Friday, 10 January 2014

Kalarekha (కాలరేఖ)

భూమిక:

తెలుగు దేశంలో సుప్రసిద్ధ విద్వాంసులు చాలామంది జన్మించారు. అనేకమంది మహాకవులు అద్భుత కవితా ఖండాలను సృష్టించి ఖ్యాతిగడించారు. కాని విద్వత్కవులుగా కీర్తి ప్రతిష్ఠ లార్జించినవారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అట్టివారిలో గుంటూరు శేషేంద్ర శర్మ గారొకరు. శ్రీశర్మగారు బహుముఖ ప్రజ్ఞాశాలి, భాషాపరశేషభోగి. తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషా సాహిత్యాలలో నిష్ఠాతులేగాక, హిందీ, ఉర్దు సాహిత్యాలలో సహితం గణనీయమైన కృషి చేశారు.

శ్రీశేషేంద్రశర్మగారు, ఎంత గొప్ప కవియో, అంతటి గొప్ప విద్వాంసుడూ, విమర్శకుడు అనుటలో ఎలాంటి భిన్నాభిప్రాయము లేదు. ప్రముఖ కవిగా, మహాపండితునిగా, గొప్ప విమర్శకునిగా శర్మగారు ప్రదర్శించిన ప్రతిభ అనన్య సామాన్యము. వీరి 'శ్రీవిద్యారహస్యనేతృత’ సర్వం కష్టమని పేర్కొనుట అతిశయీక్తి కాదు. "భారత రామాయణ ములను కలిపి శ్రీశర్మగారు చదివి నట్లుగా చదివిన వారి సంఖ్య లేదనియే చెప్పవలెను" (విశ్వనాధ సత్యనారాయణ). ప్రపంచ సాహిత్య ధోరణులను అవగాహన చేసుకొని, విస్తృత దృక్పథాన్ని అలవరచు కొని, కవితారంగంలోను విశ్వజనీన ప్రవృత్తిని ప్రకటించారు. నూతన కవితా ‘వాహిక’ చేబట్టి కవితా రంగంలో నూతన శకాన్ని సృష్టించారు. ఆధునిక కవితా రంగంలో ‘మండేసూర్యుని’ గా అభివర్ణించారు శ్రీశ్రీగారు శ్రీశేషేంద్రశర్మగారిని. తన కాలం వరకు ఉన్న కవితా ధోరణులను పూర్తిగా అకలింపు చేసుకొని, నాటికి లేనిదాన్ని సృజించి అభివృద్ధి చేయడమే వినూత్న శక్తిగా పరిగణిస్తారు శేషేంద్రశర్మగారు. శ్రీశర్మగారి కలం నుండి అనేక రచనలు ప్రవహించాయి. రచనలన్ని కలిపి దాదాపు 40కి పైగా ప్రచురిత మయ్యాయి.

శేషేంద్రశర్మగారి సాహిత్య ప్రస్థానం:

శేషేంద్రశర్మగారు వృత్తి రీత్యా ప్రభుత్వోద్యోగి (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్ కమీషనరుగా పని చేశారు) ప్రవృత్తి మాత్రం సాహిత్యం. వారి సాహిత్య జీవితం అత్యంత మహోన్నతమైనది. శ్రీనాథ మహాకవి వలె నూనూగు మీసాల నాడే అంటే 20వ ఏటనే (1947లో) రచనా వ్యాసంగం మొదలెట్టారు. అనువాద కావ్యం "సొరాబు" తో ఆయన సాహిత్య ప్రస్థానం ఆరంభ మయింది. తర్వాత 1961వ సంవత్సరం లో శర్మగారి "చంపూవినోదిని" పద్య కావ్యం ప్రచురిత మయింది. ఆ కావ్యం శర్మగారి ఆశు కవిత్వ పటిమకు, పాండిత్య ప్రకర్షకు అద్దం పడుతుంది. శ్రీ శేషేంద్రశర్మ గారు 11 పద్య కావ్యాలు, 12 విమర్శనా గ్రంథాలు రచించి పేరు ప్రతిష్ఠలు ఆర్జించారు. వారి ప్రముఖ రచనలను గూర్చి సంక్షిప్త వివరణ పాఠక మహాశయుల నిమిత్తం ఇందు పొందు పరచడ మైనది. విజ్ఞులు దీనిని సహృదయంతో స్వీకరిస్తారని ఆశిద్దాం!

ప్రసిద్ధ రచనలు :

శ్రీ శేషేంద్రశర్మగారి నాదేశం - నాప్రజలు, శేషజోత్స్న, రక్తరేఖ, ఆధునిక మహాభారతం, జనవంశం, స్వర్ణహంస, షోడశి - రామయణ రహస్యాలు, మండే సూర్యుడు, కవిసేన మేనిఫెస్టొ విశిష్ఠ రచనలుగా పేర్కొంటారు పండితులు. ఆయా రచనల లోని విశేషాలను తెలుసు కొనే ప్రయత్నం చేద్దాం.

నాదేశం - నాప్రజలు:

సాహిత్య వ్యాసంగం లో ప్రయోగాలు చేయుట శేషేంద్రశర్మగారికి అత్యంత ప్రీతి కరమైన విషయం. ఆధునిక సాహిత్యంలో కావ్యేతిహాసాలు లేని లోటును తీర్చే ఉద్దేశ్యంతో శేషేంద్రశర్మగారు "ఆధునిక మహాభారతము (నాదేశం-నాప్రజలు) రచించారు. విలక్షణ ప్రక్రియ అయిన "వచన కవితా వాహిక" ద్వారా ఒక అద్భుత కావ్యాన్ని సృష్టించి ప్రపంచ స్థాయి రచయితగా నిలచారు శేషేంద్రశర్మగారు. సామాజిక చైతన్యాంశాలను సాహిత్యంలో ప్రవేశ పెట్టి విలువలను పెంచడమే కాక, ఒక నూతన ప్రక్రియ ఆధునికులకు పరిచయం చేశారు. ఇతిహాస నిర్మాణానికి బాధానుభూతి పూర్వక బలి కావాలి. నేనే ఆబలి! నా వయస్సు నా పాండిత్యం, నా ప్రతిభ, నా అనుభవం సర్వస్వం పిండి, మాటల గొంతుల్లో పోసిన నా రక్తం ఈ ఇతిహాసం. ప్రపంచ మానవుల్ని, వాళ్ళ చరిత్రల్నీ, వాళ్ళ జయాప జయాల్నీ, వాళ్ళ భూత భవిష్యద్వర్తమానాల్నీ, అన్నిటినీ అనుభవ జ్ఞాన నేత్ర ద్వయంతో అవలోకన చేసి, ఆ విశ్వ దృశ్యం నుంచి ఈ తాత్పర్యం పిండాను" అంటారు శర్మగారు నాదేశం-నాప్రజలు గురించి ప్రస్తావిస్తూ!

వర్తమాన తెలుగు కవిత్వంలో ఇతిహాసం ఒక అచుంబిత మైన ప్రక్రియ. "ఇప్పుడు నేను ఈ ఇతిహాసం సమర్పిస్తున్నాను, దేంట్లో ఒక సామాన్య కర్షకుడు నాయకుడో ... కర్షకుడి జీవితంలో ఏం గాథ లుంటాయి ... ఈ ఇతిహాసంలో కథ కోసం చూడకూడదు... ఆధునిక యుగంలో పాశ్చాత్య దేశాల్లో కథా రూపం ఇతివృత్తం లేని ఇతిహాసాలే వస్తున్నాయి". ఈ పుస్తకం ద్వారా కవిత్వంలో విలువల్ని, వస్తు రూపాల్లాంటి కవితా సామాగ్రిని, కవి అలోచనలే నిర్దేశిస్తాయని, ఋజువు చేశారు శ్రీశర్మగారు.

శేషజ్యోత్స్న :

శ్రీశేషేంద్రశర్మగారు "వేదనా జీవితం నుండి ప్రేమోప జీవిగా మారిన తరుణంలో రచించిన రచన "శేషజ్యోత్స్న". ఇది ఇరువది కవితల ఖండ కావ్యం. దీనికి శేషేంద్రశర్మగారు రచించిన ఉపోద్ఘాతం "నేనూ - నా నెమిలీ లేక నెమిలీ - నా నేనూ" విశేషించి పేర్కొన దగినది. ప్రేమ కూడా ఒక తపస్సే! విరహావస్థలో కంటే, సాఫల్యంలో దాన్ని తపస్సుగా, దర్శనంగా, ఆత్మ సంస్కారంగా, అనుభవించుట గొప్ప సంస్కార వంతుల విశేషం. అట్టివారు అరుదుగా వున్నారు. సాధారణంగా ప్రేమ తపస్వులైన కవులు విరహులే! శేషజ్యోత్స్న కవితా ఖండికలలో ఎక్కడ చూచినా ప్రేమ సాఫల్యానుభూతి కవితా మధు స్రవంతిగా ప్రవహిస్తుంది! మచ్చుకు :

"ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నీవు" అన్నాయి - నా పెదవులు మృదువులైన అక్షరాలుగా మారిన

జన్మాంతర నిరీక్షా మధువుతో తడిసి - ... బహు జన్మల సమూహాలకు పూర్వం

నాలో నీవు, నీలో నేనూ ఉన్నాను కాబోలు ... (ఆమె రెండు కళ్ళు)



"నిన్నూహించి రెండు ముక్కలు చెపితే -అవే రెండు రెక్కలయి - ఊహ

విహాయసంలో కెగిరి పోతుంది -అదే ఒక గీతం అవుతుంది - ..." (ఏవో చినుకులు).

ఇందు లోని మిగతా కవితా ఖండికలు ముఖ్యంగా, పడవలూ-తెరచాపలూ, నూతన తీరాలు, నీవు, ఆరోజు, మనసే ఒక మధుమాసం, చీకటి దయ్యాలు, వెన్నెల వ్యధ, ఇత్యాదులు చదివి ఆనందింప తగినవి. ఈ కవితా సంకలనం 1972 లో ప్రచురిత మైనది. ఇది ఇంగ్లీషు, ఊర్దూ, హిందీ భాషల లోనికి అనువదించ బడినదంటే, దీని ప్రాముఖ్యత, ప్రభావం ఎలాంటివో ఊహించు కోవచ్చు!

రక్తరేఖ (నాడైరీ) :

ఈ పుస్తకం శేషేంద్రశర్మగారు తన స్వంత ఉపయోగం కోసం వ్రాసుకొన్న చిత్తు పుస్తకం (Writers Note Book). దాన్ని యథా తధంగా ప్రచురించటం జరిగింది. ఇందులో తత్వ విచారమూ, తెలుగు దేశంలో కవిత్వం పట్ల ప్రబలిన అపోహల ఖండనమూ ప్రథాన భాగాలు. కవిగా భావకుడుగా శేషేంద్రశర్మ లో జరిగిన పరివర్తన తెలుసు కొనుటకు "రక్తరేఖ" ఉపకరిస్తుంది. శేషేంద్రశర్మగారిలో ఏ మార్పు వచ్చినా - ఆయనకు చిన్న పిల్లల మీద, పక్షుల మీద ఉదయాస్తమయల మీద, ఉండే మోజు పెరుగుతుంది! "ఎందుకు వస్తున్నాయి ఈ చక్కని భావాలు నిశ్శబ్ద బంధురమైన నా మందిరము లోకి" అని తన్ను తానే ప్రశ్నించు కొంటాడు. "నీలాకాశంలో తెలి మబ్బులై పొండి, సాగరాల్లో నావల తెరచాపలై పొండి,దూర తీరాలకు తరలి పోయే పవనాలై పొండి, రేపటి గులాబీల తోటల్లో ఉషస్సులై పొండి!" అంటూ పాఠకుల పైకి తన భావాల్ని గుప్పిస్తారు శేషేంద్రశర్మ. ఆయన హృదయ పరిణతిని "రక్తరేఖ" కావ్యం వివరంగా చిత్రిస్తుంది. ఈ పుస్తకం 1974వ సంవత్సరంలో ప్రచురిత మైనది. సాహిత్యం గురించి, సమాజాన్ని గురించి ఎన్నో ఆలోచనాత్మక మైన విషయాలను పొందు పరచారు రచయిత ఈ పుస్తకంలో.

ఋతుఘోష :

శేషేంద్రశర్మగారి కవితా ప్రతిభను విశ్వనాథ మొదలు పుటపర్తి నారాయణాచార్యుల వరకు ప్రశంసించని వారు లేరు. శర్మగారి కవితలో శ్రీనాథ మహాకవి చందో బద్ధత, ముక్తచ్ఛంద రచనలో బాలగంగాధరతిలక్ తో సాదృశ్యము కని పిస్తుంది. భాషా సౌందర్య రహస్యం ఆధునికుల్లో శేషేంద్రశర్మకూ, తిలక్ కూ తెలిసి నంతగా మరెవరికి తెలియదని ఆర్.యస్.సుదర్శనం వంటి విమర్శకుల అభిప్రాయం. కొందరు విశేషజ్ఞులు ఋతుఘోషను శేషేంద్ర హృదయ వేదంగా అభివర్ణించారు. ఒక విధంగా ఆలోచిస్తే "ఋతుఘోష" పేరులోనే కనిపిస్తున్న "ఘోష" దీనికి అంతస్సూత్రం. ఒకానొక "ఆర్తి" దీనికి జీవనాడి! శరీరాన్ని "కారాగారంగా" భావించి ఎక్కడికో ఎగిరి పోవడానికి ఆకాంక్షించే తత్త్వం. అది అసాధ్యమైన నిర్వేదం దీనిలో కనిపిస్తాయి.

"ఆసల్ తీరునే దృష్టిచే, మహిత ఘాడాలింగ నాయుక్తిచే

నా సంయోగ నిరంత వేదనము లేయద్వైత సంసిద్ధికో

నైసర్గంబగు నేయగాధకుహరాంతకః, ప్రజ్వలానంద కీ

లానంతర్పణకో శరీర మొక కారాగారమై తోచగన్".

అంటూ ప్రగాఢ తాత్త్విక రేఖను ఆవిష్కరిస్తాడు. ప్రణయాన్ని "ఆనంద" భూమికకు ప్రచోదనం చేస్తాడు. శేషేంద్ర ప్రణయ తత్త్వం శరీరావధి కాదు, "ఆనందావధి". అంతేకాదు, "శరీర మొక కారాగారమై తోచగన్" అనే మాట అత్యంత కీలకంగా తోస్తుంది. కవి ప్రతి కవితా ఖండికలోనూ, ఎగిరి పోవాలనే ఆకాంక్షను ఏదో విధంగా వ్యక్తం చేస్తాడు! పక్షులూ, ఎగరడం, ఆకాశం - ఇవే తరచుగా శేషేంద్రశర్మగారి కవితలో మన కెదురయ్యే కవితా సామాగ్రి! ఋతుఘోష లోనిదే మరో పద్యం పరికించండి:

"ఎవడో చాకలి ఆకలిన్ మరచి తానే వన్యె మల్లీలతా

నివహక్రోడపుటీ తటాకముననో నిత్యాశ్రమా జీవన

వ్యవసాయం బొనరించు చున్న ధ్వనియే వ్యాపించే ప్రాపంచిక

వ్యవహార ప్రవిహీన విశ్వహృదయ వ్యాపార మేమో యనన్".

నిశ్శబ్ద మావహించిన మధ్యాహ్న వేళ చాకలి వాడు బట్టలుతికే ధ్వని "విశ్వ హృదయ వ్యాపార" మన్నట్లు వినిపించిందట! అంతర్ముఖుడైన ఋషి ధ్యాన నిష్ఠతో కూర్చున్నప్పుడు మనస్సు ఇంద్రియ వ్యాపారముల నుంచి నివర్తిత మయ్యే స్థితిలో వినిపించే హృదయ స్పందనాన్ని ధ్వనిస్తూ, ఋషికి విశ్వానికి ఏర్పడే తాదాత్మ్యాన్ని సూచించే తీరున సాగిన పై పద్యం "ఋతుఘోష" లో ఆణిముత్యం లాంటిది. కావ్యమంతా ఇటు వంటి ఆణిముత్యాల మాల! ఈ కావ్యం లోని మరో విశేషం కవి ఒక వంక ఋతువుల సౌందర్యాన్ని వివరిస్తూనే అది పేదలకు, దీన జనులకు అందడం లేదనే ఆవేదనను వ్యక్తం చేస్తాడు. పాఠకుల దృష్టిని అందం మీది నుండి లోక భోగ వ్యత్యాసం వైపు మళ్ళిస్తాడు! అదే శేషేంద్ర ప్రత్యేకత!

స్వర్ణహంస:

ఈ వ్యాస సంపుటి 1968వ సంవత్సరంలో వెలువడింది. ఇది సంస్కృతంలో హర్షభట్ట (శ్రీ హర్షుని) ని విరచిత మైన "నైషధ మహాకావ్యం" యొక్క విశ్లేషణాత్మక విమర్శ. సాహితీ లోకం హర్ష నైషధంను కావ్యముగా పరిగణించి పఠించు చున్నది. "హర్షుని కేవలము సారస్వతేయునిగా మాత్రమే లోకము తలచు చున్నది. అది పొరపాటు. హర్షుడపర శంకరుడు. శాంకర సాంప్రదాయము కాంతా సమ్మితముగా జెప్పుట కీ గ్రంథము వ్రాసెను" అంటారు శేషేంద్రశర్మగారు. ఇంకా "హర్షనైషధం లో హంస దానెవరో యెనిమిది వందల సంవత్సరముల నుండి చెప్పు చున్నప్పటికిని ఇంత వఱకు ఎవరును గుర్తింప లేదు".! ... నైషధము మంత్ర శాస్త్రము; నైషధము యోగశాస్త్రము; నైషధము వేదాంతశాస్త్రము". ఈ విషయమును శేషేంద్రశర్మగారు సమన్వయ పూర్వకముగా సమర్థించి ఈ విమర్శనా గ్రంథము (స్వర్ణహంస) లో చూపించారు (నిరూపించారు). శ్రీశర్మగారి విశ్లేషణ ప్రకారం నలుడు జీవాత్మ; భీముడు పరమాత్మ లేక నిర్గుణ బ్రహ్మము; దమయంతి శ్రీ మహాత్రిపురసుందరి. హర్షనైషధం లో మొదటి మూడు సర్గలలో గ్రమముగా అజప మంత్రాధి దేవతగా, జీవాత్మగా, పరమాత్మగా వర్ణింప బడినది. ఈ విషయం ఉపనిషత్తుల నుండి ఉదాహరణలు తీసుకొని సమర్థించారు శర్మగారు. ఈ సిద్ధాంతాన్ని పూర్వ పక్షం చేయుట సులభ కార్యం కాదు.

నైషధ వ్యాఖ్యాత, మల్లినాథసూరి గాని, నైషధాన్ని తెలుగు జేసిన శ్రీనాథ మహాకవి గాని, ఈ విషయములను విశద పరచలేదు. అదే విధంగా, నైషధము నందలి సరస్వతి నలుని కుపదేసించిన చింతామణి మంత్ర పరమగు "ఆవామావామార్థే" అను శ్లోకమునకు మల్లినాధుడు దేవతా, మంత్ర యంత్రాణాం త్రయాణామపి ప్రకృతత్వాత్" అని మూడర్థములను, ప్రకృతములని చెప్పగా, శ్రీశర్మగారు ఆ మూడర్థములే గాక బ్రహ్మ విద్యా రహస్య పరమగు నాల్గవ యర్థము కూడా కలదని, అది ప్రకృతము గాకున్నను బ్రకృత మైన మంత్ర శాస్త్రార్థము కన్న పరమ రమణీయ మైనదని పేర్కొన్నారు.

నైషధ కావ్యం ధ్వని కావ్యం. కాని, ఈ కావ్యం లోని ధ్వని గూఢ ధ్వని. హర్షభట్టు వ్యాస వాల్మీకాదుల వలె ఆధ్యాత్మిక యోగమంత్ర శాస్త్ర రహస్యములను ఆ కావ్యము నందు నిక్షేపించి అపార ప్రతిభ ప్రదర్శించారని శ్రీశర్మగారి వాదన. శ్రీ శేషేంద్రశర్మగారికి యోగమంత్ర శాస్త్ర ములందుగల అభినివేశము అపారం. ఆ శాస్త్రములలోని రహస్యములన్నియు వారికి కరతలామలకము. అందుచే సహేతుక మైన వారి వాదన ఖండింప జాలనిది. "స్వర్ణహంస" శర్మగారికి, తంత్ర, మంత్రయోగశాస్త్రాదులలో గల అపార జ్ఞానానికి నిదర్శనము.

పక్షులు:

పక్షులు అనే కవితా సంపుటి 1970వ సంవత్సరంలో ప్రకటిత మైనది. ఈ సంపుటికి వ్రాసిన మున్నుడిలో "కవిత్వ మంటే పద్యమే నని కొందరు, కాదు గేయమని కొందరు; కాదు వచన కవితేనని కొందరు ... కవిత్వమనే ఆ ఆనంద స్వరూపిణి ఏఒక్క రూపంలో మాత్రమే ఎందుకుంటుంది? ... అన్ని ప్రక్రియలు ఉండ వలసిందే ..." అంటారు శేషేంద్రగారు. "కవిత ధరించే బాహ్య వేషం చంధస్సు ... అంతరదృష్టితో పరిశీలిస్తే దాని నెట్లా చెప్పాలంటే - యుగయుగాల పొరల క్రింద అణగి నూతన వ్యక్తీ కరణ కోసం తహతహ లాడుతూవున్న, మానవాత్మ సాహిత్య బంధాలన్నీ ఛేదించుకొని సముజ్వల భావ లావాగా ప్రవహించింది. పశ్చిమ దేశాల్లో ఛందస్సు విగళితం కావడం కవితలో రూపానికి ప్రాధాన్యం నశించడానికి సంకేత మైతే, మన దేశంలో ఒక రూపాన్ని తోసేసి, మరొక రూపాన్ని స్వీకరించడం మాత్రమే అయింది. ...అందుచేత కవిత్వం ఎలా వ్రాయాలి అనే విషయం మీద గంతులు వేయడం కంటే, కవిత్వం ఎలా వుంటుంది అని వివేచన చేయడం లాభదాయకం" అంటారు శేషేంద్ర.

ఈ సంపుటం "చెరుకువిల్లు" అనే కవితతో ప్రారంభించారు శేషేంద్ర. భావకుడైన సహృదయుడు, ఈ కవితను చదివితే ఆనంద జీవన మధూళిలో స్నాతుడౌతాడు! చెరుకువిల్లు అనేది మన్మథ ప్రతీకమైన కవి సమయం. కాని, దీనిని శేషేంద్ర కవి మన్మథ ఆయుధంగా చిత్రించ లేదు. మనసులో చైతన్య జ్వాలగా మెదిలే కవితా మహేంద్ర చాపానికి ప్రతీకగా ప్రయుక్తం చేశాడు. గమనించండి.!

అక్షరాల ఇసుకతో కవిత కడతారామరి – తలపుల నెత్తావులు చిమ్మే మృదు హృదయ

సుమ ధూలి కావాలి; జీవన మధూళి తో తడపాలి - చెఱకువిల్లు విరిచిన వాడే చిగురు కైత చెపుతాడు

ఎదల పొరదిళ్ళ మీద మల్లెలు విరియిస్తాడు. . . .

జీవితంలో లేని కవితా కాగితంలో వస్తుందా - తునక మబ్బు లేకుండా చినుకు నేల బడుతుందా. . . .

సుందర భావ జగత్తు సృష్టించ లేని వాడు - ముసలి పదాలతో మురిపేలాడుతూ సరి పుచ్చుతాడు

ఊహకు రెక్క లున్న వాడు ఉదధులు దాటుతాడు - ఉత్తుంగ శిఖరాలకు ఎగురుతాడు. ...

వాడే, చైతన్యం - చరిత్రను సృష్టిస్తాడు - చరిత్ర భారాన్ని జ్ఞాన నేత్రాగ్ని జ్వాలా దగ్ధం చేస్తాడు.

ఇందులోని కవితలు మనోహర మైనవి. పద్య రచనలు చక్కగా నుండి, కవి నిష్టా తత్త్వాన్ని వేనోళ్ళు చాటుతున్నాయి. పద్యం, నిన్నటి కవితా వాహకం, నేటి తొందర జీవితానికి పద్యాలు మాత్రమే అనవద్య సాధనాలను కోవడానికి, ఈ యుగం అగీకరించదు. (ఆవంత్స సోమసుందర్).

షోడశి - రామాయణ రహస్యాలు:

షోడశి అనే పేరు "శ్రీ విద్య" కు సంబంధించినది. శ్రీవిద్య మహాతంత్రానికి సంబంధించిన గొప్ప విద్య. గ్రంథ మంతటి లోను మంత్ర విద్య, యోగములకు సంబంధించిన వివరములు చర్చించ బడినవి. ఈ పుస్తకానికి వ్రాసిన మున్నుడిలో విశ్వనాథ సత్యనారాయణ గారు చివరి అధ్యాయము లోని దేవి స్తోత్ర శ్లోకమును పేర్కొని, దానికి శర్మగారు వ్యాఖ్యానించిన విధానాన్ని ప్రశంసించి, వ్యాఖ్యానము లోని విశేషాలను గూర్చి విశదీకరించారు. "శివః" అన్న శబ్దమును పుంలింగముగా పేర్కొని, అయినప్పటికీ, విశేషణ విశేష్యములకు తత్ర తత్ర భిన్న లింగత్వము యొక్క కలిమిని తగినట్టుగా నిరూపించారు శ్రీశర్మగారని పేర్కొన్నారు. శర్మగారు అనుసరించిన పద్ధతిని "నిగమాగమ" సంప్రదాయమని చెప్పుట సమంజసమని అభిప్రాయ పడ్డారు. శివశక్తుల కబేధ ప్రతి పత్తి కనుక, మరియు శివుడు శక్తి యొక్క ప్రతి బింబము గనుక శివశక్తు లిద్దరు అన్యోన్య ప్రతి బింబములని వక్కాణించారు. గ్రంథ మంతట అనేక విషయములు నిక్షిప్తమై ఉన్న వనియు, శ్రీశేషేంద్రశర్మగారు చేసిన పరిశోధన, వారు దృఢ పరచిన విశేషాలు అత్యంత ఆశ్చర్య జనకము లనియు, శర్మగారి మేధా విశేషము మెచ్చుకొన దగినదని చెప్పారు.

షోడశి గ్రంథంలో ప్రధాన విషయములలో మొదటిది రామాయణం లోని "సుందరకాండకు" ఆ పేరు ఎందు వలన వచ్చిందన్న ప్రశ్న, దానికా పేరు వచ్చుటకు కారణం ఆ కాండంలో కుండలినీ విద్య ప్రతిపాదించ బడినదని చెప్పుట. రెండవది సుందరాకాండంలో త్రిజటా స్వప్న వివరాలు చర్చింప బడుట. త్రిజటా స్వప్న వివరణకు పూర్వం వానిని గురించిన రహస్యములను శేషేంద్రశర్మగారు ఎత్తి చూపి, ఋజువు చేసిన విధానము విజ్ఞుల అభిమానాన్ని ఆకట్టు కొన్నది. సుందరాకాండంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడి యున్నదన్న విషయం పండితులకు తెలియనిది కాదు. కాని ఎచ్చట నున్నదీ ఎవ్వరూ విశద పరచ లేదు. కాని, శేషేంద్రశర్మగారు ఈ విషయాన్ని సాపేక్షతా సహితంగా నిరూపించారు. ఐతే, సుందరాకాండం పేరు విషయం. అమ్మవారు సౌందర్య నిధి. నిధి కాదు ఆమెయే సౌందర్యము. శ్రీదీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల యొక్క యర్థము దేవి యందు పర్యవసించునట్లు సౌందర్య మనగా దేవి - అందుచేత ఈ కాండమునకు "సుందరకాండం" అని పేరు వచ్చిందని శేషేంద్రశర్మగారి ప్రతిపాదన.

