభావితం చేశారు. జీవానందదాస్ కూడా బైరాగి కోవకు చెందిన కవి. "బ్రతుకు బాధ భరించ రానంతగా వున్నట్లు భావించి, జీవితం కొట్టిన కొరడా దెబ్బలకు తట్టుకో లేక, ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి అంటే మృత్యుగహ్వరంలోకి, అంధకార గర్భంలోకి వెళ్ళి పోవాలనే ఆకాంక్ష ఆయన కవితల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. కవితలన్నీ బాధలకు తట్టుకోలేక వేసిన కేకల్లా వినిపిస్తాయి, ... ఆయన కవిత తొలి దశలో స్త్రీ మూర్తి కవితకు కేవలం ఒక ఆశ్రయంగా మాత్రమే ఉండేది. తర్వాత చీకటి గర్భం లోకి పోవాలనే మృత్యు కాంక్షగా పరిణమించింది" (కుందుర్తి). ఈ సంకలనంలో "నీలిమా", "వనలతాసేన్" అనే రెండు జీవానంద దాస్ కవితల తెలుగు అనువాదాలు పొందు పరచ బడ్డాయి.

ముగింపు:

బైరాగి అభ్యుదయ కవిగా సాహితి జగత్తులో ప్రవేశించాడు. అతనిపై ఆధునిక పాశ్చాత్య కవుల ప్రభావం ఎక్కువగా వుంది. బైరాగికి కొన్ని రాజకీయ విశ్వాసాలు ప్రగాఢంగా ఉన్నాయి. బైరాగి తన రాజకీయ విశ్వాసాల కోసం పడ్డ బాధ మాత్రం వెతికితేనే కాని కనబడదు ఆయన కవితలో. బైరాగిని కేవలం అపనమ్మకపు నీడల్లో సంచరించే సంశయాత్మగా చిత్రిస్తే, అది అవగాహనకు లోప చిహ్నం. కావ్యంలో నిరాశలు, నిట్టూర్పులు, భయాలూ, సందేహాలూ అడుగడుగునా ఉంటే, వాటన్నిటినీ బైరాగికి అంటగట్ట కూడదు. కుళ్ళుతో, అవినీతితో, అక్రమాలతో అన్యాయాలతో నిండిన ఈ జీవితపు చీకటి నుంచి ఆకాశపు వెలుతురు లోనికి చొచ్చుకు పోయే స్వేచ్ఛను, బైరాగి జీవిత మంతా అన్వేషించాడు, ఆకాంక్షించాడు.

వచన కవిత్వపు తొ లి రచయితల్లో బైరాగిని చేర్చ కుండా ఉండలేము. ఈ ప్రక్రియను తీర్చి దిద్దిన కవుల్లో ఆయన ముఖ్యుడు. ఆయన కవిత పైకి సులభసాధ్యంగా కనిపించక పోయినా, లోతుగా ఆలోచించే వారికి, ఆయన బాగా అర్థ మవుతాడు. వచన కవితలో గొప్ప ధారా శుద్ధి గల కవి బైరాగి. చివరి దశలో బైరాగికి, లోకం మీద కోపం ఎక్కువైంది. లోకంతో పాటు తన పైననే తనకు విసుగు పుట్టిందేమో?! ... చివరి రోజుల్లో అసలు బ్రతకడం ఎందుకో ఆయనకు అర్థం కాలేదు! లక్ష్యసిద్ధి భ్రాంతి లేకుండా - అంటే మోక్షాశయం లేకుండా, చావదలచిన యోగీశ్వరుడాయన. ఏమైతే నేమి, ఒక మంచి కవిని కోల్పోయింది తెలుగు తల్లి. బైరాగి మరి కొంత కాలం బ్రతికి ఉంటే ఏం రాసేవాడో? కవిగా ఎంత పేరు ప్రతిష్ఠలు గడించే వాడో ఊహిస్తే భరింప జాలని బాధ కలుగు తుంది.

కృతజ్ఞతలు: శ్రీ ఆలూరి బైరాగిని గూర్చి సాహిత్య పరమైన వివరాలు లభించక, తికమక లవుతున్న తరుణంలో, ఆపద్భాంధవునిగా చేయూతనిచ్చి, అలభ్యమైన ఆలూరి సంస్మరణ సంచిక (1979) నుండి ముఖ్య విషయాలను సేకరించి నాకు అంద జేసిన నా చిరకాల మిత్రులు డా. వెలగా వెంకటప్పయ్య గారికి నే నెంతయో ఋణ పడి యున్నాను. వారికి ఇందు మూలమున నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను.

2 comments:

  1. అద్భుతమైన వ్యాసం. ధన్యవాదములు

    ReplyDelete
  2. అద్భుతమైన వ్యాసం
    🌷🌷🌷🌷🌷🌷👍🙏

    ReplyDelete