మరోవిషయం:

రామాయణం భారతము కన్న ఆధునాతన మన్న వాద తిరస్కారము. దీనికై శర్మగారు అశేష కృషి సల్పారు. రామాయణము లోని కొన్ని శ్లోకాలను యథా తథంగా భగవాన్ వ్యాసులు మహాభారతం లో చొప్పించిన వివరాల విశ్లేషణ. ఇది మహాభారతము వాల్మీకి రామాయణానికి ప్రతిబింబ మనే సిద్ధాంతానికి బలమును చేకూరుస్తుంది. షోడశిని గూర్చి చివరి మాటగా "మొత్తము మీద ఒకటి నిస్సంశయముగా చెప్ప వచ్చును. వీరి పాండిత్యం చాలా లోతు గలది. వీరి శ్రీవిద్యా నేతృత సర్వం కష్టమని చెప్పుట కభ్యంతర ముండ కూడదు. భారత రామాయణములను కలిపి వీరు (శ్రీశేషేంద్రశర్మ) చదివి నట్లు చదివిన సంఖ్య ... భారత దేశమున ఒక రిద్దరుందురేమో?" అని అభిప్రాయ పడినారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు! అందుచే షోడశిని చదివి విజ్ఞులైన పాఠక మహాశయులు రామాయణ భారతాదులలో నిక్షిప్తమైన తంత్ర, మంత్ర యోగ సిద్ధాంతములను గూర్చి వివరాలను, విశేషాలను గ్రహిస్తారని ఆశిద్దాం. షోడశి తొలిసారి 1967వ సంవత్సరంలో ప్రచురిత మైనది. 16 శీర్షికల క్రింద వివరాలన్ని చర్చించబడినవి.

షోడశి, స్వర్ణహంస గ్రంథాలలో శ్రీశేషేంద్రశర్మగారు వివరించిన అంశాలు పరిశోధనాత్మక మైనవి. మంత్ర, తంత్ర శాస్త్రాలలో శర్మగారికి గల ప్రావిణ్యం విశద పరుస్తాయి. ఎక్కువ మందికి తెలియని విషయాలని చర్చించడం వలన ఈ రెండు పుస్తకాలకు మంచి పేరు వచ్చింది. వీటిని "శాస్త్రానుస్యూతవర" విమర్శగా పేర్కొన్నారు శ్రీ ఆచార్య సంపత్కుమారవర్యులు. వీనిని తెలుగు సాహిత్య విమర్శలో ప్రామాణిక విమర్శ గ్రంథాలుగా పేర్కొన వచ్చును.

విహ్వల:

శేషేంద్రశర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం పద్య రచనలూ, విమర్శా యుక్తమైన వ్యాసాలే కాక మిగతా సాహిత్య ప్రక్రియలలో సహితం అందెవేసిన చేయి. చిన్న కథా ప్రక్రియా రచనలో ప్రయోగాలు చేశారు. ఆయన ప్రచురించిన కథా సంపుటి "విహ్వల" పాఠకుల ఆదరాభిమానాలు చూర గొన్నది. ఈ సంపుటిలో ఐదు కథలను సమకూర్చారు రచయిత. దీనిలో "రంగుల చేప" అనే కథానిక కథా శిల్పానికి చెప్పుకో దగిన ఒక విలక్షణ రచన. మానవీయతలో పాత్ర అంతరంగిక కల్లోలం, ఆ కల్లోలం మధ్య ఆర్థ్రంగా ఎగురుతున్న నీటి తుంపరలు -సమస్తమూ క్లుప్తతతో విరిసినై. సముద్రం మీదికి వెళ్ళి తిరిగి రాని తండ్రికై నిరీక్షిస్తూ నిలచిన జాలరి పసిబాలుని చిత్రణ హృదయ విదారకంగా ఉంది. మరువలేని, మరపు రాని సంఘటన అద్భుతంగా వర్ణిత మైనది. సంపుటి లోని మిగతా నాలుగు కథలూ ఆస్వాద నీయాలు, పఠితలను ఆలోచింప చేస్తాయి.

మబ్బుల్లో దర్బారు:

ఈ రచన శర్మగారి మరో రూపాన్ని (నాటక కర్తగా) ప్రదర్శిస్తుంది. వారి బహుముఖ ప్రజ్ఞకు మరో ఉదాహరణగా పరిగణింప దగినది. కొందరు ఏపని చేసినా శోభిస్తుంది. శేషేంద్రశర్మగారు పద్యం వ్రాస్తే, పాడితే "స్కాచ్" పుచ్చుకున్నంత (శర్మగారి అత్యంత ప్రీతి కరమైన చర్య) పరమానందం, జెట్ ఎక్కినంత సంబరం. ఈనాడు ప్రచలిత మౌతున్న అన్ని బ్రాండుల కవిత్వాన్ని ఆయన పద్య మంటాడు. అందుకేనేమో శేషేంద్ర కవితని "పద్యమా లేక ఫ్రెంచి మద్యమా" అన్నారు శ్రీశ్రీ.

ప్రస్తుత రచన "మబ్బుల్లో దర్బారు" ఒక ఊహ చిత్రం(ఫేంటసీ). దీనిని విప్లవ నాటికగా పేర్కొన్నారు రచయిత. చదివి ఆనందింప తగినది. పాఠక మహాజనులను బాగా ఆక ర్షిస్తుంది. దీనిని తొలిసారి 1968వ సంవత్సరంలో ప్రచురించారు.

మండే సూర్యుడు (కవితా సంపుటి):

మండే సూర్యుడు అనే శేషేంద్ర కవితా సంపుటి 1974 లో వెలువడింది. ఈ సంపుటి కార్య కలాపాలలో శ్రీమతి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిరి గారు పాత్ర వహించారు. ఆమె మాటల్లో “It has emerged in these poems as the chosen voice of his people”. ఈ సత్యం "మండే సూర్యుడు" కావ్యం లోని ప్రతి కవితా లోను స్పష్ట మవుతుంది. శేషేంద్ర కవిగారు వాడిన - చెమట బిందువు, కండల కొండలు, పిడికిలి. ఆక్రోశిస్తున్న అడవులు, వ్రేలాడిన శిరసు, వంతెనలు, వంటి ప్రతీకలు పుంఖాను పుంఖాలుగా మన హృదయం పైన జలపాతంలా విరుచుక పడతాయి! ప్రతి పేజీలో విశ్వమంత రహస్యాన్ని ఇముడ్చుకొన్న పద చిత్రాలతో వెలితి లేని గీతికా భోగపదం అలరారు తుంది. ప్రతి శబ్ద దళమూ మనలను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. మండేసూర్యుడు సంపుటి లోని కవిత లన్నీ ప్రధానంగా అత్యాధునిక మైన Imagist symbolist సంవిధానలకు చెందినవి. నేడు అంతర్జాతీయంగా ప్రచలిత మౌతున్న కవితా ధోరణిని పుణికి పుచ్చు కొన్నవి.

ఇక ఈ సంపుటి శీర్షికను (పేరును) నిర్ణయించిన తొలి కవిత మండేసూర్యుడు. ఈ కవిత హైద్రాబాదు రేడియో కవి సమ్మేళనంలో మొదటి సారి ప్రసార మయింది. ఆ సమయంలో గొప్ప సంచలనం రేపింది. దీనినే ఆంధ్రప్రభ వారపత్రిక (13-11-1974) సంచిక "మనిషిని చెక్కిన శిల్పి" అనే శీర్షికతో ప్రచురించింది.

సూర్యుడు అనే ప్రతీక పూర్వం చాలామంది కవులు ప్రయుక్తం చేశారు. అయితే, మహత్తర శక్తి సంపన్నంగా ఈ కవితలో ప్రచలితం కావడం వల్ల ఈ ప్రతీక చాలామంది యువ కవులను ప్రభావితుల్ని చేసింది. ఇంతకీ ఈ మండేసూర్యుడు అనే కవిత లోని విశిష్టత ఏమిటి? పద చిత్ర బాహుళ్యముతో ధగధగ లాదుటయేనా? లేక, ప్రతీకవాద శిల్పంతో శిఖరాగ్రం అందుకొనడమేనా? మరేమైనానా? శేషేంద్రశర్మ చమటబిందువు స్వగతాన్ని ఇతివృత్తంగా ఎన్నుకొన్నాడు. ఆసాంతం స్వాత్మక ధోరణిలో చెమటబిందువు స్వగతంగా ఈ కవిత సాగుతుంది. అయితే ఈ చమటబిందువు ఎలాంటిది? "కండల కొండల్లో ఉదయించే లోకబంధువు"; అంటే లోకబాంధవుడు సూర్యుడని వేరే చెప్పనక్కర లేదు. సూర్యుడే లేకపోతే ఈ భూమిమీద జీవన సర్వస్వమంతా నిర్జీవ మవుతుంది. అంతేకాదు, శ్రమైక జీవనానికి సమస్త వస్తూత్పత్తికీ ఈ చెమట బిందువు ప్రతిష్ఠించ బడింది. దీని నుంచే సమస్త భాగ్య భోగ్యాలు రూపొందు తున్నవి. అయినా లోకం ఈ చమటబిందువుని ఖాతరు చేయుట లేదు. స్వేదశక్తి పరిగణన పొంద లేదు. శ్రమబిందువు శ్రమశక్తికీ, సృజనశక్తికీ ప్రతీక. కనుక, తాను సంఘీ భావంతో ఏ ఘనకార్య మైనా సాధించ గలదు. ఈ జగత్తు రూపు రేఖల్ని పూర్తిగా మార్చివేయ గలదు. ... ఒక ప్రతీకను నెలకొల్పి ప్రథమపురుషలో దాని పరంగా కవితను వెలార్చే ధ్యానంలో సాధారణంగా కవులకీ తమ ప్రతీకలకీ మధ్య పేచీలు వచ్చుట సహజమే. ... ప్రతీకను దురాక్రమించి ఆరోపితం కావడం వలన రసభంగం జరుగుతుంది.

"సూర్యుడు ఉదయించకపోతే - మండే నాగుండె చీల్చి దానిమీద పెడతా"

సూర్యుడు కాంతి హీనుడయితే ప్రజ్వలించే తన గుండెనే చీల్చి సూర్యుడి స్థానంలో నెల కొల్పుతా నంటుంది చేమటబిందువు!

"ఎఱ్ఱటి నా కండలతో ఎండలు కాయిస్తా" అన్న వ్యాక్యంతో ఈ కవిత పరాకాష్ఠ నందుకొంటుంది. ఈ ముగింపు వాక్యం తోనే మండేసూర్యుడు అనే కావ్య నామం సార్థక్యత పొందుతుంది.

ఇంతవరకూ "కేవలం పదాల పోహళింపు ద్వారా శబ్ద శక్తి పై ఆధార పడిన సౌందర్యానికి కవితా శిల్పం కాణాచిగా రూపొందింది. "మండేసూర్యుడు" కవితా సంపుటిలో ఈ లక్షణానికి మారుగా పదచిత్ర రచన ప్రాధాన్యం సంతరించు కొంది, ప్రతీకలు అతి ధారాళంగా నెలకొల్ప బడ్డాయి. నూతన సంవిధానం ద్వారా ప్రతి వాక్యమూ ఒక మనోహర భావ చిత్రంగా (Ideogram) రూపొందింది. ఒక సమగ్ర తేజశ్శక్తిని స్వాయత్తం చేసుకొంది. ఈ సంపుటి లోని ప్రతి కవితకు శేషేంద్ర శర్మగారు స్వయంగా ఆంగ్లానువాదాన్ని పొందు పరచారు. పుస్తకం చదువు తుంటే పాఠకునికి చెమట బిందువు స్వగతాన్ని కవి చెబుతు న్నాడన్నది సుబోధక మవుతుంది.

"నేను చమట బిందువుని - కండల కొండల్లో ఉదయించిన లోక బిందువుని"

ఈ కవిత పాఠకుల హృదయాల్లో యోచనా కిరణాలను ప్రసరిస్తుంది. కావ్యాన్ని పూర్తిగా చదివిన రసజ్ఞునికి మానసికంగా విచిత్రానుభూతిని కల్పిస్తుంది.

రాత్రి నేను కనే కలలు – దినాల మీద కట్టే వంతెనలు –

నా భాష తన నిండా బాధలు నింపు కొంది.

చీకట్ల లాస్యం - ఛేదించు కొని - చుక్కలు నా వాక్యాలై

సూర్యుడిలో కలసి పోతున్న - చిట్ట చివరి రాత్రి . . .

రోజూ ఉదయాద్రి శిఖరం మీద - రక్త కాంతులు చిందే గుండ్రని పాటని!



కవిసేన మేనిఫెస్టో:

శ్రీ గుంటూరు శేషేంద్రశర్మగారు విమర్శా ప్రస్థానంలో సాగించిన అతి ముఖ్య మజిలీ ఈ గ్రంథ రచన. తెలుగులో అభ్యుదయ సాహిత్య ఉద్యమం వచ్చి ఉండక పోతే ఇలాంటి విమర్శనా గ్రంథం వెలుగు చూడక పోవునేమో?! ఈ కవిసేన మేనిఫెస్టో చదివే వారికి శ్రీశేషేంద్రశర్మ పై పాశ్చాత్యుల ప్రతీక వాద ప్రభావం బలంగా కనిపిస్తుంది.

అరిస్టాటిల్, ప్లేటో ఇత్యాది గ్రీకు పండితుల యొక్క Poetics ని, లూనాషార్కే, ప్లెఖనోవ్, గోర్కి, మాయాకోవస్కీ వంటి మార్కిష్టుల కళా వివేచననీ, భామహ, అభినవ గుప్త, శారదా తనయాది భారతీయ మేధావుల అలంకార శాస్త్రము లోని విశేషాలను సమన్వయ పరుస్తూ రూపొందించారు కవిసేన మేనిఫెస్టోన్ని శ్రీశర్మగారు. ఇలాంటి తులనాత్మక చర్చ ఇంతకు పూర్వం తెలుగు విమర్శా గ్రంథాలలో చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి పరి శోధన శ్రీశేషేంద్రశర్మ వంటి మహా పండితులకే సాధ్యం. "కేవలం సామాజిక చైతన్యం తో సాహిత్యం ఉత్పన్నం కాదు. సామాజిక చైతన్యాన్ని సాహిత్య చైతన్యం గా మార్చుకొనుట ఎంతో అవసరమని గట్టిగా చెబుతుంది "కవిసేన మేనిఫెస్టో" అలాంటి శక్తి లేని ఆకవిత్వాన్ని కవిత్వంగా పరిగణించుట నిరసిస్తుంది కవిసేనలోని వాదనా పటిమ. ఆకాలంలో అనుభూతి ఆప పదంగా, పెడ ధోరణిగా పరిగణించ బడింది. ఆ సమయంలో మేనిఫెస్టో అనుభూతి అనే భావనను పునః పరిశీలించింది. కవిత్వానికి అతి ముఖ్యమైన అంశం అనుభూతి అనీ, అనుభూతి అనేది మెదడు ద్వారా, తర్కం ద్వారా కాక, ఇంద్రియాల ద్వారా ఆర్జించు కొనిన జ్ఞానం అని నొక్కి వక్కాణించింది. అనుభూతి అనేది జీవితంలో పూర్తిగా మునిగితే గాని సిద్ధించే వస్తువు కాదని ఉద్ఘాటించింది. "సచేతనంగా. సబుద్ధికంగా, సంకల్ప సహితంగా జీవితాన్ని ఆచమనం చేయటమే అనుభూతి కళగా అభ్యసించడం అంటే" అని పేర్కొన్నది. అంతేగాక, పాండిత్యం పట్ల ఉన్న వ్యతిరేకతా భావాన్ని, వ్యుత్పన్నత పట్ల ఉన్న అలక్ష్య తత్త్వాన్ని ఖండిచింది. మరియు, "కవి అన్నవాడు పుడతాడు తప్ప తయారు కాడు " అన్న నానుడిని కవిసేన మేనిఫెస్టో ఆమోదించదు. కాని, వ్యుత్పన్నత అంటే బహు విషయ పరిజ్ఞానమని స్పష్టీకరించి, జడమైన జీవితాన్ని ఉజ్వలిత అనుభవాలుగా మార్చడానికి ఆపరిజ్ఞానం అత్యంత అవసరమని వివరించింది. వ్యుత్పన్నత వలన అనుభవం సంపన్నమూ, గాఢమూ అవుతుందని చెప్పింది మేనిఫెస్టో.

మరో విశేష మేమిటంటే రొమంటిక్ ఆత్మాశ్రయ కవిత్వం అనే పదాలు నిందా వచనాలుగా భావించే వారికి ఆ పదాల అంతరార్థాన్ని వివరించి పరాశ్రయాన్ని, ఆత్మాశ్రయము చేసుకొనుట వలనే కవిత్వం పుడుతుందని చెప్పారు. Feelings అనేవి ఆత్మాశ్రయాలే నని, అవి లేనిదే కవిత్వం జనించుట కష్ట తరమని వెల్లడించారు. ఈ విషయంలో మార్క్సిష్టు సాహిత్య కారుడైన గోర్కీని ఉల్లేఖించారు.

ప్రాచీన అలంకారికులు చెప్పిన హృదయ సంవాదం, ప్రీతి మొదలగు శబ్దాలు కవిలో వస్తువు కలిగించే ఉద్వేదన, తత్ఫలితమైన నిర్మగ్నత (Reaction and involvement) లను ప్రతిపాదిస్తున్నాయి. కమిట్‌మెంట్ అనేది పైపై ప్రకటనలకు, నినాదాలకు అతీత మైనదని శేషేంద్రగారి అభిమతము. అంతేకాక, అనుభూతీ, కావ్య ప్రయోజనమూ, ప్రతిబద్ధతా ఐక్యం కావాలంటారు శేషేంద్ర.

కవిసేన మేనిఫెస్టో తో పోల్చ దగిన రచనలు తెలుగు లో అరుదుగానే కనిపిస్తాయి. అట్టివానిలో శ్రీ కట్టమంచి వారి కవిత్వ తత్వ విచారం, రాచమల్లు వారి సారస్వత వివేచనా పేర్కొన దగినవని విజ్ఞుల అభిప్రాయం. పైన పేర్కొన్న మూడు రచనల లోనూ ఆవేశం, అభిక్షేపం, శైలిలో వాడీ వేడినీ గమనించ వచ్చును. పైన ఉదహరించిన రెండు పుస్తకాలలో విస్తృత కొటేషన్లు మాత్రం కనిపించవు. అలాగే శేషేంద్ర శర్మగారి రచన ఏ సృజనాత్మక రచనను కేంద్ర బిందువుగా వాడుకొన లేదు.

అలాగే, తెలుగు సాహిత్యంలో కొత్తగా వచ్చిన అనుభూతి వాదానికి కవిసేన మేనిఫెస్టో ఒక విధమైన శాస్త్రీయ పునాది కల్పించిందంటే, ఏమాత్రం అతిశయోక్తి కానేరదు. ఈ సందర్భములో కవిసేన మేనిఫెస్టోను గురించి ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు వ్యక్త పరచిన అభిప్రాయాలను విజ్ఞులందరూ గమనించాలి.

కాలరేఖ:

ఈ పుస్తకం ఈ శతాబ్ది చింతన తులనాత్మక సాహిత్య వ్యాస సంపుటి. ఇందు శేషేంద్రశర్మగారు రచించిన దాదాపు 24 వ్యాసాలు పొందు పరచ బడ్డాయి. వీనిలో సంస్కృత సాహిత్య సంబంధమైన విమర్శ వ్యాసాలు ఎక్కువ. మహర్షి వాల్మీకిని, వ్యాసుణ్ణి, మయూరుణ్ణి, కాళిదాసుని గురించిన వ్యాసాలున్నవి. వాటిలో శేషేంద్రశర్మగారు అత్యంత నిపుణతతో వారి కవితా హృదయాలను చిత్రించారు. కథా కావ్యాల మీద, నాటకాల మీద తన వ్యతిరేకతను వ్యక్త పరుస్తూ, కాళిదాసుని మేఘదూతం రసయుగాన్ని అంతం చేసిందని, లక్షణకారుడు భామహుడు ఆ ప్రభావం వల్లనే అలంకార యుగాన్ని ప్రారంభించారని శేషేంద్రశర్మగారు అభిప్రాయ పడ్డారు. ఈ వ్యాస సంపుటిలోనే సావిత్రి అనే వ్యాసం, సూర్యశతకం పై విశ్లేషణ పరిశీలింప దగినవి. ఇందు పొందు పరచిన మిగతా వ్యాసాలు సహితం అత్యంత ప్రశంసనీయ మైనవి. కాలరేఖ అనే వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు 1994వ సంవత్సరపు జాతీయ పురస్కారానికి ఎంపికచేశారు. శేషేంద్రశర్మగారికి కవిగా కాక, విమర్శకునిగా ఈ పురస్కార ప్రదానం పండిత లోకాన్ని సంతోషంతో నిపింది. కాలరేఖ లోని విశేషాలు పాఠకుల ముందుంచడమే ఈ వ్యాసం యొక్క ప్రధానోద్దేశ్యం. ఈ వ్యాసాన్ని చదివిన పిమ్మట కాలరేఖను విజ్ఞులైన పాఠకులు తప్పక చదువుతారని ఆశిద్దాం.

కాలరేఖ లోని విశేషాలు:

ఇదివరలో పేర్కొనిన విధంగా కాలరేఖ (The Arc of Time) విమర్శనా సాహిత్యంలో ఉల్లేఖనీయమైన రచన. ఇందులోని మొదటి తొమ్మిది వ్యాసాలు శ్రీశేషేంద్రశర్మ సాహిత్య విమర్శనా ప్రతిభను, వారి కవితాశక్తిని ప్రశంసిస్తూ ఇతర రచయితలు వ్రాసినవి. వీనిలో శ్రీశర్మగారి జీవిత విశేషాలను ముఖ్యంగా వారి సాహితీ ప్రస్థానం స్థూలంగా, చర్చించ బడినది. ఇది వారి స్వీయ వ్యాసాలను చదివి అవగాహన చేసుకొనుటలో పాఠకులకు ఉపకరిస్తుంది. కాలరేఖ సంపుటిలో తొలి వ్యాసం "వాల్మీకి కవిత". ఈ వ్యాసాన్ని క్రింది కవితతో మొదలెడతారు శర్మగారు.

"నదులు కవులు భూగోళపు రక్త నాళాలు - నదులు ప్రవహిస్తాయి కవితల్లా

పసువుల కోసం పక్షుల కోసం మనుష్యుల కోసం - నదులు కంటున్న కలలు పొలాలో ఫలిస్తాయి

కవులు కంటున్న కలలు మనుష్యులలో ఫలిస్తాయి" (ఆధునిక మహాభారతము).

"మనమందరం ఈ దేశంలో కవుల కలలం. కవులకు మూల పురుషుడు వాల్మీకి. ఆయన కావ్యం రామాయణం నుంచి వ్యాసుడి భారతం పుట్టింది! రామాయణ భారతాదుల నుండి భాస కాళిదాసులు పుట్టారు. ఇది ఈదేశపు కవుల వంశ వృక్షం. ఆ వృక్ష ఛాయల్లో మనం పుట్టి పెరిగి మన పరమార్థం చేరుకుంటున్నాము".

సాధారణంగా ఉపమలకు కాళిదాసును పేర్కొంటున్నారు. కాని, "వాల్మీకి పెదవి కదిపితే చాలు చిలుక కొరికితే దానిమ్మ గింజలు రాలినట్లు రాలుతాయి ఉపమలు" అంటారు శర్మగారు. ఈ విషయాన్ని అనేక ఉదాహరణలతో అత్యంత మనోహరంగా ప్రదర్శిస్తారు పాఠకులకు. "రాముడు జలాల్లోకి దిగి ఆచమనం చేశాడు. జరిగింది ఇంత మాత్రమే. కాని వాల్మీకి యొక్క వర్ణమయ దృష్టికి ఈ సాధారణ విషయంలో ఎన్నో రమణీయతలు కనిపిస్తాయి. ... "ఉపా స్పృశత్ సుశీతేన జలేనోత్పల గంధినా" వట్టి ఆచమనం కాదు, కలువ పూల వాసనలు గుబాళించే శీతల మైన జలాలతో ఆచమనం చేశాడు అంటాడు వాల్మీకి. ... ఆ వర్ణనకు రాముడి ఆచమనం మాట అటుంచి మన నోరు లాలాజల మయం అవుతుంది!

వాల్మీకి ప్రతిభను వర్ణిస్తూ "పిపీలికాది బ్రహ్మపర్యంతమైన సృష్టిలో వాల్మీకి జ్ఞాన నేత్ర పరిధిలో రానిది ఏదీ లేదు. గుడిసె తెలుసు, మహలు తెలుసు, మద్య మాంస మహిళామయ ప్రపంచమంతా తెలుసు. ... ఋషిత్వం తెలుసు వేట తెలుసు, పాట తెలుసు, ఇది తెలుసు ఇది తెలియదు అని చెప్పడానికి వీలు లేదు. జ్ఞానం చేత ఆశ్చర్యం కలిగించే సర్వజ్ఞుడు! వాల్మీకి సౌందర్య సింధువు" అంటారు శేషేంద్రశర్మ. ...

చంద్రోదయాన్ని వర్ణిస్తున్నాడు వాల్మీకి, "ప్రజగామ సభశ్చంద్రః" (సుందరాకాండ) చంద్రుడు ఆకాశంలో ప్రవేశించాడు. అంతిటితో ఆపడు ... అదికోట్లాది కళ్ళకు కనిపించే సాధారణ దృశ్యం ... వాల్మీకికి మాత్రమే మరొకటి కనిపిస్తుంది - నీలి జలాల్లోకి హంస ప్రవేశించడం ... కవికంటికి మాత్రమే కనిపించే రెండో దృశ్యం పరోక్షం. అది మన ఎదుట లేదు. ... వాల్మీకి మాటలన్నీ ఇలాంటి మాణిక్యాలే. ఆయన నోరు కదిపితే అలంకారాలు ప్రతీకలు బింబాలు . . . చివరకు ఆ మూర్ఛావహమైన చాంద్రీ మయ నిశా శిల్పిని చంద్రుడ్ని చూచి ఋషి చేతులు జోడించి "రరాజ చంద్రో భగవాన్ శశాంకః" అంటాడు.

"రావణుడు అపహరించి లంకకు తెచ్చిన సీత రామ వియోగం సహించ లేక . . . ప్రాణత్యాగం చేద్దామనే నిర్ణయానికి వచ్చింది. అదే సమయంలో హనుమ అశోకవన ప్రవేశం . . . సీతకు ఎడమ కన్ను అదిరింది . . . "ప్రాస్పంద తైకం నయనం సుకేశ్యాః మీనా హతం పద్మ మివాభి తామ్రం". వాల్మీకి టెక్నిక్ సర్వత్రా ఒక్కటే! - సీత ఎడమ కన్ను అదిరింది, ఎలా - పూచిన తామర కొలనులో ఈదుతున్న చేప తోక తగిలి కదిలిన తామర పువ్వులా కదిలింది! కాని ఆయన పంక్తి పొడవు ఒక్క అంగుళమే, కాని దాని గర్భంలో ఉన్న చిత్రాన్ని - మన శబ్దజాలంలో చెప్పాలంటే ఇన్ని మాటలు తెచ్చు కోవాలి." ఈ విధంగా వాల్మీకి ప్రతిభను, ఉపమలను విశ్లేషిస్తూ వ్యాసాన్ని ముగిస్తారు శర్మగారు. వాల్మీకి ఘనత అద్దం లోని హిమాలయంగా మన ముందుంచారు ఈ వ్యాసం ద్వారా రచయిత!

కాలరేఖ లోని రెండో వ్యాసం కాళిదాసుని మేఘసందేశమును గురించినది. శ్రీశేషేంద్రశర్మగారి దృష్టిలో మేఘసందేశం ఒక కావ్యం కాదు! కుమారావస్థలో దానిని చదువుకున్న వాళ్ళకు అది జీవితాంతం వెంటాడే ఒక బలీయ స్మృతి! "ఏది వృద్ధుల్నీ, ప్రౌఢుల్నీ, కుమారుల్నీ బాలుర్నీ చేసి వయః ప్రవాహాన్ని వెనక్కి మళ్ళిస్తుందో, ఏది మృత్యుబోధ వైపు ప్రవహించే మనిషికి ఆనకట్ట కడుతుందో, ఆ ఆశ్చర్య జనక మైన కావ్యం మేఘసందేశం".

వాల్మీకి రామాయణంలో ఎక్కడో అరణ్యంలో ప్రచ్ఛన్నంగా పడి ఉన్న విప్రలంబ శృంగార లక్షణ యుక్తము, కరుణ రస బిందు స్పందమానము అయిన శ్లోకం -

"ఇతి వైశ్రవణో రాజా రంభాసక్తం పురానఘ! - అనుపస్థీయ మానోమాం సంకుద్ధ్రో వ్యాజహారహ"

అనేదాన్ని తీసుకొని మేఘసందేశం వ్రాశాడు మహాకవి కాళిదాసు.

పై శ్లోకమే -: "కశ్చిత్కాంతా విరహ గురుణా స్వాధికారాత్ ప్రమత్తః \ శాపేనా స్తంగమిత మహిమా వర్ష భోగ్యేణ భర్తుః

యక్షశ్చక్రే జనక తనయా స్నాన పుణ్యోద కేషు \ స్నిగ్ధ చ్ఛాయా తరుషు వసతిం రామగిర్నాశ్రమేషు"

శ్లోకంగా రూపమెత్తింది. "కాళిదాసులో ఈ దేశపు మట్టి వాసన ఘ్రాణేంద్రియాల్ని దేశవాసుల్నిగా పిలుస్తుంది! కాళిదాసు పితృపితామహమైన సారస్వతీయ సామ్రాజ్యానికి చక్రవర్తి! వ్యాసుడిలో వాల్మీకి కనిపించడు, వ్యాసుడి అంగాంగాన వాల్మీకి తేజస్సు మండలీకరిస్తున్నప్పటికీ. కాళిదాసులో మాత్రం పంక్తి పంక్తిలో కనిపిస్తుంది! కాళిదాసు శరీరంలో ప్రవహించే వాల్మీకి అంతర్లీనత . . . భారతీయ కావ్య సామ్రాజ్యంలో వాల్మీకి, వ్యాస, కాళిదాసులు సగర, దిలీప, రాఘవుల వంటి ఆదిమ చక్రవర్తులు" అంటారు శేషేంద్రశర్మగారు.

కాలరేఖలోని మరో ముఖ్య వ్యాసం "అరవింద సావిత్రి". వాల్మీకి వ్యాసులు దృశ్య వస్తువైన మానవుడి భౌతిక జీవయాత్రను గురించి కావ్యాలు రచిస్తే, అరవిందుడు ప్రధానంగా మానవుడి మరణాంతర జీవనాన్ని గూర్చి, అంటే, మానవుడి అభౌతిక జీవయాత్రను గురించి కావ్య నిర్మాణం చేశాడు. అంటే, అరవిందుల ఇతివృత్తం అదృశ్య వస్తు ప్రధానం. ఒక విషయం మనం గమనించాలి. వ్యాస వాల్మీకుల్లో అధ్యాత్మిక సంబంధమైన మిధకీయ సృష్టి కొంత ఉన్నప్పటికీ దానికంటే వారిలో ప్రధానం మానవుడు భూగోళం మీద చేసిన జీవయాత్ర. సావిత్రి వ్యాసుడి మహాభారతంలో ఉపాఖ్యానం, ఆఖ్యానం కాదు. కాని అరవిందుడు దానిని ఆఖ్యానంగా వికసింప జేశాడు. అందువలన అరవిందుని కావ్య సృష్టి అదృశ్య వస్తువుని దృశ్యమానం చేయడం అనే విచిత్ర ప్రక్రియ! ఒక విధంగా చెప్పాలంటే, వాల్మీకి, వ్యాసుల సరరన కూర్చో బెట్టగలిగిన మహావ్యక్తి అరవిందులు. అందుచేత మన దేశంలో రామాయణ, మహాభారత ఇతిహాస మహాగ్రంథాల తర్వాత మూడవ ఐతిహాసిక కావ్యం సావిత్రి, అంటారు శేషేంద్రగారు.

సావిత్రి లాంటి ప్రాచీన కథల్లో ముఖ్యమైనది స్వర్గ నరకాన్ని గురించి చేయబడిన మానవీయ ఊహ! మానవుడు ఇహలోకం లో చేసే దుష్కర్మలు ఫలరహితంగా ఉంటాయని మనిషి ఒప్పుకోలేని దశ చేరినప్పుడు జన్మించిన ఒక ప్రతీకాత్మక తత్వచింతన ఇది. 20వ శతాబ్దంలో ఇంత మహత్తర ఆధ్యాత్మిక కావ్యం మరొకటి లేకపోవడం చేత, అరవిందుని సావిత్రి కావ్యం అత్యంత విశిష్ట గ్రoథంగా పరిగణింప బడుతుంది. శేషేంద్రశర్మగారి దృష్టిలో సావిత్రి ఒక భాషకు సంబంధించినది కాదు - మూలం ఇంగ్లీషులో ఉన్నప్పటికీ, అన్ని భాషలలోకి పోయి అది ప్రజల కావ్యంగా పరిగణించ బడవచ్చును. "అరవిందులు యోగి కావడం చేత ఈ కావ్యం కావ్యతలో పరాకాష్ట పొందింది. అయోగులు, అర్థ యోగులు అయిన లౌకిక కవులు ఈ మూర్ఛా మహామాయను ఉత్పాదన చేయలేరు. సృజనాత్మక శిఖరాలైన వాల్మీకి, వ్యాస, హోమర్, వర్జిల్, దాంతే . . . మహానుభావుల్ని కావ్యమర్మ దృష్టికి గురి చేస్తే తెలుస్తుంది, వాళ్ళందరూ యోగులు, లేక భక్తులు అని. యోగి కాని కవి వాస్తవంగా లేనేలేడు".

వ్యాసుడెవరు?

"సముద్రంలో కలిసిపోయిన వాడ్నయినా పట్టుకోవచ్చు గాని కాలంలో కలిసిపోయిన వాడ్ని పట్టుకోవటం మహాకష్టం. వాల్మీకి, వ్యాసులు అలాంటి వారు" అంటారు శ్రీశేషేంద్ర వ్యాసుడు అనే వ్యాసంలో. వ్యాసుడెవరు అన్న ప్రశ్నకు జవాబు అంత సులభం కాదు. ఎందుకంటే, ఏ వ్యాసుడు అన్న ప్రశ్న కూడా దానితోనే ఉత్పన్న మౌతుంది. జయం వ్రాసిన వ్యాసుడా? భారతం వ్రాసిన వ్యాసుడా? వేదవిభజన చేసిన వ్యాసుడా? బ్రహ్మ సూత్రాలు వ్రాసిన వ్యాసుడా? పురాణాలు వ్రాసిన వ్యాసుడా? పతంజలి యోగసూత్రాలకు భాష్యం వ్రాసిన వ్యాసుడా? బృహస్పతి, నారదా, కాత్యాయనాది స్మృతికర్తల్లో ఒకడై స్మృతి వ్రాసిన వ్యాసుడా?

మహాభారత, బ్రహ్మసూత్ర, అష్టాదశ పురాణాలు వ్రాసిన వ్యాసుడు ఒక్కడే అని సంప్రదాయం. ఈ విషయమే వివాద గ్రస్థం. అయినప్పటికీ వ్యాసుడు ఒక్కడే అన్న విశ్వాసం దేశంలో బలంగానే వున్నది. వ్యాసుడు భారతీయ సాహిత్యానికి చేసిన ప్రధానం ఏమిటని మరొ ప్రశ్న. ఈ ప్రశ్నకు కూడా జవాబు క్లిష్టతర మైనదే! కవిగా, కావ్య నిర్మాతగా మహాకవి వాల్మీకిని మించిన వారు బహుశా లేరనే ఎక్కువ మంది కావ్య మీమాంసకుల అభిప్రాయము. అయితే, వాల్మీకిని అడుగడుగునా అనుసరించిన ప్రథమ కవి వ్యాసుడేనని శర్మగారి అభిప్రాయం. దీనికి ఆధారంగా మహాభారతాన్నే ఉల్లేఖిస్తారు శేషేంద్రగారు.

ఈ వ్యాసంలో అనేక విషయాలను (చాలా వరకు వ్యాస సంబంధిత మైనవి) విస్తృతంగా చర్చించారు శేషేంద్రశర్మగారు. వ్యాసుడ్ని గురించి అనేక రకాల ఆలోచనలు వెదజల్లారు. కచ్చిత మైన నిష్కర్ష తెలియ పరచ లేదు. వ్యాసుడు వ్యక్తియా? వ్యవస్థా పరంపరా అనే సంశయాన్ని అలాగే వదిలేశారు. ముగింపుగా "పురాణాల విషయం వచ్చేసరికి ప్రపంచం అంతా చర్చా పరిధి లోకి వస్తుంది. కనుక వేదాల పూర్వం నుంచి సర్వత్రా, వ్యాపించి ఉన్న పురాణాలను క్రోడీకరించి అక్షరబద్దం చేసి అష్టాదశ పురాణాలుగా విభజించి మనదేశానికి అనుగ్రహించిన ఆ వ్యాస మహర్షి ఎవరో ఆ వ్యాస సాంప్రదాయానికి నా నమస్కారము" అంటారు శేషేంద్రశర్మగారు! వివాద గ్రస్థమైన విషయానికి గల అనేక పార్శాలను చూపెట్టారు శర్మగారు పాఠకులకు ఈ వ్యాసం ద్వారా.

తులనాత్మక సాహిత్యము :

కాలరేఖ వ్యాస సంపుటిలోని ప్రముఖ వ్యాసాలలో పేర్కొనదగినది తులనాత్మక సాహిత్యమనే వ్యాసం. తులనాత్మక సాహిత్యమంటే కంపారెటివ్ లిటరేచర్ (comparative literature) అంటే ఒకటి కంటే ఎక్కువ భాషల సాహిత్యాన్ని కలిపి పోలుస్తూ పరిశీలించే సాహిత్య విమర్శ ప్రక్రియ. తులనాత్మక సాహిత్యానికి స్వతంత్ర రచనలే సామాగ్రి. ఆ రచనలు సహజ జాతములై ఉండాలి. అప్పుడే అవి తులనాత్మక సాహిత్యానికి లాభదాయక మౌతాయి. తులనాత్మక సాహిత్యంలో ప్రధానతః సిద్ధమయ్యే సత్య మేమిటంటే మనుష్యులు ఈ భూగోళంపై ఎక్కడ ఉన్నాసరే వాళ్ళ భావాత్మక సంఘటనలు సుఖ దుఃఖాలు సామాజిక స్థితి గతులు, చరిత్ర, ఇతిహాస పురాణావళీ ఇత్యాది మానవీయతా జన్య జీవన చిత్రాలు సందర్భాలు ఎన్ని భేదాలున్నప్పటికీ సాధారణతః సమానంగా ఉంటాయి. ఈ విషయాన్ని గ్రీకు, సంస్కృత, ఫ్రెంచి, ఆంగ్ల సాహిత్యాల నుండి అనేక ఉదాహరణ లిస్తూ దృఢ పరచారు శేషేంద్రశర్మగారు.

అన్య భాషా సాహిత్యాధ్యాయనం చేత మన భాషలో సాహిత్యకారుల స్థాయి ఏమిటో మనకు తెలుస్తుంది. మన అల్పిష్టి కవిని చూచి వీడే మహానుభావుడనే మూర్ఖత్వానికి లొంగే ఆవశ్యకత ఉండదు. అంతేకాదు, విజ్ఞులకు తెలుస్తుందితెలుస్తుంది ఏ ఒక్క భాషసాహిత్యమూ సమగ్రం కాదని. ఆ ప్రజల సాంప్రదాయ, సంస్కృతి, చరిత్ర, అనుభూతి ఇత్యాదుల్లో ప్రవేశించే వైకల్యాల మూలంగా అసమగ్రత సంభవించుట సహజం. ఒక్కో భాషలో, ఒక్కో సాహిత్య ప్రక్రియ ఉజ్వలంగా ఉంటుంది. జీవనానుభూతులు సహితం ఒక్కో సాహిత్యంలో ఒక్కో విధంగా సంపూర్ణతను పొందుతాయి. ఈ విషయంలో తులనాత్మక సాహిత్య వేత్త హెన్రీ జిప్ఫర్డ్ ఏమంటారో గమనించండి “Is any one literature enough to the end of providing in itself a true education? We are bound to admit that some parts of European experience hardly entered into English literature. Certain kinds of writing were better alone elsewhere”. కనుక, బహు భాషా సాహిత్యాల అధ్యాయనం ఆధునిక మానవుడికి అనివార్య కర్తవ్యం అంటారు శేషేంద్రశర్మ.

తులనాత్మక సాహిత్యం పాశ్చాత్యదేశాల్లో పరిశీలన శాస్త్ర రూపంలో ఇటీవలనే ప్రారంభ మయింది. కాని భారత దేశంలో తులనాత్మక సాహిత్యం ప్రాచీన కావ్య శాస్త్రంలో ఒక భాగంగా ఉండేదని అందులోను ప్రధమ భాగంగా పరిగణించ బడేదనీ, దండి, వామన, రాజశేఖరాదుల గ్రంథాలు చదివితే తెలుస్తుందంటారు శ్రీశర్మగారు. దీనికి కారణం సంస్కృత సాహిత్యమే ఒకే ఒక భాషకు సంబంధించిన సాహిత్యం కాదు. మన దేశంలో ఉన్న అనేక భాషల మిశ్రమ ప్రయోగం జరిగిన ఒక విచిత్ర సాహిత్యం సంస్కృత సాహిత్యం అంటారు శర్మగారు. అంతేకాదు, దండి ప్రథమ పరిచ్ఛేదంలో, మాగధ్యాది ఏడు పాకృత భాషలు అపభ్రంశ, పైశాచిక భాషలు అన్నింటినీ కలిపి, సర్గబంధ ఆఖ్యాయిక కథ నాటకాదుల కావ్య విభజన చేసిన తరువాత అంటాడు "తదేత ద్వాఙ్మయం భూయః సంస్కృతం ప్రాకృతం తథా! అపభ్రంశ మిశ్రం చేత్యాహురా ర్యాశ్చతుర్విధం ". అని కనక, సంస్కృత సాహిత్యం అనగా దేశంలో ఉన్న అన్నిభాషల మిశ్రమ సాహిత్యం అని ఆనాటి భావన! ఈ విధంగా నానా భాషా సాహిత్య సమైక్య దృష్టి ఈ దేశంలో మూలతంగా ఉండటం చేతనే అన్ని భాషల సాహిత్యాల అన్యోన్య పరిశీలన సహజంగానే సంభవించింది" అంటారు శేషేంద్రశర్మ.

మనదేశపు ఒకనాటి వలస రాజ్య స్థితి మూలంగా మనకు సంక్రమించిన సాహిత్య సంస్కృతిచేత మనం ఆంగ్ల భాష గవాక్షం ద్వారా ఆధునిక సాహిత్యాన్ని మూలంగా చూడటంలో ఒక సౌలభ్యం ఉంది. అది ఇలాంటి సందర్భాలలో లాభదాయకం. ప్రపంచ భాషల్లోని (గణనీయమైన) సాహిత్యం ఆంగ్ల భాషలోనికి అనువదించ బడుతుంది కనుక ఆంగ్ల విద్య మనకు లాభసాటి.

మరొక ముఖ్య విషయ మేమిటనగా, ఆధునిక ప్రపంచానికి తులనాత్మక సాహిత్యం అనివార్యం. హింసా పీడితమైన వర్తమాన ప్రపంచానికి తులనాత్మక సాహిత్యం ఒక విధమైన మతం. ఆధునిక మానవుడు అన్ని మతాలు విడిచి, ఈ సాహిత్య మతాన్ని స్వీకరించి ప్రజల్లో విశ్వవిద్యాలయాల్లో ప్రచారం చేయాలి. ఒక విధమైన నూతన అంతర్జాతీయ సాహిత్య చైతన్యాన్ని ఉత్పన్నం చేయాలి అని అంటారు శేషేంద్రశర్మ. అంతేకాదు, నానా భాషల్లో ఖైదీలుగా పడివున్న సాహిత్యాల్ని ఆభాషా జైళ్ళు బద్దలు కొట్టి విడుదల చేయ్యాలి. దానికి ముఖ్యమార్గం అనువాదం, అని వక్కాణిస్తారు శర్మగారు. ఈ ప్రక్రియ ఐరోపాలో భారీ ఏత్తున జరుగుతున్న విషయమని విశద పరచారు శేషేంద్రగారు. ఐరోపా ఒక ఐక్య బౌద్ధిక సమితిగా మారుటకు అదే ముఖ్య కారణమంటారు వారు. నేషనల్ బుక్ ట్రష్టు వంటి సంస్థలు ఈ విషయంలొ ఉల్లేఖనీయమైన సేవ చేయు చున్నారని శర్మ గారి నమ్మకం. అనువాద ప్రక్రియమీద ఈనాడు ఇండియాలో ఉన్న అపనమ్మకం అత్యంత గర్హనీయ మంటారు శేషేంద్రగారు.

సాహిత్యం ఎక్కడ ఉన్నా అది మనదే! సాహిత్యము ఏకము, అవిభాజ్యము. కళ విశ్వజనీనము, సృజనాత్మక కళ అయిన సాహిత్యం ఏభాషలో కైనా ప్రవేశించ గలదు. ఆ భాష ప్రజల సంపదగా ప్రతిష్ఠ కాగలదని గట్టిగా వాదిస్తారు శేషేంద్ర్శర్మగారు ఈ వ్యాసం ద్వారా! అలాగే ప్రాచీన గ్రీకు, భారతీయ నాటకాల తులనాత్మక పరిశీలన వివరాలను విశ్లేషించారు శర్మగారు మరో వ్యాసంలో. పాఠకులందరు చదువదగిన వ్యాసం ఇది.

కాలరేఖ సంపుటిలో సంకలితమైన మరో ముఖ్య రచన ఇద్దరు ఋషులు ఒక కవి అన్న వ్యాసం. ఇందు ఉల్లేఖించ బడిన ఇద్దరు ఋషులు - ఒకరు వాల్మీకి మహర్షి, రెండవ వారు వ్యాస భగవానులు. రామాయణంలో కనిపించే భారతీయ సంస్కృతిని విస్తృత పరుస్తూ వ్యాస మహర్షి వాల్మీకి అడుగు జాడల్లో పయనిస్తూ, కావ్య తంత్రాన్ని, కావ్య వస్తువును, నిర్మాణ సామాగ్రిని, భాషను తన కావ్య సృజనా ప్రక్రియకు వాడుకొన్నారు అనే భావన వ్యక్త పరచారు శ్రీశర్మగారు. అదే విధంగా వ్యాస మహర్షిని అనుసరించాడు మహాకవి కాళిదాసు. ఈ విషయాన్ని సృష్టీకరించారు వారు. వాల్మీకి వ్యాస మహర్షులు దేశానికి వారసత్వంగా యిచ్చి పోయిన సాహిత్య సంస్కృతికి కాళిదాసు చివరి కాపలాదారు, అంటారు శేషేంద్రశర్మగారు. కాళిదాసు తదనంతరం, ప్రవాహమాన భాషగా ఉన్న సంస్కృతం జడత్వం పొందుట, ఆ భాషలో కృత్రిమత్వం, నిరర్థకత, పాండిత్య ప్రకర్ష ప్రవేశించడం కారణాన, సంస్కృత సాహిత్య వాహిని ఒక పిల్ల కాలువగా మారి, చివరకు బిందు బిందువుగా కారే బలహీన ధారగా మిగిలి పోయింది. అని ఆందోళన వ్యక్త పరుస్తారు శర్మగారు. ఉత్తర రామచరితము, మృచ్ఛకటికము, కర్పూర మంజరి, లాoటి కాళిదాసానంతర కాలపు కృతులను నిర్లక్ష్యం చేయలేము కాని, ఆ కాలపు దోషాలు ఆ కావ్యాలలో లేవని చెప్పలేము. ఒక విధంగా చెప్పాలంటే, కాళిదాసు తర్వాత మరి అలాంటి కవులు జన్మించ లేదంటే, అది అతిశయోక్తి మాత్రం కాదు. కాళిదాసుపై ప్రసిద్ధ వ్యక్తులు చాలామంది కృషి చేసి, అనేక విశేషాలు వెల్లడించారు. అయినప్పటికీ వారి దృష్టి కందని విశేషాలు వెల్లడించారు శేషేంద్రశర్మగారు.





ముఖ్య విశేషాలు :

శేషేంద్రశర్మగారి ఉద్దేశ్యంలో కాళిదాసు మూలస్థానాలు ప్రత్యక్షం కాకపోతే, కాళిదాసీయ కళ, దాని పాత్ర ఔచిత్యం అర్థం కాదు. అలాంటి సమగ్ర అవగాహన ఒక క్లిష్ట సాహస యాత్ర! అది నిర్వహించడానికి వాల్మీకి పాత్రను సరైన దృక్కోణం నుంచి అర్థం చేసుకోవాలి.

వాల్మీకి ఇతిహాసం స్వయం కల్పిత బాధ్యతల మూలంగా అంతకు ముందు కాలం లో లేని అభివ్యక్తులని సృష్టించి దానితో శ్రోతలని ఆశ్చర్య పూర్వక ఆహ్లాదంతో ముంచి వేసింది. ప్రకృతి, నదీ నదాల వర్ణనలు, అభివ్యక్తులు అందరి కవుల చేత ఆయా సందర్భాలలో వాడుకో బడ్డాయి.

వ్యాస మహర్షి కథన కళా విధానంలో వాల్మీకిని అనుసరించారు. వాల్మీకిని అనుసరించిన మొట్ట మొదటి కవి వ్యాసుడే! తరువాతనే కాళిదాసు ఆయన అడుగుజాడల్ని అనుసరించి వాల్మీకి వారసత్వాన్ని నిష్ఠతొ నిర్వహించాడు. వాల్మీకి ఉపదేశించిన ముఖ్యమైన మానవ విలువలలో రాజు, ఋషి మూలతః సమానులు అనేది, ఒకటి. అంటే, ప్రభుత్వానికి బుద్ధి జీవులకు మధ్య ఉండవలసిన సంబంధం. ఈ మానవీయ విలువల్ని వ్యాసుడు, కాళిదాసు సందర్భం వచ్చి నప్పుడల్లా సమగ్రంగా పాటించారు. ఉదాహరణకి రామాయణంలో రాజు ఋషి ముందు వినమ్రుడుగా ఉంటాడు. ఋషి కూడా రాజుకు తన కంటే ఉన్నత స్థానమిస్తాడు. ఈ విషయాన్ని దృధ పరచడానికి శేషేంద్రశర్మగారు రామాయణం నుండి అనేక సందర్భాలు సూచిస్తారు. అలాగే వ్యాసుడిని గురించి కూడా అనేక సందర్భాలు వివరిస్తారు. అదే విధంగా కాళిదాసు విషయంలో అనేక ఉదాహరణలు పొందు పరచారు శర్మగారు. కాళిదాస కృతి మేఘదూతం భారతీయ సాహిత్యంలో ఒక బ్రహ్మాండ మైన మలుపుగా అభివర్ణించారు వారు. మేఘదూతం మూలంగా భారతీయ సాహిత్యంలో ఒక గొప్ప యుగ కర్తృక సంఘటన జరిగింది అంటారు శేషేంద్ర గారు. ఈ వ్యాసం ద్వారా భారతీయ కావ్యశాస్త్రం మీద మేఘదూతం చూపిన ప్రభావాన్ని విశదీకరించ ప్రయత్నించారు శర్మగారు. ఈ విషయమై మర్మజ్ఞులైన కావ్య వేత్తలు పరిశీలిస్తారని ఆశిద్దాం!

శేషేంద్రశర్మగారు కాలరేఖ వ్యాస సంపుటిలో పొందు పరచిన వ్యాసము లన్నియు వివరింప దగినవే! దేనికది నూతన ఆలోచనలు పాఠకునిలో ప్రేరేపిస్తుంది. సరికొత్త వ్యాఖ్యా విధానాన్ని సృజిస్తుంది. ఉదాహరణకు "శాకుంతల నాందీ శ్లోకము దేవీస్తోత్రమే" అన్న దాన్ని గురించిన వ్యాఖ్యను పరిశీలిద్దాం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన "అభిజ్ఞాన శాకుంతలమున గల నాందీ శ్లోకమును ఇంత వరకు కేవలము ఈశ్వర స్తోత్రముగానే భావించు చున్నారు. దానిలో మంత్ర శాస్త్రార్థ ప్రతీతి గలదన్న సత్యాన్ని శేషేంద్రగారు వెలికి తెచ్చారు.

యా సృష్టి స్స్రష్టురాద్యా, వహతి విధిహుతం యా హవిర్యా చహోత్రీ,

యే ద్వే కాలం విధత్తః శ్రుతి విషయాగణా యా స్థితా వ్యాప్య విశ్వం,

యా మాహుః సర్వభూతప్రకృతి రితి, యయా ప్రాణినః ప్రాణవంతః,

ప్రత్యాక్షాభిః ప్రపన్నస్తనుభి రవతు వ స్తా భి రష్టాభి రీశః.

ఈ శ్లోకానికి మామూలుగా చెప్పబడుతున్న అర్థం - అష్ట తనువుల చేత ప్రసన్నుడై ఈశుడు మిమ్ములను రక్షించుగాక. శాకుంతల శ్లోకము ఒక కవియొక్క సాధారణమగు ఒక ఊహపై గాక శాస్త్ర సిద్ధాంతము పై నాధార పడియున్నది. అది తెలిసినచో ఈ శ్లోక మేట్లుద్భవించినదో తెలియ గలదు. 1) పంచ భూతాద్యష్టతన్వాకమగు సృష్టి, సమాహారమున శక్తియే అనియును, 2) శక్తి శివుని తనువనియును, 3) శివ శక్తులు అభిన్నములు లింగ రహితములనియును, 4) అట్టి శక్తి అభేదము చేత అష్టమూర్తి మత్వాది సర్వ శివ లక్షణములు కలిగి యున్నదనియును నిగమాగములు సిద్ధాంతము చేసినవి.

నిగమాగములకు పరమార్థమైయున్న ఈశాస్త్ర విషయమునే మన శ్లోకము చెప్పుచున్నది. అందును ప్రథమాంశమైన శక్తి యొక్క సర్వకర్త్రిత్వమును ప్రతిపాదించుటయే దేవీ ఉపాసకుడగు కాళిదాసుని యొక్క ఆశయము. అందుచేత ఈ విషయము జగత్ప్రసిద్ధమగు నాటకముయొక్క నాందీ శ్లోకమునకు వస్తువుగా గైకొనెను. ఈ శ్లోకములో శాస్త్రవేత్తయగు మహాకవి కాళిదాసు మూడు విషయాలను ప్రతిపాదించాడు: 1) పరాశక్తి సర్వకర్త్రి : అందుచేత శ్లోకమంతయు శక్తి పరముగా అన్వయమగును. అప్పుడు ఆది పూర్వక విశేషము లన్నియు శాస్త్రోక్త వివిధ శక్తి లక్షణములను ధ్వనింప జేయును. ఈశః శబ్దము ప్రతిబింబ మాత్ర తత్వము చేత శక్తినే ప్రతిపాదించు నట్టి శాస్త్రము ఇందు నిక్షిప్త మైనది. 2) పరాశక్తి శివుని తనువు అని : ఈ పక్షమున యాదిపూర్వవిశేషణములు అష్టమూర్తులను వ్యష్టిగా ప్రతిపాదించి, ఆది సర్వనామముల చేతను తను శబ్దము చేతను సమిష్టిగా శక్తిని ధ్వనింపజేసి అట్టి శక్తి చేత ప్రసన్నుడైన శివుడు అని అన్వయము నిచ్చును. అనగా అట్టి తనువు లేనిచో శివుడు కార్య సమర్థుడు గాడనియు, 3) శివశక్తులు అభిన్నములనియును, కనుక అష్టమూర్తి యగు శివుడు మిమ్ములను రక్షించుగాక అను సామాన్యార్థమునకు అన్వయమగును.

ఇలాంటి శ్లోకమున శబ్దములు యాదృచ్ఛికముగా ఆశుకవిత్వమల్లే దొర్లినవికావు. భావము ఏదో ఒక "మానుషానంద" దృష్టితో గైకొన్నదికాదు, భావము బ్రహ్మానంద బంధురము, భాషాశ్రౌత లక్షణసంపన్నము. దీనిని మహాకవి కాళిదాసు పరమార్థ స్పృహతో శబ్ద సామాగ్రిని, భావప్రపాదానా పద్ధతిని, భాషా మర్యాదను శాస్త్ర సాంప్రదాయం నుండి గైకొని ఈ విధంగా రూపొందించాడు.

సంస్కృత సాహిత్యంలో అత్యంత ఖ్యాతి నార్జించిన పుస్తకం మయూరిని సూర్యశతకము. ఈ పుస్తకము అనేకమంది విద్వాంసుల దృష్టి నాకర్షించింది. సూర్యశతకానికి వ్యాఖ్యానాలు హెచ్చు సంఖ్యలోనే ఉన్నాయి. ఈ శతకానికి తెలుగు సేతలు దాదాపు ఎనిమిది వరకు ఉన్నాయి. వానిలో మహాకవి శ్రీ దాసుశ్రీరాములుగారి అనువాదం ప్రసిద్ధి గాంచింది. కవి సౌర్వభౌమ శ్రీనాధమహాకవి, జగన్నాధపండితరాయల వంటి వారిని యెంతో ఆకర్షించిన గ్రంథం సూర్యశతకము. దీనిలో కొన్ని పద్యాలు పింగళిలక్ష్మీకాంతం వంటి విద్వాంసులు తెలుగు చేశారు. ఈ పుస్తకం శేషేంద్రశర్మ లాంటి విద్వత్త్కవులను ఆకర్షించుటలో ఆశ్ఛర్య మేమిలేదు! "వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అనే గనుల్నుంచి త్రవ్వితీసిన మణులతో చెక్కిన మహత్తర శిల్పం సూర్యశతకం" అంటారు శేషేంద్రశర్మగారు. సూర్యశతకములోని విశేషాలను కొన్ని ఎత్తిచూపించారు పాఠకులకు. "సూర్యశతకము - ఒక అధ్యయనము" అను వ్యాసం ద్వారా. ఈ శతకంలో అక్కడక్కడా దర్శనమిచ్చే కాళిదాసమహాకవి ప్రభావాన్ని మనకు ఎత్తి చూపారు శేషేంద్రగారు.

విప్లవ కవిత్వము - సాహిత్య విమర్శ అనే వ్యాసంలో వ్యక్త పరచిన అభిప్రాయాల లోని సారాంశాన్ని పాఠకులీ విధంగా గ్రహింప వచ్చు. సాహిత్య విమర్శ కేవలం సాహిత్యాన్ని గురించి మాత్రమే కాని సాహిత్య కర్తను గూర్చి కాదు. విమర్శించే కావ్యంలో విమర్శకుడు మూడు విషయాలు పరిశీలించాలి. అవి : భాషా, అలంకారము, వస్తువు. వస్తువు అంటే కవి చెప్పదలచినది. కవి చెప్పే విషయ మేదైతే ఉందో, దేన్ని వస్తువంటున్నామో అదే అలంకారంగా మారుతుంది. దీనినే కావ్య మర్మ మంటారు. వస్తువు కావ్యానికి రంగు నిస్తుంది. విప్లవాత్మక వస్తువు తీసుకుంటే విప్లవ కావ్యం రూపొందుతుంది. కవికి కావ్యానికి చెందిన విశేషణాల్ని తగిలించడం శాస్త్రీయం కాదు. విప్లవ కవిత్వం వ్రాయటానికి షరతులు పాలించాల్సిన అవసరం లెదు. కవిత్వ మనేది రెండు విధాలుగా ఉత్పన్న మౌతుంది - స్వానుభూతిచేత, సహానుభూతిచేత. ఒక్కోసారి సహానుభూతే, అనుభూతి కంటే తీవ్రంగా సిద్ధిస్తుంది. నిత్య జీవనంలో అన్యాయం మీద చేసే తిరుగుబాట్లే అసలు విప్లవం! అన్యాయాన్ని, అసమానతను ఎదుర్కొనే చైతన్యం వలన పుట్టిన కవితయే నిజ మైన విప్లవ కవిత్వం. సాహిత్య విమర్శకుడి పాత్ర స్వప్రయోజనా పేక్ష విసర్జించి విప్లవ కావ్యాన్ని నిర్ధ్వంద్వంగా ప్రోత్సహించడం. సాహిత్య విలువలమీదా, సాహిత్య సూత్రాలమీద ఆధార పడి విమర్శ వ్రాయాలంటారు శేషేంద్రశర్మ.

గ్రీకు, భారతీయ నాటకాలలోని సామ్య వైషమ్యాలని తెలిపే వ్యాసం, గజల్ కవిత్వాన్ని గురించిన విశ్లేషణాత్మక వ్యాసాలు శెషేంద్రశర్మగారి పాండిత్య విస్తృతికి నిదర్శనలుగా పేర్కొన వచ్చును. తెలుగు కవుల గూర్చి వారు వ్యక్త పరచిన విశేషాలు పాఠకులు తెలుసుకొన దగినవి. తెలుగు కవులలో తిరుపతి వెంకటకవులు, గురజాడ అప్పారావు, పానుగంటి లక్ష్మీనరసింహారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహారావు, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, రాయప్రోలు సుబ్బారావు గార్లను గురించి విశ్లేషణాత్మక వ్యాసాలు వ్రాశారు.

ఈ వ్యాసాల్లో గమనించదగ్గ విశేషమేమిటంటే రాయప్రోలు సుబ్బారావుగారు తప్పక, మిగిలిన కవులు తమతమ నాటకముల ద్వారా, ఉద్యోగ విజయాల ద్వారా తిరుపతి వెంకటకవులు, పాదుకా పట్టాభిషేకం, గయోపాఖ్యానాల ద్వారా పానుగంటి, చిలకమర్తి వారు, అనేక నాటకాల ద్వారా ధర్మవరం రామకృష్ణాచార్యులు, కన్యాశుల్కం ద్వారా గురజాడ అప్పారావు గారు, ఆంధ్రదేశ మంతటా మారుమూల గ్రామాలలో సహితం పేరు ప్రఖ్యాతులు గడించారు. తిరుపతి వేంకటకవులు తమ అష్టావధాన, శతావధానముల ద్వారా రాజస్థానములలో సహితం అత్యంత ప్రఖ్యాతి గడించారు. వారిని గూర్చి " సాహిత్య రాజసూయంచేసిన దుర్ధర్ష ప్రతిభా దురంధరులు . . . వారి అపూర్వ కవితా శక్తి ముందు ఎవరూ నిలవలేక పోయారు. వారి పాండవ ఉద్యోగ విజయాల్లోని పద్యాలు ఒకటి రెండన్నా కంఠతా రాని తెలుగు వాడు లేడంటే అది అతిశయోక్తి కాదు" అంటారు శర్మగారు.

రాయప్రోలు సుబ్బారావుగారు కవిత్వంలో ఒక నూతన పద్ధతిని ప్రవేశ పెట్టారు. దానినే ఆ రోజుల్లో భావ కవిత్వంగా పేర్కొన్నారు. శేషేంద్రశర్మగారి దృష్టిలో రాయప్రోలు వారి కవిత్వంలో కీలకం వ్రక్రోక్తి. వాచ్యార్థం ఏక్కడా కనిపించదు. రాయప్రోలు వక్రోక్తి ఆత్మ కళ. ఒక కృత్రిమ కల్పన కాదు. "అమృతాం ఆత్మనః కళాం" అన్న భవభూతి మాటకు రాయప్రోలువారు రక్తమాంసాకృతి. రాయప్రోలు కవిత్వాన్ని గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే - ఆయన పద్యాలే మంత్రాలుగా జపించుకొంటూ వాటి మద్య మాధురిలో మునిగిపోయి, మళ్ళీ పునర్జన్మ లేనట్లుగా మనిషి తరించి పోవచ్చు" అంటారు శ్రీ శేషేంద్ర .

ముగింపు :

శ్రీశేషేంద్రశర్మగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ వ్యాసంలో చర్చించిన విషయాలన్నీ ఆ విషయన్ని దృఢ పరుస్తాయి. శర్మగారి ప్రతిభా విశేషాలు చర్చించేటప్పుడు మనం వారిని గూర్చిన కొన్ని అంశాలను విశేషంగా పేర్కొనక తప్పదు. శేషేంద్రశర్మగారికి సంస్కృత భాషా సాహిత్యలలో గల పాండిత్యం అసాధారణం. ముఖ్యంగా వారు మంత్ర తంత్ర శాస్త్రాలలో ఆర్జించిన జ్ఞానం అనితర సాధ్యమంటే, అది సత్య విదూరము కాదు. సమకాలీన ప్రపంచ సాహిత్య రీతులను గూర్చి శర్మగారి అవగాహన అత్యంత విస్తృత మైనది. తెలుగు భాషా సాహిత్యాల పైనేగాక శర్మగారు ఆంగ్లభాషా సాహిత్యాదులలో, హిందీ - ఉర్దూ భాషా సాహిత్యాలలో ఆర్జించిన జ్ఞానం శ్లాఘనీయం. శర్మగారి కవిత్వ తత్వం పేర్కొన దగినది. కవిత్వానికి వస్తు స్వరూపాన్ని బట్టి రూపం, రూపాన్ని అనుసరించి స్వభావం ఉంటుందని వారి నమ్మకం. అదే కవిత్వమని శేషేంద్ర ప్రకటించారు. అయితే శర్మగారు మనిషి తత్వాన్ని కవిత్వతత్వంగా మలచిన మహాకవి. దేశ పౌరుని ఆత్మ కథే ఆదేశ చరిత్ర అవుతుందని నిరూపించడానికే వారు ఆధునిక మహాభారతం వ్రాశారు. శర్మగారు శబ్దశక్తి తెలిసిన అలంకారికుడు. అందుకే "నేను శబ్దాల అణువులతో పద్యాలు చేస్తా, ఇసుక రేణువులతో చేసిన గ్లాసుల్లా మధుర ధ్వనులు పలికిస్తా" నంటారు శేషేంద్ర. రచనలో రస నిష్పన్నతలొ ప్రగతిని సాధించారు. శబ్దసౌందర్యముతోపాటు వాగార్థాలకు సన్వయాన్ని సాధించారు. శబ్దశక్తిని పూర్తిగా గ్రహించిన వారగుటచే శర్మగారు కవితా ప్రక్రియ లన్నిటినీ పద్యాలుగానే పేర్కొన్నారు. శేషేంద్రశర్మగారిలో మనం ఒక విధమైన దార్శనికత్వం పసికట్ట వచ్చు. ఆయనకు Modernity మీద ఒక గొప్ప విజన్ ఉంది. ఆయన రచించిన ఆధునిక మహాభారతం ఈ విషయాన్ని రూఢి చేస్తుంది. ఉపదేశాల వలన, ప్రబోధాల వల్ల సాహిత్యానికి ఎలాంటి మేలు జరుగదు అని ఆయన గట్టి నమ్మకం. అందుకే శర్మగారు నూతన కవితా ప్రక్రియా ప్రయోగానికి పూను కొన్నారు. వచన కవితా వాహికని ఉపయోగించి కావ్యాన్ని సృజించారు. ఆధునిక మహాభారత మనే కావ్యేతిహాసం మనలని మరోశకం ముందుకు నడిపించింది.

వారి రచనలు - స్వర్ణహంస, సాహిత్య కౌముది, షోడశి, కవిసేన మేనిఫెస్టో, కాలరేఖ విమర్శా సాహిత్యంలో కొత్త పంథాలను సృజించాయి. శేషేంద్రశర్మగారి సాహిత్య మీమాంస శక్తిని, పాండిత్య లోతుపాతులను పుటపర్తి నారాయణాచార్య, విశ్వనాథ సత్యనారాయణ లాంటి ఉద్దండులతో పాటు ఆంవత్స సోమసుందర్ లాంటి ఆధునికులు ప్రశంసించారు. శేషేంద్రశర్మగారిని 21వ శతాబ్దిలోని గొప్ప సాహిత్య వేత్తగా చిత్రించుట సమంజసమని ఈ వ్యాస రచయిత అభిప్రాయము. ఈ వివరణాత్మక వ్యాసం తయారు చేయుటలో శర్మగారి రచనలే కాక, అనేకమంది ఇతర రచయితల రచనలు చదువుటయేగాక, ఆయా రచయితల భావ సంపదను స్వేచ్ఛగా ఉపయోగించు కొన్నాను. ఆయా రచయిత లందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు ఇందుమూలంగా తెలియజేయడమైనది. ఈ వ్యాసం పాఠకుల అభిమానాన్ని చూరగొంటుందని ఆశిస్తాను.

Agamagiti (ఆగమగీతి)

ప్రస్తావన:

రెండవ ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతున్న రోజులవి. ప్రపంచ యుద్ధం, పారిశ్రామిక విప్లవ ప్రభావానికి దాదాపు అన్ని దేశాలు కొద్దో, గొప్పో, లోనయ్యాయి. సాంఘిక విలువలు మార జొచ్చాయి. చుట్టూ యుద్ధ వాతావరణం, లోపల అసంతృప్తితో పడగ విప్పుతున్న తుఫాను యువక వర్గాన్ని అస్థిమిత పరిచి తీవ్ర అశాంతికి దారి తీశాయి. ఆ తరుణంలో ప్రవేశించాడు బైరాగి సాహిత్య రంగం లోనికి, యువకునిగా!

బైరాగి జననం 03-09-1925న ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జరిగింది. ఆయన తల్లి తండ్రులు ఆలూరి వెంకట్రాయుడు, శ్రీమతి సరస్వతీ దంపతులు. బైరాగి అనేది కలం పేరుగా అనేకమంది అపోహ పడవచ్చు. కాని, అది ఆయన తల్లి తండ్రులు పెట్టుకొనిన అసలు పేరు. వెంకట్రాయుడు దంపతులు చక్కగా చదువు కొనిన సంస్కారవంతులు. జాతీయ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనుటయే కాక, హిందీ భాషాధ్యాయనం వైపు అశేష కృషి చేసి, ఆ భాషలో ప్రావీణ్యం సంపాదించారు.

యువకుడైన బైరాగి మీద తల్లి తండ్రుల ప్రభావం ఎక్కువగానే ప్రస్ఫుటించింది. తెలుగు ప్రాథమిక విద్యతో బాటు, హిందీ భాషాధ్యయనం బైరాగిని ఆకర్షించింది. హిందీ భాషపై గట్టి పట్టు సాధించే నిమిత్తం, చిన్న వయసులోనే బైరాగి బీహారుకి వెళ్ళారు. అచ్చట నాలుగైదు సంవత్సరములు కృషిచేసి హిందీ భాషను క్షుణ్ణంగా నేర్చు కొన్నారు. హిందీతోపాటు బైరాగి ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో విశేష ఆధిపత్యాన్ని గడించారు. సాహితి పిపాసను పెంపొందించు కొని, మూడు భాషల్లోను సమగ్ర సాహిత్య వేత్తగా రూపొందారు. సృజనాత్మక రచనలు (ముఖ్యంగా కవితలు) ప్రారంభించారు.

తను ఆర్జించిన హిందీ పరిజ్ఞానం పెక్కుమందికి పంచి పెట్టే ఉద్దేశంతో పత్తిపాడు బోర్డు హైస్కూల్లో హిందీ పండితునిగా అధ్యాపక వృత్తిని స్వీకరించారు. కాని, ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగ లేదు. తర్వాత చందమామ (మాసపత్రిక) హిందీ విభాగానికి సంపాదకునిగా కొంత కాలం పనిచేశారు. చిన్న పిల్లల కోసం గేయాలు, కథలు రచించారు. చందమామ సంపాదకునిగా పనిచేసే కాలం లోనే, "పలాయన్" అనే హిందీ కవితా సంకలనం ప్రచురించారు. ఆ సమయం లోనే తెలుగు స్వతంత్ర పత్రికలో బైరాగి కవితలు విరివిగా ప్రచురిత మయ్యేవి.

స్వేచ్ఛా జీవి కావడం మూలాన, చందమామ లో చేసే ఉద్యోగంలో ఇమడలేక పోయారు. ఆ తర్వాత కాలంలో దక్షిణ భారత హిందీ ప్రచార సభలో అధ్యాపకునిగా పని చేశారు. ఆ చిర కాలం లోనే, దానికి సహితం తిలోదకాలివ్వడం జరిగింది! బైరాగి గారు ఏకాంత ప్రియులు, ఒంటరి జీవి, ఎక్కువగా ఎవరితోనూ కలిసేవారు కారు. తల్లి గారి ఆకస్మిక మరణం ఆయనపై అత్యంత ప్రభావాన్ని చూపించింది. కొంత వరకు బైరాగి సంఘానికి అంటీ అంటనట్లుండె ప్రవృత్తికి కారణం ఆయన తల్లి మరణమే నేమో?!

బైరాగి తొలి తెలుగు కవితా సంపుటి "చీకటి నీడలు", రెండవ సంపుటి "నూతిలో గొంతుకలు" 1955వ సంవత్సరంలో ప్రచురిత మైనది. అటు తర్వాత బైరాగి గారు తన రచనలను ప్రచురణకు పంపటమే మానివేసి నారు. ఆయన మరణానంతరం (1978 తర్వాత) లభ్యమైన ఆయన రచనలు "ఆగమగీతి" అను పేరుతో మిలింద్ ప్రకాశన్ వారు ప్రచురించారు. బైరాగి జీవన కాలం లోనే ఆయన కథా సంకలనం "దివ్య భవనం" అచ్చైంది.

కవిగా బైరాగి:

పరిసర వాతావరణం నుండి రవంత తొలిగి నిలిచి, లోకాన్ని ఆత్మీయతతో, జాలితో, ఆవేశంతో చూడగలిగిన కవితాత్మ బైరాగి (వైరాగి)ది. సాటి మనిషి కష్టాలను పంచుకో లేక పోయినా, సొంతం చేసుకొని, వాటికి తన కవితలలో విశ్వజనీనత కలిగించడం బైరాగి సొత్తు. ఏ "ఇజానికి" చెందిన పడికట్టు పదాలు (Jargon) ఆయన కవితలలో మనకు కనిపించవు. పదాలకు, అర్థానికి అందని గూఢ భావాలు (అర్థాలు) సంతరించగల కవితా శక్తి, బైరాగికి స్వంతం. "అర్థమైన దాని కన్నా అధికంగా స్ఫురించేది, చేతలకు చెంద రానిది, మాటలకు అందరానిది కవిత్వం" అనేది ఆయన స్వయంగా ప్రతి పాదించిన కవిత్వ నిర్వచనంగా మనం భావించాలి!

బైరాగిది స్వయం వ్యక్తిత్వం. ఏ ఉద్యమాన్ని, సంస్థనూ ఊతగా చేతగొని పైకి రాలేదు - ఆయన! అనుసరణలు, అనుకరణలు ఆయనకు నచ్చవు. అందుకే "బైరాగి కేటాయింపయిన కవి వ్యక్తి" అంటారు కె.వి.రమణారెడ్డి. "ఉపనిషత్తులోని మహా కావ్యాలను కావ్యాలలో పొదిగి, వర్తమాన కాలం లోని మానవుని పరిస్థితిని వాఖ్యానించేటందుకు సాధనాలుగా చేసుకోవడం, తన భావాలను తగిలించే చిలక కొయ్యలుగా వాడుకోవడం, ఒక కొత్త తరహా ప్రక్రియ, ఈ ప్రక్రియను బైరాగి పూర్తిగా వాడుకున్నాడు". సాహిత్యాది కళలకు, సామాజిక జీవనానికి పూర్తి ఎడబాటు కలిగి నప్పుడు, రచయితలు, మేధావులు తమ చర్మాల లోపలికి దూరి, తమతనానికి బందీ లై పోవడం పరిపాటే! ఎజ్రాపౌండ్ లాంటి మేధావులు ఈ పరిస్థితికి లోనైన వారే!

"బైరాగి కవితలలో నైరాశ్యం, నిస్ఫ్రుహ ముఖ్యమైన ఆవేశాలు. అయితే, బైరాగి నైరాశ్యం మనసును క్రిందికి దిగలాగేది కాదు. అంతరాత్మను ఉర్రూత లూగించే ప్రభంజనం లాంటిది" అని అభిప్రాయ పడ్డారు శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారు. బైరాగి, జీవితంలో తానూహించిన మార్పునంతటినీ ఒక పెను తుఫానుగా భావించాడు! అందుకే, "ఆగబోదు ఈ తుఫాను మీ మేడలు మునుగు వరకు, మీ కోటలు కూలు వరకు" . . . అంటూ ప్రళయ కాలోగ్రుడైన పరశురాముని వలె విజృంభించి కవితా ఘోషణ చేశాడు!

"కవిగా గాని, వ్యక్తిగా కాని, బైరాగిని అర్థం చేసుకొనుట సులభం కాదు. ఎందుకంటే కవిగా ఒక బైరాగి, వ్యక్తిగా ఒక బైరాగి - ఇద్దరు బైరాగులు లేకపోవడం ఇందుకు కారణ మేమో?" అంటారు నార్ల. నార్ల వారి అభిప్రాయానుసారం, "కవిత జీవితాన్ని ప్రతిబింబించాలి; జీవితం అందాలను అది చూపించాలి; జీవితం అర్థాలను వివరించాలి, జీవిత ధ్యేయాలని అది నిర్దేశించాలి. జీవితంతో సన్నిహిత సంబంధం లేనిది కవిత కాదు. అయితే కవితే జీవితం కాదు; ఇదే విధంగా జీవితమే కవిత కాదు. కవితకు, జీవితానికి మధ్యగల సరిహద్దును బైరాగి గుర్తించ లేదు. ఒక వేళ గుర్తించి ఉంటే, దాన్ని చెరిపి వేయడానికి ప్రయత్నించాడు. ఇది చేయరాని ప్రయత్నం. ఇటు కవితకు, అటు జీవితానికి కూడా ఫుల్‌స్టాప్ పెట్టగల ప్రయత్నం" . . . కవితకు జీవితానికి మధ్య అంతరం ఎల్లప్పుడు ఉంటుంది. గొప్ప కవులనే వారు దీనిని తప్పక గుర్తిస్తారు. ఈ సూక్ష్మ విషయాన్ని గుర్తించ లేనటువంటి అవజ్ఞుడు కాడు బైరాగి. అయినా అంగాంగంలో, అణువణువునా, కవిగా తప్ప ఊపిరి పీల్చుకొనుట ఆయనకు తెలియదు! ఆ కారణం వల్ల కవితకు జీవితం ఇంత భిన్నంగా ఎందుకున్నదనీ, కవితను జీవితం ఎందుకు పరిహసిస్తున్నదనీ, బైరాగి ఖిన్నుడై ఉండాలి? తర్వాత కాలంలో ఆయన మౌనవ్రతానికి, వ్యక్తిగా ఆయన మహాభినిష్క్రమణానికి, అదే ప్రబల కారణమై ఉండాలి. ఏదైనా బైరాగి ఒక ప్రహేళిక! ఒక క్లిష్ట సమస్య! అందుకే కాబోలు ఏ కొద్ది మందికో తప్ప, బైరాగి కవిత్వం సుపరిచయ మైనట్లు గోచరించదు!

సుదీర్ఘ సమాసాలు, ఆచ్చిక పదబంధాలు బైరాగి కవితా శైలిని బరువెక్కించాయి. సమాధానాలు దొరకని ప్రశ్నల ప్రస్తావనలూ, జీవన తత్త్వసాధనకు ఉపలక్షించిన భావాలు, తిరుగుళ్ళూ, విరుగుళ్ళూ, సుడిగుండాల్లాగా మడుస్తూ, ఆవర్తాలలా అనుక్రమించే కవి సంశయ సందేహాలు, ఇలాంటివన్నీ బైరాగి రచనలను క్లిష్టం, జటిలం చేశాయి". (రమణారెడ్డి).

"మానవుడి సహజ వేదనలో మధనపడి, పూర్ణత్వాన్ని దాదాపు కవిగా బైరాగి అందుకున్నాడా అనిపించింది. అమ్మా! ఎంత గొప్పగా అన్నాడు కవిత్వ తత్వవేది, అచ్చమైన గొప్ప కవి అయిన బైరాగి" అని ఆశ్చర్యం వ్యక్త పరచారు దేవులపల్లి కృష్ణశాస్త్రి.

అభ్యుదయ కవిగా తన స్థానం గట్టిగా నిలత్రొక్కుకున్న బైరాగి, కవితా దృక్పథంలో, జీవితాన్ని అర్థం చేసుకునే కోణంలో, తర్వాత కాలంలో ఎంతో మార్పు వచ్చినట్లు మనకు కనిపిస్తుంది. "జీవితపు ఇరుకు సందుల్లో తిరిగి, తిరిగి, అలసటతోనో, భయం వలనో, బాధవల్లనో, ఆలోచనాధిక్యత వల్లనో, మేధావి స్పృహవల్లనో, ఏదో ఇదమిద్ధంగా తెలియదు కాని, ఒక కొత్త ఆలోచనా రీతి అతన్ని తనలోకి లాక్కుంది" (కుందుర్తి)... కవి తాను సమాజంలో ఒకడినని భావించినంత కాలం ప్రజల స్థాయి లోనే ఆలోచిస్తాడు. కాని, ఎప్పుడైతే తాను కవిననీ, మేధావి ననే అహంకారం వస్తుందో అతడు మహాకవినని అనిపించుకోవచ్చు, ప్రజలకు దూరమై పోతాడు. అభ్యుదయ కవికి సమాజాన్ని తనతో పాటు ముందుకి తీసుకు పోవడం విద్యుక్త ధర్మం. తనకు ప్రజల కన్నా ముందు పరుగెత్తడం చేతనవును గనుక, ముందుకు పరుగెత్తిన కొలదీ, అతనికీ, వారికీ మధ్య దూరం ఎక్కువవుతూనే వుంటుంది. ఈ ముందు పరుగెత్తడం అనేది అనేక రూపాల్లో వుంటుంది. ఆ విధంగా ప్రజలకంటే ముందు పరుగెత్తిన అభ్యుదయ కవుల్లో బైరాగి ఒకడు".

బైరాగికి రాను రాను లోకం మీద కోపం, కసి ఎక్కువయ్యాయి. ఇది అభ్యుదయ కవులందరి లక్షణమే! కానీ, బైరాగిలో ఇది క్రమేణా అత్యంత నిరాశకు దారితీసింది. అతనికి లోకంతో పాటు, తనమీద తనకే విసుగు పుట్టింది. అదే ఆయన నిర్యాణానికి కారణ మైంది. బైరాగి ఆత్మ హననం మార్గమని సూచించాడు. కవిగా అదే మార్గాన్ని అనుసరించాడు.



బైరాగి రచనలు:

బైరాగి రచనలు (లభ్యమైనవి) నాలుగు సంపుటాల్లో ప్రచురిత మైనవి. వానిలో మూడు కవితా సంపుటాలు, ఒకటి కథా సంపుటి. బైరాగి తొలి రచన "చీకటి నీడలు" అనే కవితా సంపుటి. ఈ సంపుటిలో 21 కవితా ఖండిక లున్నవి. కవితలన్నీ దేని కవే స్వతంత్ర రచనలు. విడివిడిగా చదివ ఆనందింప తగినవి. ఈ సంకలనంలో, కవి (బైరాగి) ఊహకీ, వాస్తవానికీ, క్రియకీ, కదలికకీ, మధ్య వ్యవధిలో నీడలు పడుతున్నట్లు సంభావించి, కవితలు రచించారు! కొన్ని కవితా ఖండికలు దీర్ఘ రచనలైతే, మరికొన్ని చిన్న గేయాలు. పేర్లు సహితం కవి మన స్థితిని వ్యక్తం చేస్తాయి. దీపావళి అనే కవితతో ప్రారంభిస్తారు మొదటి కవితా సంకలనం. దీపావళిని గూర్చి ఆయన వ్యక్త పరిచిన భావాలు గమనించండి.

దీపావళి ఉత్సవ మండి! - దీపావళి చేద్దాం రండి!

ఆకాశం మండిద్దామా? - పాతాళం తగలేద్దామా? ...

నరకాసురు డెందుకు? ప్రపంచ - నరకాన్నే మసి చేద్దామా?

కాటుక నల్లని చీకటి - జ్యోతుల బంధించిన వాకిటి

తలుపులు పగలేద్దామా? - పీడిత దరిద్ర శాపంతో

క్రుంగిన ధరిత్రి కడుపు పగిలి - వెలిగిన ప్రళయ ప్రదీపావళి

దీపావళి వచ్చిందండి! అంటూ ముగిస్తాడు.

యుగసంధి అనే మరో గీతికలో మంచికీ, చెడుకూ, పాతకూ, కొత్తకూ గల కలయికను అద్భుతంగా చిత్రిస్తాడు బైరాగి. కవిత అంతటా అభ్యుదయ కవితా ప్రతీకలు కోకొల్లలుగా ప్రస్ఫుటిస్తాయి. మచ్చుకు:

అరుణ కాంతిలో పొగలా -రాజుతున్న చిర అశాంతి

తిరుగుబాటు జెండాలా - ఆకాశం నెత్తురుతో రంగరించి అరుదెంచిన

సంధియుగం! సంధియుగం!

బైరాగి జీవితంలో తానూహించిన మార్పు నంతటినీ ఒక పెను తుఫానుగా భావించుకొంటాడు. అందుకే,

ఆగబోదు ఈ తుఫాను - మీ మేడలు మునుగు వరకు

మీ కోటలు కూలు వరకు - మీ అంతఃపుర కాంతలు

భూమిపైన దొరలు వరకు - శోకంతో పొరలు వరకు

ఆగరాదు ఈ తుఫాను ...

రేపు బయలుదేరు నావ - చుక్కానీ మనదేనోయ్!

రేపుదయించెడి సూర్యుడు - మీకొరకై తరుణారుణ

మధు కాంతుల జయ మాలలు - సిద్ధంగా ఉంచుతాడు

రేపే మీ కళ్యాణం! - తుఫాను బిడ్డల్లారా!

అంటూ కొంత ఆశా వాదిగా ధ్వనిస్తాడు తుఫాను కవితలో.

వేశ్యా వృత్తి మన సమాజంలోని అత్యంత హేయమైన దురాచారం. హృదయం గల ప్రతి వ్యక్తినీ ఖేద పరుస్తుంది. ఇక బైరాగి లాంటి వారి స్పందన హృదయ విదారకము. మాటలలో వ్యక్త పరచ జాలనిది! వేశ్యా వృత్తిలోని దినచర్యను ఎంత జుగుప్సాకర పదజాలంతో చిత్రించారో చూడండి:

... నెత్తుట తడసిన అడుగుల - కన్నీరుల ఉప్పని మడుగుల

ఒళ్ళంతా పచ్చిపుళ్ళు రసికారే కురుపులు,

మూగుతున్న ఈగలు - ఎందుకు చీదర?

జీవితపు కాళరాత్రి, గుండెలు పిండే చలి

భగ భగ మండే ఆకలి - పాపపు చిరిగిన దుప్పటిలో ...

వెచ్చని చలి మంటల కౌగిలిలో

చక్కలి గింతలు - ఎందుకు చీదర? రా ఇంకా దగ్గిర.

"చారిత్రక జ్యోతులు" అనే కవిత చరిత్ర విలువలను వ్యంగ్యంగా చాటుతుంది. కవి తన దృష్టిలో చరిత్ర విలువలేమిటో పాఠకులకు వివరిస్తాడు. కవితను చదువు తున్నప్పుడు పాఠకుల కనుల ముందు శ్రీశ్రీ రచించిన దేశచరిత్రలు మెదులుతుంది! కవితలోని కొన్ని పంక్తులు పరిశీలించండి:

... సామ్రాట్టుల సంకేతంపై - వర్షాడపు నదులై ప్రవహించిన

మహా సైన్య వాహినిలో - కొట్టుక పోయిన జనపదాలు.

ఏమిటి ఈ చరిత్ర? హత్యలు దోపిల్ళు తప్ప! ...

ప్రాపంచిక సౌఖ్యాలకు - మెరిసే బంగారు నాణ్యాలకు

మానవ మేధస్సును విక్రయించి - తమ హృదయపు నెత్తుటి నమ్మిన

రాజ సభల కవి కుమారులూ ...

చరిత్ర చీకటి గుడిలో - ఆశా నిగూఢ రశ్ములు!

భవిష్య యుగ యాత్రికులకు - నవ్య కథా ప్రదర్శన జ్యోతులు!!

విధ్వంసం:

బైరాగి పడక కుర్చీలో పవళించి, కలలు కంటూ కవితలల్లే ఊహా జీవి కాదు. ఆయన కవిత కమ్మ దనంతో ఉరక లెత్తదు. తీపి దృశ్యాలు చిత్రించదు. చీకటి, తుఫాను, విధ్వంసం, నెత్తురు బైరాగి కవిత్వ మంతటా అలుముకొని ఉంటాయి! మొగ్గలో నిరాశలు, ముళ్లలో హెచ్చరికలు బైరాగిని అమితంగా కలవర పెడ్తాయి. పురాతత్వ శాఖ వెలికి తీసిన భూగర్భ నాగరికతా విశేషాలు, భూగర్భ నాగరికతల మిగిలిన గురుతు మరుగు దొడ్లు, అని జుగుప్సతో వానిని ఈసడించుకొంటాడు! విధ్వంసం ద్వారా ఆయన ఆశిస్తున్న దేమిటో మనకు అర్థం కాదు. బైరాగి కవిగా జీవితం నుండి గత కాలపు ఘనతను గూర్చిన కిరణమునకై వెదుకుట లేదు. ఆయన ఆకాంక్ష మరచిన పాటలోని చరణం అసలే కాదు. కాటుకల చీకట్లను తుడిచే బ్రతుకు సంజె కెంజాయ గుర్తులు! చీకటిలో మంచు బొట్లలా టపటప రాలే అశ్రుబిందువులు - వీడలేక పోతున్న బంధువుల లాంటి అశ్రుబిందువుల ఓదార్పులు. ఈ జీవిత సంఘర్షణలోంచి మార్గం చూపే ప్రపంచాల దివ్వెల కాధారమైన గానుగలోని బ్రతుకుల నెత్తురు తైలం!

అందుకే అంటారు బైరాగి: వినాశ సుందర రూపం - వీక్షించిన వాడెవడూ

వికాస జడ స్తూపం - రక్షింప బూన డెవడూ

జుగుప్స మన ఆదర్శం - ప్రేయసి మన విధ్వంసం.

పైన ఉల్లేఖించిన పంక్తులు అరాచకాన్ని సూచించవు. వానిని మనం వ్యంగ్యంగానే భావించాలి . మరో ముఖ్య విషయ మేమిటంటే బైరాగి కవిత్వాన్ని అందంగా సృజించాలని ప్రయత్నించ లేదు. పట్టరాని ఆవేశంతో రాశాడు. పద చిత్రాలు వాటంతటవే, పుంఖాను పుంఖాలుగా, మంటలుగా ప్రసరించాయి.

గమనించండి: "ఆర్పేయండా సూర్య చంద్రులను - చమురు లేని దీపాలను

చీకటిలో ముంచేయండా - నీడల పాపాలను".

"తాజమహల్ పడ గొట్టండోయ్"!

ఈ కవితను రూపొందించుటలో "తాజమహల్" ను ఒక ప్రతీకగా తీసుకున్నాడు బైరాగి. అయితే, చాలామంది విమర్శకులకు ఈ విషయం స్ఫురించ లేదు. నిజంగా వీరు పోయి తాజమహల్ ను గునపాలు పెట్టి పగుల గొడతారేమో అన్నంత భయం (భ్రమ) వేసింది! ధ్వని వాదం, ప్రతీక వాదం తెలిసిన విజ్ఞులకు ఆ భయం రాకూడదు కదా?! తెలిసిన వారు సహితం కొందరు విపరీతార్థాలు తీసి బైరాగిని విమర్శించారు. అభ్యుదయ కవులకు సౌందర్య వాదంలో నమ్మకం లేదని, ఆ వాదం పై వర్గాల వారు సృష్టించినదని, అభ్యుదయ కవులు దానికి వ్యతిరేకులనే విమర్శలు బయలు దేరాయి. బైరాగి మాత్రం తాజమహల్ ను గతకాలపు ఫ్యూడల్ వ్యవస్థకు చిహ్నంగా భావించి దానిని కఠిన పదజాలంతో గర్హిస్తాడు. మచ్చుకు కొన్ని పంక్తులు పరికించండి:

తాజమహల్ పడ గొట్టండోయ్! - వెన్నెల రాత్రుల్లో కలగా

సౌందర్య సాగరపు అలగా - మా పీడిత హృదయాల్ చీల్చీ

మా ఎత్తిన తలలను వాల్చీ - దరిద్రులను హేళన చేస్తూ

మానవులను చులకన చేస్తూ - ఆకాశం వైపుకు చూపే

ఈర్ష్యలతో హృదయం ఊపే - తాజమహల్ పడ గొట్టండోయ్!

ఈ విధంగా "చీకటి నీడలు" కవితలన్నిటినీ వివరణాత్మకంగా విశ్లేషించ వచ్చును. ఒక చిన్న వ్యాసం ద్వారా ఆపని సంభవము కాదు. విజ్ఞులు క్షమిస్తారని ఆశిస్తాను.

నూతిలో గొంతుకలు:

నూతిలో గొంతుకలు బైరాగికి పర్యాయ పదమై పోయింది. ఈ సంకలనం లో నూతిలో గొంతుకలు, సంఘర్షం, ఒక సమిష్టి ప్రార్థన, కవి సమస్య అనే నాలుగు కవితా ఖండికలు పొందు పరచారు రచయిత బైరాగి. ఈ కావ్యానికి తొలి పలుకు బైరాగి స్వయంగా వ్రాసు కొన్నారు. ఈ విషయమై బైరాగికీ ఆరుద్ర గారికీ మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన పేర్కొనుట అనుచితము కాదేమో? ఆరుద్రగారి "త్వమేవాహం" అనే ఖండ కావ్యం మొదట్లో చాలామందికి అర్థం కాలేదుట. తర్వాత, ఒక వ్యాసంలో దాశరథి గారు ఆరుద్ర భావాలకు వ్యాఖ్యానం చేశారుట. అప్పుడు ఆరుద్రగారు దాశరథికి వ్రాసిన లేఖలో "బైరాగిని లోకం అర్థం చేసుకో లేక పోతున్నందులకు విచారిస్తూ ... బైరాగి తన పద్యాలను అచ్చువేసే ప్రయత్నంలో ఉన్నాడని అవి అచ్చు అయ్యేటప్పుడు నేను (ఆరుద్ర) వ్యాఖ్యానం లేకపోతే కనీసం టిప్పణి రాస్తానని చెప్పాను. బైరాగి ఒప్పుకున్నాడు"... తీరా ఆ పుస్తకం ప్రచురించే టప్పుడు బైరాగి మనసు మార్చుకున్నాడు". ఆ విధంగా "నూతిలో గొంతుకలు" అనే సంకలనానికి తనే స్వయంగా తొలి పలుకు వ్రాసు కొన్నాడు. అందులో కొన్ని భావాలు పరిశీలిద్దాం. బైరాగి అభిప్రాయానుసారం ఏ కావ్యానికైనా భాష్యం అనేది అవసరము లేదు. సామాన్యంగా ప్రతి రచనా స్వతసిద్ధం. దానికి భాష్యకారుని చేయూత అనవసరం. భాష్యకారుడు (వ్యాఖ్యాత) అపరిణత బద్ధులైన పాఠకులకు సహాయకారి కావచ్చు, సాధారణార్థాలు బోధించ వచ్చు, ఆ ప్రయత్నంలో అప్పుడప్పుడూ కావ్యం లోని మసృణత్వాన్ని (సున్నిత భావాన్ని) లేదా మనోహరత్వాన్ని చెరచే అవకాశం కూడా లేక పోలేదు. అతి సున్నితంగా వ్రేలిడవలసిన చోట రసాభాస చేసి కూర్చొంటాడు! అందువలన బైరాగికి భాష్యకారు లంటే సదభిప్రాయం లేదు. భాష్యాలను సమర్థించడు. "నూతిలో గొంతుకలు" విషయం. పాడు పడ్డ నుయ్యి పతనానికి, మరణానికీ, సంకేతం. అందులో జీవనం ఉండదు. అందులో పడి వున్న వారికి వెలుతురు మృగ్యం. పైకి రావటానికి ఆధారం అసలు కనిపించదు. వారు కేకలు వేస్తారు కాని, వారి అరుపులు బయట వారికి వినిపించవు. చీకటి తప్ప వారికి తోడెవ్వరూ లేరు. "వారు గర్వాంధత వల్ల అభిశప్తులైన నహుషులు. ఆ పాపం వారిది మాత్రమే కాదు. అది సమస్త మానవ కోటికీ వర్తిస్తుంది" (బైరాగి).

"నూతిలో గొంతుకలు" ఒక సంశయ కావ్యంగా అభివర్ణించారు బైరాగి. ఈ కావ్యంలో వర్ణితమైన మానవుడు "ఏది త్రోవ?" అని ప్రశ్నిస్తున్నాడు. తనకై తాను ఒక నిర్ణీత మార్గాన్ని నిర్థారణ చేసుకునే స్థితిలో లేడు (కిం కర్తవ్యతా మూఢుడు)! చీకటిలో ప్రారంభమైన ఈ కావ్యం "ఆవేదనల అనంతంలో అంతమైన జీవితాలను" చర్చిస్తుంది. దీనిలోని నాయకులు హామ్లెట్, అర్జునుడు, రాస్కల్నికోవ్ సందిగ్ధావస్థలో ఒక క్రమబద్ధమైన పరిణామాన్ని సూచిస్తున్నారు. ఉదాహరణకు హామ్లెట్ వేదన కర్మ పూర్వం. అర్జునుడి వేదన కర్మ క్షేత్రంలో తక్షణికం, రాస్కల్నికోవ్ బాధ కర్మ తర్వాత. అది మానవుని సహజ వేదన. అది అతన్ని త్రికాలాల్లోను వెంటాడు తుంది. ఆ బాధలలో మధన పడనివాడు పూర్ణత్వాన్ని అందుకో లేడు. ఆ బాధనుండి అతడు తప్పుకొనే మార్గం లేదా అంటే ఉంది. పలాయనం, కృతక శక్తుల పూజనం, ఆత్మ హననం". ఈ కావ్యంలో నేను అంటే కవి కాదు. నేనీ మానవుని అనుభూతిలో అధికః తాదాత్మ్యం. స్వీయ బాధ వెలువరించడం కవి పరమావధి కాదు. ప్రపంచం తో ఏకమైన నాడే కవికంఠం సరిగ్గా పలుక గలుగుతుందని నా నమ్మకం" అని వ్రాశారు తన తొలి పలుకులలో బైరాగి. ఇది కావ్య పఠిత ‍లందరూ గమనించ దగిన విషయం.

"నూతిలో గొంతుకలు" ఆధునిక తెలుగు కావ్యాలలో ప్రముఖ మైనది. దీని లోని కవిత లన్నీ అద్భుత మైనవి, పదే పదే చదివి ఆనందించ తగినవి. నా దృష్టిలో 'ఒక సమిష్టి ప్రార్థన", 'కవి సమస్య" అనే కవితా ఖండికలు ప్రత్యేకంగా పరిగణించ వలసినవి. "సమిష్టి ప్రార్థన" వంటి కవితలు వెక్కిరింత లనిపించవచ్చు. కాని అవి వెక్కిరింతలు కావు. "ఒక్కోసారి భావావేగం ఉపహాసా స్పదంగా కనిపించేటంత తీవ్రమై వక్ర మార్గా లవలంబిస్తుంది. ఆవేదన వ్యంగ్యం వెనుక దాక్కుంటుంది" అంటారు బైరాగి. "సమిష్టి ప్రార్థన" లోని కొన్ని పంక్తులు మీ అనుభూతికై ఉదహరించడ మైనది.

... ఆడపిల్లల జడలు పట్టుకు లాగిన

అపరాధాన్ని, గోడల మీద రాతలను క్షమించు

డిక్షనరీలో (Dictionary) బూతు మాటల కర్థాలు వెదికితే

అది జ్ఞాన దాహమనే ఎంచు

బిత్తరి చూపు, నూనుగు ముద్దు, ఇబ్బందైన ఇరుకు కౌగిలి

ఘనత వహించిన రొమాన్సులు అవి యన్నీ లెక్క గట్టకు

గురుతు తెలియని చీకటుల సౌకర్యాన్ని

గురుతుతెచ్చి మమ్ములను కష్ట పెట్టకు ...

దేవా! క్షమించు మమ్ము, చేసినవి చేసినందుకు

చేయనివి చేయ నందుకు

పిందెలు కోసినందుకు, పండినవి కోయ నందుకు ...

ఖాళీ పౌడరు డబ్బీల, తల నూనె సీసాల

అత్తరు బుడ్ల, అరిగిన బ్లేడ్ల మధ్య మేము

మురికి బట్టల శయ్యపై శాశ్వతంగా కనులు మూసిన తదనంతరం

మా అలసిన శరీరాలను కడిగించు ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీతో

గంధపు చెక్కలు లేకపోతే మాత్రమేమీ

పేర్చమను చితిపై మేము కాల్చిన సిగరెట్టు పీకలన్నీ ...

పడియుండనీ నరకం లోనో నాకం లోనో మమ్ముల నొకమూల,

వై తరణి ఒడ్డయినా పర్వాలేదు, తిరిగి తిరిగి అలసిపోయాం.

సింహానికి పంజానిచ్చి ఏనుగకు దంతామిడిన మహానుభావా!

మ్యాటినీ లేని వేళ మా మొరాలకించవయ్యా ఓ దేవా!

"ఒక సమిష్టి ప్రార్థన" అనే గేయం ఆధునిక వచన కవిత్వానికి ఆనాడే వేసిన బాటలా కనిపిస్తుంది. అందులోని వ్యంగ్యం, చమత్కారం, హాస్య ప్రియత్వమూ తర్వాత అనేకమంది కవులకు మార్గదర్శకమైంది" అంటారు కుందుర్తి.

కవి సమస్య:

"శబ్దాల అసమర్థత ప్రతి కవికీ ఏదో ఒక సందర్భములో తట్టే ఉంటుంది, కవితా కామిని చేలాంచలాల కొస విసురులు ఎప్పుడూ బారెడు దూరానే మాయ మైనట్లు అగుపిస్తాయి" అంటారు బైరాగి. బైరాగికి మాత్రం ఆ కొస విసురులు దూరాన మాయ మైనట్లు గాక, దగ్గరగా వచ్చినప్పుడు అతనిని నిలువునా నిమిరి, అంతరంగాన్ని పలుకరించేవి" (కృష్ణశాస్త్రి). బైరాగి కవి సమస్యలో ప్రత్యేక శబ్ద సమస్యను వ్యక్త పరుస్తారు. అదే భావకుడైన కవికి ఒకానొక ప్రత్యేక మన స్థితిలో ఏదో అస్పష్టమైన అనుభూతి కలుగుతుంది. అది బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఆనందం కావచ్చు, ప్రేమ కావచ్చు, విరాగం కావచ్చు, యేదైనా అస్పష్టంగా ఉంటుంది. యేదైంది తెలియనంతటి అస్పష్టత (cannot be clearly perceived) అలాంటి అనుభూతిని మాటల్లో వ్యక్తం చేయడమెల్లా? అదీ కవి సమస్య. ఆ అనుభూతి

పొగమంచు ముసుగులోని యాకృతిలాగా, గాలి బాట

వెంట మాట తెలియరాని ఆరాటపు దూరపు పాట ...

నిదురించే మోవి మీద ముద్దు లాగ

వ్యక్తా వ్యక్తపు వినీల విపినంలో,

కుసుమ కపోల పాళిపై సౌరభ శ్వసనంలా (ఉంటుంది) ...

చల్లని తల్లి ఒడిలా, మక్కువ నిండిన ముగుద కన్నుల్లా (ఉంటుంది)

అర్థమైన దాని కన్నా అధికంగా స్ఫురించేది,

చేతలకు చెందరానిది, మాటలకు అందరానిది. ...

సిగ్గుపడి తలలు వంచిన శబ్దాలు,

అసమర్థతను గుర్తించిన శబ్దాలు

పరా భూత కవి కరంలో విరిగిన విల్లు లాంటి భాష

మొక్క పోయిన అమ్ములీ శబ్దాలు.

పై విధంగా సాగుతుంది నిర్దేశించిన భావానుభూతులను వ్యక్త పరుచుట లోని శబ్దాల అసమర్థత (అసమగ్రత) చిత్రీకరణ. అంతేకాక, నూతన Expression కోసం, నిత్య జీవితం లోని సామాగ్రితో నూతన ఉపమానాలు సంధించడంలో బైరాగి కృషి శ్లాఘనీయం.

దివ్య భవనం:

బైరాగి రచనా శక్తి కేవలం కవిత్వ రచనకే పరిమితం కాలేదు. ఆయన చందమామలో పని చేసే రోజుల్లో బాలలకై కథలు వ్రాసే వారుట. కాని అవి చాలా వరకు హిందీ భాషలో రచింప బడినవి. అంతేకాదు, బైరాగి తెలుగులో సహితం మంచి కథా సాహిత్య సృష్టి చేశారు. లభ్యమైన వారి కథలు " దివ్య భవనం " పేర సంపుటిగా మిలింద్ ప్రకాశన్ వారు అచ్చు వేశారు. ఈ సంపుటిలో 11 కథలు చేర్చ బడినవి. అందులో దరబాను, స్వప్నసీమ, బీజాక్షరి, జేబుదొంగ, కన్నతల్లి, నాగమణి, తండ్రులూ-కొడుకులూ అందరు చదివి ఆనందింప తగిన ఉత్తమ కథల కోవలోనివి. "తండ్రులూ-కొడుకులూ" అనే కథ ప్రపంచ కథా సాహిత్యంలో చోటు చేసుకొన దగినది. పాఠకులందరూ తప్పక చదవ వలసిన కథ. అందులోని పాత్రలు చిరస్మరణీయాలు. కథను విపులీకరించిన పద్ధతి మెచ్చుకో దగినది. బైరాగి మరిన్ని మంచి కథలు ఎందుకు వ్రాయ లేదా? అని పఠితలు చింతిస్తారు.

ఆగమగీతి:

ఈ కవితా సంకలనం బైరాగి స్వర్గస్తులైన తరువాత ప్రచురిత మైనది. ప్రస్తుత ప్రతి 2006లో ముద్రింప బడినది. ఈ సంకలనంలో దాదాపు 140 కవితా ఖండికలు ఉన్నవి. వానిలో 100 స్వీయ రచనలు, మిగతా 39 కవితలు అనువాదాలు. ఈ కవితలన్నీ వివిధ సమయాల్లో రచించారు బైరాగి. అందుచేత ఏ కవిత కా కవిత అనుకూల సమయాల్లో పఠించి పాఠకులు ఆనందించ వచ్చు. అనువాదాల్లో టి.యస్.ఇలియట్ రచనలు, కొన్ని జర్మను రచనల అనువాదాలు పొందు పరచారు. భారతీయ భాషల్లో బెంగాలీ నుండి జీవానంద దాస్ కవితలు, హిందీ నుండి సుమిత్రా నందన్ పంత్ రచనలు, రామ్ ధారీ సింగ్ (దినకర్) కవితలు, ఉర్దూ, పారసీ, మరాఠీ కవితల అనువాదాల్ని పొందు పరచారు. ఈ సంకలనం లో తెలుగు పాఠకులకు ఇతర భాషల లోని మంచి కవితలు కొన్ని బైరాగి పరిచయం చేశారు. 'ఆగమగీతి" కవితా సంకలనాన్ని ఉత్తమ రచనగా ఎంపిక చేసి కేంద్ర సాహిత్య అకాడెమీ వారు 1984వ సంవత్సరపు జాతీయ పురస్కారాన్ని సమర్పించి బైరాగిని గౌరవించారు. ఈ పురస్కారం బైరాగి జీవన కాలంలో లభించి ఉంటే ఆంధ్ర సాహితీ లోకం ఎక్కువగా హర్షించి ఆనందించి యుండేది. అటుల జరగలేదు. విధి బలీయం కదా?!

"ఆగమగీతి" సంకలనాన్ని కృష్ణశాస్త్రి గారి "నా వాడూ మున్నుడితో అలంకరించుట ముదావహం. ఆ రచనే కృష్ణశాస్త్రి గారి కలం నుండి వెలువడిన ఆఖరి రచనగా మారుట గమనార్హము. "బైరాగి, మన కవులు - వ్రేళ్ళ మీద లెక్క పెట్ట దగిన బహు కొద్ది మందిలో ఒకడు" అని పేర్కొన్నారు కృష్ణశాస్త్రి గారు. ఈ వాక్యం బైరాగి కవితా శక్తిని చాటుతుంది. "బైరాగి వంటి నక్షత్రాలు సాహిత్య రోదసికి అలంకారాలు. ఆంగ్ల సాహిత్యంలో ఫ్రాన్సిస్ థామస్ కెంత ప్రాముఖ్య మున్నదో బైరాగికి మన సాహిత్యంలో అంత ప్రాముఖ్యత ఉంది" అంటారు మహాకవి శ్రీశ్రీ. అలాగే ప్రపంచంలో ఏ ప్రధమ శ్రేణి కవికైనా సరే - వీస మైనా తీసి పోరు అని అభిప్రాయ పడ్డారు ఆరుద్ర. అలాంటి కవి బైరాగి ఆగమగీతి సంకలనం ద్వారా మన ముందుంచిన కవితా స్రవంతిని ఆస్వాదించే ప్రయత్నం చేద్దామా?!

ఆగమగీతి కవితలోని కొంత భాగం -

మానస యజన వాటికపై మరల నేడు

ముసురు తోంది సందేహాల మందేహాంధ దేహచ్ఛాయ

ద్వి దా ధూషిత ద్వ్యాభా సహజాసుర మాయ

సుడిగాలుల వడిలో విడి ఎడమైనాయి

హృదయ వెద హేమంతాల జీర్ణ శీర్ణ వర్ణాళులు

విశ్వాసాలు, ఆస్థలు, శ్రద్ధాసక్తులాచారాలు,

ప్రాత రోత బూతుల తెరిపి లేని ప్రచారాలు

బ్రహ్మాండ కటాహంలో సలసల మరుగుతోంది నూతన జీవన పాకం

ఊహల ఈహల పెనగిన కల్పిత భూతల నాకం.

అంటూ మొదలవుతుంది ఆగమగీతి గేయం! ఆ గీతికను ముగించిన విధానం గమనించండి -

వృధా కాదు, తామస గర్భ వేదన, మనుజుని గరళాస్వాదన తామరసం హసిస్తుంది,

శ్వసిస్తుంది ప్రాతర్వాతంలో తన

పరిమళాలు, నిన్నటి శంకాతంకాచ్ఛాదన తొలగి మరల

విరుస్తుంది ధర రుధిరచ్ఛవి జీవన దీప్తి కెరల.

ఈ వంధ్యా ధూళి నుంచి, వికృత భస్మపాళినుంచి

ఉదయిస్తా డనల సంభవు డాత్మధవుడు, నవ మానవుడు;

అతని కొరకే వేచి ఉంది యుగయుగాలనుంచి ధరణి

అతని వ్యోమమార్గంలో ఉల్కాధర ప్రహరి తరణి.

కవితా సారాంశ మేమిటంటే రోతకు ప్రతీక మైన పాత నశిస్తుంది. నూతనోత్తేజంతో నవయుగం మొదలై మానవాళికి మంచిని తెస్తుంది అని .

"త్రిశంకు స్వర్గం" అనే కవితలో బైరాగి జీవిత దృక్పథాన్ని వర్ణించిన తీరు గమనించండి.

జీవిత మొక ఆవులింత

జీవిత మొక వొళ్ళు విరుపు

జీవిత మొక గజ్జి కురుపు

మెరసే నున్నని చర్మం పై ప్రాకే దురద విసుగు విసుగు! జీవితాల ముసుగు.

"పలాయనం" అనే మరో ఖండికలో -

జీవితం తింటొంది తనను తను,

కాలే కడుపు నింపు కొనేందుకు గాను

క్రొవ్వొత్తిలా తింటోంది తనను తాను ...

చావునుండి పారిపోవటమే బ్రతుకు

బ్రతుకు నుంచి పారిపోవడ మెక్కడికీ? ...

శాంతి నుంచి పారిపోవడమె అశాంతి

అశాంతిని శాంతి పరచట మెలాగా?

జీవితాన్ని గడిపేస్తుంది కాలం

కాలన్ని గడపి వేయట మెలాగా?

ఖైదీలో నున్నది జైలు

జైలు తప్పించు కోవట మెలాగా? అంటారు!

ఈ సంకలనం లోని అద్భుత కవితా ఖండిక "నా క్కొంచెం నమ్మక మివ్వు" అనే గేయం. ఈ గేయంలో, తరువాత వచ్చిన దిగంబర కవితోద్యమానికి బీజాలు కనిపిస్తాయి. ఆ విధంగా చూస్తే బైరాగిని దృష్ట గా పరిగణించ వచ్చు. కొత్త తరహా వ్యక్తీకరణ కోసం నిరంతర కృషి చేశారు బైరాగి. ఈనాడు వచన కవితలో కొత్త కొత్త ఉపమానాలు వాడిన విధంగా, బైరాగి ఆనాడే నిత్య జీవితం లోని సామాగ్రితో ఉపమానాలు సృజించడానికి కృషిచేశారు. అందుకే వారి కవిత ఉత్తేజంతో పాటు ఉత్సాహాన్ని పుట్టిస్తుంది పాఠకుల హృదయాల్లో. ఏ కార్యాన్ని సాధించాలన్నా మనిషికి ఆత్మ నమ్మకం అత్యంత ఆవశ్యకం. "నా క్కొంచెం నమ్మక మివ్వు" అన్న గేయంలో ఆ విషయాన్ని అత్యంత ఆహ్లాద కరంగా చిత్రించారు ఆలూరి. ఈ కవితను మెచ్చుకొని "Grant me a grain of Faith" అనే పేరుతో ఆంగ్లం లోకి అనువదించారు శ్రీశ్రీ. "నా క్కొంచెం నమ్మక మివ్వు" నుండి కొన్ని పంక్తులు ఉదహరించడ మైనది. పఠితలు ఆస్వాదించండి:

నా క్కొంచెం నమ్మక మివ్వు

కొండలు పిండి కొట్టేస్తాను

చితికిన టొమేటో లాంటి సూర్యుణ్ణి

ఆరిన అప్పడం లాంటి చంద్రుణ్ణి

ఆకాశపు ఎంగిలి పళ్ళెం లోంచి నెట్టేస్తాను

నాదగు బాహు బంధనం లో ఈ విశాల

బ్రహ్మాండాన్ని చాపలా చుట్టేస్తాను. ...

ఇంటింటా గగన కుసుమాలు మూడు పూవులుగా

నందన నికుంజాల అమృత ఫలాలు ఆరు కాయలుగా

పూయిస్తాను, కాయిస్తాను. ...

ఆకాశపు ఊదారంగు తాను చించి

చొక్కా లేని వారందరికీ కుట్టిస్తాను

ఒకటేమిటి, ఏదైనా చేస్తాను ...

నమ్మకం లేని బొంది ఖాళీ సిగరెట్టు టిన్ను

నమ్మకం లేని ఆత్మ పుల్లలు లేని అగ్గిపెట్టే

నమ్మకం లేని బ్రతుకు కాలిన సిగరెట్టు బూది

అన్నీ ఉన్నాయి కాని నమ్మక మొకటే లేదు

నా క్కొంచెం నమ్మక మివ్వు! నమ్మక మివ్వు!

నమ్మక మివ్వు! నమ్మక మివ్వు!

"వాగ్దత్త వసుంధర" అనే ఖండికలో బైరాగి వాస్తవ ప్రపంచం ఎటు మొగ్గు తున్నదో దానితో పాటే తనూ అటే మొగ్గాడు. అందుకే ఆయన కవితా తత్వంలో కొంత మార్పు కనబడుతుంది. గమనించండి -

మనిషికి మనిషికీ మధ్య సంఘర్షణం ఉండదింక సహ జీవన పావన హర్షం తప్ప,

మనిషికి మనిషికీ మధ్య అమర్షం ఉండదింక సహజ సులభ స్నేహాకర్షణ తప్ప,

మనిషికి మనిషికీ మధ్య గోడ లుండవు గోతులుండవు, అదృష్టం గీచిన గీతలుండవు

విప్లవపు బుల్‌డోజర్‌తో మిట్టపల్లా లేకం చేసి మకిలి గుంటలు పూడ్చేశాం ...

మేధకూ క్రియకూ మధ్య, ఆశయానికీ, సంశయానికీ మధ్య

సాధనకూ, సాధ్యానికి మధ్య పడిన నీడలు తుడిచేశాం.

బైరాగి తను చెప్ప దలచిన దానిని పఠితల మనస్సు హత్తు కొనేటట్టు చెయ్యడానికి ఒక్కొక్కప్పుడు ఆశ్చర్యావహకంగా పద ద్యోతక ధ్వనితో చెబుతుంటాడు. పరికించండి:

పత్తనాల రాజ వీధుల పందులు తిరుగు తున్నవి

ఎంగిలికై ఎగబడే నరులను చూచి కుక్కలు మొరుగు చున్నవి.

బియ్యపు కొట్ల వద్ద బారులు తీర్చి నిలబడిన వారు పౌరులు

అమృతం పొంగే ఏరులు పారుతూనే ఉన్నాయి.

శ్రమించే తనువుల స్వేదాలు కారుతూనే ఉన్నాయి.

గిడ్డంగులు, చీకటి కొట్లు, వినాయకుల జేబులు నిండుతూనే ఉన్నాయి.

అయినా అన్న పూర్ణ భాండంలో తండులాలు నిండు కొన్నవి.

పొయ్యి లోన రాజని చిచ్చు కడుపులో రగులుతోంది

కన్నీరుల ఆరని మంట ఎదలో ఎదుగు తోంది

పగ సెగలై పొగులు తోంది.

కలలు అడుగంటాయి, వెలలు మిన్నంటాయి.

కడుపు కరువు, గుండె చెరువు, బ్రతుకు బరువు

ఈ స్వరాజ్యం స్వారాజ్యానికి రాచబాట.

అంటూ మన సమాజంలోని దౌర్భాగ్య స్థితికి వ్యధ వ్యక్త పరుస్తాడు "పాంచజన్యం" అనే కవితలో!

"పెంచిన తల్లి" అనే గేయం ఆంధ్రరాష్ట్రం ఉమ్మడి మద్రాసు నుండి విడిపోయిన కాలంలో రచించారు బైరాగి. తమిళ దేశాన్ని పెంచిన తల్లిగా సంభావించు కొన్నారు బైరాగి. తమిళ తల్లీ నీకు నేను ప్రేమతో, గౌరవంతో వందనము చేస్తున్నాను అంటారు. బైరాగి ఉద్దేశ్యం లో -

కన్నతల్లి కన్నను

పెంచిన తల్లి ఋణ మెక్కువ

ఏమంటే అందు కన్న తల్లి కుండే నెత్తురు బంధం లేదు.

సహజ రహస్నేహం తప్ప మరొక ఆనందం లేదు.

మాతృ మమతా నిహిత స్వార్థ ద్వందం లేదు.

వెలుగు లాగు, గాలి లాగు, నీరు లాగు అదే గదా ప్రేమంటే.

అని పెంచిన తల్లిని అభివర్ణిస్తారు.

ఆగమగీతిలోని ఖండికలన్నీ వివరణాత్మక, విశ్లేషణీయములే! కాని స్థలాభావముచేత ఆ పని విరమించడ మైనది. విజ్ఞులు మన్నింతురుగాక! ఇంతవరకు స్వీయ కవితలను గూర్చి చర్చించు కొన్నాము. అనువాద కవితలను గూర్చి కొద్దిగా ముచ్చటించుకొని, విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అనువాద కవితలు పరిశీలిస్తే, టి.యస్.ఇలియట్ రచనలంటే బైరాగికి ఎక్కువ అభిమానమని గ్రహించ వచ్చును. ముఖ్యంగా వారి కవితలు బైరాగిని అధికంగా ప్రభావితుని గావించాయి. ఫ్రెంచి కవితలు సహితం ఆయనను ఆకర్షించాయి. అందుకే అనువాదాలలో ఎక్కువ భాగం ఫ్రెంచి కవితలు. వానిని ఆంగ్ల మాధ్యము నుండి తెలుగు చేశారు. భారతీయ భాషల్లో హిందీ నుండి సుమిత్రా నందన్ పంత్, దినకర్ బైరాగి అభిమాన కవులని మనం భావించ వచ్చును. మరాఠీ కవులలో విందా కరందీకర్, బెంగాలి కవులలో జీవానందదాస్ బైరాగిని ఎక్కువగా ఆకర్షించి, ప్రభావితం చేశారు. జీవానందదాస్ కూడా బైరాగి కోవకు చెందిన కవి. "బ్రతుకు బాధ భరించ రానంతగా వున్నట్లు భావించి, జీవితం కొట్టిన కొరడా దెబ్బలకు తట్టుకో లేక, ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి అంటే మృత్యుగహ్వరంలోకి, అంధకార గర్భంలోకి వెళ్ళి పోవాలనే ఆకాంక్ష ఆయన కవితల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. కవితలన్నీ బాధలకు తట్టుకోలేక వేసిన కేకల్లా వినిపిస్తాయి, ... ఆయన కవిత తొలి దశలో స్త్రీ మూర్తి కవితకు కేవలం ఒక ఆశ్రయంగా మాత్రమే ఉండేది. తర్వాత చీకటి గర్భం లోకి పోవాలనే మృత్యు కాంక్షగా పరిణమించింది" (కుందుర్తి). ఈ సంకలనంలో "నీలిమా", "వనలతాసేన్" అనే రెండు జీవానంద దాస్ కవితల తెలుగు అనువాదాలు పొందు పరచ బడ్డాయి.

ముగింపు:

బైరాగి అభ్యుదయ కవిగా సాహితి జగత్తులో ప్రవేశించాడు. అతనిపై ఆధునిక పాశ్చాత్య కవుల ప్రభావం ఎక్కువగా వుంది. బైరాగికి కొన్ని రాజకీయ విశ్వాసాలు ప్రగాఢంగా ఉన్నాయి. బైరాగి తన రాజకీయ విశ్వాసాల కోసం పడ్డ బాధ మాత్రం వెతికితేనే కాని కనబడదు ఆయన కవితలో. బైరాగిని కేవలం అపనమ్మకపు నీడల్లో సంచరించే సంశయాత్మగా చిత్రిస్తే, అది అవగాహనకు లోప చిహ్నం. కావ్యంలో నిరాశలు, నిట్టూర్పులు, భయాలూ, సందేహాలూ అడుగడుగునా ఉంటే, వాటన్నిటినీ బైరాగికి అంటగట్ట కూడదు. కుళ్ళుతో, అవినీతితో, అక్రమాలతో అన్యాయాలతో నిండిన ఈ జీవితపు చీకటి నుంచి ఆకాశపు వెలుతురు లోనికి చొచ్చుకు పోయే స్వేచ్ఛను, బైరాగి జీవిత మంతా అన్వేషించాడు, ఆకాంక్షించాడు.

వచన కవిత్వపు తొ లి రచయితల్లో బైరాగిని చేర్చ కుండా ఉండలేము. ఈ ప్రక్రియను తీర్చి దిద్దిన కవుల్లో ఆయన ముఖ్యుడు. ఆయన కవిత పైకి సులభసాధ్యంగా కనిపించక పోయినా, లోతుగా ఆలోచించే వారికి, ఆయన బాగా అర్థ మవుతాడు. వచన కవితలో గొప్ప ధారా శుద్ధి గల కవి బైరాగి. చివరి దశలో బైరాగికి, లోకం మీద కోపం ఎక్కువైంది. లోకంతో పాటు తన పైననే తనకు విసుగు పుట్టిందేమో?! ... చివరి రోజుల్లో అసలు బ్రతకడం ఎందుకో ఆయనకు అర్థం కాలేదు! లక్ష్యసిద్ధి భ్రాంతి లేకుండా - అంటే మోక్షాశయం లేకుండా, చావదలచిన యోగీశ్వరుడాయన. ఏమైతే నేమి, ఒక మంచి కవిని కోల్పోయింది తెలుగు తల్లి. బైరాగి మరి కొంత కాలం బ్రతికి ఉంటే ఏం రాసేవాడో? కవిగా ఎంత పేరు ప్రతిష్ఠలు గడించే వాడో ఊహిస్తే భరింప జాలని బాధ కలుగు తుంది.

కృతజ్ఞతలు: శ్రీ ఆలూరి బైరాగిని గూర్చి సాహిత్య పరమైన వివరాలు లభించక, తికమక లవుతున్న తరుణంలో, ఆపద్భాంధవునిగా చేయూతనిచ్చి, అలభ్యమైన ఆలూరి సంస్మరణ సంచిక (1979) నుండి ముఖ్య విషయాలను సేకరించి నాకు అంద జేసిన నా చిరకాల మిత్రులు డా. వెలగా వెంకటప్పయ్య గారికి నే నెంతయో ఋణ పడి యున్నాను. వారికి ఇందు మూలమున నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను.

Amrutam Kurisina Ratri (అమృతం కురిసిన రాత్రి)

ప్రస్తావన:

ఇరవయ్యో శతాబ్దంలో ప్రపంచ మంతటా, అన్ని రంగాల లోను శర వేగంతో విప్లవాత్మక మైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆంగ్ల భాష ద్వారా, పర భాషల లోని సర్వ కవితా రీతులు మన రచయితలకు పరిచయ మయ్యాయి.ఆ కారణం చేత తెలుగు కవితా రంగంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. వీటి ప్రభావం ఆనాటి కవులందరి మీద కొంతమేరకు కనిపిస్తుంది. కవితా రంగంలో అనేక పద్ధతులు మొదలయ్యాయి. సంప్రదాయ కవిత్వము, భావ కవిత్వము, అభ్యుదయ కవిత్వము, వచన కవిత్వము - అనే నాలుగు పాయలలో కవితా రథం పయనించ సాగింది. 20వ శతాబ్దం తొలి పాదంలో తెలుగు కవితా రంగంలో వచ్చినన్ని మార్పులు అంతకు ముందు కాలంలో మనకు కనిపించవు. సంప్రదాయ కవితా రీతులను మాని, ఆధునికత వైపు కలం సాగించిన వారికి ప్రజాదరణ లభించుట మొదలైనది.

గేయం, వచనం, రెండూ కూడా తెలుగు సాహిత్యంలో తమ తమ స్వతంత్ర ప్రతి పత్తిని నిర్మించుకొనుటలో విజయాన్ని సాధించాయి. 1935వ సంవత్సరము నుండి వచన కవిత క్రమ వికాసం చెందు తున్నది. భావ వ్యక్తీకరణలో స్వేచ్ఛా స్వతంత్ర్యాలు ఆదర్శంగా ఈ కవిత అభివృద్ధి చెందుతోంది. వచన కవిత సులభంగా అర్థ మవుతుంది. అందుకే ప్రజలు దాన్ని ఆదరిస్తున్నారని మనం భావించాలి. అయితే ప్రతి ప్రక్రియ, కొన్ని భావాల అభి వ్యక్తీ కరణకు యెక్కువ అనుకూలంగా వుంటుంది. ఏ ప్రక్రియ లోనైన కవితా వస్తువు సాధారణంగా మూడు రూపాలలో ప్రదర్శిత మౌతుంది. భావ సంచలనం, ప్రకృతిలోని సౌందర్యా రాధనం, సామాజిక జీవన విశ్లేషణం. ఏ ప్రక్రియ రూపంలో వెలువడినా, ఒక కవిత విలువ ఆ కవితా గుణాన్ని, ప్రయోజనాన్ని బట్టి నిర్ణయించ బడుతుంది. గుణం లోపించి నప్పుడు కవిత ఏ ప్రక్రియలో వున్నా ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించినా, అది కవితగా పరిగణించ బడదు. అంటే, ఏప్రక్రియలో చెప్పినా, కవిత కళాత్మక మైన అంతర సత్య దర్శనం కలిగించాలి.



అప్పుడే అది ఒక విశిష్ట మైన కళా సంపదగా లోకానికి మిగులు తుంది. వచన కవితా ప్రక్రియలో ప్రఖ్యాత కవులు (కుందుర్తి, తిలక్, బైరాగి, ఆరుద్ర, దాశరథీ, అజంతా, నారాయణ రెడ్డి, బోయిభీమన్న, శేషేంద్ర శర్మ, ఇత్యాదులు) ప్రసిద్ధి కెక్కిన వచన కవితా గ్రంధాలు రచించారు. అయినప్పటికీ, "ఆధునిక వచన కవిత్వానికి ప్రాణం పోసిన వాడు తిలక్. అంతకు ముందే ఒక మట్టి బొమ్మను దేవాలయంలో ప్రతిష్ఠ చేశారు గాని, అది తిలక్ వాణి స్పర్శ తగిలే వరకు పలక లేదు. ఆయన్ను చూడగానే కేరింతలు కొడుతూ ఆటలాడింది... అప్పటికి గాని వచన కవిత్వానికి ఒక స్థాయి రాలేదు. గౌరవం లభించ లేదు" (కుందుర్తి). ఆశ్చర్య మేమిటంటే తిలక్ కవిత చెప్పిన పద్ధతి అటు సంప్రదాయజ్ఞులనూ, ఇటు ఆధునికులనూ, సమానంగా ఆకర్షించింది. తిలక్ రచించిన "వచన గేయం" పరిమళ భరిత మైన బంగారపు తీగలాగా సాగి ఆయన పనితనపు సామర్థ్యానికి లొంగి రసజ్ఞుల కంఠా భరణమై వాసి కెక్కింది!


బాల గంగాధర్ తిలక్ రచించిన "అమృతం కురిసిన రాత్రి" అనే కవితా సంకలనాన్ని పాఠక మహాశయులకు వివరణాత్మకంగా పరిచయం చేయడమే ఈ వ్యాసం యొక్క ముఖ్యోద్దేశం.

1971వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ (ఢిల్లీ) వారు "అమృతం కురిసిన రాత్రి" తెలుగులో ప్రచురిత

మైన ఉత్తమ కవితా సంకలనముగా ఎంపిక చేసి, పురస్కారాన్ని (జాతీయ అవార్డు) ప్రదానం చేశారు. అంతేకాక, ఈ రచన ఉత్తమ జనహిత గ్రంథంగా కూడా, ఎంపికయినది.



బాల గంగాధర తిలక్ కవితా దృక్పథం:

ఒక మహాకవి కవితా సుధను ఆస్వాదించుటకు ముందు ఆ కవి యొక్క కవితా దృక్పథం తెలుసు కొనుట ఎంతో వాంఛనీయం. దాని వలన పఠితలకు రచయిత భావాలు సులభంగా అర్థ మౌతాయి. కవితలను చదివి ఆనందించ గల్గుతారు. ఆ ఉద్దేశ్యంతో తిలక్ గారి కవితా దృక్పథాన్ని సూక్ష్మంగా చర్చించడ మైనది.

తిలక్ గారు అంతరాత్మా ప్రేరితులై వచన కవితా రచనకు పూనుకున్నారు. కవిత్వాన్ని గురించిన వారి అభిప్రాయాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.


పద్య రచనను గురించి ప్రస్తావిస్తూ "పద్యం ఈ నాటి అనుభూతి విలక్షణతను ప్రదర్శింప లేదు. సమకాలీన జీవితం లోని వివిధ ప్రవృత్తులను పద్యంలో చూపించలేం". అంటారాయన.అంతేకాక, కవిత యొక్క నిర్వచనమూ, స్వరూపం ఎప్పటి కప్పుడు మారుతోంది. విస్తృత మౌతోంది. చంధస్సూ, కవి సమయాలు, మొదలైన సంకెళ్ళ నుండి తప్పు కొనిన కవిత అచ్చమైన రూపం సంతరించు కొంటుందని ఆయన నమ్మకం. ఆలాగే కథా సంవిధానం అనే అనవసరపు తొడుగుని విప్పుకొని ప్రధాన అనుభూతుల ఆకృతితో నేటి కవిత్వం దర్శన మిస్తుంది... కవిత్వాన్ని నేడు అనుభవ ప్రధానంగా పరిగణిస్తున్నాం. సిద్ధాంతాల కోసం కవిత్వాన్ని, అసలు వ్యక్తిని, బలి పెట్టే తత్త్వం హర్ష నీయం కాదు". అంటారు తిలక్.



మరో సందర్భంలో వ్రాస్తూ "ఈ నాటి కవిత చురుకైన ఆవేశాన్ని, సాంద్రతరమైన అనుభూతి వత్తిడినీ, సూక్ష్మమైన భావననీ, అనుసరించడానికి, తన స్థానాన్ని ప్రత్యేకించు కుంది... కవి దృష్టి నేడు ఒక లాంతరు పట్టుకొని నలు వైపులా వెళ్ళి ఓపికగా పరిశీలించడం లాంటిది కాదు. వస్తు స్వరూపాలకూ, సంఘర్షణ లకూ, శక్తులకూ, కీలక స్థానం మీద శక్తి వంతమైన బ్యాట్రీ లైటు ఫోకస్ చెయ్యడం లాంటిది" అంటారు తిలక్ గారు. తమ రచనల్లో కీలక స్థానం మీద శక్తి వంతమైన బ్యాట్రీ లైటు ఫోకస్ చేస్తారు, వస్తువు మీద కాదు! తిలక్ రచించిన "నిన్న రాత్రి" అనే కవిత (చూడు ఆ.కు.రాత్రి 118-119పుటలు) పరిశీలిస్తే వారి కవితా తత్త్వమంతా అందులో ఇమిడి వున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు "తిలక్ గారికి, తక్కిన అభ్యుదయ కవులకు ఉన్న భేదం ఆ కవితలో ప్రస్ఫుటంగా దర్శన మిస్తుంది" అంటారు విప్లవ కవి వరవర రావుగారు. నవీనుల మనుకొనే వారు - సాంప్రదాయ కవులమని భావించే వారు శ్రీ బాలగంగాధర తిలక్ తమ తమ వర్గీయుడని ఎందుకు భ్రమి స్తారో కూడా "నిన్నరాత్రి" కవిత చదివితే విశద మౌతుంది.



ఆ కవితా ఖండికలో ఒక యువకుని ఆకలి చావు,"అమ్ముకొని యౌవ్వనం, అలసిన జీవనం" సాగించి, సాగించి, సంధ్య వేళ ఉరి తీసుకొన్న సాని దాని కథ, కాంగోలో, క్యూబాలో, సైప్రస్ లో, లావోస్ లో కాలి, కమురు కంపు కొట్టే కాలం కథ, మానవ వ్యథ వర్ణిత మైంది. ఆశ్చర్యకర మేమిటంటే, "ఇవన్నీ నేను (రచయిత) నా మంచం మీద వచ్చి కూర్చొన్న దేముణ్ణి అడుగ లేదు!" అని చెప్పడం లోనే ఉన్నదని అంటారు వరవర రావు. గమనించండి:



నాకు తెలుసు నాకు తెలుసు

గొలుసు లోని అసలు కిటుకు

నాకు తెలుసు నాకు తెలుసు

దేవుని చెక్కిళ్ళ మీద దీనంగా కారే కన్నీటిని ...

మానవుడే దానవుడై తిరగ బడినప్పుడు

పాపం! - పెద్దవాడు - కన్న కడుపు - ఏం చేస్తాడని!



ఈ తతంగమంతా గమనిస్తూ, కవి తిలక్ ముక్కు మూసుకొని కూర్చో గలడా?! అద్భుత మేమిటం టే ఈ ఆధునిక యుగంలో దేవుడు ఎంత నిస్సహాయుడై పోయాడో - దేవుని చెక్కిళ్ళ మీద దీనంగా కార్చే కన్నీటిని తుడిచి ఊరడించ వలసిన పరిస్థితి కవికి పట్టింది.! మరో చమత్కార మేమిటంటే తిలక్ బాధ్యత నంతా దేవుని మీద వేయడు. హృదయాన్ని కదిలించే విధంగా మానవుడే దానవుడై ప్రవర్తిస్తే - పాపం దేవుడు మాత్రం ఏంజేస్తాడు - పైగా కన్న కడుపు! అంటూ జాలిని వ్యక్త పరుస్తాడు! సిద్ధాంతా లన్నింటికీ అతీత మైన మానవతా ధర్మాన్ని ప్రతి పాదిస్తాడు తిలక్ ఈ కవితలో.



తిలక్ గారికి కవిత్వం గురించి, మరియు కవిత్వం లోని "నవత్వం" గురించి నిర్దిష్టమైన అభిప్రాయా లున్నవి. "కేవలం అనుభూతి విశేషాన్నే కవిత్వంగా భావించిన వాడైతే, ఆధునికుల్లో, ఫ్రీవర్స్ రచయితల్లో ఆయనకు అగ్రస్థానం వచ్చేది కాదు... ఆయన కవిత్వంలో అబ్ స్క్యూరిటి, అస్పష్టత పనికి రాదన్నాడు. "మోడరన్ గా ఉండాలని, ఏదో అందామనీ, తనకే తెలియని అస్పష్టపు అనుభూతిని అర్థం లేని యిమేజరీల తో, కలగా పులగపు వర్ణనలతో, చాతకాని అనుకరణలతో రాయొద్దన్నాడు. అంతటితో ఆగలేదు. "కవిత కొత్త అనుభవాల కాంతి పేటికను తెరవాలి, కదిలించాలి. ఈ కాలంలో బ్రతుకు; ఈ ప్రపంచాన్ని ప్రతిఫలించు. ఇంటికున్న కిటికీ లన్నీ తెరచి అన్ని పవనాల్ని ఆహ్వానించు, నువ్వు చెప్పేదేదైనా నీదై వుండాలి. నీలో నుంచి రావాలి, చించుకొని రావాలి. మళ్ళీ ఈనాడు చిత్ర కవితల్నీ, అయోమయ బంధాల్నీ, పునరుద్ధరించకు" అంటారు. ఎంత మంచి ఆలోచనలు! ఎంత మహత్తర మైన సందేశం! కవితా రచనను నిష్ఠతో సాగించే రచయిత లందరూ అనుసరించ దగిన సందేశ మిది! తిలక్ మహాశయుని హృదయానికి అద్దం పట్టేటువంటి ఆలోచనా పరంపర.



తిలక్ కవితా దృక్పథాన్ని గూర్చి అనేక విషయాలు పేర్కొన వచ్చు. అలా వ్రాస్తే - ఒక పుస్తకమే అవుతుంది! అది ఈ వ్యాస కర్త లక్ష్యం కాదు. అందుకని...

"కవిత్వం ఒక ఆల్కేమీ, దాని రహస్యం కవికే తెలుసును

కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకీ తెలుసు

కృష్ణ శాస్త్రి కి తెలుసు, శ్రీ శ్రీ కి తెలుసు"

అన్నా! కవిత్వం అంతరాంతర జ్యోతి స్సీమల్ని బహిర్గతం చెయ్యాలి, విస్తరించాలి చైతన్య పరిధి

అగ్ని జల్లినా, అమృతం కురిసినా

అందం, ఆనందం దాని పరమావధి"

అని పేర్కొంటూ ఈ విభాగం ముగిద్దాం!



అమృతం కురిసిన రాత్రి - కవితాధ్యాయనం:



కవిత్వ అధ్యాయనానికి సాహిత్యాభిరుచి అవసరం.కవిత్వంలో వస్తువు వుంటుంది, ప్రక్రియ వుంటుంది, అనుభవం వుంటుంది. వస్తువు ఏదైనా, ప్రక్రియ ఏదైనా అవి రెండూ కూడా అనుభవానికి సాధకాలు. అనుభూతిని అందుకోవడానికి సహాయ పడతాయి. కవిత చదివితే పాఠకుడు ఆ కవితలోని భావంతో సానుభూతి ప్రకడించడం, లేదా ఆ కవిత ప్రతి పాదించే భావంతో ప్రభావితుడు కావటం జరుగు తుంది. కవితాను భూతిని రెండు విధాలుగా పొంద వచ్చు. మొదటిది మనసుతో, రెండవది మెదడుతో. మనసుతో పొందే అనుభాతి పఠితకు లో చూపు నిస్తుంది. మెదడుతో పొందే అనుభూతి పై చూపు నిస్తుంది. పఠితలో విశ్వాసాన్ని తెలుసు కొనేది లో చూపు. విశ్వాత్మలో పఠిత తనను తాను చూచు కొనేది పై చూపు. ఈ రెండు విధానలలో దేనితోనైనా పాఠకుడు (పఠిత) తన కవిత్వ అధ్యాయనం మొదలెట్ట వచ్చు. పైన పేర్కొనిన విషయాలు దృష్టిలో పెట్టు కొని "అమృతం కురిసిన రాత్రి" లోని కవితా ఖండికలు (కొన్నిటిని) ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం.



"అమృతం కురిసిన రాత్రి" అనే కవితా సంకలనం లో 80 కవితా ఖండిక లున్నవి. ఈ కవితలన్నీ 1941-1970 మధ్య కాలం లో రచించ బడినవి. సంకలనము లోని ప్రతి కవితా ఖండిక స్వయం సంపన్న. దేని కదే చదివి ఆనందింప తగినది. ఒక దానితో మరొకటి వస్తు బాంధవ్యము లేనిది. కాబట్టి కవితలన్నీ ఏక బిగిని చదువ వలసిన అవసరము లేదు. దేని ఆనందం దానిదే. దేని అనుభూతి దానిదే. పఠితలు తమ తమ ఇష్టాను సారంగా, ఇష్టాను క్రమంగా చదివి ఆనందించ గలరు.



"అమృతం కురిసిన రాత్రి" సంకలనము లోని మొదటి కవిత "నా కవిత్వం" అనే శీర్షికతో ప్రచురిత మైనది. ఈ గేయం 1941లో రచించినది. అప్పటికే, విభిన్న రాజకీయ ధోరణులు సాహిత్య రంగములోకి ప్రవేశించాయి. ముఖ్యంగా అభ్యుదయ కవులు రాజకీయ ప్రభావాలకు లోనై తమ తమ కవిత్వంలో ఆయా ధోరణులు వ్యక్త పరచటం ప్రారంభ మైనది. నిబద్ధ కవితలు విరివిగా ప్రచురిత మయ్యాయి. అయితే, రాజకీయ పక్షాలకు రచయిత దాసోహం కావటం తిలక్ గారికి సమ్మతం కాదు. ఆ భావనే ఈ కవితా ఖండిక పరోక్షంగా వ్యక్త పరుస్తుంది:



నా కవిత్వం కాదొక తత్వం

మరికాదు మీరనే మనస్తత్వం

కాదు ధనిక వాదం, సామ్య వాదం

కాదయ్యా అయోమయం జరామయం

...

నా అక్షరాలు కన్నీటి జడులతో తడిసే దయా పారావతాలు

నా అక్షరాలు ప్రజా శక్తుల వహించే విజయ ఐరావతాలు

నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడ పిల్లలు.



తన కవిత్వాన్ని పైన పేర్కొనిన (తొలిగేయంలో) కొలత బద్దతో కొలవద్దన్నాడు తిలక్. తన కవితా శక్తి నంతా కరుణా శృంగారాలతో నింపి విశ్వ శ్రేయస్కరం చేస్తానంటాడు. "కరుణ" కు దయాపారావతాలను, శృంగారానికి అందమైన ఆడపిల్లలను, విశ్వశ్రేయస్సు సూచనగా విజయ ఐరావతాలను, ప్రతీకలుగా (సంకేతాలు) చిత్రిస్తాడు తిలక్.

"మేగ్నాకార్టా" అనే మరో కవితలో

మాకు లోకం ఒక గీటురాయి మాకు కరుణ చిగురు తురాయి

మేం పర పీడన సహించం మేం దివ్యత్వం నటించం



అంటారు. ఈకవిత రచించినది 1942వ సంవత్సరంలో. ఆకాలంలో కొంతమంది యువకులు "నయాగరా" కవులనే పేరుతో సాహిత్యాన్ని ఎత్తి పోతలుగా కురుపించారు. ఆనాటి యువకులకు వ్యక్తి చైతన్యాన్ని, సంఘ చైతన్యంగా అనువదించాలనే సంకల్పం ప్రభల మైనది. ఆ తరుణంలో తన "మేగ్నా కార్టా" ప్రకటిస్తాడు తిలక్. విజయ శంఖారావ విమల గీతమ్ము తో కొత్త మార్గాలకై సాగిపోతాడు. "మేగ్నా కార్టా" అంటే ఒక "సివిల్ లిబర్టి చార్టరు" ప్రతి పౌరుడికి అన్ని విధాల స్వేచ్ఛ అవసర మనే ప్రభల వాంఛ.



సైనికుడి ఉత్తరం: రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు తన భార్యకు వ్రాసిన ఉత్తరం ఈ కవితా ఖండిక లోని వస్తువు. ఆ సమయం లో సైనికులు అనుభవించిన బాధలు, వారి జీవన విధానం, వారిని మనుషులుగా కాక మరలగా వాడిన వృత్తాతం అత్యంత ఆకర్షనీయంగా చిత్రించాడు కవి. అంతే కాక, ఆ తరుణంలో మనుష్యులలో చీకటి కొండగా పెరిగిన స్వార్థం, సైని కుల అసహాయత వారిని నిరుత్సాహ పరచి, వారిలో నిర్వీర్యతనే గాక రాక్షసత్వాన్ని, జీవితం పట్ల చులకనా భావాన్ని యినుమడింప చేస్తుంది. అప్పటి వారి మనస్థితిని - మనో వేదనను వ్యక్త పరచడంలో మనోంతరాల నుండి అనుభూతిని విశాల పరిధిలోనికి గొని వచ్చి ఘనీ భవింప జెయ్యాలని ప్రయత్నిస్తాడు తిలక్. ఆ కవితా ఖండిక లోని కొన్ని పాదాలను పరిశీలించండి!



ఇక్కడ నేను క్షేమం - అక్కడ నువ్వు కూడా...

...

ఇప్పుడు రాత్రి, అర్థ రాత్రి

నాకేం తోచదు నాలో ఒక భయం

తెల్లని దళసరి మంచు రాత్రి చీకటికి అంచు

దూరంగా పక్క డేరాలో కార్పోరల్ బూట్స్ చప్పుడు

ఎవరో గడ్డి మేటి నుంచి పడ్డట్టు -

నిశ్శబ్దంలో నిద్రించిన సైనికుల గురక

చచ్చిన జీవుల మొరలా వుంది.

... ...

పోదు నాలో భయం మళ్ళీ రేపు ఉదయం

ఎడార్లు నదులూ అరణ్యాలు దాటాలి.

ట్రెంచెస్ లో దాగాలి

పైన ఏరోప్లేను, చేతిలో స్టెన్ గన్

కీయిస్తే తిరిగే అట్ట ముక్క సైనికులం

మార్చ్!

వన్ టూ త్రీ షూట్ డెడ్ ఎవడ్

నువ్వా నేనా

కేబుల్ గ్రాం యిప్పించండి కేరాఫ్ సో అండ్ సో

(మీ వాడు డెడ్.)

సృహతప్పిన ఎనెస్తిషియాతో

వెన్నెముక కర్రలా బిగిసింది.

యుద్ధం యుద్ధం

లిబియాలో బెర్లిన్లో స్టాలిన్ గ్రాడ్ లో

స్వార్థం పిచ్చి కుక్కలా పెరిగింది.

...

నేనిది వరకటి నేను కాను

నాకు విలువల్లేవు

నాకు అనుభూతుల్లేవు

చంపడం, చావడం

మీసం దువ్వడం లాంటి అలవాటయ్యింది.

కనిపించే ఈ యూనిఫారం క్రింద

ఒక పెద్ద నిరాశ, అనాగరికత

బ్రిడ్జీ క్రింద నది లాగా రహస్యం గా వుంది.

వదల లేని మోపు ఊబిలాగా వుంది

నేనంటే నాకే అసహ్యం

అందుకే మరీ మరీ చంపుతాను, మరీ మరీ తాగుతాను

ఇంకేం చేసినా ఎవరూ ఒప్పుకోరు.

...

తిరిగి ఎప్పుడు మన ఊరు వస్తానో!

నిన్ను చూస్తానో?

...

ఎన్నాళ్ళకి! ఎన్నాళ్ళకి!

కొన్ని వేల మైళ్ళ దూరం మన మధ్య

ఒక యుగంలా అడ్డు పడింది.

ఇంక సెలవ్ మై డియర్!

నిద్ర వస్తోంది మత్తుగా నల్లగా

అడుగో సెంట్రీ డేరా ముందు గోరీలా నిలబడ్డాడు

...

మళ్ళీ జవాబు వ్రాయ్ సుమీ!

ఎన్నాళ్ళకో మరీ

సెలవ్! అబ్బా! చలి!

చలి గుండెల మీద కత్తిలా తెగింది.

నీ రూపం నా దేహానికి వెచ్చగా తగిలింది.



భార్యా పిల్లల నుండి యెంత కాలం నుండి విడిగా వున్నాడో? అసలు వారిని కలుస్తానన్న నమ్మకం సైనికుడికి కలుగుట లేదు. ఒక వేళ కలిసినా ఎన్నాళ్ళకి? అనే ప్రశ్న అతన్ని కలవర పెడుతోంది! ఇదే తిలక్ శైలి లోని ప్రత్యేకత! మానవ కారుణ్య భావనకు పతాకం ఎగుర వేసే తత్వము తిలక్ ది.



మరో అద్భుతమైన కవితా ఖండిక "ఆర్త గీతం" ఇది ఒక హృదయ విదారక మైన కవిత. ఈ కవిత చదువు తున్నప్పుడు దేవులపల్లి కృష్ణ శాస్త్రి రూపం మన కనుల ముందు మసలు తుంది. ఆయన రచన "ఏడ్వనీండి నన్ను" మనకు స్పురిస్తుంది. కాని ఈ రెండు కవితలలో చాలా వ్యత్యాస మున్నది. తిలక్ హృదయ వ్యధకు దారి తీసిన కారణాలు పాఠకుణ్ణి సహితం అత్యంత వేదన పాలు చేస్తాయి. కవితలోని కొన్ని భాగాలు తిలకించండి!

నా దేశాన్ని గూర్చి పాడ లేను,

నీ ఆదేశాన్ని మన్నించ లేను,

ఈ విపంచికకు శ్రుతి కలుప లేను

ఈ రోజు నాకు విషాద స్మృతి,

విధి తమస్సులు మూసిన దివాంధరుతి

నా ఎడద మ్రోడైన ఒక దుస్థితి.

నేడు నేను కన్నీరుగా కరిగిన గీతికను,

సిగ్గుతో రెండుగా చీలిన వెదురు బొంగును,

మంటలో అంతరాంతర దగ్ధమైన బూడిదను

పైన దైవమునకు, కింద మానవునకు జవాబు చెప్ప వలసిన వాణ్ణి

రసాతల మంట శిరస్సు వంచిన వాణ్ణి



ఆ తర్వాత గేయాలలో తాను చూచిన దృశ్యాలను హృదయానికి హత్తుకొనే విధంగా చిత్రిస్తాడు తిలక్. "నేను చూచాను నిజంగా మూర్తీభవత్ దైన్యాన్ని, హైన్యాన్ని, క్షుభితాశ్రు కల్లోల నీరధుల్ని,గచ్చత్ శవాకార వికారుల్ని" అంటాడు భరించ లేని ఆవేదనతో. అందుకే కాబోలు ఇది ఏ నాగరికతకు ఫల శ్రుతి? ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి; ఏ బుద్ధదేవుని జన్మ భూమికి గర్వ స్మృతి"? అని నిక్కచ్చిగా ప్రశ్నిస్తాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ అంటాడు. "ఒక్క మలినాశ్రు బిందు వొరిగి నంత వరకు; ఒక్క శుష్క స్తన్య సన్నిధిని క్షుదార్తి నేడ్చు పసి పాప ఉన్నంత వరకు...; అలాగే "ఒక్క తల్లి వీరవాక్రోశ రవమ్ము విన్నంత వరకు, ఒక్క క్షత దుఃఖిత హృదయ మూరడిల్ల నంత వరకు, నాకు శాంతి కలగ దింక నేస్తం, నేను నిగర్వి నైనాను, ఈ సిగ్గు లేని ముఖాన్ని చూపించ లేను" అని వాపోతాడు. అంతే కాదు, ఈ స్థితిని గురించి పట్టించు కొనే నాధుడెవడైనా (రాజకీయ వేత్త గాని, భోగ భ్యాగ్యాలను భవించు వారుగాని) ఉన్నాడా? ఈ విషాద ఆర్తి వారిని చలింప జేస్తుందా? ఏ భగవంతునికి ఈ హృదయ విదారక స్థితి విన్నవించాలి? అని ప్రశ్నిస్తాడు కవికుల తిలక్. "ఆర్త గీతం" కవిత సూక్ష్మంగా పరిశీలిస్తే - తిలక్ మానవ కవి అనీ, అన్ని ధర్మాలకు మించిన మానవ ధర్మం త్రికరణ శుద్ధిగా పాటిస్తారనే నమ్మిక పాఠకు లందరి లోను దృఢ మౌతుంది. తిలక్ కోరుకునే దేశం ప్రాణమున్న మనుష్యులతో నిండినది. ఆ దేశం లోని మనుషులకు ఆయన కోరుకున్నదల్లా, కడుపు నిండా ఆహారం, గుండే నిండా ఆ శ్లేషం, బ్రతుకు పొడువునా స్వతంత్రం, కొంచెం పుణ్యం, కాస్త పాపం, కొంత కన్నీరు, మరికొంత సంతోషపు తేనీరు"! ఈ అవసరాలన్ని తీరేకాల మెప్పటి కైన వస్తుందా అని ఆయన మనో వ్యధ! దానిని గురించి అటు దేవునికీ, ఇటు మనిషికీ తగిన జవాబు ఇవ్వ లేక తన నిస్పృహను వ్యక్త పరుస్తాడు.



గొంగళి పురుగులు:



నేటి సామాన్య మానవునికి అన్ని సమాజ రంగాల్లో ప్రతి నిధులు ఉన్నారు. సాహిత్య రంగంలో సామాన్యునికి ప్రతినిధి తిలక్. సామాన్యుని ఆశయాల్ని, స్వధర్మాన్ని గుర్తించడమే గాక, వారిలో తానొకడుగా భావించాడు తిలక్. సామాన్యుని అణగ ద్రొక్కాలనే యత్నంలో వున్న వారంతా నేటి రచయితకు (తిలక్) శతృవుల వంటి వారు. తానాశించే జాగృతీ, చైతన్యమూ సామాన్యులలో కనిపించక పోవడంతో నిస్పృహకు లోనవుతాడు. అలాంటి మానసికి స్థితి లో రచించిన కవితా ఖండిక, "గొంగళి పురుగులు". గొంగళి పురుగును, పూట గడవని, కనీసావసరాలు తీరని, దైన్య స్థితిలో జీవించే సామాన్యునికి ప్రతీకగా వాడుతాడుకవి. కవితా చిత్రణ తిలకించండి:



బల్ల పరుపుగా పడుకొన్న జీవితం మీద నుంచి

భార్యా మణి తాపిగా నడచి వచ్చి అంది కదా -

"పంచదార లేదు, పాల డబ్బా లేదు

బొగ్గుల్లేవు రాత్రికి రగ్గుల్లేవు.

రోజూ పాడే పాత పాటకి రోజూ ఏడ్చే పాత చావుకి

విలువలేక, విని కూడా కదల కుండా గొంగళీ పురుగు

సగం సగం తిన్న కలల్ని నెమరేస్తూ నిద్ర పోయింది

... ... ...

విసుగెత్తి చివరికి గొంగళి పురుగులు

బల్ల పరుపుగ పరుచు కున్న తన జీవితాన్ని పరుపు చుట్టలా చుట్టి

ఆత్మహత్య చేసు కుందా మని అనుకుంటుంటే

పెళ్ళాం మాట వినబడి బాస్ కేక వినబడి

భయంతో గజ గజ వణుకుతూ

సగం సగం తిన్న కలల్ని నెమరు వేస్తూ

సగం సగం చచ్చిన ప్రాణాల్ని జోకొట్టుతూ



తిలక్ 1959లో "ఒక శ్రుతి" అనే కవితను రచించారు. శ్రుతి అనే పదానికి వేదం, ధ్వని, విన బడినది, సంగీతం లోని మేళవింపు అనే నానార్థాలు ఉన్నప్పటికీ - వినబడినది అనే అర్థం లోనే తిలక్ వాడారని మనం భావించ వలసి ఉంటుంది. "ఒక శ్రుతి" అనే గేయంలో "దూరదూరల్లో రేఖగా, పొలి మేరగా కరిగి నిల్చిన తనలో వినబడే" శ్రుతిని కవి పలికించడానికి ప్రయత్నిస్తాడు. ఇది చాలా లోతైన భావన (deep thought) అంటితేనే, చరచరా పారిపోయే, పాదరసం లాంటి అనుభూతి. అలాంటి అనుభూతిని పదాలలో అమర్చి పాఠకుడి అనుభవానికి అందజేయాలనే ప్రయత్నం చేస్తాడు కవి తిలక్.చాలా మంది ఆధునిక కవులు ప్రదర్శించే అలాంటి భావన పాఠకుల మనోనేత్రానికి చీకటిగా కనిపిస్తుంది. అలాంటి చీకటి తెరను చీల్చుకొని పోయేటంత శక్తి పాఠకుని హృదయపు కళ్ళకి సాధ్య పడదు. కాబట్టి కవి తన మనస్సులోని చీకటిని ఒక వెలుగు రేఖతో జోడించాలి. ఆ చీకటిని (transparent) చెయ్యాలి. కవి ఉపయోగించే వెలుగు రేఖలే ఆలోచనా పరుడైన పాఠకునికి అందే సంకేతాలు, కవితా రహస్యాలు. ఈ కవితా ఖండిక లో తిలక్ చేసిన శిల్పాన్ని దర్శిద్దాం. ఈ కవితలో కవి దైవానికి తనకి మధ్య గల దూరాన్ని హృదయంతో కొలుస్తాడు! అప్పుడు వినిపించే దూర దూరల శ్రుతి



"చెరగి - నేను పుట్టిన పురిటి నొప్పుల చీకటి బాధ;

చెరగి - నేనునశించి చావు సంధ్యల నెత్తుటి చార

చెరపి కొని నీ మధ్య గల దూరపు రేఖ

తెలిసికొని

నీ మధ్య నా మధ్య వంగిన తారకల శాఖ"



"పురుటి నొప్పుల చీకటి బాధ చేరగి పోవాలి. అప్పుడు కవికి ప్రారంభాన అనంతత్వం ప్రాప్తిస్తుంది. చావు సంజెల నెత్తుటి చార చెరగి పోవాలి. అప్పుడు అతనికి అంత్యాన అనంతత్వం ప్రాప్తిస్తుంది. "పురిటి నొప్పుల చీకటి చార" అనడంలో మానవ జన్మ లోని వేదన, జన్మ పూర్వకమైన అనంత తిమిరాలూ దర్శన మిస్తున్నవి. ఇట్లా అనంత వేదననీ, అజ్ఞాన తిమిరాన్ని పాఠకుని అనుభూతికి తేవడానికి "పురిటి నొప్పుల చీకటి చార" అనే పదాన్ని వాడడమే చీకటిని Transparent చేయడం... ఇక్కడే "దూరపు రేఖ" అనే పద సంఘటన చాలా ప్రతిభా ద్యోతక మైనది. దూరాన ఉన్న రేఖ - అని కాదు దీని అర్థం. దూరము అనేటు వంటి రేఖ. మానవుడు దైవానికి, ఒకే సారి అనంత దూరం లోనూ, అమిత సమీపం లోనూ, ఉన్నాడు... అందుకని ఒకేసారి దూరాన్ని సమీపానికీ, సమీపాన్ని దూరానికీ తీసుక పోగల శక్తిని ప్రదర్శిస్తుంది "దూరపు రేఖ" అనే సమాసం. ఇటువంటి అద్భుత శిల్పాన్ని తిలక్ తనదైన నవ్య మార్గంలో విచిత్రంగా చూప గలిగాడు" (అద్దేపల్లి రామమోహనరావు) ఒక శ్రుతి అనే కవితా ఖండికలో.



తపాలా బంట్రోతు : 1959లో తంగిరాల వెంకట సుబ్బారావు అనే మిత్రుడు జిల్లా తపాలా శాఖ జరుపుకొనే వార్సికోత్సవానికి పోస్టు మాన్ మీద యేదైన కవిత వ్రాయమని కోరి నప్పుడు తిలక్ రచించిన గేయం ఈ కవితా ఖండిక. పోస్టుమాన్ అంటే తిలక్ హృదయంలో ఏర్పడిన - లేక మెలగే భావ తరంగాలకు అక్షర రూపకల్పన. మరో మాధ్యమం లేకుండా పఠితల హృదయాల్లోనికి సూటిగా చొచ్చుకు పోతుంది!



మై డియర్ సుబ్బారావ్ కనిపించడం మానేశావ్

ఏవిటీ - పోస్ట్ మాన్ మీద గేయం వ్రాయాలా!

...

ఈ నీ ప్రార్థన కడుంగడు అసభ్యం సుబ్బారావ్

ఉత్త పోస్ట్ మాన్ మీద ఊహలు రా నే రావు

ఎండలో వానలో ఎండిన చితికిన

ఒకచిన్న సైజు జీతగాడు

చేతిలో సంచి కాకీ దుస్తులు అరిగిన చెప్పులు

ఒక సాదా పేదవాడు ఇంటింటికి వీధి వీధికి

ప్రతి రోజూ తిరిగే వాడు - ప్రై మినిస్టరా ఏం?



అయితే చూడు

ఆ కిటికిలో రెండు విచ్చిన కలువల్లాంటి కళ్ళు

ఆ వీధి మొగవైపే ప్రసరిస్తున్న చూపుల ముళ్ళు

ఆ కళ్ళలో ఆతృత ఆ గుండెల్లో గడచిన

దేశాంతర గతుడైన ప్రియుడి వార్త కోసం

అమ్మాయీ!

పద్ధెనిమిదేళ్ళ పడుచు దనాన్ని భద్రంగా దాచి

పళ్ళెంలో పెట్టి ప్రాణ నాధుడి కందించాలనే

నీ ఆశ నాకు అర్థమయింది

అందుకే

. . .

వీధి వీధి నంతా మేల్కొలుపు తున్నాయి

వీధి వీధి నంతా కలయ చూస్తున్నాయి

అడుగో పోస్ట్ మాన్!

...

గుడిసె ముందు కూర్చున్న పండు ముసలి అవ్వ

గడచిన బ్రతుకంతా కష్టపు నెత్తుటి కాలువ

కనబడీ కనబడని కళ్ళల్లో

కొడిగట్టిన ప్రాణపు దీపంలో

తాను కనిన తన ప్రాణం, తనకు మిగిలిన ఒకే ఒక స్వప్నం

తన బాబు తన ఊపిరి

అస్సాం రైఫిల్సులో సోల్జర్ సిమ్మాచలం

కోసం నిరీక్ష క్షణ క్షణ ప్రతీక్ష

ఒక్క కార్డు ముక్క వ్రాశాడా

బంట్రోతు వెళ్ళు వెళ్ళు త్వరగా

ముసలి దానికి మంచి వార్త నందించు

ముడతలు పడిన మొహం మీద ఆనందాన్ని పరికించు

దూర భారాన ఉన్న కుమారుని కోసం

వగచే తల్లికి

చేరు వౌతున్న నువ్వొక ఊరాట

... ...

నువ్వు దూరాల దారాల్ని విచిత్రంగా

ఒకే నిముషము

అనే కండె చుట్టూ త్రిప్పగల నేర్పరివి - కూర్పరివి

నీ మేజిక్ సంచిలో

ఏ క్షణంలో ఏది పైకి తీస్తావో

ఆ క్షణాన నువ్వు రాజుతో సమానం!

...

అందరికీ నువ్వు ఆత్మ బంధువువి

అందరికి నువ్వు వార్త నంది స్తావు

కాని నీ కథనం మాత్రం నీటిలోనే మధనం

అవుతూంటుంది.

ఇన్ని ఇళ్ళు తిరిగినా

నీగుండె బరువు దింపుకోవడానికి ఒక్క గడప లేదు

ఇన్ని కళ్ళు పిలిచినా

ఒక్క నయనం నీ కోటు దాటి లోపలకు చూడదు

ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడి లాగా వెళ్ళిపోయే నిన్ను చూచి నపుడు

తీరం వదలి సముద్రం లోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు.



"ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిగా వెళ్ళి పోయే నిన్ను చూచి నపుడు తీరం వదలి సముద్రం లోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు". ఎంతటి రమ్య మైన ఊహ! ఇటువంటి కవిత తిలక్ ముద్రతోనే సాధ్యం! ఇంతటి మహత్తర కవిత తిలక్ మాత్రమే సృష్టించ గలడు!



అధునాతన భావకులను గురించి లోతుగా ఆలోచిస్తాడు తిలక్. "కఠినోపనిషత్" అనే గేయంలో ఒక అధునాతన భావకుని లక్షణాన్ని చిత్రించిన తీరును గమనించండి.



వెలుగును వెనక్కి నెట్టుతూ రేపటి రోజుకి

పది వేల సంవత్సరాల నాటి పాత ముఖాన్ని అతికించేందుకు

కాలాన్ని సాగదీసి సాగరాన్ని మధించి ఖగోళాల నావర్తించి

అధునాతన భావకులు స్వప్న భుక్కులు

వర్తమాన శిరస్సున వధించ బోయే సమయాన

గత భూత కాల ప్రసక్తి లేక గగన పాతాళాల మధ్య

ఏట వాలుగా జారే విలాసులు తత్ క్షణ ప్రయోజన సాధకులు

చిరు నవ్వులు చిందే విషమ సంధ్య వేళ

అత గాడు మూడవ పరిమాణంలోని ఊహలకి

ఆకారం కల్పించ లేక తికమక పడుతున్నాడు

...

ఏడు రంగుల ఇంధ్ర ధనుస్సు నెక్కుపెట్టి కోట్ల కొలది జనులు

ఎండ మావుల పండుగలు చేసుకొనే సమయాన

అతగాడు తెగిన ఫిడేలు తీగల్నీ

కదలని గడియారపు గుండెల్నీ చినిగిన స్వప్నపు సంచుల్నీ

రిపేయిర్ చేసే ప్రయత్నంలో నిమగ్ను డయాడు.



"కో ట్ల కొలది జనులు ఎండమావుల పండగలు చేసు కుంటున్నారని" ఎంతటి కఠిన సత్యం తెలిపాడు తిలక్! ఇప్పటికి పరిస్థితి మారలేదు?! ఎంతటి నిరాశ? "కఠినోపనిషత్" ముగిపు గమనించండి!



అద్భుత చారిత్రక ఘట్టాల లోన

ఆస్థికులు నాస్తికులు మతాలు సిద్ధాంతాలు

మనష్యుల్ని మరచి పరమ సత్యాలను తరచి పైకి తీసే

ఆవేశపు మధ్యాన్నపు ఎండలలోన

నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి

సౌఖ్య నగరానికి దారి తెలియక

సైను పోస్టు మీద మిధ్యాలిపి డిసైఫర్ చెయ్యలేక

జిగీషువుల జిజ్ఞాసవుల ముఖాలు వెల వెల బోతున్న సమయాన

అతగాడు ఒక్కడూ ఊపిరాడని గదిలో ఉరి పోసుకుని చని పోయాడు



1963వ సంవత్సరంలొ తిలక్ తన "మైనస్ ఇంటు ప్లస్" అనే కవితను ప్రకటించాడు. ఆనాటి పరిస్థితులు తిలక్ హృదయంలో నిస్పృహను కల్గించాయి, ఆయనలోని optimism సన్నగిల్ల జొచ్చింది. "మానవుడు మానవుడిగా దేవుడుగా రూపొందే ఈ ప్రయాణం అనంత దీర్ఘం పునః పునర్వ్యర్ధం బహుయుగ విస్తీర్ణం" అంటాడు. అయితే, అనంత దీర్ఘం, బహుయుగ విస్తీర్ణ మైన మానవతా సంఘర్షణ, కృషి, ఎన్నటి కైనా ప్రతి ఫలిస్తుందనే ఆశక బదులు తిలక్ లో నిరాశ కల్గించి పెసిమిస్టుగా మారుస్తుంది. ఈ కవితా ఖండికలో తిలక్ ఆత్మ అంగీకరించ లేని సత్య మేదో దాగి ఉన్నట్లని పిస్తుంది. ఆ కారణం చేత "ఉన్నశాంతి" జడం గా కనిపిస్తుంది. నిష్క్రియాత్వాన్ని శాంతిగా భ్రమిస్తున్న మానవుని సంఘర్షించ మని ప్రభోదిస్తాడు. అందుకే



జడంగా వున్న శాంతి నుండి

ఎడంగా తప్పు కుంటాడు మానవుడు

సంచలనం కలిగించే

సమరాంగణాన్ని కోరు కుంటాడు

అందుకే మానవ చరిత్ర అంతా యుద్ధ మయం

యుద్ధాలు లేని చరిత్ర చదివితే అర్థ హీనం.

. . . . . . .

అందుకే మానవుదు మానవుడిగా దేవుడిగా రూపొందే ఈ ప్రయాణం

అనంత దీర్ఘం పునః పునర్వ్యర్థం బహుయుగ విస్తీర్ణం



అంటారాయన. ఈ కవిత లోని గూడార్థం: అసలైన మనిషి, కాస్త అలజడిలో, బయట పడతాడు. వయసెల్లా జనన మరణాలకు లోనవుతుందో కృషి కూడా అలాగే ఆశ నిరాశలకు లోనౌతుంది. దాని అంతిమ జయం మరీ మరీ ప్రయత్నించడమే! నిరంతర సంఘర్షణ మాత్రమే! దీనినే తాత్వికుడైన కవి (తిలక్) పాఠకులకు సూచిస్తారు.

"అమృతం కురిసిన రాత్రి" గేయం 1962వ సంవత్సరంలో రచించినది. ఒక విధంగా పరిశీలిస్తే ఇది ఆత్మాశ్రయ మైన కవిత. కవి ఊహా లోకంలో విహరిస్తూ గడించిన అనుభూతి పరం పర. అత్యంత ఆహ్లాద కరంగా తనను తాను వ్యక్తీ కరించు కొనిన వివరణ.



అది రమణీయ మైన రాత్రి. వాతావరణమంతా తియ్యదనముతో నిండి అమృతాన్ని వెదజల్లు తున్నది. జనమంతా నిద్రా వశులై పవ్వ ళిస్తారు. అప్పుడు కవి పయనం సాగుతుంది, ఎక్కడికో దూరంగా కొండదాటి, కోన దాటి వెన్నెల మైదానంలో కి. ఆ కవితా సమయ వర్ణనలు...

ఆకాశం మీద అప్సరసలు

ఒయ్యారంగా పరుగు లెత్తుతున్నారు

వారి పాదాల తారా మంజీరాలు

ఘల్లు ఘల్లని మ్రోగు తున్నాయి

.........

నన్ను చూసి చూసి కిల కిల నవ్వి ఇలా అన్నారు

చూడు వీడు అందమైన వాడు

ఆనందం మనిషైన వాడు

కలల పట్టు కుచ్చు లూగు తూన్న కిరీటం ధరించాడు

.....

ఎవరికీ దొరకని రహస్యాలని వశ పరుచు కున్నాడు

జీవితాన్ని ప్రేమించిన వాడు జీవించడం తెలిసిన వాడు

నవ నవా లైన ఊహా వర్ణార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు

ఇతడే సుమీ మన ప్రియుడు, నరుడు, మనకి వరుడు

జల జల మని కరిసింది వాన జాల్వారింది అమృతపు సోన

దోసిళ్ళతో తాగి తిరిగి వచ్చాను

దుఃఖాన్ని చావుని వెళ్ళి పొమ్మన్నాను

.....

అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్ర పోతున్నారు

అలసి నిత్య జీవితంలో సొలసి సుషుప్తి చెందారు

అలవాటునీ అస్వతంత్రతనీ కావలించుకున్నారు

ఆ ధైర్యంలో తమలో తాము ముడుచుకు పోయి పడు కున్నారు

అనంత చైతన్యోత్సవాన్ని వినిపించుకో లేక పోయారు

అందుకే పాపం ఈ నాటికీ ఎవరికీ తెలియదు

నేను అమరుడనని!



స్వగతం గా గడచిన ఈ కవితలో ఆత్మ ఘోషను రంగరించి ఆధ్యాత్మికను చొప్పించాడు కవి తిలక్. అద్భుత మైన అనుభూతిని పాఠకులతో పంచు కున్నాడు. అందుకే కాబోలు ఈ కవితనే సంకలనానికి శీర్షికగా ఎంచు కొనుట!



"ప్రార్థన" అనే మరో కవితలో అవాంఛనీయ శక్తుల నుండి తన దేశాన్ని కాపాడ మని దేవునికి మొర పెట్టు కుంటాడు కవి. దేవుని ఉద్దేశించిన ఆ "మొర" లో పేర్కొన్న సంఘ వ్యతిరేక శక్తుల వర్ణన పాఠకుని హృదయాన్ని కదుపు తుంది. చదవండి:

దేవుడా రక్షించు నా దేశాన్ని

పవిత్రుల నుండి పతివ్రతల నుండి

...

శ్రీ మన్మద్గురు పరం పర నుండి

...

నలభై కోట్ల మనుష్యుల నిజమైన ప్రాణం వున్న

మనుష్యులతో నిండిన దేశం నాది...

... బ్రతుకు పొడవునా స్వతంత్రం

కొంచెం పుణ్యం కించిత్ పాపం

కాస్త కన్నీరు మరి కాస్త సంతోషపు తేనీరు

చాలు మాకు తండ్రీ ...

మమ్మల్ని కనికరించు

చావు పుట్టుకల సందేహం లాంటి

జీవితంలో నలు వైపులా అంధకారం

...

ఆశల వెచ్చని పాన్పు మీద స్వప్నాల పుష్పాలు జల్లుకొని

ఆద మరచి కాసేపు విశ్రమించటాని కనుమతించు తండ్రీ.



సంప్రదాయ భీరువుల్ని (ఘాటుగా) విమర్శించాడు ఈ గేయంలో తిలక్. లక్షలాది దేవుళ్ళ నుండి, వారి వారి నిరం కుశ ప్రతినిధుల నుండిఈ సామాన్యుణ్ణి రక్షింపమని వినమ్రతతో విన్నపం జేస్తాడు దేవునికి!

"నీడలు" అనే కవితా ఖండిక ఆరు గేయాల్లో ముగుస్తుంది. చిన్నమ్మా! అనే సంబోధనతో ప్రారంభించిన ఈ కవిత విశాల మైన పరి వ్యాప్తి కలిగినది. స్థూలంగా చూస్తే, అదేదో ప్రత్యేకమైన సంఘటనకు చెందిన దాని వలే కని పిస్తుంది. కాని లోతుగా పరిశిలిస్తే, దాని విశాల పరి వ్యాప్తి అర్థ మౌతుంది. చిన్నమ్మా! వీళ్ళ మీద కోప గించకు, వీళ్ళ నసహ్యించు కోకు, వీళ్ళందరూ చిన్న వాళ్ళు, ఆలోచనలు చిన్నవి, మనస్సులు చిన్నవి. ఆదరణలు చిన్నవి, అవకాశాలు అందుకో లేని వాళ్ళు. అనుభవా ల్నుంచి పారి పోయే వాండ్లు!



ఇలా వాండ్లను గూర్చి వివరిస్తూ, అయినా వాండ్లను విడిచి వెళ్ళి పోకు, వీళ్ళందరూ నీ బడ్డలు"! అంటాడు. "వీళ్ళ మధ్య డైనమైట్ పేలాలనీ, డైనమోలు తిరగాలని ఆకాంక్షిస్తాడు. ఈ ఖండిక లోని ఏ కవితను తీసుకొన్నా, ఎంత ఊహకీ, ఎంత ఆలోచనకీ, ప్రేరణ, తావు, ఇవ్వాలో అంతా ఇస్తుంది. అది పాఠకుని పరిశీలనా శక్తి మీద ఆధార పడి వుంటుంది. అసలు "నీడలు" అనే పేరు లోనే "ధ్వని" వుంది.

ఆత్మాశ్రయ పరంగా సాగినట్లు కనిపించే తిలక్ రచించిన "అదృష్టాధ్వ గమనం" 1964వ సంవత్సరం లో రచించినది. "శిఖరారోహణ" 1966వ సంవత్సరం లో ప్రచురిత మైనది. మొదటి కవితలో రచయిత (కవి తిలక్) చాలా కాలం తర్వాత తన మిత్రుడిని కలుసు కొంటాడు. ఆ బాల్య సహ పాఠి అతనిని గుర్తించడు?! కవి తన బాల సహాధ్యాయి (మిత్రుని) తో సంబోధనా పూర్వకంగా మాట్లాడిన సంఘటన ఈ కవిత లో వివరిస్తాడు. కవితలో పేర్కొనిన వ్యక్తిని అదృష్టం వరిస్తుంది. జీవితంలో ఉన్నత స్థానాన్ని అందు కొంటాడు. ఇద్దరి మధ్య అసమానత ఏర్పడు తుంది. స్వగతంగా సాగిన కవితా విశేషాన్ని గమనించండి!

అన్నా

నన్నానవాలు పట్టా గలవా? ఆనాటి వాణ్ణి నీ చెలికాణ్ణి

...

స్థూల మైన ఆకృతిని అస్తిత్వాన్ని పొందని పొంద లేని ఊహామరుత్తని.

ఏకాకిని....

"తనది అదృష్టాధ్వ గమనం! ఎవరూ వినని పాటను, ఒకే తీగ మాత్రం మిగిలిన సితార మీద (ఆ ఒక్క తీగ కూడా తెగిన నాడు ఆయన అన్వేషణ మౌనంలోకి ఇంకిపోతుంది) పాడుతూ, ఎవరూ నడవని బాటలో నడుస్తున్నాడు. "కొమ్మ మీద ఆహారం దొరకని కృకలాసం (ఊసరవెల్లి) కంగారు చూపులో, ఊరవతల సందులలో దుమ్ము కొట్టుక పోయిన పిల్లల కళ్ళల్లో ఆరిపోతున్న వెలుగు లో కాలవ వొడ్డున, వంకర తిరిగి న తుమ్మ చెట్టు కొమ్మల్లోంచి కాలి మసై పోతున్న పశ్ఛిమ దిశ గగనంలో ఒక భయం కరమైన సృష్టి క్రమాన్ని, మానవ యత్న వైఫల్యాన్ని ఊహించు కుంటున్నాడు రచయిత. మాములు దారుల్నీ, మర్యాదల్నీ, మంచి చెడ్డల్నీ, విడిచి రాత్రిందివాల మధ్య రహఃకిర్మీరరథ్య (బంగారు బాటల కూడలి) ఆశతో, విశ్వాసంతో, ఆత్మ బలంతో సాగిపోయా డాయన. ఆయన లోపల ఆయన బాధలు, వెలుపల క్షత జగత్తు ఆక్రోశించిన కరుణా భిభత్స రవాలు.



నిరంతర పరిణామ జగత్కటాహంలో సల సల కాగే మానవాశ్రు జలాలు. ఐనప్పటికీ అంతర్గత సంగీతం అనుపమ సుందర గీతం ఆయనలో వినబడటం మాన లేదు. సృష్టి లోని అర్థం కోసం, జన్మ లోని సాఫల్యం కోసం... ప్రతి తెరనీ తొలగిస్తూ, ప్రతి అరని తెరుస్తూ నడిచాడాయన". "ఆకాశమంత నా ఏకాంతము లో అనంత మానవ హృదయ స్పందన వినడం మాన లేదు. అలసిన ప్రవాసంలో అద్భుత సౌధాల మణి కవాటాలూ తెరుచు కోవడం మాన లేదు" (వరవరరావు).



"శిఖరారోహణ" మరో అద్భుత మైన రచన. ఈ గేయంలో కవి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకు తున్నాడు. ఆ సందర్భాన్ని వాదు కొని, నవీన కాలపు అవ లక్షణాన్ని, నవ యుగానికి కావలసిన శక్తి వికాసాన్నీ సూచన మాత్రంగా స్పృశిస్తాడు. ఆధునిక కాలంలో ప్రాప్తించిన దుర్దశను గేయం మొదటి మూడు భాగాల్లో చమత్కార పూరితంగా "తీక్షణ ధ్వని రచన" తో నిరూపిస్తాడు. నాలుగో భాగంలో కాలపు మూలాల్లోకి, అనుభూతి లోతుల్లోకి కూరుకొని పోతాడు! ఈ నాల్గవ భాగమంతా సనాతనత్వ భావ పూర్వక మైన వేదనా వర్ణితం.



విప్లవకవి (వరవరరావు) మాటల్లో "శిఖరారోహణ" అద్భుత మైన రచన. "పాత మాటల మూటలో కవులూ, వట్టి మాటల సంచులతో రాజకీయ వేత్తలూ, మొహమాటం లేకుండా ముందెక్కి కూర్చున్నారు రైళ్ళో". అట్లా "పాత మాటల మూటల కవుల" మీద ఒక విసురు విసరనే విసిరాడు. ఇంకా ఆ కవితా ముగింపులో కొరడా దెబ్బల వంటి తీర్పు ఇచ్చాడు. "కొత్త దారి తొక్క లేని, కొత్త మలుపు తిరగ లేని కుంటి గుడ్డి వాళ్ళ ప్రయాణ కోలాహలం, మురికి కాల్వ మీద, ముసలి తనం మీద, మృషా (అసత్య) జగతి మీద, మహోదయం వికసించదు. సంప్రదాయ భీరువుకీ, అస్వతంత్ర వితంతువుకీ వసంతం లేదు! సాహసి కానివాడు జీవన సమరానికీ, స్వర్గానికీ పనికి రాడు. అయితే, ఆయన (తిలక్ లో) ఎంత సత్సంప్రదాయం జీర్ణించి పలికిందో కూడా చెప్పుకొంటాడు. మన సంసృతిని గురించి కూడా తిలక్ కు విశాల మైన దృక్పధం వుంది. ఆయన షేక్స్పియర్, డాంటీ, కాళిదాసూ, శంకరుడూ మార్క్స్, మహాత్ముడూ, పికాసో, సార్ట్రే లకు వారసుడి నను కున్నాడు.కాని కేవలం కాళిదాసు, శంకరుడూ, మహాత్ములకే వారసు ణ్ణను కో లేదు. "మనగలిగినదీ, కాలానికి నిలబడ కలిగినదీ వద్దన్నా పోదు. మన దైనా మరొకరి దైనా మంచికి జాతీ కులమూ సరిహద్దులు లేవు" అన్న వసుదైక దృక్పథం తిలక్ మహాశయునిది. కాళిదాసు కవిత్వం లోని మాధుర్యం, సౌందర్యం, ఉపనిష దర్శ మహోదది ఎవడు పోగొట్టు కుంటాడూ?



ఏ దేశ సంసంకృతి అయినా ఏనాడూ కాదొక స్థిర బిందువు

నైక నదీ నదాలు అదృశ్యంగా కలసిన అంతస్సింధువు

అంటారు తిలక్ మహాశయులు.



తిలక్ కవితల్లో ఏది చదివినా కవితా రచన పారవశ్య లక్షణాన్ని పసి గట్ట వచ్చు. ఆయన శిల్పం ఆయనదే! బియ్యంలో నువ్వుల వలే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. "నేను కాని నేను" అనే కవితా ఖండికలో ఈ విషయం మనకు విశద మౌతుంది.

"ఒక నిశార్థ భాగంలో నివహ గగనం

ఓరగా భూమ్మీదకు ఒంగి ఏదో రహస్యం చెబుతున్న వేళ"

అంటారు కవి. "నక్షత్రాలతో కలసిన ఆకాశం భూమ్మీదకు వంగి రహస్యం చెప్పటం" ఎంతటి గొప్ప ఊహ! ఆ పదాల పొందికలోనే ఉన్నది రచయిత విశిష్ఠత. 'రహస్యం' చెప్పటం అనే పదం చాలా మహత్వ మైనది. ఆ వాడుకలోనే కవి మనస్సులోని నిశ్శబ్ద స్థితి వ్యంజన (సూచన) ఉన్నది. ఈ విధంగా "బయటి ప్రకృతి గతమైన వస్తువుల్ని వర్ణిస్తూ, ఆ వర్ణన తోనే అనుభూతిని, సంకేత రూపాన జోడించి, ఆ అనుభూతి, మనోంతర్గత రహస్య వ్యక్తీ కరణ రూపంగా ఉండేటట్లు మలచ బడిన ఈ గేయం, ప్రకృతికీ, కవితా పరవశితమైన మనస్సుకీ కవి రహస్యాలతో నిర్మించుకొన్న వంతెన లాంటిది".



బయటి వస్తువుని వర్ణించుట లోనే కవి లోని ఆవేశం వ్యంగ్యంగా స్ఫురిస్తుంది. ఉదాహరణకి ఈ క్రింది పంక్తులను పరిశీలించండి:

"ఎదురుగా గోడమీద బల్లి ఏకాగ్రంగా నాకేసి చూస్తూ ఉంటుంది".

"కిటికి అవతల ఫెరన్ మొక్క క్రీకంట కనిపెడుతూ ఉంటుంది"

"కీచురాళ్ళ చప్పుడు అప్పుడు వినిపిస్తూ ఉంటుంది"



తర్వాత కూడా మరి కొన్ని చిత్ర మైన సంకేత భావాలచేత కవి తన అనుభూతిని వ్యక్త పరుస్తాడు. అలాగే 'మంచూ మసక వెన్నెల కలసిన శీతాకాలపు రాత్రీ కవి మనసు యొక్క వ్యక్తా వ్యక్త స్థితికి సంకేతం! అటువంటి రాత్రిగుండెల మీద కవి నిట్టూర్పు వాలుతుంది. ఆ నిట్టూర్పు కవితావేశ పరాకాష్టతో కూడిన నిట్టూర్పు. అది కవి ఏకాంతం మీద ఒక రకమైన తీర్పు. విపులంగా చెప్పాలంటే కవి ఏకాంత స్థితిని చిత్రించే వ్యాఖ్యానం. కవి తనలో తాను యేకమైన అద్వైత స్థితికి సూచన. సూక్ష్మంగా పరిశీలిస్తే తిలక్ తన చుట్టూ వున్న ప్రకృతిలోనే, తన అవేశాన్ని సూచన ప్రాయంగా వర్ణిస్తూ, సంకేతాల ద్వారా తన పారవశ్యాన్ని నిరూపిస్తాడు. అందుకే తిలక్ ప్రధానంగా తాను అనుభూతి వాదినని చెప్పుకొన్నాడు.



"కిటికీ” అనే మరో గేయం లో మనస్సు యొక్క దైర్ఘ్యాన్ని మూర్తీభవించే విధంగా మన ముందు ఉంచుతాడు చూడండి!

కిటికీ తెరిస్తే గా లీ వెలుతురుతో పాటు

జాలి జీవితపు ధూళీ జ్ఞానమధూళీ కూడా వస్తాయి

తెరిచే కిటికీని బట్టి పర తెంచే పుష్ప రాగం వుంటుంది.

గదికీ మదికీ కూడ గవాక్షా లుంటాయి

అంతరిక్షం లోకి జీవిత రహస్యం లోకి సృష్టి సమక్షంలోకి

విచ్చు కొనే విచిత్రాక్షి సమూహాలు

ఆనంద శోకానుభూత్య విరళ తటిచ్ఛకిత వార్షుక వలాహ కాలు.



అనుభూతిని అమోఘంగా చిత్రించి కవితా రూపంలో వ్యక్త పరచారు తిలక్ గారు. "నువ్వు లేవు నీ పాట వుంది" అనే కవితలో - ఇంటిముందు ఉద్యాన వనంలో చిన్ననాడు తాననుభవించిన ప్రేయసి సమాగమానుభూతి యొక్క స్మృతి వేదన ఈ కవితా ఖండిక లోని వస్తువు. కవితను ప్రారంభించిన తీరును గమనించండి:



నువ్వు లేవు నీ పాట ఉంది

ఇంటి ముందు జూకా మల్లె తీగల్లో అల్లు కొని

లాంతరు సన్నని వెలుతురులో క్రమ్ము కుని నా గుందేల్లో చుట్టు కుని

గాలిలో ఆకాశంలో నక్షత్రం చివరి మెరుపులో దాక్కుని

నీరవంగా నిజంగా వుంది

జాలిగా హాయిగా వినబడుతూ వుంది

శిశిర వసంతాల మధ్య వచ్చే మార్పుని గుర్తుకి తెస్తోంది"



యౌవనంలో తన కౌగిలిలో పాడిన ప్రేయసి యొక్క అనుభూతి కవి హృదయంలో ఎలా స్పందించిందో పైన ఉదహరించిన పంక్తులు వ్యక్త పరుస్తాయి. వారు సంగమించే సమయాన ఇంటిముందు ఉన్నటువంటి జూకామల్లె తీగలో, లాంతరు సన్నని వెలుగులో ఆపాట కవి హృదయాన్ని నింపుతుంది. మరో విధంగా చెప్పాలంటే ఆతరుణం ఆపాట, వాతావరణం కవి (తిలక్) గుండెలలోకి చొచ్చుకుని ఆయనను ప్రకృతిలో ఐక్యం జేస్తుంది. ఆ తరుణం లో అద్వైతానంద స్థితి. అయితే, ఈ నాటి ఆస్మృతి అనిర్వచనీయ వేదనా సహిత మైనది. ఆవేదనలో తీయదనం కరిగిపోయి ఉన్నది. ఆవేదనను తిలక్ అతి సమర్థవంతంగా ప్రకృతితో ధ్వనింప జేస్తాడు. కవి అనుభూతి గాలిలో నిండింది; ఆకాశాన్ని పలకరించింది. ఉదాహరణకు "నక్షత్రపు చివరి మెరుపులో" అన్నది విషాదపు జీరకు సంకేతంగా వాడబడింది. ఆపాట ఈనాటికీ "జాలిగా" వినబడుతోంది. పైగా అది శిశిర వసంతాల మధ్య మార్పు వలె ఉన్నది" అంటాడు తిలక్. మనకందరికి తెలిసిన విషయ మేమిటంటె శిశిరం విషాదం. వసంతం ఆనదం. ఈరెంటికీ మధ్య, విషాదానందాల మధ్య - మార్పు; అంటే వేదనని పిలిచే ఆనదం, ఆనందానికి చేతులు చాచే వేదన, రెండూ కలసిన రేఖ ప్రస్తుత కవి యొక్క స్మృతి! ఈకవితా ఖండిక మొత్తం చిత్ర విచిత్రాను భూతులతో నిండి ఉంది. తిలక్ తన అనుభూతికి మరికొన్ని పోకడలు చెప్పి తర్వాత గేయాన్ని ముగించె విధానంలో సమగ్ర శిల్పత్వాన్ని వ్యక్తీకరిస్తాడు



"ఇంటిముందు జూకామల్లె తీగల్లో అల్లుకొని...

శిశిర వసంతాల మధ్య వచ్చే

విచిత్ర మధురమై మార్పుని గుర్తుకి తెస్తోంది

ఇన్నేళ్ళ తరువాత" అంటూ –



మహాకవులైన విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ లు అంటే అవ్యాజమైన గౌరవాదరాలు తిలక్ మహాశయునికి. వారిని త్రిమూర్తులుగా చిత్రీకరిస్తాడు. అల్లాగని వారిని గుడ్డిగా అభిమానించడు. చురక చురకగా వ్యంగ్య రీతిలో వారిని గూర్చి ఏమంటారో గమనించండి:

ఒకడు:

మావాడే - మహాగట్టివాడు - మకుటం లేని మహారాజయ్యేవాడు

కాని ముసలిదాన్ని, మసక మసక కన్నులదాన్ని

మూలమూల ముడుచుకు కూర్చున్నదాన్ని

మనువు చేసుకోవాలన్న ఉబలాటంతో

మంచి చెడ్డా మరచి పోయాడు

మర్యాదల్ని అతిక్రమించాడు

మరి పనికిరాడు.



మరొకడు:

మల్లెపూల మీద పరుంటాడు, మంచి గంధం రాసుకుంటాడు

మరి ఎందుకేడుస్తాడు?

మంచి పనివాడు, మాకు నచ్చిన వాడు

మాతో నడుస్తా నంటాడు

మరి నిజంగా వస్తాడా?



మూడోవాడు:

అరే! వీడు చిచ్చిర పిడుగు,

ఎండలో నడిచే మనుష్యులకు గొడుగు

ముందుకు వేసిన అడుగు

మాకు చిన్నన్న కానీ అన్నన్న!

ఈ మధ్య విదేశాల చవకబారు

పానీయాలు సేవించి

మత్తుగా పడుకున్నాడు

మరి యిప్పట్లో లేవడు.



ఎంతో నిజాయితీగా, నిర్భయంగా, చమత్కార యుతంగా చిత్రించారు త్రిమూర్తులను! అదే తిలక్ లో దాగి యున్న మహనీయత. అందుకే, ఆయనను అనుభూతి వాదిగా పేర్కొనుట.



ముగింపు:



మరో మహత్తర మైన సత్య మేమిటంటే, ఆధునిక కవితా యుగంలో కావ్య వస్తువు పరిధిని విస్తృత పరచి సర్వ జీవిత తరంగాలకూ వ్యాపింప జేయడానికి ఆయన పడిన శ్రమ. సంకుచితమైన జాతి మతాల సరిహద్దులను చెరపి వేసి అకుంఠిత మానవీయ పతాకాన్ని యెగుర వేసిన అభ్యుదయ కవి తిలక్. ఉత్తర ధృవాన ఒక పాదం, దక్షిణ ధృవాన మరోపాదం ఉంచి త్రివిక్రముని వలే పెరిగి కవితా రాజ్యమును పరిపాలించిన వాడు తిలక్. "ఎవరెస్టు కన్నా ఎత్తైన ఆయన ఊహా శిఖరాన్ని" చేరుకోవడం సాధ్యం కాని పని. ఆయన హృదయాన్ని చదవడం కూడా కష్టతరమే! "అమృతం కురిసిన రాత్రి" అనే కవితా సంకలనం లో పొందు పరచిన కొన్ని కవితా ఖండికలలో మరుగు పడిన మాణిక్యాలు, కవితా శిల్పాలలోని సౌందర్యాలు పాఠకుల ముందుంచే సాహస ప్రయత్నం చేశాడు ప్రస్తుత వ్యాస కర్త. అది ఎంత వరకు ఫలించినదో విజ్ఞులే నిర్ణయించాలి.



ఈ వ్యాస రచనా ప్రక్రియలో భాగంగా, తిలక్ కవితా విశేషాలను తెలుసుకొనేటందుకు వ్యాస కర్త అనేక రచయితల రచనలను పరిశీలించడం ఆవశ్యకమైనది. ఆయా రచనలలోని భావజాలం అత్యంత ఉపయోగ మైనది. అయా రచయిత లందరికీ - ముఖ్యంగా, కుందుర్తి గారికీ, వరవరరావు గార్కీ, రామమోహనరావు గారికీ, మల్లవరపు విశ్వేశ్వరరావు గారికీ వ్యాస కర్త ఋణబడి యున్నాడు. వారికి కృతజ్ఞతా పూర్వక నమోవాకములు.

చివరగా కాళోజి మాటలతో ఈ వ్యాసం ముగింద్దాం:

కవితిలకుడు లేడు

కవితా క్షేత్రం పడ్డది బీడు

...

శారద నుదుటి తిలకం

కవితకు రాణింపు, ధ్వనికి గుబాలింపు

"ట్రాన్ స్పరెంట్ చీకటి"

“వానికి వాడే సాటి"